ధీరగుణ శోభ

My Passport size photo

బ్లాగర్ పేరు: శోభ

బ్లాగ్ పేరు: కారుణ్య

బ్లాగ్ చిరునామా: http://kaarunya.blogspot.in/

పుట్టిన తేదీ: 05.04.1978

పుట్టిన స్థలం: చింతపర్తి, చిత్తూరు జిల్లా

ప్రస్తుత నివాసం: చెన్నై

చిరునామా (ఇబ్బంది లేనట్లయితే)

విద్యాభ్యాసం: ఎం.ఏ. తెలుగు, బీఈడీ

వృత్తి : గృహిణి, అదృష్టం తోడయ్యుంటే గవర్నమెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ అయ్యేదాన్ని.. అర మార్కులో ఉద్యోగం పోయింది అందుకే అదృష్టం తోడయ్యుంటే అన్నాను…

వ్యాపకాలు: బ్లాగింగ్, పుస్తకాలు చదవటం, కవితలు, కథలు రాయటం.. కుట్లు, అల్లికలు, పాట్ పెయింటింగ్, క్లాత్ పెయింటింగ్, ఎంబ్రాయిడరీ….

బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ: January 30, 2009

మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి): 102 పోస్టులు

బ్లాగ్ లోని కేటగిరీలు: 19 (ఆదెమ్మక్క కోసం, కవితలు, చిన్ననాటి జ్ఞాపకాలు, నాన్న జ్ఞాపకాలు, పత్రికల్లో నా రచనలు, ప్రేమగా నా కోసం, బుజ్జి కెమెరా జ్ఞాపకాలు, మా వూరు, మా బాబు కోసం, రోజువారీ స్పందనల ప్రతిరూపం, సునామీ జ్ఞాపకాలు, మా ఇంటి గోల, వంటకాలు, శైలూ కోసం, సిరి కోసం, అందరి కోసం లాంటివి)

బ్లాగ్‌ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?

2009లో. గృహిణిగా ఉన్న నాకు బ్లాగు గురించి పరిచయం చేసింది మా అక్క వాళ్లబ్బాయి. తను రాసే ప్రతి పోస్టూ నాకు మెయిల్ చేసేవాడు. అలా బ్లాగ్ ప్రపంచం అనేది ఒకటుందని పరిచయం అయింది. అది కూడా మన మాతృభాషలోనే రాసుకునే సౌకర్యం ఉండటం ఇంకా బాగా నచ్చింది.

ఎందుకంటే చిన్నప్పటినుంచీ గవర్నమెంటు స్కూల్లో చదువు, ఆ తరువాత గవర్నమెంట్ కాలేజీలో చదువు… ఇంగ్లీషులో బాగా పూర్. అమ్మా నాన్నలు చదువుకోలేదు. వాళ్లలాగా మేమూ ఉండకూడదని… కూలి చేసుకునేవాళ్లు ఎన్నో కష్టాలకోర్చి మా ముగ్గురు పిల్లల్ని చదివించారు. అయితే చదువుపరంగా ప్రోత్సహించేవాళ్లు లేక… బడిలో చెప్పింది చదువుకుంటూ పోయా. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీషు లేదా ఇతరత్రా భాషలు సరిగా చెప్పరని కాదుగానీ… నాకే చిన్నప్పటినుంచీ ఇంగ్లీషు, హిందీ, లెక్కలు అంటే ఓ రకమైన భయం ఉండిపోయింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నప్పటీ… ఇప్పుడిప్పుడే ఇంగ్లీషు కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నా.

అలా నేర్చుకోబట్టే.. ఇంటర్నెట్ గురించి తెలుసుకోగలిగా.. అలా బ్లాగు ప్రపంచం గురించి కూడా తెలుసుకున్నా. మా అక్క కొడుకు బ్లాగు ప్రేరణతో… తన సహాయంతోనే నేనూ ఓ బ్లాగును 2009 జనవరిలో http://blaagu.com/kaarunya పేరుతో రూపొందించుకున్నా. బ్లాగు.కామ్‌ నిర్వహణ సరిగా లేని కారణంగా http://kaarunya.blogspot.in/ పేరుతో ఆగస్టు, 2010లో కొత్త బ్లాగును క్రియేట్ చేసుకున్నా. పాత బ్లాగు పోస్టులన్నీ ఇందులోకి తరలించిన తరువాత కొత్తగా రాయటం మొదలెట్టాను.

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?

మొదటినుంచీ మనసుకి తోచినవి రాయటం అలవాటు. నచ్చినవి, నచ్చనివి.. స్పందింపజేసినవి.. ఆలోచింపజేసినవి.. బాధపెట్టినవి, భయపెట్టినవి, బాధ్యతల్ని నేర్పినవి ఇలా ఒకటేమిటి అన్నీ మనసు చెప్పిన కథలు, కథనాలే నా బ్లాగునిండా. ఎక్కువగా స్వానుభవాలే. మొదట్లో ఏం రాయాలన్నా ఇది బాగుండదేమో, ఎవరికీ నచ్చదేమో… ఇలా రాయకూడదేమో…… ఇలా ఎన్నో రకాల సందేహాలు.

ఒకరికి నచ్చుతుందా లేదా అనేది పక్కనపెట్టి.. నీకు తెలిసింది, రాయాలనుకుంది… నీ మనసుకు నచ్చిన విషయాల్ని రాయమని మావారు ఎప్పటికప్పుడు ప్రోత్సహించేవారు. ఏది రాసినా ముందుగా మా ఆయనకో, లేక మా అబ్బాయికో పంపి వాళ్ల సలహాలు, సూచనల్ని తీసుకునే పోస్టు చేయటం అలవాటైంది మొదట్లో… తరువాత తరువాత ఎవరి సలహా, అభిప్రాయం లేకుండా నాకు తోచినట్లు రాయటం, పోస్ట్ చేయటం చేస్తూ వచ్చాను.

మొదట్లో అస్సలు కామెంట్స్ వచ్చేవి కావు. దాంతో కాస్త కంగారు. నా పోస్టులు ఎవరికీ నచ్చటం లేదేమోనని. అయితే బ్లాగు అగ్రిగేటర్ల గురించి తెలుసుకుని వాటిల్లో నా బ్లాగును ఆడ్ చేసిన తరువాత మెల్లిగా నా బ్లాగును చూసే చదువరులు పెరిగారు. తమ కామెంట్లతో ప్రోత్సహించటం.. నా పోస్టుల్లో నేను బాధపడితే సహానుభూతి ఇవ్వటం, నవ్వితే నవ్వటం, ఏడ్చితే ఓదార్చటం… ఇలా చాలా రకాలుగా తోటి బ్లాగర్లు, ఇతర చదువరులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు.

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు? పరిమితులు?

బ్లాగు అన్నది మనం సొంతంగా రూపొందించుకున్నది. పూర్తిగా మనకి సొంతమైనది. మన మనసుకు అద్దంలాంటిది. మనకి నచ్చినట్లు రాసుకునే సౌలభ్యం ఇందులో ఉంది. ఏవైనా రచనలు బ్లాగులో ప్రచురించుకోవటం సులభం. పత్రికల్లో కొన్ని రకాల లిమిటేషన్స్ ఉన్నట్లుగా బ్లాగింగ్‌లో ఉండదు. ఇదే సానుకూల అంశం.

పరిమితులు అంటే… మనకి తట్టినవో, లేకపోతే ఊహ ద్వారానో కొన్ని రకాల అంశాలపై రాసినప్పుడు, వాటిని చదువరులు బ్లాగర్ స్వానుభవాలుగానో లేకపోతే, ఆ బ్లాగర్ సొంత జీవితంలో జరుగుతున్న ఘటనలను ఆ రచన ద్వారా చెబుతున్నట్లు భావించి.. వ్యాఖ్యానించే అవకాశం ఉంది. దానివల్ల బ్లాగర్ చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టి… వ్యక్తిగత విషయాల్లో చర్చ మళ్లటం వల్ల మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. దానివల్ల కొన్ని కొన్ని విషయాలు రాయలేకపోతారు. నేను గమనించిన దాన్ని బట్టి… బ్లాగింగ్ పరిమితుల్లో ఇదొకటి.

