సహృదయ లలిత

20120915_180058lalitha                                           
“చిన్నా పెద్దా ఆలోచనలు, మనసులో రేపే అలజడులు

చిన్నా పెద్దా ఆనందాలు,  మనసులో నిలిపే జ్ఞాపకాలు

క్షణికమైనా నీటి బుడగలు,  అవి అనుక్షణికాలు”

ఇవి అంతర్జాలంలో నా తెలుగు తప్పటడుగుల కథని చెప్పడానికి ముందు మాటలు. బ్లాగింగు గురించి నా  చివరి మాటలు కూడా 🙂 నేను పుట్టింది కాకినాడలో. అమ్మమ్మ దగ్గర గారం మరిగింది కాకినాడలో. పెరిగినది హైదరాబాదులో. పై చదువు పూణేలో. స్థిరపడింది అమెరికాలోని న్యూజెర్సీలో. నన్ను నేను అర్థం చేసుకునే ప్రయాణం మొదలుపెట్టింది బ్లాగుల్లో ఓనమాలు వ్రాయడంతో. అక్షరాలా, “ఓనమాలు” అనే పేరుతో బ్లాగేదాన్ని :)ఇప్పుడా బ్లాగు లేదు కానీ. ఆ బ్లాగు నాకు సంపాదించి ఇచ్చిన స్నేహాలు మిగిలి ఉన్నాయి.

అమెరికా వచ్చినప్పట్నుంచీ అంతర్జాలలంలో తెలుగు లిపిలో ఏదైనా కనిపిస్తుందేమోనని తెగ వెతికేదాన్ని. పిల్లలు పుట్టాక వాళ్ళకి తెలుగు అలవాటు చెయ్యడానికి సులభమైన తెలుగులో పాటలు, పద్యాలు, కథలు  ఏమైనా దొరుకుతాయేమోనని తెగ వెతుకుతూ ఉండే దాన్ని. ఆ వెతుకులాటలో చాలా సార్లు రచ్చబండ అనే యాహూ గుంపు (http:/groups.yahoo.com/group/racchabanda/) కనిపిస్తూ ఉండేది. అందులో సాహిత్యం గురించి చాలా చర్చలు జరిగేవి. అక్కడక్కడా చిన్న పిల్లలకి సంబంధినవీ కనిపించేవి. ఆది బ్లాగరు కిరణ్ కుమార్ చావా గారు అక్కడ సొంత గూడు (బ్లాగ్) ఏర్పరుచుకోండి అని సందేశాలు వ్రాస్తూ ఉండే వారు.

అలా బ్లాగుల గురించి తెలిసి వాటి గురించి కుతూహలం మొదలయ్యింది. తెలుగు బ్లాగులు చదవడం మొదలు పెట్టాను. వాటిలో కూడా పిల్లల కోసం తెలుగులో ఏమున్నాయో తెలుసుకోవాలనే ఆరాటం. అలా వెతుకుతూనే నేను కూడా నాకు తెలిసినంత తెలుగునే అంతర్జాలంలో ఉంచడానికి ప్రయత్నం మొదలు పెట్టాను. పిల్లలకోసం అతి సులభమైన తెలుగులో వీడియోలు తయారు చెయ్యడం మొదలు పెట్టాను. అలా తెలుగు4కిడ్స్ (http://telugu4kids.com) శుభారంభం జరిగింది. మార్కెట్లో సీడీలు కూడా అప్పటికి ఇక రావడం మొదలు పెట్టినా, అవి పిల్లలు ఇష్టంగానే చూస్తున్నా, నేను ఊహించిన, ఆంగ్లంలో నాకు పరిచయమైన వినోదం వంటిది  నాకు తెలుగులో పిల్లల కోసం తారసపడలేదు. ఆ తరవాత బుక్‌బాక్స్(http://bookbox.com) కనిపించింది. కానీ అందులో ఒక్క కథ మాత్రమే తెలుగులో ఉండేది. అక్కడా ఇంకో రెండు కథలు తెలుగు చెయ్యడానికి నేను చెయ్యగలిగిన సాయం చేశాను. ఇలాంటి వెతుకులాటలు, ప్రయత్నాల మధ్య రచ్చబండ సభ్యురాలిగా చేరి  తెలుగు4కిడ్స్ గురించి పరిచయం చేసుకున్నాను.

బ్లాగుల్లోనూ పిల్లల కోసం నేను చేస్తున్న పనిని ప్రచారం చేసుకోవడం, సలహాలు అడగడం, పిల్లల కోసం తెలుగులో ఎటువంటి వినోదం, విజ్ఞానం అంతర్జాలంలో, పుస్తకాలలో ఉంటే బాగుంటుంది అనే విషయాలలో నాకున్న అభిప్రాయాలని పంచుకోవడం మొదలు పెట్టాను. అలా అభిప్రాయాలు పంచుకుంటూ, మెల్లగా కొన్ని పెద్ద వాళ్ళ విషయాలకి కూడా స్పందించడం మొదలు పెట్టాను. తర్వాత బ్లాగు మొదలు పెట్టాలని అనిపించినా, నా ప్రైవసీకి భంగం కలుగుతుందేమో అనుకుని ఆలస్యం చేసాను. అనుకోకుండా చరసాల ప్రసాద్ గారిబ్లాగులో TMAD (http://tmad.org/)  అని స్వచ్ఛందంగా సమాజ శ్రేయస్సు కోసం పని చేసే అనే యువ బృందం గురించి తెలుసుకుని, వారి గుంపులో చేరి అక్కడినుంచి నాకు ఇష్టమైన విద్య విషయంలో ఏదో కొంత సాయం చేస్తూ, తెలుగు భాషలో పిల్లల కోసం ఇంకా ఏదైనా చెయ్యగలనేమో అని ప్రయత్నించాను.

ఆ తర్వాత నా పరిమితులు నాకు అర్థమయ్యాయి. కానీ ఉత్సాహంగా మంచి పనులు చేస్తున్న యువతీ యువకుల ప్రభావంతో నాలోనూ ఏదో కొత్త శక్తి వచ్చినట్లయ్యి ఒక శుభముహూర్తాన “ఓనమాలు” అనే పేరుతో బ్లాగు మొదలు పెట్టాను. అంటే ముహూర్తం చూసుకుని అని కాదు. మొదలు పెట్టిన సమయం మంచిది అనిపించేలా ఉత్సాహంతో ఒక ఒరవడిలో వ్రాయగలిగాను కాబట్టి.

బ్లాగు వ్రాస్తున్నప్పుడు నాకు కలిగిన అనుభవాల గురించి చెప్పాలంటే స్నేహం తో మొదలు పెట్టాలి. “స్నేహమా” బ్లాగు (http://snehama.blogspot.com/) రాధిక గారు అప్పట్లో కొత్త బ్లాగర్లందరినీ స్నేహంతో పలకరిస్తూ ఉండే వారు. నేను ముందు బ్లాగులు చదవడంతో మొదలు పెట్టాను కనుక నాకు తన బ్లాగూ, కవితలూ అప్పటికే తెలుసు. తేలికైన తెలుగులో అంత తేలికగా చెప్పలేని భావాలని అందంగా అక్షరబద్ధం చెయ్యడం రాధిక గారికే చెల్లింది. అటువంటిది, ఆమెనుంచి నాకు అభినందనలు రావడం నాకు తొలి ఆశీస్సు అనిపించింది. (http://yarnar.blogspot.com/) రామనాథ రెడ్డి లాంటి వారి యువకుల తెలుగు నుడికారాలు చూసి ఇక తెలుగు భాష భవిష్యత్తుకి ఢోకా లేదనిపించింది. తెలుగుని కాపాడడం కోసం కాక తెలుగు నేర్చుకోవడం కోసం ఎక్కువ ఆరాటపడడం మొదలు పెట్టాను. ఇక ఆ తర్వాత ఎంతో మంది అమ్మాయిలూ, అబ్బాయిలూ ధారాళంగా తెలుగులో వ్రాస్తుంటే చదివి ఆనందించాను. అన్ని వయసుల వారితో, రక రకాల భావజాలాలు ఉన్న వారితో సంభాషించగలిగాను. కొన్ని సార్లు ఆవేశం ప్రదర్శించాను. కానీ సంయమనం కోల్పోలేదనే అనుకుంటున్నాను.

బ్లాగు వ్రాయడం వల్ల ఆలోచన పెరిగింది. ఆవేశం తగ్గింది. మరిన్ని రకాల మనస్తత్వాల గురించి అవగాహన పెరిగింది. చెప్పదల్చుకున్న విషయాలు స్పష్టంగా చెప్పగలగడం సాధన చెయ్యడానికి  బ్లాగు ఒక మంచి పరికరం అనిపించింది. వ్రాయడంలోని ఆనందం ఏమిటో తెలిసింది. బ్లాగ్ వ్రాయడం వల్ల మంచి స్నేహితులు దొరికారు.

బ్లాగులో జరిగే వాదనలలో వేడి కూడా చాలా తొందరగానే అనుభవంలోకి వచ్చింది. వేదాల గురించి వాటిని చదివి తెలుసుకుని చర్చించాలి కానీ అందులోనే అన్నీ ఉన్నాయనుకునో, లేక అందులో ఏమీ లేవనో ఏదో ఒకటి నమ్మేసి విపరీతాలకి పోకూడదు అని చెప్పదలుచుకుని వ్రాసిన ఒక టపా చాలా బ్లాగాదరణ పొందింది. బ్లాగులలో కథలు వ్రాయడానికి ప్రోత్సహిస్తూ కొత్తపాళీ గారు పెట్టిన పోటీలకి నేను వ్రాయలేను అనుకుంటూనే ఆరోగ్యకమైన వాతావరణం సహజంగా కలగజేసే ఉత్సాహంతో వ్రాయడానికి పూనుకుని, పిల్లల్ని ఊహించుకునే ఒక కథ వ్రాశాను. నిజానికి అది స్కెచ్ అని గురువు గారు అన్నారు:) కానీ అందులోని మూలభావాన్ని గుర్తించి ఆశీర్వదించారు. అది నేను వ్రాసిన మొట్టమొదటి పిల్లల కథ. ఆ తర్వాత చందమామకీ కథలు వ్రాసే సాహసం చేసి కొన్ని ప్రచురించబడే అదృష్టానికి కూడా నోచుకున్నాను.
పెద్దవాళ్ళ కథలూ వ్రాయడానికి ప్రయత్నం చేశాను.

