స్ఫూర్తి మువ్వల వరూధిని

 

 

బ్లాగరు పేరు: సిరిసిరిమువ్వ

 

బ్లాగు పేరు: సరిగమలు

 
బ్లాగు చిరునామా:  vareesh.blogspot.in
 
పుట్టిన తేదీ: ఆగష్టు 30.
 
పుట్టిన స్థలం:  ఈతేరు, గుంటూరు జిల్లా
 
ప్రస్తుత నివాసం: స్థిరపడింది హైదరాబాదులో…ప్రస్తుతం కొంతకాలంగా తాత్కాలిక నివాసం మధ్యప్రదేశ్.
 
విద్యాభ్యాసం:  M.Sc
 
వృత్తి: మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్టుగా కొన్నేళ్ళు చేసి గత ఆరేడునెలలుగా ఏమీ చెయ్యటం లేదు.
 
వ్యాపకాలు: బోలెడన్ని..అన్నిటిల్లో వేలుపెట్టటమే కానీ ప్రావీణ్యత లేదు. ఒకప్పుడు కుట్లు-అల్లికలు విపరీతంగా చేసేదాన్ని. ప్రస్తుతం పుస్తకాలు చదవటం, మొక్కల పెంపకం, ప్రయాణాలు ఇవే ముఖ్యమైన వ్యాపకాలు అయిపోయాయి.
 
బ్లాగు మొదలుపెట్టిన తేదీ: ఫిబ్రవరి 22, 2007
 
మొత్తం బ్లాగు పోస్టులు: 149
 
బ్లాగులోని కేటగిరీలు: నా టపాల సంఖ్య కన్నా కేటగిరీల సంఖ్య ఎక్కువనుకుంటా 🙂 ముఖ్యమైనవి మాత్రం పుస్తకాలు, అనుభవాలు.
 
 బ్లాగుని ఒక మాధ్యమంగా ఎప్పుడు గుర్తించారు?
 
నిజానికి నేను బ్లాగుల్లోకి కాస్తంత అయిష్టతతోటే వచ్చాను.  అయిష్టత బ్లాగులంటే కాదండోయ్..కంప్యూటర్ లో చదవటం..వ్రాయటం అంటే అయిష్టత! మా వారు 2005 నుండే బ్లాగులు వ్రాస్తుండే వారు (http://chaduvari.blogspot.in).  తెలుగులొ తొలి బ్లాగర్లలో ఆయన కూడా ఒకరు.  అప్పుడప్పుడు తను వ్రాసిన టపాలు చదవమని చూపిస్తుండే వారు.  అలా బ్లాగుల తోటి పరిచయం.  నువ్వు కూడా వ్రాయవచ్చుగా అనేవాళ్ళు కానీ నాకెందుకో అంత ఆసక్తిగా ఉండేది కాదు.  2006 అక్టోబరులో నా ఆరోగ్యరీత్యా ఉద్యోగానికి సెలవు పెట్టాను.  అప్పుడు మెల్లగా బ్లాగులు చదవటం మొదలుపెట్టి చివరికి 2007 ఫిబ్రవరిలో బ్లాగు మొదలుపెట్టాను. నేను నా బ్లాగు నా కోసమే వ్రాసుకుంటాను. తెలుగులో వ్రాస్తున్నానన్న తృప్తే నన్ను బ్లాగు వ్రాయిస్తుంది.  నాకు కంప్యూటర్ ముందు కూర్చుని వ్రాయాలనిపించినప్పుడు మాత్రమే టపా వ్రాస్తాను, అందుకే నా బ్లాగులో చాలా తక్కువ టపాలు ఉంటాయి. చదవటం మాత్రం బాగా చదువుతాను.
 
బ్లాగు రచనలో మీ అనుభవాలు?
 
ఇంతవరకు సంతృప్తికరంగానే ఉంది. ఆహ్లాదకరమైన అనుభవాలే కానీ మనస్సుని బాధపెట్టినవి అయితే మాత్రం ఇంచుమించుగా లేవనే చెప్పవచ్చు.  నేను గుర్తింపు కోసం వ్రాయటం లేదు కాబట్టి అసంతృప్తి అంటూ ఏమీ లేదు. సీనియర్లు..జూనియర్లు..ఇలాంటివి నేనసలు పట్టించుకోను.  తెలుగు భాష మీద పట్టు కోల్పోలేదు అన్న ఓ నమ్మకం మాత్రం నాకు బ్లాగు ద్వారానే కలిగింది.  వ్రాసేకొద్దీ భాష మీద పట్టు పెరగటమే కాదు నా భావ వ్యక్తీకరణ కూడా చాలా మెరుగు పడిందనే అనుకుంటున్నాను.
 
