నవ్వుల చందమామ – శైలజచందు

 invitation 3
బ్లాగర్ పేరు; చందు శైలజ
బ్లాగ్ పేరు; చందు. S రచనలు
బ్లాగ్ చిరునామా; sailajachandu.blogspot.in
 పుట్టిన తేదీ : 13-10-1965
పుట్టిన స్థలం : చదలవాడ, వేమూరు మండలం. గుంటూరు జిల్లా
ప్రస్తుత నివాసం: నైమిష హాస్పిటల్, కొత్త పేట, గుంటూరు.
Address: Dr. Chandu Sailaja M.D
Naimisha Hospital
kothapet, Guntur- 522001 AP, 0863-2225401
విద్యాభ్యాసం: ఎం. డి. ( గైనకాలజీ)
వృత్తి, వ్యాపకాలు: డాక్టర్, రచనలు చేయడం
మొత్తం బ్లాగు పోస్టులు: 77
బ్లాగు మొదలు పెట్టిన తేదీ: 07-07-2011
బ్లాగులోని కేటగరీలు: విభజించలేదు
బ్లాగు ఒక మాధ్యమంగా ఎప్పుడు గుర్తించారు:
నేను కొంతకాలం రచనలు చేసి సొంత వెబ్ సైట్ లో పెట్టుకుంటూ ఉండేదాన్ని.ఎవరో గూగుల్ చేస్తూ ఉండగా నా కథ ఒకటి చదివి
కామెంట్ పెట్టి, బ్లాగు తెరవమనీ,కథలను అక్కడ పెట్టడం వల్ల అందరూ చదివే అవకాశం ఉంటుందనీ సలహా ఇచ్చారు.
బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?
పాఠకుల స్పందన చూసి నేను వ్రాసే దాని వల్ల నాకేకాదు, చదివినవారికి కూడా ఆనందం కలుగుతుందని తెలుసుకున్నాను.
 బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?
వృత్తిలో కలగే వత్తిడి చాలా తగ్గుతుంది. పాఠకుల ప్రశంసలతో ఇంకా వ్రాయాలని అనిపిస్తూ ఉంటుంది.
పరిమితులు: వృత్తికి అప్పుడప్పుడు అడ్డు పడుతూ ఉంటుంది. టైపింగ్, ఎడిటింగ్, మళ్ళీ వ్యాఖ్యలకు జవాబివ్వడ
వీటికన్నిటికీ బాగా టైం కావాలి.
మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?
నాకో ప్రత్యేకత ఉందని నేననుకోను గానీ, నా రచనల్లో హాస్యం ఉంటుందని చెప్తారు చదివిన వాళ్ళు.
సాహిత్యంతో మీ పరిచయం?
చిన్నతనం లో నేను చూసిన మొదటి పుస్తకం ‘బుడుగు ‘. మా వీధి రీడింగ్ రూం నాకిష్టమైన ప్రదేశం. అక్కడే చందమామలూ,
బాలమిత్రలూ చదివే దాన్ని. ఇంకా కొంత పెద్దయిన తర్వాత లైబ్రరీలో ఆదివారం మొత్తం గడిపేదాన్ని.
 అన్నయ్యలు మంచిపుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. కుటుంబంలో కొంతమంది రచయితలున్నారు.
సినిమా రచయితైన శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ గారు మా నాన్నకు మేనమామ కొడుకు.
అభ్యుదయ రచయిత శ్రీ చందు సుబ్బారావు గారు మా పెదనాన్న గారి అబ్బాయి.
కానీ వారి రచనలు నేనెప్పుడూ చదవలేదు.
స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?
ఎదురు కాలేదు
జీవన నేపధ్యం?
వృత్తిని పక్కకు పెడితే, నేనో సామాన్య స్త్రీని. నాన్నగారిది ఉపాధ్యాయ వృత్తి.  తల్లి గృహిణి. ఇప్పుడు నాన్నగారు లేరు.  భర్త కూడా డాక్టర్. ఇద్దరు పిల్లలు.
8.ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
ఎన్నాళ్ళని అనుకోలేదు. వృత్తిలో రిటైర్ అయాక, వ్రాయడానికి ఎక్కువ సమయం కేటాయించాలని కలలు కంటున్నా.
సరదాగా ఏవైనా చెప్పండి?
హఠాత్తుగా సరదాగా వ్రాయాలంటే ఏవీ తోచడం లేదు.
సరదాగా అంటే, నాకు కూరగాయలు కొనడం ఇష్టం. ప్రతిరోజూ నవనవలాడే, వంకాయలు, తాజా ఆకుకూరలు చూస్తే ఎక్కడలేని ఆనందం కలుగుతుంది.
 రోజూ కూరగాయలు చూడడానికి , కొనడానికి రైతు బజార్ వెళ్ళాలనిపిస్తుంది.
 చిన్న ట్రక్ లో  తడి గోనె పట్టాతో కట్టిన కర్వేపాకు, కొత్తిమీర మోపులు తీసుకెళ్తుంటారు.
కారు అద్దం దించి నాకు కొన్ని లేత కర్వేపాకు రెమ్మలు దూసుకోవాలని అనిపిస్తుంది కానీ, నేనున్న పరిస్థితిలో ఆ పని చెయ్యలేను.
సీరియస్ గా ఏవైనా చెప్పండి?
పైకి కనిపించడానికి అన్యోన్యంగా ఉండే సంబంధాలలో పైకి కనిపించని వయొలెన్స్ పసిగట్టినపుడు మనసంతా వికలమై పోతుంది.
విషాదమైన వార్త చదివినపుడు కొంత మంది స్త్రీలు మాట్లాడినపుడు  ఏదో కొంత సేపు అయ్యో అనుకుని మళ్ళీ పనుల్లో మునిగిపోతాను.
 వారికోసం నేనేమీ చెయ్యను. నన్ను నేను సంస్కరించుకోవాలి.

నలుగురు మెచ్చిన బ్లాగ్ రచన.

