కృష్ణ ‘ప్రియమైన బ్లాగర్’

me_at_39 
 
 
బ్లాగర్ పేరు; కృష్ణప్రియ
 
బ్లాగ్ పేరు; కృష్ణప్రియ డైరీ
 
బ్లాగ్ చిరునామా; krishna-diary.blogspot.in
 
పుట్టిన తేదీ;17.07.72
 
పుట్టిన స్థలం; రంగాపురం, ఆంధ్రప్రదేశ్.
 
ప్రస్తుత నివాసం;బెంగుళూరు.
 
చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)
 
వృత్తి, వ్యాపకాలు; సాఫ్ట్ వేర్ ఇంజనీర్.
 
బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ; 17.04.2010
 
మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి); 91
 
బ్లాగ్ లోని కేటగిరీలు;అనుభవాలు, అనుభూతులు, గేటెడ్ కమ్యూనిటీ కథలు, నేటి స్త్రీగా, పిల్లలు, పుస్తకాలు, సమాజం, సాఫ్ట్వేర్ కంపెనీ కబుర్లు, పుస్తకాలు, సినిమాలు, ఊసుబోక కబుర్లు, మనస్తత్వాలు, విశిష్ఠ వ్యక్తులు, ప్రయాణాలు, హాస్యం, సరదా, ఇంకా అన్నీనూ
 
బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?
 
2010 లో, ఒక స్నేహితురాలి తమిళ బ్లాగు చూసి.
 
బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?
 
నేను మంచి నారేటర్నని నాకు తెలుసు. కానీ నాలో రాసే ఒక కళ అంటూ కొద్దిగా ఉందని బ్లాగు మొదలు పెట్టాకే అర్థమైంది. ఇదివరకు ఎప్పుడూ రాసింది లేదు.
బ్లాగింగ్ నాకు ఒక గుర్తింపు తెచ్చి పెట్టింది. నేను రాసేవి చదివి ఆస్వాదించగలిగే వాళ్ళున్నారని చూసి ఒక చిన్న గర్వం తెచ్చిపెట్టింది. ఒకరిద్దరు మంచి స్నేహితులని తెచ్చిపెట్టింది. నా ఆలోచనా పరిథి ని పెంచింది.  నాలో ఉన్న కొన్ని బలహీనతలు తెలుసుకోగలిగాను.  పత్రికల్లో నా పేరు చూసుకోగలిగాను.
మొదట్లో నేనొక గొప్ప దానిలా ఈ ప్రపంచం లో మనుషులని నా పాత్రలు చేసుకుని రాస్తూ ఉండేదాన్ని.   రోజులు గడుస్తున్నకొద్దీ నా గురించి అంతా, నా అభిప్రాయాల గురించీ అన్నీ రాయకపోవచ్చు కానీ రాసినంత వరకూ  నా బ్లాగు పోస్టుల్లో నిజాయితీ పాలు రాను రాను ఎక్కువవుతుందని నేనే గమనిస్తున్నాను.
 
బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు? పరిమితులు?
 
పత్రికల్లో రాయాలంటే అదొక పెద్ద ప్రాసెస్. వాళ్లకి నచ్చినట్లు గానే రాయగలగాలి. అలాగే మనకి బాగా తెలిసినవారికి మన అభిరుచులు నచ్చకపోవచ్చు. మనకే సిగ్గు గా అనిపించవచ్చు. కానీ బ్లాగు ద్వారా (అసభ్యం, అశ్లీలం, అభ్యంతరకరం కానంతవరకూ) కేవలం మనకి ఇష్టం వచ్చినట్లు రాయచ్చు.. ఇది కథ, కవిత, నవల, వ్యాసం లాంటి ఏ క్లాసిఫికేషన్ కీ చెందని రచనలు చేయచ్చు. కాకపోతే మన రచనలు అందరికీ చేరకపోవచ్చు.
రాసినది ఎంత మంది చదివారు చదివిన వారేమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. అది నిజంగా ఆన్ లైన్ రాతలకి ఉన్న అడ్వాంటేజ్.  statscounter website లాంటి వాటి ద్వారా, మన రచన చదవడం ఆరంభించి నచ్చక వెంటనే పేజీ మార్చేసారా అని కూడా తెలియడం మన రచన ఎలా అందరికీ అనిపించిందో తెలుసుకోవచ్చు.
  ఇక పరిమితులంటే.. కొన్ని రకాల పోస్టులు (నేననే అని కాదు) రాసినప్పుడు బ్లాగుల్లో తీవ్ర నిరసన రావడం చూశాను. దానివల్ల చాలా మంది దాదాపు ఒకేరకంగా రాయడం గమనించాను. కానీ నిరసన వచ్చింది కదా అని రాయడం మానేస్తే,.లేదా ఒకేరకం గా రాసి చదివే వాళ్లని మెప్పించాలనుకోవడం బ్లాగు రచయిత కున్న బలహీనతే అని నేను నమ్ముతాను. దానికి నేనూ అతీతురాలిని కాను.  పరిమితి అన్నది బ్లాగరు తమకు తాము వారి సెన్సిటివిటీ బట్టి విధించుకున్నదే.
ఇక బ్లాగు లో రాసినప్పుడు కామెంట్ల కి వచ్చే కిక్ ఏంటో అనుభవించిన దానిగా ఒకటి చెప్పగలను. బ్లాగర్ డాష్బోర్డ్ తెరిచినప్పుడు ఎర్ర రంగు లో ఇన్ని కామెంట్లు మీ మాడరేషన్ కోసం ఎదురు చూస్తున్నాయి అని చూసినప్పుడు కలిగే ఆనందానికి విలువ కట్టలేను. ఒక్కోసారి ఆ ఆనందం కోసం రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి.  అలాగే ఒక్కోసారి తీవ్ర విమర్శ లతో కూడిన కామెంట్లవలన రాసేందుకు చిన్నపాటి తాత్కాలిక విరక్తి కూడా కలగడం నాకు జరిగింది.
ఒక్కోసారి ఎలా రాస్తే చదువరులకి నచ్చుతుందో రాయడం చేశాను. అలాగే ఏ సమయం లో పోస్ట్ చేస్తే ఎక్కువ మంది చదువుతారో అర్థమయి అదే విధం గా ప్రచురించడం కూడా కొంత కాలం చేశాను. (ఉదా: వారాంతాల్లో ప్రచురిస్తే తక్కువ మంది చదువుతారు.. అలాగ).  కానీ నెమ్మది గా ఆ పిచ్చి నాకు తగ్గుతోందని కూడా గమనించాను. ఈమధ్య నాకు వీలైనప్పుడు, వీలైనట్లు రాస్తున్నాను.
 
మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?
 
నన్ను నేను కేవలం బ్లాగర్ గా గుర్తించుకుంటాను. ‘మహిళా’ బ్లాగర్ని నేను అని ఎప్పుడూ అనుకోలేదు..
 
సాహిత్యంతో మీ పరిచయం?
 
చిన్నప్పుడు చందమామల నుండీ, ఇప్పటిదాకా ఏది దొరికితే అది చదువుతాను. ఒక్కోసారి ఎక్కువగా చదివితే,  ఒక్కోసారి నెలల తరబడి  ఒక్క పుస్తకం కూడా చదవను.,
చిన్నప్పుడు ఎక్కువగా తెలుగు, తర్వాత చాలా ఏళ్లు (దాదాపు పదేళ్లు) పూర్తిగా ఆంగ్లం లో సాహిత్యం చదివాను. ఇప్పుడు మళ్లీ తెలుగు చదువుతున్నాను.
మిథలాజికల్/హిందూ మతం లో పుస్తకాలు, ఫిలాసఫీ మీద వచ్చిన పుస్తకాలు సరళమైన భాష లో ఉంటే దొరికితే తప్పక చదువుతాను.  ఇతర మతాలకి సంబంధించినవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను. కురాన్, బైబిల్ సంక్షిప్త వర్షన్లు చదివాను. మహా భారతం మీద /పాత్రల మీద వచ్చిన ఏ కథైనా, చదువుతాను.
శ్రీపాద, మధురాంతకం, భరాగో, కొ.కు.  అడవి బాపిరాజు ఇలాగ దాదాపు పాత తరం రచయితల వర్క్  బాగా చదివాను.
యండమూరి, మల్లాది, యద్దనపూడి, కోడూరి కౌసల్యా, దాదాపు వాళ్లు రాసినవన్నీ చదివేశాను.  స్త్రీవాద రచయితల రచనలు కూడా చదువుతాను. (ఓల్గా, P. సత్యవతి.. ఇలాగ)
బ్లాగుల్లోకి వచ్చాకా గమనించాను. సాహిత్యం చదివేడప్పుడు ఒక ‘ఇజం’ కి సంబంధించినవి చదివేవారు వేరే ఇజాల పుస్తకాలు ఇష్టపడరని.  నావరకూ విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం నెమ్మదిగా ఆస్వాదిస్తూ,ఇష్టపడి  చదువుతాను. వేయిపడగలు మూడు సార్లు చదివాను. మళ్లీ కూడా బహుశా చదువుతాను. అలాగే  రంగనాయకమ్మ రచనలూ ఇష్టం గానే చదువుతాను. ఇప్పుడు పాత సంస్కృత కావ్యాలు కొన్ని చదువుతున్నాను. ఇదివరకు చలం పుస్తకాలు ఎప్పుడూ చదవలేదు. మొన్నీమధ్య ఆయన సాహిత్యం చదవడం మొదలు పెట్టాను. 
కొత్తగా రాసే వాళ్లు ఏం రాసినా ఓసారి చదవడానికి తప్పక ప్రయత్నిస్తాను.  పద్యాలు, కవితలు ఎందుకో చదవాలనిపించదు. అలాగే జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీ ల్లాంటివి కూడా చదవను.
 
స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?
 