ఓనమాలు బ్లాగు అనుకోని పరిస్థితులలో నా ప్రమేయం లేకుండా తొలగించబడింది. అది నాకు బాధ కలిగించింది. దానికి దారి తీసిన పరిస్థితులు, మనుషులు నా వ్యక్తిగతమైన విషయం.  అందులో బ్లాగర్ల ప్రమేయం ఎంతమాత్రమూ లేదు. ఐతే అదే బ్లాగుని నేను కూడలి ముఖం చూడకుండా రెండేళ్ళు గడిపిన తర్వాత కూడా గుర్తు చేసుకునే వారు ఉన్నారని తెలిసినప్పుడు ఆ బాధని మించిన ఎంతో సంతృప్తి కూడా కలిగింది. బ్లాగు నాకు బయటి ప్రపంచంతో పాటు నా లోపలి ప్రపంచం, నా ప్రపంచం అని నేననుకున్న నా పరిమిత సంబంధాలలోని మంచీ చెడు నేను తెలుసుకునేందుకు ఉపకరించింది.

తెలుగు4కిడ్స్ మొదలు పెట్టి దాదాపు ఇప్పటికి  ఏడెనిమిది సంవత్సారాలు అయ్యుంటుంది. తెలుగు4కిడ్స్ తో అంతర్జాలంలో నేను ప్రవేశించిన కొన్ని రోజులకి సిలికాన్ఆంధ్రా వారి సుజనరంజని పత్రిక (http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan13/) మొదలైనట్టు గుర్తు.
 

ఇప్పటికి తెలుగు4కిడ్స్ యూట్యూబ్ చానెల్‌(http://youtube.com/telugu4kids)లో 80 వీడియోలు ఉన్నాయి. బ్లాగ్ సౌలభ్యం కోసం తెలుగు4కిడ్స్‌ని వర్డ్‌ప్రెస్‌కి మూవ్ చేశాము. తెలుగు4కిడ్స్ ని మూవ్ చెయ్యకముందు ఆ వెబ్‌సైట్‌లో ఉండి ఇంకా యూట్యూబ్‌లో పెట్టని వీడియోలు కూడా ఉన్నాయి. ఇవి కాక తెలుగు అక్షరాలు, గుణింతాలు, వత్తులు, చిన్న చిన్న మాటలు, వాక్యాలు సాధన చెయ్యడానికి ఉపయోగపడేలా తయారు చేసిన printable activities మరియు interactive activities కూడా ఉన్నాయి. ఇవి కూడా కొత్త సైట్‌లో ఇంకా చేర్చవలసి ఉంది.ఐదు నిమిషాలకి మించని నిడివి గల వీడియోల రూపంలో కథలు, పద్యాలు, rhymes, మాలతి(http://tethulika.wordpress.com)గారు పిల్లల కోసం వ్రాసిన కథలు, వారి సహాయంతో తయారు చేసిన సామెత కథలు, పొడుపు కథలు, “ఆణిముత్యాలు” (My favorites) శీర్షికన కొన్ని నాకు చాలా నచ్చిన పాటలు, కథలు వంటివి, printable activities, interactive activities, పురాణ కథలు మొదలైన పలు అంశాలతో చాలానే కంటెంట్ పోగయ్యింది. ఇది మూవ్ చేస్తుంటే చాలా అనిపిస్తుంది. కానీ చెయ్యాలి, చెయ్యగలను అనుకునేది ఇంకా ఎంతో ఉంది. తెలుగు4కిడ్స్ కి అనుబంధంగా “తెలుగు మాటలు” (http://balasahityam.wordpress.com/)అనే పేరుతో ఒక బ్లాగ్‌లో పిల్లల కోసం ఆడియో కథలు తయారు చేసి పెట్టడం మొదలు పెట్టాను. ఆడియో కథలు ఇంకా బాగా చెయ్యగలగాలి అని అనిపించింది. ఇప్పటి వరకూ చేసినవి నాకు పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేదు. ముఖ్యంగా కథాసుధ (http://kadhasudha.blogspot.com/) లో కథలు విన్నాక నేను కథలు అంత బాగా చెప్పట్లేదని అర్థమైపోయింది. ప్రస్తుతానికి అది ఇక ముందుకు సాగట్లేదు. బాలసాహిత్యం మీద నా భిప్రాయాలు చెప్పాలనుకుని మొదలు పెట్టిన బ్లాగ్‌(http://balasahityam.blogspot.com/)లో కూడా ఇప్పుడేమో వ్రాయడం లేదు.  ఎలాగూ తెలుగు4కిడ్స్ కి ఇప్పుడు బ్లాగు సౌలభ్యం కూడా ఉంది కాబట్టి అక్కడే ఈ ప్రయత్నాన్ని మెరుగు పరిచి కొనసాగించాలని ఒక ఆలోచన.

కొన్నాళ్ళ క్రితం ఫేస్‌బుక్ ఇచ్చే అత్యుత్సాహంతో, కొత్త సెల్ ఫోన్ ఇచ్చిన కెమెరా సౌకర్యంతో నాలోని కోతికి ఇంకో కొత్త కొబ్బరికాయ దొరికినట్టయ్యి నేను “చూడచక్కని (చిత్రాలు)” పేరుతో ఒక ఫోటో బ్లాగ్ (chudachakkani.blogspot.com) మొదలు పెట్టాను. ఆ ఉత్సాహం కొంత  తీరింది. ఇప్పుడు అప్పుడప్పుడూ అక్కడ పెట్టగల ఫోటోలు ఏవైనా ఉంటే పెడుతుంటాను. వాటికి తెలుగులో శీర్షికలు ఆలోచించడం నా బుర్రకి ఒక వినోదకరమైన కసరత్తు. 

బ్లాగింగ్ వలన ఉండే  సానుకూల అంశాలు, పరిమితుల గురించి చెప్పాలంటే, బ్లాగింగ్ అభివ్యక్తికి ఒక సాధనం. ఎంత ఆవేశపడినా ఒక పరిమితిని మించి ఆవేశానికి  పోలేము అని అనిపిస్తుంది. అది సానుకూల అంశం నా ఉద్దేశంలో. పరిమితులు దాటిన వ్యాఖ్యాలని ప్రచురించడం మానుకోవచ్చు. మనమే హద్దు మీరుతుంటే మన బ్లాగుకి ముం స్పందన ఎక్కువైనట్టనిపించినా మెల్లగా అది ఆరోగ్యకరం కాదని తెలుసుకుని వెనక్కి తగ్గే వారి సంఖ్యే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నేను గమనించినంతవరకూ నాకనిపించినది అదే. పత్రికలు వగైరాలలో వ్రాయడానికి ఏ పరిమితులు ఉంటాయో బ్లాగులకీ అవే పరిమితులు ఉంటాయి అని నా అభిప్రాయం. సానుకూలంగా పని చేసే అంశాలలో స్పందన చాలా ముఖ్యమైనది. అది చాలా మటుకు కూడలి, హారం వంటి అగ్రిగేటర్ల వల్ల సమకూరుతోంది. నలుగురితో అభిప్రాయాలు పంచుకోవడానికి, ఆలోచనలు చర్చించుకోవడానికి, మన లాంటి అభిరుచులు ఉన్న వారిని కలుసుకోవడానికి ఈ స్పందన సహాయం చేస్తుంది.

కనీసం మొదలు పెట్టిన కొత్తల్లో బ్లాగర్ల గురించి వ్యక్తిగతంగా తెలిసినది తక్కువ కాబట్టి, ఎప్పటికైనా వారితో వ్యక్తిగత పరిచయం పెంచుకునే అవసరం కూడా ఎక్కువ ఉండదు కాబట్టి కూడా బ్లాగుల్లో మనం సంభాషించుకోవడం సులభం అవుతుందని నాకనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణ, నా స్నేహితురాలు తెలుగులో బ్లాగు వ్రాస్తోందని నాకు తెలియదు. ఆమె బ్లాగు నాకు ఇష్టంగా చదవాలనిపించేది. కొన్ని టపాలకి చాలా పెద్ద వ్యాఖ్యలు కూడా వ్రాశాను. ఫేస్‌బుక్ పుణ్యమా అని తను నన్ను గుర్తు పట్టి ఆ వ్యాఖ్యలు వ్రాసింది నేనే అని తెలుసుకుని నాకు చెప్పింది. అంత ఇష్టంగా నేను చదివే బ్లాగు నా స్నేహితురాలిదే అని తెలిసి కొన్ని రోజులు ఆనందాశ్చర్యాలలో మునిగి తేలాను. ఆ ఆననదంలో మళ్ళీ అన్ని టపాలూ చదివి వరసగా వ్యాఖ్యలు వ్రాశాను. కానీ మెల్ల మెల్లగా నా వ్యాఖ్యల పరిమాణం, frequency తగ్గి నా స్పందన స్మైలీలకి పరిమితం ఐపోతోంది ఈ మధ్య. ఎందుకంటే, తెలిసిన వారితో ముఖా ముఖీ (లేదా ముఖపుస్తంలో) మాటా మంతీ జరపడం ఎక్కువ అనువుగా ఉంటుంది.

