నడుద్దామా ‘తృష్ణ వెంట’

 
బ్లాగర్ పేరు : తృష్ణ
 
 బ్లాగ్ పేరు: తృష్ణ
 
బ్లాగ్ చిరునామా : http://trishnaventa.blogspot.com
 
నా మిగతా బ్లాగులు:
 
పుట్టిన తేదీ : 4th,september
 
పుట్టిన స్థలం: రాజమండ్రి
 
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
 
చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)
 
విద్యాభ్యాసం: M.A(English),M.A.(Hindi), PGDT (PG Diploma in Translation)
 
వృత్తి, వ్యాపకాలు: సగటు గృహిణిని. అన్నిరకాల సంగీతం వినటం, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్, గార్డెనింగ్, సినిమాలు, పుస్తక పఠనం, ఫొటోగ్రఫీ, కొత్త రకాల వంటలు వండటం…ఇప్పుడు బ్లాగ్ రాయటం.. మొదలైనవి నా వ్యాపకాలు.
 
బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ: 2009 మే 28న నేను బ్లాగ్ మొదలుపెట్టాను.
 
మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి): “తృష్ణ” బ్లాగ్ లో 482, నా మిగతా నాలుగు బ్లాగుల్లో కలిపి ఈ మూడున్నరేళ్లలో మొత్తం 665 టపాలు రాసాను.
 
 
బ్లాగ్ లోని కేటగిరీలు: నా అభిప్రాయాలూ, చిన్ననాటి స్మృతులు, నే చదివిన కొన్ని పుస్తకాలు, ఇష్టమైన పాటలు, సినిమాలు, కవితలు, వంటకాల రెసిపీలు, ప్రయాణాలు, సరదా కబుర్లు మొదలైనవి నా టపాల్లోని అంశాలు.
 
 
బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?
 
ఒక కథలో చదివాను బ్లాగ్స్ అనేవి ఉన్నాయని. తర్వాత నెట్ లో అనుకోకుండా ఒకరోజు క్రియేట్ యువర్ బ్లాగ్ అన్న పేజీ కనిపించి అప్పటికప్పుడు సరదాగా బ్లాగ్ క్రియేట్ చేసాను. అప్పుడు నాకు అగ్రిగేటర్స్ గురించి గానీ, ఇన్ని రకాల బ్లాగ్స్ ఉంటాయని గానీ తెలీదు.
 
 
బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?
 
మూడున్నర ఏళ్ళుగా రాస్తూండటం వల్ల నేను కూడా ఏదన్నా రచన చెయ్యగలను అన్న నమ్మకం నాపై నాకు కలిగింది. నా రాతల్లో పెరిగిన పరిణితి ని కూడా నేను గమనించాను. నా రాతల్ని అభిమానించే ఎందరో బ్లాగ్మిత్రులు పరిచయమయ్యారు. స్నేహితులయ్యారు. బ్లాగింగ్ అనేది ఒక వ్యాపకమే అయినా మనోభావాలను, అభిరుచులను అలాంటి అభిరుచులున్న మరికొందరితో పంచుకోవటం వల్ల ఎంతో ఆనందం, తృప్తి మిగులుతాయి. ఇంకా చాలానే పాఠాలు నేర్చుకున్నాను. మనస్తాపానికీ, వేదనకూ గురయ్యాను. రకరకాల కారణాల వల్ల ఎన్నోసార్లు నేను బ్లాగింగ్ కు దూరంగా వెళ్ళి మళ్ళీ తిరిగి రావటం జరిగింది. చివరిగా అర్ధమయ్యిందేమిటి అంటే.. రాయటానికి అలవాటు పడ్డ చెయ్యి రాయకుండా ఉండలేదని..:)
 
బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు? పరిమితులు?
 