 
చేతినిండా ఎప్పుడూ పని ఉండటం వల్ల తప్ప, స్త్రీ అవడం వల్ల  నాకేమీ ప్రత్యేకమైన ఇబ్బందులు ఎదురవ్వలేదు. ఒక సీక్రెట్:  కృష్ణప్రియ డైరీ  బ్లాగర్ గా ఒక్క చిన్న చెత్త కామెంట్ కూడా నాకు రాలేదు. Not even one single sick comment!  మీకు తెలిసిందే కదా.. నా బ్లాగు పోస్టులు చాలా పెద్దవి గా ఉంటాయి. పారాగ్రాఫ్ దాటని కబుర్ల కోసం  వేరే బ్లాగు కొన్నాళ్లు నడిపి వదిలేశాను. ఆ బ్లాగు లో మాత్రం చాలా చెత్త /వెక్కిరింపు కామెంట్లు వరదలా వస్తూనే ఉండేవి.
 
జీవన నేపధ్యం?
 
కుటుంబ మూలాలు  ఆర్థికం గా మధ్యతరగతి నుంచే.  ఇక ఇప్పుడు ఎగువ మధ్యతరగతికి చేరిన కుటుంబం మాది. తల్లిదండ్రుల కి పుస్తకాల పిచ్చి ఉండేది. మా నాన్నగారు తెలుగు,ఉర్దూ,సంస్కృతం, ఆంగ్ల నిఘంటువుల మధ్య రిటైర్మెంట్ జీవితం గడిపేస్తున్నారు. నాది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం.  పిల్లలూ, మా వారూ, మిగిలిన కుటుంబం, మొక్కలూ, సంగీతం, సాహిత్యం, సినిమాలూ, యాత్రలూ, చుట్టాలూ, స్నేహితులూ, చుట్టు పక్కలవారితో కబుర్లు.. అంతే.
 
ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
 
చేతనైనంత వరకూ రాద్దామనే.
 
సరదాగా ఏవైనా చెప్పండి?
 
సరదాగానా? మీరలా అడిగేస్తే.. మెదడంతా బ్లాంక్ అయిపోయింది. నా బ్లాగు లో ‘సరదాగా’ లేబుల్ తో ఉన్న టపాలు చదవాల్సిందే. J
 
సీరియస్ గా ఏవైనా చెప్పండి?
 
జీవితం లో ఎంత పరిగెత్తినా, ఎంత పై ఎత్తుకి ఎగిరినా, నేలని మర్చిపోకూడదు. ఊపిరి సలపనంత పరుగునీ, ఒంటరిదనాన్నీ, బోర్ డం నీ కూడా సమానం గా ఆస్వాదించగలగాలి. ఎంత బిజీ గా ఉన్నా, రోజూ సూర్యోదయాన్నో, సూర్యాస్థమయాన్నో అదీ కుదరకపోతే కనీసం చంద్రుడినో, ఆయనా ఆకాశం లోకి రాకపోతే తారల్నో, మబ్బుల్నో, అథమపక్షం ఆకాశాన్నయినా ఒక నిమిషానికైనా చూడాలి. ఇంట్లో చిన్న మెంతి మొక్కనైనా పెంచుకోవాలి. రోజులో ఒక్కరిద్దరి ముఖాల పైన , చిరునవ్వు తెప్పించగలగాలి.  నాలుగంట్లైనా తోమాలి, రెండు పేజీలైనా ఏదో ఒకటి చదవాలి. బాత్ రూమ్ లోనైనా ఓ పాట పాడుకో గలగాలి. J
 
 గేటెడ్ కమ్యూనిటీ కధలు తెలుగు సాహిత్యంలో రికార్డ్ కాలేదు…అందులోనూ స్త్రీల దృష్టి నుంచి…అట్లా రాయడం వెనుక ప్రేరణ ఏంటి?
 
పైన చెప్పినట్లు ఒక స్త్రీ గా రాయలేదు. మామూలు పరిశీలకురాలి గా రాశాను.  దీనికి ప్రేరణ..యెర్రం శెట్టి సాయి గారి అపార్ట్ మెంటాలజీ. నా చిన్నదనం లో ఏదో పత్రిక లో వస్తూండేది.  అపార్ట్ మెంట్ సంస్కృతి వచ్చిన కొత్తల్లో ఆయన రాసిన సిరీస్.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకి దక్షిణాది లో బాగా జోరు గా ఉన్నందువల్ల మినీ ఇండియా ల్లా ఉన్న ఈ తరహా గేటెడ్ కమ్యూనిటీల లో, గ్లోబలైజేషన్ పుణ్యమాని ఇప్పుడిప్పుడే, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాల్లోకి ఎగబాకిన మనుషుల తీరుతెన్నులు నన్ను విశేషం గా ఆకట్టుకుని ఆలోచింప చేశాయి. ఇప్పటికీ నిజానికి సమయాభావం తో లోతుగా రాయడం మొదలు పెట్టలేదు. నెమ్మదిగా ఇంకా డీప్ టాపిక్కుల తో ఈ సిరీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని  ఒక ఆలోచన ఉంది.  ఇంకా సోమరాజు సుశీల గారి వర్క్ చదువుతుంటే అలాగ రాయాలని నాకు చాలా ఉండేది. ఇంకా వైవిధ్యంగా బాగా రాయాలని తపన గా ఉంటుంది..
 
 ప్యూర్ హ్యూమర్ రాయడం కష్టమంటారు అంత అలవోకగా రాయగలిగే శైలి ఎలా పట్టుబడింది?
 
ముందుగా హాస్యం  ‘అలవోకగా’ రాస్తున్నానన్నారు. ధన్యవాదాలు. I am thrilled J  సహజం గా నేను హాస్య ప్రియురాలిని. మా అమ్మ చాలా మంచి కథకురాలు. తన చిన్నప్పడి సంఘటనలు కథలు కథలు గా చెప్తుంటే, ఆ కాలం లో మేమెందుకు పుట్టలేదా అని బాధ గా ఉండేది. మా బాబాయి చుట్టూ జనాలు చేరితే నవ్వని వాడు పాపి.. అన్నట్టుండేది. అవే జోకులు మళ్లీ మేము చెప్తే అన్ని నవ్వులొలికేవి కావు. ఆయన్ను పరిశీలిస్తూ కొద్దిగా నేర్చుకున్నాను. తర్వాత నవ్వించే వాళ్లు మాట్లాడుతున్నప్పుడు వాళ్ల టెక్నిక్ ని గమనించేదాన్ని. american sitcoms, Isaac Asimov’s book of humor వల్ల చాలా ఎన్హాన్స్ అయింది J
ఒక్కొక్కరి హాస్యం లొ ఒక్కో ఫ్లేవర్ ఉంటుంది కదా? కొందరు పదాల విరుపు తో హాస్యం పండిస్తే, ఇంకొకరు బాడీ లాగ్వేజ్ తో మెప్పిస్తారు. కొందరు కథ బిల్డ్ చేసి శిఖరాగ్రానికి తీసుకెళ్లి ఒక్కసారి గా ఫ్రీ ఫాల్ చేయిస్తారు. కొందరు అతి సీరియస్ గా మాట్లాడుతూ అవతల వారిని నవ్వులలో దొర్లిస్తారు. కొందరు అవతల వాళ్ల మీదో, తమ మీదో భౌతిక అంశాల మీద జోకులేసుకుని నవ్విస్తారు.. నా వరకూ జరిగిన సంఘటనలని వర్ణించడం లో, ఏ ఒక్కరినీ నొప్పించని విధం గా వినేవాళ్లు ఇమాజినేషన్ లోకి వెళ్లిపోయేలాగా చేసే టెక్నిక్ ఇష్టం. 
ఓసారి ఒక technical communication class లో వక్తృత్వం లో నా మీద నేను జోకులేసుకుని నవ్వించాను. ఆ తర్వాత మా టీచర్ గారు పక్కకి పిలిచి నీ జోకులతో నవ్వించు.. నీ మీద జోకులేసుకుని కాదు అని చెప్పారు. అది నాకు చాలా మంచి పాఠం.
రాసేటప్పుడు మాత్రం ఇలాగే రాయాలని మొదలు పెట్టను. somehow some of my posts end up being funny.
 

నచ్చిన టపాలు కొన్ని

http://krishna-diary.blogspot.in/2011/08/blog-post.html

ప్రకటనలు

78 thoughts on “కృష్ణ ‘ప్రియమైన బ్లాగర్’

 1. “ప్రియమైన బ్లాగర్” అని టైటిల్ లో వచ్చేసింది.. ఇంకేం చెప్పాలో తెలీట్లే..:) మిస్సయినా పాత టపాలు వెతుక్కుని మరీ చదివే బ్లాగ్ కృష్ణప్రియగారిది.

 2. కృష్ణ ప్రియ గారు.. మీ గురించి పరిచయం చాలా బాగుంది.

  – కొత్తగా రాసే వాళ్లు ఏం రాసినా ఓసారి చదవడానికి తప్పక ప్రయత్నిస్తాను. పద్యాలు, కవితలు ఎందుకో చదవాలనిపించదు. అలాగే జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీ ల్లాంటివి కూడా చదవను.

  ఇలాంటి విషయాలు ఓపెన్గా చెప్పారు.
  ఇంకా చాలా చాలా సీక్రెట్స్ తెలుసుకున్నాను. 🙂
  ఒక్కొక్క బ్లాగర్ ది ఒక్కొక్క శైలి. అందరూ ప్రత్యేకతలు నిలుపుకుంటూ బ్లాగ్ ప్రయాణం సాగించడమే !

  • 🙂 సీక్రెట్స్ ..షష్స్ ష్ష్.. అదొక పిచ్చి. దాంట్లో కొంతకాలం మునుగుతూ, తేలుతూ దానికి బానిసవుతూ కొంతకాలం ఉన్నాను లెండి. ఇప్పుడు బయట పడ్డాను.