ఇలా చెప్తుంటే నాకు ఇంకో విషయం గుర్తుకు వస్తోంది. నేను బ్లాగు వ్రాయడం మొదలు పెట్టినప్పుడు నా ఉత్సాహం కొంచెం శృతి  మించుతోందేమో అన్న అనుమానం కలిగి అలా ఐతే చెప్పమని నా దగ్గరి స్నేహితులకి చెప్తూ నా బ్లాగుని పరిచయం చేశాను. అప్పుడు వారు ఏమీ చెప్పలేదు. ఎవరికి వాళ్ళు యమా బిజీగా ఉంటారు. నా బ్లాగు చదివే తీరిక వాళ్ళకి ఎక్కడుంటుంది అనుకుని ఆ విషయం మర్చిపోయాను. కానీ ఒక స్నేహితురాలు క్రమం తప్పకుండా నా టపాలు చదువుతున్నాననీ, బాగా వ్రాస్తున్నాననీ తనకి కాస్త తీరిక దొరకగానే నాకు చెప్పింది. నేను సంతోషం పట్టలేకపోయాను. బ్లాగు డిలీట్ చెయ్యబడ్డాక కూడా ఏమయ్యిందో తెలియక తను నేను వ్రాయడం గురించి ఎదురు చూసింది, నన్ను అడిగింది. బ్లాగులో కొన్ని చేదు అనుభవాలైనప్పుడు ఎన్నేళ్ళనుంచో నన్నెరిగిన స్నేహితురాలిగా నేను నా గురించి సందేహించాల్సింది ఏమీ లేదని నాకు నమ్మకం కలిగించింది. అందుకని స్నేహం బ్లాగుల్లోకీ, బ్లాగులు స్నేహంలోకీ దారి తీసినా, రెండూ పూర్తిగా మమేకం కానక్కర్లేదు అని నాకనిపిస్తోంది. దేని ప్రాముఖ్యత దానిదే, దేని సంతోషం దానిదే. 

మహిళా బ్లాగర్‌గా నాకు నేనై ఏ ప్రత్యేకతా ఊహించుకోలేదు. ఇది బ్లాగు ప్రపంచమే కల్పించింది. అప్పట్లో సీబీ రావు గారు(http://deeptidhaara.blogspot.com/) మహిళా బ్లాగర్లతో ముఖాముఖీ ప్రచురించే వారు. అప్పుడు నేను వారడగగానే ఏదో వ్రాసి పంపించేశాను. ఇప్పుడు మీరీ ప్రశ్న అడిగితే అనిపిస్తోంది, నిజానికి మహిళా బ్లాగర్లు అని విడిగా చెప్పుకోవలసిన అవసరం ఉందా అని. ఇప్పట్లో బ్లాగులు రాశిలోనూ వాశిలోను, వైవిధ్యంలోనూ  మిన్నగా వ్రాస్తున్న వారిలో మహిళల శాతం ఎక్కువ ఉండి మగవారిని ప్రత్యేకంగా గుర్తించాలనిపించదూ, నిజం చెప్పండి?:) నేను అలా బాగా వ్రాసేవారిలో నా స్నేహితురాలు కూడా ఉందని చెప్పుకుని మురిసిపోవడం, తను నా స్నేహితురాలు కావడాన్ని ప్రత్యేకంగా చూడడం చెయ్యగలను. కానీ మహిళా బ్లాగరుగా నాకేమీ ప్రత్యేకత లేదు.  

సాహిత్యంతో నా పరిచయం అన్న ప్రశ్న రాగానే ఇంతవరకూ ఆగకుండా సాగిన మాటల ప్రవాహం ఒక్క సారి ఆగిపోయింది. నాకు తెలుగు సాహిత్యంతో చెప్పుకోదగ్గ పరిచయం లేదనే చెప్పుకోవాలి. బ్లాగుల్లో పుస్తకాల గురించి వ్రాస్తుంటే చదివి తెలుసుకుని AVKF వారినుంచి తెప్పించుకున్న పుస్తకాలు చదివి కానీ అంతర్జాలంలో అందుబాటులో ఉన్న కాపీలు చదివి కానీ తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. అంతెందుకు వేటురి పాటలలో సాహిత్యాన్ని కూడా పాటపాటలో పదాలు వెతుక్కుని ఆనందించడం నేర్చుకున్నది చాలా మటుకు బ్లాగుల మూలంగానే. నేను బడి మారడం వల్ల ఎనిమిదో తరగతి నుంచీ తెలుగు మూడో భాష అయిపోయింది. నా చిన్నప్పుడు మా అన్నయ్యలూ, అక్కయ్యలూ వాళ్ళ పాఠ్యపుస్తకాలలోని పద్యాల గురించి మాట్లాడుకుంటుంటే నాకు పద్యాలంటే ఆసక్తి, ఇష్టం పెరిగింది. ఇంకా వాళ్ళందరూ స్నేహితులతో చర్చించేటప్పుడు శ్రీశ్రీ గురించి తెలిసింది. అలాగే యండమూరి రచనల గురించీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విని తెలుసుకున్నదే. సినిమా పాటల పుణ్యమా అని దేవులపల్లి కృష్ణశాస్త్రి దగ్గరయ్యాడు. కానీ సరిగ్గా సాహిత్యం పరిచయం కావల్సిన సమయంలో తెలుగు స్థానే ఆంగ్లం వచ్చింది. తెలుగులో చదవలేదని, తెలియలేదనీ ఒక రకమైన అసంతృప్తి ఉన్నా నాకు ఆంగ్లమైనా సరే సాహిత్యాన్ని ఆస్వాదించడానికి కావలిసిన బీజాలు అక్కడ పడ్దాయి. వ్రాయడం, భావాలని వ్యక్తపరచడం, చదివిన దానిని అర్థం చేసుకోవడ, విశ్లేషించడం, 8, 9, 10 తరగతులలో తెలుసుకున్నాను. అలా సాహిత్యం రుచి మరిగాక తెలుగు సాహిత్యం కోసం మొహంవాచిపోయాను. బ్లాగుల వల్ల ఆ విషయంలో నాకు ఆ లోటు చాలా మటుకు తీరింది. మాలతి గారి కథలంటే నాకు చాలా ఇష్టం. సాహిత్యానికి సంబంధించి ఆమె వ్రాసే వ్యాసాలు కూడా నాకిష్టం. ఇక పుస్తకం.నెట్ (http://pustakam.net)గురించి నేను చెప్పేదేముంది? బ్లాగుల్లో తెలుగు పుస్తకాల చిరునామాగా అందరికీ తెలిసిన ఇల్లే కదా! ఇప్పుడు మా అన్నయ్యలూ, అక్కయ్యలతో నేను కూడా తెలుగు సాహిత్యం గురించి కొన్ని మాటలు మాట్లాడగలుగుతున్నాను 🙂

స్త్రీగా వ్రాయడంలో ఏ ఇబ్బందులూ ఎదురవ్వలేదు. ఇబ్బంది ఎక్కడా అంటే స్త్రీల సమస్యల గురించి సరైన అవగాహన పెంచుకోమని వ్రాయడంలో. స్త్రీల సమస్యని స్త్రీల కోణంలోనుంచి వివరిస్తే చాలు వారి గురించి ఒక విధమైన అభిప్రాయం ఏర్పరుచుకుని వారిని ఒక రకమైన మసి పూసిన అద్దాల వెనక నుంచి చూడడం మొదలు పెడతారు కొంతమంది. ఇక వారు ఏ విషయం గురించి వ్రాసినా సరే వారిని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటారు. నేను వేదాలని చదివి అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని వ్రాసిన వ్యాసానికి వచ్చిన స్పందనలో కూడా ఒకాయన నేను వేదాలని దూషిస్తున్నాను అన్న భావంతో వ్యాఖ్య వ్రాశారు. ఆయన చాలా విషయాల మీద సాధికారంగా మాట్లాడతారు. ఎంతో పరిజ్ఞానం ఉంది ఆయనకి. కానీ స్త్రీల దగ్గరికి వచ్చే సరికి అద్దాల రంగు మారిపోతుంది. అది అర్థం కావడానికి నాకు చాలా సమయం పట్టింది. అర్థమయ్యాక అది నాకు నిజ జీవితంలో కూడా వ్యతిరేకతని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. అదే విధంగా ముందు ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నా వరుసగా నా టపాలు చదువుతూ ఉండడం వల్ల నేను చెప్పదల్చుకున్నదేమిటో అర్థం చేసుకుని ఆ విషయం చెప్పిన వారూ ఉన్నారు. 

కొత్తపాళీ గారు చాలా మంది స్త్రీలు “నేను ఫెమినిస్టుని కాదు” అంటారెందుకు  అని ఒక చోట అనుమానం వ్యక్తం చేశారు. నేను ఫెమినిస్టుని కాదని నేనెందుకనుకుంటాను అంటే “ఫెమినిజం” భావజాలం నాకు పూర్తిగా తెలియదు కనుక. ఆ పదం నాకు తెలిసినప్పట్నుంచీ దాదాపుగా ఆ పదం వాడడం అపాయకరమనే అనుభవాలు కలగడం వల్ల. ఫెమినిస్టు అంటే పురుషద్వేషంతో సమానం అనే అభిప్రాయాం చాలా ప్రచారంలో ఉంది కనుక. ఆ అభిప్రాయం నాకు లేదు. కానీ నాకు ఫెమినిజం మీద ఏ అభిప్రాయమూ లేదు. నాకు పూర్తిగా అదేంటో తెలియదు కనుక.  సమాజం స్త్రీని ఎంత కాదన్నా ప్రత్యేకంగానే చూస్తుంది కనుక ఆ ప్రత్యేకతని అర్థం చేసుకుని దాని హద్దులు తెలుసుకుని, అవసరమనుకున్న చోట ఆ హద్దులని చెరిపే ప్రయత్నం చెయ్యక తప్పదు అమ్మాయిగా పుట్టిన వారికెవరికైనా అనే నా అనుభవాలు నాకు నేర్పాయి. ఐతే మానవత్వం ఉన్న చోట ఏ ఇజాలూ అక్కర్లేదు అనీ, ఆత్మీయత ఉన్న చోట ఈ రోజుల్లో అందరూ సమానమే అనీ అవి లేని చోట ఏ అభిప్రాయాలూ గౌరవించబడవనీ, ఇందులోనూ ఏ తేడాలూ లేవనీ కూడా అర్థమౌతోంది. 
బ్లాగింగ్ ఇప్పుడు దాదాపుగా ఆపేశాననే చెప్పాలి. తెలుగు4కిడ్స్ కోసం బ్లాగింగ్‌తో సహా నేను చెయ్యగలిగినదంతా ఎప్పటికీ చేస్తూ ఉండాలి అనే నా కోరిక. వ్రాయడం ఏదో ఒక రూపంలో ఎప్పటికీ కొనసాగించాలి అని ఆశ. తెలుగు బాలసాహిత్యానికి నేను విశేషంగా ఏదైనా ప్రయోజనకరమైన పని చెయ్యాలని కూడా నా కోరిక. 

