బ్లాగ్లోకపు ఉక్కుమహిళ

OWN PHOTOS 023
బ్లాగర్ పేరు; వనజ తాతినేని
బ్లాగ్ పేరు;వనజ వనమాలి
బ్లాగ్ చిరునామా;http://vanajavanamali,blogspot.com
పుట్టిన తేదీ; 12/03/1967
పుట్టిన స్థలం; కుంటముక్కల (నియర్ మైలవరం ) కృష్ణ జిల్లా
ప్రస్తుత నివాసం; విజయవాడ
చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)
విద్యాభ్యాసం;M.A
వృత్తి, వ్యాపకాలు; గృహిణి,మరియు స్వయం ఉపాధి
బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ; నవంబర్ 21/2010
మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి);600 పైన
బ్లాగ్ లోని కేటగిరీలు;కథలు,కవిత్వం,వ్యాసాలు,అనుభూతులు-అనుభవాలు,సినిమా పాటల పై వివరణ
బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?
ఓ..నాలుగేళ్ళ క్రితం.  బావాలని వెల్లడించుకునే వారికి చక్కని వేదిక. . అందరూ నదులు కానవసరం లేదు. పిల్ల కాలువలు అయినా నయమే కదా !
బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?
సంతృప్తికరం గా ఉన్నప్పటికీ  ఏదో లోపం. బ్లాగర్స్ లో అధిక మంది విద్యాధికులు ఉన్నారు. కాని కొత్త వారికి ప్రోత్సాహం తక్కువ. అబ్బ.. వచ్చారులే! వ్రాసారులే ..అన్న ధోరణి ఉంటుంది. బ్లాగ్ అంటే  సాధారణ అవగాహన ఉన్న వ్యక్తులు కూడా నిర్వహించుకోలరు కదా! విద్యాధికులు,సీనియర్ బ్లాగర్స్ మాత్రమే  వ్రాయాలి మిగతా వారు చదివి పొగడ్తలు కురిపించాలి అనే దోరణి అంతర్లీనంగా ఉంటుంది. చాలా సార్లు కొత్త బ్లాగర్స్ బాధ పడ్డ సందర్భాలు ఉన్నాయి. కవిత్వం అంటే విద్యాధికులు వ్రాసినదే కవిత్వం ,వారు వ్రాసినవే కథలు కాదు. ఓ.. టైలర్ కూడా మంచి కవిత్వం వ్రాయగలరు వారు కూడా బ్లాగ్ నిర్వహించుకోగలరు అని అర్ధం కావాలి..కావాల్సింది సృజనాత్మకత, చదివించ గల్గే  శైలి.
నేను రెండు సంవత్సరాలు క్రితం బ్లాగ్ లోకం లోకి వచ్చి పడ్డాను. సాహిత్యం అంటే ముఖ్యంగా కవిత్వం అంటే  ప్రాణం.  నిర్మొహమాటంగా చెప్పాలంటే ఇందరి బ్లాగర్ల మధ్య నేను పెద్దగా నేను సాధించినది ఏమి లేదు.ఇక్కడా భావ చౌర్యం ఉంది. ఇక్కడా పెద్ద బ్లాగర్,చిన్న బ్లాగర్ అన్న తేడాలు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే గ్రూపిజం ఉంది.
ఎగతాళి చేసేవారు ఉన్నారు.అనామకులుగా వచ్చి  కామెంట్స్ తో బాధ పెట్టేవారు ఉన్నారు. స్త్రీల సమస్యలపై స్పందించితే వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారు ఉన్నారు.  అవన్నీ పరిగణ లోకి తీసుకోకుండా.. వ్రాసుకుంటూనే ఉన్నాను. కొన్ని చేదు  అనుభవాలు ఉన్నాయి. చాలా సంతృప్తినిచ్చిన సంతోష సమయాలు ఉన్నాయి.. చాలా బ్లాగ్ లని నేను ఎప్పుడు చదువుతాను.అది నాకెంతో ఇష్టమైన వ్యాపకంగా మారింది. నాకై నేను కేవలం నా కోసమే నేను  గడిపిన ఘన సమయాలు ఇక్కడ నాకు సొంతం. చిన్న చిన్న అసంతృప్తులు తప్ప  అంతా బహు బాగు.
బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?
మన వ్రాసినదానిని ఎవరికో పంపి ప్రచురణ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇదో చక్కని వేదిక మనం వెలిబుచ్చిన భావాలు నచ్చిన వారు మళ్ళీ మళ్ళీ బ్లాగ్ కి విచ్చేసి చదివి మెచ్చుకుని అభిప్రాయాలని తెలిపి వెళుతూ ఉంటారు. బయట పత్రికలలో ప్రచురింప బడ్డ రచనల పై స్పందన కన్నా.. ఇక్కడ స్పందన ఎక్కువ. అయితే ఇక్కడ అందరూ చదివే అవకాశం లేదు కనుక బాహ్య ప్రపంచానికి బ్లాగ్ రచయితలు తెలిసే అవకాశం లేదు.
మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?
సామాజిక సృహ కల్గిన కథలు,కవిత్వం వ్రాయగల్గ డం. నిత్య జీవనంలో మనకి ఎదురయ్యే  ప్రతి అనుభవాన్ని.ఇంకా  సమాజాన్ని పరిశీలించి.. ఆ విషయాలని వ్యాసాలుగా వ్రాయగలగడం
సాహిత్యంతో మీ పరిచయం?
ఓ.. పదేళ్ళు. ఎక్స్ రే సాహితి సంస్థ తో.. “నెల నెలా వెన్నెల” వేదిక నిర్వహించడంలో ఏడేళ్ళ కి పైగా మమేకం.
స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?
ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడం కూడా కష్టం.  కొన్ని అంశాలు గురించి వ్రాసేటప్పుడు నేను ఒకటికి పది సార్లు ఆలోచించాను. ఉదాహరణకి..సైబర్ సెక్స్ వ్రాసిన పోస్ట్. నేను  వ్రాసిన పోస్ట్ లని నా కొడుకు చదువుతాడు. అలాగే మా కుటుంబ సభ్యులు చదువుతారు. నాకున్న భావ స్వేచ్చ ని అడ్డుకోలేదు కాని కొన్ని రచన లలో.. వ్యక్తి గత అనుభవాలు ఉన్నాయి. ఆ రచనలని వాళ్ళు చదివినప్పుడు అవన్నీ ఎందుకు వ్రాయడం అంటారు. నేనైతే.. నా అనుభవాల తో.. మరియు సామాజిక సృహ తోనూ..కలగలిపి కవిత్వం,కథ,వ్యాసం వ్రాసాను.అవన్నీ  నా వ్యక్తిగతం అని అనుకునే వారు ఉన్నారు తప్ప రచయిత/ రచయిత్రికి  పరిమితులు లేవు అని అర్ధం చేసుకోకపోవడం కొంచెం ఇబ్బంది కల్గిస్తుంది. నా కుటుంబ సభ్యులు  కూడా నా భావ స్వేచ్చని హరించి నట్లు  ఉంటుంది. అలాంటప్పుడు.. నన్ను నేను వ్యక్తీకరించుకోవడంలో (రచయిత్రిగా) విఫలం అయ్యాను కూడా.
నాకున్న సమయాన్ని సద్వినియోగ పరచుకుని బ్లాగ్ వ్రాయగల్గుతున్నాను. ఒక గృహిణిగా తీరిక సమయాల్లో బ్లాగింగ్ చేయగలను. కానీ కొందరికి ఉపాధి కల్గించే వృత్తిలో ఉన్నాను. వాళ్ళ తర్వాతే బ్లాగ్. అలాంటప్పుడు నేను అసహనంకి గురి  అయిన రోజులు ఉన్నాయి. ఎంతో  నచ్చిన పోస్ట్  లని చదవడానికి, వ్యాఖ్య ఇవ్వదానికి సమయం ఉండేది కాదు. ప్చ్.. అంతే!
జీవన నేపధ్యం?
చదవడం,వ్రాయడం, సమాజ పరిశీలన,ఆత్మావలోకనం.
ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
ఎవరి ఒత్తిడి లేకుండా జీవితాంతం వ్రాసుకుంటూనే ఉండాలని కోరొక
సరదాగా ఏవైనా చెప్పండి?
బ్లాగ్ ప్రపంచం నుండి  కాస్త బయటకి రండి.. కిరణ్ బేడి లాగా మారి నడివీదుల్లో సంచరించండి
సీరియస్ గా ఏవైనా చెప్పండి?
నిన్ను నీవు తెలుసుకో, తర్వాత ప్రపంచం నీకు అర్ధమవుతుంది అనుకుంటాను నేను సమస్యలని ఎదుర్కుంటున్న స్త్రీమూర్తులకి నా పరిధిలో నేను సాయం చేయాలని తాపత్రయం.యూత్ కి కౌన్సిలింగ్ క్లాస్స్ తీసుకోవాలని అభిలాష
మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం గానీ ఒకటి,కవితలైతే రెండు
నాకు ఎంతో ఇష్టమైన కవితలు రెండు
నువ్వు వదిలేసిన కాడితో
నువ్వు వదిలేసిన కాడితో
ఏ ఏటికి ఆఏడు చెలమలోని  నీళ్ళులాగ అవసరాలు ఊరుతూనే ఉండాయని చేసిన అప్పులు వడ్డీతో కలసి సాలుసాలుకి రెళ్ళు దుబ్బుల్లా పెరుగుతూనే ఉండాయని బాధల్లన్ని మరిచిపోవాలని అప్పుడు ఆ  మందు తాగినావు .. ఏకంగా  ఇప్పుడు ఈ మందు తాగేసి పురుగులా మాడిపోయావు.. కొంగు ముడి  పడ్డ నాటినుండి .. నేను సాయంగా ఉండానన్న సంగతి మరిసేసి నిన్ను కన్నోళ్ళకి   మనం కన్నోళ్ళకి నన్నే ఒంటి నిట్టాడిని  చేసి పోయినాక నన్ను గాలికి  ఒగ్గేసి.. నువ్వు గాలిలో కల్సిపోయాక నేను రోజూ ధైర్యం అనే మందు తాగుతూనే ఉండాను .. నువ్వు ఉన్నప్పుడు సాయం చేస్తానని రాని చేతులు నా ముందుకొచ్చాయి  లెక్కలేనన్ని.. బిక్క చచ్చి బక్క చిక్కి ఉన్న శరీరాల చుట్టూ .. ఆకలి చూపులు కాకుల్లా.. గ్రద్ధల్లా.. గిరికీలు కొడుతూనే ఉండాయి. నువ్వు చస్తే మారతాయని  అనుకున్నబాధలు పెనంలోనుండి పొయ్యిలోకి మారినాయి. నడిరేతిరి కీచురాళ్ళ రొదలా.. అప్పులాళ్ళ బాధలు,పేగులు తిప్పేసే బిడ్డల తీరని ఆకలి కేకలు.. దాయలేని యవ్వనపు ప్రాయపు పొంగులు.. మోటబాయి లోని నీళ్ళు లాగానే నీరింకిన కళ్ళల్లో భయం, దైన్యం శూన్యం తారట్లాడుతున్నాయి. మనోల్ల చూపుల్లో చుక్కలు పొడవాలంటే .. మా చుట్టూ తిరిగే చూపులకి ముళ్ళ కంచెలు కొట్టి మా చూపులకి అగ్గి రగిలించుకుని.. ఆమడ దూరంలో వాళ్ళని ఆపేసి నువ్వు వదిలేసిన కాడితో .. బతుకు సేద్యం చేస్తూనే ఉండాల. బతుకుతూనే ఉండాల.. బతుకుతూనే ఉండాల ఒంటి చేత్తో ఆవలి ఒడ్డుకి చేరేదాక.. బతుకుతూనే ఉండాల. బతుకుతూనే  ఉండాల..
దేహక్రీడలో తెగిన సగం
దేహక్రీడలో తెగిన సగం
ఆడి  పాడే అమాయకపు బాల్య  దేహం పై.. మొగ్గలా  పొడుచుకు వస్తున్నప్పుడు.. బలవంతంగా   జొప్పించిన ఆడపిల్లననే జ్ఞానం పదమూడేళ్ళ ప్రాయంలో..యవ్వనపు దేహం పై.. వసంతం విరిసినప్పుడు…. వీడని అమాయకత్వం
