‘ఆ ప్రేమ అదాటున కలగదు’ – మానస చామర్తి

మానస కోసం కొన్ని నజరానాలు

ప్రేమతో…జాజిమల్లి

           
మానస రాసిన వాక్యాలు చదువుతుంటే, చాలాసార్లు, శరదృతువులో కొండల్లో చల్లగా పరుగులుపెట్టే స్వచ్ఛజలాలు గుర్తుకొస్తాయి. శుభ్రమైన భాష, స్పష్టమైన వాక్యనిర్మాణం, తన ఆలోచననో, అనుభూతినో పంచుకోవటంలో కనిపించే ఉత్సాహం – వాక్యం తరువాత వాక్యంవెంట పరుగుపెట్టిస్తాయి. అంత సునాయాసంగా రాసినట్లుండే వాక్యాలలోనూ ఆలోచనలేని వట్టి ఉత్సాహమో, జీవం లేని వట్టి ఆలోచనో కనిపించవు. యాత్రలలోనూ, పుస్తకాలు చదివినప్పుడూ తనకి కలిగే గాఢానుభూతిని సమర్ధవంతంగా వ్యక్తీకరిస్తారు మానస. అయితే ఆ సరళాభివ్యక్తి ఒక్కొక్కసారి ఆమె ప్రతిపాదించే లోతైన విషయాలను గురించి మరింత ఆలోచించే వ్యవధినివ్వకుండా మనని ముందుకు తీసుకుపోతుందేమో అనిపిస్తుంది. కవిత్వం, కథ, వ్యాసం, విమర్శ ప్రక్రియ ఏదైనా రచయితకి తనకంటూ ఒక వాతావరణం వుండి, దానిలోకి పాఠకుల్ని ఆకర్షించగల శక్తి వుండాలి. వ్యాసరచయిత్రిగా మానసకు ఈ లక్షణాలు చక్కగా ఉన్నాయి. కథలు నేనింకా చదవలేదు. కవిత్వంలో కూడా అదే సరళహృదయం కనిపిస్తున్నా, కవిత్వం రాయటానికి మరికొంత సాధన అవసరమేమో అనుకొంటాను. ముఖ్యంగా, బాగా ఎడిటింగ్ జరగాలి. ఈ శిల్పసంబంధమైన విషయాలు అలా ఉంచి, ఆమె గురించి మరికొన్ని మాటలు చెప్పాలి. అవి, ఆమె వాక్యాల వెనుక అంతర్వాహినిలా జీవితం పట్ల కనిపించే అపారమైన ప్రేమా, గౌరవమూ, తనలోపలి వెలుగునీడల్లోకి తరచి చూసుకోగల అంతర్దృష్టీ, తనకు మంచిదిగా కనిపించిన ఏ విషయాన్నైనా, ఎలాంటి లెక్కలూ వేసుకోకుండా పసిపిల్లలు స్నేహితులతో చిరుతిళ్ళు పంచుకొన్నట్టు, పంచుకోగల నిర్మలత్వమూ. వీటితోపాటు నిరంతర అధ్యయనమూ. ఈ లక్షణాలవల్ల, ఆమె గనుక రచనా వ్యాసంగానికి మరింత సమయం కేటాయించగలిగితే, తెలుగు సాహితీలోకం గుర్తుంచుకోదగిన మరింత ఉన్నతమైన రచనలు చేయగల శక్తివంతురాలు మానస అని భావిస్తూ, ఆమెకు జీవితానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకొంటున్నాను.

బివివి ప్రసాద్ 

 
బ్లాగ్ గురించి చెప్పడంకన్నా ముందుగా బ్లాగర్ గురించి చెప్పాలి. తనగురించి తాను, “One who knows the art of living and loving” అని ఒక్క వాక్యంలో ఎంత చక్కగా చెప్పుకుందో! రచయిత్రి ప్రతిభని చెప్పడానికి ఆ ఒక్క వాక్యం సరిపోతుంది. జీవితాన్ని ఇంతగా ప్రేమించే ఆ హృదయం రాసే ప్రతి అక్షరంలోనూ జీవం ఉంటుంది అనడాకి బ్లాగునుండి ఒక్క లైన్, “నా అక్షరాలన్నీ ప్రేమ పంచిన సంతోషం లోనో, అవి దాచిపెట్టిన కన్నీళ్ళ లోనో  తడిసి ముద్దైన ముద్ద మందారాలే.” కవితలు, కథలు, పుస్తక పరిచయాలూ, విశ్లేషణలూ, యాత్రా విశేషాల వ్యాసాలతో అల్లిన కదంబమాల ఈ మధుమానసం! వ్యాసం రాసినా, కథ రాసినా అన్నిట్లోనూ కవిత్వం ఉట్టిపడే అందమైన భాషకొటి తొణికిసలాడుతూనే ఉంటుంది. బ్లాగుల్లో తెలుగు అమృతం రుచిచూడాలనుకునే ప్రతివారూ చదవవలసిన బ్లాగ్ www.madhumanasam.com

