అమ్మమ్మ ‘నిర్జనవారధి’ కాదు…

అసంఖ్యాక పాఠక ‘జనవారథి’

 Posted By భూమిక on December 1, 2012
 మల్లీశ్వరి
 
కొండపల్లి కోటేశ్వరమ్మగారిని 2010 జనవరి 17 తేదీన మొదటిసారి కలిసాను. చాసో స్ఫూర్తి పురస్కార సభకి మేమిద్దరం కలిసి విజయనగరం వెళ్ళాం. ప్రయాణంలో ‘అమ్మమ్మా! నీ గురించి ఏవయినా చెప్పవూ? మాకు స్ఫూర్తిదాయంగా ఉంటుంది కదా!” అని అడగ్గానే, నిష్కపటంగా ఏమాత్రం రాగద్వేషాలు లేని స్వరంతో తన జీవితాన్ని తడుముకున్నారు. పలవరించారు.
 ఏళ్ళ తరబడీ ఎందరినో కదిలించిన ఆ పలవరింతలే ఆమె ఆత్మీయుల సహకారంతో  తన 92 వ ఏట ‘నిర్జన వారధి’గా మన ముందుకు తీసుకు రావడం ఆత్మకథాసాహిత్యంలో మేలిమలుపు. నిర్జన వారధి ఆత్మకథ మాత్రమే కాదు, ఈ కాలానికి అవసరమయిన ఒక చారిత్రక గ్రంథం కూడా.
 నిర్జన వారధిలో చాలామంది పాఠకులు గుర్తించి మెచ్చిన ప్రధానమయిన అంశం… అందులోని అంతస్స్వరం. నలుపు తెలుపులుగా కాక ఎంతో వైవిధ్యం, పోరాటం, దుఃఖం, విషాదం నిండివున్న జీవితాన్ని సమీక్షించుకుంటున్నపుడు ఆగ్రహ ప్రకటనలను నివారించి రాయడం అన్నది అంత సులువేమీ కాదు. మానవోద్వేగాల మీద ఎంతో పట్టు ఉంటే తప్ప అది  సాధ్యం కాదు. ఈ పుస్తకానికి ముందుమాటలు రాసిన ఓల్గా, అనురాధలు కూడా ఆ స్వరాన్ని కాపాడుతూ గౌరవిస్తూ సంయమనంతో రాయడం పుస్తకం ఔన్నత్యాన్ని మరింత పెంచింది.
 ప్రముఖుల జీవిత విశేషాలు, ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలోని వారి బలాలూ, బలహీనతలూ తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. ఒక్కోసారి సంచలనం సృష్టించే అవకాశాలూ ఉన్నాయి. నిర్జన వారధి కూడా సంచలనమే. అయితే ఆ క్షణానికి ఉర్రూతలూగించే సంచలనం కాదు. జీవితానుభవాల ఆధారంగా యిప్పటికీ సమాజంలో పెనగులాడుతున్న కొన్ని వర్గాల తరుపున నిలబడి ప్రశ్నించిన గ్రంథం. నిర్జనవారధి చదివి మొహమాటపడాల్సిందో, నొచ్చుకోవాల్సిందో, ఆశ్చర్యపడాల్సిందో ఏమీ లేదు. నేర్చుకోవాల్సిందీ, ప్రశ్నించాల్సిందీ మాత్రం చాలా ఉంది.
 కొండపల్లి సీతారామయ్యలాంటి విప్లవయోధుడి భార్యగా తను పొందిందీ, కోల్పోయిందీ నిష్పక్షపాతంగా అంచనా వేసుకునే క్రమంలో చాలా విలువయిన ఆలోచనలు చేశారు కోటేశ్వరమ్మ. తన సమస్తాన్నీ త్యజించి, జైలు జీవితానికీ, అజ్ఞాతవాసానికీ చలించక, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన విప్లవ పార్టీ రూపకర్తగా, సమరశీలిగా ఆయన సమాజానికి చేసిన సేవ నిరుపమానం… యింతటి త్యాగం ముందు ఆయనలోని ఒకటి రెండు వ్యక్తిగత బలహీనతలను పక్కన పెట్టడం సమాజానికి కష్టం కాదు… కానీ యిదే క్షమ కోటేశ్వరమ్మగారిలో కూడా ఉండాలని ఆశించడంలో అప్రయత్నంగానే పాతివ్రత్యకోణం చేరుతుంది. అందుకే ”మను సిద్ధాంతం, హిందూ మనస్తత్వం నాలో జీర్ణమై ఎన్ని బాధలు పడినా కూడా పతివ్రతలా భర్తను చూస్తానని నేనొకవేళ అంటే కూడా వద్దని కమ్యూనిస్టుల్లా వారించాల్సిన మీరు, అణచబడ్డ స్త్రీజాతికి అన్యాయం చేస్తావా అంటూ చీవాట్లు పెట్టాల్సిన మీరు ఆయనను చూడమని నాకు చెప్పడం వింతగా ఉంది” అంటారు కోటేశ్వరమ్మ.
 కొండపల్లి సీతారామయ్యని ఆయన వ్యక్తిత్వపు మొత్తంలోంచి చూసినపుడు అసాధారణ, మహోన్నత వ్యక్తిగా కనిపించవచ్చు. కానీ స్త్రీల దృష్టికోణం నుంచి చూసినపుడు ఆయన కూడా పురుషాధిక్యతకి అతీతుడు కాదని తోచవచ్చు. యిది ప్రత్యేకంగా ఆయన పరిమితి కూడా కాదు. సమాజమే పురుషాధిపత్య భావజాలంలో ఉండటం ముఖ్యకారణం.కులం, మతం, వర్ణం, జెండర్‌ వివక్షలు అంత త్వరగా పోయేవి కావు. వాటిని తమలో గుర్తించి, వదులుకోవడం కోసం నిరంతరాయంగా పోరాటం చేయాల్సి వుంటుంది.