నువ్వు ఆడదానివే సుమా అన్నట్లు నఖశిఖ పర్యంత చూపులతో.. గుచ్చి గుచ్చి తడిమినప్పుడు.. లోలోపల భయం, గగుర్పాటు తో అప్పటిదాకా లేని సిగ్గు తెర పైట అయి తనువంతా  చుట్టుకునే ముగ్ధత్వం
కాంక్షల కౌగిలిలో నలిగిపోతున్నా మోహపు పరవశంతో ఉప్పొంగినా .. నలిగిన  మేనుకు  అవే  తరగని అలంకారమని సగభాగం నిర్ధారించాక
అనంత సృష్టి  రహస్యపుఅంచులు తాకే
కేళీ విలాసంలో ముఖ్య భూమిక గా
కామ్య వస్తువుగా..భోగ వస్తువుగా
మారిన  కుఛ ద్వయాలకి
అన్నీ గరళమైన  అనుభావాలే !
చిన్నిచేతులతో ..తడిమి  తడిమి .. ఆకలికి  తడుముకుంటూన్నప్పుడు ఆ పాలగుండెలు బిడ్డ ఆకలిని తీర్చేఅమృత భాండా లని… ఆ గుండెలు పరిపూర్ణ  స్త్రీత్వపు చిహ్నాలని తన్మయత్వం తో.. తెలుసుకున్న క్షణాలు మాత్రం స్వీయానుభావాలు.
అసహజపు అందాలను ఆబగా చూసే వారికి సహజం అసహజమైనా,అసహజం సహజమైనా.. ఆ దేహం పై క్రీడలాడునది..ఈ నరజాతి వారసుడు చనుబాలు కుడిచిన నాటిని మరచిన బిడ్డడే కదా..
అసహజంగా పెరిగిన కణ సముదాయాలని కుతికలోకి.. కోసి.. ఓ..సగ భాగాన్ని పనలని పక్కన పడేసినట్లు పడేసాక.. అయ్యో అనే  జాలిచూపులు భరించడం,. నువ్విక పనికరావనే..వెలివేతలు..సహించడం కన్నా ప్రాణం పొతే బాగుండునన్న భావనే అధికం.
అమ్మ – అమృత భాండం, స్త్రీ-సౌందర్యం..ఉద్దీపనం  సారూప్యమైనవే !
దేహం నదిలో ఎత్తు పల్లాలు,ఒంపు సొంపులు ,సొగసులును ఆబగా కొలుచుకునే కామచిత్తులకి ప్రవాహించినంత మేరా…  పచ్చదన్నాని నింపే ఆ నది అంతరంగం అర్ధమయ్యేది ఎన్నడు?
పరచిన నగ్న దేహం పై మిగిలిన సగం పై విశృంఖలం చేసిన గాయం స్రవిస్తూనే ఉంది. అంతః చక్షువుతో .సౌందర్యపు ఝడిని కనలేని వికృతమైన ఆలోచనల కురుపు రాచ పుండు కన్నా భయంకర మైనది.
(టాటా మెడికల్  ఇనిస్ట్యూట్ ఆఫ్ కేన్సర్ (ముంబాయి) లో బ్రెస్ట్ కేన్సర్ విభాగంలో కొంతమంది అనుభవాలు విని విచలితమై వ్రాసుకున్న కవిత ఇది.)
మరియు ఒక కథ
ఓల్డ్ లవ్ లెటర్
నగరంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకి అతి కష్టం పై ఒక రోజు మాత్రమే హాజరయి తనకి భాషాభిమానం ఉందని తృప్తి పడుతూ.. జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ. సాహితీ వేత్తల ప్రసంగాలు వినడంలో నిమగ్నమయింది స్నేహ .
అప్పుడప్పుడు తెలిసినవారు ఎవరైనా కనబడతారేమో అని చూపులతో ఆ హాల్ అంతటిని ..జల్లెడ పడుతుంది.
తెలుగు భాష మరుగున పడకుండా మనమేమి చేయాలో ఉద్భోదిస్తూ  ఆంగ్లంలో మాట్లాడుతున్న ప్రముఖ సాహితీ వేత్తని తప్పనిసరి అయి  భరించారు.అభ్యంతరం తెలిపితే తెలుగు వారు వివాదం చేయడంలో ముందు ఉంటారు అన్న అపవాదుని మూట గట్టుకున్నట్లు అవుతుందేమో అన్న భయంతో.
తరువాత పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న భాషాభిమానులు తెలుగు సాహిత్యంలో అంతో ఇంతో పేరు ఉన్నవారు మాట్లాడుతూ వారు నివసిస్తున్న రాష్ట్రంలో తెలుగు భాష వ్యాప్తి చేయడానికి నిధులు అందిస్తే మన భాష ని అక్కడ కూడా వ్యాప్తి చేయడానికి అవకాశం ఉంటుందని విన్నమిస్తుంటే విని…
మూల విరాట్టుకే నైవేద్యం పెట్టడానికి  లేకుంటే మూలన కూర్చున్న ఉత్సవ విగ్రహం  వచ్చి నాకు నాకు అని అన్నట్లుగా ఉంది అనుకుంది స్నేహ చిన్నగా నవ్వుకుంటూ..
అంతలో.. నాలుగైదు వరుసల ఆవల మరొకరితో కలసి వెళుతున్న ఆనంద్  ని  చూసింది. అప్రయత్నంగా చేతిని ఊపింది. ఆనంద్ అయితే గమనించలేదు కానీ అతని ప్రక్కన ఉన్న అతను “ఎవరో నిన్ను చూసి పలకరిస్తున్నారు ” అని చెప్పినట్లు ఉన్నాడు. ఆనంద్  స్నేహ వైపు చూసాడు.వెంటనే ఆమె ఉన్న వరుస వైపు వచ్చాడు. “బాగున్నారా?” పలకరించాడు. అతన్ని చూసిన సంతోషం లో వెంటనే తల ఊపింది.
ఇక్కడ సీట్లు ఖాళీ గా లేవుకదా..అక్కడికి వెళ్లి కూర్చుంటాను. లంచ్ టైం లో మాట్లాడుకుందాం .. అని చెప్పి తనతో వచ్చిన వ్యక్తి ప్రక్కకి వెళ్లి కూర్చున్నాడు.
సభ నడుస్తున్నంతసేపు  లంచ్ టైం  ఎప్పుడవుతుందా..అన్నట్లు ఎదురుచూసింది స్నేహ. మధ్య మధ్యలో ఆనంద్ వైపు చూస్తుంది. పదేళ్ళ క్రితంలాగానే అలాగే సన్నగా ఉన్నాడు.ఎక్కడ ఉంటాడో వివరంగా తెలియదు కాని ఓ..ప్రముఖ దిన పత్రికలో విలేఖరిగా పని చేస్తున్నట్లు విన్నది. విని చాలా బాధపడింది కూడా..
ఎంత మంచి కవి.  కలసి చదువుకునే రోజుల్లో ప్రతి రోజు  అతని కవిత్వం కోసం పడి పడి  ఎదురుచూసే వారిలో తను కూడా ఉండేది అన్నది ఎప్పుడు మర్చిపోలేదు. అతని వ్రాసిన కవిత్వం సంపుటిగా కూడా వచ్చింది.తరువాత అతనెప్పుడు వ్రాసినట్లు లేదు.ఎక్కడైనా ఒక్క కవితైనా కనబడుతుందేమో నని కనిపించిన ప్రతి పత్రికలోను, దినపత్రికల లోను వెతుకుతూ ఉంటుంది.ఆనంద్ ఏమి వ్రాస్తాడో  చూడాలి అని ఆమె ఆశ కూడా.
లంచ్ బ్రేక్ కన్నా ముందే లేచి వచ్చి.. లంచ్ కి వెళదాం రండి అని పిలిచాడు ఆనంద్.
స్నేహ అందుకోసమే చూస్తుంది కనుక వెంటనే లేచి వెళ్ళింది.
ఇన్నేళ్ళ తరువాత మిమ్మల్ని చూడటం చాలా ఆనందం కల్గింది. అందుకే అలా చెయ్యి ఊపి నా ఉనికి  చెప్పాల్సివచ్చింది అంది కొంచెం సిగ్గుగా..
ఆత్మీయులని  చూసినప్పుడు అలా  ఆనందంని  ప్రకటించడం విడ్డూరం కాదు కదండీ. అది వారి మధ్య ఉన్న అనుబంధాన్ని పట్టి ఇస్తుంది..అని చెప్పాడు ఆనంద్ మిత్రుడు.
తనని తానూ పరిచయం చేసుకుంటూ  “ఐ యాం మిత్ర “.. అని చెప్పాడు.
ఈ రెండు రోజులనుండి మీరు కనబడతారేమో అని చూస్తున్నాను వూరిలో లేరేమో.. అందుకే ఇక్కడి రాలేదు .. అనుకున్నాను అన్నాడు.ఆనంద్.
ఆ మాటల్లో  ఇన్నేళ్ళ తర్వాత కూడా నువ్వు కనబడవేమో..! అన్న నిరాశ పడినట్లు అనిపించింది.
” అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చేసారు, అందుకే రాలేకపోయాను. చాలా మిస్ అయ్యాను కూడా.” చెప్పింది.
చాలా బాగా ఏర్పాటు చేసిన  భోజనాల స్థలం వద్దకు వెళ్లి చేతులు శుభ్రం చేసుకుని ప్లేట్లు తీసుకుని ఇష్టమైన పదార్ధాలు  పెట్టించుకుని.. దూరంగా వెళ్లి తినడానికి ఉపక్రమిస్తూ.. ఏమిటి..”కభీ కభీ” చిత్రంలో “అమితాబ్”  వి అయిపోయారు  ? అడిగేసింది ఉగ్గబట్టుకోలేనట్లు.
కొంచెం సేపు మౌనం తర్వాత కవిత్వం వ్రాయాలన్న ఆసక్తి, వ్రాయించే స్పందన, అనుభూతి..కూడా ఉండాలిగా.. అన్నాడు ప్రశ్నిస్తున్నట్లు.
అవునేమో! అయినా అందరూ స్పందనతోనే కవిత్వం వ్రాస్తున్నారు అంటారా? మీలాంటి మంచి కవిత్వం వ్రాయగల్గినవారు వ్రాయకపోవడం ఒక రకంగా కవిత్వ ప్రక్రియకి అన్యాయం చేసినట్లే!అంది స్నేహ.
మాటైనా..బాటైనా ..నా తీరు ఇంతేనేమో! మీ రచనలు చూస్తున్నాను. బావుంటున్నాయి అని చెప్పను కాని కొన్ని లోపాలు కన్పిస్తూ ఉంటాయి అని నిర్మొహమాటంగా చెప్పాడు.
అలవాటైన ఆ నిర్మోహమాటాన్ని తట్టుకుంటూనే..”మనిషిలో ఏ మాత్రం మార్పు లేదు” అనుకుంటూ .. తన లోపాలని అంగీకరించింది.
రేపు ఆఖరి రోజు కదా.. మీరు కూడా వస్తారు కదా! అడిగాడు మిత్ర.
రేపు  కొందరు స్నేహితులు వస్తానని ఫోన్ చేసి చెప్పారు.కాబట్టి తప్పకుండా వస్తాను. చెప్పింది స్నేహ.
అయితే మీరొక హెల్ప్ చెయ్యాలి, మీరు చాలా అందమైన లేఖలు వ్రాస్తారని ఇంతకు క్రితమే ఆనంద్ చెప్పాడు. మీరు నాకొక ప్రేమ లేఖ వ్రాయాలి అని చొరవగా అడిగేసాడు మిత్ర.
అస్సలు కుదరదడీ..మా వారు ఊరుకోరు .. నవ్వుతూ చెప్పింది.
తన మాటలో దొర్లిన తప్పు  అర్ధమయి “సారీ సారీ !! నాకొక అందమైన ప్రేమ లేఖ వ్రాసి పెట్టాలి.అది నా ప్రేయసికి ఇవ్వగానే ఆమె ఇంప్రెస్స్ అయిపోయి నా ప్రేమకి  పడిపోవాలి ” అని చెప్పాడు.
ఒరేయ్ !.. అమ్మాయిలూ నిజాయితీ అయిన ప్రేమకి, స్వచ్చమైన ప్రేమకి కూడా పడటంలేదు. నువ్వు ప్రేమించే అమ్మాయి  ఒక్క  ప్రేమ లేఖకే పడిపోతుందా!? ఇలాంటి ప్రయత్నాలు మాని వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో పెళ్లి విషయం గురించి  మాట్లాడు ..అని మందలించాడు ఆనంద్.
నేను కూడా ఒక కవిని అని ఆమె ముందు నిరూపించుకోవాలి.ఇంత  మంది  మిత్రులు ఉండి  కూడా నాకు ఈ చిన్న సాయం చేయలేరా..? విచారం తెచ్చిపెట్టుకుంటూ..అడిగాడు మిత్ర.
అతను అడిగినతీరు నచ్చి “నేను తప్పక  వ్రాసి పెడతాను.సరేనా! హామీ ఇచ్చేసింది స్నేహ.