మహిళా బ్లాగర్‌గా మీ ప్రత్యేకత?

ఓ మహిళా బ్లాగర్‌గా నా ప్రత్యేకత ఏమీ లేదండి. చాలా సాదా సీదా మనిషిని. సాహిత్యం అంటే ఇష్టమేగానీ… ఎలా రాయాలి, ఏది రాయాలి అనేది పెద్దగా తెలీదు. మనసుకి తోచింది రాస్తూ పోవడమే ఇప్పటిదాకా చేసింది. అయితే నా రచనలు పదిమందినీ ఆలోచింపజేయాలనీ, వాటి ద్వారా ఎంతో కొంతమంది అయినా మారినా చాలని అనిపిస్తుంటుంది. అంతే…

సాహిత్యంతో మీ పరిచయం?

చాలామందికిలా చిన్నప్పటినుంచి చందమామ సాహిత్యం చదువుతూ పెరగలేదు నేను. అస్సలు అదొక పత్రిక ఉందన్న సంగతి కూడా నా పెళ్లి అయిన రెండు మూడేళ్లదాకా కూడా తెలీదు. మీకు ముందే చెప్పాను కదండీ అమ్మా నాన్నలు నిరక్షరాస్యులు. ఓ పూట తింటే రెండు పూటలు పస్తులుండే పరిస్థితుల్లో నా చిన్ననాటి జీవనం సాగింది. ఇక్కడ పస్తులు అంటే అమ్మానాన్నలకేనండీ. మాకు మాత్రం మూడుపూటలా కడుపునిండేది.. మరి అమ్మానాన్నలంటే అంతే కదండీ.

అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని బడికి పంపటమే గొప్ప విషయం. పుస్తకాలు, బట్టల్లాంటి కనీస అవసరాల్ని తీర్చేందుకే నానా అగచాట్లు పడేవాళ్లు. నేను 8వ తరగతిలోకి వచ్చేదాకా ఇదే పరిస్థితి. తరువాత క్రమంగా మారటం మొదలైంది. ఉన్నంతలో కాస్త బాగా బ్రతికే పరిస్థితులు ఏర్పడ్డాయి. బాల సాహిత్యం లాంటివి ఉంటాయన్న సంగతి నాకు అస్సలు తెలీదు. దినపత్రిక, వార పత్రికల సంగతి ఇక సరేసరి. అయితే ఒక్కటి మాత్రం నిజం. పుస్తక రూపంలోని కథలు.. సాహిత్యం చదవకపోయినా… అద్భుతమైన బాల్యాన్ని అనుభవించాననే చెప్పవచ్చు. అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, తాతయ్యల ప్రేమ, లాలన… వాళ్ల ఒళ్లో పడుకుని, భుజాలపై వాలిపోయి మరీ లెక్కలేనని కథల్ని విన్న రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను.

ఇంటర్మీడియట్ చదివేటప్పుడు… నా ఫ్రెండ్స్ చాలామంది కాలేజీ లైబ్రరీలోనే కాకుండా.. బయట లైబ్రరీలకు వెళ్లి పుస్తకాలు తెచ్చుకోవడం గమనించాను. లైబ్రరీలో క్లాసు టెస్ట్ పుస్తకాలు, లేదా కోర్స్‌కి సంబంధించిన ఇతరత్రా పుస్తకాలే ఉంటాయని అనుకునేదాన్ని. కానీ… బయటి లైబ్రరీల నుంచి నవలలు, కథల పుస్తకాలు, పాత వార పత్రికలు, చతుర, విపుల లాంటివి తెచ్చుకుని చదవుతుండేవారు. వాటిల్లో ఏముందో చూద్దామని ఓ నవల ఏదో తీసుకుని ఇంటికి వెళ్లాను.. అలా తొలిసారి నవల చదవటం. పేరు గుర్తు లేదుగానీ ఎదో ఎయిర్‌హోస్టెస్‌ల గురించిన నవల అది. విమానం అంటే వింతగా అనిపించే నాకు ఆ విమానంలో పనిచేసేవారి గురించిన నవల కావడంతో చాలా ఆసక్తిగా రాత్రికి రాత్రే చదివేసి పొద్దున్నే నా ఫ్రెండ్‌కి ఇచ్చేశా. అలా మెల్లిగా నవలలు, కథలు చదవటం అలవాటైంది. అమ్మవాళ్లు ఇచ్చే రోజూ ఇచ్చే ఐదు రూపాయల్లోంచి రోజూ 1 లేదా 2 రూపాయిలు మిగుల్చుకుని ఆ డబ్బుతో లైబ్రరీలో నవలలు తెచ్చుకుని చదివేదాన్ని. ఆ తరువాత కొన్నాళ్లకు ధైర్యం చేసి స్వాతి పత్రికను వారం వారం కొనుక్కుని అందులోని కథలు, సీరియల్స్ ఫాలో అయ్యేదాన్ని.

ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పరీక్షలు ముగిశాక… రెండో సంవత్సరంలోకి వెళ్లకముందే పెళ్లి జరిగిపోవడం…… ఒక్కసారిగా పల్లెటూరి నుంచి ఏకంగా మద్రాసు లాంటి మహానగరంలో పడటం చకచకా జరిగిపోయాయి. మావారికి మాత్రం సాహిత్యం అంటే పిచ్చి. ఇంటినిండా ఏ మూల చూసినా పుస్తకాలే. ఎప్పుడు చూసినా వాటిని ముందేసుకుని గంటల తరబడి కూర్చుంటున్న ఆయనని చూసి.. ఈ పుస్తకాల్లో ఏముందబ్బా ఇలా కూర్చుంటున్నారు అని… మెల్లిగా ఒక్కో పుస్తకాన్ని తిరగేయటం మొదలెట్టిన నాకు సాహిత్యం ఏంటో తెలియవచ్చింది. ఆ తరువాత సాహిత్యమే లోకమైంది.

స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?

బోలెడన్ని ఇబ్బందులు. ముఖ్యంగా కామెంట్ల రూపంలో… పేరు చెప్పకుండా అనానిమస్‌ పేర్లతో చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్లు. పైగా బ్లాగు ఆపేయమని బోలెడన్ని హెచ్చరికలు 🙂 ఇంతకంటే ఏం చెప్పగలను… అర్థం చేసుకుంటారుగా….. 🙂

జీవన నేపధ్యం?

పైన చెప్పినట్లుగా వ్యవసాయ కూలి కుటుంబం నుంచి వచ్చాను. పుట్టింది పెరిగింది మారుమూల పల్లెటూళ్లో. చదువు అంతా గవర్నమెంటు స్కూళ్లోనే. ఉపాధి కోసం అమ్మానాన్నలు చిన్నపాటి మండల కేంద్రానికి వచ్చిన తరువాత కాస్తో, కూస్తో మంచి జీవితమే. పెళ్లి తరువాత ఒక్కసారిగా వచ్చి మహానగరంలో పడ్డాను… 🙂 పెళ్లయ్యాక పూర్తిగా సంవత్సరాల తరబడీ చదువు మాటే మర్చిపోయిన నన్ను పట్టుబట్టి మరీ చదివించి డిగ్రీ పూర్తి చేయించారు మావారు. తరువాత ఆయన పట్టుదలతోనే బీఈడీ, ఎం.ఏ.లు కూడా పూర్తయ్యాయి.

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?

మావూరికి అరగంట దూరంలో ఉండే మదనపల్లి అనే చిన్న పట్టణాన్ని ఒకసారో, రెండుసార్లో చూసిన నేను ఇంత పెద్ద మహానగరంలో ఉద్యోగం చేయగలుగుతాను అని అస్సలు అనుకోలేదు. అది కూడా ఓ ఆన్‌లైన్ పోర్టల్‌లో జూనియర్ సబ్ ఎడిటర్‌గా. మొత్తం కంప్యూటర్లో ఇంగ్లీషు నుంచి తెలుగులోకి వార్తలు అనువాదం చేసి ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ని అప్‌డేట్ చేసే ఉద్యోగం.