అందమా.. అందుమా

ఆ మధ్యన నేను నా స్నేహితురాళ్ళు కలిసినపుడు సౌందర్య సదస్సు నొకటి ఆకస్మికంగా నిర్వహించాం. ‘పెరుగుతున్న వయసు-  తరుగుతున్న సౌందర్యనిలవలు’ అనేది టాపిక్.
  కామన్ ఆలోచనాధోరణి కలిగి ఉండటం చేతనే మేమందరం స్నేహ పక్షులమయాం. అవేమిటంటే, పద్ధతి గా మాట్లాడుకోవడం ఎరగం . ఒకరు ఆపిన తర్వాత వేరొకరు మాట్లాడాలి అనే చచ్చు పుచ్చు మర్యాదలు పాటించం. ఒకరి అభిప్రాయాలనీ ఇంకొకరం చచ్చినా గౌరవించుకోం.
       ఒకానొక స్వర్ణ యుగం లో, పౌడరు కూడా రాయకపోయినా, కనీసం పది సైకిళ్ళన్నా పైకెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేవనీ, ఇపుడేమో ‘ ఆంటీ’  పిలుపులు మోస్తూ బతుకులీడ్చాల్సివస్తుందనీ మూకుమ్మడిగా బాధ పడ్డాం.
   ఈ రోజున ఎదురింటాయన వచ్చి అక్కయ్య గారూ అంటాడు. ఎలాగోలా పోనీ అనుకుందామంటే ఎదురింటో పుట్టిన ఈ కొత్త తమ్ములు గారికి మొహంలో కనుబొమలు తప్ప ఎటు చూసినా ధవళ వర్ణమే.
ప్రతి దానికీ ముందు మాట్టాడే ఇందిర పాల మీద మీగడ వాడితే పదికాలాల పాటు పాలుతాగే పసిపిల్లల చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని చెప్పింది . పక్కవాడికి ఎదురుపోవోయ్ అనే సిద్ధాంతం తోనే బతికే నేను, నిరంకుశంగా దాని పాల వాదన విరగ్గొట్టి, ” అసలు పాల మీద మీగడేం కడుతుంది, పెరుగు మీద మీగడే అందాన్ని సంరక్షిస్తుంది” అని వాదించాను.
అది చెప్పిన పాల సిద్ధాంతానికి ఓ పురాణ ప్రమాణం కూడా పట్టుకొచ్చింది. కృష్ణుడు, రాముడు నల్లని వారే కానీ కేలండర్ల సాక్షిగా మహావిష్ణువు తెల్లగానే ఉంటాడంది.
“ఎలా సాధ్యం? అంతా పాల మహిమ. పాల సముద్రం లో నివాసముండీ, ఉండీ ఆయనకా ఛాయ. లక్ష్మీ కళ అనే మాట ఎందుకొచ్చింది ఓ చేత్తో ఆయన కాళ్ళు పడుతూ, ఇంకో చేత్తో పక్కనే ఉన్న పాల సముద్రం లో కాస్త నురగ తీసి మొహానికి పూసుకోబట్టి కాదా?” అంటూ వాదించింది మా ఇందిర.
ఒకేసారి ఇద్దరం, ముగ్గురం, అందరం మాట్లాడేస్తూ, పక్క కొంపల వాళ్ళకు మా ఇంట్లో ఏదో పెద్ద ఎత్తున తగాదా జరుగుతోందన్న సంతోషకరమైన భావన కలగజేశాం.
ఆహారం సౌందర్యం రెండూ దగ్గర సంబంధం ఉన్న విషయాలు. రుచి కి అందానికి చుక్కెదురు. రుచి కావాలనుకుంటే అందం గురించి ఆలోచన మానుకోవాలి. రుచీ పచీ లేని పరమ దరిద్రపు తిండి తింటే అందాన్ని పదికాలాల పాటు కాపాడుకోవచ్చు.
కడుపెలా మాడ్చుకోవాలి, ఈడు కెలా ఎదురీదాలి అన్న సమస్యపై చర్చించుకున్నాం. , అందం కోసం చేయాల్సిన త్యాగాలు, తీయాల్సిన పరుగులు లెక్కవేసి సమగ్ర నివేదికనొకటి తయారు చేసి తలా ఓ కాపీ తీసుకున్నాము.
******
ఆ మధ్యన ఏదో పెళ్ళికెళ్ళాల్సి వచ్చింది.
మొహం అద్దం లో చూసి “నాసి గా ఉందే!” అని పైకే అనుకుంటుంటే,
“దానికి అద్దం చూడాలా, నన్నడిగితే నే జెప్పనా?” అన్నాడు పేపరు చదివే సొంత ఇంటి శత్రువు.
కొంత మంది వివాదాస్పదులైన వ్యక్తులతో చర్చలకు దిగి మనశ్శాంతి పోగొట్టుకునే అవకాశం ఉందని దినఫలాలు హెచ్చరించాయి. ఈయనతో మనకు మాటలెందుకు?
పెళ్ళి కి కట్టుకుందామని ఓ చీరకొనుక్కున్నాను, ఆ చేత్తోనే కాస్త అందం కూడా కొనేసుకుంటే సరి అని బ్యూటీ పార్లర్ కు వెళ్ళాను.
క్లినిక్ లో పని చేసే ఆడపిల్లలు అందాకా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారేమో నేను లోపలికెళ్ళగానే మాటలాపేసి నా వంక చూశారు.
ఏం కావాలి అని అడిగారు. ” రెండ్రోజుల్లో పెళ్ళి ఉంది” అంటూ నసిగాను.
నన్ను ఎగా దిగా చూసి ” పెళ్ళా? ” అని ఆశ్చర్యపోతుంటే వాక్యం సరిదిద్దాను. “అదే అదే రెండ్రోజుల్లో పెళ్ళికెళ్ళాల్సి ఉంది. మొహానికేవైనా చేస్తారేమోనని ” అని
అందరూ ఊపిరితీసుకున్నారు.
“రండి, రండి. మొహమొక్కటే ఏవిటి మేడం, చేతులు , కాళ్ళూ కూడా  చక్కగా చేసేస్తాం. అన్నీ మేం చూసుంటాం” అని నన్ను సకల మర్యాదలతో లోపలికి తీస్కెళ్ళారు
బంగారపు ఫేషియల్, వజ్రపు ఫేషియల్ అని కొన్ని ప్రక్రియలు చెప్పారు. బంగారం తో మొహానికి నగిషీ పెట్టే సామాన్లు నిన్ననే తెప్పించారట. ఆ సౌకర్యాన్ని వినియోగించుకోగల ప్రథమ సౌందర్యాధమురాలిని నేనేనట. మొహం, జుట్టూ పరీక్ష చేసి చర్మం బాగా డేమేజ్ అయిందనీ, జుట్టు పొడిబారిందనీ చెప్పారు.
ఆవిడ తన అసిస్టెంట్స్ ను పిలిచి చూపించి రిపైర్ కు కూడా లొంగని ఈ మొహాన్ని ఏం చెయ్యాలో కదా అని వాపోయింది. అయినా కానీ బహుచక్కగా బాగుచెయ్యగలననీ ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఆ పిల్లకాయ ట్రెయినీలతో వెలిబుచ్చింది. ఆ ఔత్సాహిక అపక్వ బ్యుటిషియన్లు నేర్చుకునే నిమిత్తం వాళ్ళ ఇష్టాను సారం నా జుట్టూ గిట్టూ పరిశీలించి జాలి చూపించారు.
నన్ను పడుకున్నట్లు కూచోబెట్టే కుర్చీలో పడేసి, ముగ్గురు ఆడపిల్లలు మొహాన్నొకరు, చేతులొకరు, స్వాధీనపరుచుకున్నారు. చేతికందిన లేపనాలేవో పులుముతున్నారు.
ఒకావిడ పక్కనే చేరి తెలుగు తాలింపు పెట్టిన ఇంగ్లీషులో ఊళ్ళో సోది చెప్తోంది.
చేతులకేదో క్రీము పూసి చిన్న గుడ్డ ముక్కనతికించారు. అది ఎందుకో ?
