ప్రజా ఉద్యమాలకి ప్రతినాయకుడు పూరీ జగన్నాధ్

ప్రజా ఉద్యమాలకి ప్రతినాయకుడు పూరీ జగన్నాధ్‌

http://www.bhumika.org/archives/2638

Posted By on November 2, 2012

తనొక ‘ఆంధ్ర చెగువెరా’నన్న స్పృహ మనలో కలిగించడానికి నిరంతరం తంటాలు పడే కధానాయకుడు పవన్‌కల్యాణ్‌, తన తాజా సినిమాలో పలికిన ఒక పాతడైలాగ్‌ పదే పదే ప్రొమోస్‌లో చూశాం . ” ఉంచుకోవడానికీ, ఉయ్యాలలూగడానికీ మీడియా ఎవరికీ ఉంపుడుగత్తె కాదు…” అన్న డైలాగ్‌ రాసిన రచయితకీ రాయించిన దర్శకుడికీ పలికిన నాయకుడికీ ధారాళమయిన ప్రేమతో ఆమోదించిన సెన్సార్‌ బోర్డుకి ఉన్న సాహసానికీ తెగువకీ ముచ్చట పడుతూనే మూలం ఏంటన్నది ఆలోచిస్తుండగానే ఇంతలో తెలంగాణ వాదులు ఈ సినిమాలోని కొన్ని అంశాలపై తమ అభ్యంతరాలు తెలిపారన్నది కొంత హడావిడిని సృష్టించింది. తెలంగాణ ఉద్యమం ఇపుడు చైతన్యవంతమైన దశలో ఉంది కాబట్టి ఎక్కడ తెలంగాణ వ్యతిరేకత వివక్షత కనబడితే అక్కడ ప్రశ్నించడం ఎదిరించడంలో చాలా చురుకుగా వ్యవహరిస్తోంది.

కానీ నిజానికి కేవలం తెలంగాణ ఉద్యమం మీదనే కాదు ఇపుడు ఉనికిలో ఉన్న అస్తిత్వ ఉద్యమాలన్నింటి మీదా, అత్యంత జుగుప్సాకరమైన అవహేళనతో తీసిన సినిమా ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’. సినిమా ప్రారంభంలోనే కుల పోరాటాల మీదా. కుల సమస్యల మీదా దర్శకుని దాడి మొదలయ్యింది. ఎస్‌.సి హాస్టల్‌ విద్యార్థులు, బి.సి హాస్టల్‌ విద్యార్థులు పనీ పాటా లేకుండా నిరంతరం కొట్టుకుంటూ ఉంటారన్న ‘కొత్త చీలిక’ని తనే తెచ్చి, ”అసలు బి.సిలకు ఒక హాస్టల్‌, ఎస్‌.సిలకు ఒక హాస్టల్‌ ఎందుకుండాలి?.. అందరూ కలిసే  ఉండొచ్చు కదా! దీనికి సమాధానం ఎవరైనా సరే వచ్చి చెప్పండి?” అంటూ ఇంత లావు ఇనపరాడ్‌  పట్టుకొని ఐక్యతని ప్రబోధిస్తాడు కథానాయకుడు.ఎస్‌.సిలు, బి.సిలు ఒక్కటేనన్న దర్శకుడికి తన మార్కు ‘సామాజిక న్యాయం’లో ఒ.సిలను కలవడానికి ధైర్యం చాలకపోయి ఉంటుంది కానీ అతని ఆంతర్యం రిజర్వేషన్‌ సిస్టమ్‌ మీద ఉన్న వ్యతిరేకతే అన్నది స్పష్టం.

అక్కడ మొదలయిన ఈ సాహసదర్శకుడి యాత్రలో మరో మజిలీ స్త్రీల పోరాటాలు. మహిళా సంఘాలను, మహిళా ఉద్యమాలను చిత్రించడంలో తెలుగు సినిమాకి ఏనాడూ సమాజ వాస్తవికత భూమికగా లేదు. ప్రతీ దర్శకుడు తమకున్న నిశ్చితాభిప్రాయాలలోనుంచి పడికట్టుగా  మాత్రమే చూశారు. ఈ దర్శకుడు కూడా ఆ ఫినామినాని ఛేధించకపోగా మరింత మెరుగుదిద్దాడు. స్త్రీవాదులు ప్రశ్నిస్తున్న, చర్చకు పెడుతున్న పలు అంశాలపై ప్రాధమిక స్థాయి అవగాహన కూడ లేకుండా వాటిని వక్రీకరించి ప్రతినాయకురాలికి ఆ లక్షణాలను ఆపాదించి పదే పదే ఒక సూడో రాడికల్‌ టోన్‌తో కించపరచడంద్వారా స్త్రీవాద మహిళా ఉద్యమాలపట్ల సమాజానికి వ్యతిరేకత కలిగేలా సందేశాన్ని ఇచ్చారు.