జీవితంలో కంప్యూటర్ అనేదాన్ని చూస్తాననిగానీ.. కంప్యూటర్ నేర్చుకుని ఇలా బ్లాగింగ్ చేస్తూ.. ప్రపంచం నలుమూలల్లోని తెలుగువారితో నా భావాలను పంచుకుంటానని కలలో కూడా అనుకోలేదు. ఇంగ్లీషు అన్నా, లెక్కలు అన్నా పారిపోయే నేను మెల్లి మెల్లిగా ఇంగ్లీషును నేర్చుకుని కంప్యూటర్‌తో బంధాన్ని పెంచుకున్నాను.

నాకంటూ ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన కంప్యూటర్‌ను, బ్లాగింగ్‌ను వదిలే ఉద్దేశ్యం ప్రస్తుతానికి లేదు. ఇప్పటికీ, ఎప్పటికీ వదిలే ప్రసక్తే లేదు. కానీ కాలం మనకంటే గొప్పది కదా… ఇవ్వాళ రాత్రి పడుకుంటే అస్సలు పొద్దున్నే ప్రాణాలతో లేస్తామో, లేదో తెలీని జీవితాలు కదండీ…

సరదాగా ఏవైనా చెప్పండి?

మద్రాసులో కాపురం పెట్టిన తరువాత ఓ స్నేహితుడి దగ్గర్నుంచి ఓ సెకండ్ హ్యాండ్ మోనో కంప్యూటర్ కొన్నారు మావారు. వాళ్ల ఇంటి నుంచి కంప్యూటర్ తెచ్చుకుని మా ఇంట్లో పెట్టుకున్నాం. కానీ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలీలేదు. మావారు తన ఫ్రెండ్ దగ్గర అన్నీ తెలుసుకుని వచ్చి ఉంటారు అనుకున్నా. ఆయనేమీ అడగలేదట. మావారి స్నేహితుడు ఏదో పనిమీద వాళ్ల సొంతూరు వెళ్లిపోయాడు. ఇప్పట్లో లాగా అప్పుడు సెల్‌ఫోన్లు ఇంత విరివిగా అందుబాటులో ఉండేవి కావు. మరెలా… మేమే ఎలాగైనా సరే తెలుసుకోవాలని అనుకున్నాం.

స్విచ్ వేస్తే ఎంతకీ ఆన్ అవదే.. సీపీయూలో లైట్ వెలుగుతుందేగానీ.. మోనిటర్లో ఏమీ కనిపించటం లేదు. ఏం చేయాలబ్బా అని తలలు గోక్కుంటూ చెరోవైపు కూర్చున్నాం. ఏం చేసినా మోనిటర్లో మాత్రం ఏమీ కనిపించటం లేదు. ఎలా ఆన్ చేయాలో చెప్పకుండా వెళ్లిపోయాడన్న అక్కసునంతా తన తిట్లరూపంలో ఫ్రెండ్‌పై వెళ్లగక్కుతున్నారు మావారు.. అలా తిడుతూ తిడుతూ మోనిటర్ ఆన్ అయ్యేందుకు ఉండే బటన్‌పై అనుకోకుండా వేలో, లేదా చెయ్యో పెట్టాడు. అంతే ఒక్కసారిగా మోనిటర్లో అక్షరాలు… మా సంతోషం చూడాలి.. తరువాత అంత చిన్న విషయం కూడా తెలీని మా అమాయకత్వాన్ని తల్చుకుని తల్చుకుని నవ్వుకునేవాళ్లం చాలాసార్లు… ఇప్పుడు కూడా చెబుతుంటే ఆ రోజులు కళ్లకు కడుతున్నాయి.

సీరియస్‌గా ఏవైనా చెప్పండి?

మా నాన్నకి హఠాత్తుగా అనారోగ్యం. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన రోజున బాగా పూర్తి స్పృహలోనే ఉన్న నాన్న నేను ఫోన్ చేసిన రెండు, మూడు సందర్భాల్లోనూ నువ్వు త్వరగా వచ్చేయమ్మా అన్నారు. నేనూ సరిగానే మాట్లాడాను. నాన్న బాగానే ఉన్నాడు నువ్వు కంగారు పడకు ఇవ్వాళ కుదరకపోతే రేపైనా వచ్చేయ్ అని తమ్ముడు అన్నాడని ఆ రోజు హాస్పిటల్‌కి వెళ్లకుండా ఆగిపోయా. కానీ మరుసటి రోజు నేను వెళ్లేసరికి ఏ మాత్రం స్పృహలో లేని స్థితిలో మరణానికి అతి చేరువలో నాన్న… డాక్టర్లు చేతులెత్తేశారు. నేను పిచ్చిగా అలా తన వైపు చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.

చాలాసేపు తన దగ్గరే కూర్చున్నాక ఓసారెప్పుడో కాస్త స్పృహ వచ్చింది. కళ్లతోనే పలుకరించాడు. ఏం నాన్నా అంటే.. ఏం లేదు మా అని కూడదీసుకుంటూ భారంగా అన్నాడు అంతే… ఆ తరువాత మళ్లీ మాట్లాడలేదు. తను పూర్తి స్పృహలో ఉన్నప్పుడు నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని అనుకున్నారు. నేను వెళ్లలేక పోయానే.. తనతో మాట్లాడలేక పోయానే అని ఇప్పటికీ నన్ను నేను తిట్టుకోని క్షణం లేదు… ఆ విషయం గుర్తొస్తే కన్నీరు ఆగదు… చాలా బాధాకరమైన అనుభవం… ఎవరికీ ఇలా కాకూడదని కోరుకుంటానెప్పుడూ…

చిన్నప్పటినుంచీ అన్నీ తామే అయి కళ్లలో పెట్టుకుని చూసిన తల్లిదండ్రులు… వాళ్ల జీవితపు చివరి దశలో ఓల్డేజ్ హోంల పాలు అవుతున్న తీరు చూస్తే గుండెల్ని ఎవరో మెలిపెట్టినట్టుగా అనిపిస్తుంది. అలాగే కళ్లు తెరిసీ తెరవకముందే అనాధలవుతున్న చిన్నారుల్ని చూస్తే మనసు మూగబోతుంటుంది. ఇలాంటి అనాథలు, అభాగ్యుల కోసం ఎంతో కొంత మేలు చేయాలి అని అనుకుంటున్నా. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఇలాంటి వారి కోసం తప్పకుండా ఏదైనా మంచి పని చేస్తాను.

మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం :

ఏం కొడకా… మాకేమైనా ఇచ్చేదుందా…?
http://kaarunya.blogspot.in/2010/12/blog-post_03.html

కవితలు రెండు :

వందో టపా.. నాన్నకి..!!
http://kaarunya.blogspot.in/2013/03/blog-post.html

నా జీవితపు శిల్పీ…!!
http://kaarunya.blogspot.in/2013/01/blog-post_22.html

Click here to Reply or Forward

106 thoughts on “ధీరగుణ శోభ

  1. శోభ గారూ,
    మీ జీవన రేఖల్ని అతి సరళమైన మాటల్లో దృశ్యీకరించారు.నిజానికి జీవనపోరాటాలను ఇంత అలవోక గా చెప్పడం అనేది మీలో స్తిరపడుతున్న స్తితప్రజ్ఞతకి గుర్తు.
    ముఖ్యంగా సాహిత్యంతో మీ పరిచయం అన్న ప్రశ్నకి మీరిచ్చిన సమాధానం మీకు చాలా మంది ఆత్మీయులను తెచ్చి పెడుతుంది. మున్ముందు జీవితంలో మీరు సంతృప్తిశోభతో వెలిగి పోవాలని కోరుకుంటూ అభినందనలు
    మల్లీశ్వరి

    • జాజిమల్లిగారూ….