ఆ పరిస్థితిలో నన్ను నేను పరిచారికల సేవలందుకుంటున్న శకుంతలలా ఊహించుకున్నాను.
కుడి చేతి మీద ఒక క్రీము రాసిన అమ్మాయిని
“ఏమే ప్రియంవదా, శీతా కాలంలో ఎసి ఎందులకే” అని అడగబోయేంతలో నా చేతికంటించిన గుడ్డముక్కను వ్యతిరేక దిశలో ఒక్కసారిగా లాగి పారేసింది . చర్మం ఊడి వచ్చినంత పనయ్యింది.
‘ఓరినాయనో’ అంటూ నా పై ప్రాణాలు పైకి పోబోయి, కొంత సేపు మా నాయన గారి స్వర్గం లో ఊగిస లాడి , కిందకొచ్చిపడ్డాయి. ఆవిడ ట్రీట్ మెంట్ ఇచ్చిన మేరా చర్మం ఎర్రగా కంది మంటలేస్తోంది.
ఏవిటీ హింస. పొరపాట్న వచ్చి పోలీస్ స్టేషన్ లో పడ్డానా? అన్న డౌట్ వచ్చింది.
పోలీసులు, ఓ అరగంట దొంగల్ని ఇక్కడ పడేసి ఈ ట్రీట్మెంట్ ఇచ్చినట్లైతే నచ్చిన వస్తువుల్ని రికవరీ చేసుకోవచ్చు.
“ఏవిటమ్మా ఇది” అని అడిగితే దాన్ని వాళ్ళపరిభాషలో ఏమంటారో చెప్పి “కొద్దిగా ఓర్చుకోండి మేడం మిమ్మల్ని సుందరంగా మార్చే పూచీ మాదే” అంది.
అమ్మాయీ, అహింసా మార్గం లో అందగల అందం మాత్రమే చాలునన్నాను.
నన్నో వెర్రి జంతువుని చూసినట్లు చూసి
“నో పెయిన్ నో గెయిన్” అంది
ఉసూరుమంటూ ఇంటికొచ్చాను. ఇక చచ్చినా బ్యూటీపార్లర్ కు పోను.
ఇంట్లో దొరికే సరుకులతోనే సౌందర్యసాధనగావించాలని నిర్ణయించుకుని పొద్దున్నే ఉత్సాహంగా లేచాను. జుట్టు మెత్తగా అవాలంటే నిమ్మకాయ తేనె, మజ్జిగ, గుడ్డు మహత్తరమైన పరిష్కారాలని, అవన్నీ జుట్టుకు పట్టించి ఓ ఘంట తర్వాత స్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుందని ఎక్కడో చదివాను.
నేనా శుద్ధ శాకాహారిని. గుడ్డు అన్న పదం పలకడం కూడా ఇష్టపడను. నా స్వభావ రీత్యా తోటి మనిషి ఎంతటి విజయం సాధించినా సరే ‘వెరీ గుడ్డు’ అనను. కానీ ఈ రోజున గుడ్డు వాడాల్సిన అత్యవసరపరిస్థితి ఎదురైంది.
అటూ ఇటూ చూస్తుంటే టేబిల్ మీద మజ్జిగ గ్లాసు కనిపించింది. అమాంతంగా దాన్ని ఎత్తిపట్టి నా తలపై గుమ్మరించుకున్నా. ఫ్రిజ్ లోంచి ఓ గుడ్డు తీసుకుని నెత్తికి నడిబొడ్డున చిన్నగా తాటించా. నా అటిక తలను తాకినంతనే వెయ్యివక్కలైంది. మా అత్తగారు రోజూ నిమ్మకాయ రసం, తేనె తో కలిపి పొద్దున్నే పుచ్చుకుంటారు. ఆవిడ ఏమరుపాటుగా ఉన్న సమయంలో అవి తీసి గబ్బుక్కున నెత్తిమీద ఒంపేసుకున్నా.
ఉడికించిన కేరట్లు గుజ్జు చేసి మొహానికి పట్టించా. వంటకు సమకూర్చుకున్నవన్నీ నేనే వాడేస్తున్నాననీ, ఇహిలా అయితే తను పనిచెయ్యడం కష్టమని మా అత్తగారితో చెప్పి రుసరుస లాడుతూ వెళ్ళింది వంటావిడ. వంటింటి సరుకుల్తోనే అందంగా తయారవుతున్నానని ఓర్చలేనితనం.
బరువు తగ్గి సన్నగా నాజూకుగా కనపడాలి. ఓ రోలు పొత్రం తెప్పించి బయట బంతిమొక్కల పక్కనే పడేయించా. రోజూ మినప్పప్పు నానేసి రోట్లో కాటుకలా రుబ్బి పడేస్తే, మెత్తటి అట్లు వేసుకోవచ్చు, చేతులు కూడా సన్నబడతాయి. అన్నిటినీ మించి, ‘ కోడలితో ఎంతెంత పని చేయిస్తుందమ్మా ఆ రాకాసి అత్త’ అని పక్కింటివాళ్ళ మనసుల్లో మా అత్త మీద వ్యతిరేక భావం కలగించొచ్చు. ఒకే రోలు, కానీ ఎన్నో రోల్సు.
బట్టలుతికే బాపమ్మ అన్ని విధాలా నా రోల్ మోడల్. ఎన్నో ఏళ్ళబట్టీ జీరో సైజు మెయింటైన్ చేస్తోంది. ఏళ్ళనుండీ చూస్తున్నాను. వీసం వెయిటెక్కని విగ్రహం. పొద్దున్న ఆరింటికి బయలుదేరుతుంది ఆ సూపర్ ఫాస్ట్ బాపమ్మ. బట్టలుతకడానికి ఆ వీరోత్సాహమేంటో నాకర్ఢం కాదు. ” పని మొనాటనస్ గా ఉందోయ్” అని కనిపించిన ప్రతివాడి దగ్గర వాపోతూ ఉండే నాకు మా బాపమ్మ ఉద్యోగోత్సాహాలు  చెంపలు చెళ్ళుమనిపిస్తుంటాయి.
దాని నడుము కొలతకు హీరోయిన్లు సైతం కలత చెందాల్సిందే. ఐశ్వర్యా రాయి కూడా ముందు అసూయచెంది ఆపైన మొహం చూసి అమ్మయ్య అనుకుంటుందిలెండి. బట్టలుతికితే మనం కూడా నాజూకుగా తయారవొచ్చన్న విషయం విశదమైంది.
మా బాల్కనీలో ఒక బండ వేయించా. ఓ రోజు నా మొహం ఒండ్రు మట్టితో పాకింగ్ చేసి బాల్కనీలోకెళ్ళి అటూ ఇటూ చూసా. చుట్టు పక్కల ఇళ్ళలో అలికిడే లేదు. ఎవరైనా చూసినా ఒండ్రు మట్టి వెనక దాగిన నా ముఖాన్ని ఆనవాళ్ళు పట్టలేరు. అల్మైరా లోంచి ఇస్త్రీ చేసిన ఓ మల్లె రంగు టవల్ మడతలు విప్పి నీళ్ళలో ముంచి ‘జై బాపమ్మా’ అనుకుంటూ ఆ ఏటవాలు బండకేసి బాదుతుంటే ‘హెలో మేడం గారూ’ అన్న పిలుపు వినిపించింది. అదేంటి నన్నెవరూ గుర్తుపట్టరనుకున్నాగా.
అటూ ఇటూ చూస్తే వాళ్ళ బాల్కనీలో నించుని పక్కింటాయన కనిపించాడు.
టవల్ కట్టుకుని ముప్పాతిక స్థాయి ఎక్స్పోజింగ్ తో ఉన్నాడు. అప్పటి వరకూ శవాసనం వేస్తున్నాడేమో నేను చూసుకోలేదు. ఎంతో మర్యాదస్తుడు. ఎక్కడ కనిపించినా పలకరించకుండా వదలడు. ఆయన అవతారం, నా అవస్థ ఎలా ఉన్నా సరే అవేమీ పట్టించుకోనంత మర్యాద. పలకరింపు ముఖ్యం కానీ మిగతా విషయాలతో ఏం పని .
పాదరస సమాన వేగంతో బుర్రను పరిగెత్తించి చటుక్కున ఒక అత్యవసర నిర్ణయం తీసుకున్నా. నేను నేను కాదన్నట్టు అయోమయంగా ఆయన వంక చూస్తూ గొంతు మార్చి కీచు గొంతుకతో ‘ఓలమ్మో, నేనవరనుకుంతన్నారో అయగోరు ‘ అన్నాను.