అవినేని భాస్కర్

 
మధుమానసం బ్లాగర్ మానస చామర్తి గారు నాకు బాగా నచ్చిన  బ్లాగర్. ఆమె ఒక మంచి పాఠకురాలు సాహిత్యం పట్ల ఆమెకి ఉన్న ఆసక్తి మెండు. నిరంతర అధ్యయనశీలి మంచి సమీక్షలు అందిస్తూ ఉంటారు..  ఆమె వ్రాసే పోస్ట్స్ అన్నీ ప్రతి మదిని  సృశిస్తూ ఉంటాయి. చాలామంది తమలో కల్గె భావనలను అక్షరీకరించలేరు.మానస గారి శైలి అద్బుతం. అలాగే తన రచనలలో సామాజిక సృహ అధికం ఆమె రచన ఎప్పుడూ పాఠకులని ఇమాజినేషన్ లో ఉంచదు. ఆమె  తీసుకున్న అంశం కానీండి,వ్యక్తీకరణ కానీయండి చాలా బలంగా ఉంటుంది. పాఠకుల స్మృతి పథం నుండి అంత  త్వరగా వీడిపోవు. సమకాలీన సమస్యలపట్ల మంచి అవగాహన కల్గిన ఆమె కలం నుండి మరిన్ని రచనలు వెలువడాలని కోరిక.   

వనజ వనమాలి

 
మానస చామర్తి

మానస చామర్తి

బ్లాగర్ పేరు : మానస

బ్లాగ్ పేరు : మధుమానసం
 
బ్లాగ్ చిరునామా : www.madhumanasam.in
 
పుట్టిన తేదీ : శ్రావణ ఏకాదశి, 1984
 
పుట్టిన స్థలం : అవనిగడ్డ
 
ప్రస్తుత నివాసం: బెంగళూరు
 
చిరునామా(ఇబ్బంది లేనట్లయితే): Flat -303, Alba Block, Manar Silver
Shadow apartments, Kasavanahalli, Bangalore
 
విద్యాభ్యాసం: బి.టెక్ (కంప్యూటర్ సైన్స్)
 
వృత్తి : ఐ.టి- టెక్నాలజీ లీడ్;
 
వ్యాపకాలేమో..
ఔట్‌డోర్ ఆటలేవైనా;
కొత్తా పాతా తేడా లేకుండా దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదవడం;
వాద్యసంగీతమంటే అపారమైన ప్రేమ. వీణ నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.
ఇవి కాక వీలు దొరకగానే ప్రయాణాలు.
 
బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ : మార్చ్, 21, 2010
 
మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి): 63
 
బ్లాగ్ లోని కేటగిరీలు :
కవులూ – కవిత్వాలూ
పయనించెనెచటికో..మనసు పరవశించెనెందుకో
పుస్తక పరిచయాలు
అనుభవాలూ-జ్ఞాపకాలూనూ
కవితలు
కథలు
 
బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?
 
2008 లో. సన్నిహిత మిత్రులతో కలిసి సొంత వెబ్సైట్ పెట్టే ఆలోచనల్లో
ఉన్నప్పుడు మొదటిసారి వీటి గురించి తెలుసుకున్నాను. అటుపైన, లోక్‌సత్తా
సంస్థ తరఫున పని చేస్తూ, మా బృందం చేసిన కార్యకలాపలను పెద్ద సంఖ్యలో
అందరికీ చేరవేసేందుకు బ్లాగ్ అన్నివిథాలుగా అనువుగా ఉందనిపించి వాడటం
మొదలెట్టాము. దానికి చక్కని స్పందన రావడం, ఒకే అభిప్రాయాలున్న అనేకులను
ఒకే చోటికి తీసుకు రావడం చూశాక, తెలుగు రచనలకు సంబంధించి నా తొలి
అడుగులకు ఇది సరైన వేదిక కాగలదనిపించింది.
 
బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?అభిమాన రచయితలనూ, కవులనూ, గొప్ప వ్యక్తిత్వం కలవారినీ దగ్గరగా
పరిశీలించగల, పరిచయాలు పెంపొందించుకోగల అవకాశాన్నిచ్చింది. సాహితీ
తృష్ణను తిరిగి రగిలించింది. సమకాలీన సాహిత్యంతో అనుబంధాన్ని పెంచింది.

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?

 సానుకూలాంశాలు :
1)రచనా వ్యాసంగం పట్ల ఆసక్తితో ఉద్యోగాన్ని వదులుకోవాలనుకున్న ఒకనాటి నా
ఆలోచన , తొందరపాటుతనమని బ్లాగ్స్‌లోకి రానిదే నేనెప్పటికీ
తెలుసుకోలేకపోయేదాన్ని. నా రచనల స్థాయి సరిగా లేదనీ, నేను కృషి
చేయవలసినది, నేర్చుకోవలసినదీ, శైలి శిల్పం తదిర అంశాల్లో మరింతగా మెరుగు
కావలసి ఉందనీ బ్లాగ్స్ ద్వారా మరింత స్పష్టంగా తెలుసుకోగలిగాను.
2) ఏ రచనా చేజారిన అనుభవం ఉండదు. మన ప్రతీ రచనా మన సొంతమే కనుక,
అభివ్యక్తి మెరుగు పరచుకోవడానికి కావలసినంత అవకాశం ఉంటుంది.
3) బ్లాగర్స్‌కు మాత్రమే ఉన్న మరొక సదుపాయమేమిటంటే – వెనువెంటనే దొరికే
ప్రతిస్పందన; అభిప్రాయ బేధాలు తలెత్తిన పక్షంలో చర్చలకు అవకాశం; అలాగే
బహుళ ప్రాచుర్యం పొందిన రచనల గురించి వ్యాసాలు వ్రాసుకున్నప్పుడు
అనుభవజ్ఞుల నుండి అందే అరుదైన సమాచారాలు.
 
పరిమితులు :
1) నిడివి విషయంలో అప్పుడప్పుడూ తలెత్తే బెంగలు . ఇక్కడితో ఆపాలి అని
మనకెవ్వరూ చెప్పరు కనుక, ఎంత స్పష్టంగా,  సూటిగా, క్లుప్తంగా వ్రాయాలో
పత్రికలకు పంపినప్పుడు ఎడిటర్లు సాయం చేసినట్టు ఇక్కడెవ్వరూ చెయ్యరు.

2) కథగా మలచగల్గిన వెలున్న అంశాలు కూడా బ్లాగింగ్ వల్ల వ్యక్తిగత
అనుభవాలుగా మిగిలిన సందర్భాలున్నాయి నాకు. రచనా వ్యాసంగం అన్నివేళలా
సీరియస్‌గా సాగనవసరం లేదన్న అభిప్రాయాన్ని బ్లాగ్స్ కలిగిస్తాయి. అది
రచయితలుగా నిలబడాలనుకున్న వారిని లక్ష్యాలకు కాస్త దూరంగా జరిపే ప్రమాదం
ఉంది.

మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?

లోకంలో మహిళలు మాత్రమే స్పృశించగల్గిన అంశాలు కొన్ని ఉంటాయనిపిస్తుంది.
అలాగే పరిశీలనా శక్తి కూడా మహిళకు సహజసిద్ధంగా కాస్త ఎక్కువ ఉంటుందని నా
అనుకోలు. పూర్తి స్థాయిలో ఆ దిశగా నేను కృషి చేయలేకపోయినా, ఆ అవకాశాలు
కలిగి ఉండడమే ప్రతీ మహిళా బ్లాగర్‌నూ ప్రత్యేకంగా నిలబెడుతుందని
అనిపిస్తూంటుంది.

సాహిత్యంతో మీ పరిచయం?

