క్లాసికల్ బ్లాగర్ చెపుతున్న ‘మనసులో మాట’లు

 

పేరు సుజాత
బ్లాగ్ పేరు- మనసులో మాట
 
బ్లాగ్ చిరునామా www .manishi-manasulomaata.blogspot.com
 
పుట్టిన తేదీ జూన్ 28
 
పుట్టిన స్థలం :నరసరావు పేట, గూంటూరు జిల్లా
 
ప్రస్తుత నివాసం : చికాగో, ఇల్లినాయి రాష్ట్రం(USA)
 
విద్యాభ్యాసం : జర్నలిజం
 
బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ:  29 మార్చ్, 2008
 
విద్యాభ్యాసం ; జర్నలిజం 
 
వృత్తి, వ్యాపకాలు; కొంత కాలం ఒక పత్రికలో సబెడిటర్ గా పని చేసాను.  తర్వాత ఫ్రీ లాన్సర్ గా, కాలమిస్ట్ గా ఉన్నాను.

మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి); దాదాపు 170 మాత్రమె 

బ్లాగ్ లోని కేటగిరీలు;హాస్యం, సంగీతం, సమాజం, ఎక్కువగా సాహిత్యం, పుస్తక పరిచయాలు 

 
బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?

 బ్లాగ్ ని మొదట నలుగురితో ఇంటరాక్షన్ కోసమే మొదలు పెట్టినా…అది ఒక మాధ్యమంగా మారిందని,  ఇక్కడి విషయాలు ప్రపంచానికి సులువుగా చేరతాయని త్వరలోనే గుర్తించాను. నా బ్లాగ్ నా కోసమే రాస్తున్నా అని కొందరు చెప్తుంటారు కాని అది నిజం కాదు. మన బ్లాగ్ కేవలం మన కోసమే కాదు, చదువరుల కోసం కుడా రాస్తాం. మన రాతల పట్ల నలుగురి అభిప్రాయాల కోసం చూస్తాం. బ్లాగ్ ఇప్పుడు ఒక మాధ్యమం మాత్రమే కాక, ఒక ఐడెంటిటీ కుడా!  అందుకే ఇవాళ బ్లాగులు కేవలం తమ సొంత గొడవలు చెప్పుకోడానికో, సరదా కబుర్లు రాసుకోడానికో  మాత్రమె కాక , సబ్జెక్ట్ ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బ్లాగర్స్  ఉపయోగిస్తున్నారు.  వస్తువుల మార్కెటింగ్,  అమ్మకాలు, స్టాక్ మార్కెట్ వంటి వాటికి కుడా బ్లాగ్స్ ఉపయోగపడుతున్నాయంటే ఇది శక్తి వంతమైన మాధ్యమంగా ఎదిగినట్లే అని భావిస్తున్నాను.

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?

నేను ఆంద్ర దేశానికి దూరంగా ఉన్న రోజుల్లో తెలుగులో ఏదో ఒకటి రాయాలి,  తెలుగు సాహిత్యానికి దగ్గరగా ఉండాలి అన్న కోరికతోనే బ్లాగులు పరిచయం అయిన కొత్తల్లో 2008 లో బ్లాగ్ మొదలు పెట్టాను. అంత సీరియస్ గా కూడా లేను ఈ విషయంలో. నలుగురితో ఇంటరాక్షన్  అన్న పాయింట్ మీదే ఉండేది నా దృష్టి. .నా అభిమాన విషయం పుస్తకాలు కాబట్టి నేను చదివిన  మంచి పుస్తకాలను నలుగురితో పంచుకోవాలన్న ఆసక్తి తో పుస్తకాల పరిచయం రాయడం ప్రారంభించాను.. ఆ తర్వాత !!  పుస్తక పరిచయాలు నా అభిమాన విషయం కాబట్టి అవే ఎక్కువగా రాశాను. దానివల్ల  నా బ్లాగ్ కి మంచి రీడర్స్ ఏర్పడ్డారు.  సాహిత్యాభిమానులైన మంచి స్నేహితులు దొరికారు.`