“బ్లాగ్” మన సొంతం కాబట్టి ఏదైనా రాసిన వెంఠనే మనమే ప్రచురించుకోవచ్చు. ఎవరి అనుమతి, నియంత్రణ లేకుండా మనకు తోచిన విధంగా రాసుకునే స్వాతంత్ర్యం మనకు ఉంటుంది. అయితే బ్లాగ్ లో వ్రాయటమంటే వీధిలో నించుని మట్లాడినట్లే కాబట్టి ఆచితూచి రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది అనుభవపూర్వకంగా అర్థమౌతుంది. అంతర్జాలంలో ఎవరైనా సరే మన రాతల్ని చదవగలరు. ఎవరికి తోచినట్లు వాళ్ళు వ్యాఖ్యానించగలరు. ముఖాముఖి కనబడము కాబట్టి వ్యాఖ్యానించేవారికి బ్లాగర్ లోకువ. ఈ లోకువతనాన్నీ, వెకిలి వ్యాఖ్యలను ఏమీ చెయ్యలేకపోతున్నాం. ఇది ఓ పరిష్కారం లేని సమస్య. ఇందుమూలంగా చాలామంది బ్లాగర్లు కొన్ని పరిమితులకు లోబడి రచనలు చేయాల్సి వస్తోంది. ఈ పరిమితుల వల్లనే ఎందుకొచ్చిన తలనెప్పి అని బ్లాగింగ్ ఆసేసో, రాసినమటుకు బ్లాగ్ వదిలేసో వెళ్ళిపోయినవారు చాలామందే ఉన్నారు.
 
మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?
 
నన్ను నేను ఒక సగటు మధ్యతరగతి గృహిణిగానే గుర్తుంచుకుంటానండి. ప్రత్యేకత లాంటిదేమైనా ఉంటే.. అది నా బ్లాగ్ చదివే పాఠకులు చెప్పల్సిందే..:)
 
సాహిత్యంతో మీ పరిచయం?
 
నాన్నగారు విజయవాడ ఆకాశవాణి ఉద్యోగి కాబట్టి సంగీతసాహిత్యాలతో నా పరిచయం చిన్ననాటిదనే చెప్పాలి. రజని గారు, ఉషశ్రీ గారు, శ్రీకాంత శర్మ గారూ, భట్టు గారు మొదలైన పెద్దలందరి సాంగత్యాభిమానాలు దొరకటం నా అదృష్టంగా భావిస్తాను. సొంతంగా తెలుగు చదవటం వచ్చిననాటి నుండీ పుస్తకాలు నా నేస్తాలయ్యాయి.
 
 నా పుస్తకాల కబుర్లు క్రింద లింక్లో చదవచ్చు..
 
స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?
 
ఎదురయ్యాయండి.. ముఖ్యంగా సినిమాల గురించి రాసినప్పుడు. అయినా నేను ఒక స్త్రీ బ్లాగర్ గా  ఎప్పుడూ రాయలేదండి… ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో బెస్ట్ స్టూడెంట్ గా అవార్డ్ పొందిన వ్యక్తి కూతురుగా, చిన్నప్పటి నుండీ సినిమాల గురించీ, తెర వెనుక సినిమా తియ్యటానికి ఎంత శ్రమ ఉంటుంది విని ఉన్న మనిషిగా సినిమా కబుర్లు రాద్దాం అని మొదలెట్టాను… కానీ కొందరి వ్యాఖ్యలు ఇబ్బందిపెట్టడం వల్ల ఈమధ్యన అవి కూడా తగ్గించేసాను.
 
 
.జీవన నేపధ్యం?
 
మాది సామాన్య మధ్యతరగతి కుటుంబం. కళాభిరుచి, సంగీతసాహిత్యాల పట్ల ప్రేమాభిమానాలున్న కుటుంబం. నాన్నగారి రేడియో ఉద్యోగం వల్ల రకరకాల కళాకారుల మధ్యన పెరిగటం వల్ల నాకూ కళల పట్ల, సంగీతసాహిత్యాల పట్ల ఆసక్తి పెరిగింది. వివాహానంతరం ఉమ్మడి కుటుంబంలో బాధ్యతలెక్కువ ఉండటం వల్ల ఉద్యోగప్రయత్నాలేమీ చెయ్యలేదు. పాప పుట్టకా నా సమయాన్ని తనతోనే గడపాలనే ఉద్దేశంతో గృహిణిగా ఉండిపోయాను. ఏదో ఈ బ్లాగ్ పుణ్యమా అని అటకెక్కిన నా అభిరుచులన్నీంటినీ దుమ్ముదులపటమైంది 🙂 
 
 
బాలాంత్రపు రజనీకాంతరావు గారితో మీ అనుబంధం?
 
