” He is my biggest rock ” – మధురవాణి

బ్లాగర్ పేరు; మధురవాణి 

 బ్లాగ్ పేరు; మధురవాణి
 
బ్లాగ్ చిరునామా; http://madhuravaani.blogspot.com
 
ఇది నా ఫోటో బ్లాగు.. http://madhurachitralu.blogspot.com 
 
పుట్టిన తేదీ; June 30
 
పుట్టిన స్థలం; భద్రాచలం 
 
ప్రస్తుత నివాసం; జర్మనీ
 
విద్యాభ్యాసం; Biology లో డాక్టరేట్ డిగ్రీ 
 
వృత్తి, వ్యాపకాలు; వృత్తిరీత్యా సైంటిస్టుని. ఇష్టమైన వ్యాపకాలు పాటలు వినడం, మొక్కలు, పువ్వుల వెనక తిరుగుతూ వాటి ఫోటోలు తియ్యడం, వంట చెయ్యడం, తెలుగు బ్లాగులు చదవడం, రాయడం..
 
బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ; సెప్టెంబర్ 27, 2008
 
మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి); 256
 
బ్లాగ్ లోని కేటగిరీలు; జ్ఞాపకాలు, పాటల కబుర్లు, కథలు, కవితలు, ఊహలు, ఊసులు 

 

బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?

2008 సెప్టెంబర్లో నేను బ్లాగ్ URL క్రియేట్ చేసుకున్న రోజుకి నాకసలు తెలుగు బ్లాగులు ఉన్నాయన్న విషయమే తెలీదు. నాకు పాటలంటే ఇష్టం కాబట్టి వాటి గురించి ఏమైనా రాసుకోవచ్చని బ్లాగ్ ఓపెన్ చేసాను. ఏదన్నా పోస్ట్ రాద్దామని చూసేసరికి అక్కడ తెలుగులో రాయొచ్చన్న ఆప్షన్ కనిపించింది. అది చూసి ఎంత సంబరపడ్డానో మాటల్లో చెప్పలేను. సరదాగా ఒక ఐదారు పోస్టులు రాసాక ఎవరో వచ్చి “జల్లెడలో చూసి మీ బ్లాగుకి వచ్చాను.” అని కామెంట్ పెట్టారు. నాకేం అర్థం కాక జల్లెడ అంటే తెలుసుకుందామని గూగుల్లో వెతికాను. జల్లెడ సైట్ వచ్చింది. అది తెరిచి చూస్తే ఇంకేముంది.. ఓ చిన్న పిల్లాడి ముందు పెద్ద చాక్లెట్ల కొండ ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో కంప్యూటర్లో అన్ని తెలుగు బ్లాగులు చూసిన నా పరిస్థితి అలాగే అయింది. అప్పటి నుంచీ ఈ తీపి సముద్రంలో మునిగి తేలుతూనే ఉన్నాను. 🙂

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?
 
 
అసలు నేను ఇన్ని రోజులు బ్లాగు రాస్తానని గానీ రాయగలనని గానీ నేనెప్పుడూ ఊహించలేదు. నాలో నాకు తెలీకుండా దాగున్న రాయాలనే తపన ఉన్న అమ్మాయిని బయటికి తీసుకొచ్చింది తెలుగు బ్లాగు ప్రపంచం. ఈ నాలుగేళ్ళలో నా బ్లాగులో 250 కి పైగా పోస్టులు రాయడంతో పాటు ఒక పది కథలు వివిధ అంతర్జాల పత్రికల్లో అచ్చయ్యాయంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అలాగే, నాకు తెలియని ఎందరో గొప్ప వ్యక్తుల పరిచయం లభించింది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలిగింది. కేవలం రాతల మూలంగా బోల్డు అభిమానాన్ని పొందగలిగాను. నా కుటుంబంలో ఓ భాగంలా ఇమిడిపోయినంత ఆత్మీయులని, జీవితకాలంలో అరుదుగా దొరికే అత్యంత విలువైన ప్రాణస్నేహితుల్ని సంపాదించుకోగలిగాను.
 
 
బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?
 