వాళ్ళ బాల్కనీ తాలూకు ఇనప ఊచలు పట్టుకుని “అటూ ఇటూ గా మీ అమ్మగారిలానే ఉన్నావే నీ దుంపతెగా, నీ పేరేవిటే ? ” అడిగాడు . పరిగెత్తుకుని కిందకొచ్చి పడ్డాను.
నాకు కొద్దిగా మిమిక్రీ కళ వచ్చు. పిల్లలకు సిన్మా కథ చెప్తున్నప్పుడు రామారావులా, నాగేస్సర్రావులా గొంతుమార్చి డైలాగులు చెప్తుంటా. నా మిమిక్రీ టేలెంట్ వల్లే కదా ఇవ్వాళ ఒక విపత్తు నుండి విజయవంతంగా బయటపడింది. ఆ కళకు సాన బట్టాలి అని అప్పటికప్పుడు అనుకుని రకరకాల గొంతులు ప్రాక్టీసు మొదలెట్టా.
ఓ పద్ధతి పాడూ లేకుండా టైమంతా వేస్ట్ చేయడం నాకు కొట్టిన పిండి. ఒక పని చేస్తూ అది పూర్తి కాకుండా ఇంకో పని మీదికి దూకడం లో కొమ్మల మీద కోతులు కూడా నాతో పోటీకి రాలేవు.
నాకు పరిచయమున్న వాళ్ళందరి గొంతులూ గుర్తు తెచ్చుకుని ఆడా మగా అన్న తేడా చూపకుండా అనుకరిస్తూ ఎడా పెడా ప్రాక్టీసు మొదలెట్టా. కాసేపు మిమిక్రీ కళనభ్యసించిన తర్వాత బోరుకొట్టింది. మిమిక్రీ కళనూ, పాటలు పాడే కళను కలిపేస్తే అన్న ఆలోచన వచ్చింది.
పనిలో పనిగా ఓ ఘంటసాల సుశీల యుగళ గీతం ఎంచుకుని ( అదే అదే అదే నాకు అంతు తెలియకున్నదీ) అంటూ పాటెత్తుకుని మగ గొంతు తో, ఆడగొంతు తో మార్చి మార్చి పాడడం ప్రాక్టీసు చేస్తున్నా. ఏదో ఒక రోజు ప్రఖ్యాత ఆడ మిమిక్రీ ఆర్టిస్టు లా ఇద్దరిగొంతులతో పాట మొత్తం స్టేజి మీద పాడేసి ఈయన కళ్ళు కుట్టేలా, కుళ్ళు పుట్టేలా పేరు తెచ్చేసుకోవాలి.
చండ ప్రచండంగా ప్రాక్టీసు చేసిన తర్వాత, అమాంతం గా నామీద నాకు గౌరవమూ, ఇంటాయన అదృష్టం మీద అసూయ రగిలింది.
ఆహా ఏమీ నా మిమిక్రీ ప్రజ్ఞ!
వ్యాకరణం తెలిసిన వాళ్ళకుండే restrictions నాకెటూ లేవు. అప్పటికప్పుడు నాకు తోచినట్లు పౌరాణిక స్టైల్లో మనసులో ఓ పద్యం కట్టాను
‘ఇనుకోర పెనిమిటి ఓ మంచి మాట
ఇన్నేసి కళలున్న ఇంతి దక్కుట
ఎవడికైనా కలదె నీ లక్కు ఇచట
కారణమేమందువా, నీ పూర్వ పుణ్యంబు పుచ్చుట ఆ ఆ ఆ..
అంటూ ఓ రాగం తీయబోయాను కానీ గొంతు సహకరించలేదు. వాయిస్ ఎక్సర్సైజు వికటించి , గొంతు చిక్కబట్టి, బేస్ వాయిస్ లో పలికే రఘువరన్ గొంతు దగ్గర స్థిరపడింది.
రేపటికి సెటిల్ అవుతుందిలే అనుకుని రేప్పొద్దున్నే వెళ్ళాల్సిన పెళ్ళికి ఫైనల్ గా మెరుగు దిద్దాలని గుర్తొచ్చింది. పొద్దస్తమానం డబ్బా కొట్టుకునే మా సుబ్బులు చెప్పిన చిట్కా ప్రయోగించదల్చుకున్నా. మాలో అందరం అంతో ఇంతో రోజూ డబ్బా కొట్టుకోకుండా బతకలేమనుకోండి, కానీ మా సుబ్బులు ఎవరికీ అందనంత స్థాయికెదిగింది.
‘ ముందు రోజు రాత్రి బీట్ రూట్ రసం రాసి, ఓ అర్ధగంట తర్వాత , నీళ్ళు మరగబెట్టి అందులో చిటికెడు కర్పూరమేసి నెత్తిమీద దుప్పటి కప్పుకుని ఆవిరి పడితే.. మొహమంతా దివిటీలా వెలిగిపోతుందట. ఈ చిట్కా వాడినందువల్ల వాళ్ళమ్మాయి పెళ్ళిలో అమ్మాయెవరో అమ్మెవరో కనుక్కోలేక బుట్టలో దీన్నే కూర్చోబెట్టి పీటలవరకూ లాక్కెళ్ళారట దాని అన్నలు.’ అంటూ స్వీయానుభవాన్నొకటి మాకు వివరించింది .
పైకి “అలానా!” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసి లోలోపల మాత్రం ‘దీనిబొంద’ అనుకున్నాం.
రాత్రి అయింది కదా అని ఎర్రటి, చిక్కటి బీట్ రూట్ రసం తయారు చేసి మొహానికి పూసుకున్నా. అద్దం చూసుకోవాలంటే ఎందుకు రిస్కు ఒకే సారి కడిగిన తర్వాత చూసుకోవచ్చు అనుకున్నా. ఆర్గ్యుమెంట్లు అంటే ఉన్న ఇష్టం వల్ల దెయ్యాలు లేవని ఎదుటివాడు నోర్మూసుకునేవరకూ వాదించగలను గానీ, స్వతహాగా నాకు దెయ్యాలంటే చచ్చేంత భయం. స్నేహితుణ్ణి రైలెక్కించి వస్తాననీ, లేటవుతుందనీ చెప్పి వెళ్ళాడీయన.
బాగా ఎర్రబడాలని ఇంకోరౌండ్ బీట్ రూట్ రసం మొహానికి పూసేశా. మొహమంతా మెరిసిపోవాలి. దెబ్బకు, కరెంట్ బిల్లు సగానికి సగమవాలి. ఓ అరగంట తర్వాత సుబ్బులు చెప్పినట్లు మొహానికి ఆవిరి పట్టాను. ఆవిరికి బీట్ రూట్ రసమంతా కారుతోంది.
కాలింగ్ బెల్ మోగితే లేచి తలుపు తీశా.
ఎదురుగా ఈయనే, రైల్వే స్టేషన్ సువాసనతో.
‘రావయ్యా రా.. నీకోసమే చూస్తున్నా’ అన్నాను. గొంతులోంచి రఘువరన్ పోలేదు. నిలువు గుడ్లేస్కుని నా వంక చూసి
“ఓరిబాబో , నేను రాను” అంటూ వెనక్కు అడుగులేస్తున్నాడు.
‘లేటుగా ఇంటికొచ్చినందుకే ఇంతభయపడాలా, ఏవీ అననులే’ అందామనుకుని
అదంతా అనలేక ‘రా, రా,’ అన్నాను.
“నేను రాను, నేను రాను” అంటూ వణికిపోతున్నాడు.
” తిననులే రావయ్యా , రా ” అన్నా.
 వినకుండా బేర్ మని, పరుగుతీస్తూ పారిపోయాడు.
కాసేపటికి బెడ్ రూం లో ఫోన్ మోగుతుంటే వెళ్ళి తీశాను.
నేను హలో అనకముందే “ఇదిగో నిన్నే, మన ఇంటి ముందు తలుపు దగ్గర రక్త పిశాచి ఉందే.  మొహమంతా రక్తం పూసుకుని రా రా అంటూ నన్ను పిలిచింది. నేను పారిపోయి వచ్చేశా. దర్గా దగ్గరకెళ్ళి తాయెత్తు కట్టించుకొస్తా. నువ్వు తలుపు దగ్గరకెళ్ళకు. బెడ్ రూం లోనే కూర్చో. అందాకా హనుమాన్ చాలీసా గుర్తు తెచ్చుకుని పాడుకో”(కల్పితం)