మా ఊరి కబుర్లు..చిన్ననాటి జ్ఞాపకాలు బ్లాగులో వ్రాసుకుంటుంటే ఓ రకమైన ఆనందం కలుగుతుంది.  ఎక్కడో మరుగున పడిన జ్జాపకాలు ఈ బ్లాగన్నది లేకపోతే అలానే మరుగునే పడి ఉండేవి కదా అనిపిస్తుంది.
 
నా కాన్సరు సీరీస్ వ్రాసేటప్పుడు మాత్రం మానసికంగా ఒక రకమైన ఒత్తిడికి లోనయ్యాను.  ఆరేడు సంవత్సరాల కిందటి విషయాలు..ఆ చికిత్స..దాని మూలాన కలిగిన బాధలు..దుష్పరిణామాలూ..అవన్నీ గుర్తు చేసుకుంటూ వ్రాయటం శారీరకంగానే కాదు మానసికంగా కూడా కొంచం కష్టంగానే అనిపించింది. మొత్తం వ్రాసాక మాత్రం ఓ రకమైన రిలీఫ్ కలిగింది.
 
బ్లాగింగు వలన ఉండే సానుకూల అంశాలు..పరిమితులు:
 
సానుకూల అంశాలు:  మన ఆలోచనలు, అనుభూతులు, అభిప్రాయాలు వెళ్ళబుచ్చుకోను బ్లాగు ఒక మంచి మాధ్యమం అని నా అభిప్రాయం.  ఉరుకుల పరుగుల ఈ నాటి జీవితాలల్లో మన కబుర్లు వినేంత సమయం ఎవరికుంటుంది చెప్పండి? అదే బ్లాగులో అయితే మన ఇష్టం కదా! ఏమైనా ఎంతైనా వ్రాసుకోవచ్చు.  బ్లాగు మన ఆనందాలకి…సంతోషాలకి….బాధలకి..ఆవేశాలకి ఒక మంచి ఔట్ లెట్.  అది మనం ఉపయోగించుకునే విధానం బట్టి ఉంటుంది. మనం నొప్పింపక తానొవ్వక లా ఉన్నంత కాలం బ్లాగుల వల్ల మనకు బోలెడంత ఆనందం..విజ్ఞానం కలగటమే కాదు రోజూవారీ ఈతి బాధల నుండి ఆటవిడుపు కూడానూ!
 
బ్లాగింగు లోని మరో ముఖ్యమైన సానుకూలాంశం ఏంటంటే మన మాతృభాషకి మనం దగ్గరగా ఉండగలగటం.  చాకలి పద్దులు..వెచ్చాల పట్టీలు అన్నీ ఇంగ్లీషులో వ్రాసుకునే ఈ కాలంలో ఇలా తెలుగులో పేజీలు పేజీలు వ్రాయగలుగుతామని ఎప్పుడైనా అనుకున్నామా!  ఇప్పటి పిల్లలకి తెలుగు వ్రాయటం..చదవటం రావటం లేదు..మాతృభాషకి దూరం అయిపోతున్నారు అని బాధపడిపోతుంటాం కానీ బ్లాగుల్లో కొంతమంది పిల్లలు వ్రాసే టపాలు చూస్తే భలే ఆనందంగా ఉంటుంది.  మొదట్లో తప్పులు వ్రాసినా భాషని సరిచేసుకుంటూ చక్కటి తెలుగులో మంచి మంచి విషయాలతో టపాలు వ్రాసే వాళ్ళు ఉన్నారు. ఇదంతా బ్లాగుల ద్వారానే కదా సాధ్యపడుతుంది!
 
నాకయితే బ్లాగుల ద్వారా మంచి మంచి వ్యక్తులు పరిచయం అయ్యారు.  వీళ్ళంతా నడిచే విజ్ఞానసర్వస్వం లాంటి వాళ్ళు.  వాళ్ళ ద్వారా చాలా సంగతులు నేర్చుకున్నాను.  పుస్తకాలు ఊరికే చదవటం కాదు..వాటిని ఎలా అర్థం చేసుకోవాలి..ఎలా విశ్లేషించాలి..ఇప్పటి రోజులకి ఎలా అన్వయించుకోవాలి..ఇలాంటివన్నీ నేను ఈ వ్యక్తుల ద్వారా నేర్చుకున్నాను.  ఈ బ్లాగులన్నవి లేకపోతే ఇలాంటి వాళ్ళ పరిచయ భాగ్యం కలిగేది కాదు కదా అనిపిస్తుంటుంది.
 