“బ్లాగ్స్ లోకి వచ్చిన కొత్తల్లో నాకు కొన్ని విషయాల్లో స్తిరాభిప్రాయాలు ఉండేవి. “ఇది ఇలాగే ఉండాలి” అని ఖచ్చితమైన అభిప్రాయం తో ఉండేదాన్ని. తోటి బ్లాగర్లతో అనేక చర్చల్లో  పాల్గొన్నతర్వాత, క్రమేణా ఈ అభిప్రాయంలో మార్పు వచ్చింది.  “నాణానికి మరో వైపు” ఆలోచించడం ఎక్కువైంది. ఇది మంచి ఇది చెడు అని జడ్జ్ చేసే ధోరణిని మార్చుకున్నాను. ఇది బ్లాగ్స్ లో నేను నేర్చుకున్న విషయం!  అందరు చెడు అని వేలెత్తి చూపిస్తున్న విషయంలో కుడా నేను అందులో భిన్న  కోణం ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను. దీని వల్ల నేనొక్క దాన్ని ఒక వైపు ఉండిపోయే స్థితి ఏర్పడ వచ్చు.  కాని జడ్జిమెంట్ ధోరణి నాలో లేదని మాత్రం సంతృప్తి కల్గుతుంది .

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?

బ్లాగింగ్ ని సరిగా ఉపయోగించుకో గలిగితే ఇందులో సానుకూల అంశాలే ఎక్కువగా ఉన్నాయి. మనలో భావ వ్యక్తీకరణ శక్తి ఉండీ ..దాన్ని  పాఠకులకు  వ్యక్తపరిచే అవకాశాలు రానపుడు వాటిని మనకు మనమే ఒక మాధ్యమం ద్వారా వెలుగులోకి తీసుకు రావడానికి సరైన వేదిక బ్లాగ్!

మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?

ప్రత్యేకత అంటూ పెద్దగా చెప్పలేను కాని, బ్లాగ్స్ ఒక మంచి మాధ్యమం కాబట్టి వాటికి ప్రాచుర్యం ఉండాలని భావించాను. చక్కగా రాసే అనేక బ్లాగ్స్ నన్ను ఆకర్షించాయి. ఆ తర్వాత మంచి బ్లాగుల్ని కొన్నిటిని ఎన్నిక చేసి ఈనాడు ద్వారా అశేష పాఠకులకు చాలా వారాల పాటు పరిచయం చేశాను.  అగ్రిగేటర్స్ గురించి కూడా పత్రికల్లో వ్యాసాలూ రాసాను. ఈటివి లో బ్లాగ్స్ గురించిన ప్రోగ్రాము చేశాను. సాహితీ పరిచయాల మూలంగా ..ఈ -తెలుగు సంస్థ కోసం కొన్ని రోజులు పని చేశాను.  బ్లాగ్స్ గురించి తెలియని వారికి ఉపయోగకరంగా ఉంటుందని భావించి మిత్రుల ప్రోత్సాహం తో రహ్మాన్ తో కల్సి  “బ్లాగు పుస్తకం” రాశాను. ఇవన్ని ప్రత్యేకతలని చెప్పుకోలేను కాని…తెలుగు బ్లాగ్స్ కోసం కొంత పని చేశాననే చెప్పాలి.

నా బ్లాగ్ చదివిన వారు “రాసిన అంశం ఏదైనా, పక్కన కూచుని మీతో ముఖా ముఖి మాట్లాడుతున్నట్లే ఉంటుంది” అంటుంటారు. దీన్ని ఒక చిన్న పాటి ప్రశంస గా మాత్రం భావిస్తాను.

సాహిత్యంతో మీ పరిచయం?