ప్రశ్నించే స్త్రీలను గయ్యాళులుగా, విలన్‌లుగా, క్రూరులుగా, చిత్రించే క్రమంలో స్త్రీత్వాన్ని మళ్ళీ మూసలోకి నెట్టే ప్రయత్నం ఈ చిత్రంలో చేశారు. ‘గంగ’ పాత్ర ఆద్యంతమూ పురుష సమాజానికి నచ్చే విధంగా  నమూనీకరించడం, దానికోసం జరిగిన వెంపర్లాటే. ఒళ్ళు  కనపడకుండా ఫాంటూ చొక్కాలు వేసుకొనే అమ్మాయిలు, బీరు తాగే అమ్మాయిలు, సిగ్గు  పడని అమ్మాయిలు, సెక్సప్సీల్‌ని ప్రదర్శించని అమ్మాయిల పట్ల మగవారికి ఆసక్తి ఉండదని కథానాయకుడు జ్ఞానబోధ చేయడం చూస్తే ఆధునిక స్త్రీత్వం పురుషుడి ఆధిపత్యాన్ని ఎంత అభద్రతకి గురిచేస్తోందో అర్థమై కొంత సంతోషం కలిగినా గంగ బెంబేలెత్తి పోవడం మనసుని చివుక్కుమనిపిస్తుంది.

ఇక ఈ సాహస యాత్రలో దర్శకుడు చాలా నిర్భయంగా కాలుమోపిన చోటు తెలంగాణ ఉద్యమం. అతను ఏ సమైక్యవాదో అయ్యుండి, అందరు కలిసి ఉండాలన్న ఆదర్శాన్ని నిజాయితీగా నమ్ముతూ ఈ సినిమాని తీసి ఉంటే అర్థం చేసుకోవడానికి తెలంగాణ ప్రజలకి ఇంత స్పేస్‌ అయినా మిగిలి ఉండేది. నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా ఉద్యమాన్ని వేర్పాటు వాదంగా, ఇతరుల హక్కులను గౌరవించని అప్రజాస్వామిక మయినదిగా, కేవలం పార్లమెంటరీ రాజకీయ ప్రయోజనాలకి మాత్రమే పరిమితమయినదిగా మభ్యపెట్టబూనడం చాలా ఆశ్చర్యకరం.

తెలంగాణ ఉద్యమాన్ని వ్యంగ్యంగా చులకన చేయడం, అవహేళన చేయడం ప్రధాన సూత్రంగా పెట్టుకొని ఆ క్రమంలో మిగతా అస్తిత్వ పోరాటాలను కూడా పనిలో పనిగా విమర్శించడం ఈ సినిమా ప్రధానోద్దేశ్యం. ప్రపంచీకరణ మనిషిని సమూహానికి దూరం చేసి ఒంటరిని చేస్తుందన్నది ఒక అవగాహన. ఆ ఒంటరితనాన్ని వ్యక్తివాదంగా తీర్చిదిద్దే శక్తికూడా దానికే ఉంది. వ్యక్తివాదం మూలంగానే రాంబాబులాంటి హీరోలు ఆవిర్భవించి కర్రలు, కత్తులు, రాడ్లు, తుపాకులు, పట్టుకొని బెదిరించి, భయపెట్టి, చావగొట్టి మరీ బలవంతంగా మనకి మంచిని కలగచేస్తారు. ‘సామాజిక బాధ్యత కాదు, వ్యక్తి బాధ్యత’ ముఖ్యమంటూ రెంటినీ విడదీసి చూసే (అ)జ్ఞానానికి పాల్పడతారు.

