మదిని ఊరించే కొత్తావకాయ

 
బ్లాగర్ పేరు; కొత్తావకాయ (కలంపేరు)
 
బ్లాగ్ పేరు; కొత్తావకాయ, పిట్టకథలు
 
బ్లాగ్ చిరునామా;  http://kothavakaya.blogspot.com/
                      http://www.pittakathalu.blogspot.com/
 
పుట్టిన తేదీ; నవంబర్ 14
 
పుట్టిన స్థలం; విజయనగరం
 
ప్రస్తుత నివాసం; అమెరికా
 
చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)
 
విద్యాభ్యాసం; యే వేదంబు పఠించె లూత? బోధావిర్భావనిధానముల్ చదువులయ్యా ? కావు!
 
వృత్తి, వ్యాపకాలు; గృహిణి; చదవడం, రాయడం, తరంగా రేడియోలో సాహిత్యకార్యక్రమం నిర్వహణ
 
బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ; 7 August 2008
 
బ్లాగ్ లోని కేటగిరీలు; కథలు, పాటకు పదాల పల్లకీ, రేపల్లెలో జరిగిన కథ, శృంగార నాయికలు.. ఇవి కొన్ని. ఒక కేటగిరీకి అందనివే చాలా.
 

బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?

 2007 లో ఒక స్నేహితురాలి ద్వారా తెలిసింది. ఇంటర్ నెట్ లో తెలుగులో రాసేవారూ, చదివేవారూ ఉన్నారని. మనకు తోచినది రాసుకునే అవకాశం కూడా ఉందనీ..
 
బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?
 
బ్లాగింగ్ మొదలుపెట్టిన కొత్తల్లో మాయాదర్పణంలోంచి దూకేసి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతే బావుండుననిపించే చిన్నప్పటి కల తీరినట్టనిపించేది. కాస్త కాలూనాక మరో రకం.. ఆఫీస్ కి వెళ్ళి పని చేసుకొచ్చినంత సీరియస్ గా రాయడం. ఇక ఏం రాస్తున్నానో అర్ధమయ్యాక రాసిన ప్రతీ అక్షరాన్నీ తూకం వేసుకుంటూ.. ఒక క్షణం పొంగు, మరో క్షణం కుంగు..
 
బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?
 
అచ్చులో మన అక్షరాలు చూసుకోవాలనే కండూతి తీరిపోతుంది. మనమే పబ్లిషర్స్! పరిమితులు.. ఉహూ.. నా వరకూ నాకే పరిమితుల వేటూ పడలేదు.
 
మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?
 
“మహిళా” బ్లాగర్ గా మీరు గుర్తించడమే అనుకుంటా! ఇక బ్లాగర్ గా నా ప్రత్యేకత  “కొత్తావకాయ” రుచి చూస్తే తెలుస్తుంది. 🙂
 
సాహిత్యంతో మీ పరిచయం?
 
మా తాతలు నేతులు తాగారండీ. నా అదృష్టం! ఇంకా మా మూతులు గుబాళిస్తూనే ఉన్నాయి. ఉభయభాషాప్రవీణులు మా తాతగారు. డొక్క శుధ్ది కలిగేలా స్త్రోత్రాలు, శ్లోకాలు వల్లె వేయించారు. ఇవి చదివితే దేవుడు దిగివస్తాడని ఎప్పుడూ చెప్పలేదు. “ఆహ్లాదంగా ఉంటుంది చూడు..” అని రుచి చూపించారు. అది మొదలూ దొరికినది దొరికినట్టు చదివాను. అంతే. భాగవతం దశమ స్కంధం, ముకుందమాల, ఆదిత్యహృదయం, దేవులపల్లి “తిరుప్పావై”.. ఇవే నా సాహిత్యాభిలాషకి తొలిమెట్లు.
 
స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?
 
లేదండీ. “మహిళను కనుక ఇది రాయగలనా, లేదా రాయవచ్చా?” అని ఆలోచించే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. బహుశా చదివేటప్పుడు నాకు అలాంటి భేదం లేకపోవడం వల్లనుకుంటా. చదివేందుకైనా, రాసేందుకైనా పరిమితులను కానీ, లింగవివక్ష ని కానీ “అక్షరాలు” విధించవు, చూపించవూ కదండీ. ఒకవేళ ఎవరైనా విధించినా వాళ్ళేం వాగనుశాసనులు కాదు కదూ! నేను పట్టించుకోను.
 
జీవన నేపధ్యం?
 
అందరిలాగే పుట్టి పెరిగానండీ. అందరు అమ్మల్లాగే ఓ అమ్మని.
 
ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
 
బ్లాగర్ పెయిడ్ సైట్ కానంత వరకూ
 
ప్రాచీన ఆధునిక సాహిత్యాలలో మీ పై ఎక్కువ ప్రభావాన్ని చూపినది ఏది?
 
