రాజేశ్వరి నుంచి దమయంతి వరకూ…

రాజేశ్వరి నుంచి దమయంతి వరకూ…

Posted By on October 3, 2012

మల్లీశ్వరి

లేచిపోయినా’ నంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంతో ఉంటుంది అని కదా అన్నావు రాజేశ్వరీ! ఎపుడో 1927లో నువ్వట్లా నీతివర్తనుల్లోంచీ, మర్యాదస్థుల లోంఛీ  బైట పడి, దినం తర్వాత దినం నువ్వు పొందాలనుకున్న వివిధ వర్ణరాగ సుందరానుభవాల కోసం అమీర్‌తో కలిసి మైదానంలో పరుగులు తీస్తుంటే నిన్ను చూడవచ్చిన మీ మావయ్య ”పశువులు-కుక్కలన్నా నయం. నీతీ జాతీ విచక్షణలు లేక కళ్ళు కమ్మి, వొళ్ళు కొవ్వి, ఇట్లా బట్టలు విప్పుకుని యీ అడవుల్లో పరిగెత్తుతో, సిగ్గు విడిచి…” అని కదూ అన్నాడు!

ఎనభై అయిదేళ్ళు గడిచాయి. లోకం చాలా మారిపోయింది రాజేశ్వరీ! కానీ రాజేశ్వరుల గురించి లోకం అంచనాలు ఏ మాత్రం మారలేదని ఇపుడు ‘దమయంతి కూతురు’ చెపుతోంది.

పి. సత్యవతి సొగసైన, గడుసరి కథకురాలు కదా! రాజేశ్వరికి పిల్లలు లేరు కదాని అంతో యింతో సరిపెట్టుకున్న విశాల హృదయాలని సవాల్‌ చేస్తూ దమయంతికి ఒక కూతురినీ, ఆ కూతురికి తల్లిలేని శూన్యాన్నీ, ఆ పిల్ల ఎదుగుతూ అనుభవించిన వేదనని కూడా కథలోకి తెచ్చారు. ఇపుడిక ముత్యాల్లాంటి పిల్లల్నీ, మంచి భర్తనీ, లక్షణమయిన, భద్రమయిన సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోయిన దమయంతి గురించి బుగ్గలు నొక్కుకోవడమే లోకం పని.
ఆ పనిని మౌత్‌వాష్‌లూ, బ్రూట్‌ పరిమళాల సంతోష్‌ ఫ్రమ్‌ సామర్లకోట కూడా చేశాడు. ఎంక్వయిరీ అవీ అయ్యాక పెళ్ళి చేసుకోడానికి దమయంతి కూతురు నచ్చింది గానీ దమయంతి చచ్చిపోయిందా? లేచిపోయిందా? అనేదే తల్లి వంకన సమస్య అతనికి.

”నీ మొహాన పెళ్ళి బొట్టుతో పాటు ఒక తల్లి మచ్చ కూడా పెట్టేసి ఆ మచ్చని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడు. నువ్వు నీ జీవితాంతం అతనికి కృతజ్ఞతా బద్ధురాలవై ఉంటావు. ఎపుడయినా నీ చదువూ, నీ తెలివీ, నీ ఉద్యోగం గుర్తొచ్చి నువ్వు ఎగిరి పడితే ఆ తల్లి మచ్చ ఒక పేపర్‌ వెయిట్‌లా పనిచేస్తుంది” అంటూ సంతోష్‌ ఫ్రమ్‌ సామర్లకోటని ఎందుకు తిరస్కరించాలో దమయంతి కొడుకు చెల్లికి చెపుతాడు.
కథలో ఎక్కడా దమయంతి కూతురు తప్ప దమయంతి రాలేదు. కానీ దమయంతి లేకుండా కథే లేదు. ఈ టెక్నిక్‌ ద్వారా కథని నడపడంలో రచయిత, స్త్రీల నిర్ణయాధికారం, మాతృత్వభావన అనే రెండు ప్రధానమయిన అంశాలను సమాంతరంగా చర్చకి పెట్టగలిగారు. స్త్రీలు అన్ని సంకెళ్ళను తెంచుకుని నచ్చిన వ్యక్తి కోసం వెళ్ళిపోవడమనేది సాహిత్యానికి కొత్త వస్తువు కాకపోవచ్చు. కానీ ఆ వెళ్ళిపోవడమనేది అనేక సందర్భాల్లో స్త్రీల లైంగికతతో ముడిపెట్టి చూడబడుతుంది. తద్వారా స్త్రీల లైంగికస్వేచ్ఛపై నలిగిపోయిన వారిలో వాదోపవాదాలు మొదలవుతాయి. అలాంటి పాత చూపుని బ్రేక్‌ చేసింది ఈ కథ.