ఉద్యమ సందర్భాలలో ప్రజలు సమూహాలుగా కలవడం అంటే సినిమా ఎడిటింగ్‌ రూమ్‌లో కూర్చొని మౌస్‌తో క్లిక్‌ చేసి గ్రాఫిక్‌ ప్రజా సమూహాలను సృష్టించడం కాదని, తమ లక్ష్యసాధనకోసం ఏళ్ళకొద్ది మైళ్ళకొద్ది నడిచి పోరాడిన భిన్న సమూహాలన్నీ జనసంద్రమై కవాతు చెయ్యడమంటే, ఒక వ్యక్తి టివి ఛానళ్ళ ముందు నిలబడి ‘నువ్వురా.. నువ్వురా…’ అని పొలికేకలు పెడితే పరిగెత్తుకు వచ్చేసే అల్పత్వం కాదని తెలంగాణ యిష్టులకి అయిష్టులకీ అర్థమవుతూనే ఉంది.

అవసరాలో…అపర రాబిన్‌హుడ్‌లమన్న భ్రమలో…

అడ్డుపడుతున్నాయిగానీ ఈ వాస్తవం పవన్‌ కల్యాణ్‌కీ, పూరీ జగన్నాథ్‌కి మాత్రం అర్థం  కాదా ఏంటి?

 

33 thoughts on “ప్రజా ఉద్యమాలకి ప్రతినాయకుడు పూరీ జగన్నాధ్

 1. మన తెలుగు బ్లాగుల్లో ‘ఎవరి బ్లాగుల్లో వాళ్ళు తమకి ఇష్టం వచ్చినది వ్రాసుకోవచ్చు‌’ కదా అని తెలంగాణా ప్రజలని తెలబాన్‌లు అని తిడుతూ, అదేమని అడిగితే ‘తెలంగాణా ప్రజలు వేరు, తెలంగాణావాదులు వేరు – తెలబాన్‌లు అంటే తెలంగాణావాదులు మాత్రమే కానీ తెలంగాణా ప్రజలు కాదు’ అని సమాధానం చెపుతుంటారు. పూరీకి అంత ధైర్యం ఉంటే బ్లాగుల్లో ఉపయోగించే భాషని సినిమాలో ఉపయోగించి తన ధైర్యం ఏమిటో నిరూపించుకోవాలి. ఈ లింక్ చదవండి: http://forproletarianrevolution.mlmedia.net.in/jux/607289

 2. ఇంత చేసిన తరువాత ఆ సినిమా నిర్మించినవాళ్ళు ఏమంటున్నారంటే “సినిమాని సినిమాలాగ మాత్రమే చూడాలట, నిజ జీవితంలాగ చూడకూడదట”. ఆ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రకి చంద్రశేఖరరెడ్డి అనీ, విలన్ పాత్రకి జవహార్ నాయుడు అనీ, విలన్ కొడుకు చేతిలో హత్యకి గురైన జర్నలిస్ట్‌కి పింగళి దశరథరామ్ అనీ ఇలా నిజ జీవితంలోని వ్యక్తుల పేర్లని పోలి ఉన్న పేర్లని పాత్రలకి పెట్టి “సినిమాని సినిమాలాగ మాత్రమే చూడండి‌’ అని అంటే ఎవరు అర్థం చేసుకుంటారు? 1985లో పింగళి దశరథరామ్ అనే పేరు ఉన్న జర్నలిస్ట్ హత్యకి గురయ్యాడు. అతన్ని హత్య చెయ్యించినది తెలుగు దేశం నాయకులేనని ఆరోపణలు ఉన్నాయి. పత్రికలలో వచ్చిన కథనాలు ఆధారంగా సినిమా నిర్మిస్తే తప్పు కాదు కానీ ఆ సినిమాలో మనం నిజ జీవితాన్ని చూడకూడదట, ఆ సినిమాని మనం కేవలం సినిమాగా మాత్రమే చూడాలట!

  గుడ్డివాణ్ణి “పోరా గుడ్డి నాయాలా” అని అంటే గుడ్డివాళ్ళకే ఫీలింగ్ ఉండదని కూడా ఒక సన్నివేశంలో చెప్పించారు. ఆ లాజిక్ ప్రకారమైతే పూరీ జగన్నాథ్‌ని “పంది నాయాలా” అని తిట్టడం కూడా తప్పు కాదు. ఎందుకంటే పూరీ నిజంగా పంది కాదు. అతన్ని పంది అని తిట్టినంతమాత్రాన అతను నిజంగా పంది అయిపోడు. ఆ లాజిక్ ప్రకారం అతన్ని పంది అని తిడితే అతను గుమ్మడికాయ దొంగలాగ భుజాలు తడుముకోనక్కరలేదు.