అలా చెప్పడం కష్టమేనండీ. వాల్మీకితో పోలిస్తే పోతన ఆధునికుడే కదా. పోతనతో పోల్చి మల్లాది వారిని ఆధునికులనలేను. మల్లాది రామకృష్ణశాస్త్రిగారి అక్షరాలూ కదిలించాయి. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసినవి చదివీ ఆస్వాదించాను, నేర్చుకున్నాను. కొత్తాపాతల మేలు సారాన్ని ఆకళింపుచేసుకోగలిగితే ధన్యురాలిని.
 
ఇజీనారం విశేషాలు ఏవైనా చెప్పండి?
 
ఇంత దూరమొచ్చేసాక “మీది విజయనగరమా! గురజాడ వారి ఊరు? సంగీతం నేర్చుకున్నారా మరీ?” అని ఎవరైనా అడిగితే చిత్రంగా, కొంచెం సిగ్గుగా ఉంటుంది. అక్కడున్నన్నాళ్ళూ మాది గొప్ప ఊరు అనే స్పృహలేకుండా తిరిగాను, ఊరిని నాదనుకుని అనుభవించాను. ఇక్కడికి వచ్చాక ఆ నేల గొప్ప తెలిసి, “మా ఊరు” అని గొప్ప చెప్పుకునే ముందు నాకు అర్హత ఉందా అనే ఆలోచన వస్తూంటుంది. “అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ..” అన్నది అన్నివేళలా నిజం కాదండీ. “విజయనగరం” పేరు పాడు చేయకుండా ఉంటే చాలనిపిస్తుందిప్పుడు.అయ్యకోనేరుకి అతి సమీపంలో మా ఇల్లుండేది. ప్రతి ఉదయం బొంకుల దిబ్బ దాటే వెళ్ళేదాన్ని. కోటలో ఎన్నివందల సార్లు తిరిగి ఉంటానో! గురజాడ స్మారక గ్రంధాలయం గుమ్మంలో జరిగే పుస్తకప్రదర్శనలో నా సొంత తొలి పుస్తకాలు – చలం గీతాంజలి, ఎంకిపాటలు కొనుక్కున్నాను. ఏటేటా సిరిమాను సంబరాలు మైమరచిపోయి చూసి, మర్నాడు ఉదయం స్కూల్ కి వెళ్ళినప్పుడు కోవెల బయట నిలిపి ఉన్న మాను నుండి పేళ్ళు చెక్కుకుని తీసుకుని పుస్తకాల్లో పెట్టుకునే వాళ్ళం “మంచి జరుగుతుందని..!” ఇలా వందలు… కేవలం మా ఇజీనారంలో నా విశేషాలు. విజయనగరం విశేషాలు నేను చెప్పేదేముందండీ. సూర్యుడికి దివిటీ పట్టాలా?
 
సరదాగా ఏవైనా చెప్పండి?
 
రోజుకి ఇరవైఅయిదు గంటలుంటే బావుంటుంది. చదవాలనుకుని కొనిపెట్టుకున్న పుస్తకాలన్నీ రోజూ ఆ అదనపుగంటలో చదివేసుకుంటా.
 
సీరియస్ గా ఏవైనా చెప్పండి?

 
స్వాధీనే మాధుర్యే
మధురాక్షర సంహితేషు వాక్యేషు
కిం నామ సత్త్వవన్తః
పురుషాః పరుషాణి భాషన్తే॥

తీయదనం తమవశమై ఉండగా, తీయని పలుకులు తమకు లొంగి ఉండగా బుధ్దిమంతులు పరుషాలెందుకు పలుకుతారో!
ఇన్ని అందమైన పదాలుండగా వాటిని విడిచిపెట్టి కఠినమైన మాటలు మాట్లాడడమెందుకు? మాట్లాడేటపుడైనా, రాసేటపుడైనా “better word”  వెతుక్కుంటే చాలు. మాట, రాత కూడా అందంగా ఉంటుంది.

నా బ్లాగ్ పోస్ట్ లలో ఒకటి : “చినచేప”

 

ప్రకటనలు

43 thoughts on “మదిని ఊరించే కొత్తావకాయ

 1. ధీమ్మున పౌరాణిక
  హేమపు జలతారు దెచ్చి , హృదయంగమమౌ
  ‘ గ్రామీణ తెల్గు పద సుమ
  దామము ‘ కొత్తావకాయ తానల్లె నహో !