 ఈ పుస్తకం చదువుతున్నపుడు ‘వ్యవస్థలో మార్పు’ అన్న నినాదం యాంత్రికంగా మారిపోయినట్లు అనిపిస్తుంది. వ్యవస్థలో రాజకీయ, ఆర్థిక, సామాజికమయిన అంశాలు మాత్రమే ఉండవనీ, ఉత్పత్తి సంబంధాలతో పాటు మానవ సంబంధాలను కూడా కలుపుకుని మార్పుకి కృషి చెయ్యాలని, లేనపుడు మార్పు సమగ్రం కాదన్న హెచ్చరిక కూడా ఈ ఆత్మకథలో ఉంది.
 పుస్తకంలో ఒకచోట ”పార్టీలో పురుషాధిపత్యం తక్కువే” అంటారు. దానర్థం లేదని కాదు. తాము అనుభవించిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకి కమ్యూనిస్ట్‌ పార్టీ కారణమంటూనే పురుషులని దాటుకుని స్త్రీలు వెళ్తే మాత్రం సహించలేకపోయేవారు అంటారు కోటేశ్వరమ్మ . మామూలు పురుషులకన్నా మెరుగే గానీ వారూ ఈ పురుషాధిక్య వ్యవస్థలో భాగమే కదా అన్న అవగాహన ఆమెది.
 కమ్యూనిస్ట్‌ పార్టీ చీలిక పట్ల కోటేశ్వరమ్మకి ఉన్న అసంతృప్తి, బాధ ఈ పుస్తకంలో చాలాసార్లు కనిపిస్తుంది. రాజకీయ ఆచరణల దృష్ట్యా పార్టీ చీలకుండా ఉండటం అసాధ్యమయిన ఆదర్శవంతమయిన ఊహ కావచ్చు కానీ ఒక ఆకాంక్షగా ఆమె చాలాకాలం ఉమ్మడి కమ్యూనిస్ట్‌ పార్టీకి కట్టుబడి ఉన్నారు. పార్టీ చీలిక తర్వాత ఒక పార్టీవాళ్ళు యింకొక పార్టీ వాళ్ళతో కలవడం ఉండేది కాదని చెపుతూ ”మగవాళ్ళకి మానవ సంబంధాల కన్నా రాజకీయాలే ప్రధానం కనుక ఆడవాళ్ళని కలవనిచ్చేవారు కాదు” అంటారు.
 తన అత్తమామలు, కొడుకు కోరిక మీద ‘కొండపల్లి’ అనే ఇంటిపేరుని తన పేరుకి ముందు కొనసాగిస్తున్నానని చెపుతూ దాని మూలంగా తనకి ఒరిగేది ఏమీ లేదంటారు.
 భర్తతో విభేదాలు, కొడుకు, అల్లుడు, కూతురుల అకాల మరణాలు, చివరివరకూ తోడుగా నిలబడిన తల్లి అంజమ్మ మరణం, ఆర్థిక సమస్యలు యిన్నింటి మధ్యా స్త్రీ విద్యావంతురాలయి ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండాలన్న  పట్టుదలతో ముప్ఫయిఆరవ ఏట చదువు మొదలుపెట్టి ఆ తర్వాత ఉద్యోగంలో చేరారు.
 సీతారామయ్యగారు దూరమయ్యాక ఆయన్ని కలవడానికి ఏమాత్రం యిష్టపడని కోటేశ్వరమ్మ, ఈ పుస్తకంలో భర్తగా అతను విఫలమవడాన్ని గుర్తించి రాసారు గానీ వ్యక్తిగా ఆయన ఔన్నత్యాన్ని పలుసందర్భాల్లో ప్రేమగా తలుచుకుంటూనే ఉన్నారు. కొడుకు జైల్లో ఉన్నపుడు చూడడానికి వెళితే ‘చందూ’ చిరునవ్వుతో నిలబడి ఉండటం చూసి సీతారామయ్య ధైర్యసాహసాలే కొడుక్కి వచ్చాయి అనుకుంటారామె. అలాగే తండ్రి వాటాగా వచ్చిన ఆస్తిని సీతారామయ్య పార్టీకి రాసిచ్చేయడం గురించి ”సీతారామయ్య సంపన్నుడు కాకపోయినా త్యాగసంపన్నుడుగా మిగిలిపోయాడు” అని సంతోషంగా చెప్పుకుంటారు.
 కొండపల్లి సీతారామయ్య గారి చివరి రోజుల్లో ఆయన్ని కలవమని మిత్రులు ఒత్తిడి తెచ్చినపుడు తన అయిష్టతని వ్యక్తం చేస్తూ ‘ఆయన పాలిటిక్స్‌ ఆయనవి నా పాలిటిక్స్‌ నావి’ అని అనుకోగల ఆత్మవిశ్వాసం కోటేశ్వరమ్మగారిది. ఆఖరిదశలో కోటేశ్వరమ్మతో కలిసుండాలన్న ఆకాంక్షను సీతారామయ్య వ్యక్తం చేసినపుడు ‘యాజ్‌ ఎ ఫ్రెండ్‌గా ఉండటం వేరు. ఈ భార్యాభర్తల గొడవ నాకొద్దు’ అని సున్నితంగా తిరస్కరిస్తారు.
 కోటేశ్వరమ్మ గారి జీవితంలోని పలువిషాద సంఘటనలు కంటతడి పెట్టించి మనసుని ఆర్ద్రం చేస్తాయి. అయితే అది నిస్సహాయ దుఃఖం, నిరుపయోగశోకం కాదు.
 మనసుని పిండే విషాదంలోంచి జీవితేచ్ఛతో పదేపదే పైకి ఎగసే ఫీనిక్స్‌ కోటేశ్వరమ్మ. పార్టీలు, సంఘాలు ప్రజాస్వామీకరించబడాలంటూనే చచ్చేవరకూ ఉద్యమాన్ని వదలనన్న ధీర… కోటేశ్వరమ్మ, ఊపిరిసలపని కష్టాల్లోనూ స్త్రీగా, వ్యక్తిగా, ఉద్యమకారిణిగా, రచయితగా ఎక్కడా తలవంచని సాహసి… కోటేశ్వరమ్మ…
 ఈ పుస్తకం ద్వారా అనేకమందికి అమ్మగా, అమ్మమ్మగా కూడా కొత్త బాధ్యతని ఆనందంగా స్వీకరిస్తున్న కోటేశ్వరమ్మగారిని చదివాక జీవన పోరాటాలకి అవసరమయిన స్థితప్రజ్ఞత కళ్ళకి కడుతుంది. అంతర్లోకంలో వెలుగు నిండి నిలబడి పోరాడగలమన్న గట్టి భరోసా మన సొంతమవుతుంది.
 