   ఇక పద్యాలు, కవితల సంగతి… వేమన పద్యాలు, సుమతీ శతకాలు చదవడం అంటే సరదాయే నాకు. అప్పుడప్పుడూ చూడటానికి వీలుగా ఉంటుందని, హాల్లోనే, చేయి చాపితే అందే దూరం లో పెట్టుకున్నాను.. ఆటవెలది పద్యాలని నేనూ సరదాగా రాసేదాన్ని అలాగే ఈమధ్య కాలం లో తనికెళ్ల భరణి గారి ‘శబ్భాష్ రా శంకరా’ తత్వాలు,.. మళ్లీ మళ్లీ చదివాను.
   కానీ తేలిగ్గా అర్థమయ్యేవి తప్ప, క్లిష్టమైనవంటే భయం నాకు. బహుశా ఒక బ్లాకేజ్ అనుకుంటా. ఇంగ్లిష్ లో కూడా అంతే.వాటి జోలికి పోను.

 3. కృష్ణ ప్రియ గారు బాగా చెప్పారు .. కామెంట్స్ ఎలా ఉన్నా .. మీకు రాయాలనిపించింది రాసేయండి .. యర్రంశెట్టి సాయి గారు జ్యోతి మాస పత్రికలో తొలుత నిర్భయ నగర్ కాలని అంటూకాలనీ గురించి రాసే వారు .. అపార్ట్ మెంట్ కథలు ఎందులో రాశారో తెలియదు

  • అవునా… అప్పట్లో చిన్నపిల్లని. మా అమ్మ తెప్పించుకున్న పత్రికలని ఆవిడకి తెలియకుండా.. చదవాలి, ఆవిడ స్నానం చేయడానికి ఎంత సమయం పట్టేదో, మెను ని బట్టి వంట ఎంత సమయం పడుతుందో కాలిక్యులేట్ చేసి తదనుగుణం గా మరి సేఫ్ గా చదివి యథా స్థానం లో పెట్టేయాలి. 🙂 అలాగ టెన్షన్ లో చదివినవి కాబట్టి కరెక్ట్ గా గుర్తులేదు.

   నిజమే. నిర్భయ నగర్ గురించే రాసినట్లున్నారు. నా గేటెడ్ కమ్యూనిటీ కథలకి స్ఫూర్తి ఆ సిరీసే!

   ఇక కామెంట్ల సంగతి.. అదంతా ఒకప్పటి మాట. ముఖాముఖి లో చెప్పినట్లు, ఇప్పుడంత పట్టించుకోవడం లేదు. సమయం, ఓపిక, తీరిక ఉన్నప్పుడు రాయాలనుకున్నది రాసేయడమే.

   ధన్యవాదాలు!

 4. ముందు గా ‘జాజి మల్లి’ మల్లీశ్వరి గారికి ధన్యవాదాలు.

  నాజీవితం లో ఎవ్వరికీ ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఏవో సర్వేలు, ఫీడ్ బాక్ లు తప్ప. మా ఆఫీసు పత్రికకి నేను ఒకప్పుడు ప్రతి నెలా ఒక్కొక్కరి ఇంటర్వ్యూ తీసుకునేదాన్ని. దానితో నన్ను ఎవ్వరూ అప్పుడూ ఇంటర్వ్యూ తీసుకోలేదు. నాకు జీవితం లో ఉన్న ఒక వంద కోరికల లిస్టు లో ఇదొకటి.. మీరు తీర్చారు. 🙂
  ఇంటర్వ్యూ ప్రశ్నలకి సమాధానాలు రాశాకా ‘అయ్యో ఇలా చెప్పాల్సి ఉండాల్సింది.. ‘ అని దాదాపు ప్రతి ప్రశ్నకీ అనుకున్నాను. నాకు ఇదొక మంచి అనుభవం.

  మరొక్కసారి థాంక్స్!

  • కృష్ణా…
   మీ బ్లాగ్ పోస్ట్స్ మీద వ్యాసం రాయాలని ఉండేది నాకు..ఏవో ఒత్తిళ్ళ వల్ల కుదరలేదు…ఇలా ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడుకున్నాం…
   ఇంటర్ వ్యూ అపుడే అయిపోలేదు…మన మిత్రులు ఇంకా అనుబంధ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.ఆల్ ది బెస్ట్..

 5. టైటిల్ అర్ధం సెర్చ్ చేస్తే ఇలా కనిపించింది costly – dear – sumptuous – valuable – pricey – rich 🙂

  మీకు రాయాలనిపించింది రాసేయండి అని బుద్దా మురళి గారు అన్నారు కదాని, చిన్న టపాలు వ్రాసేస్తారా , అమ్మో వద్దు 🙂 (ఇంకో బ్లాగు ని కంటిన్యు చేసెయ్యండి, అదేంటో తెలియకపోయినా నష్టం లేదు 🙂

  జ్యోతిగారు , ప్రియమైన బ్లాగర్ టపాలు కూడా బాగా ‘ప్రియం’ కదా 🙂

  • డియర్ అన్నదే ప్రధానార్ధం మౌళీ…వాల్యుబుల్ కూడా తీసుకోవచ్చు.
   అవునూ…కొచ్చినీలు ఏవి?కృష్ణ మంచి మంచి సమాదానాలిచ్చే మూడ్ లో ఉన్నారు కూడాను…
   చివరి వాక్యం పేలింది..

   • ఆవ్ మల్ల.. మా దిక్కు ప్రియం అనే అంటం.. రైతు బజార్ల ల్లో ‘కూరగాయలు ప్రియం గున్నయ్’ అని హైదరాబాదు లో బాగా వినబడుతుంది… చాలా కాస్ట్లీ అని అర్థం వస్తుంది .

    జ్యోతిగారు , ప్రియమైన బ్లాగర్ టపాలు కూడా బాగా ‘ప్రియం’ కదా >>> LOL
    భలే వారే. ఇవ్వాళ్ళే రాశాను కూడా…

    థాంక్స్ మౌళీ..

   • స్కూల్లో ఉన్నపుడు మా ఇంగ్లీష్ మాష్టారు చెప్పారండీ… ’ప్రియం’ = ’డియర్’ అంటే ’ఖరీదైన’ అట… మనం దాన్ని ఇష్టమైన అనే అర్ధం లో వాడేస్తున్నాం అది వేరే విషయం 🙂

    పోస్ట్ విషయానికొస్తే… మీరు అంతలా అడిగినా, ఆవిడ అంత *సీరియస్* గా చెప్పినా నాకు నవ్వొచ్చేస్తుందేమిటో!! keep going కృష్ణాజీ 🙂

 6. అబ్బా,

  ‘సాఫ్టు’ ‘వేరు’ అంటారు గాని, వీరి ‘వేర్లు మరీ ‘స్ట్రాంగ్! ఇంత తర్ఫీదు ఉందన్న మాట కృష్ణ ప్రియ గారి బ్లాగింగ్ వెనుక!

  వీరి ‘కాఫీ విత్ ఎవరది? ఆర్ముగం కదూ !సెహబాష్!

  చీర్స్
  జిలేబి.

 7. జిలేబి గారు,

  ‘సాఫ్టు’ ‘వేరు’ అంటారు గాని, వీరి ‘వేర్లు మరీ ‘స్ట్రాంగ్!..
  వావ్. మీ వ్యాఖ్య లోనే కవిత్వం ఉన్నట్టుందే..

  ఆర్ముగం కథ లో మూడే ముఖాల ఆవిష్కరణ జరిగింది. నాకొక చెడ్డ గుణాల్లో ఒకటి… మొదలు పెట్టిన పని పరిపూర్ణం గా చేయకపోవడం. నా బ్లాగు లో ఈ సంవత్సరం నేను సగం రాసిన టపాలన్నీ పూర్తి చేసి తీరతాను.
  చాలా థాంక్స్!

 8. మొదటి సారి వీరి బ్లాగ్ చూసినప్పుడు “ఇదేమిటి ఇన్ని రోజులు ఎలా చూడలేదీ బ్లాగును” అనుకుని ఆ నాటి నుండి ఈ నాటి దాకా అలా చదువుతూనే వున్నాను. ఏ టపా నిరాశ పరచలేదు. చక్కని సందేశంతో అలవోకగా హాస్యాన్ని పండించే వీరి రచనలు ఓ రెండు రోజులైనా మనవెంటవెంటే తిరుగుతుంటాయి. మనసుకు ఎలాంటి ముసుగు వేయని రచయిత కృష్ణప్రియ గారు.

  కృష్ణప్రియ గారూ…>>‘మహిళా’ బ్లాగర్ని నేను అని ఎప్పుడూ అనుకోలేదు>> ఇది నాకు చాలా నచ్చిందండి.

  జాజిమల్లి గారు,
  మీ ప్రయత్నాన్ని మరోసారి అభినందిస్తున్నానండి.

 9. కృష్ణప్రియ గారు ఒక సెక్యులర్ బ్లాగర్. అంటే ఇజాలూ గట్రా జోలికి పోకుండా, ఎవరి మనసునీ నొప్పించకుండా, కూడా లోతైన విషయాలు రాస్తారు. చాలా వరకూ వాస్తవికం గా రాస్తారు. ఆనిడ టపాలు అన్నీ చదివాను.

 10. ప్రియమైన బ్లాగర్ గారి పరిచయం చాలా బాగుంది జాజిమల్లి గారు. కృష్ణప్రియగారు, చాలా మంచి విషయాలు, అనుభవాలు పంచుకున్నారు. మీకు అభినందనలు.