 3. తెలుగు సినిమాకి ఏనాడూ సమాజ వాస్తవికత భూమికగా లేదు. ప్రతీ దర్శకుడు తమకున్న నిశ్చితాభిప్రాయాలలోనుంచి పడికట్టుగా మాత్రమే చూశారు.
  well said

  • రామ్ గారూ,
   కృతజ్ఞతలు.
   జై గొట్టిముక్కల గారూ,
   మీ సామెత వారి పట్ల నిజమే…కానీ చిన్నపాటి నిరసన అయినా తెలపకుండా ఉండలేక…ఈ నాలుగు వాక్యాలు.

 4. ఆ సినిమావాళ్ళు ఆర్థిక రెండు రకాలుగా ఆలోచించారు. పూరీ సోదరుడు జగన్ పార్టీ నాయకుడు. YSRని పొగుడుతూ సినిమా నిర్మిస్తే వచ్చే ఎన్నికలలో తన సోదరునికే నర్సీపట్నం నుంచి జగన్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ అని అనుకున్నాడు. పైగా పూర్వ ముఖ్యమంత్రిని గొప్ప ప్రజా నాయకునిగా చూపిస్తూ సినిమా నిర్మిస్తే సెన్సార్ బోర్డ్ నుంచి కూడా సమస్యలు రావని అనుకున్నారు. సెన్సార్ బోర్డ్‌లో ఎక్కువ మంది అధికార పార్టీ నామినేట్ చేసిన సభ్యులే ఉంటారు కనుక, తెలుగు దేశం & తెరాస పార్టీలు అధికారంలో లేవు కనుక, ఆ పార్టీల నాయకులని ఎంత చెత్తగా చూపించినా ఏమీ కాదని అనుకున్నారు. ఇలా ఆర్థిక ప్రయోజనం దృష్ట్యా రెండు కోణాల నుంచీ ఆలోచించి తమకి సమస్యలు రావనుకున్నారు.

  స్త్రీలు, నపుంసకులు & వికలాంగుల విషయంలో కూడా ఇలాగే ఆలోచించారు. సెన్సార్ బోర్డ్‌లో ఎక్కువ మంది మగ సభ్యులే ఉంటారు కనుక స్త్రీలని & నపుంసకులని కూడా చెత్తగా చూపించొచ్చు అని అనుకున్నారు. అందుకే గుండక్క పాత్ర పెట్టి ఆమె హీరోని నపుంసకుల చేత కొట్టిస్తున్నట్టు సన్నివేశాలు పెట్టించారు. భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే సామెతలు ఉపయోగిస్తే భర్త ఉన్న స్త్రీలు ‘మాకు ఎలాగూ భర్తలు ఉన్నారు కదా, మాకేమిటి బాధ‌’ అని అనుకుని అభ్యంతరం చెప్పకపోవడం (ఇది చాలా బాధాకరమైనా) మనం చూస్తుంటాము. “మొగుడు చచ్చినా ముండకి బుద్ధి రాలేదు” అనే సామెతని ఉపయోగిస్తే భర్త ఉన్న స్త్రీలు అభ్యంతరం చెప్పరు కనుక “పోరా గుడ్డి నాయాలా” అని తిట్టడం తప్పు కానట్టు చూపిస్తే కళ్ళు ఉన్నవాళ్ళు అలాగే అభ్యంతరం చెప్పకుండా ఉంటారులే అని పూరీ అనుకున్నాడు. గుడ్డివాడు కార్‌కి అడ్డంగా నిలబడి అడుక్కుంటే “డబ్బులు లేవు” అనో, “కార్ తియ్యాలి, లెగు” అనో డైరెక్ట్‌గా సమాధానం చెపుతారు కానీ “పోరా గుడ్డి నాయాలా” అని తిట్టాల్సిన అవసరం లేదు. అలా తిట్టడం సంస్కారం లేనివాళ్ళు చేసే పని. సంస్కారం అవసరం లేదు అని అనుకుంటే పూరీ జగన్నాథ్‌ని పంది అని తిట్టి, “నువ్వు నిజంగా పందివి కాదు కదా, నిన్ను పంది అని తిట్టినంతమాత్రాన నువ్వు నిజంగా పందివైపోతావా?” అని సమాధానం చెప్పడం కూడా తప్పు కాదు అని అనుకోవాలి.