67 thoughts on “నవ్వుల చందమామ – శైలజచందు

 1. శైలజ గారు మీరు సరదాగా చెప్పింది విని ఫక్కున నవ్వేశానండి. మీ ఇంటర్వ్యు చదివాక ‘అన్నీ ఉన్న ఆకు’ సామెత గుర్తొచ్చింది. మీ రిటైర్ మెంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము.

 2. డాక్టర్ గారు సరదాగా కాదు సీరియస్ గానే .. భార్య భర్తలు అయినా … మిత్రులు, లేదా ఒంటరిగా అయినా తరుచుగా కూరగాయల మార్కెట్ కు వెళ్ళడం మంచిది. అని నేను అనుకుంటాను . సరదాగా మీరు చిప్పిన దానిలో ఈ విషయం ఉండడం నచ్చింది
  ….ఇంటర్వ్యు అనగానే బిగుసుకు పోయారా ? సమాధానాలు ముక్తసరిగా చెప్పారు .. మీ రచనల్లో హాస్యం బాగుంటుంది

  • బుద్ధా మురళి గారు, మీ వ్యాఖ్యకు ధన్య వాదాలు. ఎప్పుడైనా ఓ రోజు పొద్దున్నే బయటకు వెళ్ళి కూరగాయలు కొనడం నాకు బాగా నచ్చిన విషయం. ఇంటర్వ్యూ కు బిగుసుపోవడం కాదు గానీ ఇంటర్వ్యూ లో చెప్పుకునేంతగా ఏముంది అని కొంచం సిగ్గు పడ్డాను.

 3. హాస్యం గురించి చెప్పారు కాబట్టి…

  Dr Sailaja Chandu గారు రాసిన వాటిల్లో నేను చదివినంతవరకీ, కింద ఇచ్చిన బ్లాగ్ పోస్ట్, వారి రాతల్లోని సిగ్నేచర్ సెటైర్ తో పాటుగా, బాగా నవ్వొచ్చేది కూడా..అని నా అభిప్రాయం.

  http://sailajachandu.blogspot.com/2012/01/blog-post_20.html

 4. మీ రచన లన్నీ నాకిష్టమే శైలజ గారు. కూరల మండి నిజంగానే భలే ఎక్స్పీరియన్స్:)అక్కడ తిరుగుతున్నంతసేపు ఓ కొత్త ప్రపంచమే కనిపిస్తుంది. సింప్లీ సుపర్బ్….

 5. శైలజ గారు ఎంత హాస్యం రాస్తారో, సీరియస్ విషయాల్లో అంత సీరియస్ గా ఆలోచిస్తారు. ఇది నాకు చాలా నచ్చే విషయం! సినిమా రివ్యూ, ఇంకా దేవుడన్నయ్య…ఇలాంటి చాలా పోస్టులు చక్కని ఆరోగ్య కరమైన హాస్యానికి ఉదాహరణలు.

 6. శైలజగారిలాంటి మంచి రచయిత్రిని బ్లాగ్ లోకానికి పరిచయం చేసిన ఆ అజ్ఞాత వ్యక్తికి, ఇప్పుడువ్యక్తిగతంగా పరిచయం చేసిన జాజిమల్లిగారికి అభినందనలు, కృతజ్ఞతలు.

  • తేజస్వి గారూ, మీ వ్యాఖ కు సంతోషం గా ఉంది. నన్ను బ్లాగు లోకానికి పరిచయం చేసినది మరెవరో కాదు. సాహిత్యాభిమాని శ్రీ కప్పగంతు శివరామప్రసాదు గారు.
   http://saahitya-abhimaani.blogspot.in
   ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Sir, Thank you very much for the encouragement in my beginning days.

  • నారాయణ స్వామి గారు, మీ వంటి పెద్ద వారికి ( వయసులో కాదండీ) నా రచనలు చదవడం, నచ్చాయనడం నేను అదృష్టం గా భావిస్తాను సర్. కొంచం కంగారు, భయం కూడా అనిపిస్తుంది. ధన్యవాదాలు సర్.

  • నారాయణ స్వామి గారూ,
   ఎందుకు కూడదన్నారో నాకు అర్ధం కాలేదు…స్త్రీల పుట్టినరోజు తేదీలు దాచుకోవడం మీద ఉండే ఫ్రేం వర్క్ లోంచి మీరు మాట్లాడి ఉండరు…బహిరంగపరచడం వ్యక్తిగత పట్టింపు మాత్రమే అనుకున్నాను…నాకు కన్విన్సింగా ఉంటె మీ సూచన తప్పకుండా పాటిస్తాను.

   • శైలజ గారు,

    అబ్బే,

    ఇక్కడ వయసు గురించి అయి ఉండదండీ నారాయణ గారి కామెంటు,, డేటా సీక్రేసి గురించి ఉంటుందనుకుంటా ! (అయినా మీ కేమి వయసయయ్యిందని ?… జిలేబీ తో పోలిస్తే?)

    (అమెరికా వాసుల డేటా సీక్రేసి దెయ్యం భయ్యం!)

    మరీ ‘పప్పులీకు’ వికీ లీక్స్ !

    జిలేబి.

 7. జాజిమల్లి గారు, ఎంతో శ్రమ తీసుకుని తోటి బ్లాగర్లను పరిచయం చేస్తున్న మీ మంచి ప్రయత్నానికి ధన్యవాదాలు మేడం. ఒక మంచి రచయిత్రి పక్కన వారిని ప్రోత్సహిస్తూ, వారికి వెలుగులోకి తీసుకురావడం సంతోషం కలగజేసే విషయం. మీ మనో సంస్కారానికి నేను ముగ్ధురాలినవుతున్నాను. మీ సహృదయత, మాటల్లో చెప్పలేనంత మంచి భావన కలగ జేసింది. Thank you very much.

  • స్త్రీల మీద,వారి రచన మీద ఎంత సెన్సార్ షిప్ ఉంటుందో బాగా తెలుసు శైలజ గారూ,
   వారు రాసే ప్రతి అక్షరం మీదా వారి రోజువారీ పోరాటాలు లిఖించబడి ఉంటాయి…
   బ్లాగ్స్ లో ఇంత గొప్ప రచయిత్రులు ఉన్నారని నాకు అవగాహన లోకి వచ్చినపుడు ఎంత సంతోషం కలిగిందో….
   వారికి నేనేదో చేయడం కాదండీ…’శతదిగ్గజ రచయిత్రులు’ నా బ్లాగ్ లో కొలువుదీరడం నాకు ఉత్తేజాన్నిస్తుంది.
   మీ మంచి వాక్యాలకి మనఃపూర్వక ధన్యవాదాలు.