 
నా వరకు నాకైతే బ్లాగింగ్ ని మించిన ఆటవిడుపు లేదు. ఎప్పుడూ ఓ పక్క రీసెర్చ్, ఇంకో పక్క ఇంటి బాధ్యతలతో క్షణం తీరిక లేనట్టు హడావుడిగా గడిచిపోయే జీవితంలో కాసేపు కూర్చుని నా మనసుకి తోచిన నాలుగు అక్షరాలు రాసుకోవడం అంతు లేని సంతోషాన్ని ఇస్తుంది. వేరే ఎన్ని రకాల పనుల్లో ఎంత అలసిపోయి ఉన్నా నా కోసం నేను ఏదన్నా రాసుకున్నా, నేను ఎప్పుడో రాసినవి చూసుకున్నా మనసుకి చాలా తేలికగా అనిపిస్తుంది. మన భావాలు నచ్చి పాఠకులు అందించే ప్రోత్సాహం మరింతగా రాయాలన్న ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే, మన ఉరుకుల పరుగుల మధ్యన ఎవన్నా మంచి మంచి బ్లాగు పోస్టులు చదవడం కూడా ఉల్లాసంగా ఉంటుంది. నాకు చాలా నచ్చి నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యే బ్లాగులు బోలెడన్ని ఉన్నాయి.
 
 
మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?
 
 
 అలాంటిదేమైనా ఉంటే నా రాతలు చదివే వాళ్ళకే బాగా తెలుస్తుందేమోనండీ.. ప్రత్యేకంగా ఒకలాంటి రాతలు రాయడంలో ప్రత్యేక నైపుణ్యం ఉందని నాకైతే ఎప్పుడూ అనిపించదు మరి. నా బ్లాగు పాఠకులు కూడా కొందరు కవితలు, కథలు చదవడానికి ఇష్టపడితే, కొందరు నవ్వించే పోస్టులు చదవడానికి ఇష్టపడతామని చెప్తుంటారు. మరి కొందరు పాటల గురించి ఎక్కువ రాయమని, జ్ఞాపకాలు చదవడం ఇష్టమని చెప్తుంటారు.
 
 
సాహిత్యంతో మీ పరిచయం?
 
 
పదో తరగతి వరకూ తెలుగు మీడియంలో చదివిన నేను చిన్నప్పటి తెలుగు వాచకాలు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దొరికే ఒకతో రెండో చందమామ పుస్తకాలు తప్ప సాహిత్యం గురించి పెద్ద అవగాహన లేదండి. మా ఇంట్లో చిన్నప్పుడు స్వాతి లాంటి వారపత్రికలు ఉండేవి కాని పిల్లల్ని అసలు ముట్టుకోనిచ్చేవారు కాదు. ఎప్పుడైనా కార్టూన్లు మాత్రం చూడనిచ్చేవారంతే. PhD కోసం జర్మనీ వచ్చేదాకా కాలేజీ పుస్తకాలు తప్ప నాకు సాహిత్యం గురించి అస్సలే మాత్రం పరిచయం లేదు. ఇక్కడికొచ్చాక తెలుగులో ఏదన్నా చదవాలన్న కోరికతో ఇంటర్నెట్ లో వెతికితే యండమూరి నవలలు, యుద్ధనపూడి నవలలు కనిపిస్తే అవి చదివాను. కాలేజ్ రోజుల్లో ఈనాడు ఆదివారం అనుబంధంలో వచ్చే కథలు చదివేదాన్ని అప్పుడప్పుడూ. తెలుగు బ్లాగులు చదవడం మొదలుపెట్టాకే నాకు తెలుగు సాహిత్యం ఇంత పెద్దదని, ఇంత మంది గొప్ప రచయితలు ఉన్నారని తెలిసింది. ఇప్పుడిప్పుడే మెల్లగా చదవాలని ప్రయత్నిస్తున్నాను. బుచ్చిబాబు, తిలక్, శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి ఇలాంటి వారి గురించి మన బ్లాగుల్లో విన్నాకే వారి కథలు కొన్ని చదివాను. కానీ, ఎందుకనో బ్లాగులు చదివినంత విరివిగా పుస్తకాలు చదవడం లేదు. నా సంగతి తెలిసిందే అయినా కనీసం ముందు ముందైనా రెండు నెలలకో పుస్తకమైనా చదివితే బావుండు అనుకుంటున్నా..
 
 
స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?
 