మీరు చాలా సునిశితులండి ! చిన్న పాటి తప్పులని కూడా గుర్తిస్తారు.మీతో జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటూనే.. “రేపటికి నాకు ప్రేమ లేఖ ఇచ్చేస్తారుకదా !” మళ్ళీ అడిగాడు.
అదిగో.. మళ్ళీ అలాగే అంటున్నారు. అంటూ … నవ్వేసింది. అయినా నా ప్రేమ లేఖ అందుకునే అదృష్టం ఒక్కరికే ఉంటుంది లెండి…అంది తమాషాగా అంటున్నట్లు.
భోజనం  ముగించి సభ జరుగుతున్న హాల్లోకి వెళ్లి ముగ్గురూ ఒక చోటునే కూర్చున్నారు.
ఆనంద్ తో..చాలా మాట్లాడాలి అనుకున్న స్నేహకి ఆ అవకాశం లభించడం లేదు అనే కన్నా.. ఆనంద్ ఆ అవకాశం ఇవ్వడంలేదు అన్నది అర్ధం అయింది. ఆమె మనసుకు బాధ కల్గింది. మధ్య మధ్యలో ఆనంద్ వైపు చూస్తుంది. అతను చాలా మాములుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు అనిపించింది.
సమయం ఆరు గంటలవుతుండగా  .. ఇక నేను వెళ్ళాలి మీరు కూడా మా ఇంటికి  వస్తే చాలా సంతోషం. “వెళదాం రండి “..ఆహ్వానించింది.  ఇప్పుడే ఇక్కడ మరొక ఫ్రెండ్ కలుస్తానని  చెప్పాడు. వీలుంటే..రేపు వస్తాము. మీరు వెళ్ళిరండి. చెప్పాడు ఆనంద్.
స్నేహ మరేం మాట్లాడకుండా .. “వెళ్లొస్తాను ” అని చెప్పి లేచి వచ్చేస్తూ.. ఎంట్రెన్స్ వరకు వచ్చాక వెనుతిరిగి చూసింది. ఆనంద్ తనవైపు చూస్తూ ..కనిపించాడు. మనసు కొంచెం తేలిక పడినట్లు అనిపించింది.
రాత్రి పన్నెండు గంటల తర్వాత అందరు నిద్ర పోయారనుకుని తీర్మానిన్చుకున్నాక.. మిత్ర కిచ్చిన మాట కోసం బెడ్ లైట్ వెలుతురులోనే.. ప్రేమ లేఖ వ్రాయడం మొదలెట్టింది. అరగంట గడిచినా.. ఒక్క వాక్యం వ్రాయడానికి కూడా ఆమె మనసు అంగీకరించలేకపోతుంది.
తనకి ఏమైంది? తమ చుట్టూ జరిగే సంఘటనలని,తన అనుభవాలని,ఊహలని కలిపి..ప్రవాహంలా వ్రాసే తను ఒక్క ప్రేమ లేఖ వ్రాయలేకపోతుంది. తల పగిలిపోతుంది. కలం కదలనంటుంది.విసుగ్గా అనిపించి లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది.పరదాలని ప్రక్కకి నెట్టి బయటకి చూసింది. మసక వెన్నెలని తరగి పోతున్న చంద్రుడిని చూసాక ముసుగేసిన  ఆమె మనసు బయటకి వచ్చింది. ఆనంద్ రూపం,ఆనంద్ మనసు కళ్ళ తడిలో కదలాడింది.
వెనుకకి వచ్చి వ్రాయడానికి ఉపక్రమించింది.
ఎన్నటికి మరువలేని స్నేహమా! ప్రేమ ప్రయాణంలో అంతర్ధానమైన హృదయమా!! మత్తు మందుని మించిన మోహమా! పిరికితనంతో మొహం చాటేసిన పాషాణమా !
ఈ ప్రణయ వేదికని జ్వాలగా రగిలిస్తూనే మలగని జ్యోతిగా మిగిలున్నావు. ఉబికి వచ్చే ఉప్పునీటి ఆనవాలుగా మిగిలున్నావు.
క్షణ క్షణం నిన్ను తలవకుండా ఉండలేని నా పంచ ప్రాణమా! నా ప్రాణ శక్తిని తోడేసుకుని నిర్జీవిగా వదిలేసి వెళ్ళిన ..నా చెలి! నెచ్చెలి!! గతమొక జ్ఞాపకం లా మారింది..
ఆనాటి కల  నే మరచేనా !?
చేరువైన చెలిమిని ఆహ్వానిస్తుంటే కెరటంలా మదిని తాకావు.గుండె గుడిలో దీపమై వెలిగావు. వెంటాడే నీ చూపులు మాట లాడతాయి, నీ మందస్మితాలు పాటలుపాడుతాయి
నీ మౌనంకూడా మంత్రంలా మారి కాలాన్ని కరిగిస్తుంది.నీ ఊహలు నా ఊహలు కలిసి శ్వాసిస్తాయి. నా ధ్యాసలు నిన్ను దాటి మరో ప్రపంచం వైపు మరలను అంటున్నాయి.
ఇది.. నీ కోసం నేను పడిన తపన. తలచుకుంటేనే… నరకప్రాయమైన ఈ బతుకు నాకెందుకు? అన్న నా ప్రశ్నకి సమాధానమే లేదు.
ఒకప్పటి నీ బాసలు బ్రతికిస్తున్నాయేమో ! మానని గాయాన్ని రేపుతున్న మంటలా..ఇలా..
నా ఎదని అల్లుకున్న తీగవైనావు అన్నావు  నా పాదాల చెంత కైనా చేరే పువ్వునవుతావన్నావు. నీ కలల హారతిలో నా కలల కర్పూరం జతజేస్తానన్నావు
రాగమనే పరిమళాన్ని చవి చూపించి అనురాగమనే గంధాన్ని చిలకరించి….
నీ మనసుని,నీ యవ్వనపు ప్రాయాన్ని ముడుపుగా కట్టి దాచి ఉంచి వాటిని దోచుకునే ఒడుపులు తెలిసిన చెలికాడివి నీవే కదా ! అని ఊరించావు
పుచ్చ పువ్వులా పూసిన పున్నమి లాంటి మన ప్రేమ వెన్నెలలా… విరగబడి నవ్వుతుండగానే
దప్పిక గొన్నరాకాసి  మబ్బుల్లా కమ్మేసిన క్షణాలు గ్రహణం లా కాటేసిన అంతరాలు ..
ఆహుతి గా మారిన  నా ఒకే ఒక్క మనసు..
ఈ గతమంతా  చేదు  తీపైన జ్ఞాపకం
జీవితానికి వెలకట్టే షరాబులున్న ఈ లోకంలో .. నా ప్రేమకి వెలకట్టగల షరాబు నీకన్న వేరెవ్వరు…? ఆ వెల  మనం కలగన్న మనదైన రాత్రిన  నేను కట్టే కొంగు బంగారమంత.
మనిషి సగమయ్యేది తనని తాను తగ్గించుకున్నప్పుడు,  తనలో  తనదైన ఇంకో సగంని ఐక్యం గావించు కున్నప్పుడు…
కలలు కల్లలు గా మిగిలిపోయిన ..ఇప్పుడు జీవనం అంతా.. దుఖపు నది. జీవితపు సంతోషతీరం ఆవలి ఒడ్డున ఊరిస్తూ ఉంటుంది.
నదిని దాటించే తెప్ప కూడా దుఃఖ రాసులతో తొణికిసలాడు తుండగా.. తెప్పని ఒడ్డుకు లాగే ప్రయత్నం లో గెలిచి అలసి…
మమకారాల నివాళులందుకుంటూ… క్షమించి  చెలిమి నిచ్చే చల్లని చేయినయి…
ఇలా ఏక బిగిన వ్రాసేసి.. ముగింపు ఏం వ్రాయాలో తెలియక ఆగిపోయింది.
మొదటి నుండి  చదివింది.మళ్ళీ మళ్ళీ చదివింది.కానీ ముగింపు వ్రాయలేకపోయింది.
ఇది నేనే వ్రాశానా?  తనని తానూ ప్రశ్నించుకుంది. “కాదు కాదు.. నాలో ఉన్న ..ఇంకో మనసు అచ్చు తను వ్రాసే రీతిన వ్రాయించింది” అను కుంటూ..
రెండు మనసుల స్పందన ఒకటే కదా! అందుకే ఇలా వ్రాయగల్గింది.
ఆ కాగితాలని భద్రంగా దాచి పెట్టి పడుకుంది. నిశిరాత్రి..ఆమె ఆలోచనలలో కరిగిపోయింది.
తెల్లవారుతూనే ఇంటి పనులు అన్ని చేసుకుని అందరికి అన్ని సమకూర్చి.. తొమ్మిది గంటలకి అలా.. సభలు జరుగుతున్నా చోటుకి వచ్చేసింది. ఆనంద్,మిత్ర అప్పటికే అక్కడ ఉన్నారు.
అరె!ఆలస్యంగా వచ్చినట్లు ఉన్నాను అంది.
లేదండి..నేనే త్వరగా వచ్చేసాను. నాకు ఆ లెటర్ ఇచ్చేస్త్రారా?ఆత్రంగా అడిగాడుమిత్ర.
సారీ !..నేను వ్రాయలేకపోయాను..అని చెప్పింది. మీ అడ్రస్ ఇస్తే …త్వరలో వ్రాసి పోస్ట్ లో పంపుతాను సరేనా.. క్షమాపణ గా అడిగింది.
పర్వాలేదు..స్నేహ గారు.. ఏ లేఖ వ్రాయాలన్నా.. ఫీలింగ్స్ ఉండాలి కదా!  నా ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ గా మారలేవు కదా! ఆనంద్ అన్నట్టు.. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళే ఎక్స్ ప్రెస్ చేయాలి. నా తంటాలు ఏవో నేను పడతాను. మీకు ఇబ్బంది కల్గిస్తే క్షమించండి .. హృదయ పూర్వకంగా చెప్పాడు.
స్నేహ మాట్లాడకుండా ఉండి  పోయింది.
ఆనంద్ ఒంటరిగా దొరికినప్పుడు.. హ్యాండ్ బాగ్ లోనుండి .. ఒక కవరు తీసి అతని చేతిలో ఉంచింది.  అది తను రాత్రి వ్రాసిన అసంపూర్తి లేఖ.
ఏమిటిది !? అడిగాడు ఆనంద్
ప్లీజ్ ఆనంద్..! నన్ను ఇప్పుడు ఏమి అడగకు..నేను వ్రాసినదే!  కానీ అది నాలా నేను వ్రాయలేదు. వ్రాసింది, వ్రాయించింది  ఎవరో.. నీవు  మాత్రమే చెప్పగలవు .. చెమర్చిన కన్నులతో.. వణుకు తున్న గొంతుతో చెప్పింది.
ఆనంద్ .. ఆ కవరుని పదిలంగా .. గుండెకి దగ్గరగా చేర్చుకున్నాడు.
దాదాపు తొమ్మిదేళ్ళ  వారి  కలయికలో …కొన్ని అపార్ధాలు   మబ్బుల్లా   మాయమయ్యాయి.
ఎన్నటికి  తీరం చేరని నౌకలా.. ఎన్నటికి కలవని ప్రేమలు..ఉంటాయి.
వ్రాసుకున్న లేఖలు.. చేదు, తీపి జ్ఞాపకాలు గుండెల్ని గుచ్చే గులాబీల్లా వాడకుండా ఉంటాయి.
ఒంటరి పయనం ..ఒకరిదైతే.. అన్నీ ఉన్నా ఒంటరితనం వెదుక్కునే ఇంకొకరు కావచ్చు. లేదా …ఎవరి జీవితాలు వారివి కావచ్చు.కానీ ఆ లేఖలు మాత్రం బ్రతికే ఉంటాయి.
“చిక్కి శల్యం అయినా..సరే. శవం అయ్యేదాకా అయినా సరే!”
ఒక నెల రోజుల తర్వాత.. ఆనంద్ పేరుతొ ప్రచురితమైన  కవిత ని  ఒక పత్రికలో చూసి ఆత్రంగా  అది చదివిన స్నేహ నయనం చెమ్మ గిల్గింది.హృదయం భారమైంది.
తన లేఖ అతనిలో స్పందన కల్గించింది అందుకే ఇన్నేళ్ళకి ఈ అక్షరాల రూపంలో అతని మనో భావాలకి రూపం వచ్చింది అని అనుకుంది.
ఆమె  డైరీ లో మరో పుట ఇలా నల్లని అక్షరాలతో..నిండి పోయింది.
తొలకరి చినుకు లాంటిది  స్నేహం పువ్వులో పరిమళం లాంటి ప్రేమ.
మంచును కరిగించే  కిరణం స్నేహం కల్మషం ని కడిగేసే జడి వాన ప్రేమ.
ఒక కలలా సాగే పయనం స్నేహం పవన వీచికలో  వినిపించే పాట  ప్రేమ
ప్రేమ, స్నేహం నమ్మకంలో నమ్మకమై ఉంటుంది. నిజంగా నీ హృదయంతో  నువ్వు పిలిచినప్పుడు ఈ రెండు నీతోనే ఉంటాయి నీలోనే ఉంటాయి. గుర్తించే మనో నేత్రం మనకుంటే చాలు…
ప్రకటనలు