 11. మంచి పరిచయం. పని తర్వాత రిలాక్స్ అవుతూ చదివే బ్లాగు కృష్ణ ప్రియగారి బ్లాగు. అదో లక్జరీ నాకు. ప్రతి పోస్ట్ లోనూ ఎక్కడో చోట అరె నాకూ ఇలాగే అని అనిపిస్తుంది. ఎన్నో సార్లు నన్ను నేను identify అవుతాను. అన్నిటికన్నా మించి ఆమె స్థిర వ్యక్తిత్వం, సంస్కారం, స్నేహ శిలత చూసి ముచ్చట పడతాను. కృష్ణప్రియగారిని నేను ఇప్పటి వరకూ కలవకపోయినా, మానసికంగా నాకు దగ్గర అనిపిస్తారు.

 12. మీకో మూగ అభిమానిని ప్రియ గారూ (సరదాకి):))ఒళ్ళు బద్ధకం వల్ల టైపు చెయ్యకుండ మనసులో ఇలా అనుకుంటూ(ఆవిడకు ఎలానూ తెలుసు నేను తన రాతలను ఇష్టపడతానని, బాగుంటాయని మరలా కొత్తగా బాగుందని చెప్పటం అవసరమా అనుకుని చదివేసి వెళ్ళిపోతున్నాను కొంతకాలంగా:))

 13. 🙂 సునీత గారు,.. ధన్యవాదాలు. Actually.. బాగా రాశారు అని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఏదైనా అతిగా/ఇబ్బందికరంగా/చెత్తగా/తప్పుగా రాస్తే తప్పక చెప్పండి. కామెంట్ ద్వారానో, లేక ఈ-మెయిల్ రూపం లోనో. ఏ కామెంటూ రాకపోతే.. అద్భుతం గా రాసి ఉంటాను..అనుకుంటాను.

  • శాయి గారి అపార్ట్‌మెంటాలజీ రామోజీరావుగారి చతుర/విపులలోనిదండీ.

   మీ పోస్టుల్లాగే మీ ఇంటర్వూ కూడా (కొత్త విషయాల్ని చెప్తూ) చాలా బావుంది.

   • ఓ. అయితే నేను చదివినది అపార్ట్ మెంటాలజీ యే నన్నమాట. అవును. మా ఇంట్లో చతుర, విపుల తెప్పించే వాళ్లం..
    థాంక్స్ గీతిక గారు!

 14. క్రిష్ణప్రియ గారు,

  రెండు మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా బ్లాగ్స్ తొలిసారిగా చూస్తున్నపుడు మీరు, జాజిమల్లి గారు ఒకేలా కనిపించారు. ఇద్దరు వేర్వేరు బ్లాగర్స్ అని అర్ధం కావడానికి కాస్త టైం పట్టింది. ఇంతకీ నేను చూసిన మీ ఇద్దరి టపాలు ‘సామెతలు టపా ‘, ‘వాడుక పాలు పోసేది చంద్రబాబు’ ఇవి. ఇద్దరు ఒకే రూపం లో, క్లియర్గా చెప్పాలంటే రవివర్మ ‘యశోద’ లా కనిపించారు, కనిపిస్తారంతే. ఆశ్చర్యంగా ఉండేది, ఒకరి బ్లాగులో ఒకరు వ్యాఖ్య కూడా చేయరు, నాకేంటి ఇలా అని. అందుకేనేమో జాజిమల్లి గారు మీ బ్లాగ్స్ గురించి వ్యాసం వ్రాస్తాననగానే మల్టి స్టారర్ మూవీ కోసం ఎదురుచూడ్డం నా వంతు అయ్యింది. ఇప్పటికి రిలీజ్ అయ్యింది. నా దృష్టి లో మీ ఇద్దరు తెలుగు బ్లాగ్స్ కి రెండు కళ్ళు .

  ఇక మీ బ్లాగ్ టపాలు బాగా నచ్చడానికి పాపులర్ అవ్వడానికి కారణం, టపాలో మీరు కూడా ప్రత్యక్షం గా కాని, పరోక్షం గా కాని ఉండడం అనుకుంటున్నాను . అంటే కధలు గా కాకుండా సంఘటనలు గా వివరించడం అనుకుంటున్నాను. కధలేమయినా వ్రాసారా? వ్రాయాలి అనుకొంటున్నారా? మీ నుంచి చాలా మంచి కధలు, కాలమ్స్ కూడా ఎక్పెక్ట్ చేస్తున్నాము.

  బ్లాగరు నిజంగా పరిమితి విధించుకుంటారా అన్నది నాకు అర్ధం కాదు. వారికి ఆసక్తివుంటే వ్రాయకుండా ఉండలేరు అన్నది నా అభిప్రాయం. ఒకరి పై తీవ్రంగా నిరసన చూపిస్తే ఇంకొకరు వ్రాయడానికి ధైర్యం చెయ్యరు అన్న ఆలోచనతో కొందరు దాడి చెయ్యడం సాధారణమే అయినా, నిజంగా భావం అన్నది ఉన్నపుడు ఈ నిరసనలు ఆపగలవా?

  అదే విధంగా విమర్సలవల్ల తాత్కాలిక విరామం తీసికొన్న సందర్భం లేకపోలేదు అన్నారు. నిజానికి విమర్సలకు ఎలా స్పందించాలి అన్న విషయం లో మీరు చాలా మందికి మార్గదర్సకులు, అలాంటి మీరు అది బాధ్యతగా కాక మనసు కష్టపెట్టుకోవడం ఎంతవరకు న్యాయం. ?

  మీరు నాకు తెలిసిన చాలా కొద్దిమంది మహిళా బ్లాగర్స్ లో ఒకరు. కేవలం మహిళా బ్లాగర్ గానే గుర్తింపు పొందడం కాక బ్లాగర్ గా భావించడం లో పూర్తిగా అంగీకారం ఉంది కాని, మహిళా బ్లాగర్ గా కూడా మీకు చాలానే గుర్తింపు ఉంది. మీ ఉద్దేశ్యంలో మహిళా బ్లాగర్ అంటే ఏమిటి. మీరిక్కడ పరిచయం ఇచ్చినది మహిళా బ్లాగార్గా కదా అధ్యక్షా అని ప్రశ్నిస్తున్నాను.

  మీ చిన్న బ్లాగ్ ప్రయోగం బాగుంది. మీరు ఆపెయ్యడానికి కారణం వ్యాఖ్యలేనా? లేక గుర్తింపు (టపాలకి ) లేకపోవడమా ?

  సీరియస్ గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెప్పారు. బాగుంది.బహుసా మహిళగా మీ ప్రొఫెషన్, ఫ్యామిలీ,
  బ్లాగింగ్ లాంటి వ్యక్తిగత ప్రాధామ్యాలు మిమ్మల్ని ఒక ప్రత్యేకమయిన వ్యక్తిగా నిలబెట్టాయి. మీరు మహిళ కాకపొతే ఇవ్వన్నీ మిస్సయ్యేవారా ?

  గేటెడ్ కమ్యునిటీ కధలు కాని, ఇంకే రచన కాని మీరు ఒక స్త్రీగా వ్రాయలేదని నేను నమ్ముతున్నాను. నిజానికి ఇక్కడ చాలా మంది ( దాదాపు అందరు ) స్త్రీ గా మాత్రమె వ్రాయరు అనే నేను అనుకొంటున్నాను. కాని వ్రాస్తున్నపుడు స్త్రీకి మాత్రమె స్వంతమైన పరిశీలన తప్పని సరిగా వచ్చి చేరుతుంది అని నమ్ముతున్నాను. కాదంటారా ?

  మీ రచనల్లో హాస్యం అంతకుముందు బ్లాగర్స్ వ్రాసినవి చదివి వ్రాయకుండా , స్వతహాగా హాస్య ప్రియుల మధ్య మసలడం, అనేక నిజ వ్యక్తులను పరిశీలించడం ద్వారా వచ్చినదవడం మూలాన్నేమో ఎప్పటికి క్రొత్తగా, సజీవంగా ఉంటుంది. కేవలం హాస్యం కోసమే వ్రాసిన టపాలు లేకపోవడం (సామెతలు టపా మినహాయిమ్పేమో ) మీ బ్లాగుకు పెద్ద ప్లస్ పాయింట్ !

  బొందలపాటి గారన్నట్లు మీరు సెక్యులర్ బ్లాగర్, కొన్నిసార్లు మీ టపాలతో విభేదించడానికి ఇలా పరస్పర సెక్యులర్ భావనలలో ఉండే భేదాలేనేమో . మీ టపా మొత్తంలో ఎక్కడో ఒకచోట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ సంబంధిత అంశం పై వ్యాఖ్యానించకుండా ఉండడం దాదాపుగా అసాధ్యం, నో కామెంట్స్ పాలసి, సింపుల్ కామెంట్ పాలసి పెట్టుకొన్న వాళ్లకి తప్ప

  • మౌళీ…
   భలే చిక్కులోకి నెట్టేసారే!!
   ముఖ్యంగా ఒక మంచి బ్లాగర్ తో నన్ను పోల్చినందుకు నాకు సంతోషంగా ఉంది.ఇక తెలుగు బ్లాగ్స్ మేమిద్దరం రెండు కళ్ళు అని అభిమానం కొద్దీ అతిశయోక్తికి(నా విషయంలో)పాల్పడ్డారు కానీ ఇలా ఆలోచించి చూడండి…తెలుగు బ్లాగ్ ఒక దానిమ్మ పండు.. బ్లాగర్లందరం కెంపు వర్ణంతో వరుసలు వరుసలుగా అతుక్కుని ఉన్న దానిమ్మ గింజ ల్లాంటి వాళ్ళం…మహిళా బ్లాగర్లు అందులో మేలిమి గింజలు అన్నమాట…ఇట్లా బావుంది కదా…