 
రాయడంలో చిన్నాచితకా ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ, అవి స్త్రీని అవ్వడం వల్ల, ఇంకా చెప్పాలంటే రాయడం వల్ల మాత్రమే ఎదురైనవి కాదని నా అభిప్రాయం. ఇంత మంది రకరకాల మనుషుల మధ్య ఉండాల్సి వస్తే ఎక్కడైనా సరే కొన్ని ఇబ్బందులు రావడం అనేది అనివార్యం అనుకుంటాను. ఇక్కడ ఉండే అందరినీ కలిపే ఒకే ఒక విషయం తెలుగుపై మక్కువ, తెలుగులో రాయడం, చదవడంపై ఇష్టం. అవి పక్కన పెడితే అందరి మనస్తత్వాలు, పద్ధతులు, ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ వేరుగానే ఉంటాయి. కాబట్టి ఏవైనా చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా అవి పూర్తిగా నన్నూ, నా రచనా వ్యాసంగాన్ని ప్రభావితం చేసేంత పెద్దవి కావనుకుంటాను. మరీ అంత పెద్ద సమస్యలు నాకైతే ఇప్పటిదాకా ఎదురు కాలేదు.
 
 
జీవన నేపధ్యం?
 
 
జర్మనీకి వచ్చేదాకా మా పల్లెటూర్లో ఇంట్లోనే ఉండేవాళ్ళం. మధ్యతరగతి కుటుంబంలో పెరిగాను. స్కూలు చదువులన్నీ తెలుగు మీడియంలోనే చుట్టు పక్కల చదువుకున్నా.. ఇంటర్, డిగ్రీ, ఎమ్మెస్సీ చదువులు గుంటూరు, ఖమ్మం, హైదరాబాద్ లో సాగిపోయాయి. మొదటిసారి ఆంధ్రప్రదేశ్ దాటి వచ్చింది ఇక్కడికే.. అమ్మా, నాన్నకి తెలుగు నవలా సాహిత్యంతో కాస్త పరిచయం ఉంది. ఎనభైల్లో, తొంభైలలో వారపత్రికలు, నవలు బాగానే చదివేవారని ఇప్పుడు చెప్తుంటారు. నాన్నకి మాత్రం పాత తెలుగు సినిమా పాటలంటే చాలా ఇష్టం. వాటిలో సాహిత్యాన్ని వివరించి చెప్తూ ఉండేవారు. మా పెదనాన్న గారు పత్రికల్లో ఏమీ ప్రచురించకపోయినా అప్పట్లో ఇంట్లోనే కూర్చుని బోలెడు కథలు, నవలలు రాసుకునేవారట. ఇప్పుడు నేనిలా తెలుగులో రాస్తుంటే చూసి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు.
 
 
ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
 
 
రాయడం మొదలుపెట్టాక, అందులో ఉన్న ఆనందాన్ని రుచి చూసాక రాయడం రాయడం మానుకోవాలన్న ఆలోచన ఈ నాలుగేళ్ళలో నాకింతవరకూ రాలేదు. ఒకోసారి రెండ్రోజులకే ఏదో రాయాలన్న ఆలోచన వస్తే వెంటనే రాసేస్తాను. ఒకోసారి రెండు మూడు వారలైనా ఏమీ రాయాలనిపించదు. అప్పుడేం రాయను. నేను ఘడియకో రకమైన ఆలోచనల్లో ఉంటాను కాబట్టి చాలాసార్లు ఎప్పుడు ఏది రాయాలనిపిస్తుందో రాసేదాకా నాకే తెలీదు. Planned గా రాసేది చాలా తక్కువ. కానీ, బహుశా రాయడం మాత్రం నాకు మానుకోలేని వ్యసనం అయిపోయిందని అనిపిస్తుంటుంది. 

మీ రచనలు చదువుతుంటే మీరు ప్రధానంగా భావుకురాలు అనిపిస్తుంది…మీ సున్నితత్వాన్ని కాపాడుతున్న అంశాలు ఏవి?