      మీరు మహిళా బ్లాగర్ల ఇంటర్వ్యూ కోసం ప్రమదావనంకి పంపిన ప్రశ్నల్ని మొదట చూస్తే రాసేయవచ్చు అనిపించింది. తీరా రాసేందుకు కూర్చున్న తరువాత….. అమ్మో రాయటం కష్టమే అనిపించింది. మంచి ఆన్సర్స్ ఇవ్వలేనేమో అన్న ఫీలింగ్ దాదాపు వచ్చేసింది. ఆ మూడ్ లోనే మీకు ఏదోరకంగా ఇంటర్వ్యూని పూర్తి చేసి పంపించేశాను.

      కానీ… మీ బ్లాగులో వస్తున్న ఇంటర్వ్యూలను చూశాక.. ఎలాంటి విషయాలు రాయాలి, ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవచ్చు అన్న అంశాల్లో కాస్తంత అవగాహన కలిగింది. ఆ తరువాత అయ్యో నేను బాగా రాయలేకపోయానే అనే బాధ కూడా మొదలైంది. ఇంటర్వ్యూని తిరిగీ రాసేందుకు జాజిమల్లిగారు ఓ అవకాశం ఇస్తే బాగుండు కదూ అనుకోని రోజు లేదు. మీ నుంచి ఎలాంటి మెయిల్ రాకపోయే సరికి.. పోనీలే అని మనసుకు సర్దిచెప్పుకుని ఉన్నాను. కానీ ఓరోజు మీ నుంచి మెయిల్. మార్చి రాస్తే బాగుంటుందనే సూచనతో… హమ్మయ్యా ప్రాణం లేచి వచ్చింది..

      అదే ఊపులో రాసేస్తే ఇదుగో ఇంటర్వ్యూ ఈ రూపం తీసుకుంది అచ్చం నా జీవితంలాగే…. 🙂

      అందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను… రుణపడటం పెద్దమాటేమోగానీ… నా మటుకు మనసుకు కలిగిన భావాన్నే ఇక్కడ చెబుతున్నా. ఒక్కోరికి ఒక్కో రకమైన జీవితానుభవాలు ఉంటాయి. నేను ఈ జీవితం నుంచి వచ్చాను అని చెప్పుకోవడంలో నేను ఎప్పుడూ నామోషీ ఫీల్ కాలేదు. అందుకే నా భావాలను ఇలా మీ అందరిముందూ పరచగలిగాను. ఇలా నన్ను నేను మరోసారి నా అక్షరాల్లో చూసుకునేందుకు, నా గురించి అందరికీ తెలుపుకునేందుకు ఓ వేదికను కల్పించినందుకు మీకు మనస్ఫూర్తి ధన్యవాదాలు.

      • కొందరు బ్లాగర్స్ ఒకసారి రాసి పంపాక నాకు సరిగ్గా సంత్రుప్తినివ్వని ఇంటర్ వ్యూలు కొన్ని ఉన్నాయి. తొలిసారి వనజ గారిని దబాయించి మరీ అడిగేశాను ఇంకోసారి రాస్తే బావుంటుందని,ఆమె తపన నాకు తెలుసు కనుక ఏవనుకుంటారో నన్న భయం కలగలేదు. చక్కగా మార్చి పంపారు .తర్వాత ఆ ముఖాముఖి ఎంత మందిని ఆకర్షించిందో మనకి తెలుసు. అట్లా ఒకరిద్దరివి మార్చి రాసాక బాగా పర్ఫెక్ట్ గా వచ్చాయి అందులో శోభ అయితే ఊహించనంత బాగా మార్చి పంపారు. ఇపుడు నాకు ధైర్యం వచ్చింది. అందుకే మరికొందరిని రిక్వెస్ట్ చేసాను. మరింత బాగా రావడం కోసమే కనుక ఫ్రెండ్స్ అందరూ అర్ధం చేసుకుంటారని ఆశిస్తాను.
        నేను ప్రత్యేకం చేసింది పెద్దగా ఏమీ లేదు శోభా ఈ పని నాకు చాలా ఇష్టమై చేస్తున్నాను.ఇంత మంది జీవితాలను పరిశీలించాలీ అంటే ఎన్ని తరగతి గదులు ఎందరు ఉపాధ్యాయులూ.. సంతోషంగా ఉంది

      • ఇక్కడ పరిచయం అయిన బ్లాగర్లకూ… అవబోయే బ్లాగర్లకూ కూడా అంతే సంతోషంగా, తృప్తిగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మల్లీశ్వరిగారూ…

        మీరు చేస్తున్నది ఏమీ లేదంటూ ఒప్పుకోరుగానీ….

        పోనీ…. ఇది మనందరి విజయము, సమిష్టి విజయం అని అందాంలెండి… 🙂

  2. శోభ గారు .. హాట్స్ అఫ్ యూ ! మీలా అందరూ ధీర గుణం తో, అవగాహనతో ఉండగల్గితే జీవన శైలి అద్భుతంగా ఉంటుంది ఎవరైనా మూలాలని మరువకూడదు మీ బ్లాగ్ లో వ్రాసిన పోస్ట్ లలో కొన్ని పోస్ట్స్ నాకు చాలా ఇష్టం . మీ మనసులోని మాటలు, మీ వ్యక్తిత్వం అన్నీ నచ్చాయి .

    అభినందనలు .

    • వనజగారూ…

      మీ అభిమానానికి మనస్ఫూర్తి ధన్యవాదాలండీ. మనం రాసే రాతలు, మాట్లాడే మాటలే కదండీ మన వ్యక్తిత్వానికి ప్రతిబింబాలు. నా రచనలు, నా మాటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ… థ్యాంక్యూ..

  3. శోభ గారు, మీరుచెప్పే విషయాలు చదువుతున్నాకొద్దీ ఓ జీవితాన్నేవడబొసిన మీ అనుభవం అర్ధమవుతోంది. ఎంతో కష్టపడి పైకి వచ్చిన మీకు నా అభినందనలు.మీ ఆశయాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను.

    మల్లీశ్వరి గారు,చక్కటి రచయిత్రిని పరిచయం చేసిన మీకు నా కృతజ్ఞతలు. ఇకనుంచి తప్పకుండా వీరి బ్లాగ్ చదువుతూనే ఉంటాను.

  4. చక్కని ప్రశ్నలకు శోభ ఇచ్చిన చిక్కని సమాధానాలతో నిజంగా శోభాయమానంగా ఉంది..
    తను చెప్పిన మాటల్లో నాకు బాగా నచ్చినవి:-
    1. “తమ కామెంట్లతో ప్రోత్సహించటం.. నా పోస్టుల్లో నేను బాధపడితే సహానుభూతి ఇవ్వటం, నవ్వితే నవ్వటం, ఏడ్చితే ఓదార్చటం… ఇలా చాలా రకాలుగా తోటి బ్లాగర్లు, ఇతర చదువరులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు.”

    2. “ఇంటినిండా ఏ మూల చూసినా పుస్తకాలే. ఎప్పుడు చూసినా వాటిని ముందేసుకుని గంటల తరబడి కూర్చుంటున్న ఆయనని చూసి.. ఈ పుస్తకాల్లో ఏముందబ్బా ఇలా కూర్చుంటున్నారు అని… మెల్లిగా ఒక్కో పుస్తకాన్ని తిరగేయటం మొదలెట్టిన నాకు సాహిత్యం ఏంటో తెలియవచ్చింది. ఆ తరువాత సాహిత్యమే లోకమైంది.”