   బ్లాగింగ్ లో నాకున్న పరిమితులు నాకు బాగానే తెలుసు.నేను ప్రధానంగా బ్లాగర్ ని మాత్రమే కాదు…(ప్రధానంగా బ్లాగర్ ని అయి ఉంటే చాలా ప్రయోగాలు చేసి ఉండేదాన్ని)అందుకే ఎక్కువ సమయం దాని మీద పెట్టలేను…ఆ ఒక్క కారణంతోనే నేను ఇతరుల బ్లాగ్స్ కి వెళ్లి చదవడం, కామెంట్ చేయడం చాలా తక్కువ సార్లు మాత్రమే జరిగింది…అయినా గానీ నా పట్ల భేద భావం లేకుండా నా బ్లాగ్ ని మీలాంటి మిత్రులు ఆదరిస్తూనే ఉన్నారు…ఈ విషయాన్ని గర్వంగా కాక వినయంగానే చెప్పుకుంటాను.ఈ మూడేళ్ళలో బ్లాగ్ మీద ఇంత సమయం ఈ ఇంటర్ వ్యూల సందర్భం లోనే పెట్టగలిగాను…బాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది.కానీ మంచి స్పందన రావడం సంతోషం…
   మనం బ్లాగర్లమా,మహిళా బ్లాగర్లమా అన్న ప్రశ్న రాజకీయమైనది..మనం స్త్రీలమా మనుషులమా అంటే మనిషిగా ఉండడానికే అందరం ఆసక్తి చూపిస్తాం…ఒక స్త్రీగా కుటుంబం నుంచీ సమాజం నుంచీ సమస్త వ్యవస్థల వివక్షల నుంచీ విముక్తమై పోయి మానవీయమైన,అరుదైన సమానత్వాన్ని పొందిన రోజున నేను ఒక మనిషిని అని గర్వంగా ప్రకటించగలను.కానీ నా వాస్తవాలు అలా లేవు…ఇప్పటికీ అనేక చోట్ల అనేక సందర్భాల్లో నేను స్త్రీ కావడం మూలంగానే వివక్షని ఎదుర్కోవడం జరుగుతోంది.అది వివక్ష అని గుర్తించగలిగే,ప్రశ్నించగలిగే చైతన్యం,సాహసం ఉండడం కూడా చాలా ముఖ్యం…స్త్రీగా వివక్షలతో నా ఘర్షణ అంతిమ మానవీయత కోసమే అని నమ్ముతాను నేను.అందుకే నా ఉనికి, నేను నిల్చున్న చోటు…నేను మాట్లాడుతున్నది స్త్రీ గానే
   మీ వ్యాఖ్యలు సమాధానమివ్వకుండా ఉండనివ్వవు మరి.

   • జాజిమల్లి,
    …తెలుగు బ్లాగ్ ఒక దానిమ్మ పండు.. బ్లాగర్లందరం కెంపు వర్ణంతో వరుసలు వరుసలుగా అతుక్కుని ఉన్న దానిమ్మ గింజ ల్లాంటి వాళ్ళం… Very well said!
    But I would put it in another way.. It is like an assorted chocolate box, each piece with a unique flavor of it’s own, నిజానికి ఈ పోలికా తప్పే. ఉగాది పచ్చడి.. ఇంకా చాలా చాలా పదార్థాలతో.. అన్నీ యూనీక్ గా ఉండి తీరాలని లేదు.,
    ఎవరి ప్రత్యేకత వారిది అనడానికీ లేదు. న్యాయానికి అసలు ఒక ప్రత్యేకత ఉండాలేంటి బ్లాగు రాయడానికి? అనుకుంటాను నేను.

    ఇప్పటికీ అనేక చోట్ల అనేక సందర్భాల్లో నేను స్త్రీ కావడం మూలంగానే వివక్షని ఎదుర్కోవడం జరుగుతోంది.అది వివక్ష అని గుర్తించగలిగే,ప్రశ్నించగలిగే చైతన్యం,సాహసం ఉండడం కూడా చాలా ముఖ్యం…స్త్రీగా వివక్షలతో నా ఘర్షణ అంతిమ మానవీయత కోసమే అని నమ్ముతాను నేను.అందుకే నా ఉనికి, నేను నిల్చున్న చోటు…నేను మాట్లాడుతున్నది స్త్రీ గానే>>>
    చాలా బాగా చెప్పారు. నా అభిప్రాయం.. మౌళి గారి వ్యాఖ్య కి సమాధానం లో వివరం గా రాస్తాను.

   • జాజిమల్లి గారు, నా మాటలో అతిశయోక్తి నా అభిప్రాయానికి సంబంధించినది. మీరు ప్రధానం గా బ్లాగర్ కాదు అని , జాజిమల్లి కధలు బ్లాగ్ టపాలు మాత్రమె కాదు అని తెలిసింది మొన్న మొన్ననే కదా. మీ ఇద్దరి లా ఒక ధ్యేయం గా బ్లాగ్ ని నడుపుతున్న వారు ఇంకొద్ది మంది ఉండే ఉంటారు.. మీకెన్ని పరిమితులున్నా దూరంగా వెళ్ళలేరు. నిజమే మీరు ఈ పరిచయాలవల్ల వత్తిడికి లోనవుతారు అన్నది కూడా తెలియనిది కాదు.

    మనం మనిషి మి అని చెప్పినా, స్త్రీ ని అని చెప్పడానికి ఆలోచించనవసరం లేదు, మనలో స్త్రీ అన్న గుర్తింపు పై ఆసక్తి లేకపోతె తప్ప అని నా అభిప్రాయం, అది కేవలం ప్రశ్న మాత్రమె. వాదన కాదు.

  • మౌళి గారు,
   ముందుగా, మీ వ్యాఖ్య కి హృదయ పూర్వక ధన్యవాదాలు!
   ఇంక మేమిద్దరమూ ఒకే రూపం లో మీకు కనిపించాము.. అన్నారు..  ఒకరి బ్లాగులో ఒకరు వ్యాఖ్య కూడా చేయరు అన్నారు.. That’s not true. నాకు ఆవిడ బ్లాగు అంటే ఇష్టం. కొన్ని సార్లు కామెంట్ చేశాను. ఆవిడ పుట్టిన రోజు టపా లో ఆవిడ బ్లాగులో వ్యాఖ్యలు రాసిన వారి లిస్టు రాస్తూ నాకూ చోటిచ్చారు.
   మల్టీ స్టారర్ మూవీ.>>>.  ముందే చెప్తున్నా.. ఈ సిరి err. జాజిమల్లి ఉన్న వాకిట్లో ఆవిడకి వెంకటేశ్ రోల్ ఇచ్చేద్దాం., నాకే మహేశ్ బాబు రోల్ కావాలి.
   1. కధలేమయినా వ్రాసారా? వ్రాయాలి అనుకొంటున్నారా? మీ నుంచి చాలా మంచి కధలు, కాలమ్స్ కూడా ఎక్పెక్ట్ చేస్తున్నాము.
   లేదండీ.. రాయలేదు. రాయాలని ప్రత్యేకం గా అనుకోవడం లేదు. రాయకూడదని నియమం లేదు. నిజానికి నలభై వయసు రాగానే ఉద్యోగం మానేసి మనసుకిష్టమైన పనులు మాత్రమే చేయాలి అనుకునేదాన్ని. Turned out,.. మనసుకిష్టమైన పనుల్లో ఉద్యోగం ఒకటి. నాకు సమయం ఎక్కువ దొరకదు. పిల్లలు పెద్దవాళ్లవ్వాలి..
   బ్లాగరు నిజంగా పరిమితి విధించుకుంటారా అన్నది నాకు అర్ధం కాదు…..>>> హ్మ్.. ఏమో.. ఉదాహరణ.. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకి ఒళ్లు మండింది. భావోద్వేగం ఏర్పడింది. అలాగే, దిల్లీ సంఘటన తర్వాత రకరకాల వ్యాఖ్యలు విని వాటిగురించి బ్లాగు ద్వారా స్పందించలేకపోవడం.. అంతెందుకు.. మహానటి సావిత్రి మహా బోర్.. ఎలా చూస్తారండీ.. ఎంత లావుగా ఉంటుంది…. అప్పుడే నాలుగిడ్లీలు లాగించినట్లు ప్రశాంతం గా మొహం వేసుకుని… ఈ టైప్ లో ఎవ్వరూ వ్రాయరు.. నా చిన్నప్పట్నించీ చూస్తున్నాను.. ఎవ్వరైనా సావిత్రి నాకు నచ్చదు అని చెప్తారేమో నని.. ఇంతవరకూ కనపడలేదు. అలాగని అందరికీ సావిత్రి నచ్చుతుందనా? ఏమో?  (నాకు నచ్చదని కాదు. కేవలం ఉదాహరణ కి)

   1. అదే విధంగా విమర్సలవల్ల సందర్భం తాత్కాలిక విరామం తీసికొన్న లేకపోలేదు అన్నారు. నిజానికి విమర్సలకు ఎలా స్పందించాలి అన్న విషయం లో మీరు చాలా మందికి మార్గదర్సకులు, అలాంటి మీరు అది బాధ్యతగా కాక మనసు కష్టపెట్టుకోవడం ఎంతవరకు న్యాయం. ?
   మీరు తప్పు గా చదివారు. I never said.. తాత్కాలిక విరామం .. I said తాత్కాలిక విరక్తి. నేను విరామం తీసుకున్నది కేవలం సమయాభావం వల్ల మాత్రమే. అలాగే.. ఒకటి రెండు క్లాసిక్స్ చదివాను..ఆగస్ట్ లో తర్వాత. పుస్తకాల్లో కూరుకుపోయి.. ఏం రాసినా.. సిగ్గేసేది. ఏంటి.. నేను రాసింది… ఇప్పుడు చదువుతున్న సాహిత్యం కాలి గోటికి కూడా పనికి రాదనిపించేది. అందువల్లే రాయలేకపోయాను. సుబ్బు గాడి గురించి రాసేముందర ఎన్నోసార్లు రాద్దామని మొదలుపెట్టి.. ‘బ్లాగర్స్ బ్లాక్’ వల్ల రాయలేకపోయాను.
   .అలాగే.. నాకు విమర్శలనేవి ఇష్టమే. ఇంటరెస్టింగ్ గానే అనిపిస్తాయి. మరీ అసందర్భ ప్రేలాపనల్లా ఉంటే తప్ప.. కామెంట్ల రూపం లో నా రాతల మీద వచ్చిన ప్రతి విమర్శ (ఇప్పటిదాకా) ప్రచురించాను, నాకు తోచినట్లు సమాధానం ఇచ్చాను. మళ్లీ బ్లాగులో కొత్త టపాలు రాస్తూనే ఉన్నాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను… లేటెస్ట్ పోస్ట్ కి నేను కామెంట్లు డిసేబుల్ చేసింది.. ఈ ఇంటర్వ్యూ పోస్ట్ మీద మాత్రమే కాన్సెంట్రేట్ చేయాలని మాత్రమే.
   (సమాధానం రెండు భాగాలు గా రాస్తున్నాను. మరీ పెద్దదైనట్లుంది..)