( సంవత్సర కాలంగా ఈ కాలమ్ ని ఆదరించిన భూమిక, చదివి పలు చర్చలు చేసిన జాజిమల్లి బ్లాగ్ పాఠకులకు కృతజ్ఞతలు.)
 
 
 
                                                                                                                                                         అమ్మమ్మ ఫోటోలు
ammamma-kaara-chetty_002visakhapatnam-2011ammamma_trip-sklm-jan_3-2010_064ammamma-kaara-chetty_017
ప్రకటనలు

29 thoughts on “అమ్మమ్మ ‘నిర్జనవారధి’ కాదు…

 1. @ ఉత్పత్తి సంబంధాలతో పాటు మానవ సంబంధాలను కూడా కలుపుకుని మార్పుకి కృషి చెయ్యాలని,

  చాలా ఉంది ఈ చిన్న వ్యాఖ్య లో. ఉదయం నుండి ఉన్న ఆలోచనలన్నీ ఇందులో ఇమిడిపోయాయి.
  మానవసంబంధాలను కలుపుకోవడంకి, కావాలనుకొనే మార్పుకు ‘చుట్టరికం’ కుదరాలిగా అసలు 🙂

  వ్యాసం చివరిలో ఆమె నిర్ణయం వాళ్ళిద్దరి కోసం మాత్రమె కాదు,

  • మౌళీ
   ఏ మార్పయినా మానవసంబంధాలను పక్కనపెట్టే యాంత్రికమైనది కాకూడదనే ఈ పుస్తకం చెపుతోంది..
   అమ్మమ్మ నిర్ణయం ఆమె ఆత్మాభిమానానికి సంబంధించింది అనుకుంటాను నేను

 2. అంటే ఆత్మాభిమానం కోసం ఎవరైనా విడిగా ఉండడాన్ని సమర్ధించ గలమా ..అదీ రిటైర్ అయ్యే వయసుల్లో .