    3. “చిన్నప్పటినుంచీ అన్నీ తామే అయి కళ్లలో పెట్టుకుని చూసిన తల్లిదండ్రులు… వాళ్ల జీవితపు చివరి దశలో ఓల్డేజ్ హోంల పాలు అవుతున్న తీరు చూస్తే గుండెల్ని ఎవరో మెలిపెట్టినట్టుగా అనిపిస్తుంది. అలాగే కళ్లు తెరిసీ తెరవకముందే అనాధలవుతున్న చిన్నారుల్ని చూస్తే మనసు మూగబోతుంటుంది. ఇలాంటి అనాథలు, అభాగ్యుల కోసం ఎంతో కొంత మేలు చేయాలి అని అనుకుంటున్నా.”

    నచ్చిన అంశాలు:-
    1. తనను తాను మోటివేట్ చేసుకుని స్వతంత్రంగా తన భావాలను వ్యక్తీకరించుకునే మాధ్యమంగా బ్లాగు ఎంచుకోడం.

    2.సాహిత్యం గానీ కంప్యూటర్ గానీ ఎవరి దగ్గరా నేర్చుకోకపోయిన మనంతట మనం కృషి చేస్తే ప్రపంచాన్ని ఇంట్లోంచే ప్రపంచాన్ని చూడగలం అనే స్ఫూర్తిని కలిగించడం .

    మొత్తానికి ‘ధీరగుణశోభ’ అనే టైటిల్ కి జాజిమల్లివారూ శోభా ఇద్దరూ పూర్తి న్యాయం చేసారు

    • జ్యోతిర్మయి అక్కా…

      ఎప్పుడూ వెన్నంటి ఉండే మీ ప్రోత్సాహం మరువలేనిది… కొన్నాళ్లు కనిపించకపోతేనే ఎక్కడో జొహెన్నెస్‌బర్గ్‌లో ఉంటూ కూడా ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగే మీ ప్రేమకు, అభిమానానికి వేనవేల కృతజ్ఞతాభివందనాలు… థ్యాంక్యూ…

    • జ్యోతిర్మయి గారూ శీర్షిక నచ్చినందుకు థాంక్ యూ. శోభ ఇంటర్ వ్యూ చదివినపుడు అబ్బురపడ్డాను. సామాన్యంగా కనిపిస్తూనే స్త్రీలు చాలా సాధిస్తారు కదా!!

  5. సోభా, మీ తెలివి , మీఎ సమయస్పూర్తీ..జీవన విదానం అందరికీ ఆదర్స వంతం, అన్ని్టికంటే మీ సింపల్సిటే అందరికీ నచ్హుతుంది, మీ పలకరింపు గర్వం లేని నిర్మలత్వం. ఇలాంటి చెల్లి నాకెందుకు లేదు అనే బాద తీరింది మీ పిలుపుతో…, మీ జీవితమ్లో ఇంకా ఎన్నో గొప్పస్థానాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాను…అక్క మెరాజ్

    • మేరాజ్ ఫాతిమా అక్కయ్యా….

      ఫేస్‌బుక్‌లోని కవి సంగమం అనే సాహిత్య గ్రూపు ద్వారా పరిచయం అయిన మీరు అతి తక్కువ కాలంలో ప్రేమగా చెల్లీ అంటూ దగ్గరయ్యారు… మీకు నాపై అభిమానం కలుగజేసేలా చేసినందుకు ఆ అక్షరాలకు జేజేలు.. మీకు ధన్యవాదాలు….

  6. కత్తి మహేష్ కుమార్ గారి అభిప్రాయం

    మెయిల్ ఐడీ : mahesh.kathi@gmail.com
    పేరు : మహేష్ కుమార్
    వెబ్‌సైట్ : http://parnashaala.blogspot.in/

    జీవితాన్ని అవలోకనం చేసుకోవడం ఎప్పుడూ మంచిదే. మనం ఎక్కడున్నామో ఎక్కడినుంచీ వచ్చామో ఎటువైపు వెళ్తున్నామో బేరీజు చేసుకునే సమయం లాంటి ప్రయత్నం. బాగుంది.

    • మహేష్ గారూ…

      జీవితాన్ని అవలోకనం చేసుకోవడం ఎప్పుడూ మంచిదే. మనం ఎక్కడున్నామో ఎక్కడినుంచీ వచ్చామో ఎటువైపు వెళ్తున్నామో బేరీజు చేసుకునే సమయం లాంటి ప్రయత్నం. బాగుంది…. అన్న మీ కామెంట్లో నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంది… థ్యాంక్యూ సర్…

  7. శైలబాల గారి అభిప్రాయం

    మెయిల్ ఐడీ : kallurisailabala@gmail.com
    పేరు : శైలబాల
    వెబ్‌సైట్ : http://kallurisailabala.blogspot.in/

    శోభ అక్క ఇంటర్వ్యూ చాల బావుంది.
    బావుంది అనేకన్నా మీ మాటల్లో , మా రాతల్లో ఉండే నిజాయితీ నాకు చాల నచ్చుతుంది .
    మీకు వీలున్నంతలో ఎదుటి వాళ్ళకి సాయపడాలి అనే గుణం… మీ గురించి మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకునే మీ పధ్ధతి ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంటర్వ్యూలో మీరు కనిపించారు.
    ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూలు ప్రచురిస్తున్న ( బ్లాగ్ ద్వారా ) జాజిమల్లి గారికి అభినందనలు.

    • నా బ్లాగు పోస్టులను చదివి… వాటినీ, నన్నూ ఇష్టపడి… ప్రేమగా అక్కా అని పిలుస్తూ ఎప్పుడూ మనసుకు దగ్గరగా ఉండే చెల్లాయ్ శైలూ… ఇంటర్వ్యూ నచ్చినందుకు థ్యాంక్యూ రా…

      మల్లీశ్వరిగారి ప్రయత్నం పలు ఇంటర్వ్యూల ద్వారా సఫలం అవుతున్నందుకు సంతోషిస్తూ నువ్విచ్చిన అభినందనలకు ఇంకా బోలెడన్ని అభినందనలు చేరుస్తూ అభినందన మందార మాలలు తనకి ఇచ్చేస్తున్నా… అందుకోండి మల్లీశ్వరిగారూ….

  8. మొదటగా మల్లీశ్వరి గారికి ధన్యవాదాలు!!

    శోభ గారు పరిచయమయ్యి దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తుంది…ఇప్పటికీ అదే పలకరింపు..మాటల్లో అదే స్ఫూర్తి … కాలం మారేకొద్దీ ఎదుటివారిలో పెద్దగా మార్పులు వుండవని తెలిస్తే మనమెంత తేలికై పోతామో, ఎంత సరళమై పోతామో శోభగారి పరిచయమయం ద్వారా తెలిసింది… తనని శోభక్కా అని పిలుస్తాను..లోకాన్నంతా తన అనుభవానికద్ది, జీవితాన్ని దగ్గరినుంచి చూసిందేమో అనిపిస్తుంది… శోభగారి రచనల్లో కూడా అదే కనిపిస్తుంది.. సహనమెక్కువ!. సంతృప్తితో, తన అభీష్టాలన్నీ నెరవేర్చుకొని, మంచి అభివృద్దినొందాలని కోరుకుంటూ ..
    -సత్య

    • ఆకుపై కవిత రాయమంటూ ఓ బహిరంగ సవాల్ ద్వారా పరిచయమయ్యాడు సత్య. అప్పటినుంచి రకరకాల రచనలపై బోలెడన్ని అనుభవాలను, అనుభూతులను… చర్చలను ఆన్‌లైన్లోనూ, ఫోన్లోనూ సంభాషించుకునేవాళ్లం. ప్రతి విషయంలోనూ తన విశ్లేషణ… రెండువైపులనుంచీ ఆలోచించే తత్వం నాకు బాగా నచ్చుతాయి.. అందుకే మా స్నేహం అక్కా, తమ్ముళ్ల బంధంలోకి మారి హాయిగా సాగుతోంది.. థ్యాంక్యూ తమ్ముడూ…

    • కష్టేఫలి మాస్టారూ …

      మీ కామెంట్లను ఇతర బ్లాగుల్లో చూస్తుంటాను… మీ బ్లాగులోని పోస్టులు కొన్నింటిని చదివాను… ముఖ్యంగా వనజగారు తన బ్లాగులో మీ గురించి రాసిన కథనం చదివాక చాలా ఆత్మీయంగా అనిపించారు.