  రేపల్లె కధల యందున
  నాపయి శృంగార నాయి కాళి రచనలన్
  దీపించి తెల్గు తేనియ
  తీపులతో తెల్గు నేల తృప్తిం గాంచెన్

 2. బ్లాగులోకంలోకి వచ్చేదాకా నేనెప్పుడూ విరజాజుల తోటలోకి అడుగు పెట్టలేదు…కొత్తావకాయ గారు ఆ లోటు తీర్చారు.
  ఒక ఆశ్చర్యం..అద్భుతం..అంతే. అంతకంటే చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు.

 3. కొత్తావకాయ గారు మీ రచనల గురించి…జస్ట్…ఊహూ…నేనేమీ అనను. అంతే.ఏం మాట్లాడినా అది తక్కువే. ఎంత చక్కగా చెప్పారండి ఇజీనగరం కబుర్లు.
  జాజిమల్లి గారు మీ గురించి కూడా నేనేం మాట్లాడను. అంతే:)మాధుర్యం పెంచేసారు.

 4. అచ్చు వేసి ఒక పుస్తకంతో సమానంగా దాచుకోదగ్గ టపాలు ‘కొత్తావకాయ’ గారి సొంతం.
  రుచి చుసిన వారెవ్వరూ మరల మరల రాక మానరు.
  డైటింగ్ చెద్దామనుకొనేవారు ఈ బ్లాగు చదివితే చాలా ప్రమాదం.రకరకాల రుచులతో ఊరించేసీ పచ్చి దుంపలు తినే ఋషీశ్వరులు కూడా ఈ బ్లాగు చదివితే తపస్సు గిపస్సు పక్కన పెట్టేసి కొత్తవకాయ రుచులు ఆస్వాదించేస్తారు ..
  మనసు అశాంతిగా ఉన్నప్పుడు సదరు బ్లాగు టపాలు చదివితే జీవితం అందంగా కనిపిస్తుంది..:))

 5. ధీమమ్మున పౌరాణిక
  హేమపు జలతారు దెచ్చి , హృదయంగమమౌ
  ‘ గ్రామీణ తెల్గు పద సుమ
  దామము ‘ కొత్తావకాయ తానల్లె నహో !

  రేపల్లె కధల తోనూ ,
  ఆపయి శృంగార నాయి కాళి రచనలన్
  దీపించి తెల్గు తేనియ
  తీపులతో తెల్గు నేల తృప్తిం గాంచెన్

 6. ఈ కొత్తావకాయ ఎవరండీ ? ఇంత దాకా ఎప్పుడూ ‘విన్నట్టు’ లేదే ?

  మాకు ఓ ‘పాత ఆవకాయ’ తెలుసు. బ్లాగ్ లోకం లో వారి ఆవకాయ రుచి ఓహ్ మల్లాది గారి కాలాన్ని , e-కాలం లో గుర్తుకు తెస్తూంటూంది.!

  శుభాకాంక్షలు కొత్తావకాయ గారూ… మీదీ ఇజీ’నగార’ మే ! (అహా సౌమ్య గారి లాగన్న మాట!)

  చీర్స్
  జిలేబి.

 7. వావ్ !

  “ఉప్పెంతో కారం అంత, కారం ఎంతో ఆవపిండి అంత,అవన్నీ ఎంతో నూనె అంత. ఆవకాయంటే ఇంతే”
  అలా
  ఆవిడ బ్లాగెంతో ఇంటర్వ్యూ అంత , ఇంటర్వ్యూ ఎంతో కామెంట్లు అంత , అవన్నీ ఎంతో ఆవిడ అంత . నాకామెంట్ ఇంతే !!

 8. జాజిమల్లి పరిచయం చేస్తోన్న బ్లాగర్లు, వారి బ్లాగులు చాల మటుకు నాకు కొత్త. దాదాపుగా చదవలేదనే చెప్పాలి. నా మటుకు వనజ వనమాలి సమాధానాలు చదివిన తర్వాత “కొత్తావకాయ” చప్పగా అనిపించింది…నా మనసులో మాట చెప్పాలంటే “మా తాతలు నేతులు తాగారండీ. నా అదృష్టం! ఇంకా మా మూతులు గుబాళిస్తూనే ఉన్నాయి” అన్నప్పుడు …సంబడం అనుకున్నా..మిత్రుడు కొత్తపాళీ “బ్రిలియంట్ ” అన్న తర్వాత ఆలోచనలో పడ్డాను… ఏమో ఒకటి రెండు టపాలు చదివితే పరిచయంలో తగలని కొత్తావకాయ కారం తగులుతుందేమో

  • ఆనంద్,
   అలా పోల్చకూడదేమో అనిపిస్తుంది నాకు…పోలికలు పోటీలు ఈ సీరీస్ లో రాకూడదన్నదే నా ఆకాంక్ష.బ్లాగర్లందరూ ఒకేలా ఉండరు, రాయరు…ఇప్పటివరకూ తమ పరిచయాలు చెప్పిన వారంతా చాలా చక్కగా రాసారు…కొత్తావకాయ అయితే అల్పాక్షరాల్లో అనల్పార్ధ రచన మాదిరిగా షార్ప్ గా చెప్పారనిపించింది.పోనీ మీరేమైనా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్ట్టండి.