 5. జన కధన మాంత్రికుడు గంటేడు గౌరు నాయుడు గారి మీద రాసిన చక్కనైన వ్యాసం మీద ఒక్కటంటే ఒక్క వ్యాఖ్యలేదు , అదే ” ప్రజా ఉద్యమాలకి ప్రతినాయకుడు పూరీ జగన్నాధ్” మీద మటుకు బోల్డన్ని స్పందనలు. చాల బాధ గా ఉంది ఆలోచిస్తే

  • వివిధ సమూహాలుగా ఉన్న మనుషులు వాళ్ళ ఆత్మగౌరవాలు,వారి పై ఉండే వివిధ పీడనలు వివక్షలు వీటి నుంచి కూడా మీరంటున్న రాద్ధాంతాలు వస్తాయండీ…

 6. ఆ సినిమా విడుదలైన సమయంలో నేను ఒరిస్సాలోని రాయగడ పట్టణంలో ఉన్నాను. ఈనాడులో వార్త చదివి ఆ సినిమా సంగతి ఏమిటో కనుక్కుందామని థియేటర్‌కి వెళ్ళి సినిమా చూశాను. రాయగడ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకి చెందినవాళ్ళు కూడా ఆ సినిమా చూడడానికి వచ్చారు. ముఖ్యమంత్రికి ‘చంద్రశేఖరరెడ్డి‌’ అనీ, విలన్‌కి ‘జవహార్ నాయుడు‌’ అనీ పేర్లు పెట్టడం చూసి అది కాంగ్రెస్ ప్రోపగాండా సినిమా అని అనుకుని జనం నవ్వుకున్నారు. పూరీ సోదరుడు జగన్ పార్టీ నాయకుడని వాళ్ళకి తెలియదు. అది ప్రోపగాండా సినిమా అని మాత్రం అర్థమైంది. ఒరిస్సావాళ్ళకే ఆ సినిమా అంత వరకు అర్థమైనప్పుడు ఇక ఆంధ్రాలో ఉంటున్నవాళ్ళకి ఆ సినిమా ఎంత బాగా అర్థం కావాలి? ఇంత డైరెక్ట్‌గా ప్రత్యర్థి పార్టీలని దూషిస్తూ సినిమా నిర్మించిన తరువాత కూడా ‘సినిమాని సినిమాలాగ మాత్రమే చూడండి కానీ నిజ జీవితంలాగ చూడొద్దు‌’ అని చావు సలహాలు ఇస్తున్నారు.

 7. హ్మ్మ్ , మీరు సినిమాపై వ్రాయడం అదీ ఇంత చక్కని వివరణతో …ప్రోమోస్ లో దైలోగ్ నేను చూడలేదు కాని , బహుసా ఈ తలబిరుసు తోనే ఇద్దరి పెళ్ళాల నుండి డైవోర్స్ తీసికొన్నాడు ఏమో పాపం పవన్.

  ఇక పూరి జగన్నాద్, మీరు వ్యాఖ్యలలో చెప్పినట్లు పవన్ కి ఉన్న టార్గెట్ ఆడియన్స్ అలాంటి వారు మరీ , డైరెక్టరు పని వాళ్ళని(హీరో లని) నిలబెట్టడమే కాని, సమాజానికి సేవ చెయ్యడం కాదు.

  మీ టైటిల్ విషయానికి వస్తే , ప్రజా ఉద్యమాలకి మాత్రమె కాదు..స్త్రీ స్వేచ్చకి కూడా ప్రతినాయకుడే….అతని మొదటి సిన్మాలోనే హీరో తో చెప్పిస్తాడు, పోలీస్ కూతుర్లు కి పెళ్ళిళ్ళు చెయ్యరా, మొగుడు అక్కరలేదా అని 🙂

  @ఎస్‌.సిలు, బి.సిలు ఒక్కటేనన్న దర్శకుడికి తన మార్కు ‘సామాజిక న్యాయం’లో ఒ.సిలను కలవడానికి ధైర్యం చాలకపోయి ఉంటుంది కానీ అతని ఆంతర్యం రిజర్వేషన్‌ సిస్టమ్‌ మీద ఉన్న వ్యతిరేకతే అన్నది స్పష్టం.