 
భలే ప్రశ్నే అడిగారుగా! ఈ సున్నితత్వం స్వతహాగా పుట్టుకతో వచ్చినా, కాలంతో పాటు అది హరించుకుపోకుండా ఉందంటే దానికి కారణం నాదైన ప్రపంచంలో ఉండే మనుషులందరూ నా స్వేచ్ఛకి, వ్యక్తిత్వానికి విలువిచ్చేవారు అవ్వడమే అనుకుంటాను. ఈ సున్నితత్వం అనేది ఉంది చూసారూ.. ప్రతి చిన్న విషయానికీ స్పందించడం, కదిలిపోవడం, కరిగిపోవడం, బెదిరిపోవడం లాంటి వాటన్నీటి మూలంగా మనిషిలో ఒకలాంటి మెతకదనం ఉంటుంది. దాని వల్ల practicality తక్కువైపోయి ధైర్యం, నిబ్బరం లాంటివి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ, నాలో భాగంగా కలిసిపోయిన కొన్ని బంధాలు నా చుట్టూ ఎప్పుడూ ఓ కవచంలా ఉండి నన్ను తమ అరచేతుల్లో పెట్టుకు పెంచినట్టు అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ సాహచర్యంలో వారి విజ్ఞత, తెలివితేటలూ, విశాలమైన ఆలోచనాపరిధి లోంచి నేను ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఉంటాను. చిన్నప్పుడు సైన్సు పాఠంలో చెప్తారు చూడండి. గుండె శరీరంలో చెడు రక్తాన్నంతటినీ తీసుకుని మంచి రక్తంగా మార్చుతుంది అని.. అలాగ వాళ్ళు నాకు హృదయంలాంటి వారు. ఎన్ని రకాల సమస్యలు, ఎదురు దెబ్బలు ఎదురైనా ఎప్పుడూ నాలో నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపుతూ నాలో సున్నితత్వానికి ఏ మాత్రం భంగం కలగకుండా కాపాడుతుంటారు. They are my rock! నా వాళ్ళు అనుకునే వారికి భావుకత్వం అనే పదానికి అర్థం తెలీకపోవచ్చు. కానీ, వాళ్ళ చేతల్లో ఉండే భావుకత్వమే నా రాతల్లో ప్రతిబింబిస్తుంటుంది. మనుషులు, మనసులు, ప్రేమ, ప్రకృతి.. ఇవే నా నమ్మకాలు. నా జీవితమంతా వీటి చుట్టూనే అల్లుకుని ఉంటుంది. ఎప్పుడైనా తాత్కాలికంగా మొదటి మూడు నొప్పించినా ఏ ఆకాశమో, వానో, మంచో, పువ్వులో.. ఆ కాస్త నొప్పి మాపేసి మళ్ళీ మామూలైపోయేలా చేస్తాయి.
 
 
మీరు యాక్టివ్ బ్లాగర్ గా ఉండడాన్ని మీ మంచబ్బాయి ఎలా తీసుకుంటారు?
 
 
He is my biggest rock. మనకి జీవితంలో ఫలానా పని చెయ్యడంలో ఎంతో సంతోషం, సంతృప్తి కలుగుతున్నాయి అని గుర్తించగలగడం అదృష్టం. ఒకసారి అదేంటో తెలిసొచ్చాక మన కోసం మనం ఆ పని చేసుకుంటూ జీవితాన్ని గడపడం ఉత్తమంగా జీవించే పద్ధతి అని తన అభిప్రాయం. నాకా సంతోషం రాతల్లో ఉందని తనకి తెలుసు కాబట్టి నా సంతోషమే తనకి ముఖ్యం. నేను రాసేవన్నీ తన మనస్తత్వానికి కలిసే రాతలు కాకపోయినా, బయటికి ఎప్పుడూ పెద్ద పట్టించుకోనట్టు కనిపించినా మౌనంగా నా రాతల్ని, వాటి మూలంగా నాకు పొందుతున్న గుర్తింపుని, అభిమానాన్ని చూస్తూ మనసులో రవ్వంత మెచ్చుకుంటూనే ఉంటారని నాకనిపిస్తుంటుంది.
 
 
సరదాగా ఏవైనా చెప్పండి?
 
 
నా బ్లాగు స్నేహాలని చూసి “నువ్వే అనుకుంటే నీలాంటి వాళ్ళు ప్రపంచంలో ఇంతమంది ఉన్నారా..” అని ఓ పక్క హాశ్చర్యపడిపోతూనే నా మీద ప్రాణాలు పెట్టుకునే నేస్తాలని కేవలం నా రాతల ద్వారా దొరకబుచ్చుకున్నానని మా ఇంటబ్బాయ్ గారు బోల్డు సంతోషిస్తుంటారు.
 
 
సీరియస్ గా ఏవైనా చెప్పండి?
 
