మంజులనాదం

మంజు యనమదల

బ్లాగర్  పేరు; మంజు యనమదల 

బ్లాగ్ పేరు; కబుర్లు కాకరకాయలు 

బ్లాగ్ చిరునామా;http://naalonenu-manju.blogspot.in/
పుట్టిన తేదీ;21.1.1971
పుట్టిన స్థలం;జయపురం, కృష్ణాజిల్లా
ప్రస్తుత నివాసం;గుడివాడ
చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)

విద్యాభ్యాసం;ఇంజనీరింగ్ (స్పెషల్ తెలుగులో ఎమ్ ఏ చేసి పి హెచ్ డి చేయాలనుకున్నా )
వృత్తి, వ్యాపకాలు; సాఫ్ట్ వేర్ క్వాలిటి మానేజర్, అది ఇది అని లేకుండా దొరికిన పుస్తకాలు అన్ని చదవడం, పాటలు వినడం, సరదాగా బొమ్మలు వేయడం, ఒకప్పుడు పాటలు కూడా బాగానే పాడేదాన్ని లెండి…అప్పట్లో పాడుతా తీయగా లేదుగా లేక పొతే నేను టి వి లో కనిపించేదాన్నేమో సరదాకే లెండి :)… వంట చేయడం, బ్లాగులో నాకు అనిపించింది రాయడం… ఇలా చెప్పాలంటే చాలానే ఉన్నాయి.
 బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ;తేది గుర్తు లేదు జనవరి 2009 లో
మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి); 500 కి దగ్గరలో

బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు? 

మా ట్రస్ట్ గురించి ఎలా ఫ్రీ గా పబ్లిసిటి చేయాలా అని నా స్నేహితులని సలహా అడిగితే  బ్లాగుల గురించి చెప్పారు అలా తెలుసుకుని ట్రస్ట్ కి ఒక బ్లాగు ఓపెన్ చేసి తరువాత నా కబుర్లు కాకరకాయలు మొదలు పెట్టాను…సలహాల కోసం సలహాలు చిట్కాలు అని మరొక బ్లాగు ఓపెన్ చేసాను….ఇదీ నా బ్లాగు సంగతి…నా బ్లాగుని అందంగా తీర్చి దిద్దడంలో మొదట జ్యోతిగారు సలహాలనిచ్చారు .. తరువాత అవి ఇవి పెట్టడంలో చంద్రశేఖర్, శరత్, లక్ష్మిపతినాయుడు సహకరించారు…. టపాలు రాయమని ఎక్కువగా చెప్పింది శ్రీకాంత్..రాయడం మొదలెట్టాక అందరి వ్యాఖ్యల ప్రోత్సాహం మరువలేనిది…అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరు అలానే ఆదరిస్తున్నారు…. ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు…

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు? 

మొదట్లో నాకు జరుగుతున్న అనుభవాలు, నా అలొచనలు రాస్తూ ఎవరైనా చూస్తారా అసలు అని అనుకునే దాన్ని…చూస్తే చూడని లేక పొతే లేదు అని నాకు అనిపించినవి రాస్తూ పోతుంటే…అలా నా రాతలను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారని తెలిసి భలే సంతోషం వేసింది…చాలా మంచి స్నేహితులు, అభిమానులు, తమ్ముడు ఈ బ్లాగు ద్వారా దొరికారు. రాసే ప్రతి టపాలో నన్ను నేను చూసుకుంటున్నట్లు గా ఉంది… నా మనసులోని భావాలే మీ రాతల్లో ఉంటున్నాయి…ఈ మాటలు చాలామంది అంటున్నారు…. ఇంతకంటే ఏమి కావాలి??
టపా రాసిన ప్రతి సారి ఇదే చివరిదేమో అన్నంతగా అనిపిస్తూ ఉంటుంది…అనిపించిన దాన్ని రాయడమే నాకు తెలిసింది. చాలా టపాలకు స్పందన నా మనసులోనిది మీరు రాశారు అని అంటూ ఉంటారు చాలా మంది. సంతోషంగా అనిపిస్తుంది ఆ మాటలు విన్నప్పుడు.

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు? 