  (ఈ వ్యాఖ్య ఆమెకి సంబంధించినది కాదు…మిగిలిన వారి విష్యం లో చెప్పండి)

  • గొప్పే, అమ్మమ్మది ఆత్మాభిమానం కి మించిన యోగము.

   కాని వయసును అధిగమించించి మరీ ఇంతటి ఆత్మాభిమానం ఇప్పటి రోజుల్లో నేను మగవారి లో మాత్రమె చూస్తున్నాను. వారు కేవలం పిల్లల కోసమో, సమాజం కోసమో కలిసి ఉండాలని అనుకోవడంలేదు.
   వారిది తప్పుకాదు. మహిళల్లో మార్పు రావాలి. పిల్లలకోసం మాత్రమె కాక తమకోసం కూడా బ్రతకాలని తెలుసుకోవాలి. ఈ సమస్య గురించి ఆలోచిస్తూ పైవ్యాఖ్య చెయ్యాల్సివచ్చింది. 🙂

 3. మంచి వ్యాసం, మల్లీశ్వరి గారు.. టైటిల్ కూడా సరిగ్గా సరిపోతుంది!
  ఈ పుస్తకం చదివాక ఆ ఆలోచనలు రెండుమూడ్రోజులు వదల్లేదు.. నిర్జన వారధి — పుస్తకం పేరులో స్ఫుటమయ్యే ఒంటరితనం, గాంభీర్యత్వం ఆవిడ జీవితం నిండా కూడా ఉంది!
  కాకపోతే ఈ పుస్తకం మాత్రం నా లాంటి పాఠకులకీ.. ఆవిడ నమ్మిన ఉద్యమానికీ వారధిలా నిలిచి బహుజన వారధి అయింది.. ఎందుకంటే ఆవిడ ఎన్నుకున్న/నడిచిన దారి మొన్నటివరకూ నాకు పూర్తిగా అపరిచితం!

  • నిషిగంధ గారూ…
   నిజమే…అమ్మమ్మ జీవితం లోని వంటరితనం కేవలం వ్యక్తిగత జీవితంలోని కొన్ని పార్స్వాలకు మాత్రమే పరిమితం..వాటిని అధిగమించి సమాజానికి ఉద్యమాలకి నిలబడటం లోనే ఆమె జీవితపు రిలవెన్స్ ఉంది అనుకుంటున్నాను…
   శీర్షిక మీద మీ వ్యాఖ్యానం చక్కగా ఉంది.

 4. /* నిర్జన వారధి ఆత్మకథ మాత్రమే కాదు, ఈ కాలానికి అవసరమయిన ఒక చారిత్రక గ్రంథం కూడా

  చాలా బాగా చెప్పారండీ, ‘నిర్జన వారధి’ నిజంగానే ఒక చారిత్రక గ్రంథం! చదువుతున్నంతసేపూ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే ఉంది.తాను నమ్మిన సిధ్ధాంతాలకోసం ఆవిడ పడిన కష్టాలు, చేసిన త్యాగాలు తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. నిజమైన అధికారం ఉన్న మన రాజకీయ నాయకులు ఆవిడ చేసిన దాంట్లో పదోవంతు చేసినా దేశం చాలా బాగుండేది.

  కానీ ఆవిడ తన జీవితంలోని ముఖ్యఘట్టాలనే తీసుకుని చాలా క్లుప్తంగా వ్రాసారు. ఇంకా విపులంగా వ్రాస్తే బాగుండేది.

  అలాగే ఎవరైనా ఆంగ్లంలోకి అనువాదం చేస్తే బాగుంటుంది, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడ తెలుసుకుంటారు.
  మీరు నిజంగానే ఆవిడ మనవరాలా లేక అనుబంధంతొ అంటున్నారా?