నాకు నచ్చిన రచన ఏది అంటే దాదాపుగా తడుముకోకుండా నేను వ్రాసిన మొదటి కథ “అమ్మ దొంగా” అనే చెప్పాలి. మీ ఇంటర్వ్యూకి ఇవ్వడానికి ఇంకో కథ కూడా పోటీకి వచ్చింది. అది పెద్ద వాళ్ళ కథ. పిల్లల విషయంలో నేను చేస్తున్న కృషి చాలా మటుకు తెలిసిందే కదా, ఇంకో కథ ఇస్తే బావుంటుందని మనసులో తొలుస్తోంది. కానీ నా ఓటు పిల్లల కథకే వేస్తున్నాను. పెద్ద వాళ్ళ విషయాలూ వ్రాయగలను అని చెప్పుకోవాలని ఉన్నా, ఇక్కడ బాగా వ్రాసే వారందరూ తలుచుకూంటే పిల్లల కోసం బాగా వ్రాయగలరు అని చెప్పాలని  ఉంది. అందుకు ఉదాహరణగా నేను వ్రాసిన కథ పనికి వస్తుందని నాకనిపిస్తోంది. ఇప్పుడూ మళ్ళీ చదివి చూశాను. సులభమైన మాటలు వాడే, పిల్లలకి ఆసక్తికరంగా ఉండే కథనంతోనే, ప్రయోజనకరమైన విషయం మీదే వ్రాశాను అనిపిస్తోంది. మా పిల్లలూ ఈ కథని వారికి అన్వయించుకున్నారు. ముఖ్యంగా మా పెద్దబ్బాయి వేసే బొమ్మలూ, తెల్ల కాగితాల కోసం వాడి డిమాండ్లూ, వాడి ఇష్టాన్ని ప్రోత్సహించడానికీ, బాధ్యత తెలియజేయడానికీ మధ్య నా ఊగిసలాటా ఈ కథకి ప్రేరణలు. అప్పుడప్పుడూ ఈ కథ గుర్తు చేసి వాడిని కాగితాలు పొదుపుగా వాడడానికి మొహమాటపడేలా చేస్తుంటాను 🙂 ఈ కథ కొత్తపల్లి పిల్లల పత్రిక వారు అచ్చు వేశారు కూడా. ఆ కథ ఇక్కడ ఇస్తున్నాను.
————–
అమ్మ దొంగా!

సంచీ నిండా పుస్తకాలు.

నోటు పుస్తకాల నిండా ప్రశ్నలూ జవాబులూ.

ఎప్పుడైనా తెల్ల కాగితం దొరికిందంటే దాని మీద రాసేది పరీక్ష జవాబులు.

బొమ్మలేసుకుందామంటే- చిత్తు కాగితాలు.
‘నువ్వెంత బాగా బొమ్మలు వేస్తావో!’ అంటుంది అమ్మ.
కాని కొత్త కాగితం అడిగితే మాత్రం ‘దండగ’ అంటుంది.
‘చెట్లు కొట్టి కాగితాలు చేస్తారు;’

‘కాగితాలు తక్కువ వాడాలి, ఖాళీ ఉంటే మళ్ళీ వాడాలి’ అంటుంది.

ఒక రోజు మా నాన్న, అమ్మకి తెలియకుండా తన ఫైలులోంచి తీసి ఒక తెల్ల కాగితం ఇచ్చారు.

నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను దానిని.

‘ఏదైనా మంచి బొమ్మ వెయ్యడానికి వాడాలి ‘అని.

అంతే కాదు, అమ్మ చూస్తే కోప్పడదూ? నాన్న మీద కూడా కోపమొస్తుందో ఏమో.

రోజూ పడుకున్నాక, అమ్మ లైట్లు ఆర్పేసి వెళ్ళిపోతే, ఆ చీకట్లోనే ఆ కాగితం తీసుకుని చూసుకుంటున్నాను: ఏమైనా మంచి ఆలోచన తడ్తుందేమోనని. ఒకటే బెంగ, ,అమ్మ చూసేస్తుందేమో, తీసేసుకుంటుందేమో అని!

ఒక రోజు అమ్మకి ఒంట్లో బాలేదు. రోజంతా పడుకునే ఉంది.

నాకేమీ తోచలేదు. ఆ దాచి ఉంచిన కాగితం గుర్తుకు వచ్చింది.

బాగా దిగులేసింది. ఏదో తప్పు చేశాననిపించింది.

నాన్న ఇంటికి వస్తూ కొత్త మందులేవో తెచ్చారు. నేను కంగారు పడుతుంటే టెంపరేచరు చూసి, “పరవాలేదులే, జ్వరం లేదు. ఈ రోజుకి అమ్మని ఇబ్బంది పెట్టకు. వీలైతే ఏదైనా మంచి బొమ్మ వేసి ఇవ్వ కూడదూ, సంతోషిస్తుంది?” అన్నారు.

అప్పుడు వెంటనే ఆ తెల్ల కాగితం తీసి అమ్మ కోసం ఒక మంచి బొమ్మ వేశాను.

కింద చాలా చిన్నగా “సారీ” అని రాశాను.

అమ్మకి చూపించాను.

అమ్మ, బొమ్మ చూసి చాలా బావుంది అంటుంటే నేను కింద రాసిన “సారీ” చూపించాను.
అమ్మ నవ్వేసింది.

‘సరే, అయితే ఇప్పుడు వెనక వైపు కూడా ఏదైనా బొమ్మ వేసి ఇవ్వు’.

‘రెండు వైపులా పూర్తిగా వాడుతానంటే నాన్న నీ కోసం కొని ఉంచిన కాగితాల్లోంచి నీకు రోజుకొకటి ఇస్తాను’ అంది.

అప్పటికప్పుడు కాగితం తిప్పి ఇంకో బొమ్మ వేశాను. నాన్న కాగితాలు గూట్లో దాస్తుంటే అమ్మ నా కళ్ళు మూస్తోందిట.

కింద పెద్ద అక్షరాలతో రాశాను, “అమ్మ దొంగా!” అని.

—————-
మీరు ఇప్పుడు నా బ్లాగు గురించి వ్రాయమని అడిగినందువల్ల నేను నా జ్ఞాపకాలని నెమరు వేసుకోగలగడమే కాదు, మళ్ళీ ఎన్నో నెలల తర్వాత ధారాళంగా వ్రాయగలిగాను కూడా. అందుకు మీకు ఎంతైనా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

42 thoughts on “సహృదయ లలిత

 1. లలిత గారూ
  ఇలా స్వచ్చంగా సరళంగా సూటిగా ఖచ్చితంగా మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి.పిరికి వాళ్లెపుడూ సహృదయులు కాలేరు. ధీరులే సహృదయులు. అభినందనలు.

  • వనజ గారూ, ధన్యవాదాలు. వ్రాయగలగడంలో ఆనందం ఉంది. అది నాకు అనుభవమైంది. అందరిలో ఉన్నట్లే నాలోనూ లోపాలున్నాయి. అవి కొంతమటుకు తెలిశాయి. కొన్నిటిని అధిగమించగలిగాను. చుట్టూ ఉన్న వారిలో సహృదయత పాళ్ళే ఎక్కువ చవి చూశాను. అది నా దృష్టం. బ్లాగుల మూలంగా ఎందరిలోనూ దాగున్న రచయితలు బయటపడుతున్నారు. అందమైన అభిరుచులు, ఆసక్తులూ కలవారెందరో మన చుట్టూ ఉన్నారని అర్థమౌతోంది. అందరికీ అభినందనలు. ఒక పద్ధతి ప్రకారం పరిచయం చేస్తున్న జాజిమల్లిగారికి ధన్యవాదాలు.

 2. లలిత గారూ, నేను బ్లాగుల్లోకి రాక మునుపు మా పాపకి “తెలుగు4కిడ్స్” లోంచి కథలు,పొడుపుకథలు డౌన్లోడ్ చేసి వినిపించేదాన్ని. ఇప్పటికి నా వద్ద ఉన్నాయి అవి. బ్లాగుల్లొకొచ్చాకా అప్పుడప్పుడు, అక్కడక్కడ మీరు రాసిన కామెంట్ల వల్లే మీ పరిచయం కలిగింది.
  జాజిమల్లి గారూ, బావుందండి.. మీరు అందరికీ ఏప్ట్ టైటిల్స్ ఇస్తున్నారు.

  • తృష్ణ గారూ, నాకు ఎంతో సంతోషం కలిగించే మాటలు చెప్పారు. ధన్యవాదాలు. తెలుగు4కిడ్స్ పట్ల నేను ఇంకా ఎంతో శ్రద్ధ చూపవలసి ఉంది. ఇప్పటికి ఇంకా చేర్చవలసిన పాత కంటెంటే నా కంప్యూటర్లో ఎదురు చూస్తూ ఉంది. స్ఫురిత గారు ఒక కథకి బొమ్మలు వేసి పంపించారు. అది ప్రెజెంట్ చెయ్యాల్సి ఉంది. మీ మాటలు ఇచ్చిన ఉత్సాహంతో త్వరలో ఆ పనులు మొదలు పెట్టగలనని ఆశ పడుతున్నాను.