  • ఆనంద్ గారు,
   వరుసగా ఉండడం వల్ల మీరు పోల్చుకున్నారేమో. ఇలా మీలాంటి తెలియని వారికోసమే ఈ మహిళా బ్లాగు పరిచయాలు. ఇవి రచనలు కావు .

 9. కొత్తావకాయ గారి బ్లాగు గానీ, తరంగ రేడియో లో వారి కార్యక్రమం కానీ, చూశాకా, ఆవిడకి భాష మీదున్న పట్టు, అంతకి మించి సాహిత్యం మీద మమకారాలని చూసి ఆశ్చర్యానందాలననుభవించని వారు బహుశా బహుతక్కువ. నాకు వారి బ్లాగు లో బాగా నచ్చిన సిరీస్.. కాత్యాయినీ వ్రతం. చాలా చాలా చక్కటి కథనం. రేపల్లె లోకి ప్రతిరోజూ ఉదయం తీసుకెళ్లి మళ్లీ వెనక్కి దించేవారు. .ప్రింట్ అవుట్ తీసి అమ్మ,నాన్నలకి కానుక గా ఇచ్చాను.
  కొత్తావకాయ గారు,.. keep going!

 10. కొత్తావకాయ గారు.. మీ పేరు నాకు తెలుసు అయినా ..సంభోధించడానికి మీకు అభ్యంతరం ఏమో అని బలవంతంగా ఆపుకున్నాను.:)

  మీ పరిచయం సింపుల్ గా మీలా ఉంది. మీ బ్లాగ్ మాత్రం చాలా ఘనం . తరంగ లో మీరు నిర్వహిస్తున్న కార్యక్రమం వింటున్నాను.

  సాహిత్యం పట్ల మక్కువ కల్గిన నేను మీ బ్లాగ్ తరచూ చదవలేకపోవడం లోపం కూడా. తీరిక సమయాలు ఉంటే నేను చదవాల్సిన పుస్తకం ఉంటే ఆది .. మీ బ్లాగ్.

  మీ సాహిత్య అభిలాష కి మీ ప్రతిభావంతమైన శైలికి అభినందనలు.

  • వనజ గారు, 🙂 ఓపెన్ సీక్రెట్ కదండీ. దాన్నలాగే ఉండనిద్దాం.
   సమయం చిక్కకపోవడం అనే సమస్య నాకు తెలుసండీ. నా వరకూ నేను హడావిడి పరుగుల్లో ఏ ఫోన్లోనో చదివేసి పక్కన పెట్టాల్సి వస్తుంది. మీ స్పందనకు ధన్యవాదాలు!

 11. కొత్తావకాయ గారి ఏ టపా చదివినా, నాకు ఒకటే ప్రశ్న ఆవిడ ను అడగాలనిపిస్తుంది, “మీరు ఇంత బాగా ఎలా రాయగలుగుతారండీ?”. ఈ ఇంటర్వ్యూ లో ఆ ప్రశ్న కు సమాధానం దొరికింది.

 12. పరిచయాల మీద (టపాల మీద కాదు) నా అనుభూతిని ముసుగు వేయకుండా మీ ముందుంచాను అంతే.
  నల్లక్షరాలను గుప్పెళ్ళతో విసిరి పాఠకులకు 3డి లో రంగుల ప్రపంచాన్ని చూపించే ఇంద్రజాలికులకు నేను పోటీ పెట్టటమే!! మీ ప్రత్యుత్తరాలకు ధన్యుణ్ణి

 13. కొత్తావకాయ పేరు పరిచయమే కానీ బ్లాగు చదవలేదు ఎందుకో ఇన్నాళ్ళూ. ఇలా తెలియనివి ఇంకెన్ని ఉన్నాయో మరి.
  మంచి నిధి దొరికింది. ఒకటొకటే టపాలు చదువుతున్నాను. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కొత్తావకాయ గారికి అభినందనలు.

 14. కొత్తావకాయ గారి బ్లాగు గురించి చెప్పాలంటే భావుకత, హాస్యం ఈ రెండూ ముందుగా గుర్తొస్తాయి. ఆమె భాషకు , ఆమె భావాలకు అభిమానిని. మనసు తలుపు తట్టే ఆ రాతల ధోరణి మరీ ఇష్టం. ఆలోచనలను వ్యక్తం చేసే తీరులో ఆమె కనబరిచే ప్రజ్ఞ చూసి ‘ దాసోహం’ అనడం తప్ప ఇంకో మాట రాదు. ఆమె స్నేహం ఒక అదృష్టం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s