      మల్లీశ్వరిగారి పరిచయం తరువాతనైనా నా బ్లాగును తరచుగా చూస్తుంటారని ఆశిస్తూ… ధన్యవాదాలు….

    • మౌళీ గారూ… ధన్యవాదాలండీ…

      బ్లాగింగ్‌లో అత్యంత ఆనందం పొందిన సందర్భాలు, వ్యాఖ్యలు చాలానే ఉన్నప్పటికీ… బాగా బాగా ఇష్టమైనవి… కొన్ని ఉన్నాయి.. తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను.

      http://kaarunya.blogspot.in/2011/02/blog-post.html

      http://kaarunya.blogspot.in/2011/11/blog-post.html

      ఈ రెండు పోస్టులు రాస్తున్నప్పుడు పొందిన ఆనందం, సంతృప్తీ అంతా ఇంతా కాదండీ.. అదేంటి చనిపోయిన నాన్న గురించి రాస్తే సంతోషిస్తారా అని ఆశ్చర్యంగా మీరు అడగవచ్చు…

      నాన్న లేని వారి బాధని మాటల్లో చెప్పలేం.. అది అందరికీ సహజమే… ఆ బాధ ఉన్నప్పటికీ తన జ్ఞాపకాలను… తను ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చదివించిన చదువుకు సార్థకత కల్పించేలా నా అక్షరాలతో నాన్నను ఈ ప్రపంచానికి పరిచయం చేశాను. అంతకంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పండి జీవితంలో.

      నాన్న లేరన్న బాధ… అలాగే లేని నాన్న జ్ఞాపకాలను నా అక్షరాల్లో పొందుపరచినప్పుడు సంతోషం.. ఇటీవలి కాలంలో నాకు తోడు, నీడలా మారిపోయాయి. నాన్న గురించి నేను ఏం రాసినా బ్లాగర్లు కామెంట్ల రూపంలో నన్ను వాళ్ల సొంతమనిషిని చేసుకున్నారు.. మా నాన్నను వాళ్ల నాన్నలా ఫీలవుతూ చదివారు.. స్పందించారు… ఇది చాలు జీవితానికి అనిపిస్తుంటుంది..

      ఈ మాత్రం చెప్పుకునేందుకు అవకాశం కల్పించిన మౌళిగారు మీకు మరొక్కసారి ధన్యవాదాలు.

      • ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి…

        మా నాన్న గురించి రాయమని ప్రోత్సహించింది దుర్గ అనే స్నేహితురాలు. తను ప్రమదావనం అనే మహిళల బ్లాగు గుంపులో పరిచయం అయింది. తన ప్రోత్సాహంతోనే నేను సిలికానాంధ్ర వారి సుజన రంజని పత్రికకు రాసి పంపాను.

        ఆ కథనంలోంచి కొంత మ్యాటర్ తీసి నా బ్లాగులో పబ్లిష్ చేసుకున్నాను. కానీ కథనం పూర్తి పాఠం సిలికానాంధ్రవారి సైట్లో ఉంది. ఆసక్తి ఉన్నవాళ్లు కింది లింక్‌లో చదవవచ్చు.

        http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb11/maanaannakujejelu.html

  9. మీ అమ్మ, నాన్న చాలా చక్కగా ఉన్నారండీ. మీరు చాలా అదృష్టవంతులు అంత కష్టజీవి ప్రేమని పొందినందుకు

    రెండు టపాలు చాలా హృద్యం గా వ్రాసారు .

  10. కొత్త బ్లాగర్లనూ, తెలిసిన బ్లాగర్లలో కొత్త కోణాలను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు మల్లీశ్వరి గారు.

    Good to know about your blog Sobha gaaru. మీరిచ్చిన సమాధానాల్లో మీ దృక్పదం నచ్చింది, వీలైననంత కాలం బ్లాగుతూనే ఉండాలని కోరుకుంటున్నా 🙂

  11. శొభ గారు, మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. బ్లాగర్ గా మీ అనుభవాలను మాతో పంచుకోవడమే కాక,మీ జీవితం గురించి మీరు రాసినది చదివితే చాలా నేర్చుకోవచ్చనిపించిందండి.
    మిమ్మల్ని “ధీర గుణ శోభ” అని జాజిమల్లి గారు పరిచయం చెయ్యడం నాకు చాలా నచ్చింది..

  12. “అనాథలు, అభాగ్యుల కోసం ఎంతో కొంత మేలు చేయాలి అని అనుకుంటున్నా.పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఇలాంటి వారి కోసం తప్పకుండా ఏదైనా మంచి పని చేస్తాను.”

    మంచి ఆలోచన (కారుణ్య)శోభ గారూ,మీ ఆశయం తొందర్లోనే నెరవేరాలని కోరుకుంటూ మిమ్మల్ని ఈ వేదికపై పరిచయం చేసిన జాజిమల్లి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.

    కష్టపడి పైకిరావడం,మన మూలాలు మరిచిపోకపోడం,కనీసం నిజాయితీతో ఉండడం అన్నది “మనుషులుగా” బ్రతికే వాళ్ళకి ఉండాల్సిన అత్యావశ్యకమయిన లక్షణం.అవి మీలో మెండుగా ఉన్నాయని మీ మాటలు చేతల ద్వారా తెలుస్తోంది.మీకు అంతా మంచే జరిగి ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నా.

    • శ్రీనివాస్‌గారూ.. మీ అభినందనలకు కృతజ్ఞతలు.

      నా కృషికి మీ అందరి అభినందనలు, ఆశీస్సులు తోడై నేను అనుకున్నది చేయగలిగే పరిస్థితులు త్వరగా రావాలని.. కనీసం ఒక్కరైనా సరే ఫలానా వారివల్ల నా జీవితం ఇప్పుడు బాగుంది అని సంతృప్తితో అనగలిగితే నేను అనుకున్నది చేయటంలో కాస్త ముందడుగు వేసినట్లే…!

  13. అన్నట్టు మీ అందరికీ చెప్పడం మర్చిపోయా….

    బ్లాగ్ అనేది ఒకటి ఉందని నాకు పరిచయం చేసిన మా అబ్బాయిని పరిచయం చేయకపోతే ఎలాగని నా మనసు నాకు రాత్రే మొట్టికాయ వేసిందండీ.. అందుకే తనను మీకు పరిచయం చేసస్తాను… లేకపోతే మళ్లీ మొట్టికాయలు చాలానే తినాల్సి వస్తుంది.. 🙂

    తన బ్లాగు: http://blaagu.com/sree/

    2007లోనే బ్లాగు మొదలెట్టాడు. కానీ నాకు జ్ఞానోదయం అయ్యేసరికి 2009 వచ్చేసింది…. 🙂

    తననీ ఆశీర్వదిస్తారు కదూ….

  14. andaru chandamaamalato modalettaka poyinaa vedana lo nuchi baadha lo nunchi chakkani bhaavaalu puttuku vastaayani miru kudaa nijam chesaaru…..alaa vache bhaavajaalam andari hrudayaalalo padilam gaa padi kaalaalu nilichi potundi….chakkani vyaktitvam mi sontam andamaina bhaavato padaalu alladam miku alavokagaa vachesindi…mi nijaayiti ki abhinandanalu…nenu kudaa blog modalu pettinappudu milaane anukunna….naa manasulo maatale miru raasaru….chakkagaa vundi mimmalni miru aaviksharichukkunna tiru…jaajimalli gari ki abhinandanalu

  15. @ శోభ గారూ..
    మీ అంతరంగం, అనుభవాలు చాలా స్ఫూర్తివంతంగా ఉన్నాయండి. Truly inspiring! Nice to know you! ఇంతకన్నా ఏం చెప్పాలో తెలీట్లేదు. 🙂

    @ మల్లీశ్వరి గారూ.. శోభ గారి ఇంటర్వ్యూ మొత్తం చదివాక మీరు పెట్టిన టైటిల్ వంద శాతం సరిపోయిందనిపించింది. శోభ గారు నాకు తెలుసు కదా అనుకుంటూ చదవడానికొచ్చిన నాకు తన గురించి అస్సలు తెలీని కొత్త కోణాల్ని పరిచయం చేసారు. థాంక్యూ సో మచ్! మీరు చేపట్టిన ఈ మంచి పని వల్ల చాలా మంది గురించి విలువైన విషయాలు తెలుస్తున్నాయి. మరోసారి ధన్యవాదాలు మీకు. 🙂

  16. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడచి అన్నీ స్వంతంగా నేర్చుకుంటూ ఈ స్థాయిలో నిలబడిన మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది శోభ గారు. మీ నాన్నగారి పై మీ అభిమానం నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. మీలాంటి కూతురున్న ఆయన అదృష్టవంతులు.