సాహిత్యం తో  పరిచయం ఈ నాటిది కాదు. మూడు నాలుగు క్లాసుల నాటి నుంచే పుస్తకాలు విరివిగా చదవడం అలవాటు గా ఉండేది. ఇంట్లోని వాతావరణం అందుకు కొంత దోహదం చేసి ఉండాలి.  సాహిత్యం నా జీవితంలో విడదీయలేని ఒక భాగం. కథా రచన లో అడుగు పెట్టి కొన్ని అడుగులు వేసినా..చదవడం లోనే ఎక్కువ ఆనందం కనపడి కాబోలు…దాని మీదే దృష్టి కేంద్రికరించాను. కుటుంబ రావు గారి విశ్లేషణలు అంటే ప్రాణం పెడతాను. ఎక్కువగా పాత తరం రచయితలూ వారి రచనలు ఇష్టపడినా,  కొత్త ఆలోచనల్ని రేకెత్తించే కొత్త సాహిత్యాన్ని కుడా ఇష్ట పడతాను. ఇటివల నన్ను ఆకట్టుకుంది ఝంపా లాహిరి.

స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?

ఎదురయ్యాయి.  సామాజిక అంశాల, రాజకీయ అంశాల  మీద రాసినపుడు వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యాఖ్యలు వచ్చేవి. సమాజానికి బ్లాగ్స్ ప్రతిబింబమే తప్ప వేరు కాదు. “ఆడవాళ్ళు కూడా రాజకీయాలు రాసేవాళ్ళే? వంటలు,కుట్లు అల్లికలు మీద రాసుకోక, ప్రతి దాంట్లోకి ఎందుకు వస్తారో?” అంటూ అనామక వ్యాఖ్యలు వచ్చేవి.  స్త్రీల బ్లాగులు అంటే అవి కేవలం కుట్లు అల్లికలు, లేదా ఇష్టమైన పాటో,పెరట్లో పెంచుకున్న మొక్కో, మొక్కకు పూసిన పువ్వో, ఇలాటి వాటి మీద రాస్తే “సున్నితం” గానూ, సూటబుల్  గాను ఉంటుందనే భావన  ఇప్పటికీ  పూర్తిగా మాసి పోలేదు. లేదా భావ కవిత్వం…రాయాలి. ఇంతకు  మించి సామాజిక రుగ్మతల మీద చర్చకు దారి తీసే అంశాలు రాస్తే…వాటికి ప్రోత్సాహం లభించే వాతావరణం ఇంకా లేదు.  స్త్రీలు చెప్ప దల్చుకున్న విషయాన్ని చెప్పడం సంప్రదాయ వాదులకు (కనీసం అలా కనిపించాలనుకునే వారికి) మింగుడు పడదు. నాకు ఎదురైన స్వల్ప ఇబ్బందులకు కుడా బహుసా ఇదే కారణం కావొచ్చు. అయితే వాటిని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. లెక్క చెయ్యనూ  లేదు. ఇప్పటికీ   ఇలా సున్నితమైన, అంశాలు  మాత్రమె ఎక్కువగా  రాస్తూ, అందులోనే ఐడెంటిటి  వెదుక్కునే బ్లాగ్స్ చదువుతుంటే కొంత నిరాశగా ఉంటుంది నాకు.

జీవన నేపధ్యం?

మధ్య తరగతి కుటుంబమే! సంగీతం సాహిత్యం అంటే ప్రాణం ఇచ్చేకుటుంబం  కావడంతో ఆ రెంటి మీద మక్కువ ఎక్కువ. 

 
నలుగురాడపిల్లల్లో ఒకరిగా పెరిగిన మీరు అప్పటికీ ఇప్పటికీ అమ్మాయిల పెంపకంలో వచ్చిన మార్పులని ఎలా అర్ధం చేసుకుంటున్నారు? 