పరిమితులు:  ఏదైనా మనల్ని బట్టే ఉంటుందని నా అబిప్రాయం.  నా వరకయితే అంతగా పరిమితులేం లేవు.  ఇల్లు..ఉద్యోగం..పిల్లల బాధ్యతలు వీటితో పాటు బ్లాగుని కూడా మానేజ్ చెయ్యటం ఒక్కోసారి కష్టం అనిపించేది కానీ దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో  అంతే ఇస్తాను కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు.  బ్లాగింగుని ఒక వ్యసనంలా చేసుకుంటే మాత్రం కష్టమే!
 
కొన్ని సార్లు చర్చల్లో వ్యక్తిగత దూషణలు చూస్తూ ఉంటాం…అవి మాత్రం బ్లాగింగుకి ప్రతికూలాంశమే..ముఖ్యంగా మహిళలకి.
 
మహిళా బ్లాగరుగా మీ ప్రత్యేకత:
 
అందరి బ్లాగర్లలాగ  నేనూ ఒక బ్లాగర్ని అంతే.  మహిళా బ్లాగరుగా నాకంటూ ఏ ప్రత్యేకతా లేదు.  కాకపోతే స్త్రీలు మాత్రమే వ్రాయకలిగే అంశాలు కొన్ని ఉంటాయి..అవి వ్రాయటం మగవారి వల్ల అవదేమో అని నా అభిప్రాయం.
 
సాహిత్యంతో మీ పరిచయం:  
 
ఏం చదువుతున్నానో..ఎందుకు చదువుతున్నానో తెలియని వయస్సునుండే అన్ని పుస్తకాలు చదివేదాన్ని.  చందమామలు..బాలమిత్రల తో మొదలుపెట్టి….అప్పట్లో వార పత్రికలు..మాస పత్రికలు బోలెడు వచ్చేవి కదా..వాటిల్లో వచ్చే సీరియల్సు… 70-90 లలో వచ్చిన రచయితలు..రచయిత్రుల నవలలన్నీ చదివాను.  మా చుట్టాలకి నవలలు అద్దె కిచ్చే షాపు ఉండేది..ఇక అక్కడికి వచ్చిన ప్రతి పుస్తకం చదివేదాన్ని.  డిటెక్టివ్ పుస్తకాలన్నీ ఆ షాపు నుండి తెచ్చుకుని చదివినవే!  కాకపోతే అంతా పై పైన చదువే! చదివి అవతల పడెయ్యటమే కాని చదివిన దాని గురించి ఆలోచించి విశ్లేషణలు చేసుకోవటం తక్కువగా ఉండేది.  నాకు బాగా ఇష్టమైనది..నన్ను అమితంగా కదిలించిందీ మాత్రం యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల నవల.  నేనంటూ నాకంటూ మొదటగా కొనుక్కున పుస్తకం అదే!
 
అప్పట్లో ఓ పుస్తకం చదవటం మొదలుపెడితే అది పూర్తయ్యేదాకా వదలకుండా చదివేదాన్ని.  ఇప్పుడు కూడా కనపడిన ప్రతిదీ చదువుతాను కానీ వెనకటంత ఉత్సుకత తో మాత్రం చదవటం లేదు..ఓ పుస్తకం పూర్తి చెయ్యటానికి ఒక్కోసారి నెలలు పడుతుంది.
 
స్త్రీగా వ్రాయడంలో మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా:
 
నేను వ్రాయటంలో అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు కానీ ఇతరుల బ్లాగుల్లో కొన్ని కొన్ని విషయాల మీద వాదోపవాదాలు జరిగినప్పుడు నేను స్త్రీని అవటం మూలానే స్పందించలేకపోతున్నానేమో అనిపించిన సందర్భాలు మాత్రం ఉన్నాయి.
 
జీవననేపధ్యం: 
 
ఓ రైతు కుటుంబంలో పుట్టి మరో రైతు కుటుంబంలోకి వెళ్ళాను.  మా నాయనమ్మ మా ఊరిలో పెద్ద రైతు.  మా నాన్న లెక్చరరు.  మా మీద మా నాయనమ్మ ప్రభావం చాలా ఎక్కువ.  చదువంటే ఆమెకి ప్రాణం.  చదువు..పని ఈ రెండూ ఆమెకి రెండు కళ్ళు. ఆ రోజుల్లోనే మా నాన్నని బోంబే పంపించి M.Sc చదివించింది.  చెయ్యాలనుకుంటే ఏ పనైనా చెయ్యగలమని..మనం తప్పు చెయ్యనప్పుడు ఎవరికీ భయపడనక్కరలేదని ఆమె నుండే నేర్చుకున్నాను నేను.  జీవితంలో నాకు రోల్ మోడల్ మా నాయనమ్మే అని గర్వంగా చెప్పుకుంటాను.
 