 3. లలిత గారు,

  మీ ముఖా ముఖి చదువుతుంటే, అది బ్లాగింగ్ గురించి కావచ్చు, ఇంకా మీరు నడుపుతున్న తెలుగు4కిడ్స్, బాలసాహిత్యం, వీటన్నిటితో పాటు మీ బ్లాగు ప్రస్థానం, ఆసక్తులు అన్నీ కలిపి ఒక వికీ పేజి చదువుతున్నట్లు వుంది.

  >>@@ఇప్పట్లో బ్లాగులు రాశిలోనూ వాశిలోను, వైవిధ్యంలోనూ మిన్నగా వ్రాస్తున్న వారిలో మహిళల శాతం ఎక్కువ ఉండి మగవారిని ప్రత్యేకంగా గుర్తించాలనిపించదూ, నిజం చెప్పండి?:)

  రాసిలోనూ వాసిలోను, వైవిధ్యంలోనూ తక్కువగా ఉందన్న మీ ఈ వ్యాఖ్యానం చూసి పురుష బ్లాగ్లోకం ఉలిక్కిపడుతుందా ?!!!! మేల్కొంటుంద !!! (నాకు బోల్డు ఆశ్చర్యంగా ఉంది )

  ఇంతకుముందు ఏమో కాని , జాజిమల్లి గారు ఈ సిరీస్ మొదలుపెట్టినప్ప టి నుండి నాకిలానే అనిపిస్తుంది. కాని ఈ ప్రశ్నావళి మహిళా బ్లాగర్లను ప్రత్యేకంగా గుర్తించడానికి కాక ఒకచోట చేర్చి , స్పూర్తి, వారి రచనలపై అవగాహన కలిగించడానికి అనుకుంటున్నాను. పురుష బ్లాగర్లందరినీ ఒకచోట చేర్చగలిగివారు ఉన్నారా? ఆల్పార్టీ మీటింగులను గుర్తుచేసుకోవాలి మనం.

  ఇదే బ్లాగులో ఇంకొకచోట ఒకరు ప్రస్తావించినట్లుగా, ఒక మహిళగా ఎవరైనా , అది కేవలం వంటల బ్లాగే కావచ్చు కొన్ని పరిమితులని దాటి రావాల్సి ఉంటుంది. కాని మీలా చాలామంది మహిళా బ్లాగర్ గా తమ ప్రత్యేకతని గుర్తించలెకపొవడమో, అలా ఆల్చించడం అవసరం లేదనో, ఇబ్బంది అనో వదిలేస్తున్నారు. చదువరులే చెప్పాలి అని చాలా మంది చెపుతున్నా, తమని తాము గుర్తించడం కూడా అవసరమే అని అనుకొంటున్నాను.

  ఉదాహరణకు మీ మొదటి టపా తల్లిగా మీ ప్రత్యేకతను ఖచ్చితంగా తెలియచేస్తుంది. అలాగే మహిళగా ప్రత్యేకత గుర్తించడానికి కూడా చాలా ఉదాహరణలు ఉండే ఉంటాయి.

  >>ఫెమినిజం @ ఆ పదం నాకు తెలిసినప్పట్నుంచీ దాదాపుగా ఆ పదం వాడడం అపాయకరమనే అనుభవాలు కలగడం వల్ల. ఫెమినిస్టు అంటే పురుషద్వేషంతో సమానం అనే అభిప్రాయాం చాలా ప్రచారంలో ఉంది కనుక.

  నాతొ సహా ఎక్కువమందికి ఇదే అభిప్రాయం ఉంటుంది అని అర్ధం అవుతున్నది మీ వ్యాఖ్యానం వల్ల. కాని నాకు ఫెమినిజం పట్ల కొంత మంచి అభిప్రాయం ఉంది ఇప్పుడు, అది ఏర్పడడానికి బ్లాగులలో ఉన్న వ్యతిరేక ప్రచారం లో ఉన్న డొల్లతనం, అకారణ ద్వేషం ఒక కారణం. దానికి సంబంధించిన సాహిత్యం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు, నేనయితే చదవలేదు.

  ఎవరైనా ఆ పదం వాడడం అపాయం అన్న ఉద్దేశ్యం కలిగించడాన్ని ఎందుకు ప్రోత్సహించాలి? మానవత్వం, ఆత్మీయత ఉన్న చోట కూడా ఇజాలు అవసరమే అని నేను నమ్ముతాను. కొన్ని పార్శ్వాలు, ఎమోషన్స్ అర్ధం చేసికోవడానికి మానవత్వం, ఆత్మీయత లు అక్కరకు రావు . నాకు తెలిసిన ఉదాహరణలు : అత్తా కోడళ్ళు, ఆడ మగ స్నేహాలలోని కొన్ని అసాధారణ సందర్బాలు.

  ఇకముందు మీరు వ్రాసేది తక్కువ అయినా , పిల్లల సాహిత్యంలో మీరు చేస్తున్న కృషి అసమానం కాబట్టి, అంతకుమించి మీనుండి ఆశించలేము. వ్రాయకుండా ఉండలేకపోవడం అన్న సందర్భం వస్తే మీరైనా ఎవరైనా వ్రాయాల్సిందే కదా .

  చదువరులకోసం మిమ్మల్ని మీరు ఇంత లోతుగా విశ్లే షించు కొన్నందుకు ధన్యవాదములు.

  • మౌళీ మీరు నా చేత చాలా పెద్ద సమాధానం వ్రాయించేలా ఉన్నారు. ముందుగా మీ స్పందనకీ, మంచి మాటలకీ

   ధన్యవాదాలు. బ్లాగులు వ్రాయటం గురించి మగవారిని ప్రత్యేకంగా ప్రశ్నించాలి అని ఎందుకంటున్నానో చెప్పటానికి

   ప్రయత్నిస్తాను. మీరు ఉదహరించిన నా మాటలే కాక సమాధానం గురించి ఆలోచిస్తే తట్టిన ఇంకొన్ని ఆలోచనలు.

   అప్పట్లోనే నేను అడిగాను ఒక ప్రశ్న. దానికి మగవారినుంచి సమాధానం ఏమీ రాలేదు. భావుకత సాహిత్యంలో ఎంతో

   ఉంటుంది. సాత్యంలో ఏ కారణం చేతనైనా కానివ్వండి మగవారి కాంట్రిబ్యూషన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కానీ రోజూ

   వారీ జీవితాలలో, చుట్టు ప్రక్కల చూసేంతలో ఆడవారు తమ భావాలని వ్యక్తపరిచినంతగా మగవారు వ్యక్తపరచడం

   కనిపించదు. మనసులో ఉన్న దాని గురించి మాట్లాడడంమగవారిలో ఎక్కువగా ఎంతో దగ్గరి వారీ దగ్గర కూడా ఎక్కువ

   కనిపించదు. బ్లాగుల్లో అటువంటి భావాలు వ్రాసే మగవారు వారి ఇళ్ళలో ఎలా ఉంటారు అన్న సందేహం నాకు ఎప్పుడూ

   కలుగుతూ ఉంటుంది. సున్నితత్వం స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఉంటుందనే నా నమ్మకం. అలాగే అభిమానమూ,

   అడ్డుగోడలూ కూడా ఏ ఒక్క జెండర్‌కో పరిమితం కాదు. ఇంకా, చూడగా, గృహిణులకి పనులు తక్కువ అని కాదు కానీ

   సౌలభ్యం (flexibility) ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తుంటాయి. ఉద్యోగినులైన మహిళలు వ్రాసే బ్లాగులు

   చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం. వాళ్ళ దగ్గర సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమెలానో నేర్చుకోవాలని

   అనిపిస్తుంది. అది వేరే విషయం. ఇక్కడ వ్రాసే మగవారిలో కొందరు రిటైర్ అయ్యిన పెద్దలు ఎక్కువగా తప్ప చాలామంది

   ఉద్యోగస్తులే. వారు బ్లాగులు వ్రాయడం గురించి, వాటిలో వ్రాసే వాటి గురించి వారి ఇండ్లలో వారి అభిప్రాయాల గురించి

   కుతూహలంగా ఉంటుంది నాకు.
   ఇక మహిళగా వ్రాయడానికి అవి మహిళలకి ప్రత్యేకమని భావించే వంటల గురించే ఐనా కొంత సంఘర్షణ తప్పదంటే,

   మగవారికీ ఏ సాంకేతిక విషయమో, రాజకీయమో కాక ఇంకే విషయం గురించైనా వ్రాసేందుకు కొన్ని మానసికమైన గోడలు

   కూలగొట్టక తప్పదేమో అనిపిస్తుంటుంది నాకు.
   ఫెమినిజం గురించి ఆడవారినీ మగవారినీ కూడా విద్యావంతులని చెయ్యవలసిన బాధ్యత ఫెమినిస్టుల మీదే ఉందని నా

   అభిప్రాయం. ఇదే అభిప్రాయం అప్పట్లో ఇంత సూటిగానూ వ్యక్తపరిచాను. దానికీ సమాధానం రాలేదు.
   మౌళీ, నేను నవ్వితే అపార్థం చేసుకోవద్దు. అత్తా కోడళ్ళ సమస్య ఫెమినిజం తీరుస్తుందంటే అత్యాశ అనిపిస్తోంది.