మనకు అనిపించినవి ముఖ పరిచయం లేక పోయినా అందరితో పంచుకోవచ్చు…అనిపించింది బాధైనా సంతోషమైనా ఏదైనా మనకు నచ్చినట్లు వచ్చినట్లు రాసుకోవచ్చు… ఒక్కోసారి మన రాతలు విమర్శలకు గురి కావచ్చు…లేదా పొగడ్తలు కురియవచ్చు…మనని మనం తెలుసునే ప్రయత్నం చేసుకోవచ్చు…మొదట్లో రాయాలంటే భయంగా అనిపించేది…అయినా ధైర్యం చేసి ఎవరు ఏం అనుకుంటే నాకేంటి నాకు అనిపించింది నాకు వచ్చిన భాషలో రాయడం మొదలెట్టేసాను…. ఇదిగో ఇలా ఈ రోజు మీ ముందు ఉన్నానంటే మరి ఇది బ్లాగు సానుకూల అంశమే కదా..!! నొప్పింపక తానొవ్వక అన్నట్లు ఉంటే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు…ఇది పరిమితేమో మరి… !!

మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత? 

నాకు అనిపించిన కబుర్లు కాని కవితలు కాని అనుభవాలు కాని రాస్తూ ఉంటాను…అమ్మ మనసు అమ్మాయి మనసు పడే తపనను…అది ఇది అని లేకుండా అన్ని రాస్తూ ఉంటాను…అందుకే మహిళా బ్లాగర్ గా నాకంటూ ప్రత్యేకత ఏం ఉందో నాకు తెలియదు…

కాకపొతే అందరు అంటూ ఉంటారు మీరు చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా ఉంటుంది అని….!!
దేనికైనా తొందరగా స్పందించే మనసు… ఆ మనసు మాటలు మాత్రమే రాస్తాను….మహిళగా కాకుండా మనిషిగా నాకు అనిపించింది రాస్తూ ఉంటాను.

సాహిత్యంతో మీ పరిచయం? 

చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం చాలా చాలా ఇష్టం…రెండో తరగతి నుంచే సీరియల్స్ చదివేదాన్ని .. చిన్నప్పటినుంచి ఇష్టంతో చదివిన పుస్తకాలు బోలెడు…వాటితో పాటుగా అమ్మమ్మ తిట్టినా…స్నేహితులు పోట్లాడినా…అలా రాయడం మొదలు పెట్టి…ఉత్తరాలతో పలకరింపులు….చిన్న చిన్న కవితలతో మొదలై ఏదో ఇలా బ్లాగులో నా ఆలోచనలను, అనుభూతులను, అనిపించిన దాన్ని రాయడం మొదలు పెట్టాను. చందమామ తో కాకుండా ముందుగా రాధాకృష్ణ సిరియల్ తో నా పుస్తక పఠనం మొదలు అది ఇది అని లేకుండా అన్ని చదివేస్తూ ఉంటాను ఇప్పటికి.

స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా? 

కొన్ని సార్లు కాస్త అలోచించి రాయాల్సి వస్తుంది…ఇప్పటి వరకు ఇబ్బంది ఎదురు కాలేదు…

జీవన నేపధ్యం? 

నాన్నకు సంగీత సాహిత్యాలతో…నాటకాలతో పరిచయం…రచయితా కూడాను…పేరున్న రచయిత కాదులెండి…అమ్మకు అస్సలు ఈ రాతలు ఇష్టం ఉండదు….ఎప్పుడు ఏంటా రాతలు అంటూ ఉంటుంది.

మాది మధ్య తరగతి రైతు ఉమ్మడి కుటుంబం. బంధాలు బాధ్యతలు ప్రేమలు అభిమానాలు, కోపాలు ఆవేశాలు  అన్ని కలిసున్న కుటుంబం. చదివింది ఇంజనీరింగ్ అయినా గురు లఘువులతో తెలుగు అంటే ఇష్టం మొదలై అది అలా పెరిగిపోయి తెలుగు అంటే ఉన్న అభిమానంతో రాష్ట్రాలు మారినా… దేశాలు తిరిగినా తప్పని స్థితిలో మాత్రమే తెలుగు మాట్లాడను. కూటి కోసం పరాయి భాష…ఆత్మ సంతృప్తి కోసం అమ్మ భాష అండి…

మా వారికి అస్సలు పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఇద్దరు అబ్బాయిలు చిన్నవాళ్ళే….తొమ్మిది…ఐదు  చదువుతున్నారు.