  • శ్రీనివాస్ గారూ,
   మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.మీ స్పందన అమ్మమ్మకి తెలియజేస్తాను.మూడేళ్ళ కిందట ఆమె నాకు అమ్మమ్మ అయ్యారు.
   అనురాధ,సుధ ఆమె కూతురు బిడ్డలు..విశాఖలో ఉంటారు.మానవహక్కుల వేదిక ద్వారా కూడా చాలా మందికి చిరపరిచితులు

 5. ఆమె కధవరకు చదవగలిగాను. కరుణ మరణం దగ్గర అసలు చెప్పలేను, చాలా చాలా బాధనిపించింది. కధనం చాల ఉత్సాహంగా ఆ ఈడు అమ్మాయి కనిపించేలా చక్కగా వ్రాసారు.
  ఇక వారు విడిపోయిన పరిస్థితులు, అప్పటి సమస్యలు వాటి ప్రభావాలు చూసాక మీరన్నది నిజమే అనిపించినా మల్లి కమ్యునిస్టు నాయకులతో ఆమె చెప్పిన సమాధానం నా మొదటి అభిప్రాయాన్నే బలపరచింది. ఆమె డి ఒక భార్యగానే ఆత్మవిశ్వాసం కాదు. ఒక సిద్దాంతం ని త్రికరణశుద్ది గా నమ్మడం!!! ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం తనకి తానూ గా మాత్రమె సంబంధం అవుతాయి. సిద్దాంతం అలాకాదు మార్గదర్శ కం అవుతుంది. వారి నిర్ణయాలు ఇంకాస్త స్థిరం గా, జాగ్రత్త గా ఉండాలి. సీతారావమ్మ గారి నిర్ణయం ఇలాంటిది అని నాకు స్పష్టం గా కనిపించింది మరి .

  పొతే ఈ కధ లో ఇద్దరు దూరం అవ్వడం లో సీతారామయ్యను అస్సలు నిందించను . వీలయితే బాల్యవివాహపు పరిస్థితులు , ఆమె తండ్రి మొదటి బాధ్యులు. జాలితోనో, ఉద్యమ ప్రయోజనాలుకు ఆకర్షితుడై సీతారామయ్య అంగీకరించడం ఆమెకి ఏవిధంగా ప్రమాదకరమో మనం చూడాలి. తల్లికి , తండ్రికి ఉన్న భయం, వరుడు తగినవాడా కాదా అని ఆలోచించనివ్వలేదు. ఒక శక్తివంతమైన ,గొప్ప జీవితమే ఆమె కి సీతారామయ్యతో కొంతకాలం కలిగింది అనుకోవాలో, ఆ మాత్రం గొప్ప ఎవరిక్కావాలి అని అనుకోవాలో మరి మీరే చెప్పండి.

 6. ”ఒక శక్తివంతమైన ,గొప్ప జీవితమే ఆమె కి సీతారామయ్యతో కొంతకాలం కలిగింది అనుకోవాలో, ఆ మాత్రం గొప్ప ఎవరిక్కావాలి అని అనుకోవాలో మరి మీరే చెప్పండి.”

  నిజమే మౌళీ…
  కానీ వారి వివాహపు ప్రాతిపదికనే మీరు తప్పు పడుతున్నారు.అది కోటేశ్వరమ్మ గారు కూడా
  అంగీకరించరేమో…ఎందుకంటే వారి వ్యక్తిగత సామాజిక జీవితాలు విడివిడిగా లేవు…నిర్జనవారధిలో కూడా కేవలం వ్యక్తిగత విషాదం గానే ఆమె జీవితం లేదు…వ్యవస్థలో మార్పు కోసం కృషి చేస్తున్నామనే వారు కూడా స్త్రీల పట్ల ఎట్లాంటి వివక్షతో వ్యవహరిస్తారో తన జీవితం ఆధారంగా చెప్పారనిపించింది…నిజానికి ఇంత సరళమూ కాదు చాలా చర్చలు ఉద్యమ సంస్థల్లో జరగాల్సి ఉంది.

 7. @కొండపల్లి సీతారామయ్యలాంటి విప్లవయోధుడి భార్యగా తను పొందిందీ, కోల్పోయిందీ నిష్పక్షపాతంగా అంచనా వేసుకునే క్రమంలో చాలా విలువయిన ఆలోచనలు చేశారు కోటేశ్వరమ్మ. తన సమస్తాన్నీ త్యజించి, జైలు జీవితానికీ, అజ్ఞాతవాసానికీ చలించక, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన విప్లవ పార్టీ రూపకర్తగా, సమరశీలిగా ఆయన సమాజానికి చేసిన సేవ నిరుపమానం… @@

  మీరు చెప్పిన ఈ నిజం లో ఇంకో సత్యం దాగుంది.