నా అసలు “పేరు”కి ప్రేరణ రజని గారు రాసిన ఒక పాట అని నాన్నగారు చెప్తూంటారు. రజని దంపతులను అమ్మ బాబయ్యగారూ, పిన్నిగారూ అంటూ ఉండేది. వాళ్ళిద్దరూ కూడా అదే అభిమానంతో ఉండేవారు. అమ్మావాళ్లతో చిన్నప్పటి నుండీ ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. తొంభై ఏళ్ళు పైబడిన అంతటి గొప్ప వ్యక్తి ఫోన్ చేసినప్పుడల్లా నేనెలా ఉన్నానని నా గురించి కూడా నాన్నగారిని అడగటం నా అదృష్టంగా భావిస్తాను.
 
 
మీ బ్లాగ్ రచనలు గానీ మీ బ్లాగ్స్ డిజైన్ గానీ ఈస్తటిక్ వాల్యూస్ తో ఉంటాయి..దానికి ప్రేరణ ఎక్కడ ఉంది?
 
బ్లాగ్ టెంప్లేట్స్ కి అయితే ప్రత్యేకమైన ప్రేరణ అంటూ ఏదీలేదండి.. ఆర్టిస్టిక్ ఇంట్రస్ట్ ఉండటం వల్ల అలాంటి టెంప్లేట్స్  నచ్చి ఉండచ్చు. ఇక రచనలు గురించి అంటే.. బ్లాగ్ లో నా ఆలోచనలనూ, కొన్ని జీవిత సంఘటనలనూ సరదాకో, ఊరికేనో రాయనండి.. మంచి విషయాలు నలుగురితో పంచుకోవాలన్న ఆసక్తి మాత్రమే కాక ఒక సంఘటన వల్ల, లేక ఒక వ్యక్తి వల్ల నేను నేర్చుకున్న విషయం లేదా తెలుసుకున్న సత్యం మరెవరికైనా ఉపయోగపడుతుందేమో అని రాస్తాను. అది అర్థం చేసుకున్న వాళ్ళు “తృష్ణ వెంట” నడుస్తారు…:)
 
 
ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
 
రాయగలిగినన్నాళ్ళు… మళ్ళీ ఏ ఎదురుదెబ్బా తగలనన్నాళ్ళూ.. రాస్తూనే ఉంటాను.
 
 
సరదాగా ఏవైనా చెప్పండి?
 
ఎన్ని చికాకులు ఉన్నా ఆనందంగా ఉండటానికే ప్రయత్నించండి. పరిపూర్ణమైన ఆరోగ్యానికి అదే మంచి టానిక్..:)
 
 
సీరియస్ గా ఏవైనా చెప్పండి?
 
ఎవరి మీదన్నా కోపం గానీ, చిరాకు గానీ ఉంటే వాళ్ళని తిట్టండి, కోప్పడండి, నా బాధ ఇది అని తెలపండి… కానీ వాళ్ల తప్పేమిటో కూడా చెప్పకుండా వాళ్లని వెలివేసి, మీ మౌనంతో వాళ్లను మరింత బాధపెట్టకండి. మౌనం సమస్యలను జటిలం చేస్తుంది తప్ప పరుష్కరించదు.
 
 
మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం గానీ ఒకటి..
 