మేము నలుగురాడ పిల్లలం. మా ఇంట్లొ ఆడ మగ పిల్లల మధ్య తేడా ఏమి లేకుండానే పెరిగాము. చదువుకున్నాం.ఉద్యోగాలు చేస్తున్నాం. మా తర్వాత ఇప్పటి తరం ఆడపిల్లలకు చదువులో మరింత సౌలభ్యం అవకాశాలు ఉన్నాయి.ప్రోత్సాహం కుడా ఉంది. కాని socialization  విషయంలోనూ, సోషల్ సెక్యురిటి విషయం లోను మా అమ్మ కంటే , ఈ తరం తల్లిగా నాకు ఎక్కువ భయాలు ఉన్నాయి. నా ఎనిమిదేళ్ళ కూతురు పార్క్ లో ఆడుకుంటూ ఉంటె నేను కూడా  పార్క్ లోనే ఉంటాను. డెబ్భై ఏళ్ల తాత దాన్ని వొళ్ళో కుచోబెట్టుకున్నా ముద్దాడినా…వొద్దు వొద్దనుకుంటూనే, మనసులో లెంప లేసుకుంటూనే   జాగ్రత్తగా పరికిస్తుంటాను.  ఇలా అనుక్షణం వారికి కాపలాగా ఉండి వాళ్ళను రక్షించుకుంటున్నామా .. లేక వాళ్ళలో “నాకు రక్షణ అవసరం” అనే భావాన్ని నూరి పోస్తున్నామా అని దిగులు వేస్తుంది. రాత్రి ఎనిమిదింటికి వరకు పక్కింట్లో ఆడుకుంటూ ఉంటె…మా అమ్మ ఇలాంటి భయాలకు లోనయ్యేది కాదు. ఇది పురోగమనమో తిరోగమనమో అర్థం కాదు.

ఆడ పిల్లల చదువు విషయంలో మాత్రం చాలా అభివృద్ధి కనిపిస్తోంది. అలాగే తల్లి దండ్రులు కూతుళ్ళతో స్నేహితుల్లా మసలడం కూడా ఒక మంచి మార్పు. పెంపకంలోమంచి మార్పులే వచ్చినా..మొత్తం మీద సొసైటి లో పెద్దగా మార్పు లేకపోవడం వల్ల ఆడ పిల్లలు కొన్ని బారికేడ్లు దాట లేకపోవడం నిరాశ కరం!

మనం ఊహించని స్థాయిలో మన జీవితంలోకి అనివార్యంగా వచ్చి పడిపోతున్న మార్పులని అర్ధం చేసుకోవడానికి మీ వద్ద ఉన్న జీవన సాధనాలు ఏంటి?

వాస్తవ జీవన చిత్రం మన కళ్ళముందే మారి  పోతోంది. అన్యుహంగా వచ్చి పడుతున్న మార్పుల్ని అంగీకరించడానికి కావలసింది ఎప్పటికప్పుడు సమాజాన్ని పరిశీలిస్తూ మన ఆలోచనల్ని, థాట్ ప్రాసెస్ ని ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ, అప్డేట్ చేసుకుంటూ ఉండటమే! గ్లోబలైజేషన్ వల్లో , మరో కారణం వల్లో ఇవాళ ప్రపంచం చాలా చిన్నదై పోయింది. ప్రపంచంలో ఎక్కడ మార్పు చోటు చేసుకున్నా..దాని ప్రభావం విశ్వ సమాజం మీద ఉండే అవకాశం  పెరిగి పోయింది. అందు వల్ల ఈ మార్పుల్ని అర్థం చేసుకోవాలంటే దృక్పథాల్ని విశాలం చేసుకోవాలి. మార్పుఏదైనా సరే, తిరస్కరించక, దాన్ని మిగతా పరిస్థితుల నేపథ్యం లో అర్థం  చేసుకునే ప్రయత్నం చేయాలి. అది మొబైల్ ఫోన్ కావొచ్చు, స్త్రీల అస్తిత్వ పోరాటం కావొచ్చు, లేదా పిల్లల మీద లైంగిక హింస,  కావొచ్చు. మూల కారణాలని చదివి, వాటి పరంగా ఆ మార్పు ని అర్థం చేసుకోవాలి.  కొన్ని మార్పులు మన వ్యక్తిగత జీవితానికి  ముడి పడి  ఉండొచ్చు.  మనకు అంగీకారం కాని మార్పులు మన జీవితం వరకు వస్తే..వాటిని అంగీకరించమని మాత్రం చెప్పను. సెల్ఫ్ రెస్పెక్ట్ ని పోగొట్టుకోమని మాత్రం చెప్పను.
అమ్మో..మరీ ఉపన్యాస ధోరణి లో రాసినట్లు ఉన్నాను…

 

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?