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని? 

నేను జీవించి ఉన్నంత వరకు…నాకు వీలైనంత వరకు…

సరదాగా ఏవైనా చెప్పండి? 

కామెంట్లకు జవాబిస్తూ నేను ఓ పెద్ద రచయితలా ఫీల్ అయిపోతు ఉంటాను….ఇదిగో ఇప్పుడు మీకు ఇంటర్వు ఇస్తూ కూడా భలే బావుంది నా గురించి కూడా చెప్పమని అడిగారే అని ఒకింత గర్వంగా ఫీల్ అయిపోతున్నాను.

సీరియస్ గా ఏవైనా చెప్పండి? 

జీవితం లో అన్ని చూసాను….మొత్తంగా జీవితాన్ని చూసాను..చూస్తున్నాను…. 

1.కబుర్లు 

నాలో నేను 

అమ్మో అప్పుడే మద్య వయసు వచ్చేసిందా!! ఈ నాలుగు పదుల జీవితంలోకి ఓసారి తొంగి చూసుకుంటే…!!
తప్పొప్పులు, తీపి చేదు అనుభవాలు, నిజాలు అబద్దాలు, కొన్ని చేదు నిజాలు, మనకిష్టం లేక పోయినా ఎదుటి వారి ఆనందం కోసం చేసిన పనులు, మనకోసం మాత్రమే…మనకి మాత్రమే సొంతమైన కొన్ని అనుభూతుల పరిమళాలు…..ఇలా ఎన్నో రకాల అనుభూతుల మాలికే దేవుడిచ్చిన ఈ జీవితం. మనకి మాత్రమే సొంతమైన, మనది మాత్రమే అయిన మన జీవితం.
జీవితాన్ని అందరూ అందంగానే మలచుకోవాలని, సంతోషంగానే వుండాలని మొదలు పెడతారు కాని అందరికి అన్ని దొరకవు కదా!! మన గతజన్మ ఖర్మ ఫలితాన్ని బట్టి మన నుదుటి రాతని మనం పుట్టే కొన్ని క్షణాల ముందే రాసేస్తాడు. ఈ లోకం లోకి రావడం మొదలు బతకడానికి పోరాటం మొదలు పెడతాము. అదృష్టవంతులు బంగారు స్పూను నోటిలో పెట్టుకు పుడితే, కొంత మంది వెండి, రాగి ఇలా జీవితాలు మొదలవుతాయి.
నేను బంగారు స్పూనుతో పుట్టక పోయినా అదృష్టవంతురాలినే చిన్నప్పుడు. అందరి ప్రేమ, ఆప్యాయతలు పుష్కలంగా దొరికేవి. మాది పల్లెటూరు అయినా మేము పెరిగిన వాతావరణం చాలా చాలా బాగుండేది. చదువు, పుస్తకాలు,ఆటలు, స్నేహితులు, బంధువులు, సినిమాలు, షికార్లు ఇలా అన్ని ఆనందాలు దొరికేవి. మరి మనకు నచ్చినట్లు వుండే అలాంటి జీవితం దొరకడం దేవుడిచ్చిన వరమే నాకు. చిన్నప్పుడు డాక్టరు అంటే చాలా ఇష్టం పెద్ద అయినంక అదే చదవాలని అనుకునేదాన్ని. సైన్సు బొమ్మలు కుడా బాగా వేసేదాన్ని, కొద్దిగా బాగానే చదివేదాన్ని. పిన్ని వాళ్ళు రికార్డులు రాసుకొంటుంటే నేను రాస్తాను ఇంతకన్నా బాగా అని అనుకునేదాన్ని. నాన్న ఇంటరులో సైన్సు వద్దు లెక్కలు తీసుకో అంటే సరే అని లెక్కలు తీసుకున్నాను. బొమ్మల మీద అభిమానంతో స్నేహితులకు వేసిపెట్టేదాన్ని. తెలుగు అంటే బోల్డు అబిమానం కాని స్పెషల్ తెలుగు తీసుకుంటానంటే ఒప్పుకోలేదు. సరే ఇక ఇంజనీరింగ్ మొదలు…..వెళ్తే క్లాసులకు వెళ్ళడం, లేదా క్లాసులు ఎగొట్టి సినిమాలకు వెళ్ళడం….ఇది అందరూ చేసే పనేలెండి నేనేం కొత్తగా చేయలేదు. కాకపొతే ఇంట్లో వాళ్ళని చూడకుండా ఎక్కువ రోజులు వుండటం అలవాటు లేదు అందుకే పది, పదిహేను రోజులకి ఇంటికి వెళ్ళడం. హోటల్ కి వెళ్తే ఓ మంచి కాఫీ, దోశ, ఐస్ క్రీం పార్లర్ కి వెళ్తే భేల్పూరి, వెనీలా తినడం, ఉత్తరాలు, హాస్టల్లో పుట్టినరోజు పార్టీలు, రాగింగులు, క్లాసులో లాస్ట్ బెంచ్లో కూర్చొని అల్లరి, బస్సులో అంత్యాక్షరిలు, పరీక్షల్లో నైట్ అవుట్లు…. …..ఇలా బానే గడిచి పోయింది.