 
మామూలు లోకంలో ఉండే మనుషులే ఇక్కడ బ్లాగ్లోకంలో కూడా ఉంటారు. కొన్నిసార్లు కొన్ని రాతల్ని చూసి విపరీతంగా తెలీకుండానే బోలెడు అభిమానం పెంచుకుంటాం. కానీ, మనం ఎప్పుడూ గుర్తు ఉంచుకోవలసిన విషయం ఏంటంటే మనం చదువుతున్న రాతలు కేవలం వారికున్న అనేక కోణాల్లో ఒకటి అయ్యుండొచ్చు. మనం చదివిన రాతల్ని రాసిన మనిషిలో వెతుక్కోవాలన్న ఆరాటం సహజంగానే వస్తుంది గానీ అది చాలాసార్లు మనం ఆశించినట్టు ఉండకపోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, రాతల్ని, మనుషుల్ని కలపకుండా చూడగలిగితే, ఇక్కడ మనకి కనిపించే అతి చిన్న పార్శ్వాలు, పక్కన నలుగురు చెప్తున్న అభిప్రాయాలు చూసి మనుషుల్ని పాజిటివ్ గా అయినా, నెగటివ్ గా అయినా జడ్జ్ చెయ్యకుండా ఉంటే disappointments కి తావుండకపోవచ్చు. పాలని నీళ్ళని, నీళ్ళని పాలని భ్రమ పడకుండా ఉండొచ్చు. 🙂
 
 
 మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం గానీ ఒకటి,కవితలైతే రెండు మూడు
 

నా బ్లాగ్ పోస్ట్ లింక్.. http://madhuravaani.blogspot.de/2012/06/blog-post_17.html

 

ఓ అపురూప ప్రేమకథ!

చుట్టూరా కనిపిస్తోందే ఈ విశాలమైన ఆకాశమంతా ఒకప్పుడు చీకటిగా నల్లటి నిశ్శబ్దంలో ఉండేది. అప్పుడు ఓ అరుదైన అపురూప ఘడియన తన చిరునవ్వు కిరణాలు ఈ ఆకాశమంతా ప్రసరించి ముందు తెల్లటి వెలుగుతో మొదలై చివరికి అందమైన నీలివర్ణంగా నిండిపోయింది. ఆ అద్భుతాన్ని నేను అబ్బురంగా చూస్తుండగానే మరిన్ని వింతలు జరిగాయి.
అదొక అమోఘమైన సృష్టి కావ్యం.. ఊహకందని ఇంద్రజాలం!
తన పసిమి చూపులు సోకిన ప్రతి చోటా జీవం విరిసింది. తన మోమున ఉదయించిన చిరు దరహాస రేఖలు కాంతి పుంజాలుగా మారి అచేతనంగా ఉన్న ఈ విశ్వంలో ఉత్తేజాన్ని నింపాయి. ఎన్నో రంగురంగుల లోకాలకి ప్రాణం పోశాయి.
తను ధారపోసిన శక్తి నాలోనూ ప్రాణప్రతిష్ఠ చేసింది. తన నులివెచ్చని స్పర్శతో నాలో కొత్త ఊపిరి పోసుకుంది. ఆ చల్లని చూపులు విరజిమ్మే వెలుగులు నాలో ఆకుపచ్చని జీవాన్ని నింపాయి. ఆ జన్మాంతం ఎండి బండ బారిన గుండెలో చిరుజల్లుల్ని కురిపించి యుగాల దాహార్తిని తీర్చాయి. తనలోని దివ్య తేజస్సు కనగానే యుగాలుగా నాలో ఆవరించిన స్తబ్దత ఆవిరైపోయి కొత్త చలనం వచ్చి ఆ సమ్మోహన శక్తికి దాసోహమంటూ అప్రయత్నంగానే తన చుట్టూ పరిభ్రమించసాగాను. సరిగ్గా అప్పుడే కాలం కదలడం మొదలైంది.