 8. జాజి మల్లి గారు చిన్న సలహా .. బహుశా మీరు ప్రశ్నలు మెయిల్ చేసి సమాధానాలు మెయిల్ లో పొండుతున్నరేమో. దానితో పాటు వీలుంటే వారితో ఫోన్ లో మాట్లాడండి .. మరిన్ని మంచి ముచ్చట్లు తెలియ వచ్చు. అయితే ఇది సలహా ఇచ్చినంత తేలిక కాదని తెలుసు .. వీలుంటే చుడండి

  • మురళి గారూ,
   నిజమే…అట్లా చేయడం వల్ల ఇంకా మంచి విషయాలు ఇంటర్వ్యూ లో వస్తాయి…
   ఈ ప్రయత్నం మొదలు పెట్టినపుడు ఈ స్థాయి స్పందన ఊహించలేదు…అదీ కాక ప్రశ్నావళి కూడా మారుస్తూనే ఉండాలి ఎట్ లీస్ట్ కామన్ ప్రశ్నలతో పాటు వారి ప్రత్యేకతల్లోంచి కూడా అదనపు ప్రశ్నలు అడగాలి…ఏదో చేసేసాం అని కాకుండా సీరియస్ గా ఒక చిన్న ప్రయోజనం అయినా మహిళా బ్లాగర్స్ కి కలిగితేనే ప్రయత్నం నెరవేరినట్లు…
   ఇక ఇపుడు సమయం తక్కువనో,వెసులుబాటు చిక్కడం లేదనో నసిగితే అది నాదే తప్పు అవుతుంది…”ఆపన్న హస్తం దొరికితే బావుండును”

 9. జాజిమల్లి గారు,

  ప్రత్యేకంగా ఒకరు ఫోన్ లో కాకుండా ఇలా టపా వ్యాఖ్యల ద్వారా వారిని ప్రశ్నలు ఎవరైనా అడుగవచ్చును కదా? మంచిరచయిత అని వారి వారి బ్లాగుల్లో ఎలాగు మెచ్చుకొంటూనే ఉంటారు, ఈ టపాల వ్యాఖ్య ల పరిధి ఇంకొంత పెరిగితే బావుంటుందని నా అభిప్రాయం .

  • చాలా మంచి సూచన మౌళీ…
   తోటి బ్లాగర్లు తమ వ్యాఖ్యల ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు…అపుడు వారి అంతరంగం సమగ్రంగా విస్తృతంగా ఆవిష్కరించబడుతుంది…ముఖాముఖిలో వైవిద్యం కూడా పెరుగుతుంది…కాకపొతే ముఖాముఖి ఇచ్చిన బ్లాగర్ ఆ రెండు రోజులూ కొంచెం కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది..

   • అయితే అందుకొండీ, మొదటి రెండు ప్రశ్న శైలజా చందూ గారు,

    మీ రచనల లో మీకు చాలా చాలా ‘నచ్చని’ రచన/టపా ఏది ? ఎందుకు?

    రెండో ప్రశ్న, బ్లాగ్ ల లో రాయటం మొదలెట్టి నప్పటికి ఇప్పటికి మీ రాతల్లో ప్రావీణ్యత పెరిగిందను కుంటున్నారా ?

    కొత్త గా వచ్చే రచయిత్రులకు/రచయితలకు ఈ బ్లాగ్ లోకం ఒక పరిచయ వేదిక గా, కథా సామర్థ్యాన్ని పెంపొందించే మాధ్యమం గా ఉపయోగ పడే అవకాశం ఉందంటారా ?

    ప్రశ్నలు వేసేసా! జవాబు టప టపాయించండీ మరి.!

    చీర్స్
    జిలేబి.

   • జిలేబి గారూ

    @ “బ్లాగు ఓనరి మొగుడు గారూ, బ్లాగుని వొదిలే ప్రశ్నే లేదు. “

    @ “కోడల్ని కూడలిలో కడిగేస్తా”

    పై వాఖ్యలు శైలజా చందు గారి ఏ టపా లోనివి 🙂

 10. శైలజా చందూ గారి హాస్యం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆవిడ బ్లాగులో రచనలన్నీ చదివి ఆనందిస్తూ అప్పుడప్పుడూ స్పందిస్తుంటాను కూడా.చక్కటి హాస్యాన్ని అందరూ రాయలేరు. ఆవిడను ఫుల్ టైమ్ రచయిత్రిగా చూడాలనుకుంటున్నాను.మంచి రచయిత్రిని పరిచయం చేసినందుకు జాజిమల్లి గారికి ధన్య వాదాలు.

 11. జిలేబి గారు,
  మీ ప్రశ్నలకు జవాబివ్వడం సంతోషం గా ఉంది. కొంచం పెద్ద జవాబే వచ్చింది. ఓపిక చేసుకుని చదవండి.
  వేరే రచయితల కథలు చదువుతుంటే నాలోపాలు కనిపిస్తాయి. నా కథలు ఎప్పుడైనా చదువుతుంటాను. పెద్దగా నచ్చవు. బాగా నవ్వొచ్చింది అన్న కథ ఇప్పుడు చదువుతుంటే నవ్వే రాదు. ప్రతి రచనలోనూ ఎక్కడో ఒక చోట లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. హిందీ మాష్టారి కథ ఎప్పుడు చదివినా కన్నీళ్ళు పెట్టుకుంటాను. కానీ కథ చివర్లో కామెడీ చేసి కథంతా పాడుచేశావని మా అన్నయ్యలు విసుక్కున్నారు. నాక్కూడా అదే అనిపించింది. కథలో మూడ్ ని నాశనం చేశానని. ప్రతి కథలోనూ లోపాలు ఉన్నాయి. కొన్నింటిని డిలీట్ చేస్తే సరిపోలా అన్నంత చిరాకు తెప్పిస్తాయి..

  నా కథల్లో లోపాలు ( నాకు కనిపించేవి) ఏదైనా విషయం మీద వ్రాసేప్పుడు అవసరమైనంత పరిశోధన చెయ్యకుండానే వ్రాస్తున్నట్లు అనిపిస్తుంది. ముగింపు దగ్గరకొచ్చేసరి తొందర పడతాను. Ending crisp గా వ్రాయను.
  ఈ మధ్యనే వ్రాసిన కథ “నిన్ను నిన్నుగా” ఒక సారి కేరళ లో ఘాట్ రోడ్ మీద వర్షం పడుతుండగా ప్రయాణిస్తూ ఆ కథ ఆలోచించాను. సన్నివేశాలు ఆలోచిస్తున్నపుడు ఒక చోట, కళ్ళలో నీళ్ళొచ్చాయి. సరిగా ఆ మూడ్ ని మొత్తం కథలో తెప్పించగలిగితే కథ బాగుండేది. బ్లాగు పోస్ట్ వ్రాసే టైం కు theme గుర్తుంది. కొన్ని సీన్లు గుర్తొచ్చాయి. కథ ఏర్పడినప్పుడు ఉన్న intense మూడ్ వ్రాసే సమయానికి dilute అయి, మూడ్ ని మిస్ అయ్యాను. I failed miserably to deliver what I imagined and couldn’t take the readers along with me as I lost the route map. అదో ఘోరమైన కథ అని నా అభిప్రాయం.