అస్సలు కత మొదలైంది చదువు అయినంక….నాకు, మా నాన్నకి చిన్న మాట తేడా వచ్చి నేను ఎంచుకున్న దారిలో నడవడం మొదలు పెట్టాను. కష్టమైనా, నష్టమైనా నేనే పడ్డాను చాలా రోజులు. ఇంట్లో వాళ్ళు కుడా నాతొ పాటుగానే అన్ని అనుభవించారు ఆ టైములో. మనం వాళ్ళని కాదన్నా వాళ్ళు మనల్ని వదులుకోలేరు ఇది ఎవరు నమ్మినా నమ్మక పోయినా అక్షర సత్యం. మా అత్తింటి వాళ్ళు అందరూ వాళ్ళ స్వార్ధం కోసం అందరు బంధువుల్లానే తమ నిజ స్వరూపం చూపించారు. చాలా కొద్ది మంది మాత్రమే వేరేగా వుంటారు, ఇది మానవ నైజం దీనిలో మనం వాళ్ళని తప్పు పట్టడానికి ఏమి లేదు. కాక పొతే నమ్మకం మీద, మానవత్వపు విలువల మీద దెబ్బ కొట్టారు అది మర్చి పోలేను.
నేను నడుస్తున్న దారిలో ముళ్ళు, రాళ్ళు ఏరుకుంటూ ప్రయాణం మొదలు పెట్టాను….కొన్ని కావాలంటే కొన్నిటిని వదులుకోవాలని పసి పిల్లలని( ఒకటినర్ర , ఆరు నెలల పిల్లలని) అమ్మ వాళ్ళ దగ్గర వదిలి….మరి బతకడానికి డబ్బులు కావాలి కదా!! దేశం కాని దేశం లో ఏదో ఒక తిప్పలు పడి కాస్త నిలదొక్కుకున్నాము. పెద్ద బాబు చచ్చి బతికినా కుడా రాని, కనీసం చూడని అత్తింటి వారికి డబ్బుల అవసరాలు తీర్చి, చిన్న ఆడబిడ్డకు పెళ్లికి డబ్బులు ఇచ్చి, పెళ్లి కుదిర్చి చేస్తే కుడా మామీద ఇంకా కోపమే వాళ్లకి.ఆ పెళ్లి కొడుకు ఆవిడకి నచ్చలేదంట. అది ముందు చెప్పలేదు.నేనేదో అబద్దం ఆ అబ్బాయి జీతం విషయంలో చెప్పానంట. నేను చెప్పలేదు, అడిగితే నాకు తెలియదు నాలుగువేలో,ఐదువేలో నాకు తెలియదు ఫోను నెంబరు ఇదిగో మీరే ఇంకా ఏమైనా అడగదల్చుకొంటే అడగండి అని చెప్పాను. అది జరిగింది. మరిది తోడికోడలు వాళ్ళని అమెరికా మేమే డబ్బులు కట్టి తీసుకు వెళ్లి మూడు నాలుగు నెలలు మా ఇంట్లోనే ఉంచుకుని అన్ని చేస్తే వాళ్ళ అవసరాలు తీర్చుకుని ఈ రోజు మా డబ్బులు పదిహేను లక్షలు ఎగొట్టారు. ఇదండీ బంధువుల రాబందుల గోల!!
ఇక ఉద్యోగం అంటారా!! అది అంతేనండి. పని సంగతి ఏమో కాని రాజకీయాలు బాగా నేర్చుకోవచ్చు. మనం పని చేస్తున్నాము కదా, మళ్ళి దాని గురించి చెప్పడం ఎందుకు? వాళ్లకి తెలుసు కదా!! అనుకుంటాము కాని మనం చేసే పనిని వాళ్ళకిష్టమైన వాళ్ళు చేసారు అని, పని చేసిన మనం ఏమి చేయలేదని, మనకి ఏమి రాదనీ చెప్పడం….ఎవరి దగ్గర నాటకాలు వాళ్ళ దగ్గర వేయడం, చేతలు లేకుండా మాటలు కోటలు దాటించడం…ఇలా మనకు తెలిసిన అనుభవాలే అన్ని. కాదంటారా!! చదివి నవ్వు కుంటున్నారా!! మరి ఇవేనండి నా నాలుగు పదుల అనుభవాల అనుభూతులు కొన్ని.