  హీరో యొక్క టార్గెట్ ఆడియన్స్ కి వున్న వ్యతిరేకత నే చూపించి ఉండొచ్చు. మన ఉత్తమ దర్శకులు తీసినవి అర్ధం చేసికోవడం చేతకాక వాళ్ళని ఉతికి ఆరేసే పవనాభిమానులకి ఇలాంటి సినిమాలు కాక ఇంకేం దొరుకుతాయి , మనకు ఎందుకు అనుకోకుండా మీ అభిప్రాయం మీరు చెప్పారు. చూద్దాం ఎవరికయినా సరి అనిపిస్తుందేమో.

  • మౌలి గారు, సినిమాలలో ఎంత రొమాన్స్ అయినా చూపిస్తారు కానీ అవి నిజ జీవితంలో జరగవు. శ్రీకాకుళం పట్టణంలో రెల్లి అనే దళిత కులానికి చెందిన కొంత మంది యువకులు తెలియకతెలియక DSP గారి బంధువుల అమ్మాయిని ఏడిపించారు. ఆ DSP తన అధికారాన్ని దుర్వినియోగం చేసి పెద్ద రెల్లి వీధికి చెందిన 300 మంది యువకులని కేస్ లేకుండానే లాకప్‌లో పెట్టించాడు. అది సినిమా కాబట్టి హీరో తప్పించుకుంటాడు. నిజ జీవితంలో అలా చేస్తే కాన్సీక్వెన్స్ అనుభవిస్తాడు.

  • పైగా ఈ సినిమాలో మహిళా జర్నలిస్ట్‌లు నిక్కర్‌లు వేసుకుంటున్నట్టు చూపించారు. నిజ జీవితంలో మహిళా జర్నలిస్ట్‌లు ఎవరూ ఆ వేషంలో ఉండడం నేను చూడలేదు. జర్నలిస్ట్ ఉద్యోగాన్ని కూడా ‘మోడలింగ్‌లాగ అందాన్ని ఒలకపోసే ఉద్యోగంగా చూపించే చెత్త టాలెంట్’ మన తెలుగు సినిమా దర్శకులకే ఉంది.

   “పోలీస్ కూతుర్లు కి పెళ్ళిళ్ళు చెయ్యరా, మొగుడు అక్కరలేదా” అనే డైలాగ్ విషయాని వద్దాం. ఆ సినిమా నేను కూడా చూశాను. ఆర్థిక అసమానతలు ఉన్న సమాజంలో ఆర్థికంగా ఏమీ లేని కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి మగవాడైనా ఒప్పుకోడు. నీతి అనేది ఆడవాళ్ళకి ఒకలాగ, మగవాళ్ళకి ఇంకొకలాగ ఉండదు కదా. ఆర్థికంగా ఏమీ లేని కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకునే ధైర్యం ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెందిన మగవానికి లేనప్పుడు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం చేసేవాని కొడుకుని పెళ్ళి చేసుకునే ధైర్యం పోలీస్ కమిషనర్ కూతురికి ఎలా ఉంటుంది?

 8. రాయగడలో ఆ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్‌లో కేవలం ఇద్దరుముగ్గురు ఆడవాళ్ళు కనిపించారు. మిగిలినవాళ్ళందరూ మగవాళ్ళే. పూరీ సినిమాలైనా, పవన్ కళ్యాణ్ సినిమాలైనా అవి మగ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని, ఆ థీమ్‌తో వ్రాసిన కథలతోనే ఉంటాయి. అందుకే ఆ సినిమాలకి ఆడవాళ్ళు వెళ్ళరు.