  17. శోభమ్మా.. జీవితం ఎగుడూ దిగుడూ లేకపోతే, అది అసలు జీవితమే కాదేమో, నేర్చుకోవలసింది తక్కువేనేమో అనిపించేలా రాసేవు. సాహితీ మూర్తి రావూరి భరద్వాజ గారికి , జ్ఞాన పీఠం వచ్చినందుకు , కలిగినంత సంతోషం వేసింది. నీ నిజాయితీ అయిన పరిచయం చదివితే. రాస్తూ ఉండు. వైయుక్తిక వేదన .. సామాజికమూ , సంఘానికి ఒక మంచి ఇన్స్పిరేషన్ కావాలి నీలాంటి వాళ్ళు.

    • మీ అభిమానానికి నాకు మాటలు కరువయ్యాయి సాయి పద్మ (తమ్మి మొగ్గలు) అక్కా… తప్పకుండా మీ సూచనను పాటిస్తాను.. నేర్చుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది… నేర్చుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ… మీ అందరి చేయూత, ఆదరణ, ప్రేమ సహకారంతో…. ముందుకు సాగుతాను.

  18. అందరం ఒకరి జీవితాల నుంచి ఇంకొకరం స్ఫూర్తి పొంది.. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు సాగుదాం జ్యోతిర్మయిగారు..

    మా కోసం సుఖం అనేదే ఏనాడూ ఎరుగకుండా కష్టించిన నాన్న… తీరా పిల్లలు ప్రయోజకులై సుఖపెట్టే సమయంలో దూరమైపోయారు. ఆ బాధే అక్షరాల్లో బయటికి వస్తుంటుంది. చిన్నప్పటినుంచీ నాన్నంటే చాలా ఇష్టం పైగా అచ్చం నేను నాన్న పోలికే… రంగుతో సహా… 🙂 అమ్మ ఎప్పుడూ ఇలా చెబుతుంటుంది. ఆయనలాంటి నాన్న నాకున్నందుకు నేనూ అదృష్టవంతురాలినే…

  19. శోభ గారూ..మీ గురించి మీ బ్లాగు ద్వారానూ..ప్రమదావనం ద్వారానూ తెలిసినా మీ మాటల్లో మీ గురించి ఇలా చదవటం బాగుంది. మీ జీవితం ఎంతోమందికి స్పూర్తి దాయకం. జాజిమల్లి గారు ఈ టపాకి చక్కటి టైటిల్ పెట్టారు.

    Thank you JaJimalli garu for your lovely series on women bloggers.

    • వరూధిని గారూ …
      మీ ఇంటర్ వ్యూ నాకు తప్పకుండా ఇవ్వాలి. మీ కోసం నేను ప్రత్యేకంగా ప్రశ్నలు తయారు చేస్తాను
      శీర్షిక,ఈ సీరీస్ నచ్చినందుకు ధన్యవాదాలు

      • వరూధినిగారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు…

        మీ మాటలు చాలా సంతోషాన్నిస్తున్నాయి. మీరన్నట్టు టపా టైటిల్ క్రెడిట్ మాత్రం మల్లీశ్వరి గారిదే… 🙂

        మహిళా బ్లాగర్లందరికీ ఒక వేదికపై చోటు కల్పించి.. వారి వారి బ్లాగు అనుభవాలను, జీవితానుభవాలను ఈ ప్రపంచానికి చెప్పుకునేందుకు ఒక వారధిలా నిల్చిన మల్లీశ్వరి గారి ప్రయత్నానికి అందరం ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోవు.

        కానీ చిక్కంతా ఏంటంటే… ఆవిడ నేను పెద్దగా చేసిందేమీ లేదంటూ ఒప్పుకోరు… 🙂

        ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది పెద్దలు ఇందుకే కాబోలు….

  20. జాజిమల్లి గారూ,

    మంచి మంచి బ్లాగర్లను పరిచయం చేస్తున్నందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు! మీ ఈ పరిచయం చూసేంతవరకు నాకు శొభగారి గురించి తెలియదు.

    రోజంతా సంఘంలో జరిగే అరాచకాలనీ, నెగిటివ్ న్యూస్ నీ హైలైట్ చేస్తూ ప్రజలకి అభద్రతాభావం, భయాందోళనలు కలుగజేసే మన ప్రచార మాధ్యమాలు వాటికి బదులుగా శోభగారిలాంటి వారి గురించి చెప్తే సమాజంలో సగం సమస్యలైనా వాటంతట అవే తగ్గుతాయని నా అభిప్రాయం. బ్లాగులు చదివేవారి సంఖ్య ఇప్పటికీ తక్కువే, ఇలాంటివి ఇంకా ఎక్కువమందికి చేరితే బాగుంటుంది.

    శొభగారూ,

    Great to know about your blog and you! ముందు మీ ఇంటర్వ్యూ చదివి ‘చాలా కష్టపడి పైకి వచ్చిన మహిళ ‘ అనుకున్నాను, కానీ దాని వెనుక మీ తండ్రిగారి కృషి, ప్రోత్సాహం చాలా ఉందని సిలికాన్ ఆంధ్రాలో మీ కధనం చదివిన తరువాత తెలిసింది. వారు అంత కష్టపడి ముగ్గురుపిల్లల్ని కనీసం మాస్టర్స్ దాకా చదివించారు అంటే నిజంగా అభినందనీయం. చాలామంది తల్లిదండ్రులకు, పిల్లలకు మీ కుటుంబం ఆదర్శ్యప్రాయం.

    మీ ఆశయాలు అన్నీ నెరవేరాలని, మిమ్మల్ని ఆదర్శ్యంగా తీసుకుని మరింతమంది మీ బాటలో నడవాలనీ ఆశిస్తున్నాను!

    –శ్రీనివాస్

    • శ్రీనివాస్ గారూ,
      మీ విశ్లేషణ చాలా హుందాగా బాలన్స్ గా ఉంది. ఈ పని మీద పిసరు సందేహాలున్నా మీ వ్యాఖ్యతో పోయాయి. శోభ గారి గురించి నాకూ అంతకు ముందు తెలీదు ఆమె పంపిన సమాధానాల ద్వారానే పరిచయం. చాలా ప్రభావశీలమైన వ్యక్తిత్వం ఆమెది. చదవగానే చాలా సంతోషం కలిగింది

      • నా పై వ్యాఖ్యలో ‘ప్రచార మాధ్యమాలు ‘ అని వ్రాసాను, ‘ప్రసార మాధ్యమాలు ‘ అని నా ఉద్దేశ్యం.

        పొరపాటున వ్రాసినా ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో ఒకరకంగా ‘ప్రచార ‘ అనడమే సమంజసంగా ఉంటుందేమో!! 😉

    • ధన్యవాదాలు శ్రీనివాస్‌గారూ…

      జీవితంతో పోరాడి నెగ్గే గుణాన్ని మా నాన్న నుంచే నేర్చుకున్నాను శ్రీనివాస్‌గారూ… నాలో ఏవైనా మంచి లక్షణాలున్నాయంటే అవి ఆయన నుంచి నేర్చుకున్నవే… అందుకే మట్టి సుగంధం మా నాన్న. మా నాన్న మీ అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నందుకు సంతోషంగా ఉంది.