  సీతారామయ్యది లోపం కాదు, ఉద్యమంలో మరణించిన కుటుంబాల పై ఆయనకున్న అంకితభావం!!!!. మీరే అన్నారు వారికి సామాజిక, వ్యక్తిగత జీవితాలు వేరు వేరు గా లేవు అని. ఎక్కడయితే వేరు వేరుగా ఉండాల్సి వచ్చినదో అక్కడినుండి ఆయన ఆ ఛట్రం లో ఇమడలేరు.

  కాబట్టి ఆమెకి అంత చిన్నవయస్సులో వఛ్చిన కలిగిన దుఃఖం, విషాదం కు మూలం వివాహ ప్రాతిపదికలోనే కనిపించింది. సీతారామయ్యలో కాదు 😦

 8. ఈ టపా ఆలస్యంగా చదివాను మల్లీశ్వరి గారూ!

  అసలు…ఆ పుస్తకం చదివాక నాకు మాట పడి పోయింది. కొన్ని చోట్ల మసక బారిన కళ్లను తుడుచుకుంటూ చదవాల్సి వచ్చింది. అంత వ్యధ అంత బాధ అనుభవించిన మనిషి మామూలు జనానికి ఇంత ఆలస్యంగా ఎలా పరిచయం అయిందా అని బాధ కల్గింది.

  ఆమె సి.ఆర్ ఫౌండేషన్ లో ఉన్న రోజుల్లో నేను లోక్ సత్తా కి పని చేస్తూ అక్కడికి వెళ్తుండే దాన్ని తరచుగా. (పైగా ఆ హోమ్ మా ఇంటి పక్కనే) . అలాగే అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఆంధ్రా బాంక్ కి ఆమె హోమ్ లోని మిగతా వృద్ధులతో కల్సి వస్తుండేవారు. అప్పుడు పలకరిస్తుండే దాన్ని కానీ “మీ జీవితం ఏమిటి” అని ఒక్క సారైనా అడగాలని తోచలేదు.

  ఈ పుస్తకం చదివాక ఏదో పొరపాటు చేసిన ఫీలింగ్, మిస్ అయిన ఫీలింగ్ వచ్చేసింది.

  జీవితం నిండా పరచుకున్న కష్టాల కళ్ళు తుడుచుకుంటూనే నడిచి వచ్చి….నిర్జన వారధి మీద నిలబడి మనకు తన కథను చెప్పిన కోటేశ్వరమ్మ గారికి ఎన్ని అభివందనాలు చేసినా తక్కువే!

  ఆమెను కలుసుకుంటే..నా నమస్కారాలు చెప్పండి. ఈ పుస్తకం రావడానికి కారకులు ఎవరెవరున్నారో..అందరికీ కూడా ధన్యవాదాలు! ఒక అద్భుత వీర గాధ ను పరిచయం చేసినందుకు

  • అవును సుజాత గారూ,
   ఈ మధ్యకాలం లో ఇంతగా ప్రభావితం చేసిన జీవితం,వ్యక్తిత్వం అమ్మమ్మదే మీ అభినందనలు ఆమెకి కలిసినపుడు తెలియజేస్తాను.

 9. నేను ఈ పుస్తకం గత నెలలో రెంటల్ బేసిస్ మీద కినిగె నుంచి డౌన్‌లోడ్ చేసి ఫోన్‌లో భద్రపరుచుకున్నాను. కానీ గత నెలలో అనారోగ్యం కారణంగా చదవలేకపోయాను. ఇంతలో రెంటల్ వ్యవధి 30 రోజులు గడిచిపోయింది. నిన్న మళ్ళీ డబ్బులు కట్టి పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేశాను. చదివిన తరువాత నాకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి.

  మూఢ నమ్మకాలు యాభై ఏళ్ళ క్రితమే కాదు, ఇప్పుడు కూడా ఉన్నాయి. నేను నా కంటే నాలుగేళ్ళు పెద్దైన అమ్మాయిని ప్రేమిస్తే నాకు చెల్లెలు వరసైన అమ్మాయి ఒకరు నన్ను వెటకారం చేస్తూ “అమ్మాయిలని వదిలి ఆంటీలని ప్రేమిస్తున్నావేమిటి అన్నయ్యా” అని అడిగింది. అలా అడిగింది ఏ పల్లెటూరి అమ్మాయో కాదు, ఆమె డెంటల్ కాలేజ్ విద్యార్థిని. ఇది ఇప్పటి మాట కానీ ఒకప్పుడు అబ్బాయి తన కంటే వయసులో పెద్దైన అమ్మాయిని ప్రేమిస్తే “ఆమెని పెళ్ళి చేసుకుంటే నీ ఆయుషు తగ్గిపోతుంది” అని బెదిరించేవాళ్ళు. కోటీశ్వరమ్మ గారు రెండో పెళ్ళి చేసుకుంటే ఆమె తమ్ముడికి అశుభం జరుగుతుందని ఆమెని బెదిరించారు. ఆమె రెండో పెళ్ళి చేసుకున్న తరువాత ఆమె కులానికి చెందిన స్త్రీలే ఆమెని విచిత్రంగా చూశారు. అప్పట్లో అయిదువతనం, ముండమోపితనం లాంటి పదాలు వాడుకలో ఉన్నట్టే ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, అమ్మాయి, ఆంటీ లాంటి పదాలు వాడుకలోకి వచ్చాయి.