92 thoughts on “బ్లాగ్లోకపు ఉక్కుమహిళ

 1. వనజ గారు,
  మీ ఇంటర్వ్యూ నాకు నచ్చింది. మీ బ్లాగు రచన అనుభవాలు, ఒక స్త్రీ గా బ్లాగు నడపడం లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి చాలా బాగా చెప్పారు.
  అలాగే అడ్రస్, ఫోటో తో సహా ఇంటర్వ్యూ ఇచ్చారు. . అభినందనలు…

  • కృష్ణ ప్రియ గారు.. ధన్యవాదములు.
   నా గురించి ఓపెన్ గా పరిచయం చేసుకోగాల్గాను కాని.. నా కుటుంబ నేపధ్యం వ్రాయలేదు. అంటే.. నన్ను ప్రకటించుకోవడానికి అభ్యంతరం ఉన్నట్లే కదా మేడం.
   మహిళలు ఎంత ఎదిగినా బోన్సాయి మొక్కల కన్నా హీనం..అని కొందరి అభిప్రాయం. కొన్ని చోట తలవంచాల్సి వస్తుంది. అలాంటి దుస్థితి నుండి బయటపడాలని నా ఆకాంక్ష.

   • మీ కుటుంబనేపధ్యం మీ బ్లాగ్ చెపుతుంది కదండీ? ఇక మీరు అడ్రెస్స్ ఇచ్చాక ఇంకా ఏదో ప్రకటించుకోవడానికి మీరు అభ్యంతరపడినది ఖచ్చితంగా లేదు. తలవంచుతున్నారు అంటే, అది కేవలం మీ చాయిస్ మాత్రమె కాని ఇంకొకరి వలన ప్రత్యేకంగా సమస్య వుంటుంది అని నేను అనుకోను.

    మీ సమస్యను ఇక్కడ క్లియర్ గా చర్చించ వచ్చును. ఆ విధంగా మీ పరిచయ వేదిక అందరికీ మరికాస్త ఉపయోగకరంగా ఉంటుంది.(మీకు అభ్యంతరం లేకపోతేనే )

   • మౌళి గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.

    మీరు చెప్పినట్లు నా కుటుంబ నేపధ్యం గురించి నా బ్లాగ్ లోనే ఉంది

    మహిళలు రాజకీయరంగ ప్రవేశం గురించి, మద్యం షాపుల వల్ల ఇబ్బందుల గురించి.. కొన్ని నిజమైన సంఘటనల గురించి వ్రాసినప్పుడు ఫలానా వారి కోడలు అని బహిరంగంగా చెప్పడం గురించి.. ఇంకా చాలా విషయాలపై మా కుటుంబ సభ్యుల ఒత్తిడి వచ్చింది. అవన్నీ వ్రాయడం ఎందుకు ? అన్న ప్రశ్నలు ఎదుర్కున్నాను.అలా వ్రాయకూడదని ఆంక్షలు ఉన్నాయి.

    మా అన్నయ్య, నా కొడుకు వీరు ఇరువురు మాత్రమే నేను చేసిన వ్యక్తీకరణ కి ఎప్పుడు అభ్యంతరం చెప్పరు. మిగతా కుటుంబ సభ్యులకి అన్ని అభ్యంతరాలే! “ఇంటి పేరు” “మనలో మనం ” అనే కవిత ని వ్రాసినప్పుడూ నా అంతరంగమే అందులో వ్యక్తం అయినాయి.