1.కవిత 

 ఇదీ బావుంది…!! 


చుట్టూ అందరున్నా నాకెవ్వరూ లేనట్టుగా
అన్ని బందాలున్నా ఏ బంధమూ నాది కానట్టుగా
నిస్పృహో….
నిట్టూర్పో..
నిస్సహాయతో…
ఏదో తెలియని…
నిశ్శబ్ద శూన్యం ..!!
ఒంటరితనంతో ఏకాంతమో….!!
ఏకాంతంతో సహవాసమో….!!
ఎలా ఉన్నా అన్నింటా నువ్వే…!!
వడి వడిగా పరుగులెత్తే  కాలం
ఎవరి కోసం దేని కోసం ఆగనట్లే…..
మెల్లగా తడిమి వదలి పోయింది….
నీ జ్ఞాపకాలతో నన్నుండమని….!!

2.స్వప్నమో కాదో…!!


కలో కలవరమో తెలియనిఅయోమయంలో నిదుర కాని

మెలుకువ లోని ఒక స్వప్నం

వేకువలో నిజమయ్యేనా!!

కమ్మని అమ్మ లాలి పాట

నను పరవశింప చేసేనా!!

అమ్మ చల్లని చేతి స్పర్శలోని

వెచ్చదనం నా కందేనా!!

కలైన ఈ కలవరింత లోని

కమ్మదనం, అమ్మదనం అచ్చంగా నాదైతే!!

మెలుకువలోని మరిన్ని నా స్వప్నాలు

వేకువ పొద్దులో నిజమౌతాయి….!!

35 thoughts on “మంజులనాదం

 1. మంజు గారూ,
  మంజులనాదం మృదువుగా వినబడి కనబడుతుంది కానీ అశ్సరభశ్సరభ హడావిడి చేయదు కదా.. అందుకే కూడళ్ళలో శీర్షిక కనపడదు.
  లోపం కవర్ చేయడానికి కవిత్వం చెపుతున్నా కానీ సారీ..
  మీ సమాధానాలు సింపుల్ గా బావున్నాయి .

 2. కూటి కోసం పరాయి భాష…ఆత్మ సంతృప్తి కోసం అమ్మ భాష అండి… నిజం చెప్పారు… ఎంతైనా అమ్మ భాష తర్వాతే వేటి స్థానమైనా… 🙂

  ఇంటర్వ్యూ బాగుంది మంజుగారు.. బ్లాగు ద్వారా, ప్రమదావనం ద్వారా, ఫేస్‌బుక్ సాహిత్య గ్రూపుల ద్వారా చాన్నాళ్లుగా మంజుగారు పరిచయమే… ఎప్పుడూ టచ్‌లో ఉంటారు.. ఏం రాసినా వెంటనే స్పందిస్తారు… చక్కగా ప్రోత్సహిస్తారు..