ఇన్నాళ్ళు అని ఏమీ అనుకోలేదు. ఇన్ని రాయాలని టార్గెట్ లేదు. ఇన్ని రాసానని లెక్కలూ  వేయను. రాయాలి అనిపించినపుడు రాయడమే!

సరదాగా ఏవైనా చెప్పండి?

నా బ్లాగ్ పోస్టుల్లో సరదా కబుర్లు చాలా రాసాను. బరువు తగ్గడం గురించి బరువు బాధ్యతలు అని బ్లాగు మొదలెట్టిన కొత్త రోజుల్లో ఒక పోస్టు రాసాను. ఆ తర్వాత కొద్ది రొజులకు హైదరాబాద్ బుక్ ఫేర్ లో నన్ను కల్సిన బ్లాగర్లు “మీ పోస్ట్ చదివి మీరు బాగా స్థూల కాయం తో ఉంటారని ఊహించాము” అని చెప్తుంటే నవ్వాగింది కాదు.

సీరియస్ గా ఏవైనా చెప్పండి?

అన్నిటికంటే సులభమైన పని సందేశాలు ఇవ్వడం. అంత  గొప్ప దాన్ని కాదు కాబట్టి, ఆ పని తలకెత్తు కోలేను. అందరు అన్ని విషయాల మీద స్వేచ్చగా రాసే వాతావరణం ఉండాలి. ఏది రాసినా అందులో సీరియస్ నెస్ ఉండాలి. లైఫ్ ఉండాలి.

మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం గానీ ఒకటి.

నా బ్లాగ్ పోస్టుల్లో నాకు చాలా వరకు నచ్చుతాయి. అందులోంచి ఒకటి పిక్ చేయమంటే ఇదిగో..ఇది నాకు నచ్చిన పోస్టు ..

http://manishi-manasulomaata.blogspot.com/2009/03/blog-post_09.html

ప్రకటనలు

35 thoughts on “క్లాసికల్ బ్లాగర్ చెపుతున్న ‘మనసులో మాట’లు

  • వనజ గారూ,ధన్యవాదాలు! నిర్మొహమాట ధోరణి కొన్ని సార్లు ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుంది. వాటిని స్వీకరించ దల్చుకుంటే..ఇదే సుఖం.

 1. స్త్రీల బ్లాగులు అంటే అవి కేవలం కుట్లు అల్లికలు, లేదా ఇష్టమైన పాటో,పెరట్లో పెంచుకున్న మొక్కో, మొక్కకు పూసిన పువ్వో, ఇలాటి వాటి మీద రాస్తే “సున్నితం” గానూ, సూటబుల్ గాను ఉంటుందనే భావన ఇప్పటికీ పూర్తిగా మాసి పోలేదు. లేదా భావ కవిత్వం…రాయాలి. ఇంతకు మించి సామాజిక రుగ్మతల మీద చర్చకు దారి తీసే అంశాలు రాస్తే…వాటికి ప్రోత్సాహం లభించే వాతావరణం ఇంకా లేదు. స్త్రీలు చెప్ప దల్చుకున్న విషయాన్ని చెప్పడం సంప్రదాయ వాదులకు (కనీసం అలా కనిపించాలనుకునే వారికి) మింగుడు పడదు. నాకు ఎదురైన స్వల్ప ఇబ్బందులకు కుడా బహుసా ఇదే కారణం కావొచ్చు. అయితే వాటిని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. లెక్క చెయ్యనూ లేదు. ఇప్పటికీ ఇలా సున్నితమైన, అంశాలు మాత్రమె ఎక్కువగా రాస్తూ, అందులోనే ఐడెంటిటి వెదుక్కునే బ్లాగ్స్ చదువుతుంటే కొంత నిరాశగా ఉంటుంది నాకు.