 
వ్యక్తిగత జీవితంలో ఒక సంక్లిష్ట సందర్భాన్ని మీరు ఎదుర్కొన్న విధానాన్ని మీ బ్లాగ్ లో ఒక సీరీస్ గా రాసారు కదా దాని నేపధ్యం, ప్రతిస్పందనలు ?
 
నేను కాన్సరుకి చికిత్స తీసుకుంటున్న సమయంలో హాస్పిటల్ లో వివిధ రకాల కాన్సరు బాధితులతో మాట్లాడుతుండే దాన్ని.  అందులో కొంతమంది కాన్సరంటే చాలా భయపడుతూ ఇక తమకి అవే చివరి రోజులు అన్నట్టు మాట్లాడుతుండే వారు. కాన్సరు ప్రాధమిక దశలో ఉన్నవాళ్ళు కూడా తమకి ఏమవుతుందో..తగ్గుతుందో లేదో అని చాలా ఆందోళన పడుతుండే వారు.  కాన్సరు కన్నా దాని చికిత్స మూలాన తలెత్తే శారీరక దుష్పరిమాణాలకి భయపడేవాళ్ళు ఎక్కువగా ఉండే వాళ్ళు.  వాళ్ళకి నాకు చేతనయినట్లు ధైర్యం చెప్తుండే దాన్ని.  అప్పటికే నేను బ్లాగు వ్రాయటం మొదలుపెట్టి ఉన్నాను, ఈ విషయాలు..నా చికిత్సా అనుభవాలు బ్లాగులో వ్రాయాలని అప్పుడే అనుకున్నాను.  కానీ అప్పటి నా శారీరక పరిస్థితి మూలాన వ్రాయలేకపోయాను.  వ్రాద్దాం…వ్రాద్దాం అనుకుంటూనే మూడేళ్లు గడిచిపోయాయి. సరే అయిన ఆలస్యం ఎటూ అయింది కదా అయిదేళ్ళు పూర్తి అయ్యాక వ్రాద్దామని మొన్న ఫిబ్రవరి లో వ్రాసాను.
 
కాన్సరు సర్వైవల్సుకి అయిదేళ్ళ డిసీజ్ ఫ్రీ జీవితం అన్నది ఓ బెంచ్ మార్కు లాంటిది..ఆ మార్కు దాటితే కాన్సరు తిరగబెట్టే అవకాశాలు చాలా తక్కువ అని చెప్తారు. అందుకే అయిదేళ్లు పూర్తి అయ్యాక వ్రాసాను.
 
ఇక ప్రతిస్పందన అంటారా…మంచి స్పందనే వచ్చిందని చెప్పవచ్చు.  నా టపాలు ఒకరిద్దరికి మానసిక స్థైర్యం కలిగించినా చాలనుకున్నాను.  మీకు కాన్సరా అని బ్లాగు స్నేహితులు ఎక్కువమంది ఆశ్చర్యానికి లోనయ్యారు! కొంతమంది వాళ్ళ కుటుంబసభ్యుల అనుభవాలు పంచుకున్నారు.  చాలా మంది ఈ సిరీస్ ని పుస్తకంగా వెయ్యండి బాగుంటుందన్నారు.  నా బ్లాగులో కాస్తో కూస్తో జనాలకి ఉపయోగపడే టపాలంటే ఇవే అనుకుంటాను.
 
 
మీ యాత్రానుభవాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మీ పాదాలకు భ్రమణ కాంక్ష చిన్నప్పటి నుంచీ ఉన్నదా? 
 
భ్రమణ కాంక్ష చిన్నప్పటినుండీ ఏం లేదండి.  అసలు నేను M.Sc కి వేరే రాష్ట్రం వెళ్ళకముందు బయట ప్రదేశాలు చూసింది చాలా తక్కువ.  మా ఊరికి పది-పన్నెండు కిలోమీటర్ల వ్యాసార్థంలోనే నా ప్రయాణాలన్నీ! ఒకటి రెండు సార్లు హైదరాబాదు..ఒకసారి మా పక్కనున్న చీరాల..మరో రెండు సార్లు గుంటూరు చూసుంటాను అంతే. M.Sc కి వెళ్ళాక మాత్రం తమిళనాడు లోని చాలా ప్రదేశాలు చూసాను.  అప్పటినుండే ఈ భ్రమణకాంక్ష మొదలయ్యి కొత్త ప్రదేశాలు చూడటం మీద ఆసక్తి..అనురక్తి కలిగాయి.  అది ఇప్పుడు మరీ ఎక్కువయింది!
 