  మంజుగారి పేరు తల్చుకుంటేనే నాకు ఎప్పుడూ ఆత్మీయ స్నేహితురాల్లాగే అనిపిస్తూ ఉంటారు… 🙂

  మంజు గారి గురించి ఇంత చక్కని పరిచయం చేసినందుకు మల్లీశ్వరిగారికి ధన్యవాదాలు.. మంజుగారికి అభినందనలు.. Keep Smiling always Manjugaaroooooo……

  • శోభ గారు చాలా సంతోషం మీ ఆత్మీయ స్పందనకు… స్నేహానికి…మీ స్పందన చూసి మనసు చాల హాయిగా ఉంది….ఇంతకన్నా చెప్పలేను 🙂 మాటలు రావడం లేదు

 3. ఒక మృదు మధుర మంజులనాదంలా జరిగిన ఈ ఇంటర్వ్యూ బాగుందండీ. స్వఛ్ఛమైన మీ మనసుని విప్పి చెప్పిన విధానం చాలా బాగుంది. ఇంత చక్కగా సమాధానాలిచ్చిన మీకు, మీనుంచి ఇంత చక్కటి సమాధానాలు రాబట్టుకున్న జాజిమల్లిగారికి అభినందనలు…

 4. అరె! కొంచెం ఆలస్యంగా చూసాను . మంజు గారు మీ బ్లాగ్ మంజీరనాదం ని శ్రావ్యంగా వినిపించారు. చాలా బావుంది . నాకెప్పుడూ ఆశ్చర్యం. ఎలాంటి విషయాన్ని అయినా సింగిల్ పేజీ కథలా చక్కగా చెప్పేస్తారు . మీ మనోభావాలు ప్రతిబింబించే మీ బ్లాగ్ బావుంటుంది . అదివరకటి కన్నా ఇప్పుడు బాగా వ్రాస్తున్నారు కూడా . మీరన్న ఈ మాట బాగా నచ్చింది “కూటి కోసం పరాయి భాష…ఆత్మ సంతృప్తి కోసం అమ్మ భాష ” అభినందనలు

  మల్లీశ్వరి గారు .. కబుర్లు కాకరాయ కాయలలో నుండి మంజు నాదాన్ని వినిపించారు . రియల్లీ సూపర్బ్. థాంక్ యూ!

 5. చక్కటి బ్లాగుల్లో మంజు గారిది కూడా ఒకటి. మంజు గారూ మీ బ్లాగులో ఎక్కువగా వ్యాఖ్యలు పెట్టకపోయినా మీ ప్రతి టపా చదువుతాను. ఏ విషయమైనా భలే క్లుప్తంగా సూటిగా స్పష్టంగా చెప్తారు.

  జాజిమల్లి గారూ మంచి బ్లాగుల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నందుకు మీకు థన్యవాదాలండి. టపా పేరు కూడా భలే చక్కగా పెడుతున్నారు.

 6. మంజు గారు, చాలా ఆలశ్యంగా ఇప్పుడే చదివాను మీ ఇంటర్యూ.
  మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మీ కవితలు చాలా బాగుంటాయి.
  మీ సున్నితమైన మనసుకి అద్దం పడుతూ ఉంటాయి. మిమ్మల్ని పరిచయం చేసిన జాజిమల్లి గారికి ధన్యవాదాలు.

 7. మళ్లీశ్వరిగారు నమస్తే!

  ముందుగా మీకు ధన్యావాదాలు.

  మంజు గారు 2011 మార్చి నుండీ బ్లోగర్ గా పరిచయం!

  సున్నితంగా, నిక్కచ్చి గా వుంటాయి వాటి టపాలు. అల్లాగని ఎక్కడా వివాదాలకి పోరు. సహనంతో సానుకూలంగా వుంటారు. సహజత్వం వారిలో సహజాతంగా వుందేమో. మనసుని బట్టీ,మనసు పట్టి,మనసు పెట్టి మాట్లాడతారు.

  ఒకప్పుడు (2012-04) నేను నిర్వహించిన కవితా పోటీలో విజేతగా నిల్చారు. బహుమతందుకున్నారు.
  http://neelahamsa.blogspot.in/2012/04/blog-post_3.html

  ఇటీవలి వారి కవితల్లో నాకెప్పుడూ గుర్తుకొచ్చే మాటలు:

  రాయలేని కన్నీటి కావ్యాలు
  అక్షరాల కోసం ఎదురు చూస్తున్నాయి…!!
  చెప్పలేని మనసు స్పందనలు
  మూగగా తపిస్తున్నాయి నీకు చెప్పాలని ..!
  -మంజు

  వారి కుశలాన్ని,అభ్యున్నతిని మనసారా కాంక్షిస్తూ …

  -సత్య

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s