    ఇష్టమైన వ్యాపకం కొనసాగించుకునే స్వేచ్చ నా కుటుంబం నాకు ఇవ్వలేదు. కొన్ని పరిదులకి లోబడే నేను ఉన్నాను.సాహితీ సభలకి, సమావేశంలకి వెళ్ళడం కూడా మానుకోవాల్సి వచ్చింది. నాకే కాదు చాలా మంది స్త్రీలకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి అప్పుడు ఎలా స్వేచ్చగా వ్రాయగలరు.చెప్పండి. ఆ విషయం దృష్టిలో ఉంచుకునే నేను “కృష్ణ ప్రియ” గారి కామెంట్ కి అలా స్పందించాను.

    ఇక నా జీవన నేపధ్యం

    తల్లి దండ్రులు : సాంబశివరావు – రాజేశ్వరి. మా తల్లి గారికి చాలా అభ్యుద భావాలు కమ్యూనిస్ట్ ల ప్రభావం గల కుటుంబంలో పుట్టిన వ్యక్తి.విపరీతంగా పుస్తకాలు చదివే వారు.ఆ ప్రభావమే మమ్మల్ని పెంచడంలో ఉండేది. ఇక నాన్న గారు మాది సంప్రదాయ వ్యవసాయ సంపన్న కుటుంబం . ప్రస్తుత పరిస్థితి మా తాతలు నేతులు తాగారు..లాంటి సామెతకి సరిగ్గా వర్తిస్తుంది.

    ఇక నా మేట్టినిల్లు గురించి.: సంప్రదాయ వ్యవసాయ కుటుంబం. రెండు తరాల నుండి విద్యాధికులు అయినప్పటికీ వ్యవసాయం పైనే మక్కువ ఎక్కువ.
    భర్త :తాతినేని అశోక్ . మెకానికల్ ఇంజినీరింగ్ . చదివి టైం పాస్ బిజినెస్ చేస్తుంటారు.
    మా కుటుంబం లో ఇప్పటి తరం వారంతా ..అమెరికా సంయుక్త రాష్ట్రాల నివాసులై పోయారు.
    ఇదండీ .నా కుటుంబ నేపధ్యం.

    ఇక నా గురించి.. నా బ్లాగ్ చెపుతుంది కదండీ.! 🙂

    థాంక్ యు మౌళీ గారు.

   • మీ వ్యాఖ్యకి కంట నీరు తిరిగింది వనజ గారూ …కుటుంబాన్ని ఇష్టంగా ప్రేమిస్తూనే కోల్పోయిన వాటిని అండర్ టోన్ లో చెప్పిన మీ వ్యాఖ్యే ఒక గొప్ప రచన.మన దుఃఖాలు వ్యక్తి గతం కాదు సామాజికం…రాజకీయం…సంక్లిష్టం…మాట్లాడుకోవడం తప్పు కాదు.

   • వనజగారు, బహు చక్కని స్పందన. వ్యక్తిగతంగా ఆలోచించి వ్రాసిన రచనకు ఒక్కరోజుకు మించి విలువ ఉండదు. బహుసా అందుకే మీ కుటుంబ సభ్యులు కూడా వద్దని చెపుతారు. కేవలం శైలిని మార్చుకోవడం వల్ల ఈ సమస్య చిన్నదవుతుంది. వ్రాయాలన్న తపన మీకు మార్గం చూపిస్తుంది తప్పకుండా.

    ఇక బ్లాగ్ రచనలో మీ అనుభవాలు గురించి, కొంత కన్ఫ్యూజన్ తో చెప్పారు. క్రొత్తవారికి అయినా పాతవారికి అయినా ప్రత్యేకమైన ప్రోత్సాహం ఏమి ఇక్కడ ఉండదు అండీ. అందరికీ ఉండేది ఆ కొంచెం సమయమే. సీనియర్ బ్లాగర్స్ అనే సమూహం కూడా ఏమి లేదు. కొత్త బ్లాగర్స్ బాధపడవలసిన పని కూడా లేదు. బ్లాగ్ వ్రాసేది ఆలోచనలని తెలియజేయడానికి. మీరు వ్రాసింది నచ్చితే యెంత పెద్ద బ్లాగర్ అయినా వచ్చి పలుకరిస్తారు. పెద్ద అంటే మీ దృష్టిలో కుప్పలు కుప్పలుగా వ్యాఖ్యలు వచ్చి పడే బ్లాగులు అయితే అది పూర్తిగా అపోహ.

    తేడాలు, గ్రూపిజం ఇవ్వన్నీ మీ అపోహలు మాత్రమె. ఒకవేళ ఉన్నా అది మీ సమస్య ఎందుకు అవుతుంది.

    @ఎగతాళి చేసేవారు ఉన్నారు.అనామకులుగా వచ్చి కామెంట్స్ తో బాధ పెట్టేవారు ఉన్నారు. స్త్రీల సమస్యలపై స్పందించితే వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారు ఉన్నారు.

    పరస్పర విరుద్ద అభిప్రాయాలు ఉన్నపుడు వీటిని ఎదుర్కోవాలి. వీటిపై అవగాహన ఉండాలి. చెప్పాక వఛ్చిన విమర్శలపై ‘వివరణ’ ఇవ్వాల్సిన పనిలేదు. ఎక్కడయినా ఒక పదిమంది గుంపుగా వ్యాఖ్యలు, పొగడ్తలు వ్రాసుకుంటున్నారు అంటే వారికది తప్పనిసరి పరిస్థితి. అంతే కాని తేడాలుగా ఎంచనవసరం లేదు.

    మీకున్న పని ఒత్తిడి లో కూడా ఇంతసమయం బ్లాగ్స్ కి ఇవ్వడం చాలా మంచి విషయం, స్పూర్తిదాయకం.

   • వనజ గారు,
    ఈ పరిచయం, ఇంటర్వ్యూ మీగురించి కదా. అందువల్ల మిమ్మల్ని మీరు ప్రకటించుకున్నట్లే! ఇక కుటుంబం గురించి చెప్పాలా వద్దా? అన్నది అందరి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి.. నా అభినందనలు ఇంకా వాలిడ్ ..:) డబల్ అభినందనలు..

   • అలాగే..
    >>>కుటుంబాన్ని ఇష్టంగా ప్రేమిస్తూనే కోల్పోయిన వాటిని అండర్ టోన్ లో చెప్పిన మీ వ్యాఖ్యే ఒక గొప్ప రచన.>>>
    totally agreed with jajimalli gaaru on this.

   • థాంక్ యూ కృష్ణ ప్రియా..
    మీరూ మౌళి గారూ పెట్టిన వ్యాఖ్యల వలన వనజ గారు ధైర్యం గానూ సంస్కారంగానూ ఆమె అంతరంగాన్ని మరింత ఆవిష్కరించగలిగారు..అందుకు మీ ఇద్దరికీ కూడా అభినందనలు.

   • మౌళి గారు.. మీ ఈ వ్య్క్యలో నాకు చాలా సూచనలు అందాయి. మీ సూచనలు నాకు చాలా ఉపయోగపడతాయి. మరీ మరీ ధన్యవాదములు.

 2. అవకాశము ఉంటే మరో ఇందిర ను వనజ వనమాలి గారిలో చూసే వారమే. చక్కని పోలిక చేసారు. ఉక్కు మహిళను పరిచయం చేసినందుకు సౌరభాన్ని పేరులో నింపుకున్న మీకు నా ధన్యవాదములు

 3. అవకాశము ఉంటే మరో ఇందిర ను వనజ వనమాలి గారిలో చూసే వారమే. చక్కని పోలిక చేసారు. ఉక్కు మహిళను పరిచయం చేసినందుకు సౌరభాన్ని పేరులో నింపుకున్న మీకు నా ధన్యవాదములు
  మరిన్ని చైతన్య వంతమైన పోస్ట్లు వ్రాయా లని కోరు కుంటున్నాం.

 4. జాజిమల్లి గారు, వనజ గారికి ఉక్కుమహిళ అని సరి అయిన పేరు పెట్టారు. నాకు భలే నచ్చింది.

  వనజ గారు కుండబద్దలుకొట్టిన మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. మీ రచనలలో మీరు ఎంచుకున్న రచనలు చాలా బాగున్నాయి.మీ నుంచి ఇంకా ఎన్నో రచనలు చదవాలని ఆశిస్తున్నాను. అభినందనలు.

 5. “అందరూ నదులు కానవసరం లేదు. పిల్ల కాలువలు అయినా నయమే కదా !”

  నాలాంటి చాలా మంది ఇంకా బ్లాగులు రాయటానికి కారణం మీ ఇలాంటి మాటలే
  వనజవనమాలి గారూ..
  ఈ రోజు ఏమి పోస్ట్ పెడతారా అని ఎదురుచూసే మీ అభిమానుల్లో నేను కూడా ఉంటాను 🙂

  మీ పరిచయం బాగుంది.. అభినందనలు…

  • రాజీ గారు.. మనమంతా బ్లాగ్ ముఖంగా మిత్రులం. మన భావాలు,ఆలోచనలు అన్ని పంచుకునే వేదిక ఇది. ఇక్కడ ఎవరి ఉనికి తక్కువేమీ కాదు.అందరూ.. స్పూర్తివంతంగా ,చైతన్యవంతంగా ఉండాలని.. ఆకాంక్ష.

   రాజీ గారు.. మీకు మనసా ధన్యవాదములు.

 6. వనజక్క చాలా చక్కగా ధైర్యంగా భావ వ్యక్తీకరణ చేస్తారు.
  చిన్న ,పెద్ద తేడా లేకుండా అందరిని ప్రోత్సహిస్తారు.
  తను కామెంట్ వ్రాస్తే నాకు భలే హుషారు వస్తుంది.స్వయంగా చూసాను
  మా బాబుకి సూచనలు ఇచ్చేటపుడు తను లోకాన్ని ఎంతగా పరిశీలించారో.
  ఒక మంచి స్నేహితురాలు

  • శశి కళ గారు.. ఇక్కడ అందరూ.. సమానమే కదా! మీరు కూడా ఎంతో చక్కగా వ్రాస్తారు. అందరూ అభిమానం తో మెలగాలని మనసారా కోరుకుంటాను. .మీ అభిమానానికి మరీ మరీ ధన్యవాదములు.