తన చేత అదృశ్యంగా ఉండే మంత్రదండంతో మంత్రించినట్టు అలవోకగా ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు సంభవించాయి. అంతవరకూ కనీ వినీ ఎరుగని అందాలూ, ఆనందాలెన్నో విందులు చేసాయి.
ఆనాటి నుంచీ అనుదినమూ ఉషోదయాల బంగారు క్షణాల్ని, సాయంసంధ్య చిత్రించే రంగవల్లుల్ని, నిశి రాత్రిలో తళుక్కున మెరిసి మురిసే తారల్ని, జాబిలి చేత రాయబారమంపి పండించే వెన్నెలనీ అనుభూతిస్తున్నాను. అంతేనా! ఇంకా.. తెల్లటి మంచంటి స్వచ్ఛతని, వాన చినుకంటి మృదుత్వాన్ని, ఆకాశమంటి విశాలత్వాన్ని, సంద్రమంటి కనిపించని లోతుల్ని, అగ్గిరవ్వంటి ఆగ్రహావేశాల్ని, సుడిగాలంటి ప్రతాపాన్నీ, కారడవుల్లాంటి కాఠిన్యాన్ని, జలపాతమంటి చురుకుదనాన్ని, చీకటి వెలుగులని, సుఖదుఃఖాల్ని, ఆరు రంగుల ఇంద్రధనస్సునీ, ఆరు ఋతువుల నిండిన మాధుర్యాన్ని, కమ్మని తేనెలూరే పూబాలలని, పూరెమ్మల చెక్కిలి పైన ఆర్తిగా నిలిచే మంచు బిందువుల ముద్దుల్నీ, మధుర మకరందాన్ని కొల్లగొట్టిపోయే చిలిపి తుమ్మెదల్ని, రంగురంగు రెక్కల సీతాకోకచిలుకల్ని, మబ్బుల దాకా ఎగిరే పక్షులనీ, రాజసం ఒలకబోసే సింహపు కొదమనీ, విశ్వాసంగా చెలిమి చేసే జంతుజాలాన్నీ, మానవత్వం పరిమళించిన మనిషినీ, అనుపమాన సౌందర్యం మూర్తీభవించిన అతివనీ, పాలు గారే పసిపాపల నవ్వుల్నీ……… ఇలా ఎన్నని చెప్పనూ.. తను అనుగ్రహించిన వరప్రసాదంగా లెక్కకందనన్ని అద్భుతాలకి ఆలవాలమై మహదానందంగా విలసిల్లుతున్నాను నేను.

నిరుపమానమైన స్వయంప్రకాశకత్వం తనకే సొంతం.. అనన్య సామాన్యమైన తన శక్తిసామర్థ్యాలు ఎన్నో జవజీవాలకి ఆధారం.. తన నీడన ప్రాణం పోసుకున్న ఎందరికో తనొక గోరువెచ్చని జ్ఞాపకం.. తన దివ్యస్పర్శ నిత్యనూతనం, అమరం, అజరామరం!
అనుక్షణం తన చుట్టూ పరిభ్రమించడటమే నాలో ప్రాణస్పందనకి నిదర్శనం. ఎన్నటికీ తనివి తీరనంత అనురాగమున్నా నిర్దిష్టమైన దూరాన కట్టి ఉంచడం తనకే సాధ్యమైన స్వయంనియంత్రణ. తన పసిడి కిరణాల వెలుగులు ఇంకా ఎన్నెన్ని ప్రపంచాల్లో జీవం నింపాల్సి ఉన్నాయో కదా.. అందుకని అంతటి శక్తిని ఒడిసిపట్టి బంధించి ఉంచాలనుకోడం అసాధ్యమే కాదు, న్యాయం కూడా కాదుగా మరి.. అందుకే మా మధ్యన ఈ తప్పని దూరమన్నమాట!

కాలం పరుగు నేర్చింది తన చేతుల్లోనే.. కాలం కొలత మొదలైంది తన వెంట తిరిగే నా పరుగుతోనే.. తన చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తి చేసిన గడువే కాలచక్రంలో ఏడాదిగా ముద్రపడి తిరిగి నన్ను మొదటి అడుగు వేసిన చోటుకి చేరుస్తుంది. మా ప్రేమ జనించిన తొలి క్షణాన్ని గుర్తు చేస్తుంది. ఆ మధుర జ్ఞాపకాన్ని తలచి మురిసి సంతోషంగా సంతృప్తిగా నా పెదవంచున ఒలికే చిన్ని చిరునవ్వు సాక్షిగా మరో ప్రదక్షిణానికి నాంది.. ఇది తుది దాకా అనునిత్యం సాగే మా ప్రేమ ప్రయాణం.. నాకు ప్రాణప్రదమైన మా ప్రణయయాత్ర!

నేను భూమిననీ.. నా ప్రేమయాత్ర సూర్యుడి చుట్టూ.. అని మరి చెప్పక్కర్లేదుగా!