   • 1. మీరు నాకు తెలిసిన చాలా కొద్దిమంది మహిళా బ్లాగర్స్ లో ఒకరు. కేవలం మహిళా బ్లాగర్ గానే గుర్తింపు పొందడం కాక బ్లాగర్ గా భావించడం లో పూర్తిగా అంగీకారం ఉంది కాని, మహిళా బ్లాగర్ గా కూడా మీకు చాలానే గుర్తింపు ఉంది. మీ ఉద్దేశ్యంలో మహిళా బ్లాగర్ అంటే ఏమిటి. మీరిక్కడ పరిచయం ఇచ్చినది మహిళా బ్లాగార్గా కదా అధ్యక్షా అని ప్రశ్నిస్తున్నాను.

    ఒక మహిళ గా గుర్తింప బడకూడదని కాదు. I am proud to be a woman and to be recognized as a woman blogger. నేనన్నది.. ‘కేవలం’ మహిళా బ్లాగర్ గా నన్ను నేను గుర్తించుకోవడం లేదు.
    ఒక బ్లాగర్ ని. ఒక మహిళగా, టెకీ గా, సమాజం లో ఒక ఎలిమెంట్ గా, తెలుగు భాష/సాహిత్యాభిమానం ఉన్న వ్యక్తి గా, ఒక పరిశీలకురాలిగా నా బ్లాగు టపాలు రాస్తాను. .. మనమందరమూ కూడా ఆర్ముగాలం.. మళ్లీ మాట్లాడితే.. దశ కంఠులం. ఒక మహిళ గా ఆలోచించేటప్పుడు నాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లేక సింగర్/లేక తోటపని మనిషి/ షట్ డవున్ అయిపోరు. అందువల్ల గేటెడ్ కమ్యూనిటీ కథలు రాసినప్పుడే కాదు.. ప్రతి టపా లో, స్త్రీగా నా పరిశీలనలు తప్పక ఉంటాయి.
    ఇక జాజిమల్లి గారు నన్ను ఒక మహిళా బ్లాగరు గా ఇక్కడ పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చారు. సుజాత గారు బ్లాగు పుస్తకం లో నన్ను ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బ్లాగర్ గా ఉదాహరించారు. నా స్నేహితులు నన్ను కేవలం తెలుగు భాషాభిమానం గల బ్లాగర్ గా మాత్రమే గుర్తిస్తారు ..

    2.. మీ చిన్న బ్లాగ్ ప్రయోగం బాగుంది. మీరు ఆపెయ్యడానికి కారణం వ్యాఖ్యలేనా? లేక గుర్తింపు (టపాలకి ) లేకపోవడమా ?
     మంచి ప్రశ్న.. ఎవ్వరూ అడగలేదా అని చూస్తున్నాను. గుర్తింపు బానే ఉండేది. బోల్డు మంచి వ్యాఖ్యలూ వచ్చేవి. వ్యాఖ్యలవల్ల కాదు. కమ్యూటర్ ముందు couch potato లా తయారయి బరువెక్కిపోతున్నానని, తీసుకున్న నిర్ణయాల్లో, గూగుల్ ప్లస్, రెండవ బ్లాగు జోలికి వెళ్లకూడదు అనేవి. అప్పుడప్పుడూ బ్రేక్ చేస్తూ ఉంటాను..కానీ, చాలా వరకూ కంట్రోల్ డ్ గానే ఉంటాను.
    \
    3. సీరియస్ గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెప్పారు. బాగుంది.బహుసా మహిళగా మీ ప్రొఫెషన్, ఫ్యామిలీ,
    బ్లాగింగ్ లాంటి వ్యక్తిగత ప్రాధామ్యాలు మిమ్మల్ని ఒక ప్రత్యేకమయిన వ్యక్తిగా నిలబెట్టాయి. మీరు మహిళ కాకపొతే ఇవ్వన్నీ మిస్సయ్యేవారా ?
    యెస్. మిస్సయ్యేదాన్నే.

    4. కాని వ్రాస్తున్నపుడు స్త్రీకి మాత్రమె స్వంతమైన పరిశీలన తప్పని సరిగా వచ్చి చేరుతుంది అని నమ్ముతున్నాను. కాదంటారా ?
    One hundred percent agreed. పైన అదే చెప్పాను నేను..

    5. కేవలం హాస్యం కోసమే వ్రాసిన టపాలు లేకపోవడం (సామెతలు టపా మినహాయిమ్పేమో ) మీ బ్లాగుకు పెద్ద ప్లస్ పాయింట్ !
    ఇక్కడ ఒకటి చెప్పాలి. ఫ్లో లో రాసుకుంటూ పోతుంటే..ప్లాట్, సస్పెన్స్, హాస్యం.. అన్నీ అవే వచ్చి చేరతాయి. హాయిగా రాసేస్తాను. రెండో సారి కేవలం స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రమే చెక్ చేస్తాను. రెండు టపాలు రాసినప్పుడు మాత్రం చాలా దుర్భరం గా ఫీలయ్యాను. ఎందుకంటే.. ‘భాష’ కోసమే ప్రాకులాడిన టపాలవి (సామెతలు, నిరోష్ఠ్య బ్లాగాయణం..) అందుకే తర్వాత మళ్లీ అలాంటి వాటి జోలికి పోలేదు.

    మొత్తానికి ఒక బ్లాగు టపా అంత కామెంట్ రాయించారు  మరొక్క సారి ధన్యవాదాలు.

    ఏమండోయ్.. జాజిమల్లి గారు…. మీకు కూడా..

   • మీ వ్యాఖ్యకి చాలా ధన్యవాదాలు. చూడగానే ఒక్క మాట మాత్రం అర్జంట్ గా ఖండిస్తున్నాను . సావిత్రి గురించి చెప్పకపోవడం చాలా అన్యాయం , కనీసం చదువుకుని తృప్తి పడుదును. అప్పటికి మొన్నొకసారి నేనే అనేద్దామని ధైర్యం చేశా. మల్లి భయం వేసి హీరోయిన్స్ గురించి వ్రాయడాన్ని మాత్రమె ప్రస్తావించి వదిలేసా 🙂

    సీతమ్మ వాకిట్లో చూసారా, నేను చూసాను. ఇద్దరు అన్నదమ్ములు వున్నవాళ్లకి పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుందిట. మిమ్మల్ని ఇద్దరినీ మహేష్, వెంకటేష్ పాత్రల్లో ఊహించుకొంటే నవ్వాగడం లేదు. జాజిమల్లి గారు మీరు మాత్రం సిన్మా చూడాల్సిందే ఇప్పుడు.

   • ఎపుడో చూసేసా ఆ సిన్మా…
    అంత ఒడ్డూ పొడవూ ఉండి..వూ.. అంటే, ఆ…అంటే అలిగేసి గోడెక్కి కూచుని మహేష్ నే కాదు ప్రేక్షకుల్ని కూడా చితక బాదేసిన వెంకటేషూ నేనూ ఒకటా?!!ఎన్నెన్ని చెత్త పిచ్చి కామెంట్ల మధ్యకూడా నిండు కుండ తొణక్కుండా (కొంచెం ఎక్కువైందా!!ఆ..!!..ఈ ఒక్కసారికేలే)నరమానవుడికి తెలీకుండా డిలీట్ చేసి పారేసి గరళాన్ని దాచుకున్న పరమ శివుడిలా అన్న పెట్టే హింసనంతా మూగగా దాచుకున్న మహేష్ లా ఉన్నది నేనూ…కృష్ణప్రియ అంటే ఏదో చిన్నపిల్ల పాత్రల పంపకాలు సరిగా చేయలేకపోయింది…మీరు తీర్పరులు కదా….న్యాయం చేయండి మిలార్డ్…

   • కృష్ణ, నా బ్లాగ్ లో అపుడపుడూ కామెంట్ చేసారు.నేనే వ్యాసం రాస్తానని చెప్పి మాట నిలుపుకోలేదు.
    ఇంతకీ నేనేం చెప్తున్నానంటే పాత సిన్మాలు ఎందుకూ కొత్త మల్టీ స్టారర్ మూవీ మౌళీ తీస్తారు.అపుడేమో మనం ఒకరి పాత్రలను వేరొకరం డిజైన్ చేద్దాం…సూపర్ హిట్ అవుతుంది… ‘మల్లీ ప్రియం’ ‘కృష్ణమల్లి’,’జాజీకృష్ణ’ ఇట్లా బోల్డు టైటిల్స్ ఆలోచించు కృష్ణా…

   • అనుకొన్నా అస్సల్ ఒప్పుకోరని 🙂 అసలు సినిమాలోనే అన్న కి వ్రాయాల్సిన డైలాగ్స్ తమ్ముడికి, తమ్ముడివి అన్నకి వ్రాసారు ( మామూలుగా చిన్న వాడు కాస్త మొండిగా ఉంటాడు) .కాబట్టి బాగా డిమాండ్ లో ఉన్న బ్లాగర్ కి ఫస్ట్ చాయిస్ 😀