   ఎక్కడైనా బావే కానీ అన్న సామెత లాగా, ఎంత ఫెమినిస్టైనా ఆ సంబంధాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఇజానికి

   మించిన నిజాలని కొన్నిటిని అంగీకరించవలసి ఉంటుంది. తరతరాలుగా ఆ సంబంధం ఆరోగ్యకరంగా ఉండడం అనేది

   వివేకవంతుడైన శత్రువు (ఇక్కడ శత్రువు అన్నది లిటరల్ గా తీసుకోవద్దని మనవి) తీరున వ్యవహరించడం, మధ్యలో

   ఉన్న మగవారి లౌక్యం, మొత్తం మీద కుటుంబ శ్రేయస్సు పట్ల కుటుంబ సభ్యులందరికీ ఒకే రకమైన అవగాహన,

   అభిప్రాయం ఉండడం వల్ల అనిపిస్తుంది నాకు.అలాగని మీ మాటలని పూర్తిగా తీసి పారెయ్యడం లేదు నేనుకొన్ని ఇజాలు

   కొంతకాలం వరకూ మనకి చేతికర్రలాగానో టార్చి లైటు లానో దారి చూపడానికో ఊతం ఇవ్వడానికో కావలిసిందే. ఒక

   సంప్రదాయానికో, సంస్కృతికో, భావజాలానికో అలవాటుపడిన సమాజాన్ని, కొన్ని తరాల ‘మంచి ‘వల్ల కలిగే చెడు ‘side

   effects’ నుంచి కోలుకునేలా చెయ్యడానికి ఇది తప్పదు. Old order changeth giving place to

   new అని కింగ్ ఆర్థర్ అనుకుంటా కదా అంటాడు. ఎంత మంచి వ్యవస్థ ఐనా అది చెడక తప్పదు, కొత్త వ్యవస్థ ఏర్పడక

   తప్పదు అని చెప్తాడనుకుంటాను అతను. మార్పు తప్పదు. మార్పుకి వ్యతిరేకత తప్పదు. మారిన తర్వాత ఆ మార్పూ

   ఇంకో మార్పుకి తలవంచక తప్పదు అనిపిస్తుంది నాకు. ఈలోగా మనకు తెలిసినంతలోనే మరింత తెలుసుకుటూ

   మసులుకోవడమే మనం చెయ్యగలిగేది. ప్రస్తుతానికి మానవ విలువల పట్ల మామూలు మనిషి దృక్పథంలో ప్రస్తుతం ఉన్న

   అభిప్రాయం ఆరోగ్యకరంగానే ఉందనే అనిపిస్తుంది. సమాజంలో కుళూ ఉంది, మూర్ఖత్వం ఉంది. వాటి గురించి చెప్తే

   తెలుసుకుని మారే అవకాశాలూ ఉన్నాయి. ఆరోగ్యకరమైన వాతావరణం లేని చోట అది మానవత్వం లోపించడం వల్లే కానీ

   మరె కారణము కాదు ఈ రోజుల్లో అని నా అభిప్రాయం. స్పష్టంగా చెప్పగలిగాను అనుకుంటున్నాను. ఇంతలా

   వ్రాయగలిగేలా చేసినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు.

   • లలితగారు ,

    మీరన్నది నిజమే. మొదటి కన్నా ఇప్పుడు పురుష బ్లాగర్లు బాగా తగ్గిపోయారు. మనం పురుష బ్లాగర్ల నుండి రోజువారీ జీవితానికి సంబంధించిన రచనలు మహిళలతో సమానంగా చెప్పుకోదగ్గ సంఖ్యలో చూడలేమేమో. ఎందుకంటె వాటిలో పెద్దగా మార్పులు ఉండవు కావచ్చు.

    అత్తాకోడళ్ళ సమస్య ను, రెండువైపుల నుండీ అర్ధం చేసికోవడానికి ఫెమినిజం ఉపయోగ పడుతుంది అన్నది నా అనుభవం. దానివల్ల ఉపయోగం??? పెయిన్కిల్లర్స్ వాడడం వల్ల వచ్చే తాత్కాలిక ఉపశమనమ్ లాంటిది. చాలా మంది కోడళ్ళు మరీ మనసు కష్ట పెట్టుకోవడానికి కారణం ఈ చిన్న అవగాహన లేకపోవడం వల్లనే అనుకొంటున్నాను. ఇది ఫెమినిజం అని కాకుండా, నా దాకా వచ్చిన అత్తగార్లకి, కోడళ్ళకి ఎప్పుడు కొంత అవగాహన కలిగిస్తూనే ఉన్నాను. బ్లాగుల్లో కూడా కొంత చర్చ చేసాను అత్తాకోడళ్ళ సమస్య పై. నాకీ అవగాహన రావడం లో ఫెమినిజం కి సంబంధం ఉండే ఉందాలి.

    ఇంగ్లీషు సాహిత్యం లో మీకు ఇప్పటికీ బాగా నచ్చినవి చెపుతారా… ఇంకా ఇప్పుడు క్రొత్తగా మీరు పరిచయం చేసికొంటున్న తెలుగు సాహిత్యానికి, మీరు ఇప్పటిదాకా చదివిన ఇంగ్లీషు సాహిత్యానికి పోల్చినపుడు మీ అనుభవాలు కొన్ని చెప్తారా?

    మీరు ఓనమాలు లో ఏమి వ్రాసారో నాకు తెలియదు. చాలా పాత బ్లాగర్లకి మాత్రమె మీరు ఆ బ్లాగు ద్వారా పరిచితులు అయ్యుండాలి. నాకొక చిన్న సందేహం, మనచుట్టూ రోజు గమనించే వ్యక్తుల నుండి సమాజాన్ని అర్ధం చేసికొంటున్నపుడు , ఊరు పేరు మార్చి వ్రాసే స్వంతంత్రత మనకి ఉంటుందా? ఇంకొకరిలా వారికి తెలియపరిచి వ్రాసేవి కాదు. వారు చదివితే ఏమనుకుంటారు అన్న మీమాంస నాకు లేదు. కాని తప్పకుండా పదిమందితో పంచుకోవాలనిపిస్తే వ్రాయచ్చా?

 4. లలిత గారు మీ అనుభవాల అక్షరాల వానలో నేను తడిసిపోయాననే చెప్పాలి.
  ఇంతకు ముందులా ప్రశ్నోత్తరాల పరమపర కంటే, జాజిమల్లి గారు మిమ్మల్ని పరిచయం చేసిన తీరు నాకెంతో నచ్చింది. మీరు New Jersey లో ఉంటారనమాట!

 5. ఆహా !

  ఇవ్వాళ ‘బాలా’ గు లోక లలిత మయమైన రస రమ్య జిలేబీ ల మయము గా ‘స్త్రీ’స్థానం స్వర భూషితం గా సర్వం జిలేబీ ల మయమైన జాజిమల్లి య ల తో భళాగున్నది!

  శుభాకాంక్షలు ‘సహృదయ’ లలిత గారు !

  చీర్స్
  జిలేబి.

 6. ఓనమాలు లలితగారూ..”మీ ఓనమాలు బ్లాగు మూతపడినా మిమ్ముల్ని అలా పిలుచుకోవటమే నాకు బాగుంటుంది”..చాలా సూటిగా..స్పష్టంగా మీ అభిప్రాయాలు చెప్పారు.

  తెలుగు బాలసాహిత్యంలో మీరు చేస్తున్న కృషి ఎనలేనిది. మీకు హృదయపూర్వక అభినందనలు.

 7. లలిత గారు, అక్కడక్కడా చూసిన కామెంట్లతో మీ బ్లాగ్ ని గమనించాను. చాలా ప్రత్యేకమైన బ్లాగ్. విశిష్టమైన మీ విశ్లేషణ అద్భుతం. పిల్లలే కాదు పెద్దలకు కూడా మీ బ్లాగ్ తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది.మీ ఓనమాలు బ్లాగ్ చూడలేకపోయానన్న అసంతృప్తి మాత్రం నాకు చాలా ఉంది.

  ఆడవారి బ్లాగ్ కి ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. చక్కని బ్లాగ్ లు తమ ప్రత్యేకతని ఎలాగూ నిలబెట్టుకుంటాయి. అందరికీ స్పూర్తినిచ్చే ఎన్నో అంశాలతో ఆడవారి బ్లాగ్స్ ఉన్నాయి. అన్నీ ఒకచోట చేర్చటమన్నది చాలా మంచి ప్రక్రియ. జాజిమల్లి గారు మీకు నా అభినందనలు, కృతజ్ఞతలు.

 8. పిల్లల కోసం రాయడం – మిగతా విషయాలపై రాయడం కంటే భిన్నమైనది . కష్ట తరమైనది . దీనికి ప్రతిభతో పాటు అమేయ మైన ప్రజ్ఞా పాటవాలుండాలి . వీటన్నిటికి మించి పిల్లలంటే మిక్కుట మైన ఇష్టం , ఓర్పు , దయ , సహృదయత ఉండాలి . ఇన్ని ఘనతలు ఉండ బట్టే లలిత గారు పిల్లల కోసం రాయగలిగేరు .
  తెలుగు భాషా పరిమళాలను గుభాళింప జేసే ఇంత మంచి , ఇంత మంది మహిళా బ్లాగర్లను పరిచయం చేస్తున్న మల్లీశ్వరి నిజంగా జాజిమల్లే కదా !

  • వెంకట రాజారావు గారూ, మీరన్న మంచి మాటలు నా పట్ల నిజమవ్వాలని ఆశిస్తూ, ధన్యవాదాలు. తెలుగులో బాలసాహిత్యం బాగా అభివృద్ధి చెందాలి, ఆదరణ పొందాలి, ఎదిగే వయసులో తల్లి భాషతో స్నేహం కూడా ఎదగాలి అని నా కోరిక. భాష మీద పట్టు ఉండి పిల్లల కోసం వ్రాయదల్చుకున్న వారు కొత్తపల్లి పిల్లల పత్రిక (http://kottapalli.in/)కి కథలు వ్రాసి పంపిస్తే, తమ పిల్లలని కూడా వ్రాయడానికి ప్రోత్సహిస్తే బావుంటుంది.