 7. వనజ రచలన్నీ మొదటి నుండీ చదువుతున్నాను . కవికులము లొ నేను మెచ్హిన, నచ్హిన నెచ్హలి వనజ. సహ కవులను ప్రసంసించె సహ్రుదయం కలిగిన మంచి నేస్తం, రచనల్లొ నిరాడంబరత, నిర్మొఖ మాటం తన సొత్తు. వనజా మీ కలం నుండి ఇంకా ఎన్నొ మంచి రచనలు రావాలని మనసారా కొరుకొంటూ.. మీ మెరాజ్ .

 8. మల్లీశ్వరి గారు.. నన్ను పరిచయం చేస్తూ.. మీరు ఇచ్చిన శీర్షిక చూసి.. నాకు మాట రాలేదు.
  నన్ను నిశితంగా పరిశీలించిన పిమ్మటనే మీకు ఈ శీర్షిక పెట్టాలని అనిపించి ఉంటుంది. అని ఆలోచిస్తుంటే నాకు వండర్ గా ఉంది.
  ధన్యవాదములు. నాకు ఈ పరిచయ వాక్యం మరింత దైర్యాన్ని చేకూరుస్తుంది.

  స్వభావ సిద్దంగా నేను చాలా నిర్భయంగా ఉంటాను. నా ఆలోచనా విధానమే అందుకు కారణం అని నా మిత్రులందరూ అంటూ ఉంటారు. నన్ను పెంచిన పెంపకం, మరియు జీవితాన్ని నేను పోరాట దృష్టిలో చూసిన కోణం ఇవన్నీ నన్ను సూటిగా, నిర్భయంగా, స్థిరత్వంగా .ఉంచుతాయి.

  నా బ్లాగ్ లో నా వ్రాతలు కూడా.. నా మనోభావాలని ప్రతిబింబిస్తాయి కూడా.
  నేను ఉక్కు మహిళ ని అయినా.. ఒక భాద్యత గల అమ్మని. బేలని కూడా.నాలో సున్నితత్వం కూడా మెండు గానే ఉంటుంది . 🙂

  నన్ను బ్లాగ్ లోకానికి పరిచయం చేసిన మీకు మరీ మరీ ధన్యవాదములు. కు

  • వనజ గారూ,
   మీరు దృఢ స్వభావులు.చిత్రంగా నేను ఆ విషయాన్ని మీ రచనల ద్వారా కన్నా మీ వ్యాఖ్యల ద్వారా గమనించాను.ఆ గ్రహింపు నిజమేనని ఈ పోస్ట్ కి వచ్చిన స్పందనలు తెలిపాయి ..మీకు అభినందనలు కృతజ్ఞతలు.

 9. vanajavanamali gari interview ni post chesinadhuku malleeswari gariki na hrudhayapurvaka dhanyavadhamulu 🙂 vanaja garu, meeru mee vanthuga chesthuna krushi entho abhinandhaneeyam ,, ” sharing Knowledge and passing on to the next generation is the best thing I found in you”
  nenu , inka na laga endharo telugu sahithyam,,inka kannavari paina, desam paina mamkaram unnavariki mee “posts”, chala nachuthayi,, prasthutha prapanchaniki avi entho avasaramga nenu bhavisthunanu.
  Nice post 🙂
  —– emaina tappulunte kshaminchandi, nenu bloglu ee madhye chusthunanu

  • అంజలి గీతా.. మీకు మనసారా ధన్యవాదములు.

   మీలాంటి యువత ఇలా మీ ముందు తరం వారి భావ వ్యక్తీకరణ ని గమనించడం అంటే.. చాలా సంతోషంగా ఉంది. బ్లాగ్ మాధ్యమం ఇంత త్వరగా అందరికి చేరువ కాబాడటం కన్నా కావలసినది ఏముంది?
   మీతో పంచుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. మీ యువత కోసమే చాలా పోస్ట్ లు వ్రాసాను. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వ్రాయడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం.. మన భారతీయ కళ ని వ్యాపారాత్మకంగా మార్చే దశలో.. కొంచెం పని ఒత్తిడి లో ఉన్నాను.

   మీ అభిమాన పూర్వక వ్యాఖ్యకి మరీ మరీ ధన్యవాదములు..

   • malleswari gari ki na hrudhayapurvaka dhanyavadhamulu, nenu inka srothenee nandi (audience),, mee lanti vari parichayam, ituvanti blogula dhvara ainanduku entho anandhamga undandi 🙂

    prapanchamlo telugu varu ekkadunna, oka sannati dharamtho andharam apyayamga bandhinchi badi unnatu anipisthundi, anduku ee blogule nidharsanam, ippati taram varasuluga, raboyee taraniki margadharsakulaga andharam melagalane, mana sabhyatha samskharalu, nurrellu vardhilalani,, ee bloglu follow avtunna andharini manasara korukuntunanu 🙂

 10. వనజ గారూ! మీ ఇంటర్వూ చాలా బాగుంది. మీ ఆలోచనలు, వ్యక్తిత్వం, నిర్భయత్వం… ఇందులో చక్కగా ప్రస్పుటించాయి. కొన్ని విషయాల్లో చాలా స్పూర్తిదాయకముగా ఆలోచించారు. మీకు ప్రత్యేక అభినందనలు.

  • రాజ్ గారు.. మనసారా ధన్యవాదములు. నేను బ్లాగ్ ల లోకి వచ్చిన కొత్తలో మీ బ్లాగ్ చూడటం జరిగింది. మీరు వ్రాసేవిధానం చూసి నేను చాలా నేర్చుకున్నాను. ప్రతి నిత్యం నేను చూసే బ్లాగ్ లలో మీ బ్లాగ్ ఒకటి. ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి బ్లాగ్ లు చదవాలి అనుకుంటే ఎవరైనా మీ బ్లాగ్ చూడాల్సిందే! నాకు బాగా నచ్చిన బ్లాగ్ మీ బ్లాగ్ అని మళ్ళీ చెపుతున్నాను. ధన్యవాదములు.

 11. మల్లీశ్వరి గారు చేస్తున్న ఈ బ్లాగర్ల పరిచయాలు చాలా బాగుంటున్నాయి.వనజ గారిని ఉక్కుమహిళా బ్లాగరు గా పేర్కొనడం సమంజసంగా ఉంది. నువ్వు వదిలేసిన కాడి కవిత అద్భుతంగా ఉంది.నేను బ్లాగ్లోకం లోకి ఆలస్యంగా రావడంతో ఇలాంటివెన్నో మిస్ అయ్యాను. అక్కడికీ పాతవి వెతుక్కుని చదువు తూనే ఉంటాను.

 12. వనజ నాకు ఒక శ్రోతగా తెలుసు. శ్రోతగా పరిచయమైన ఒక ఏడాదికే ఆకాశవాణి కి ఎన్నో మంచి స్క్రిప్ట్ లు అందించారు. ఆమె రచనా శైలి చాలా బాగుంటుంది. వ్యక్తిగతంగా చాలా సహృదయ శీలి.చాలా మందికి ఆమె రోల్ మోడల్.ప్రస్తుతం నాకు కూడా. ఆమె స్ఫూర్తి తోనే నేను బ్లాగ్ లోకంలోకి వచ్చాను.
  వనజా ! నేను ఇంత చిన్నగా చూసిన నువ్వేనా ఇంతలా ఎదిగావ్? ఆశ్చర్యంగా ఉందోయ్! ఇంకా ఇంకా వ్రాసి మంచి రచయిత్రిగా ఎదగాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ..అభినందనలతో కుసుమ.AIR
  మల్లీశ్వరి గారు వనజ ని ఇలా పరిచయం చేసిన మీకు మనఃపూర్వక ధన్యవాదములు.

  • కుసుమగారూ,
   మీ వ్యాఖ్య నిజం.బ్లాగుల్లో ఎంతో మంది కొత్తగా రచయిత్రులయ్యారు…అప్పటికే రాస్తున్నవాళ్ళు మరింత వన్నె తేలారు.ధన్యవాదాలు.

  • కుసుమ గారు.. మీరు నాకు చాలా చాలా ఆత్మీయులు.
   మీ అభినందనలకి మనసారా ధన్యవాదములు.

   ముందుతరం రచయితలకి ఆకాశ వాణి పుట్టినిల్లు. అలాగే నా ఆలోచనలని అక్షరంగా మార్చి నేను అందిస్తే.. నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన ఆకాశవాణి ని నేను మరువలేను.
   అలాగే నాకు కొంగ్రొత్త జీవితాన్ని ఇచ్చిన మీ ఆత్మీయత నాకు మరపురానిది
   మీ నుండి నేను చాలా చాలా నేర్చుకున్నాను. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో! మీరు నాకు రోల్ మోడల్ 🙂
   మీ ఆలోచనలని మీ అనుభవాలని బ్లాగర్స్ కి అందించాలని నేను ఎదురు చూస్తున్నాను. ధన్యవాదములు.

   మల్లీశ్వరి గారు.. మీరు చెప్పినది నిజమండి. ఇక్కడ ఎవరి ఆంక్షలు లేవు. స్వేచ్చగా వ్రాసుకుంటాం. అందువల్ల ఎక్కువ అభిప్రాయాలని మనం క్యాచ్ చేయగల్గుతున్నాం. బ్లాగ్ మొదలు పెట్టిన తర్వాత నేను బాగా వ్రాయగల్గుతున్నాను . మీకు మరొకసారి ధన్యవాదములు.

 13. వనజ గారి గురించి చెప్పాలంటే….అందర్నీ ఒక్కటిగా చూసే నైజం, తన భావాలను నిక్కచ్చిగా చెప్పే స్వభావం ఆవిడ స్వంతం. చక్కని శైలితో సమాజానికి స్ఫూర్తినిచ్చే రచనలు చేయడం ఆవిడ నైజం, అదే పలువురికి ఆదర్శం. మనస్పూర్తిగా ఆవిడ చేసే వ్యాఖ్యానం కొత్త బ్లాగర్లకు చక్కని ప్రోత్సాహం.

  జాజిమల్లిగారు వనజగారికి సరియైన పేరు పెట్టారు.

 14. వనజ వనమాలి గారు,

  ఫైర్ బ్రాండ్ అంబాసడర్ ఆఫ్ తెలుగు బ్లాగింగ్ వరల్డ్ అని పట్టా ఇద్దామను కుంటున్నా!

  శుభాకాంక్షలు వనజ వనమాలీ గారు.

  జాజి మల్లి గారు సరి అయిన శీర్షిక పెట్టారు వనజ వనమాలీ గారి పరిచయానికి.