  ——– Totally agreed. Good Interview.

 2. “ఇప్పటికీ ఇలా సున్నితమైన, అంశాలు మాత్రమె ఎక్కువగా రాస్తూ, అందులోనే ఐడెంటిటి వెదుక్కునే బ్లాగ్స్ చదువుతుంటే కొంత నిరాశగా ఉంటుంది నాకు”

  శభాష్.

 3. పుస్తక సమీక్షలు, చిత్ర సమీక్షలు చేయటంలో సుజాతది అందెవేసిన చెయ్యి. ఆమె సమీక్షలు ఎంతో ఆసక్తికరంగాను, ఆలోచింప చేసేవిగా ఉంటాయి. పాఠకుల నాడి పట్టుకోవటంలో కృతకృత్యులయ్యారు. ఎంతోమంది బ్లాగు పాఠకులను సంపాదించుకున్నారు. అమెరికా వెళ్ళాక, తెలుగు పుస్తకాలు అందుబాటులో లేక పోవటం వలన కావచ్చు, అడపా తడపా, తక్కువగా వ్రాస్తున్నారు.

  ఈ అంతర్జాల ముఖాముఖి ప్రచురించిన మీకు, ఓపికగా మీ ప్రశ్నలకు ఆసక్తికరంగా బదులిచ్చిన సుజాతకు అభినందనలు.

  • రావు గారూ, థాంక్యూ! ప్రపంచం చిన్నదై పోయాక తెలుగు పుస్తకాలు అందుబాటు లో లేక పోవడం అనే సమస్యే లేదండీ. చదవడం ఆపలేదు కానీ, రాసే ఆసక్తి కొంత తగ్గింది. తీరిక లేకపోవడం కూడా కొంత కారణం.త్వరలోనే మళ్ళీ రాయగలనని అనుకుంటున్నాను.

   ధన్యవాదాలు

 4. ఆవిడ పోస్ట్‌లలో కొన్ని పోస్ట్‌లు కామెడీ పోస్ట్‌లలా కనిపిస్తాయి. ఉదాహరణకి ఈ పోస్ట్: http://manishi-manasulomaata.blogspot.in/2008/06/blog-post_26.html కానీ ఈ పోస్ట్ నాకు సీరియస్‌గానే నచ్చింది.

 5. సుజాత గారి వ్యాసాల్లో ఉన్న గొప్పదనమేమిటంటే, ‘ఇదెంత నిజం , ఇదే కదా నిజం’ అని మనకనిపించేలా ఉంటాయి. ఒకటని చెప్పలేను కానీ, సుజాతగారి భావజాలం అంతా నాకు బాగా ఇష్టం. ఆమె వ్యాసాలు చదివి ఆమెకు అభిమానిని అయ్యాను. సుజాత గారూ, అభినందనలు.

 6. లైటర్ వీన్ సరదా టపాలతో పాటు సమకాలీన సామాజిక అంశాలపై నిష్కర్షగా రాయటం సుజాత గారి ప్రత్యేకత. ఏది రాసినా పఠనీయత మిళితం చేయటం కూడా!

  ప్రశ్నలూ, వాటికిచ్చిన సమాధానాలూ బాగున్నాయి. (కొన్ని ప్రశ్నలు బోల్డ్ లో కాకుండా మామూలు ఫాంట్ తో ఉండి సమాధానాల్లో కలిసిపోయాయి:)

  పిల్లల పెంపకం విషయంలో మారిన అభద్రతా పరిస్థితుల గురించి ఆమె రాసిన విషయాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి.