 
మీ బ్లాగ్ లో వర్గాలు చాలా విస్తృతమైన అంశాలపై ఉన్నాయి. వాటి ప్రత్యేకతల్ని చెప్పండి ?
 
ప్రత్యేకత ఏమీ లేదండి.  నా టపాలోని విషయాన్ని బట్టి ఒక్కో టపాకి రెండు-మూడు టాగులు పెడుతుంటాను.  వర్డుప్రెస్సు లో లాగా బ్లాగరు లో లేబుల్సు..టాగులు రెండూ విడి విడిగా ఉండవు…దాంతో నా టపాల సంఖ్య కన్నా వర్గాల సంఖ్య ఎక్కువైపోయింది. బ్లాగులో విషయం తక్కువ ఆడంబరం ఎక్కువలాగా అయిపోయిందన్న మాట! ఎప్పటినుండో వీటిని ప్రక్షాణన చేద్దామనుకుంటున్నాను కానీ బద్దకం.
 
 
ఎన్నాళ్ళు బ్లాగింగు కొనసాగించాలని:
 
ఇన్నాళ్ళని కొలమానం ఏం పెట్టుకోలేదు..వ్రాయాలనిపించినన్నాళ్లు వ్రాస్తుంటాను.  ఎవరన్నా వ్రాయటం ఆపమన్నా ఆపను!
 
 సరదాగా ఏమైన  చెప్పండి:
 
నేను చీర కట్టుకుని..చెప్పులతో రెండు సార్లు ట్రెక్కింగ్ చేసాను..ఈ అరుదైన ఘనకార్యం చేసినందుకు నా పేరు కనీసం గిన్నిస్ బుక్కులోకన్నా ఎక్కాలి.  ఆ దిశగా తెలుగు బ్లాగర్లంతా కలిసి ఉద్యమించాలి.సీరియస్సుగా ఏమైనా చెప్పండి:
జీవితం మీద ప్రేమ ఉన్నప్పుడు ఒక్కోసారి పోరాటాలు తప్పవు.  గెలుపోటమిల గురించి బెంబేలు పడకుండా మన పోరాటం మనం చెయ్యాలి.
 
 
మీ బ్లాగు టపాల్లో మీకు నచ్చిన టపా:
 
మీ పిల్లల్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమంటే ఏం చెప్తాం? ఇదీ అంతే! అడిగారు కాబట్టి ఓ రెండు టపాలు!
 
 
 
ఇవి మహిళా బ్లాగర్ల పరిచయ టపాలు కాబట్టి తెలుగు మహిళా బ్లాగర్ల గురించి నేను వ్రాసిన మూడు టపాల లింకులు కూడా ఇక్కడ ఇస్తున్నాను.
 
 
 
 

57 thoughts on “స్ఫూర్తి మువ్వల వరూధిని

 1. వరూధిని గారూ
  మీ ఇంటర్ వ్యూ ఈ సీరీస్ లో రావాలని నేను చాలా కోరుకున్నాను. మీ సమాధానాలలో ఒక పొందిక ఉన్నది. చదువరి మీ సహచరుడని తెలియడం ఒక సంతోషకర ఆశ్చర్యం. ఆయన పొలిటికల్ థాట్ తో నాకు చాలా విభేదం ఉన్నా నేను అభిమానించే మంచి రాజకీయ వ్యంగ్య బ్లాగర్ చదువరి. మీ ఇద్దరికీ అభినందనలు

 2. వరూధిని గారూ, మీ బ్లాగులో ముఖ్యంగా కాన్సరు సీరీస్ అన్నీ చాలా ఉత్కంఠతో చదివాను.ఆ విషయాల్ని అలా రాయగలిగినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.జాజిమల్లి గారు పూనుకోకపోతే ఇటువంటి బ్లాగర్ల పరిచయాలు మాకు లభించేవి కావు కనుక వారినీ అభినందిస్తున్నాను .