  ప్రశ్నలు జిలేబీ వి –> వనజ గారికి.

  ౧. బ్లాగింగ్ వరల్డ్ కి వచ్చాక మీ రచనా శక్తి పెంపోదిందని (భావ వ్యక్తీ కరణ) మీరు భావిస్తారా?
  ౨. తెలుగు బ్లాగింగ్ వరల్డ్ లో స్త్రీలు ఎటువంటి సబ్జెక్ట్స్ పై ఎక్కువగా రాయాలని మీరు భావిస్తారు?
  ౩. సామాజిక స్పృహ మన బ్లాగుల్లో ఎంత దాకా ఉన్నది?

  జిలేబి.

  • జిలేబి గారు.. మీ అభిమానానికి ధన్యవాదములు. పైర్ బ్రాండ్ అని పేరు పెట్టిన మీరే వనజ గారు కూల్ అండీ! అనేలా ట్రై చేస్తాను. సరేనా ! 🙂

   ఇక ఇలా ప్రశ్నలు ఇక్కడ ఎవరు అడుగలేదు. ఆడుగుతారని ఎదురు చూస్తున్నాను.

   1.బ్లాగ్ వ్రాయడం వల్ల నేను ,నా వ్రాతలు కూడా పరిణితి చెందాయి.

   బ్లాగ్ లో కాకుండా బయట ప్రపంచంకి ఇన్ని అంశాలు ని చెప్పగల్గేదాన్నే కాదు. చేతి వ్రాత తో వ్రాయడం చాలా ఇబ్బంది. కీ బోర్డ్ చాలా సుఖం. అచ్చు తప్పులు సరిచేసుకోవడం సులభం. అదే పేపర్ అయితే వ్రాసినదే వ్రాయడం…నేను ఆ పని అసలు చేయలేను. ఇంకా చెప్పాలంటే బ్లాగ్ ని చదివి ఎంత మంది కామెంట్స్ ఇచ్చారు!. అది నాకు చాలా స్ఫూర్తి నిచ్చింది.

   2. బ్లాగ్ లో స్త్రీలు అన్ని అంశాలను టచ్ చేయాలి. సినిమాలు,రాజకీయం అంతగా ఇష్టపడకపోయినా కూడా వ్రాయాలి. ఎందుకంటే ఆ రెండు అంశాలు విలువలు కోల్పోయి.. మనని నాశనం చేస్తున్నాయి.
   ప్రతి మహిళా తనని తానూ తెలుసుకుంటూ.. ప్రపంచం గురించి తెలుసుకోవాలి. అప్పుడే కుటుంబానికి,బిడ్డలకి ,తనకి,సమాజానికి కూడా మంచిది. అని నా అభిప్రాయం. స్త్రీలు వ్రాసే విషయాలలో సామాజిక అంశాలు తో పాటు తన అభిరుచి కి తగ్గ అన్ని అంశాలు ఉండాలి .ఆ స్వేఛ్చ ఉండగలగడం హక్కు అనుకుంటాను నేను. మిడి మిడి జ్ఞానం కన్నా అన్నీ తెలుసుకోవడం అవసరం. తెలుసు కుంటూ వ్రాయడం చాలా ఉత్సాహం ని ఇస్తుంది.

   3.సామాజిక సృహ 70% వరకు ఉంది. మనం వ్రాసే కథ అయినా కవిత అయినా వ్యాసం అయినా సమకాలీనం ని ప్రతిబింబించాలి అనుకుంటాను నేను. చరిత్ర అవసరమే! కానీ దానిని అదే పనిగా తవ్వుకుంటూ కూర్చుంటే.. వర్తమానంలో పయనించ గలమా! కుల మత వర్గ అనేక భావ జాలాలతో.. వాదోపదాలు నడుస్తుంటాయి.అభిప్రాయాలని మనం మార్చలేం. కనీస అవగాహన లేకుండా మొండిగా వాదించడం ని నేను నిరసిస్తాను.

   ఇక ఆఖరిగా ఒక మాట . సంప్రదాయాన్ని గౌరవిస్తూ, వ్యక్తిత్వం ని కాపాడుకుంటూ..కుటుంబం కోసం శ్రమిస్తూ సామాజిక భాద్యత తో..నడుచుకోవడం అని అనుకుంటే.. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అనుకునే స్త్రీ ని నేను.అందుకు తగిన విధంగానే నా వ్రాతలు ఉంటాయి మేడం.

   బ్లాగ్ వ్రాతల గురించి మరింత నా అభిప్రాయం చెప్పే అవకాశం కల్గించిన మీ ప్రశ్నలకి హృదయపూర్వక ధన్యవాదములు జిలేబీ గారు.

   • వనజ వనమాలీ గారు,

    ‘ఇరగ’ దీసేరండీ !

    చాలా బాగా జవాబులు ఇచ్చారు. నెనర్లు

    జిలేబి.

 15. వనజ గారి బ్లాగ్- నేను బ్లాగ్స్ చూడటం మొదలుపెట్టినప్పటినుంచి ప్రతి టపా చదివేదాన్ని. ఎన్నో రకాల వైవిధ్యమైన టాపిక్స్ తీసుకుని రాయడం ఆవిడ ప్రత్యేకత. చాలా పోస్ట్స్ వనజ గారివి సమాజంలో నిత్యం జరిగే సంఘటనలను ఆధారం గా తీసుకుని రాసినవే. ఉన్నది ఉన్నట్టుగా, నిక్కచ్చిగా రాస్తారు. సామాజిక సృహతో రాసే బ్లాగ్ రచయిత్రులలో ఆవిడది ప్రధమ స్థానం.
  నాకు వనజ గారి రచనా శైలి ఎంతో ఇష్టం.సమయం దొరికినప్పుడల్లా నేను మొట్టమొదట చూసేది ఆవిడ బ్లాగ్..వనజ గారు, రాస్తూ ఉండండి. నా లాంటి అభిమానులు మీకెందరో ఉంటారు.

  జాజిమల్లి గారు, వనజ గారిని బ్లాగ్లోకపు ఉక్కుమహిళ గా మాకు పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

  • జలతారు వెన్నెల గారూ,
   వనజ గారి గురించి నేను పెట్టిన శీర్షికతో ఇంతమంది ప్రత్యేకంగా ఏకీభవించడం సంతోషంగా ఉంది..బహుసా అందరి మనసులో ఉన్నదానిని నేను రిప్రజెంట్ చేసినట్టున్నాను.

  • జలతారు వెన్నెల గారు.. మీ స్పందనకి మనసారా ధన్యవాదములు. ఎప్పటికి అప్పుడు నా బ్లాగ్ చదివి వ్యాఖ్యానం చేసి నన్ను ప్రోత్సహించిన మరిన్ని ధన్యవాదములు.
   మీరు కూడా వ్రాస్తూ ఉండాలని నా కోరిక. కాదనకండి. ప్లీజ్!

 16. వనజ గారు నిర్మోహంగా మీ అభిప్రాయాలూ చెప్పారు .. చెప్పడం , రాయడమే కాదు నలుగురికి సహాయం చేసే మీ మనస్తత్వం అభినందనీయం ..మన అభిప్రాయాలూ అందరికి నచ్చాలని లేదు .. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే ఏడు రంగుల ఇంద్ర ధనస్సులా ఉంటుంది. మీ బ్లాగ్ లో చాల వ్యాసాలు చదివాను .. చదువుకునే వయసు నుంచే కులం చూపుతున్న ప్రభావం గురించి చాల దైర్యంగా రాశారు .. ఆ పోస్ట్ మీకు ఇబ్బంది కలిగించి ఉండవచ్చు కానీ నాకు మాత్రం .. తెలుసుకునే అవకాశం లభించింది . పోస్ట్ ల పై కామెంట్ ల విషయం లో మహిళలకే కాదు అందరు ఏదో ఒక విధంగా ఇబ్బంది పడిన వారే. మతం, కులం ప్రాంతం, రాజ కియా పక్షాలు తది తర అంశాల్లో ఎవరి అభిప్రాయాలూ వారివి .. కానీ ఇలాంటి విషయాల్లో అజ్నతల కామెంట్స్ ఇబ్బంది కలిగించే విధంగా ఉంటున్నాయి

 17. బుద్ధా మురళి గారు మీ స్పందనకి ధన్యవాదములు.

  అజ్ఞాత ల కామెంట్ ల విషయం లో మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా!

  ఇక్కడ సందర్భం కాదు కాని నేను చెపుతున్నాను. నేను బ్లాగ్ మొదలెట్టి రెండు ఏళ్ళు దాటింది.

  “కూడలి” “మాలిక” ఈ రెండు సంకలిని లలో నా బ్లాగ్ చోటు చేసుకోలేదు. మాలిక లో గతంలో నా బ్లాగ్ చోటు చేసుకుంది. కానీ ఇప్పుడు లేదు. కారణాలు తెలియదు కూడా. అంత వివాద స్పడంగా నా రాతలు ఉన్నాయా అని నన్ను నేను ప్రశించుకుంటాను. 😦

  • వనజగారు మీరు ఉక్కుమహిళ ఐనా కూడా మనసు మాత్రం సున్నితమే. కాకినాడ కాజాలా పైన గట్టిగా ఉంటారు లోపల మాత్రం మెత్తగా తియ్యటి పాకంలా ఉంటారు. మీరిలాగే కంటిన్యూ ఐపోండంతే..

   ఇక మాలిక సర్వర్ ప్రాబ్లమ్ వల్ల పాత బ్లాగుల లిస్టులు పోయాయని చెప్పారు కదా. మీరు మళ్లీ పంపండి. అలాగే కూడలి నిర్వాహకులు కూడా మారారు, మళ్లీ పంపితే ఆడ్ చేస్తారు .. అంతే తప్ప మీ రాతలకు వాటికి ఎటువంటి సంబంధం లేదు..

   • జ్యోతి గారు.. మీ స్పందనకి మనసారా ధన్యవాదములు.

    మిత్రుల ద్వారా నేను సర్వర్ ప్రాబ్లం గురించి విన్నాను. మరలా ఆడ్ రిక్వెస్ట్ పంపాను.థాంక్యు జ్యోతి గారు.

 18. వనజ గారి బ్లాగ్ నేను రెగ్యులర్ గా చదువుతాను. బ్లాగులలో చాలా మంది కి పట్టణ నేపధ్యం ఉంటుంది. వనజ గారిలా వ్యవసాయ కుటుంబం నుంచీ వచ్చి రాసిన వారు చాలా తక్కువ. వనజ గారు రాసిన టపాలు నాకు ఓ పెద్ద అక్క రాసిన టపాలు గా చదువుతాను.

