బ్లాగర్ పేరు; జ్యోతిర్మయి
బ్లాగ్ పేరు; శర్కరి, కనిపించే అందాలే, పాఠశాల
బ్లాగ్ చిరునామా http://themmera.blogspot.com/
http://sajyotsna.blogspot.com/
http://vidyalayamu.blogspot.com/
పుట్టిన తేది: శ్రావణమాసంలో రెండో మంగళవారం.
పుట్టిన స్థలం: రాళ్ళు, రప్పలు, కొండ, గుడి వుండి ఒకప్పుడు నీటి ఎద్దడి బా…గా వున్న ఊరు. గిత్తలకు మాత్రం మాంచి గిరాకీ.
ప్రస్తుత నివాసం: ఓ క్షణం ఇంట్లో మరు క్షణం ఊహల్లో…. ఎక్కడనిచెప్పను. శాశ్వత నివాసం మావారి హృదయంలోనే(నట).
విద్యాభ్యాసం; పూర్తయ్యాక తప్పకుండా చెప్తాను.
వృత్తి; ఉండాలంటారా…
వ్యాపకాలు; ఇదీ అదీ అని లేదు అప్పటికి ఏది ఆసక్తి కలిగిస్తే అదే…ఎక్కువ కాలం అంటిపెట్టుకున్నవి చదవడం, చదరంగం. ప్రస్తుతం అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అంటూ ఓ నలుగురు పిల్లలతో చెప్పించడం.
బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ; 2 సెప్టెంబరు 2011
మొత్తం బ్లాగ్ పోస్టులు; గాంధారి సంతానాన్ని ఈ మధ్యే దాటాయి.
బ్లాగ్ లోని కేటగిరీలు;ప్రచురణలు,
కథలు, కవితలు, నా జ్ఞాపకాలు, కదంబమాల, పసిడి పలుకులు, బంగారు బాల్యం, మధురస్మృతులు, మా గడుగ్గాయి, దృశ్యనాటికలు, సంస్కృతి, ప్రయాణం, సమీక్షలు, శుభాకాంక్షలు.
బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?
జూన్ లో 2011 లో… చిమటా మ్యూజిక్ సైట్ లో మొదటి సారిగా చూశాను. ఆ బ్లాగులకు వెళ్ళి వ్యాఖ్యలతో పాటుగా చాలా దూరాలు ప్రయాణించి…’ఇదేదో బాగానే ఉందే..’ తో మొదలై, రెండు రోజుల్లో కళ్ళు ఎరుపై ఆ తరువాత ఇంకేముంది ఎదలో వలపై నిలిచింది.
బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?
మొదలుపెట్టిన రోజే ఓ నాలుగు రచనలు బ్లాగులో పెట్టేసి కాఫీ కప్పు, చిప్స్ పాకెట్ పక్కన పెట్టుకుని కూర్చున్నాను…అందరూ వచ్చి వ్యాఖ్యలు పెడతారని రోజంతా ఎదురుచూశాను L (అమాయకత్వానికి మించిన సుఖం లేదు కదూ). గాలన్ కాఫీ, నాలుగు చిప్స్ పాకెట్స్ పూర్తయ్యాయి కాని ఎవరూ వ్యాఖ్య పెట్టడం కాదు కదా చూడడానికి కూడా రాలేదు. ఎందుకు రాలేదో అర్ధం కాలేదు. మరీ అంత ఛండాలంగా ఉన్నాయా అనుకుని పైకి కిందకూ స్క్ర్లోల్ చేస్తూ ఓ ముప్పై సార్లు చదివాను. ఆ తరువాత ఎవరి బ్లాగులోనో ఒక పక్కగా కనిపించాయి…కూడలి, మాలిక, హారం…టట్టడాయ్ ఇంకేముంది రహస్యం బట్టబయలు. మొదట్లో ఘడియకోసారి చూసేదాన్ని పెద్ద బ్లాగర్లు(అంతలోనే అపార్ధం చేసుకోకండి…. అప్పటికే బ్లాగు వ్రాస్తున్న వాళ్ళు) ఎవరన్నా వచ్చి కామెంట్ పెడతారేమోనని J. వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయేవాళ్ళు పోతున్నారు అప్పుడప్పుడూ ఓ మాటనేస్తున్నారు…వాళ్ళ వివరాలు కొంచెం తెలుసుకుందామని స్టేట్స్, ఫీడ్ జిట్ కలిపాను. కొన్నాళ్ళకు అవన్నీ శతృకూటమిని తయారు చేస్తున్నట్లుగా అనుమానం వచ్చి వాటిని తీసేసాను.
బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?
ఇలా బ్లాగ్ లో పోస్ట్ పెడతానా…అలా పాఠకులు వచ్చేస్తారు. నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నారా వెనక స్టాట్స్ దగ్గర మాటేస్తాగా…వచ్చిన పుణ్యాత్ములు ఓ మాటనేస్తారు. దాన్ని నేనో వారం పాటు మోసుకు తిరుగుతాను. ఆ మాట ఊరుకుంటుందా మరో మాట తోడు కావాలంటుంది. దాని ముచ్చట ఎందుకు కాదనాలి ఇంకో పోస్ట్ వేస్తాను. అలా అలా నల్లేరు మీద నడకలా సాగిపోతుండగా ఒకరోజెందుకో వెనక్కి చూసుకున్నాను. ‘నిజంగా నేనేనా…’ అని సందేహం, నేనేనని నమ్మకమూ కలిగాయ…అభిమానించే నలుగురూ అక్షరసుమాలంది౦చారు. ఇంతకంటే ప్రయోజనం ఏం కావాలండి.
మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?
మా స్కూల్లో ఒకసారి ‘స్త్రీ కి విద్య అవసరమా అనవసరమా’ అన్న అంశం మీద వక్త్రుత్వ పోటీ జరిగింది. ముగ్గురు ఉపాధ్యాయునిలు సగానికి సగం విద్యార్ధినులు ఉన్న మా స్కూల్లో ఆ చర్చే అనవసరం అన్న వాదన చేసినట్లు గుర్తు. ఇప్పుడెందుకో అది గుర్తొచ్చింది.
నా ప్రత్యేకత…..ఎముందబ్బా, పెద్దలడిగాక చెప్పకపోవడం పద్ధతి కాదే….పాఠకులే సాయం చెయ్యాలి.
సాహిత్యంతో మీ పరిచయం?
కొన్ని దశాబ్దాల క్రితం మా అమ్మ టీచర్ గా పనిచేసేవారు. తరగతిలో పిల్లలెవరో దొంగతనంగా పుస్తకం చదువుతుంటే అది తీసి బాగ్ లో పెట్టుకున్నార్ట(ఇది దొరతనంగానే). ఆ విషయం మరచిపోయి ఇంటికి తెచ్చారు. బుజ్జి పుస్తకం, సరిగ్గా అరచేయంత ఉందేమో, రాజు..మాంత్రికుడు, చెట్టుతోర్రలో ప్రాణాలు కథ. మొదటి అక్షరం మొదలెట్టగానే ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి…చివరి అక్షరం పూర్తయినా స్పృహలోకి రాలేదు. అప్పట్నుండి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకుoటు౦టాను. ఇక్కడ మా నాన్నకున్న అలవాటు గురించి కూడా చెప్పాలి. నచ్చిన వాక్యానికి ముందో వెనుకో ఓ నవ్వు అతికించి అక్షరాలను ఇల్లంతా చల్లేసేవాళ్ళు. అవి మమ్మల్ని పట్టుకుని మిగిలిన అక్షరాలను పరిచయం చేసేవరకూ వదిలేవి కావు.
స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?
అబ్బో చాలానే ఎదురయ్యాయి. ఈ పప్పు, ఉప్పు, పాలు నిశానీలు కదండీ…సమయం సందర్భం లేకుండా మాడిపోవడాలు, అడుగంటడాలు చేసి గొప్ప ఇబ్బందుల్లో పడేసేవి. వంట చేయకుండానే వడ్డించబోవడం లాంటి ఇరకాటాలూ తప్పలేదు.
జీవన నేపధ్యం?
ఒకప్పుడు రాధా, గోపాలం, బుడుగు, సీగానపెసూనాంబ. ప్రస్తుతం విమల, బుచ్చిబాబు, బుజ్జిపండు, చిట్టితల్లి.
ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
‘క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్’…. చిత్తం ఉన్నంతవరకూ.
సరదాగా ఏవైనా చెప్పండి?
సరదాగా చెప్పడం మహా కష్టమండి నేనసలే మహా సీరియస్….
బ్లాగులన్నీ ఇళ్ళయిపోయి బ్లాగర్లే అందులో గృహస్థులైతే వచ్చే పోయే పాఠకులతో సాహిత్య చర్చ చేస్తూ…. ఎంత బావుంటుందో కదా!