  బ్లాగు పెట్టినప్పటినుండి ఇప్పటి వరకూ ప్రావీణ్యం పెరిగిందనుకోను. అప్పుడైనా ఇప్పుడైనా మనసులో ఆలోచలని టైప్ చెయ్యడమే . కాకపోతే జాగ్రత్త పెరిగింది. ఇదివరకు ఎవరూ పెద్ద చదవరు, నేనేగా నా రాతలు చదివేది అని ఎట్లా బడితే అట్లా రాసేదాన్ని. ఇప్పుడు పోస్ట్ చెయ్యబోయే ముందు పాఠకులకు నచ్చుతుందో లేదో, ఎవరైనా కథలో వ్రాసిన నొచ్చుకుంటారేమోనని ఒకటికి పది సార్లు చెక్ చేస్తాను.

 12. శైలజ గారు,

  కొన్ని సందేహాలు :

  పాఠకులకు నచ్చుతుందో లేదో అని ఆలోచిస్తే, కధ dilute అవదా?

  కొన్ని సీన్లను కధగా మలచడం అన్నది ఒక ఆర్ట్ కావచ్చు. ఆ విధానం లో కొన్ని టిప్స్ చెప్పగలరా?

  ఇంకాస్త ఇంటెన్స్ అవసరం అనిపించిన కధలను మీరు రిపేర్ ఎందుకు చెయ్యరు? లేదా మార్పులతో ఇంకొక క్రొత్త రచన చేస్తారా ?

  ఎవరు నొచ్చుకోకుండా వ్రాయాలంటే రచయితకు ఉండాల్సిన పరిమితులు ఏమిటి?

  • మౌళి గారి సందేహాలకు సమాధానాలు

   పాఠకులకు నచ్చుతుందో లేదో అని ఆలోచిస్తే, కధ dilute అవదా?

   నా కథలన్నీ ఒక పాట విన్న తర్వాత, లేదా , ఎవరైనా నాతో అన్న ఒక మాట చుట్టూతో అల్లినవే. ఆ మాటే ఎన్నో ఆలోచనలను create చేస్తుంది. వాటిని పాఠకులకు చెప్పాలనిపిస్తుంది. Raw గా ఉన్న ఆలోచనలను అలాగే పాఠకులకు ముందు పెడితే ఎవరికీ చదవాలనిపించదు. Its like feeding someone with raw vegetables. అందుకోసం సన్నివేశాలను, పాత్రలను సృష్టించాల్సి ఉంటుంది.

   పాఠకులకు నచ్చుతుందో లేదో అని నేను ఆలోచించేది కథ గురించి కాదు, కథ చెప్పే విధానం గురించి, . నచ్చితేనే కథ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకే కథను బోరు కొట్టే లానూ, ఆసక్తికరంగానూ చెప్పొచ్చు. నేను పబ్లిష్ చేయబోయే ముందు చదివే వారికి ఆసక్తి కరంగా ఉందా లేదా అని చూస్తాను. అనుకున్న కథ పాఠకులకు చేరే విధం గా వ్రాస్తే కథ dilute అయే ప్రమాదం ఏమీ ఉండదు.

   కొన్ని సీన్లను కధగా మలచడం అన్నది ఒక ఆర్ట్ కావచ్చు. ఆ విధానం లో కొన్ని టిప్స్ చెప్పగలరా?

   టిప్స్ చెప్పేంత అనుభవం నాకు లేదు. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను.

   But I would like to say how I create a strory. I would form a skeleton of the story. Main scenes will be written in the mind. They will be arranged in an order according to the flow of the story. Before posting I would elaborate the scenes and add some subtle humour ( If possible) to make it readable.

   ఇంకాస్త ఇంటెన్స్ అవసరం అనిపించిన కధలను మీరు రిపేర్ ఎందుకు చెయ్యరు? లేదా మార్పులతో ఇంకొక క్రొత్త రచన చేస్తారా ?

   ఏదైనా బుక్ గా పబ్లిష్ చెయ్యబోయే ముందు రిపేర్ చేద్దామన్న ఆలోచన ఉంది.

   ఎవరు నొచ్చుకోకుండా వ్రాయాలంటే రచయితకు ఉండాల్సిన పరిమితులు ఏమిటి?

   మనం వ్రాసిన కథ మనం చదివినపుడు, తెలుస్తుంటుంది. ఇక్కడ కొద్దిగా అతిగా ఉందనో, లేదా controversy కి గురయ్యే అవకాశం ఉందనో. పరిమితులు అనేవి individualised. ఎవరి పరిమితులు వారివి. నాకు తప్పు అనిపించేవి నా పరిమితులు. అవి వేరే రచయితకు సరైనవి అనిపించొచ్చు.

   • చక్కని సమాధానాలు & సలహాలు కూడా అందించారు, థాంక్స్ శైలజ గారు.

    అప్పుడప్పుడు చాలా ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది మీ బ్లాగు.

 13. శైలజా చందూ గారూ, మీ రచనలు చాలా సహజంగా వుంటాయండీ. మీకు హృదయపూర్వక అభినందనలు. మిమ్మల్ని ఇలా ముఖాముఖీ పరిచయం చేసిన జాజిమల్లిగారికి ధన్యవాదాలు.

 14. శైలజ గారూ, మీ Down to Earth..nature నాకు బాగా నచ్చుతుంది. ఈ మధ్య కాలంలో నేను కడుపు పట్టుకుని నవ్వేంత హాస్యం మీ బ్లాగులో మాత్రమే చూసాను.
  కూరల విషయం నిన్నేగా చెప్పారు… same same 🙂

 15. హృదయపూర్వక అభినందనలు శైలజ గారూ!

  ” పోస్ట్ చెయ్యబోయే ముందు పాఠకులకు నచ్చుతుందో లేదో, ఎవరైనా కథలో వ్రాసిన నొచ్చుకుంటారేమోనని ఒకటికి పది సార్లు చెక్ చేస్తాను”..ఈ పద్దతి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు! మీ భావాలని..ఆలోచనల్ని అలానే పంచుకోండి.

 16. చాలా బావుందండి.. శైలజగారి మాటలు, మళ్లీ కామెంట్లలో సమాధానాలు కూడా. శైలజగారు ఒక్క మాట .. మీరు రాసింది మీకు నచ్చితే చాలు. ఎవరేమనుకుంటారో, నొచ్చుకుంటారో అని ఆలోచించకుండా. తప్పులు చూపితే, అవి సరియైనవే అని అనిపిస్తే తర్వాత అవి పునరావృతం కాకుండా చూసుకోండి చాలు. మీరిలాగే కంటిన్యూ ఐపోండి..

  • సిరిసిరి మువ్వ గారు, జ్యోతి గారు, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. నొచ్చుకుంటారేమోనని నేను సందేహించేది కొన్ని పదాల వాడుకలో మాత్రమే. భావ వ్యక్తీకరణ గురించి కాదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి physical characteristics గురించి వర్ణించే సమయం లో తెలియకుండా ఒక పొరపాటు పదం దొర్లింది. ఆ తర్వాత అది సరిచేశాను.