  • Mrs Arudra gaaroo,
   మీ వ్యాఖ్య చాలా సంతోషాన్ని కలిగించింది.
   మనం ఊహించని సెక్షన్స్ లోకి వెళ్ళడం కన్నా ఒక పుస్తకానికి విలువ ఏముంటుంది!!
   జాజిమల్లిని ఇట్లా ఆదరించిన మీకూ,దేవినేని మధుసూదన్ రావు గారికీ ధన్యవాదాలు

 9. జయ గారూ, ధన్యవాదాలు. మీ పేరు చుసి ఆ పేరుతో వ్రాసే బ్లాగరు ఒకరున్నారు, వారు మీరే అనుకున్నాను. కానీ పొరబడినట్టున్నాను. ఓనమాలు బ్లాగు అప్పటికి సరిపోయింది. అది ఇప్పుడు చదివితే ఎలా అనిపిస్తుందో మరి. తెలుగు4కిడ్స్ కోసమే నేను అంతర్జాలంలో ఎక్కువగా తచ్చట్లాడేది. అభిప్రాయాలు వ్యక్తపరచడానికి స్వంత బ్లాగే అక్కర్లేదు. మీరూ అందుకు ఒక ఉదాహరణే కదా. పైన మౌళి గారికి నేనిచ్చిన సమాధానం నేను వ్రాసే టపాలకి ఒక ఉదాహరణ అనుకోవచ్చేమో 🙂 కాకపోతే అప్పట్లో అచ్చు తప్పుల పట్ల ఇంకొంచెం జాగ్రత్తగా ఉండే దానిని అని గుర్తు 🙂

 10. జయ గారూ, మంజు గారూ, ఇక్కడ కొన్ని ప్రొఫైల్స్ మాత్రమే ఇవ్వగలిగే అవకాశం ఉన్నట్లుంది. అది గమనించక నిన్న నేను నా వ్యాఖ్యలలో అలా వ్రాశాను. పొరపాటు మన్నించగలరు. మీ స్పందనకి ధన్యవాదాలు.

 11. మౌళీ, మీరు నా చేత మళ్ళీ బ్లాగు వ్రాయించేలా ఉన్నారు 🙂 నా ప్రతి సమాధానం దాదాపు ఒక టపా అంత అయ్యేలా ఉంది. ముందుగా మీరు అత్తాకోడళ్ళ సమస్యలని ఫెమింజంతో ఎలా పరిష్కరించారో లేక వారికి తాత్కాలికంగా ఉపశమనం ఎలా కలిగించారో చెప్తారా? ‘pain killer’ అన్న వాడకం ఆసకికరంగా ఉంది. వివరిస్తారని ఆశిస్తున్నాను. నా సమాధానం మీ జవాబులు విన్నాక వ్రాస్తాను.

 12. మీరు పిల్లలకోసం, తెలుగుకోసం వ్రాయగలరు, అవి అన్నింటికన్నా ముఖ్యమైనవి. ఇవి ఎప్పుడైనా వ్రాసుకోవచ్చండీ.

  ఇక మీరడిగిన ప్రశ్న, మీకు ఇప్పటికే అర్ధం అయ్యింది కదా ఆ సమస్య లో ప్రధాన కారణం అత్తగారో, కోడలో మాత్రమె కాదని. అన్నీ బావుంటే సమస్య ఉండదు, కాని మనం మాట్లాడేది అన్నీ బావున్న పరిస్థితులగురించి కాదు.

  1. అత్తగారు మామగారు మధ్య ఉన్న స్వతంత్రత ను బట్టి, అన్నేళ్ల సంసారం లో ఆవిడ చిన్న చిన్న కోరికలు కూడా తీరవు. ఆశలన్నీ కొడుకు మీద కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది.కూతురు అయితే సర్దుకుపోతుంది, ఎందుకంటే తనకి లేని స్వతంత్రత కూతురుకి మాత్రం ఉంటుందా? అలాగని భర్తను ద్వేషించదు, ఎలాంటి వ్యక్తి అయినా కుటుంబం లోను, సంఘం లోను తన గౌరవ మర్యాదలు ఉండాలన్నా, తన మాట ఎప్పటికో అప్పటికి నెగ్గించుకోవాలన్నా ఇది తప్పదు. ఇద్దరి స్నేహితుల మధ్య సంబంధం లాంటిదే. మూడో వాళ్ళ ముందు తగ్గ కూడదు. లోపల ఎన్ని గొడవలున్నా.

  2. అలాగే పిల్లల్లో ఒకరు బావుంది ఇంకొకరు జులాయిగా ఉంటె, ఆ రెండవ వారు రెక్కలు రాలేదు కాబట్టి దగ్గరే ఉంటారు. మన సంస్కృతిలో ఇన్నేళ్ళు పెంచాము, ఇక వెళ్లండి అనే సిద్దాంతం లేదు. ఇంకా పైన పిల్లల సమర్ధతను బట్టి పెద్దల మర్యాద మన్నన ఆధారపడి ఉంటాయి. ఇక్కడ తండ్రి ముందునుండి ఉద్యోగమో సజ్జోగమో మో చేసి అప్పటిదాకా కష్టపడే ఉంటాడు కదా, అందుకే ఆయన్ని ఇవి బాధించవు పెద్దగా. అసలేం చేయ్యనివాడికి ఎప్పుడు దిగులుండదు. తల్లికి తప్పదు. మరి తనలోపమే అనుకుంటుందో , లేక జనం లో నామర్దా అనుకుంటుందో. ఇవన్నీ కాకపొతే ప్రేమో ( ప్రేమే అయితే అందరి సమస్యా అర్ధము కావాలి , ఇది ఒక పజిల్ )

  3. కుమారస్వామిని ఊరంతా తిప్పి, వచ్చిన పుణ్యాన్ని వినాయకుడికి కట్టబెట్టిన పార్వతి దేవిని మనం ఎందుకు నిందిచము ? కాని ఇప్పుడు ఒక బిడ్డ వేగంగా సంపాదిస్తుంటే , కుటుంబ భారం అంతా ఆ ఒక్కరిపై బలవంతగా వెయ్యడం ఎవ్వరం అంగీకరించలేము. నిజంగా కష్టం అనిపిస్తుంది కూడా. ఇక్కడ అత్తగారు కోడలిని నిందించడమో , ఆశించడమో మానేస్తే అర్ధం చేసికోన్నట్లే. లేదంటే పైన పార్వతి దేవిని అర్ధం చేసికోన్నట్లే అత్తగారిని అర్ధం చేసికొని బాధపడడం మానెయ్యాలి. ఇష్టం లేకుంటే ఎవరినా దూరంగా ఉండొచ్చు . కాని అదే మనసుకు పెట్టుకుని బాధపడితే ఇద్దరికీ ప్రయోజనం లేదు.

  ఎదుటివ్యక్తి కోణం లో ఆలోచించడం కేవలం ఎదుటివారికి మేలుచేయ్యదానికే కానక్కరలేదు,

  4. రాముడితో , లక్ష్మనుడిని కూడా అడవికి పంపి చిన్న కోడలికి పని, పాటా లేకుండా చేయడాన్ని కూడా మనం అర్ధం చేసుకొంటాము . కాని ఒక కోడలికి కష్టం వస్తే ఇంకో కొడుకు తనింట్లో సందర్భాన్ని బట్టి వేడుకలు చేసికోవడాన్ని ని ఈ కోడలు ఎందుకు సంతోషంగా తీసికోదు ? అప్పటిదాకా ఆ ఇద్దరి అమ్మాయిలమధ్యా బంధం అన్నది ఉంటె , ఏమి జరిగినా ఇద్దరూ అర్ధం చేసికొంటారు. కాని ముందంతా పోటీగా ఉండి , మనకి బాధ వచ్చినపుడే అవతలివాళ్ళ లో తప్పులు కనిపించి బాధిస్తాయి.

  5. పురాణాల్లో మనం తప్పు చూడము , ఎందుకంటే అవి కధలు అవ్వచ్చు లేదంటే, వారికి యాభై ఏళ్ళో , వంద ఏళ్ళో మాత్రమె బ్రతికి ఉండగలిగిన పరిమిత జీవితం కాదు. ఆస్తులు పంపకాలు, ఆదాయాలు ఇంకా అప్పులు అసలు ఉండవు. ఆకలీ ఉండదు , రోగమూ ఉండదు. ఒకవేళ ఉన్నా కదలకుండా కూర్చుని తపస్సు చెయ్యమంటారు ముందు.. కధలో ఇంకో వెయ్యో, లక్షో ఏళ్ళు బ్రతికారని చెప్తారు. ఆ లెక్కలో మనం ఒక గంటో , పూటో మాత్రమె మనవాళ్ళ తో సర్డుకుపోతే చాలు 🙂

  కుటుంబాల్లో ఉండే ఈ సమస్యల్ని కవర్ చెయ్యడానికే పై కధలు వ్రాసి కొన్ని తరాల వరకు మార్గాదర్శ కం చేసారు. కాని కొన్ని దశాబ్దాలుగా మార్పులువచ్చాయి. ఆ కధలు పడగకో పబ్బానికో కూడా గుర్తు చేసికోలేని కధలు సమస్యలకు పరిష్కారాలు ఇవ్వడం లేదు.

  6. మగవాళ్ళ అసమర్ధతలు ఆడవాళ్ళ మధ్య విబేధాలుకు కారణం అయితే, ఆ అసమర్దులనే సమర్ధిస్తూ కూర్చోక వీళ్ళు ఒకరి సమస్యలను ఒకరు అర్ధం చేసికొంటూ ఉంటె. కనీసం సమస్య సాల్వ్ కాకపోయినా అవతల వాళ్ళ ప్రవర్తన ఎందుకు అలా ఉంది అర్ధం అవుతుంది. అర్ధం అయితే ఆ ఇద్దరిమధ్య కనీసం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎవరేమనుకుంటారో అని పైకి మామూలుగా ఉండాల్సిన పనీ ఉండదు.