సీరియస్ గా ఏవైనా చెప్పండి?
నేను గమనించినంతవరకూ చాలా వరకు బ్లాగరు వ్రాసేవి కొన్ని వారి అనుభవాలు, కొన్ని సమాజాన్ని చూసినవి. ఈ కలబోతలో సంబంధంలేని వాటిని బ్లాగరుకు ఆపాదించి వ్యాఖ్యానించడం జరుగుతుంది. అందువల్ల కొన్ని అంశాలను వ్రాయాలనుకుని కూడా మానేసాను.
మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం గానీ ఒకటి, కవితలైతే రెండు మూడు
పెద్ద సమస్యే తెచ్చి పెట్టారుగా…ఒకదాని పేరు చెప్తే మిగిలిన వాటికి కోపం వస్తుంది. సరే ఒక పేరు చెప్తాను నేను చెప్పానని మా ‘శర్కరి’ దగ్గర అనకండి.
మా అమ్మాయిని కొంటె పిల్లంటారా? హన్నా 🙂
కొంచెం గట్టిగా అడగండి బాబాయి గారు. 🙂
థాంక్యు
కష్టేఫల గారు ఇంత ముద్దుగా కోప్పడతారంటే ఇంకా మంచి కొంటె పేర్లు పెట్టలేమా ఏంటి?
కొంటె పిల్లా మీ జవాబులు నాకు భలే నచ్చాయి పెంకె గా ఉంటే బావుంటారు మనుషులు..
ఏ బిరుదిస్తారో ఏమిటో నేనది మోసుకుంటూ తిరగాలేమో అని చాలా భయపడిపోయాను మల్లీశ్వరి గారూ…మీ పిలుపు నాకు చాలా నచ్చింది. ఆత్మీయంగా అనిపించింది. ముఖాముఖీ ద్వారా నన్ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
జ్యోతిర్మయి గారూ
ప్రశ్నలు రొటీన్ అయినపుడు సమాధానాలు భిన్నంగా చెప్పొచ్చన్న మీ ప్రయత్నం చాలా బావుంది లలిత గారు కూడా మోడల్ మార్చి పంపారు త్వరలో పబ్లిష్ చేయాలి
అందరూ వచ్చి వ్యాఖ్యలు పెడతారని రోజంతా ఎదురుచూశాను
కాలక్షేపం సరుకు రాసారనుకోండి, మోయలేనన్ని వ్యాఖ్యలు వస్తాయి..
వివాదాత్మకవిషయంపైన రాసారనుకోండి, వ్యాఖ్యలహోరులో టపాయే కొట్టుకుపోతుంది.
మా స్కూల్లో ఒకసారి ‘స్త్రీ కి విద్య అవసరమా అనవసరమా’ అన్న అంశం మీద వక్త్రుత్వ పోటీ జరిగింది.
ఈ రోజుల్లో కూడా అటువంటి విషయాలపైన వక్తృత్వపోటీలు జరగటం చాలా ఆశ్వర్యాన్నీ అంతకు మించి విచారాన్నీ కలిగిస్తోంది.
నచ్చిన వాక్యానికి ముందో వెనుకో ఓ నవ్వు అతికించి అక్షరాలను ఇల్లంతా చల్లేసేవాళ్ళు
అక్షరాలకు చిరునవ్వుల పరీమళాఆలు అద్దితే అవి ఆనందాలలోకాన్ని ఆవిష్కరిస్తాయి తప్పకుండా.
పాఠకులతో సాహిత్య చర్చ చేస్తూ…. ఎంత బావుంటుందో కదా
అవునండీ, పాఠకులు సాహిత్యాభిమానులైతే అంతకన్నా కావలిసినదేముంది. కాని నేను గమనించినంతవరకు సాహిత్యాభిమానులు సకృత్తుగానేకనిపిస్తున్నారు. అటువంటి వారి సంఖ్య బాగా పెరగవలసి ఉంది. అలా జరుగుతుందని ఆశిద్దాం.
మంచిటపా. అభినందనలు.