చిన్నతనంలో తల్లిదండ్రులు చదివించిన / అందుబాటులో ఉంచిన చక్కని
పుస్తకాలతో మొదలైన పరిచయం, పాఠశాలలో పోటీల కోసం సుదీర్ఘమైన వ్యాసాలు
వ్రాసే క్రమంలో పెరిగిందనుకొంటాను. పెదనాన్నగారు టి.ఎల్ కాంతారావుగారు
సాహితీ విమర్శకులు. నా ఊహ తెలిసే నాటికే వారు మరణించినా, కవిత్వంతో నాకు
బలమైన బంధం ఏర్పడడానికి, కవిత్వానికి సంబంధించి ఓ ప్రత్యేకమైన అభిరుచి
పెంపొందించుకోవడానికీ, 80-90ల నాటి ప్రతి కవి గురించీ, కవిత్వాన్ని
గురించీ లోతుగా అధ్యయనం చేయడానికీ  వారే పరోక్షంగా కారణం.

అలాగే నాకు ఈ సాహిత్యపు పరిమళాలను ఆస్వాదించే వయసొచ్చాకే, మా అమ్మగారు
M.A కోసం అనేకానేక పుస్తకాలూ, పరిశోధక వ్యాసాలూ, రిఫరెన్సుల కోసం చక్కటి
సాహిత్యమూ చదవడం దగ్గరగా చూశాను.  మంచి రచనను చదవడం ఎంత ఉల్లాసంగా
ఉంటుందో , ఆ కథ వెనుక కథలు చదవడం, పరిశోధకుల అభిప్రాయాలూ, వారి
దృక్కోణాలూ ఇవన్నీ సాహిత్య సృజనను సమున్నతంగా నాముందు నిలబెట్టాయి.

స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?

లేదు.

జీవన నేపధ్యం?

విజయాలకు కష్టించే తత్వమే తప్ప దగ్గర మార్గాలుండవని నమ్మిన కుటుంబం.
పుట్టినింటా, మెట్టినింటా కూడా ఎక్కువశాతం ఉపాధ్యాయ వృత్తిలోని వారే.

సంగీతం పట్ల మీకు కేవలం అభిరుచేనా?నేర్చుకున్నారా?
 
కర్ణాటక సంగీతం నాలుగేళ్ళు నేర్చుకున్నాను – ప్రతి సారీ నేను ఇల్లు
మారడం లేదంటే టీచరుగారు ఊళ్ళు దాటి వెళ్ళడం – అందుకని ప్రస్తుతానికి ఓ
చిన్న విరామం. వీణలో వర్ణాల దాకా వచ్చాను. పాత సినిమాల్లో సావిత్రిలా వీణ
వైపు చూడకుండా అలవోకగా వాయించేయలని ఆశ. 🙂
 
ప్రింట్ లో వచ్చిన మీ రచనల వివరాలు అక్కడి అనుభవాలు చెప్పండి?
 
 నావి ప్రింట్‌లో రాలేదండీ; 2009లో కథానికల పోటీ పెట్టి వేదగిరి
కమ్యూనికేషన్స్ వాళ్ళు ఎంపిక చేసిన కథలతో ఓ సంకలనాన్ని తీసుకు వచ్చారు.
బాలకార్మికవ్యవస్థను కథావస్తువుగా తీసుకుని నేను వ్రాసిన కథ అందులో
కూర్చబడింది. అచ్చులో చూసుకున్న నా మొదటి కథ అదే. లోక్‌సత్తా టైంస్
పత్రికకు మాత్రం వ్యాసాలు వ్రాస్తూ ఉండేదాన్ని. సమాజం పట్ల ఎంతో బాధ్యతతో
సమయాన్ని శ్రమనూ వెచ్చించే ఎంతో  మంది వ్యక్తుల మధ్యలో ఉండగలడమనేది
జీవితానికి కొత్త ఉత్సాహాన్నిచ్చేది. బ్లాగ్స్‌లో వ్రాసినవే కొన్ని
వ్యాసాలు నమస్తే ఆంధ్రా పత్రిక వారు పునఃప్రచురించారు.అంతర్జాలంలో మాలిక, సుజనరంజని, కౌముది, హంసిని, నమస్తే ఆంధ్రా, వాకిలి,
కథాజగత్, హారం ఇలా కొన్ని పత్రికల్లోనూ వ్యాసాలు, కథలు, కవితలు
ప్రచురింపబడ్డాయి. అనుభవాలంటే…అందరు రచయితల మధ్య నా పేరు చూసుకోవడమే
మహదానందాన్ని ఇస్తుంది. కొందరితో పరిచయాలు మెయిల్ బాక్స్ దాకా
విస్తరించాయి – పుస్తకాల కబుర్లు, దాచిపెట్టుకోవాల్సిన చర్చలూ
బహుమతులయ్యాయి.
 
 ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
 
కళ్ళు కనపడినంతకాలమూ, చేతులు నొప్పెట్టనంతకాలం..నా వ్రాతలు నాకే తలనొప్పిగా మారనంతకాలం.సరదాగా ఏవైనా చెప్పండి?

ఓసారిలాగే ఫైనల్ ఇయర్‌లో కమ్యూనికేషన్ క్లాసులో మీరడిగినట్టే సరదాగానో
లేదా సీరియస్‌గానో రెండు నిముషాలు ఆపకుండా మాట్లాడమని అడిగారు . ఆ పాటి
ఆప్షన్ ఇచ్చినందుకు హమ్మయ్యా అనుకుంటూ స్టేజీ ఎక్కి, అప్పటికి మూడు గంటల
నుండీ బట్టీ కొడుతున్న ఓ జోకుని అనర్గళంగా చెప్పి క్రిందకు దిగిపోయాను.
చప్పట్లైతే మోగాయి కానీ, చెవులు రిక్కించి విన్నా సనసన్నని నవ్వులు కూడా
వినపడ్లేదు.
కుర్చీలో కూలబడ్డాక నా స్నేహితురాలు  ” మొహం చూడు కందగడ్డలా తయారైంది –
ఇంకో నిముషమాగితే ఏడుస్తావేమో అనుకున్నాం; ఇంద, మొహం తుడుచుకో ; ఎంచక్కా
ఏ బాపు బొమ్మలో గుర్తు తెచ్చుకుని జోకులు చెప్తే సరిపోయేది కాదూ.. ఈ
సీరియస్ కబుర్లు మనకెందుకూ! ”  అంటూ కర్చీఫ్ చేతిలో పెట్టింది.
 
సీరియస్ గా ఏవైనా చెప్పండి?
 
జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే జీవితం   పట్ల అపారమైన ప్రేమ కూడా
ఉండాలి. ఆ ప్రేమ అదాటున కలుగదు. ప్రతి క్షణాన్నీ, వెనక్కు తిరిగి
చూసుకుంటే పశ్చాత్తపపడనక్కర్లేని రీతిలో జీవించగలిగితే, నిన్నలన్నీ మధుర
స్మృతులగానూ, భవిష్యత్తంతా సాకారం కానున్న సుందర స్వప్నంలానూ కనపడతాయి.
 
ప్రయాణాల్లో – http://www.madhumanasam.in/2012/10/blog-post.htmlకవితల్లో    – http://www.madhumanasam.in/2010/05/blog-post.html

కథల్లో –  http://www.madhumanasam.in/2011/07/blog-post.html

ప్రకటనలు

35 thoughts on “‘ఆ ప్రేమ అదాటున కలగదు’ – మానస చామర్తి

 1. మానస గారు.. వ్యక్తిగతంగా మీ గురించి నాకు తెలియదు. కేవలం బ్లాగ్ ద్వారానే పరిచయం. మీ వ్రాతల్ని కాదు కాదు.. మీ భావాలని అమితంగా అభిమానించే నేను మీ గురించి నా అభిప్రాయం ఏదైతే వ్రాసానో.. మీ పరిచయ కార్యక్రమం కూడా అదే చెప్పింది.

  ఆఖరి ప్రశ్నకి మీరు ఇచ్చిన సమాధానం నాకు బాగా నచ్చింది. మీ కలం నుండి మంచి రచనలు మరిన్ని రావాలని పూర్తి స్థాయి రచయిత్రిగా మిమ్మల్ని చూడాలని నా ఆకాంక్ష.

  అభినందనలు.