 17. బ్లాగుల వల్ల వుపయోగం ఏమిటంటే మీకులాంటి వాళ్ళందరితో ఇంత సుళువుగా పరిచయాలు ఐపోతున్నాఇ శైలజ గారూ…:) మీ simplicity చాలా నచ్చుతుంది నాకు. చాలా తక్కువమందిని చూస్తున్నాం ఈ మధ్య ఇంత simple గా వుండే వాళ్ళని…

 18. నాయనా బుద్ధా మురళి !

  ఈ నల్లంచు తెల్ల జుట్టు వయసులో ఇట్లాంటి మరీ కాంప్లికేటెడ్ ప్రశ్నలు వేస్తే నేనెలా జవాబు చెప్పేది ! అసలు నేను శైలజా గారి టపాలు చదవనే చదవను. ( అయితే కామెంటు ఎట్లా రాసారు అంటారా?, అదే కదా జిలేబీ? శ్రీ రామరాజ్యం చూడకుండా ఆహా ఓహో అన్నట్టు అన్నమాట !)

  ఇక శైలజ గారి టపాల గురించి: వాటిలో ఉన్న హాస్య చమక్కులు ఫేడేల్మని అక్కడక్కడా మన పైబడి కొన్ని చోట్ల ముసి ముసి నవ్వులు మరి కొన్ని చోట్ల పదవిరుపుల కమల నయనాలు అవీ వారి గొప్ప దనాలు.

  మీ ప్రశ్న కి సమాధానం అందిందా ?

  చీర్స్
  జిలేబి.

 19. శైలజగారు,
  నేను చదువుకోలేదు, చర్చలో పాల్గొనే అర్హత కూడా ఉందనుకోను. మీరు రాసింది మీకునచ్చిందా? మరొకరికినచ్చాలనే రాస్తాం. అన్నీ నచ్చచ్చు, నచ్చకాపోవచ్చు. మనకు నచ్చినది ఇతరులకి నచ్చకా పోవచ్చు. మీరు మీరులా ఉంటే మా కదే ఆనందం. “నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమె కన్నీరు నించుటకు తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ…మనసునమనసై బతుకున బతుకై…”

 20. శైలజగారు, మీ పుణ్యమాని రచన గురించి మంచి చర్చ మొదలయింది ఇక్కడ. వేదికనిచ్చినందుకు జాజిమల్లి గారికి కూడా నెనర్లు. రాయడమనే ప్రక్రియ గురించి మీ ఆలోచనల్ని పంచుకున్నందుకు నెనర్లు. చక్కటి ఆలోచనలు. నాకు తట్టిన రెండు ఆలోచనలు పంచుకుంటాను.
  1) ఎప్పుడో అల్లుకుని పెట్టుకున్న కథని కాగితం మీద పెట్టడం – ఆ తొలి ఊహలోని intense emotion తరవాత కథ రాసే సమయానికి dilute అయిపోతుంది నిజమే. అలా కాకుండా జాగ్రత్త పడేందుకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. కథ ఊహ రాగానే సాధ్యమైనంత త్వరగా కొన్ని పొడిమాటల్లోనో, లేక ఒకటి రెండు వాక్యాల్లోనో రాసి ఉంచుకోవడం ఒక పద్ధతి. ఆ తరవాత ఎప్పుడైనా ఈ మాటల్ని చదువుకుంటే, అ తొలి ఊహ ఇంటెన్సిటీ గుర్తుకొస్తుంది. ఇది కొంచెం అభ్యాసం మీద అలవాటవుతుంది.
  2) ఇతరులకి నచ్చక పోవడాన్ని పట్టించుకోకండి అని చాలా మంది సలహా ఇచ్చారు. ఇది చాలా తప్పు దృక్పథం. కొత్తగా రాయడం మొదలు పెట్టేవారికి, రాయడం అలవాటు కావడం కోసమూ, స్వయం అభివ్యక్తిలో కొంచెం ధైర్యం సంపాదించుకోవడం కోసమూ ఈ సలహా పని చేస్తుంది కానీ మీవంటి అనుభజ్ఞులకి వర్తించదు. అదీ కాక – మీ రచనలు ఇంతమందికి నచ్చడం వల్లనే ఈ రోజున మీ బ్లాగుని ఇంత అభిమానంతో చూస్తున్నారు.

  పైన పుట్టినరోజుల్ని బహిరంగంగా ప్రకటించవద్దని సలహా ఇచ్చాను.వయసు దాచిపెట్టుకోవాలని కాదు. జాజిమల్లిగారు తన పరిశోధన నిమిత్తం ఆ సమాచారం సేకరించి దాన్ని తన పరిశోధనలో ఉపయోగించుకుంటే అది ఒక విషయం. బహిరంగంగా ప్రకటించటం వల్ల ఈ బ్లాగు పాఠకులకి ఆ రచయిత గురించి కొత్తగా అబ్బే జ్ఞానం ఏమీ లేదు. రెండోది – పుట్టినరోజు సమాచారం వ్యక్తిగత సమాచారం. It is both personal as well as an important part of a person’s data profile. May be misused if displayed publicly.

  • నారాయణ స్వామి గారు,
   మీరు చెప్పిన జాగ్రత్తలు, సూచనలు తప్పక గుర్తుంచుకుంటాను సర్. పుట్టిన రోజు సంగతి విషయం లో కూడా మీరు చెప్పినది చాలా విలువైన సమాచారం. జాగ్రత్తగా ఉంటాను. Thank you sir

 21. @ పుట్టినరోజుల్ని బహిరంగంగా ప్రకటించటం వల్ల ఈ బ్లాగు పాఠకులకి ఆ రచయిత గురించి కొత్తగా అబ్బే జ్ఞానం ఏమీ లేదు.

  తప్పకుండా ఉంటుంది కొత్తపాళీ గారు.(నా ఉద్దేశ్యం నక్షత్రం, రాశి గురించి కాదు ) మీ అభ్యంతరం స్టార్ బ్లాగర్స్ బర్త్ డే లకి జరిగే హడావిడి గురించి అయితే, అవన్నీ రచయితకి సమస్య అవ్వాల్సిన పనిలేదు.

  ఇతరులకి నచ్చక పోవడాన్ని పట్టించుకొవదమా లేదా అన్నది మీరు చెబుతున్నది శైలి గురించి అయ్యుంటుంది. భావ వ్యక్తీకరణ గురించి అయితే క్రొత్తవారికి అయినా పాతవారికి అయినా వారి వారి ఇష్టాన్ని బట్టి మాత్రమె పట్టించుకోవాలి.

  జాజిమల్లి గారు, డా.రమణ గారు వ్రాసేవి బోలెడు మందికి నచ్చకపోవచ్చు. అలానే క్రిష్ణప్రియ గారు వ్రాసేవి అందరికి నచ్చ్సుతాయి. ఎవరి చాయిస్ వారిది

  ఇది నా అభిప్రాయం , మీరేమంటారు ?

 22. శైలజ గారి పరిచయం.. అద్భుతం. ముఖ్యం గా ఫోటో, అడ్రస్ తో సహా ఇవ్వడం.. నాకు చాలా నచ్చింది. మీరు ఎంతైనా చాలా హట్ కే.. మీ హాస్య చతురత కి నేను పెద్ద పంఖా..

 23. నిజంగా నవ్వుల చందమామే నండీ శైలజ గారూ మీరు.. బాగుంది మీతో ముఖాముఖి.. మీరు సరదాగా చెప్పింది చూసి నాకు కూడా గుంటూరు కూరగాయల మార్కెట్టు, తెల్లవారు ఝామునే లారీల్లో దించే తాజా ఆకుకూరలు గుర్తొచ్చాయి. 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s