  • గోపాలకృష్ణ గారూ,
   కాన్సర్ మీద వరూధిని గారు రాసిన సీరీస్ ఈ సమస్య తో బాధ పడేవారికి చాలా ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా అవగాహన కూడా కలిగిస్తుంది.సామాజిక రంగానికి సంబంధించి ఏవో చాలా అవార్డులు ఉంటాయి కదా
   ఈ బ్లాగ్ మీద, ముఖ్యంగా కాన్సర్ సీరీస్ మీదా వారి దృష్టి పడితే బావుండును. ఎందుకంటే అవార్డులు కూడా ఇలాంటి పనుల ద్వారా తమని తాము ప్రక్షాళనం చేసుకోవచ్చు.
   మీ ప్రోత్సాహ వాక్యాలకి ధన్యవాదాలు

 3. మీ ఆత్మీయ వ్యాఖ్యకు ధన్యవాదాలు మల్లీశ్వరి గారూ! మహిళా బ్లాగర్ల పరిచయాలకి..ముఖాముఖీలకి మీ బ్లాగు వేదికయినందుకు చాలా సంతోషంగా ఉంది. వంద మహిళా బ్లాగరులు అన్న లిమిట్ పెట్టుకోకుండా తెలుగు లో ఉన్న మహిళా బ్లాగరులనందరినీ ఇక్కడ చూడాలి. అది చెప్పినంత తేలిక కాదు కానీ..ఈ విషయంలో మీకెలాంటి తోడ్పాటు కావాలన్నా నేను అందించగలను.

  • మీ సూచన బావుందండి. మధ్యలో కాడి వదిలేస్తానేమో అన్న భయంతో మినిమమ్ టార్గెట్ గా వందమంది అనుకున్నాను. ఆ పైన మన ఓపికని బట్టి నిర్ణయించుకోవచ్చు. మీ సాయం తప్పక తీసుకుంటాను

 4. చాలా చక్కని పరిచయం.. ఇక్కడ మల్లీశ్వరిగారు పరిచయం చేస్తున్న మహిళా బ్లాగర్ల ఎవరి ప్రత్యేకత వారికున్నా…. ఎందుకోగానీ… మీరు చెప్పిన ప్రతి విషయమూ బాగా నచ్చేసింది.

  ముఖ్యంగా… “చీర కట్టుకుని..చెప్పులతో రెండు సార్లు ట్రెక్కింగ్ చేసాను..ఈ అరుదైన ఘనకార్యం చేసినందుకు నా పేరు కనీసం గిన్నిస్ బుక్కులోకన్నా ఎక్కాలి. ఆ దిశగా తెలుగు బ్లాగర్లంతా కలిసి ఉద్యమించాలి” ఈ మాటలు ఎంత సరదాగా అనిపించాయో… 🙂

  మీరు చెప్పిన ప్రతి మాటలోనూ ఎంతో అనుభవం… అంతకుమించి నిర్మలత్వం కనిపించాయి.

  మీ సాహితీ ప్రయాణం మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

  ప్రేమతో..
  శోభ.

 5. చాలా బాగుందండి . “చీర కట్టుకుని..చెప్పులతో రెండు సార్లు ట్రెక్కింగ్ చేసాను..ఈ అరుదైన ఘనకార్యం చేసినందుకు నా పేరు కనీసం గిన్నిస్ బుక్కులోకన్నా ఎక్కాలి. ఆ దిశగా తెలుగు బ్లాగర్లంతా కలిసి ఉద్యమించాలి” :))

 6. మీరు, చదువరిగారు కనపడకపోతే ఏమయ్యారా అని అనుకున్నా. కాన్సర్ గురించి మీరు వ్రాసిన విషయాలు స్ఫూర్తిదాయకం. స్త్రీలకు ఉపయోగకరం. తాజాసమాచారాన్ని జోడించి, అవి e-book గా కినిగె లో ఉంచకోరుతాను. మధ్యప్రదేష్ లో ఏ ఊళ్ళో ఉంటున్నారు?

 7. మీ పిల్లల్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమంటే ఏం చెప్తాం? ఇదీ అంతే! అడిగారు కాబట్టి ఓ రెండు టపాలు!
  జీవితం మీద ప్రేమ ఉన్నప్పుడు ఒక్కోసారి పోరాటాలు తప్పవు. గెలుపోటమిల గురించి బెంబేలు పడకుండా మన పోరాటం మనం చెయ్యాలి.”
  చక్కని మీ మాటలు బావున్నాయి అండి..అభినందనలు

  • సరిగమల సిరిసిరి మువ్వ వరూధిని వేరు.. వరూధిని అన్న బ్లాగు వ్రాసే జిలేబి వేరు.

   అయినా జిలేబి గారే స్వయంగా వరూధిని గారూ జిలేబీ ఒకరేనా అని అడగటం కొంచం చిత్రంగా ఉంది! ఇప్పటికీ కొంత మంది బ్లాగరులు ” వరూధిని” బ్లాగు నాదే అనుకుంటున్నారు. మీరు సరదాకి వ్రాసినా బ్లాగుల్లో ఇలాంటి అనుమానాలు రేకిత్తించటం అంత మంచిది కాదు అని నా అభిప్రాయం.

   మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు.

 8. మీ అనుభవాలు, మీ ఆలోచనలు ఎంత బాగా చెప్పారండి మువ్వ గారు. అలా వివరించటం ఎంత చక్కటి కళో అనిపిస్తుంది నాకైతే.

  మల్లీశ్వరి గారు, మీకు చాలా చాలా థాంక్స్.మువ్వ గారి గురించి ఇవాళే తెలుసుకుంటున్నంత ఆనందంగా ఈ పరిచయాన్ని చదివాను.

   • ​@ ​సిరిసిరిమువ్వ గారూ..
    ఆ ​ప్రశ్న అడిగేసారా.. అయితే కాస్కోండి మరి.. కొన్నైనా చెప్తాను.. 🙂

    మీరు బోల్డు పుస్తకాలు చదవడమే కాకుండా ఇంత ఉరుకుల పరుగుల చదువుల తరంలో కూడా మీ పిల్లలని అకడమిక్స్ లో అంత బాగా తీర్చిదిద్దుతూనే వాళ్ళకి సంగీతం, సాహిత్యం, ట్రెక్కింగ్.. ఇలాంటి అభిరుచుల రుచిని అలవాటు చేయడం..

    ఇల్లు అంత చక్కగా సర్దుకుని, కుటుంబ సభ్యులు అందరికీ కావాల్సినవన్నీ అమరుస్తూ, గుంటూరు గుత్తొంకాయ దగ్గర్నుంచీ క్యారెట్ హల్వా దాకా కమ్మటి వంటలు వండి పెడుతూ, ప్రతీ పండగనీ సెలెబ్రేట్ చేస్తూ.. వీటన్నిటి మధ్యన మా ఆన్లైన్ స్నేహాలని వదలకుండా కబుర్లు చెప్తూ ఉండటం..

    ఇవి కాకుండా మీకంటూ ఉన్న ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, రకరకాల విషయాల మీద మీ బ్లాగులో మీరు రాయడమే కాకుండా మా అందరి రాతలూ స్పందిస్తూ, ప్రోత్సహిస్తూ ఉండటం..

    అప్పుడెప్పుడో ఒకసారి చిన్నపిల్లల మానసిక విశ్లేషణ చేస్తూ మీరు రాసిన ఒక వ్యాసం చదివాను. పైన నేను చెప్పినవన్నీ మీరు సమర్ధవంతంగా చేస్తూనే ఆలోచన కలవారై ఉండటం, అన్నీ రకాలుగా ఎక్కడ ఎంత ఎలా ఉండాలో ఎక్కువా తక్కువ కాకుండా perfect balance మైంటైన్ చెయ్యడం.

    అస్సలు రవ్వంత కూడా భేషజాలు, ఇగోలు లేకుండా మీ కన్నా చిన్న వయసు వాళ్ళతోనూ, పెద్ద వాళ్ళతోనూ అందరితోనూ చాలా ఆప్యాయంగా ఉండటం..

    ఇంకా.. పైన అందరూ చెప్పింది.. ఒక జీవితకాలానికి సరిపడిన గొప్ప స్ఫూర్తిని ఇవ్వడం.. ఇది పెద్ద మాటేమో అనిపిస్తుంది కానీ, నేనేం అతిశయంగా చెప్పడం లేదండి. ఎందుకంటే ఎక్కడో పుస్తకాల్లో ఎవరో సాహసవంతులు, గొప్పవాళ్ళ అనుభవాలు చదివితే కలిగే స్ఫూర్తి కన్నా మనకి బాగా తెలిసిన వాళ్ళు అనుకునే వాళ్ళు ఇచ్చే ఇన్స్పిరేషన్ చాలా బలంగా ఉండి “ఆ.. ఇది మనలాంటి వాళ్లకి సాధ్యమయ్యే పని కాదులే..” అనిపించకుండా మనక్కూడా ఇలాంటి స్ఫూర్తి ఆచరణసాధ్యమే అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైనా అలాంటి నమ్మకమే కదండీ మనుషుల్ని ముందుకి నడిపించేది! 🙂

    కాబట్టి మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్తున్నానండీ.. ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఉండటం అరుదైన విషయమైతే, అలాంటి వాళ్ళతో నాకు కొద్దో గొప్పో స్నేహం ఏర్పడటం ఇంకొంచెం అరుదే కదా.. So, I tell you again.. For many great reasons, you are one of the most amazing woman I know! 🙂