శ్యామలరావు గారు ఆ వక్తృత్వ పోటీలు ఇప్పుడు కాదులెండి. అవి కూడా కొన్ని దశాబ్దాల క్రితమే…సాహిత్యాభిలాష ఉన్న మిత్రులు నాకు బ్లాగు ద్వారానే పరిచయం అయ్యారండి. మీరన్నట్లుగా ఆ సంఖ్య ఇంకా పెరగవలసి వుంది. మీకు నచ్చిందన్నారు చాలా సంతోషం. ధన్యవాదాలు.
అబ్బా ఈ కొంటె పిల్లని అతిలోకసుందరి అని ముద్దుపేరు కూడా పెట్టుకున్నామండీ ఇంతకు ముందు.
జ్యోతిర్మయిగారు మీ పరిచయాన్ని చాలా చాలా ఎంజాయ్ చేసాం. నాకు మీ టపాలలో http://themmera.blogspot.co.uk/2011/12/blog-post.html మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే టపారాణి .
ఇంకా చాలా ఒక్కసారి చదివి గురుతు పెట్టుకోవడం కష్టం, మల్లి మల్లి అక్కడ విహరించాల్సిందే. కాని మీనుండి ఇంకా ఏదో ఆశిస్తున్నాము.
మీ నాన్న గారి మాటల చతురత గురించి మీ వర్ణన అద్భుతం.
టపారాణి…ఈ పదం భలే వుండండి. మీ వ్యాఖ్య నన్ను మేఘాల మీద నిలబెట్టిసింది. బోలెడు ధన్యవాదాలు మౌళి గారు. అన్నట్లు మీరు నానుండి ఎలాంటి రచనలు కోరుకుంటున్నారు?
జ్యోతిర్మయి గారు, మీ రచనల్లో చాలా వైవిధ్యం ఉంది, వేటికవే ముఖ్యమైనవే.కాని సున్నితత్వం బాగా ఎక్కువ.ఇవన్నీ మీతో చాలానే వ్రాయిస్తాయి అనడంలో సందేహం లేదు.కాబట్టి ప్రత్యేకంగా ఇవి వ్రాయండి అని అడగబడలేదు. అనుకోకుండా మీ ప్రత్యేకత చెప్పేసానేమో .
మీరు సీరియస్ గా చెపితే మాకు అర్ధం కాదు, మీరు ఇది గమనించాలి .. J
జాజిమల్లెతో కాసేపు వుంటే మనసంతా సౌరే! కొంటెపిల్లతో కాసేపు గడిపితే కోనేటినీరే!! చెప్పలేం కలువలు పూయొచ్చు..లేదా జాజులే బ్లాగులో జలజలా రాలొచ్చు!! మీ బ్లాగు..భలే బాగు బాగు!!
సువర్చల గారు మీ వ్యాఖ్య ‘సంపెంగ తావి’లా వుంది. బ్లాగు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
సువర్చల గారూ
భలే కవిత్వం చెప్పారు!!
మౌళీ,
అపుడు ‘కొంటెపిల్ల – అతిలోక సుందరి’ అనేసుకుంటే సరి మనిద్దరం కాంప్రమైజ్ అయిపోవచ్చు
నిర్మలత్వం కూసింత కొంటెతనం మరింత .. ఆలోచింప జేసే గుణం కొండంత …
ఇది ఒంగోలు వారి ఖ్యాతి. ఇది చాలదా హృదయాలని యేలడానికి !?
“శర్కరి” చాలా బావుంది అమ్మ భాషంత కమ్మగా,తీయగా ..
అభినందనలు జ్యోతిర్మయి గారు
వనజ గారు బ్లాగు మొదలెట్టినదగ్గర్నుంది నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించిన వాళ్ళలో మీరు ప్రధములు. ఒక్క వాక్యంలో నా గురించి చెప్పేశారు. మీ అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను. ధన్యవాదాలు
good
ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు.
జ్యోతిర్మయి నిఝంగా కొంటె పిల్లే లేకపోతే అలా ఎందుకు సమాధానాలు చెబుతుంది? అడిగిన మీకూ, చెప్పిన జ్యోతిర్మయికీ అభినందనలు.
మరేనండీ…లేకపోతే ఎందుకలా చెప్తుందీ…:)
ఆ సమాధానాలు వ్రాసేప్పుడు జ్యోతిర్మయి కాస్తా ‘శర్కరి’ అయిపోయినట్లుంది..
నా కవితలకు మీ వ్యాఖ్యలు కొత్త అర్ధాలు చెప్పేవి. ఆ ఉత్సాహంతోనే వ్రాయగలిగాను. ధన్యవాదాలు మూర్తిగారు..