నా బ్లాగ్లో రాతలన్నీ నాకు ఇష్టమైనవే. ఏదని చెప్పను… 
కొత్త సంవత్సరం వస్తోంది కాబట్టి 2011జనవరి ఒకటిన రాసిన పోస్ట్ లింక్ ఒకటి ఇస్తున్నా…
 

25 thoughts on “నడుద్దామా ‘తృష్ణ వెంట’

  1. నేస్తం గారు అభినందనలు.మీరు అలానే అంటారు.మా నేస్తం లాగా
    మీరు కబుర్లు చెప్పడం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది.పైగా
    మీ బ్లాగ్ వల్లనే చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు.మీరు మంచి రచయిత.
    మీరు ఇలాగే వ్రాస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను

  2. తృష్ణ గారి బ్లాగు వల్ల మంచి మంచి పుస్తకాలు గురించి తెలుసుకుంటూ వుంటాను. ‘తృష్ణ వెంట’ ప్రయాణం ఆహ్లాదంగా వుంటుంది. అభినందనలు తృష్ణ గారు.

    • తృష్ణ గారూ,
      థాంక్ యూ…కామెంట్ మోడరేషన్ ఉంది కనుక వెంటనే పబ్లిష్ కాదు…మరి ఇంకా సమస్య అంటే..వేరే పద్ధతులు లేనట్లు ఉన్నాయిగా..ఏంటో వర్డ్ ప్రెస్ ని వదలబుద్ధి కాదు…సెంటిమెంటు.

  3. ఒకసారి కొత్త పాళీ గారనుకుంటాను “ఇక్కడ ఉండాలంటే కాస్త తోలు మందం ఉండాలి” అన్నారు. తోలు మందం అక్కర్లేదు కానీ కాస్తంత ఆత్మ విశ్వాసం ఉండాలి. నిరాశ పరిచే వ్యాఖ్యల్ని పట్టించుకోక తీసి పడేయాలి. అసలు వాటి ఉనికే ఎవరికీ తెలీకూడదు. వాటి వల్ల మనం బాధ పడుతున్నామని తెలిస్తే….ఆ వ్యాఖ్యలు రాసిన వాళ్ల లక్ష్యం నెరవేరినట్లే! అందుకే వాటిని లెక్క చేయకూడదు.

    బయటి ప్రపంచం ఎలాంటిదో, బ్లాగ్ ప్రపంచమూ అలాటిదే!

    త్రుష్ణ గారు Dirty picture movie గురించి రాయడానికి మీరెంత వెనుకాడారో తల్చుకుంటే నాకు దిగులేస్తుంది.

  4. Thanks for the comment sujaata gaarU. మీ సూచన తప్పక గుర్తుంచుకుంటాను.
    ఒకోసారి రాసిన తర్వాత ఏవరో ఏదో అన్నారని బాధ పడేకన్నా రాయకుండా ఊరుకోవటమే మంచిదని అనుకుంటానండి..

  5. సామాన్యురాలినంటూనే.. ఎన్ని బ్లాగులు ఎంత అలవోక గా నడిపిస్తున్నారు! సాధారణం గా వంటల బ్లాగులు నేనెప్పుడూ చూడను. చాలా రేర్ గా. మీ వంటల బ్లాగు కూడా నేను చూస్తాను.
    మీ పరిచయం బాగుంది.

  6. @కృష్ణప్రియ గారూ, ఏమో.. అలా అలా నడుస్తున్నాయి మరి… 🙂 మీ స్పందనకు ధన్యవాదాలు.

    @ప్రసాద్ శర్మ గారూ, నిజం చెప్పాలంటే ఎవరికి కనబడకుండా లైనులో అందరి వెనుకా ఆఖర్న దాక్కునే రకాన్నండి నేను. ఫోటో ఇవ్వక తప్పలేదు. అంతే! అయినా ఆ ఫోటోలోలాగ ‘అస్సలు లేను’ అని చెప్పటానికి ఆనందిస్తున్నాను 🙂 కాబట్టి మీరు ఊహించుకుంటూనే ఉండచ్చు.
    స్పందనకు ధన్యవాదాలు.

  7. << చివరిగా అర్ధమయ్యిందేమిటి అంటే.. రాయటానికి అలవాటు పడ్డ చెయ్యి రాయకుండా ఉండలేదని..
    తృష్ణ గారూ… అవన్నీ మర్చిపోండి.. ఈ ఒక్క ముక్క మాత్రం బాగా మా బాగా గుర్తుంచుకుని అమలు పరిచెయ్యండి.. 😀

Leave a reply to మధురవాణి స్పందనను రద్దుచేయి