    అయినా మల్లి పరిశీలించాము , ‘నా కామెంట్స్ నేను ప్రచురించుకోలేనప్పుడు చిన్న టపా బ్లాగ్ వ్రాయను’ అని క్రిష్ణప్రియగారు అస్సలు మీకు అందనంత ముందుకు వెళ్ళిపోయారు మహేషు పాత్రలో ( నా నవ్వు నేను నవ్వుకోలేని ఉజ్జోగం వద్దు ప్లేస్ లో )

    హ హ

   • ఈ మాటకి మాత్రం సమాధానం రెడీ గా ఉంది, క్రిష్ణప్రియగారికి అయితే గూగుల్ ప్లస్ నుండి ఎన్ని పనులున్నా రెండు లారీల నిండా జనం , పట్టకపోతే నిల్చొని వచ్చి మరీ ఓటేసి వెళ్తారు 🙂

    ఎన్నికలు బాఘా రిస్కు, కొత్తగా ఏమైనా చెప్పమని మాత్రం అడగొద్దు 🙂

   • మౌళి గారు,
    🙂 నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుంది సినిమా చూడలేదు. ఊర్కే మల్టీ స్టారర్ అన్నారు కదా అని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న సినిమా ఉదహరించాను 🙂 ఇక మహేశ్ బాబు ఇప్పుడు అందరికన్నా పెద్ద స్టార్ కదా.. పైగా తెలుగు మహిళా మానస చోరుడు వెంకటేశ్ బాబు కన్నా వయసు లో చిన్న, అందమైన వాడని, యువత ని విశేషం గా ఆకర్షించిన తార అని మహేశ్ బాబు పాత్ర ఎంచుకున్నాను.

    అలాగే, సావిత్రి అన్నా, జమున అన్నా నాకు చాలా ఇష్టం. universally liked personalities లో తెలుగు లో నంబర్ ౧ స్థానం సావిత్రి దే కాబట్టి ఉదాహరణ కి ఆవిడ పేరు చెప్పాను 🙂

   • జాజిమల్లి గారు,

    LOL. అలాగే.. తప్పక డిజైన్ చేద్దాం. ఒకటే ప్రాబ్లం. నా నెక్ లో లైఫ్ ఉన్నంత వరకూ నేను నా పాత్ర కన్నా, అవతల వారి పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేను. ఆపై మీ ఇష్టం.

    కానీ నాకే మహేశ్ బాబు పాత్ర.. Take it or leave it. 🙂

   • కృష్ణప్రియ గారు, హహ అందుకే అన్నది డిమాండ్ ఉన్న బ్లాగర్ కే మహేశ్ బాబు పాత్ర అని , కాబట్టి మీకే ఖాయం అయ్యుండేది, గమనించారా 🙂

    universally అంటే ఇక్కడ మగవాల్లందరికి జమున మొదటిస్థానంలో కనిపించలేదు , కారణం డా.రమణ గారు చెప్పేశారు కదా 🙂

    సావిత్రి , నాకేం అయిష్టం లేదు, కాని ఇక్కడ మరీ ఎక్కువ చెప్తుంటే కన్యాశుల్కం లో సావిత్రి భరత నాట్యాన్ని , ఘటోత్కచుడి పాత్రని పోల్చి చూడాల్సి వచ్చింది 🙂 చూడండి ఇంకా నవ్వు వస్తుంది.

    తార గారు వ్యాఖ్యానించే దాకా మీరు సాంబార్ ఇడ్లి గురించి మాట్లాడకపోవడం నాకు గుర్తు ఉంది 🙂

 15. కృష్ణ ప్రియ గారి డైరీ నిజంగా అందరూ ఇష్టపడి చదివే డైరీ!

  గేటెడ్ కమ్యూనిటీ కథలు ఒక సిరీస్ లాగా ఏదైనా పత్రికలో రావలసిన కథలు! ఈ విషయంలో నేను చాలా అసంతృప్తి ఫీలవుతాను. ఇప్పటికైనా కృష్ణ ప్రియ గారూ, మీరు వాటిని కినిగె ద్వారా పబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తే ఏమట?

  ఏ విషయాన్ని అయినా ప్రతిభా వంతంగా ,లైటర్ వీన్ లో మొదలు పెట్టి సబ్జెక్ట్ లోకి వెళ్తున్న సంగతి కూడా తెలీకుండా…తన వెంట తీసుకు పోతారు ఆమె..

  నైస్ ఇంటర్వ్యూ ….చాలా బావుంది

  • సుజాత గారు,

   మీ వ్యాఖ్య చూశాకా చాలా సంతోషం గా ఉంది. ధన్యవాదాలు. ఇక గేటెడ్ కమ్యూనిటీ కథల విషయం లో, తప్పక ప్రయత్నిస్తాను. ఇంకా చాలా రాయాలి కదా.. సీరియస్ టాపిక్స్ లోకి ఇంకా వెళ్ళనే లేదు. నాకు సమయం కావాలి అనుకునేదాన్ని ఇదివరకు. ఇప్పుడు కొద్దిగా సమయం దొరికాకా, చేయాలనుకుని ఆపేసిన పనుల లిస్టు చూసి, మళ్లీ వెనుకంజ వేస్తున్నాను.

 16. ప్రణీత అనుభవాలు చదివిన తర్వాత మనసు చాలా భారం అయిపొయింది. మానసికరోగం కోసం మందులు వాడుతున్నట్లు పెళ్ళికి ఒక రోజు ముందు చెప్పినప్పుడే నో అని అతన్ని తిరస్కరించి ఉంటే ఈ నరకం ఉండేది కాదు కదా అని అనిపించింది.
  మొగుడు కొట్టినా, తిట్టినా భరించి అతనితో కాపురం చేస్తేనే సమాజంలో తనకి గౌరవం అన్న భావన మారాలి.
  మొగుడన్నాక ఒక దెబ్బ వేయకుండా ఉంటాడా అని మా పిన్ని అంటూ ఉండేది. రాబోయే మొగుడికి అనుగుణంగా ఉండాలని ఆడపిల్లల్ని ఉయ్యాలలోనే తయారు చేసే సమాజం మనది.
  అమ్మాయిలు చదువుకుంటే మాత్రం చాలదు. వ్యక్తిత్వం అలవరచుకోవాలి. సజ్జన సాంగత్యం, మంచి సాహిత్యం మంచి దారిని చూపిస్తాయి.

  • Gowri Kirubanandan గారు

   మీరు చెప్పింది బావున్నది కానీ. అదే సమయం లో ప్రత్యామ్నాయం లేదు అన్నది మనం మర్చిపోకూడదు. మన కుటుంబ సభ్యులని వదిలేస్తే, ఆ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా వదిలేసి కొత్త లోకం లోకి రావాలి. కాని అక్కడ మాత్రం బాగుంటుంది అని నమ్మకం లేదు .

   మీరు చెప్పినట్లుగా చదువు,వ్యక్తిత్వం,సజ్జన సాంగత్యం, మంచి సాహిత్యం కేవలం అమ్మాయిలకే సరిపోదు. ప్రణీత కు అవ్వన్నీ ముందే ఉన్నాయి. వీటికి మించి సమాజం పై గౌరవం ఉంది కాబట్టి పెళ్ళికి ముందురోజు నిర్ణయాలు కూడా అంట తేలిక కాదు. కేవలం ప్రణీతకో, అమ్మాయిలకో సంబంధించిన సమస్యగానే చూడడం తో ఆగిపోతున్నామా అన్న సందేహం కలుగుతోంది.

 17. కృష్ణప్రియగారికి అభినందనలు.”జగమెరిగిన” సామెతలాగ కృష్ణప్రియ గారి గురించి తెలియని వారు బ్లాగ్ లోకంలో అరుదేమో.చక్కటి సునిశితమయిన(అంటే నెమలీకతో సుతారంగా రాస్తుంటే పుట్టే కితకితల్లాంటివనుకుందాం ప్రస్తుతానికి)హాస్యానికి కేరాఫ్ అడ్రస్ మన కృష్ణప్రియ గారు.పైన సుజాత గారు చెప్పినట్టు త్వరగా మీ గేటెడ్ కమ్యూనిటీ పుస్తకం అచ్చేయించి మీ సంతకంతో మాకు పంపిస్తే మా లైబ్రరీలో దాచుకుని,మీరు మాక్కూడా తెలుసహో అని చెప్పుకుంటామండి,అదీ సంగతి.

  జాజిమల్లి గారూ ఇంటర్వ్యూ అందర్నీ ఒకే మూసలో చేస్తున్నట్టున్నారు,ఎవ్వారి అభిరుచుల్ని బట్టి అవ్విధంగా చేస్తే బావుంటుందని అప్పుడెప్పుడో అనుకున్నట్టున్నారేమో కదా!! 

  • శ్రీనివాస్ గారూ,
   అందరికీ వర్తించే కొన్ని కామన్ ప్రశ్నలతో పాటు వారి ప్రత్యేకతని తెలిపే అదనపు ప్రశ్నలు రెండు అడుగుతున్నాను.గమనించగలరు…ఈ ప్రశ్నావళికి ఇంతకు ముందే స్పందించి సమాధానాలు రాసి పంపిన వారివి మార్చలేను కనుక ఇక ముందు ఇంటర్ వ్యూల ప్రశ్నలు మారుస్తాను…ప్రతి ఒక్కరినీ బాగా స్టడీ చేసి ముఖాముఖి చేయడం బహుసా నా శక్తికి మించిన పని అలా చేయగలిగితే చాలా మంచిది కూడా కానీ ఆచరణలో కష్టం….ఏవైనా మీ సూచనను గుర్తు పెట్టుకుంటాను.
   థాంక్ యూ.