దమయంతి కూతురు పెద్దయ్యాక ‘అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందని వాళ్ళ నాన్నని అడిగినపుడు ”నేను భూలోకపు మనిషినమ్మా, ఆమె ఊర్ధ్వలోకపు మనిషి. అందుకే ఈ లోకంలో ఉండలేక వెళ్ళిపోయింది” అని చెపుతాడు. దమయంతి వెళ్ళిపోయిన చాలా ఏళ్ళ తర్వాత ఆమె భర్త నుంచి ఈ సహనంతో కూడిన సమాధానం రాబట్టడంలోనే రచయిత కథా వస్తువు పట్ల చూపిన పరిణితి కనిపిస్తుంది.

స్త్రీలు నచ్చిన వ్యక్తి కోసం వెళ్ళిపోయినపుడు అనివార్యంగా పురుషుడు చెడ్డవాడు కాక తప్పని దుస్థితి నుంచి స్త్రీవాద కథని ఈ కథ ద్వారా రక్షించగలిగారు పి. సత్యవతి.
సమాజంలో భూలోకపు మనుషులతో పాటు అరుదుగానయినా ఊర్థ్వలోకపు మనుషులుంటారనీ ‘ఆయియే ఆప్‌కో సితారోఁ మే లే చెలూ!’ అంటూ తెగింపునీ సాహసాన్నీ కావలించుకుని నక్షత్ర వీధిలోకి ఒకరినొకరు నడిపించుకు వెళతారనీ, తప్పొప్పుల తూకాలు అక్కడ చెల్లవనీ, అర్థం చేసుకోవడమూ, అవగాహనలోకి తెచ్చుకోవడమనే కొత్త దృష్టే పరిష్కారంగా ప్రతిపాదించారు రచయిత

.
ఈ కథని తళుక్కుమనిపించిన మరో అంశం మాతృత్వబాధ్యతల మీద ఉండే అదనపు బరువుని తొలగించే ప్రయత్నం… ఒకవైపు పితృస్వామిక వ్యవస్థ కల్పించిన మాతృత్వపు మిత్‌ని బద్దలు కొడుతూనే మరోవైపు మాతృత్వానికి దానంతట దానికి సహజంగా ఉండే విలువనూ గుర్తించారు రచయిత. అందుకే దమయంతి కూతురు, తల్లిలేని పిల్లగా ఉండటంలోని వెల్తిని స్వంత కూతురిలాగా పెంచిన అత్తయ్య ద్వారా కానీ, రెండో తల్లి ద్వారా కానీ పూరించు కోలేకపోయింది.
పిల్లల్ని పెంచడం అనేది తల్లిదండ్రులిద్దరి సమాన బాధ్యతగా గుర్తిస్తూనే, నచ్చినట్లుగా జీవితాన్ని మలుచుకునే హక్కు స్త్రీలకి ఉంటుందని అలవి మాలిన త్యాగాలు స్త్రీలకి అంటగట్టకూడదన్న సూచనా కథలో ధ్వనించింది.
కథని ముగిస్తూ- ”మరి నేను అనుభవించిన క్షోభ మాటేమిటి?” అంటుంది దమయంతి కూతురు.
”బహుశా మన దగ్గరే ఉండి ఉంటే ఆమె అనుభవించవలసి ఉండిన క్షోభ మాటేమిటి?” అంటాడు దమయంతి కొడుకు.
కూతురు దగ్గర జవాబు లేదు.
దమయంతి దగ్గర జవాబు ఉంటుందనుకోలేము..
మరి మన దగ్గరేం జవాబు ఉందో?!
(పి. సత్యవతి యిటీవల రాసిన ‘దమయంతి కూతురు’ కథ చదివి…)

విజయవాడలో పి.సత్యవతి గారింట్లో…

34 thoughts on “రాజేశ్వరి నుంచి దమయంతి వరకూ…

 1. …. మరి నేను అనుభవించిన క్షోభ మాటేమిటి?”
  “బహుశా మన దగ్గరే ఉండి ఉంటే ఆమె అనుభవించవలసి ఉండిన క్షోభ మాటేమిటి?”