ప్రకటనలు

21 thoughts on “” He is my biggest rock ” – మధురవాణి

 1. “నా వాళ్ళు అనుకునే వారికి భావుకత్వం అనే పదానికి అర్థం తెలీకపోవచ్చు. కానీ, వాళ్ళ చేతల్లో ఉండే భావుకత్వమే నా రాతల్లో ప్రతిబింబిస్తుంటుంది”
  Wow!! ఇంత బాగా చెప్పడం మీకే చెల్లింది.
  Keep going.

 2. సున్నితంగా సృశించే మీ వ్రాతల వెనుక మీ ఇంటి మనుషులు, మనసులు, ప్రకృతి ఇవే కారణం అని మీరు చెపుతుంటే ఎంత ఆశ్చర్యం గా ఉందొ..! సున్నితంగా ఉండటం వేరు. సున్నితత్వాన్ని కాపాడుకోగల్గడం వేరు. ఇవి రెండు మీకు లభించిన వరం.

  మీ గురించి, బ్లాగ్ వ్రాతల గురించి, మీకు లభించే సహకారం గురించి చక్కగా ఆవిష్కరించారు .

  మీరు ఇంకా ఎన్నో ఎన్నో పోస్ట్ లు వ్రాయాలని కోరుకుంటూ.. అభినందనలతో..

 3. ” మనకి జీవితంలో ఫలానా పని చెయ్యడంలో ఎంతో సంతోషం, సంతృప్తి కలుగుతున్నాయి అని గుర్తించగలగడం అదృష్టం. ఒకసారి అదేంటో తెలిసొచ్చాక మన కోసం మనం ఆ పని చేసుకుంటూ జీవితాన్ని గడపడం ఉత్తమంగా జీవించే పద్ధతి అని తన అభిప్రాయం. నాకా సంతోషం రాతల్లో ఉందని తనకి తెలుసు కాబట్టి నా సంతోషమే తనకి ముఖ్యం. నేను రాసేవన్నీ తన మనస్తత్వానికి కలిసే రాతలు కాకపోయినా, వాటి మూలంగా నాకు పొందుతున్న గుర్తింపుని, అభిమానాన్ని చూస్తూ మనసులో రవ్వంత మెచ్చుకుంటూనే ఉంటారని నాకనిపిస్తుంటుంది.”

  సరిగ్గా నా మనసులోని మాటలని అచ్చు అలాగే చెప్పినట్లనిపించింది.. మనం చేసే పనులకి జీవిత భాగస్వామినుంచి మొదటి స్పందన, మెచ్చుకోలు దొరికినప్పుడు ఆ సంతృప్తి మాటలకి అందనిది.

 4. చదువుకోని వాణ్ణి, మాటలు రాని వాణ్ణి, అమ్మకి నమస్కారం, మధురగారికి “శతంజీవ శరదో వర్ధమానా>>>” ఏంటీ వైరుధ్యం అంటారా! మధుర గారిలోని తల్లికి,జ్ఞానానికి నమస్కారం, మధురగారు, నాకంటే చిన్నవారునుకుంటున్నా అందుకు ఆశీర్వచనం 🙂

 5. మీ భాష చాలా పోయెటిక్ గా ఉంటుంది. చాలా రిచ్ డిక్షన్. అలాగే ప్రతి వాక్యం లోనూ భావుకత ఒలుకుతుంది. అంత సరళంగా, భావయుక్తం గా రాయగలగటం చాలా అరుదు. కంగ్రాట్స్. మీరింకా ఎన్నెన్నో రచనలు చేయాలని ఆశిస్తున్నాను. .

 6. భాష మీద మంచి పట్టు, దానికి తోడైన చక్కని అభివ్యక్తి కలిగిన బ్లాగరి మధురవాణి గారు. అభినందనలు. 🙂

  కర్టసీ: నారాయణస్వామిగారు (ఆయన అనుమతి లేకుండా ఎత్తుకొచ్చిన పైరేటెడ్ కామెంట్) 😉

 7. మధురవాణి గారు మీ బ్లాగు మొదటిసారి చూసినప్పుడు రెండు రోజులు వరుసగా అక్కడే ఉండి పోయానండి. ఏమి వ్రాసినా మధురంగా వ్రాసే మీ శైలి నాకు చాలా చాలా నచ్చుతుంది. మీ ఇంటర్వ్యూ కూడా మీ బ్లాగు లాగే ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s