మూర్తి గారూ
ధన్యవాదాలు
మీ టపాలు నాకు చాలా ఇష్టమండీ జ్యోతిర్మయిగారూ.
ఇప్పుడు ఈ కొంటెపిల్ల ఇంటర్వ్యూ కూడా బలే నచ్చేసింది.
మీకు అభినందనలు.. ఇంటర్వ్యూ చేసిన జాజిమల్లిగారికి ధన్యవాదాలు…
లలితగారు నా రచనలు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
లలిత గారూ
ఈ ముఖాముఖి ప్రయత్నాలకి ముందు నుంచీ ప్రోత్సాహంగా ఉన్నందుకు ధన్యవాదాలు
చాలా బాగుంది.అన్ని సమాధానాలూ బాగున్నాయి- ముఖ్యంగా “స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?” వేరే ఇంటర్వ్యూలలో వచ్చిన సమాధానాల కంటే వైవిధ్యంగా ఉంది. (అన్ని ఇంటర్వ్యూలు కూడా నచ్చాయి. ఇది ఇంకొంచెం ఎక్కువగా అన్నమాట.) ఇంటర్వ్యూ చేసిన జాజిమల్లి గారికి నెనర్లు. జ్యోతిర్మయి గారికి అభినందనలు. నేను రెగ్యులర్ గా చూసే బ్లాగ్స్ లో జ్యోతిర్మయి గారి బ్లాగ్ కూడా ఒకటి.
స్ జె గారూ మీరు బ్లాగు చదువుతున్నందుకు చాలా సంతోషం. “ఇంటర్వూ లో ఇలాంటి సమాదానలా ఇచ్చేది” అని ఎవరైనా కోప్పడతారేమో అని కొంచెం సందేహించాను. మీ వ్యాఖ్య చూసి అమ్మయ్య అనుకున్నాను. మిమ్మల్నిలా కలిసినందుకు ఆనందంగా వుంది. ధన్యవాదాలు.
ఎస్ జె గారూ
థాంక్ యూ
హుమ్మ్ భలే చెప్పారండి టక టకా ప్రశ్నలకు చక చకా సమాధానాలు
🙂 ధన్యవాదాలు అరుణ్ గారు.
ఆ అమ్మాయ్,
ఏమన్నావ్ ? కొంటె పిల్లతో ముచ్చట్లా ? మరీ బాగుంది ! మరీ బాగుంది !
బ్లాగు మొదలెట్టింది రెండు వేల పదకొండు లోనే నా ? ఇదీ కదా , మరి కొంటె ‘ధన’ మంటే !
శుభాకాంక్షలు జ్యోతిర్మాయీ గారు,
జాజిమల్లి గారికి జేజేలు ఈ పరిచయ మాలిక ని కూర్చు తున్నందులకు !
చీర్స్
జిలేబి
జిలేబీ గారు అవునండి అప్పుడే మొదలెట్టాను. మొదట్లోనే జిలేబీల రుచి తెలిసి అలా అలా కొనసాగించానన్నమాట.
కొంటె ‘ధన’ మంటే ధనమిచ్చి కొంటే వచ్చేది కాదు, జిలేబీల సావాసంతో మాత్రమే వచ్చేదని అర్ధమట. 🙂 ధన్యవాదాలు.
జిలేబీ గారికి
ధన్యవాదాలు
హహ సూపర్ సమాధానాలు…అభినందనలు జ్యోతిర్మయి గారు..:)
ధన్యవాదాలు సురేష్ గారు.
శర్కరి సమాధానాలు చాలా చాలా బాగున్నాయి. మళ్లీ మళ్లీ చదివేలా.. కొంటె గా, సరదాగా, సున్నితం గా..
చాలా సంతోషం.
మీ వ్యాఖ్య కూడా సున్నితంగా హత్తుకునేలా వుంది కృష్ణప్రియ గారు. 🙂 ధన్యవాదాలు.
ఇంటర్వ్యూ ఆద్యంతం కెవ్వుకేకలమయం
🙂 ధన్యవాదాలు మురళి గారు.
సరదాగా బాగుందండీ.. ఇలానే మీ బ్లాగ్ ప్రయాణం సరదాగా సాగాలని కోరుకుంటూ.. అభినందనలు.
మీ అభిమానానికి ధన్యవాదాలు తృష్ణ గారు.
హహః…అదరహా..మీ సమాధానాలు…అబినందనలు….జ్యోతి గారు…@శ్రీ ….