 10. నేను ఆ పుస్తకం డౌన్‌లోడ్ చేసిన తరువాత ఆవిడ బాల్యం, వివాహం, కమ్యూనిస్ట్ ఉద్యమం ఆరంభం తదితర విషయాలు చదివాను. పూర్తిగా చదవలేదు కానీ మూఢ నమ్మకాలకి సంబంధించిన విషయాలు చదువుతున్నప్పుడు నా వ్యక్తిగత విషయాలు గుర్తొచ్చి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. ఆ బాధ వల్ల కూడా ఎక్కువ పేజ్‌లు చదవలేకపోయాను. పుస్తకం పూర్తిగా చదువుతాను. ఆవిడ అడ్రెస్ పుస్తకంలో ఉందో లేదో తెలియదు కానీ ఉంటే కలవడానికి ప్రయత్నిస్తాను. వైజాగ్‌లో ఉండె జగదీశ్ అనే ఆయన నా అడ్రెస్ పట్టుకుని మా ఇంటికి వచ్చి నన్ను చలసాని ప్రసాద్ గారి దగ్గరకి తీసుకెళ్ళారు. ఆ రోజు ప్రసాద్ గారు ఊరిలో లేరు. వైజాగ్‌లో ఉన్న ఇతర అభ్యుదయవాదులని కూడా కలవాలనే ఉంది కానీ నేను ఇప్పటి వరకు కలవలేదు.

 11. నిర్జన వారిధి పుస్తకం మార్కెట్ లోకి వచ్చిన వెంటనే కొని చదివాను. తెలుగు నేలపై వీచిన చైతన్యపుగాలులు ఎంత ప్రభావం చూపాయో తెలిసింది. ఎంత మంది తమ అమూల్యమైన ప్రాణాలను త్రుణ ప్రాయంగా వదులుకున్నారో అర్థం అయింది. అంత కంటే కూడా సాంతం కుటుంబమే సమాజానికి అంకింత అయింది. ఇలాంటి కుటుంబాలు సమాజానికి అవసరం. ఎపుడో పురాణ కథల్లోచదువుకున్న నిజమైన ప్రేమ నుషులు, సమాజాన్ని ప్రేమించే వారు ఆనాడు ఉన్నారు కాబట్టే ఈ రోజు ఈ తరం తర్కబద్దంగా, ధైర్యంగా ఆలోచిస్తోంది. ప్రశ్నిస్తోంది. కొండపల్లి కోటేశ్వరమ్మ….. పేరులోనే కొండ ఉంది. దాని వెంటనే బండెడు కష్టాలు ఉన్నాయి. ఆమె, ఆమె కుటుంబం ఈ సమాజానికి చేసిన సేవ ఎన్ని కోట్లైనా దిగదుడుపే. బహుషా వారి పేరులో ఉన్న కొండను, కోట్లను చిన్నబోయేలా చేసేందుకే వారు త్యాగాలు చేసి ఉంటారు. అమ్మఅమ్మ….. నానామ్మ…… మన కోటేశ్వరమ్మ రాసిన పుస్తకం చదువుతున్నపుడు నాకళ్లు చెమర్చకుండా ఉండలేక పోయాయి. కొన్ని సార్లు ఏడ్చాను కూడా. తెలుగు నేలపై జరిగిన అన్ని పోరాటాల్లోనూ కొందరు వీరులున్నారు. వారే ఈ సమాజానికి రక్షణగా నిలబడ్డారు. భవిష్యత్తు తరాలకు వారిధిగా నిలిచారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యం గురించి ఆమె పడిన బాధ ఇపుడు చాలా మంది పడుతున్నారు. మామూలు కోటేశ్వరమ్మను సీతారామయ్య సామాజిక, విప్లవ కార్యకర్తగా తయారు చేసిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ఆ నాటి సమాజంలో కులాన్ని, సామాజిక కట్టుబాట్లను కాదని ముందుకు రావడం మామూలు విషయం కాదు. కోటేశ్వరమ్మ పార్టీని ప్రేమించిన తీరు, వారు గడిపిన రహస్య జీవితం విశేషాలు సినిమాలో జరిగినట్లు కళ్ల ముందుంటాయి. హైద్రాబాద్ లో కోటేశ్వరమ్మ ఉన్న విషయం నాకు తెలియదు. ఆ పుస్తకం చదివిన తరువాత ఆమె గురించి తెలిసింది. ఆమె ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నారని పుస్తకంలో రాసుకున్నారు. నూతన తరాలకు వెలుగులనిచ్చిన వారు రాలిపోతున్నారు. లేదా దూరం అవుతున్నారు. మనుషుల ప్రేమించే వారు కన్పించకుండా పోతున్నారు. ఆమె పని చేసిన పార్టీని, ఆమె కుటుంబ సభ్యులు నడిచిన దారిని సమర్థించినా సమర్థించక పోయినా….. మనుషులుగా వారు వ్యవహరించిన తీరు, తీసుకున్న కార్యక్రమం, చేసిన త్యాగం మాత్రం అమూల్యం.