  వావ్.. ఈ ఒక్క ప్రశ్నతో కథ మొత్తం సారంశం అయిపోతుంది.

  దమయంతి కూతురి క్షోభకు లేచిపోవడాన్ని మహాపరాధంగా భావించే సమాజం కారణమా? దమయంతి లేచి పోవడమే కారణమా?

  –ప్రసాద్
  http://blog.charasala.com

  • ప్రసాద్ గారూ భలే మెలిక ప్రశ్న అడిగారు…సమాజమే కారణం అంటే దమయంతి కూతురు మిస్ అయిన తల్లి ప్రేమ మాటేంటి అన్న ప్రశ్న వస్తుంది…దమయంతి వెళ్ళిపోవడమే కారణం అంటే నైతిక విలువలలోంచి చూసినట్లు అవుతుంది…బహుశా అందుకే సత్యవతిగారు ఈ చర్చ చేయకుండా జడ్జి మెంట్స్ లేకుండా అర్ధం చేసుకోవడాన్నే ప్రతిపాదించారు అనుకుంటున్నా…చూద్దాం సత్యవతిగారు మీ ప్రశ్నలకి స్పందిస్తారేమో…

   • @దమయంతి కూతురి క్షోభకు లేచిపోవడాన్ని మహాపరాధంగా భావించే సమాజం కారణమా?

    ఇదే నిజం అండీ,

    జాజి మల్లి గారు,

    సమాజం వల్ల ఆడపిల్లకు వచ్చే సమస్య ఎక్కువ, మగ పిల్లాడి కన్నా..ఆ అమ్మాయి క్షోభకు తల్లి లేచిపోవ్డమే కారణం అయితే, ఆ అబ్బాయికి కూడా ఉండాలి.

    తండ్రికి చివరిలో వచ్చ్సిన సహనం ముందే ఉంటే దమయంతి లేచిపోవడం వల్ల ఆ అమ్మాయి పెద్దగా క్షోభ పడాల్సిన అవసరం కూడా రాదు. కాని మానవ సహజం, కోపం తెచ్చుకోవడం . కాబట్టి ఒక వ్యక్తి ని కాకుండా సమాజ పరం గా మార్పులు ఆశించవచ్చా లేదా అన్నది రచయిత్రి తప్పకుండా చెప్పాలి 🙂

   • మౌళీ,
    మంచి పాయింట్ మాట్లాడారు…
    కానీ…
    సమాజం అర్ధం చేసుకున్ననంత మాత్రానా బిడ్డకి తల్లి తనని వదిలి వెళ్ళిపోయిన వెల్తి,దుఃఖం కలగకుండా ఉంటాయా?దమయంతి కూతురికి కలిగిన బాధ కేవలం సమాజం నుంచి వచ్చిందేనా?!

   • మంచి ప్రశ్న, నా సమాధానం :

    @@@సమాజమే కారణం అంటే దమయంతి కూతురు మిస్ అయిన తల్లి ప్రేమ మాటేంటి అన్న ప్రశ్న వస్తుంది…

    కారణం మనఅందరితో కూడిన సమాజం తప్ప , తల్లి ప్రేమ కారణం కాదు. కూతురు నిజం గా క్షోభ పడింది తల్లి ప్రేమ దొరక్క కాదు. మనకేది లేదో, అదే కారణం అయ్యుంటుంది అన్న భ్రమ లో ఉండడం సహజం.

    తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అన్నవి ఎంత వరకు వాస్తవాలు అన్నవి తరువాత మాట్లాడుకొందాము.

    దమయంతి కూతురుని తనతో తీసికొనే వెళ్తే క్షోభ పడేది కాదు అన్నది చెప్పలేము. ఆ అమ్మాయి కూడా చెప్పలేదు. అలా అని దమయంతి వెల్ల కుండా ఉన్నా కూతురు ఇంకో విధంగా క్షోభ పడే అవకాసం ఉంది. (తన సమస్యలతో కూతురుని సరిగా గమనించకపోవచ్చు)

    దమయంతి కొడుకు, తల్లి ఎక్కడో ఉన్నది కాబట్టి , సమాజం తనని పెద్దగా బాధించదు కావున అర్ధం చేసికొన్నాడు. అదే తల్లి అబ్బాయిని తీసికొని వెళ్లి ఉంటే, క్షోభ పడి ఉండేవాడు.

    తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అన్నవి వాళ్ళ ఇగోలు హర్ట్ కానంత వరకే పిల్లలపై ప్రేమ. అలాగని దూరం అవ్వడానికి పిల్లలు పొరపాటు చేసి ఉండాల్సిన అవసరం లేదు.

   • మౌళీ…
    చాలా మంది మేధావుల భావవిప్లవం వారి పరిధి,ఆచరణ ఎంతవరకో అంతవరకే…దానిని అధిగమించి ఉన్నదంతా అరాచకమనే…
    ఈ వ్యాఖ్యలో మీ విశ్లేషణ నన్ను ఆశ్చర్యపరిచింది…ఆనందపరిచింది…ఎందుకంటే…మీరు చాలా సంకెళ్ళని అధిగమించి మాట్లాడుతున్నారు.తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కనీసం భ్రమాత్మకైన వాస్తవం కాదా?వాటిని కూడా యాంత్రికం చేసేస్తే మనకేం మిగులుతుంది.!

 2. స్త్రీ పురుష సంబంధాల్ని తరిచే ఏ కథాంశానైనా నా జీవితంలోకి తీసుకొని తైపారు వేసుకొని చూడకుండా ఉండలేక పోతున్నా.
  కలిసి ఉండే ఆడా మగా, ఒకరికొకరిని ‘హృదయము సంకెల’ చేసి బంధింపబడాలని హేమాంగీ ధనుర్దాసులవ్వాలనీ అనుకునే వాడిని. నేను చాలా ఇష్టపడటం సరే, నన్ను ఇష్టపడటమే కాకుండా, గత్యంతరం లేని ఏ ఇతర కారణాలవల్ల కాకుండా, నన్ను నన్నుగానే ప్రాణాధికంగా ప్రేమించే నా బెటర్ హాఫ్ ఉన్నప్పటికీ, కనపడని ఆ సంకెళ్ళని తెంచేసేంత మహామోహాలతో నేను ‘లేచిపోకుండా’ నన్ను నిరోధించిన మహా శక్తి నా angelic కూతుళ్ళే. వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు ఎదుగుతున్న అపురూప దృశ్యానికి కానివాడ్నై పోవడం కంటే వేరే శాపం ఏముంటుంది అనిపిస్తుంది. నేను లేక పోతే మా అమ్మాయిలు పడే క్షోభ గురించి గురించి కాదు నా గొడవ, క్షోభ అన్న స్పృహని కలగనివ్వని వాళ్ళ presence, making & becoming లని miss అవ్వడానికి మించిన క్షోభ లేదు నాకు.
  ఇది నా స్వకీయ పురాణం. ఈ self-referential కళ్ళజోడు నుంచి చూసి దమయంతిని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. ఆకర్షణల సుడిలో మాటిమాటికీ జారిపడే మగవాడిగా దమయంతిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. జాజిమల్లెలంత సుకుమారమైన పదాలతో, ఆలోచనలతో దమయంతిని చూస్తున్న మీ నుండి కూడా ఆమె ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాను. రాజేశ్వరి నుంచి దమయంతి దాకా అన్నారు-
  రాజేశ్వరి నా కోసం నావంటి మరో మగవాడు సృష్టించిన కాల్పానిక సౌందర్యం.
  దమయంతి సత్యవతి గారు నాముందు నిల్పిన వాస్తవిక సందేహం. Isn’t it Ms. Malleswari?