  • మూసలో ఉన్నట్లు అనిపించలేదు, బ్లాగర్ అభిరుచులు వారికి వారుగా చెప్పాలి కాని పరిశోధన చేసి ప్రశ్నిస్తే మొగలిరేకులు సీరియల్ చివరిదాకా వెళుతుంది ఈ పరిచయకార్యక్రమం (అన్ని ట్విస్టులు కూడా వచ్చేస్తాయి హ హ ) . ఒక బ్లాగర్ ని ‘ఈ టీవి సుమన్’ పై అభిప్రాయం ఏంటి అని వారి అభిరుచులని బట్టి(టపాలను బట్టి) అడిగితె బాగోదేమో అని నా అభిప్రాయం 🙂

  • శ్రీనివాస్ గారు,

   ధన్యవాదాలు. మీ వ్యాఖ్య లో మీరన్నంత ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నా..నా గేటెడ్ కమ్యూనిటీ కథలు కనీసం ఒక పాతికైనా అవ్వాలి కదా. అదంతా ఎప్పటికి కుదురుతుందో.. ఎప్పటికవ్వాలో 🙂

 18. “మీరు చెప్పింది బావున్నది కానీ. అదే సమయం లో ప్రత్యామ్నాయం లేదు అన్నది మనం మర్చిపోకూడదు. మన కుటుంబ సభ్యులని వదిలేస్తే, ఆ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా వదిలేసి కొత్త లోకం లోకి రావాలి. కాని అక్కడ మాత్రం బాగుంటుంది అని నమ్మకం లేదు .

  మీరు చెప్పినట్లుగా చదువు,వ్యక్తిత్వం,సజ్జన సాంగత్యం, మంచి సాహిత్యం కేవలం అమ్మాయిలకే సరిపోదు. ప్రణీత కు అవ్వన్నీ ముందే ఉన్నాయి. వీటికి మించి సమాజం పై గౌరవం ఉంది కాబట్టి పెళ్ళికి ముందురోజు నిర్ణయాలు కూడా అంట తేలిక కాదు. కేవలం ప్రణీతకో, అమ్మాయిలకో సంబంధించిన సమస్యగానే చూడడం తో ఆగిపోతున్నామా అన్న సందేహం కలుగుతోంది.” చప్పట్లు మౌళీ! చప్పట్లు!
  జాజిమల్లి, కృష్ణప్రియలు మన్నించాలి.
  బ్లాగర్ల ఇంటర్వ్యూలు చదువుతున్నాను. వ్యాఖ్యలనీ చూస్తున్నాను. నేను ప్రత్యేకంగా చెప్పేది లెదు. ఈ సంభాషణలలో తెలుసుకునేదే ఎక్కువ ఉందని వ్య్కాహ్యలకి లోటు లేదు కనుక నేను హాజరు పలకడం అవసరం లేదనీ ప్రత్యక్షంగా పాల్గొనటం లేదు. కానీ మౌళి గారి మాటలు పైన quote చేసినవి మెచ్చుకోక తప్పదనిపించేలా ఉన్నాయి!
  కృష్ణప్రియకి, జాజిమల్లికీ thanks చెప్పాలి, ఈ ఇంటర్వ్యూ తద్వారా స్పందన, దాని వల్ల వచ్చిన స్పష్టత – వీటికోసం. నాకైతే ఇంతకు ముందు అర్థం అయ్యుండేవి కాదేమో మౌళి గారి మాటలు. వయసూ, అనుభవాలు అర్థం అయ్యేలా చేస్తున్నాయి. మౌళి గారి వ్యాఖ్యలలో అభిప్రాయాలు అంత తేలికగా అర్థం కావు నాకు. కానీ ఒక్కోసారి బలే అనిపిస్తాయి. మరి నాకు అర్థమయ్యిందీ తను చెప్పదలుచుకున్నదీ ఒకటేనో కాదో తెలియదు.

  • @లలిత (తెలుగు4కిడ్స్) గారు

   ఇంతకుముందు కూడా మీ వ్యాఖ్య కి భలే సంతోషం వేసింది. కాని మొహమాటం కూడా వేసింది.ఇప్పుడు ఇది మన మహిళా బ్లాగు కాబట్టి చెప్పేస్తా 🙂

   మీ వ్యాఖ్య నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది, సంతోషం గా అనిపించింది అర్ధము హైలైట్ చేస్తున్నందుకు.. ప్రణీత గురించి
   మొదట కాస్త అసందర్భంగా వ్రాశానా అని సందేహించినా నేను కూడా తప్పదనిపించి చెప్పేసాను. ఆ విధంగా అభినందన మాత్రమె కాక మళ్ళీ మీ దర్సనం కూడా 🙂 ఇక అర్ధం అంటారా, కేవలం ప్రణీతకో, అమ్మాయిలకో సంబంధించిన సమస్యగానే చూడడం తో ఆగిపోతున్నామా అన్న సందేహం కలుగుతోంది అని ఆపేసాను కారణం ఇంతకుముందే కొంత చెప్పాను. అదీ కాక ప్రత్యేకమైన చర్చ కాదు.

   నా వ్యాఖ్య లోని భావం మీకు అర్ధం అయ్యింది. మీరు అయితే ఇంకా సరళం గా చెప్పేవారు. వీలయితే చిన్న టపాలుగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను

  • లలితా,

   >>>మౌళి గారి వ్యాఖ్యలలో అభిప్రాయాలు అంత తేలికగా అర్థం కావు నాకు. కానీ ఒక్కోసారి బలే అనిపిస్తాయి. మరి నాకు అర్థమయ్యిందీ తను చెప్పదలుచుకున్నదీ ఒకటేనో కాదో తెలియదు.<<<

   నిజమే… అక్చువల్లీ నా బ్లాగు లో ప్రణీత పోస్ట్ మీద మౌళి గారి ఆఖరు కామెంట్;లో ఒక వాక్యం
   (భర్త కోసం ఆమె వదిలేసిన వాటిలో ఉద్యోగం ఒకటి మాత్రమె.) చూశాకా నాకు కొన్ని క్షణాలు చాలా కోపం వచ్చింది.. ' ప్రణీత వదులుకుంది కేవలం ఉద్యోగం కాదు. తన కుటుంబం సపోర్ట్, తన హాబీలు, డబ్బు, స్నేహితులు,,ఇంకా చాలా చాలా. ముఖ్యం గా ఆత్మ గౌరవం, దెబ్బలు కొట్టి పుట్టింటికి పంపించినప్పుడల్లా వెళ్లి మళ్లీ పిలిచినప్పుడల్లా వెళ్లి, తన చెల్లెళ్ల మీద వెకిలి కామెంట్లు చేస్తుంటే,…అవన్నీ కూడా భరించి పాప/బాబు పుడితే అన్నీ సర్దుకుంటాయి, మారిపోతాడు అనుకుని .. తన కున్న ఆలంబనలన్నీ వదులుకుంది. అన్నింటికన్నా అతనితో తెలియని దేశానికి వెళ్లిపోవడం దగ్గర గా చూడడం తో చాలా బాధ అనిపించింది.

   తర్వాత నెమ్మది గా ఆవిడ మాటల వెనక ఏదో నిగూఢమైన అర్థం ఉందనిపించింది. పూర్తిగా అయితే అర్థం కాలేదు..
   అలాగే నా బ్లాగు లో చాలా సార్లు కామెంట్ చేస్తారు ఆవిడ. చాలా వరకూ లాజికల్ గా ఉండి నన్నాలోచింప చేసినా, ఒక్కోసారి ఆవిడ వ్యాఖ్య నాకు పెద్ద ప్రశ్న లా ఉంటుంది. చాలా తెలివైన వ్యక్తి లా అనిపిస్తారు నాకు.

 19. కృష్ణ ప్రియగారు ,

  మీ సమాధానాలకు చాలా ధన్యవాదములు, మీరన్న తాత్కాలిక విరక్తి ని తాత్కాలిక విరామం గా తీసికొన్నాను హ్మ్ , కాని దీన్ని ఈ మధ్య విరామం గురించి ప్రస్తావించలేదు. నిజానికి నేను మీ విరామాలని టపాలతో సమానం గా ఎంజాయ్ చేస్తాను 🙂

  నిరసనల వల్ల మీరు వ్రాయడం మానేసిన అంశములు ఒకటి కూడా ఉన్నట్లు మీ మాటల్లో కనిపించలేదు. అది చాలా చాలా మంచి విషయం. ప్రతిఒక్కరు నేర్చుకోవాలి.

  ఇంకా ఒక్క చెత్త కామెంట్ కూడా రాని విధంగా వ్రాయగలగడం ఖచ్చితం గా మీ ప్రతిభకు నిదర్సనం ( 🙂 జాజిమల్లి గారూ , ఈ వాక్యం చూసి అలిగి గోడ దగ్గరికి వెళ్లొద్దు, అన్నన్ని చెత్తవ్యాఖ్యలు వచ్చినా తొణక కుండా, కంప్లైంట్ అస్సలు చెయ్యకుండా వ్రాస్తున్నారు మీరు చూడండి, అందుకే మీరిద్దరూ స్టార్స్ అన్నమాట )

  • మౌళి గారు,

   >>>నిజానికి నేను మీ విరామాలని టపాలతో సమానం గా ఎంజాయ్ చేస్తాను
   Me too 🙂
   >>>>ఇంకా ఒక్క చెత్త కామెంట్ కూడా రాని విధంగా వ్రాయగలగడం ఖచ్చితం గా మీ ప్రతిభకు నిదర్సనం
   బహుశా.. సెన్సిటివ్ పాయింట్స్ టచ్ చేయకపోవడం వల్లేమో?

   >>>>నిరసనల వల్ల మీరు వ్రాయడం మానేసిన అంశములు ఒకటి కూడా ఉన్నట్లు మీ మాటల్లో కనిపించలేదు. అది చాలా చాలా మంచి విషయం. ప్రతిఒక్కరు నేర్చుకోవాలి.
   థాంక్స్ 😉

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s