  • బొందలపాటి గారు..మీ స్పందనకి ధన్యవాదములు.నా బ్లాగ్ ని మీరు చదువుతూ నచ్చిందని చెప్పడం చాలా సంతోషం.అందునా..పెద్దక్క గారి వ్రాతలు లా మెచ్చడం ఇంకా సంతోషం.మరిన్ని ధన్యవాదములు.

  • వనజగారు,
   నాకేనేమో ఆ అనుభవమనుకున్నా! మీకూనా? మాలికలో నా బ్లాగు రిజిస్టర్ చేశా. చాలా రోజులు టపా కనపడేది. తరవాత మరి ఎందుకో నా బ్లాగు కనపడటం లేదు, రెండు మూడు సార్లు మఎయిల్ కూడా ఇచ్చా! జవాబూలేదు.

 19. అతివల జూచి వీరబలలంచు వచించు మహాకవీంద్రు
  ద్ధత విపరీతవాదు, విది దబ్బరగాదు; విలాసినీసమం
  చితతరళాక్షిపాతములచే గెలువంబడి రింద్రముఖ్యులున్
  ధృతి నటువంటి వా రబలలేగతినైరి తలంచి చూడగన్…

  సంయమనమెరిగిన ఉక్కుమహిళ.
  నేటి సమాజానికి ఇటువంటివారి అవసరం ఎంతయినా ఉంది.విజయోస్తు.

 20. జాజిమల్లిగారూ, మీరు వనజావనమాలిగారికి ఇచ్చిన బిరుదు చాలా బాగుందండీ. అభినందనలు.
  వనజా వనమాలిగారూ,
  నేను మీ బ్లాగ్ కి ఏకలవ్య శిష్యురాలిని. కాని ఇంకా ఒకటో క్లాసు లోనే వున్నాను. మీరు వ్రాసినట్లు మన మన పరిధులలో సమాజానికి అవసరమయ్యే విషయాలను నిర్భయంగా, సూటిగా వ్రాసుకోవడం తప్పేమీకాదనిపిస్తోంది. ఉక్కుమహిళగారికి హృదయపూర్వక అభినందనలు.

  • s lalitha గారు.. మనసారా ధన్యవాదములు. మీరు ఏకలవ్య శిష్యురాలు అంటున్నారా!? బాబోయ్.. నేను ద్రోణాచార్యుడిని కాదండి. 🙂 🙂
   మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా. మీరు త్వరిత గతిన పట్టభద్రురాలు అయిపోవాలని మనసారా ఆకాంక్షిస్తూ..

 21. వనజ గారూ, ఈ మధ్యన నేను బ్లాగులు చూసే సమయం బాగా తగ్గిపోయిన కారణంగా చాలా మంచి బ్లాగులు మిస్సయిపోయాను. అందులో మీదీ ఒకటి. ఇలా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలబడటం నిజంగా అదృష్టం. అభినందనలు.

  టపాకి సరైన టైటిల్ పెట్టారు.. బావుంది మల్లీశ్వరి గారూ.

  • తృష్ణ గారు.. మీ స్పందనకి మనసారా ధన్యవాదములు.

   మనందరికీ బ్లాగ్ ఒక్కటే పూర్తి వ్యాపకం కాదు కదండీ! ఒకోసారి పనుల ఒత్తిడి వల్ల నేను చాలా బ్లాగులు చూడటం వీలు కాదు కూడా. అలా మంచి పోస్ట్ లు మిస్ అవుతుంటాం.
   మన మిత్రుల అభినందనలు పొందటం నిజంగా అదృష్టం గానే భావిస్తున్నాను. థాంక్ యు సో మచ్.. తృష్ణ గారు.

  • మంజు గారు.. మరీ మరీ ధన్యవాదములు. ఈ ఆవిష్కరణ మన అందరిలో చైతన్యం ని పెంపొందిన్చుకోవాలనే ..కదా..మల్లీశ్వరి గారు.. ఈ పరిచయ కార్యక్రమం మొదలెట్టారు.
   ఆమెకి మనందరం ధన్యవాదములు తెలుపుకుందాం. మీ పరిచయం ఎప్పుడో.. !? ఎదురుచూస్తున్నాను.

 22. చాలా బాగుంది వనజ గారూ!…మీరు మీ బ్లాగ్ గురించి చెప్పిన భావాలు….మంజు గారు చెప్పినట్లు మీ అంతరంగాన్ని బాగా ఆవిష్కరించారు…అభినందనలు మీకు…”ఉక్కుమహిల గారూ!…”…అది మీ ధైర్యానికి పేరు…మీరిచ్చే ప్రోత్సాహం స్పందనల్లో…మీ వెన్న లాంటి మనసు ఆత్మీయత కనిపిస్తాయి…వనజ గారూ!…@శ్రీ

 23. అంతరంగమాలిక, అనుభూతుల పుష్పగుచ్చం, అమ్మ మనస్సు, కధా విశ్లేషణలు, కవిత్వవనాలు నేను, గవాక్షం, ప్రేరణ, స్నేహం, సామాజికం, సాహిత్యం……. వివిధ కేటగిరీలలో (దాదాపుగా 38) వనజగారి బహువిధ ప్రజ్ఞ అద్వితీయంగా అలరారుతుంది. వనజగారి పోస్ట్స్ చదువుతున్నప్పుడు అవ్యక్త ఆశ్చర్యానందాలకు లోనౌతుంటాను. తన రచనలు ఆదర్శవంతంగా ఉంటాయి, ఆశాజనకంగా తోస్తుంటాయి, ఆకర్షణీయంగా అన్పిస్తుంటాయి, ఆలంబనగా నిలుస్తాయి, ఆనందమును కల్గిస్తుంటాయి, ఆత్మీయంగా పలకరిస్తుంటాయి, అపురూపంగా అగుపిస్తాయి, ఆకాంక్షలను వెలిగిస్తుంటాయి, ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి….. అందుకే ఆమె అభిమానైయ్యాను. అన్నింటికీ మించి అరమరికలు లేకుండా తన భావాలను నిర్మొహమాటంగా చెప్పగలిగే ఆదర్శవంతమైన ధీరోదత్తం ఆమె సొంతం.
  మల్లీశ్వరి గారు వనజాగార్ని ఉక్కుమహిళగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు.
  మహిళా బ్లాగర్స్కి పరిచయవేదిక నిర్మించిన మల్లేశ్వరిగారు అభినందనీయులు.

 24. మా స్కూలు మిత్రుల కోసం ఏర్పాటు చేసుకున్న మా బ్లాగుని వనజ గారు ఎప్పుడూ చదువుతూ, మా ఆప్తులలో ఒకరైపోయారు. మా స్కూలు మిత్రులు కూడా వారి బ్లాగుని చదువుతుంటారు. వారు చక్కటి రచయిత్రి మాత్రమే కాదు. మంచి రీడర్ కూడా మా టపాలని నిశితంగా చదివి చక్కటి వ్యాఖ్యలు చేస్తూ వుంటారు. తన గురించి ప్రచురించిన ఇంటర్వ్యూ కి అభినందనలు

 25. @ వనజ గారూ..
  << అందరూ నదులు కానవసరం లేదు. పిల్ల కాలువలు అయినా నయమే కదా !
  Essence of blogging ని ఒకే వాక్యంలో చక్కగా చెప్పారండీ.. అభినందనలు..

  @ మల్లీశ్వరి గారూ..
  టైటిల్ బ్రహ్మాండంగా పెట్టారండీ.. 🙂

 26. మధురవాణి గారు ధన్యవాదములు.

  🙂 అందరూ నదులు కానవసరం లేదు. పిల్ల కాలువలు అయినా నయమే కదా !

  ఇది నాకు నచ్చిన వాక్యమండీ !!

  ఈ వాక్యం చాలా మందికి నచ్చింది మరి. థాంక్ యు సో మచ్

 27. వనజ గారూ, మీ ఇంటర్వ్యూ అంతా చదివానండి.
  ఈ బ్లాగ్ నిర్వహణ లో మీరు ఎదుర్కొం టున్న ఇక్కట్లు, సమస్యలు, సాధక బాధకాలన్నీ కళ్ళక్కట్టినట్టు వివరించారు.
  మీరొక నిజాన్ని చెప్పారు చూసారూ, మనం రాయాలనుకున్న కొన్ని సంగతులు వున్నదున్నట్టు రాయలేకపోడానికి వ్యక్తిగత కారణాలనీ.. ఆ స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది నిజం కాబట్టి.
  నిజాయితీ గల ప్రతి జర్నలిస్ట్ బాధా ఇదే. చాలా మంది పైకి చెప్పుకోరు. మీరు ధైర్యం చేసారు.
  ఇంకా, మీ కవితాంశాలన్నిట్నీ చదివాకం మరో సారి పరిశీలించాలనిపిం చేంత గా బావున్నాయి.
  మంచి విషయాలని తెలియబరచినందుకు,
  నా సహ రచయిత్రి అయిన మిమ్మల్ని హృదయపూర్వకం గా అభినందిస్తూ..
  స్నేహంతో..
  -ఆర్.దమయంతి.

 28. దమయంతి మీ స్పందనకి హృదయపూర్వక ధన్యవాదములు . మీరన్నట్లు ఇప్పుడు కూడా స్త్రీలు చాలా విషయాలు మాట్లాడటం తప్పనే భావన చాలా మందిలో ఉంది కొన్ని విషయాలు అంటరానివిగా ఉంచేస్తారు. ఎవరైనా చెప్పడంలో తేడా ఉండవచ్చు చెప్పే అంశం ఒకటే అయినప్పుడు ఆమోదించడంలో అభ్యంతరం ఎందుకు ఉండాలి ? మైండ్ సెట్ మారాలండి. అది మారనంతవరకు ఏం చేయలేమేమో ! మీ అభినందనలకు ధన్యవాదములు .

 29. ఇంటర్వ్యూ చాలా బావుందండీ. అభినందనలు.
  మీ పరిధిలో సామాజిక చైతన్యాన్ని రగిలించడంలో నేను సైతం… అంటూ మీరు మరింత మునుముందుకు వెళతారని ఆకాంక్షిస్తూ…
  నేను ఇటీవలే బ్లాగ్ సెలయేటిలోకి వచ్చిన పిల్ల పాయను లెండి! అందుకే టపా రాసిన ఆర్నెళ్లకు కామెంట్ పెడుతున్నాను. అన్యదా భావించవలదు. Thank you!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s