  శ్రీకాకుళం వెళ్లిన సందర్భంలో కోటేశ్వరమ్మ వీరులను గుర్తుంచుకుని పాటలు పాడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అంటే తెలుగు సమాజానికి కొత్త దశను, దిశను ఇచ్చేందు కోసం త్యాగాలు చేసిన తరాలను గుర్తు పెట్టుకోవాలని ఈ తరం వారికి నిర్జన వారధి గుర్తు చేస్తోంది. ఇంకా కొన్ని విషయాలను ముందు తరాలకు చూపిస్తోంది ఈ పుస్తకం. సీతారామయ్య చాలా సందర్భాల్లో వ్యవహరించిన తీరును కోపగించుకోకుండా సున్నితంగా, పట్టీపట్టనట్లు రాశారు. ఆయన మీద తనకు కోపం కూడా లేదని రాశారు. ఎన్నో కష్టాల పాలు చేసిన సీతారామయ్య గురించి బాధపడుతూ ఆయన మాత్రం ఏం సుఖపడ్డాడు అని ఆదేన కూడా వ్యక్తం చేస్తుంది. సమాజంలో ఉన్న రుగ్మతలను ఎదరించిన తీరు ఆదర్శనీయం.

  అన్నింటి కంటే పుస్తకం వెనుక వైపున కోటేశ్వరమ్మ పుస్తకంలోని కొన్ని మాటలు కదలించాయి. ‘‘ నేను సీతారామయ్య అనుకూలంగా లేనని నన్ను వదిలేశాడు. వాళ్ల పార్టీకి అనుకూలంగా లేడని వారు ఆయనను వదిలేశారు. ఇదేనా జీవితం’’. ఎంత లోతైన మాట ఇది. నిజంగానే అన్పిస్తుంది కాదా ఎంత జీవితం ధ్వంసం అయితే. ఎంత కొత్త నిర్మాణపు ఆలోచన ఉంటే ఇంతటి జ్ఝానత వంతమైన, ఇంతటి విమర్శానత్మకమైన మాట రావాలి. మామూలు విషయం కాదు. మామూలు వ్యక్తిగా నిర్జన వారధి చదివి ఈ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 12. నేను కూడా ఆలస్యంగానే స్పందిస్తున్నాను. దానికి దీనికి చెల్లు. ఇబ్బందేమీ లేదు. మీరు చాలా మంచి విషయాలు రాస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. కోటేశ్వరమ్మ గారిని ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాను. హైద్రాబాద్ వచ్చే అవకాశం ఉంటే….. తెలియజేయండి ప్లీజ్………

 13. Translation of “NIRJANAVARATHI” – autobiography of Mrs. Kondapalli Koteswaramma to Tamil with titile “AALATRA PAALAM” was released by
  Mrs. Ambai in a function presided by Sri Nanjil Nadan at Erode on 30.07.2015. Pulished by Kalachuvadu

  ఈ పుస్తకం గురించి ప్రముఖ తమిళ రచయిత అశోకమిత్రన్ గారు చేసిన రివ్యూ హిందూ పేపర్ లో వచ్చింది.(తమిళ హిందూ)
  “నిర్జనవారధి” ని తమిళంలో Alatra Palam అన్న పేరిట అనువాదం చేసిన రచయిత్రిగా నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నిర్జన వారధి గురించి మీరు వ్రాసిన వ్యాసాన్ని నేను తమిళంలో అనువదించి ఏదైనా పత్రికకి పంపించాలనుకుంటున్నాను, మీరు అనుమతి ఇస్తే. నా మెయిల్ ఐ డి tkgowri@gmail.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s