 9. రిజర్వేషన్‌లు అని అంటున్నారు. పదో తరగతి వరకు కూడా చదువుకోలేని పేదవాళ్ళకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, పూరీ జగన్నాథ్‌లాగ కోట్లు సంపాదించినవాళ్ళకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్‌ల కోసం కొట్టుకునేవాళ్ళలో ఎక్కువ మంది మధ్యతరగతివాళ్ళే. కోట్లు సంపాదించిన పూరీ లాంటివాళ్ళు ఇలాంటి విషయాలలో తలదూర్చి, తన కులానికి అనుకూలంగా జడ్జ్‌మెంట్‌లు ఇవ్వడం అవసరమా? రిజర్వేషన్‌లని రద్దు చేసినంతమాత్రాన అగ్రకులాలలోని పేదవాళ్ళకి ఉద్యోగాలు రావు. వైజాగ్ సమీపంలోని మధురవాడ చుట్టుపక్కల వెలమ దొరలు (పూరీ ఆ కులం నుంచి వచ్చినవాడే) ఇప్పటికీ గుడిసెలలోనే ఉంటున్నారు. రిజర్వేషన్‌లని రద్దు చేసినంతమాత్రాన చదువుకోవడానికి డబ్బులు లేనివాళ్ళకి (ఏ కులానికి చెందినవాళ్ళైనా సరే) ఉద్యోగాలు వచ్చేస్తాయా? SC, BC, OC అనేవి కేవలం రిజర్వేషన్‌ల కోసం చేసిన విభజనలు తప్ప అవి వాస్తవిక రేఖలు కావు. SC, BC కాటెగరీలలో ఉన్న మధ్యతరగతివాళ్ళు కేవలం అవకాశాల కోసం కులం పేరు చెప్పుకుంటారనేది ఎంత నిజమో, OCలు కూడా కేవలం అవకాశాల కోసం రిజర్వేషన్‌లని వ్యతిరేకిస్తారనేది కూడా అంతే నిజం. ఈ నిజాన్ని కావాలనే పూరీ ఇగ్నోర్ చేశాడు.

 10. thanks for a detailed analysis.

  while i do not expect any better from the TFI (telugu film industry), i am surprised at the audacity of the attempt during context of such a large participation in the T movement!

  Either they have some info about the strategy of the government or it is the typical ‘uttara kumara’ bravado!

  In either case, it has to be countered.

  my heartache comes from my feeling that till there is alternate content either to educate or entertain general populace will throng to these films. and these folk will keep trying to push their perspective either consciously or unconsciously – given their backgrounds.

  and we will be writing critiques of such films 😦

  pl do see my views on telugu films – the genetics of TFI in an article on Missiontelengana website.

 11. “కెమెరామేన్ గంగతో రాంబాబు” సినిమాలో ఒక డైలాగ్ ఉంది “గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచమంతా ఏకమవుతున్నప్పుడు చిన్న రాష్ట్రాల కోసం ఉద్యమం అవసరమా?” అని. అది తెలుగు దేశం అధికారంలో ఉన్న కాలంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు & హోమ్ మంత్రిగా ఉన్న మాధవరెడ్డి పలికిన పాత డైలాగే. అదే డైలాగ్ ఆ సినిమాలో పెట్టారు. “గ్లోబలైజేషన్ కాలంలో తెలుగు భాష అనేది అనవసరం” అనే డైలాగ్ కూడా వ్యాప్తిలో ఉంది. “గ్లోబలైజేషన్ కోసం మేము హైదరాబాద్‌ని ఇంత అభివృద్ధి చేశాము కనుక మేము హైదరాబాద్‌ని వదులుకోము” అనే సమైక్యవాదులు గ్లోబలైజేషన్ కాన్సెప్ట్స్‌కి విరుద్ధమైన భాషావాదాన్ని చేపట్టి భాషా సమైక్యత కోసం ఎందుకు ఉద్యమిస్తున్నట్టు? ఇది సమైక్యవాదుల డబల్ స్టాండర్డ్ కాదా? “గ్లోబలైజేషన్ కోసం తెలుగు అనవసరం కానీ హైదరాబాద్ కోసం మాత్రం మాకు తెలుగు కావాలి” అనేదే కదా సమైక్యవాదుల స్టాండర్డ్.
  ప్రపంచమంతా ఒకటేననీ, కులం-మతం-భాష లాంటివి అవసరం లేదనీ ఒప్పుకుంటే కులాంతర వివాహాలు చేసుకోవడానికి కూడా ఒప్పుకోవాలి. కానీ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లుగా పని చేసేవాళ్ళు కూడా కులానికీ, కట్నానికీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా. పాత పద్దతులలో ఏమాత్రం మార్పు లేనప్పుడు “ప్రపంచమంతా ఒకటే” అని కబుర్లు చెప్పుకోవడం ఎందుకు? ఆ సినిమా నిర్మించినవాళ్ళు ఆ సినిమాలో SCలూ, BCలూ ఒకరినొకరు కొట్టుకుంటున్నట్టు చూపించారు. “రిజర్వేషన్‌లని రద్దు చెయ్యకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తూ ఢిల్లీలో OC విద్యార్థులు ఒంటి మీద కిరోసీన్ పోసుకుని ఎలా నాటకాలు ఆడారో” అనేది కూడా ఆ సినిమాలో చూపించి ఉంటే ఆ సినిమా నిర్మించినవాళ్ళని నిజాయితీపరులని అనుకోవచ్చు. కానీ ఆ సినిమావాళ్ళు కేవలం SC, BCలని టార్గెట్ చేస్తూ సన్నివేశాలు పెట్టారు. అక్కడే కులం విషయంలో ఆ సినిమా ద్వంద్వ ప్రమాణం బయటపడింది. కొంత మంది అంటారు “సినిమాని సినిమాలాగ మాత్రమే చూడాలు కానీ నిజ జీవితంలాగ చూడకూడదు” అని. కానీ ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రకి ‘చంద్రశేఖరరెడ్డి‌’ అనీ, విలన్ పాత్రకి ‘జవహార్ నాయుడు‌’ అనీ, హత్యకి గురైన జర్నలిస్ట్ పాత్రకి ‘పింగళి దశరథ రామ్‌’ అనీ ఇలా సినిమాలోని పాత్రలలో చాలా వాటికి నిజ జీవితంలోని వ్యక్తులని పోలి ఉన్న పేర్లే పెట్టి ఈ సినిమాని ఒక ప్రోపగాండా సినిమాగా నిర్మించారు. “సినిమాని సినిమాగానే చూడాలి” అనే మాట ఈ సినిమాకి వర్తించదు. కనుక ఈ సినిమాని విమర్శించాల్సిందే.