🙂 ధన్యవాదాలు శ్రీ గారు.
బాగుంది ఇంటర్వ్యూ. శర్కరికి తెలుసు లెండి. మేము ఎప్పుడూ వస్తూపోతూనే ఉంటామని:)
జాజిమల్లి గారు ఇంకొన్ని వివరాలు పట్టేయకపోయారా:)
శర్కరి మిమ్మల్ని తలచుకుంటూనే ఉంటుంది జయ గారు.
ఏం వివరాలు కావాలో మీరే అడిగేయండి. ఇదే మంచి సమయం 😉 ధన్యవాదాలు.
జయగారూ,
మీరెవరన్నా అడుగుతారని స్పేస్ వదిలాను
super..super..superrrrrrrrrrrrrrrrrrr
kummesaru baaboi.. 😉
మీ సూపర్ నాకు సూపర్ గా నచ్చేసింది రాజ్ గారు. థాంక్యు.
బలే సరదాగా చెప్పారు సమాదానాలు 🙂 )
సమాధానాలు ఇచ్చేప్పుడు మీ ఊరి పిల్లగాలి గుర్తొచ్చింది రాధిక గారు. 🙂 ధన్యవాదాలు.
Nice.
ధన్యవాదాలు నారాయణ స్వామి గారు.
One of the best interview.
Nice answers Sarkari 🙂
సమాధానాలు అదిరిపోయాయ్ ..కొంటెగా ఖచ్చితంగా లౌక్యంగా…సూపరండి 🙂
ధన్యవాదాలు ప్రవీణ గారు.
హర్ష గారు నా పేరు శర్కరి చేసేశారా..బావుందండి. ధన్యవాదాలు.
కొంటెపిల్ల ఎప్పుడయ్యారండీ మీరు? 🙂
బాగున్నాయి మీ సమాధానాలు..
రెండు రోజుల క్రితమే మధుర గారు. 🙂 థాంక్యు
మీ సమాధానాలు భలేగా ఉన్నాయండోయ్..
Suuuuuuperrrrrrr..:D
మీ ‘బ్రోచేవారెవరురా’ కన్నానా ధాత్రి గారూ 🙂 థాంక్యు.
ఇంటర్వ్యూ చాలా బాగుంది.ఇలాంటివి రాకపోతే మాకు శర్కరి తప్ప జ్యోతిర్మయి గురించి తెలియదు కదా.ఇందుకు జాజిమల్లి గారిని కూడా అభినందిస్తున్నాను.
గోపాల కృష్ణ గారూ
జ్యోతి గురించి ఈ ఇంటర్ వ్యూ ద్వారా నాకు కూడా మరి కొంచెం తెలిసినట్లు అనిపించింది
ధన్యవాదాలు గోపాలకృష్ణ గారు.
గ్రామీణ తెలుగిండ్ల కథన చాతురి కల్మి
భాషా మతల్లికి పట్టు గొమ్మ
తెలుగుపై మమకార మొల్కు నాలోచనన్
పాఠశాల నడుపు పంతులమ్మ
సునిశిత శోథనా జనిత శేముషి కల్మి
కుదురైన రచనలన్ చదువులమ్మ
నవ నవోన్మేష ప్రజ్ఞా విశేష ప్రక్రియల్ కల్మి
విరిసిన ప్రతిభల విరుల కొమ్మ
కాదు పొగిడింపు – జ్యోతమ్మ కలము లోన
కలవు ప్రత్యేకతలు – తెలుగుల కలలు మీరు ,
భాషలో భావమున కూడి పరిఢవిల్లి
రచన లందున తెలుగిట్లు గ్రాల వలయు .
రాజారావు గారు నా జన్మ ధన్యమైపోయిందండి. మీ అభిమానపు జల్లులో పూర్తిగా తడిసిపోయాను. జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని వుంది. అభివందనం.
కొంటెపిల్ల… మల్లీశ్వరి గారి టైటిల్‌కి ఇంటర్వ్యూలోని మాటలు ప్రాణం పోశాయి. జ్యోతిర్మయిగారూ అభినందనలు…
ఈ ఇంటర్వ్యూ చదవకపోతే మీ కొంటె కబుర్లన్నీ చాలా మిస్సయ్యేదాన్ని… మల్లీశ్వరి గారికి ధన్యవాదాలు..
ధన్యవాదాలు శోభ గారు.