   • చక్కని విశ్లేషణ మధురా… వేళ్ళ చివర నుంచి కాక మనసు పెట్టి రాసిన వాక్యాలివి. అంత శక్తి ఉన్న వరూధిని గారికీ దానిని గుర్తించగలిగిన మీకూ అభినందనలు

   • ​Sorry for the typos.​
    ​పైన నేను చెప్పినవన్నీ మీరు సమర్ధవంతంగా చేస్తూనే​ లోతైన ​ఆలోచనా పరిధి​ కలవారై ఉండటం..
    ​చివర్లో ​women అని రాయబోయి woman​ అని రాసాను. 😛 ​

   • ​@ మల్లీశ్వరి గారూ..
    ​నా మనసులోని మాటలు చెప్పే సందర్భం మీరు ఈ ఇంటర్వ్యూ తీసుకోడం వల్లే వచ్చిందండీ.. మీరు చేస్తున్న మంచి పనికి మరోసారి అభినందనలు.​ 🙂

 9. ఇంటర్వ్యూ చాలా బాగుంది వరూధిని గారు. మీ బ్లాగ్ నాకు పరిచయమైంది హాస్యపుటపాలతో అయినా తర్వాత వేసిన పోస్ట్స్ చాలా స్ఫూర్తినిచ్చాయి. ఇక మీ ట్రెక్కింగ్ అడ్వంచర్స్ అయితే మర్చిపోలేను 🙂

 10. వరూధిని గారి బ్లాగు నాకు కాస్త ఆలస్యం గా అంటే చదువరి బ్లాగు కన్నా చాలా ఆలస్యంగా చూసాను. ఒక సరదా జ్ఞాపకం గా ఉంది పోయింది . వివరాల్లోకి వెళితే …

  మాకు అయ్యంగార్ సర్ అని మాథ్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఒకాయన వినాయకచవితి నవరాత్రులకి కి చక్కగా ప్రతిరోజూ సాయంత్రం కాలేజి దగ్గర పందిరి లో మాట్లాడుతూ ఉండేవారు. రోజుకొక విశేషం చాలా ఆసక్తిగా ఉంటుంది ఆయన మాటలు వింటే . ఒక రోజు జాంబవంతుడి కధ వినిపిస్తూ , మొదట సమంతకమనిని ఊయలలో ఆడుకుంటున్న పిల్లకు ఇచ్చాడని చెప్పి , యుద్ధం తర్వాత ఆ అమ్మాయిని కృష్ణునికి ఇచ్చి పెళ్లి చెయ్యడం గురించి చివరిలో ఛలోక్తులు విసురుతో ఊయలలో ఆడుకొంటున్నది నిజంగా చిన్న పాపాయి కాదన్నమాట, ఒక పదాహారేల్లన్నా ఉన్న అమ్మాయి అన్నమాట కి మాకు నవ్వాగలేదు .

  అలాగే చదువరి గారి బ్లాగులొ వారు వ్రాసే బ్లాగులన్నీ అప్పుడే కాలేజి చదువులు పూర్తీ చేసికొన్న విద్యార్ధి ఎంతో శ్రద్ద, ఆసక్తి తో ఉత్సాహం గా అక్కడక్కడా కాస్త ఆవేశంగా కూడా చెప్తున్నట్లు గా ఉండేవి . దానికి తోడూ వారి పేరూనూ .

  కాని ఒకానొకరోజు వరూధిని గారి బ్లాగు పరిచయం అవ్వడం , పాత టపాల్లో చదువరి గారి భార్యగా పరిచయమ్…. హమ్మా మన చదువరి శిరీష్ కుమార్ గారు అప్పుడే కాలేజ్ నుండి రావడం కాదు 🙂

 11. Mauli గారూ నా వ్యాఖ్య మీకు ఎలా అర్థం అయిందో కానీ…అంచనా అంటే..మీరు చదువరి గారి టపాలు అప్పుడే కాలేజీ పూర్తి చేసుకున్న విద్యార్థి వ్రాసినట్టు ఉండేవి అన్నారని నేను అలా అన్నాను.

 12. మీ వ్యాఖ్య అర్ధం అయ్యిన్దండీ, కాని ఇది అంచనా వేయడం కాదు, ఆటోమాటిక్ గా వచ్చే ఫీల్ వంటిది.
  మొత్తానికి మీరు బ్లాగ్స్ లోకి రాకుంటే చదువరి గారి పెళ్లెపుడా అని నేను మాత్రం ఎదురు చూసేదాన్ని 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s