 12. చాలా మంది గమనించారో, లేదో. “కెమెరామేన్ గంగతో రాంబాబు” సినిమాలో హీరో ఇంటిలోని గొడ మీద చేగెవరా బొమ్మ గియ్యబడి ఉంటుంది, విలన్ ఇంటిలో గోడ మీద నిజాం ఫొటో వాల్ పోస్టర్ సైజ్‌లో అంటించి ఉంటుంది. తెలంగాణావాదులు అందరూ నిజాం భక్తులు అని చెప్పదలచుకున్నారు ఆ సినిమావాళ్ళు. నిజాం ఫొటోలు ఉన్న సన్నివేశాలని తొలిగించిన ప్రింట్‌ని తెలంగాణాలో మాత్రమే విడుదల చేశారు. కోస్తా ఆంధ్రలో ఇప్పటికీ నిజాం ఫొటోల సన్నివేశాలు ఉన్న ప్రింట్‌తోనే సినిమా ఆడుతోంది.

 13. ప్రముఖ హీరో శ్రీకాంత్ నటించిన సినిమా అని గుర్తింది. ఆ సినిమాలో హీరో చేత ఒక డైలాగ్ పలికించారు “అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి అరిటాకు మీద పడినా అరిటాకుకే రంధ్రం పడుతుంది కానీ నా పంచెకి ఎలా రంధ్రం పడుతుంది?” అని. ఆ డైలాగ్‌పై ఒక్క మహిళా సంఘంవాళ్ళు కూడా అభ్యంతరం చెప్పలేదు. మహిళలకి అంత చైతన్యం లేకపోవడం బాధాకరమే. ఒకప్పుడు ప్రాంతీయ అస్తిత్వవాదులు కూడా ఇలాంటి చైతన్య రహిత స్థితిలోనే ఉండేవాళ్ళు. అందుకే సినిమాలలో విలన్‌లకి యాదగిరి, శ్రీశైలం లాంటి తెలంగాణా స్టైల్ పేర్లు పెట్టే పోకడ వచ్చింది. ఇప్పుడు ప్రాంతీయ అస్తిత్వవాదులలో చైతన్యం కొంచెం పెరిగింది. అందుకే “గంగతో రాంబాబు” సినిమా ప్రింట్‌లని తెలంగాణాలో తగలబెట్టారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s