  మీ అంతరంగం ని ఆవిష్కరించిన ఈ వాక్యాలు నాకు ఎంతో నచ్చాయి. మానస మనోసరోవరంలో వికసించిన భావ కుసుమాలు. ఇవి.
  “జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే జీవితం పట్ల అపారమైన ప్రేమ కూడా
  ఉండాలి. ఆ ప్రేమ అదాటున కలుగదు. ప్రతి క్షణాన్నీ, వెనక్కు తిరిగి
  చూసుకుంటే పశ్చాత్తపపడనక్కర్లేని రీతిలో జీవించగలిగితే, నిన్నలన్నీ మధుర
  స్మృతులగానూ, భవిష్యత్తంతా సాకారం కానున్న సుందర స్వప్నంలానూ కనపడతాయి.”

 2. మహిళాలోకం లో కి స్వాగతం మానస గారు, మీ బ్లాగ్ నేను ఎందుకు చూడను అని చూస్తే ఈ క్రింది వాక్యం అర్ధమే బాఘా తెలియదు.

  ” లతానెలతల నాలింగనం చేసుకున్న ముత్తెపు చినుకుల్లా – ”

  అసలు మీ పరిచయం title కూడా చాలా సింపుల్ & స్వీట్ గా ఉంది. హ్యాపీ బ్లాగ్గింగ్ అని మాత్రం చెప్పగలను. కాకుంటే మాక్కూడా అర్ధం అయ్యేవి కొన్ని వ్రాయండి అని మనవి 🙂

  btw నెలతలు అంటే ? 🙂

 3. ప్రసాద్ గారూ,
  “వాక్యాలలోనూ ఆలోచనలేని వట్టి ఉత్సాహమో, జీవం లేని వట్టి ఆలోచనో కనిపించవు”
  – Wow! ఎంత బాగా చెప్పారు!
  “అయితే ఆ సరళాభివ్యక్తి ఒక్కొక్కసారి ఆమె ప్రతిపాదించే లోతైన విషయాలను గురించి మరింత ఆలోచించే వ్యవధినివ్వకుండా”
  –Not so true ఏమో .For ex: పోయినవారం “చివరకు మిగిలేది ” గురించి వెతుక్కుంటూ వెళ్తే మానస గారు రాసిన ఆర్టికల్ ఒకటి కన్పించింది. దాంట్ళో బ్రెడ్తే కాదు, డెప్త్ కూడా ఉంది. (There was a lot there for me to pick and fight on 🙂
  బాగా ఎడిటింగ్ జరగాలి
  – True.

  పోతే, మీ మిగతా పేరాతో అంతా ఏకీభవిస్తున్నాను. Reading her is an enjoying experience.

  మానస గారు:
  పరిమితుల సెక్షన్ లో మీరు చెప్పిన రెండవ పాయింట్ చాలా నిజమైనది, విలువైనది. A very fine observation indeed.

  • * కుమార్‌గారూ – ధన్యవాదాలండీ! “చివరకు మిగిలేది” చదివారా? నేను మరీ ఎక్కువ రెఫరెన్సులు పెట్టుకోవడంతో ఆ వ్యాసం ఇప్పుడు నేనే తిరిగి చదువుకోలేనంత పెద్దదిగా మారిపోయింది. 🙂

 4. మల్లీశ్వరిగారూ – కానుకలంటే ఖంగారుగా మీ బ్లాగ్‌లోకి వచ్చిపడ్డాను. చాలా పెద్ద బహుమతిచ్చారు నాకు….థాంక్యూ…థాంక్యూ!

  వనజ గారూ, ప్రసాద్ గారూ, భాస్కర్ గారూ – మీ ముగ్గురికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మంచి మాటలు చదివాక, ఈ స్థాయిని నిలబట్టుకోవాలి సుమా అన్న ఆలోచన కూడా మెదిలింది. పుస్తకాలు ఎంపిక చేసి పెట్టడంలోనూ, పుస్తకాలు అందించి పెట్టడంతోనూ, వ్రాసిన ప్రతీసారీ నాలుగు ముక్కలు మాట్లాడడంతోనూ మీరంతా నాకిచ్చిన శక్తి నిజానికి వెలకట్టలేనిది.