  ‘బ్లాగు పుస్తకం’ కూడా రా’సి, ఎన్నో తెలుగు బ్లాగులను బ్లాగావరణం వెలుపలున్న పత్రికా పాఠకులకు పరిచయం చేసిన సుజాత గారు ఈ మధ్య తన బ్లాగులో టపాలు రాయటం తగ్గించివేయటం మాత్రమే బాగాలేదు. తన ఫేస్ బుక్ వ్యాసంగం వీలైనంత తగ్గించి (చాలామంది బ్లాగర్లు టపాలు రాయటం తగ్గించటానికి కారణం ఇదేగా?!) బ్లాగు టపాలు మరెన్నో రాయాలని నా సూచన, కోరిక!

  • వేణు గారూ, మీ అభిమానానానికి ధన్యవాదాలు. బ్లాగ్ రాసే ఆసక్తి తగ్గిన మాట నిజమే! ఒక్కోసారి అప్పటికప్పుడు తోచిన అంశాల్ని పంచుకోడానికి, బ్లాగ్ కంటే ఫేస్బుకే అనువుగా ఉంటుంది. అక్కడ మన మిత్రుల జాబితాలో ఉన్న వారికే మన రాతలు పంచే సౌలభ్యం కూడా ఉంది కదా!

   మీ సూచన ప్రకారం రాయడానికి ప్రయత్నిస్తాను.

  • వేణు గారూ
   టెక్నికల్ గా నేను కొంచెం పూర్…
   మీరు ఓ చిన్న లోపాన్ని పట్టి చూపాక ఈ కనుమ నాడు దొరికిన సెలవుని వెచ్చించి కొంచెం కంప్యూటర్ విజ్ఞానం సంపాదించాను.ప్రశ్నలకి రంగులు వేయడం నేర్చుకున్నాను.
   వనజ గారి ముఖాముఖిలో ఆ ప్రయోగం చేసాను.కళ్ళు మిరుమిట్లు గొలిపే సాంకేతికత ముందు అది సముద్రంలో నీటి బొట్టు.కానీ నేర్చుకోవడం బావుంది.

 7. హమ్మయ్య, మనసులో మాట సుజాత వచ్చేసారు.

  ఇక గడ్డిపూల సుజాత గారు రావడమేనా తరువాయి ?

  శుభాకాంక్షలండీ సుజాత గారు.

  సుజాత గారి విశ్లేషణ (రాసే మేటరు పై గట్టి పట్టు అనొచ్చనుకుంటా ) వారి ప్రతిభా పాటవాన్ని చూపిస్తుంది.

  చీర్స్
  జిలేబి.

  • జిలేబి గారూ, మీ వంటి యాక్టివ్ బ్లాగర్ ప్రశంస సంతోష దాయకం. ధన్యవాదాలు

   మీ ఇంటర్వ్యూ కోసం కూడా ఇక్కడ వేచి చూస్తున్నాం 🙂

 8. బ్లాగింగ్ మొదలుపెట్టిన కొత్తలో గైడెన్స్ కోసం బ్లాగులు ఎలా రాయాలి అనేందుకు ఎంచుకున్న ’ఆది బ్లాగర్ల’ లిస్టులో సుజాత గారు ఒకరు. ఆవిడ గురించి చెప్పాల్సొస్తే వేణుగారి అభిప్రాయమే నాదీనూ ( ఆ ఫేస్ బుక్ గురించి నన్నేం అడగొద్దు…. నాకేం తెలీదు ద.హా )

  ఇంటర్వ్యూ చాలా నిర్మొహమాటంగా బావుంది సుజాతగారూ 🙂

 9. సుజాత గారూ మీ పుస్తక సమీక్షలు నాకు చాలా నచ్చుతాయండి. అవి చూసి చదవాల్సిన పుస్తకాల జాబితా తాయారు చేసుకుంటూ ఉంటాను. ఇంటర్వ్యూ చాలా బావుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s