      ఇంకేం చెప్పాలో మాటలు రావడం లేదండీ… థ్యాంక్యూ…

  21. మల్లీశ్వరిగారు చెప్పినట్లు శోభ లో స్థిత ప్రజ్ఞత చాలాసార్లు గమనించాను.కాలపు గాయాలకు రాటుదేలిన మనసో… స్వభావసిద్ధంగా అలవరుచుకున్న భావాలో తెలియవు కానీ మనసులో ఉన్నది స్పష్టంగా సూటిగా నిర్భీతితో చెప్తుంది ..అది ఎక్కడాఇనా సరే….సాహిత్యానగానీ సమాజాన గానీ…ఆ నిర్దిష్టతకే నన్ను నేను ఇచ్చేసుకున్నాను అభిమానిగా…వయసులో చిన్నైనా ఈ బ్లాగు ప్రపంచాన్ని ఎన్నో సార్లు వదిలేసిన నన్ను పట్టుబట్టి మరీ లాక్కొచ్చి మరీ బ్లాగ్ మెయిన్టైన్ చేయిస్తోంది…తన రచనల్లోని పారదర్శకత ఈ ఇంటర్వ్యూ లో కూడా ప్రతిధ్వనించింది…ప్రతీ సమాధానం జీవితపు లోతుల్ని స్పృశిస్తూ…. ఎంచుకున్న ఏ విషయాన్నైనా చివరిబొట్టు వరకూ అంకితభావంతో సాహిత్యంగా మలిచే శోభా…ఈ ఎపిసోడ్ కి ధీరగుణ శోభ టైటిల్ సైతం యాప్ట్ గా సెట్ అయింది…మరిన్ని పరిచయాలతో విస్తృతంగా నీ అభిమానుల పరిధి విస్తరించే స్థాయిలో నీ రచనా వ్యాసంగం కొనసాగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ…. నిన్ను నీ సాహిత్యపు లోతునూ పరిచయించిన మల్లీశ్వరిగారిని ప్రశంసిస్తూ….స ’శేషం…..

    • పద్మ గారూ
      శోభ గురించి ఎంత ప్రేమగా చెప్పారో… మీ మంచితనం మీ వాక్యం లో ప్రతిఫలిస్తోంది… మీ బ్లాగ్ వివరాలు నాకు పంపగలరా?
      ఈ శీర్షిక,ఈ వేదిక మీకు నచ్చినందుకు ధన్యవాదాలు

      • మల్లీశ్వరిగారు…

        పద్మా శ్రీరాం అక్క… ప్రస్తుతం రెండు బ్లాగులు నిర్వహిస్తున్నారు. అవి

        http://sphoorty1.blogspot.in/

        http://padmasreeram.blogspot.in/

        మొదటిది కవితలు, కథనాలు, ఇతర రచనల కోసం అయితే… రెండోది.. ఫేస్‌బుక్‌లో కొందరు మిత్రుల కోరిక మేరకు ప్రత్యేకంగా ఒక పేజ్ క్రియేట్ చేసి అందులో ఒక నవలను రాస్తున్నారు. వారం వారం ఒక్కో ఎపిసోడ్ పోస్ట్ చేస్తున్నారు. ఫేస్ బుక్‌లో కంటే బ్లాగు రూపంలో నవల ఉంటే మంచిదని మరికొందరి సలహా మేరకు బ్లాగు ఓపెన్ చేసి ఎపిసోడ్స్ వారీ పోస్ట్ చేస్తున్నారు.

    • పద్మక్కా…

      నాపై మీకు ఉన్న ప్రేమ అంతా మీ మాటల్లో… ప్రేమంత స్వచ్ఛంగా ఆవిష్కృతమైంది. మీలాంటి ఎందరో మంచి మనసున్న మనుషుల్ని, మనసుల్ని అందించిన అక్షరాలంటే అందుకే నాకంత గౌరవం… ఈ అక్షరాలే కదా నాకు ఇంతమందిని పరిచయం చేసింది.. అందుకే ఈ అక్షరాలకి… స్పందించిన మనసులకి ప్రణమిల్లుతున్నాను…

  22. శొభ అక్కా..

    ఎన్నొ మేళవింపుల నీ ఈ ఇంటర్వ్యు నవ్వించింది..కంట తడి పెట్టించింది…మీ అక్షరాలకి నా నమస్సులు…

  23. Shobhagaru,it is simply superb.Beautiful.The beauty is not about your words,but about your attitude.About the way you see things and the way you respond to the circumstances.really inspiring.i think most of the people go along the problems more or less than you or the other way.and everyone faces the odds.but you made a difference by taking it in another way,, where you saw the riches behind poverty..,oppertunities behind problems..,happiness behind tragedy ..,and out of all.., EVERYTHING BEHIND NOTHING.really.i admire you and i am very happy for you. Migatavi phonelo chebutanu.ila type chestuntey oka roju saripoyela ledu……….

  24. సిరీ…

    నీ ప్రేమపూర్వక వ్యాఖ్యకు చాలా సంతోషంగా ఉంది. స్నేహితులు, సన్నిహితుల విజయాలను తమవిగా చేసుకుని సంతోషపడే వ్యక్తులు చాలా అరుదు ఈ రోజుల్లో. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా చుట్టూ నా అక్షరాలు అందించిన ఆత్మీయులు, స్నేహితులు, సన్నిహితులు బోలెడుమందున్నారు. మీ అందరి విజయాలు నావి. నా విజయం మీ అందరిదీనూ… Thank You So much for your kind words about me…… Thank you…

  25. ధీరగుణ శోభ గారికి
    ఆశీస్సులు !
    నా వయస్సు 65 సంవత్సరాలు.అందుకే ఆశీస్సులన్నాను
    మీ బ్లాగు ఇప్పడే చూశా.బాగుంది.భాష సరళం.భావం అద్భుతం.
    అందుకే మిమ్మల్ని అభినందస్తున్నాను.
    మీ నుంచి మరిన్ని మంచి విషయాలు ఈ బ్లాగు ద్వార తెలుసుకోవాలనుకుంటున్నాను.
    భ వ థీ యు డు
    కాళిదాస్

  26. Shobha garu

    Vruttireethya nenu software engineer ni kanee inthavaraku naaku ila blogging ani okati untundhani andhulo intha chakkaga oka dairylaaga manasuki nachina prathi vishayam prapanchamtho panchukovachani naaku theliyadhu…online lo parichayam aina oka friend dvaara mee blog gurinchi thelisindhi….innellu facebook,messenger chats,novels you tube whatsapp idhey prapancham anukunnaa…kanee blogs roopam lo oka kotta prapanchanni avishkarimpacheyochani ippudey arthamayyindhi…..mee blog chusaaka nakkuda ilanti oka blog untey entha baguntundhi anipinchindhi…urukula parugula naa jeevithamlo adhi ye meraku neraveruthundho chudali…….

    Meeru enno unnatha sikharalanu cherukovaalani manaspoorthiga akankshisthu

    Abhinandhanalatho

    Akash…

  27. శోభమ్మా…
    నీ పరిచయం కాస్త ఆలస్యంగా అయ్యిందేమో కానీ,నీ భావాలను ఇలా చదివే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది…..నిజాయితీ నిర్మలత్వం కలగలసిన నీ భావ ప్రకటనా సౌరభాలు…. మూలాలు మరవని నిక్కచ్చితనం…స్వచ్ఛత…మొత్తానికి ధీరగుణ శోభవే సుమా!నీ పయనం ఇలాగే కొనసాగాలని మరికొందరికి స్ఫూర్తివంతం కావాలని కోరుకుంటూ…
    నీ నేస్తం
    వేద రెడ్డి

Leave a reply to భాస్కర్ కొండ్రెడ్డి స్పందనను రద్దుచేయి