  మల్లీశ్వరిగారు నాకా అవకాశమివ్వడానికే ఇలా ఆశ్చర్యపరచినట్టున్నారు. 🙂

  • మానసా..
   మీకు మరింత స్ఫూర్తినిచ్చేకానుకలు కదా…ఆస్వాదించండి…
   ప్రసాద్ గారి మాటల్లో చెప్పాలంటే మీ, నా, మానస గౌరవానికి భంగం కలగని రీతిలో ఆప్యాయంగా,
   అడిగిన వెంటనే రాసి పంపిన వనజగారికీ ప్రసాద్ గారికీ,భాస్కర్ గారికీ బ్లాగ్ ముఖంగా ధన్యవాదాలు…

 5. నేను ఏదైన బాగా నచ్చితే “నచ్చింది” అని చెప్తాను. మానసగారి బ్లాగు నాకు “చాలా చాలా నచ్చుతుంది”. ఆవిడ రాసే వ్యాసాల్లోని ప్రతీ వాక్యం ఒక కవితని చదువుతున్నట్టుగానే ఉంటుంది. – క్రాంతి.

 6. అభినందనలు మానసా .
  మీరు సీరియస్ గా చెప్పిన మాటలు నాకు చాలా నచ్చాయి.
  పరిమితుల్లో మీరు చెప్పిన రెండో పాయింట్ ముమ్మాటికీ నిజం .
  మరిన్ని మంచి రచనలు చేసి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూన్నాను

 7. >>జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే జీవితం పట్ల అపారమైన ప్రేమ కూడా
  ఉండాలి. ఆ ప్రేమ అదాటున కలుగదు. ప్రతి క్షణాన్నీ, వెనక్కు తిరిగి
  చూసుకుంటే పశ్చాత్తపపడనక్కర్లేని రీతిలో జీవించగలిగితే, నిన్నలన్నీ మధుర
  స్మృతులగానూ, భవిష్యత్తంతా సాకారం కానున్న సుందర స్వప్నంలానూ కనపడతాయి.>>
  అద్భుతం….వంద లైకులు. ఎన్ని వ్యక్తిత్వ వికాస తరగతులకు వెళ్ళినా దొరకని స్పూర్తివంతమైన మాట…KUDOS Manasa garu! ఇంటర్వ్యు బాగుంది.. అభినందనలు!

 8. మానసా..మీ భాష..భావ వ్యక్తీకరణా నాకు బాగా నచ్చుతాయి…ఆలోచనల్లో ఒక మెచ్యూరిటీ..ఏదో వ్రాయటం కోసం అన్నట్టు వ్రాయటం కాకుండా చాలా శ్రద్దగా..అందంగా వ్రాస్తారు..ఇది చాలా కొద్ది మందిలోనే చూసాను నేను.

  కవిత్వం గురించి నేను చెప్పలేను కానీ ..” ఆమె గనుక రచనా వ్యాసంగానికి మరింత సమయం కేటాయించగలిగితే, తెలుగు సాహితీలోకం గుర్తుంచుకోదగిన మరింత ఉన్నతమైన రచనలు చేయగల శక్తివంతురాలు మానస”..అన్న ప్రసాద్ గారి మాటలతో పూర్తిగా ఏకీభవిస్తాను.

  మరిన్ని మంచి మంచి వ్రాతలతో మీ లక్ష్యానికి చేరువ కావాలని కోరుకుంటున్నాను.

 9. చాలా బావుంది మానస. మీ మాటలు,వాక్యాలు చిన్నప్పుడు గూట్లో దాచుకున్న రిబ్బన్ల లాగ, నోట్సు పుస్తకం మీద అంటించుకున్న లేబుళ్ళ లాగా, అమ్మ కి తెలియకుండా నాన్నగారు దాచిపెట్టి ఇచ్చిన క్రీం బిస్కెట్టు లాగ ఆప్యాయంగా, మధురంగా ఉంటాయి.

 10. మానస గారూ, మీ పరిచయం బాగుంది. జాజిమల్లిగారికీ, మీకూ ధన్యవాదములు.

  ఈ రోజుల్లో ‘వ్యావహారికమైన తెలుగు ‘ అంటే సగం ఆంగ్లం, పావు హిందీ, ఇంకో పావు తెలుగులా అయిపోయింది. మీరు ‘మీ వ్యావహారికం’ లోనే వ్రాస్తూ స్వఛ్చమైన తెలుగుకు చిరునామాగా మీ బ్లాగును ఉండనివ్వండి. 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s