  7. అవతలివాళ్ళు, వారానికో నెలకో ఒకసారి ఫోన్ చెయ్యాలన్న ఎమోషనల్ బ్లాక్మేయిల్స్ కి లొంగనవసరమ్ లేదు. మంచో చెడో కన్విన్స్ అయ్యి ఫోన్ చేస్తే , లేదా మానేస్తే తప్పవ్వదు. నేను ఇది ఎక్కువశాతం లో ఉండే గొడవగురించి చెపుతున్నాను. అత్తగార్లు, మామగార్లు ముందునుండీ చుట్టూ ఉన్న నలుగురు కుటుంబాలతో నిజమైన సత్సంబంధాలు ఉంచుకుని వుంటే, వచ్చిన కోడలితోను, అల్లుడుతోను మంచో చెడో సర్దుకు పోగలగుతారు. ఎదురు చూపులు ఉండవు.

  8. కోడలు ఇంట్లో పనిచెయ్యలేదని సాధించేవాళ్ళు (దగ్గర దగ్గరగా వేరు కాపురాలు పెడుతూ ఉంటారు ), రిటైర్ అయ్యిన భర్తతో చిన్న పని కూడా చెయ్యనివ్వరు. రాదు అని వాదిస్తారు. రాకపోతే నేర్చుకుంటారు, ముందే నువ్వు రాదు అనడం తప్పు అని నేను వాదిస్తాను. కలిసి ఉండడం ఇష్టం లేదు. ఆ అమ్మాయి ఇక్కడా అక్కడా సాయం చెయ్యాలి. ఎలా కుదురుతుంది అని అర్ధం చేసికోవాలి.అలా చేస్తే కోడలిపై ఊరికే ద్వేషం రావడం అన్నది తగ్గడం తాత్కాలిక ఉపశమనమే .

  9. చెడ్డగా కనిపించే వారి వల్లే కాదు, చాలా మంచిగా కనిపించే వారి వల్ల ఇంకా పెద్ద సమస్యలు వస్తాయి. అవి కనీసం సరిచేసుకోగాలిగిన స్థాయిలో ఉండవు చెయ్యిదాటే వరకు గుడ్డిగా ఆలోచిస్తూ ఉంటె . కాబట్టి మంచివారు, చెడ్డవారు అని బాధ పడడం లో ప్రయోజనం లేదు.

  ఓవర్ వ్యూ లా వ్రాసాను. ముందు వ్యాఖ్య వ్రాసినపుడే ఈ సిరీస్ లో నాకుతెలిసిన వారి అనుభవాలు వ్రాయాలని అనిపించింది. వ్రాయడం పెద్ద కష్టం కూడా కాదు. తప్ప కుండా వ్రాస్తాను. అవి కొంచెం స్పష్టంగా ఉంటాయి.

 13. మౌళీ మీ ఆలోచనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు చెప్పిన పరిష్కారాలు ఫెమినిజంతో ముడిపడి ఉన్నట్లు నాకనిపించటంలేదు నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో. ఏదేమైనా, సమస్యలున్నవారిని సమాధానపరుస్తున్నారంటే సంతోషం. వివరంగా మీరు వ్రాసే టపాల కోసం ఎదురు చూస్తాను. నేను మీరు నాకు వ్రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తారు అన్నది మంచి ఉద్దేశ్యంతోనే. ఉదాహరణకి పుస్తకం.నెట్ లో మీరడిగిన సాహిత్య సంబంధ ప్రశ్నలకి నా సమాధానాలను కూర్చి వ్రాయవచ్చు అనిపించింది.

  • లలితా గారు. ఎక్పెక్ట్ చేసాను మీరిలా అంటారని, ఎందుకంటె ఆ వివరణలు నేను పెట్టలేక పోయాను . పూర్తీ విశ్లేషణ కావాలి.

   ఇంకొక అంశం స్త్రీ పురుష స్నేహ సంబంధాల గురించి కూడా ప్రస్తావించాను. ఒకప్పుడు నేను రాఖీ బంధం నుండి, ఫ్రెండ్షిప్ నుండి తర్వాత ప్రేమలోకి వెళ్ళే అమ్మాయిల్ని అందరిలానే అర్ధం చేసికోలేదు. కాని ఇప్పుడా సమస్య లేదు. మొదటిది పొరపాటు అవగాహన అయ్యుంటుంది, లేదా ఆశ సహజం అని నేను అర్ధం చేసికోవడానికి ఫెమినిజం కాక ఇంకేదయినా ఉపయోగపడుతుందా .

   ఇంకో సందర్భం లో మనకి నచ్చిన అమ్మాయి అయితే మోసగింప బడింది అనుకుంటాము. ఇంకో అమ్మాయి కారెక్టర్ మంచిది కాదు అని మనం అనుకుంటే బాగా జరిగింది అనుకుంటాము. కాని ఇద్దరమ్మాయిలు ఒకేవిధంగా నమ్మి మోసపోయారు . ఇద్దరినీ మోసం చేసింది ఒకలాంటి వ్యక్తులే అని అర్ధం చేసికోవడానికి, ఇద్దరినీ సమానంగా అర్ధం చేసికోవడానికి నాకు చాలా సమయం పట్టింది. అలా కూడా అర్ధం చేసికోలేనివారు నా చుట్టూ చాలా ఎక్కువశాతం ఉన్నారు.

 14. నేనిక్కడ ఇచ్చిన సమాధానాలలో జయ గారికి నేను చెప్పిన సమాధానం నా పట్ల నాకు కొంత అసంతృప్తిని కలగజేసింది. ఓనమాలు బ్లాగుని గురించి మాట్లాడి దాని గురించి సరిగ్గా స్పందించలేక్పోయినకంటే అది ప్రస్తావించకపోయి ఉంటేనే బావుండేదనిపిస్తోంది. నేను ప్రస్తావించిననంతలోనే అప్పుడు ఏం వ్రాశానో తెలుసుకోవాని ఆసక్తి కనబరిచినందుకు అందరికీ ధన్యవాదాలు.
  పిల్ల్లల పత్రిక ఐన చందమామ పెద్దల ఇష్టం వల్లే ప్రతి ఇంట్లోను పిల్లల ప్రాణ నేస్తం అయ్యింది. ఇప్పుడూ పెద్దలు పిల్లల కోసం తెలుగులో బాల సాహిత్యం పట్ల ఇష్టాన్ని పెంచుకుని, ఆ దిశలో జరిగే ప్రయత్నాలని ప్రోత్సహించాలని, వ్రాయగలిగిన ప్రతి ఒక్కరూ పిల్లల కోసం వ్రాయాలని మరొక్కసారి మనవి చేసుకుంటూ, ఈ మాటలు చెప్పడానికి అవకాశం కలిగించిన జాజిమల్లిగారికి కృతజ్ఞతలు తెలియఏసుకుంటున్నాను. పిల్లల కోసం నేను చేసే ప్రయత్నాలని పరిచయం చేసుకోవడంలో ఉద్దేశ్యం ఇదే. నా ఇష్టం, శక్తి కొద్దీ నేను చెయ్యగలిగింది నేను చేస్తూనే ఉంటాను. ఐతే అటువంటి ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ పూనుకుని కృషి చెయ్యవలసి ఉందన్నది నా అసలు మాట.

 15. లలితగారూ… అభినందనలు…

  సూటిగా, స్పష్టంగా మీరు పంచుకున్న అనుభవాలు, అనుభూతులు చదివించేలా ఉన్నాయి.

  “బ్లాగు వ్రాయడం వల్ల ఆలోచన పెరిగింది. ఆవేశం తగ్గింది. మరిన్ని రకాల మనస్తత్వాల గురించి అవగాహన పెరిగింది. చెప్పదల్చుకున్న విషయాలు స్పష్టంగా చెప్పగలగడం సాధన చెయ్యడానికి బ్లాగు ఒక మంచి పరికరం అనిపించింది. వ్రాయడంలోని ఆనందం ఏమిటో తెలిసింది. బ్లాగ్ వ్రాయడం వల్ల మంచి స్నేహితులు దొరికారు.”

  ఇది మాత్రం నూటికి నూరు శాతం నిజ్జం… అనుభవపూర్వకంగా చెబుతున్న మాట ఇదండీ…

 16. లలిత గారూ.. మీ బ్లాగ్ప్రయాణం గురించి చక్కగా వివరంగా చెప్పారు. మీరు నాకు కేవలం ‘తెలుగు4కిడ్స్’ లలిత గారిగానే తెలుసు. మీరిదివరకు బ్లాగు రాసేవారని తెలుసుకోవడం బాగుంది. మిమ్మల్ని చూడటం కూడా బాగుంది. 🙂

 17. లలిత గారు అంతర్జాలంలో పిల్లల కోసం ఏమైనా తెలుగు సైట్స్ ఉన్నాయా అని వెతుకుతున్నప్పుడు మీ ‘తెలుగు ఫర్ కిడ్స్’ కనిపించింది. పిల్లల గురించి మీ ఆసక్తి దానికోసం మీ కృషి ప్రశంసనీయం. యు ట్యూబ్ లో మీరు పోస్ట్ చేసిన కథలు చాలా బావున్నాయి.

  • జ్యోతిర్మయీ,
   ధన్యవాదాలు. తెలుగు4కిడ్స్ కథలు మీకు నచ్చినందుకు సంతోషం. అన్నట్లు మీ పాఠశాల బ్లాగులో తెలుగు4కిడ్స్ లంకె ఉంచినందుకు కూడా ధన్యవాదాలు. తెలుగు4కిడ్స్ ని వర్డ్ప్రెస్‌కి తరలించాక డీఫాల్ట్ పేజీని సూచిస్తున్నందున ఆ లంకె పని చెయ్యటం లేదనుకుంటాను. http://telugu4kids.com మటుకు ఉంచితే సరిపోతుంది లంకెలో.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s