  • నరేష్ గారూ,
   అవును కదా…
   కాల్పనిక సౌందర్యం నుంచి, ఊర్ద్వలోకపు వాస్తవం దాకా చాలా మందిని చూడలేదా మనం…ఇక ముందు చూడమా?
   దమయంతి ఎందుకు వెళ్ళిపోయింది!అసలు అట్లా వెళ్లి పోవచ్చా!అన్న చర్చ, సంశయం కధలో ఎక్కడా లేదు…ఎందుకైనా గానీ ఎట్లాగైనా కానీ అది జరిగిపోయింది…అట్లా జరిగినపుడు ఎట్లా అర్ధం చేసుకోవాలి అన్నదే సత్యవతి ప్రధానంగా చెప్పారు అనుకుంటున్నాను.చెప్పానుగా ఈ రచయిత చాలా గడుసరి…చాలా చిక్కుముళ్ళ కధ ఇది…
   మీ భావాలు షేర్ చేసుకోవడం బావుంది…
   నా ఉనికి ‘మల్లీశ్వరి’ మాత్రమే నరేష్ గారూ…

 3. మీరు చెప్పేది ఏమిటి? పిల్లలు ఉన్నప్పుడు లేచిపోవడం అసాధారణమైన పని అనా? మీకు ఒక రియల్ లైఫ్ కథ చెపుతాను. నమ్ముతారా లేదా?

  ఒక మహిళని నూట యాభై ఎకరాల భూస్వామికి ఇచ్చి పెళ్ళి చేశారు. అతను తాగుబోతు. తాగిన మత్తులో భార్యని కొడుతుండేవాడు. ఆమె అతనితో కాపురం చేస్తుండగానే ఆమెకి ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆమెకి గ్రామంలో పని చేస్తున్న ఒక బడి పంతులుతో పరిచయమైంది. ఆ బడి పంతులు ఆమెని తనతో రమ్మన్నాడు. ఒరిస్సా రాష్ట్రంలో పల్లెటూర్లలో పని చేసే బడి పంతుళ్ళకి వచ్చే జీతాలు చాలా తక్కువ. అతను తన జీతంతో ఆమె మొదటి భర్త పిల్లలని పోషించలేడు కనుక అతను ఆమెని తన పిల్లలని నాయనమ్మ దగ్గర వదిలేసి రమ్మన్నాడు. ఆమె తన పిల్లలని నాయనమ్మ దగ్గర వదిలేసి ఆ బడి పంతులుతో వెళ్ళిపోయింది. ఆ బడి పంతులుకి పట్టణంలో ఒక గుడిసె ఉండేది. పట్టణానికి ట్రాన్స్‌ఫర్ చెయ్యించుకుని, అక్కడ తనకి భార్యగా వచ్చిన ఆమెతో స్థిరపడి, గుడిసె స్థానంలో రేకుల షెడ్ కట్టించి, ఆమెతో కాపురం చేసి మరో ముగ్గురు పిల్లలని కన్నాడు. ఆ పిల్లలందరూ ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళైపోయారు. ఆమె రెండో భర్త పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని, ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదిస్తున్నారు. కానీ ఆమె మొదటి భర్త పిల్లలకి వేరే సమస్యలు వచ్చాయి. ఆమె మొదటి భర్త తాగుడుకి డబ్బుల కోసం తన దగ్గర ఉన్న పట్టా భూములన్నిటినీ అమ్మేశాడు. పట్టా లేని & ప్రభుత్వ అనుమతి లేకుండా సాగు చేస్తున్న పదిహేను ఎకరాల భూమిని మాత్రం తన దగ్గర ఉంచుకున్నాడు. తన పిల్లలు పెద్దై పెళ్ళిళ్ళు చేసుకున్న తరువాత ఆమె మొదటి భర్త చనిపోయాడు. చనిపోయేటప్పుడు తన ముగ్గురు పిల్లలకీ కలిపి పదిహేను ఎకరాలు ఉన్న పట్టా లేని భూమిని మిగిల్చాడు. ఆ భూమిని ఆ ముగ్గురూ కలిసి పంచుకుంటే ఒక్కొక్కరికీ వచ్చేది ఐదెకరాలే. ఆ గిరిజన ప్రాంతంలో ఐదెకరాల కొండ మెరక దున్నితే ఏమీ రాదు. కానీ బతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి కనుక వాళ్ళు ఆ కొండ మెరక దున్నుకుంటూ బతుకుతున్నారు. ఆమె రెండో భర్త పిల్లలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ పట్టణంలో బతుకుతున్నారు.

  ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆమె మొదటి భర్త పిల్లలు ఆ పరిస్థితిలోకి దిగినందుకు ఎవరిని తప్పుబడతాము? ఆమెని తాగుబోతుకి ఇచ్చి పెళ్ళి చేసిన ఆమె తల్లితండ్రులనా? తాను చేసే పంతులు ఉద్యోగానికి వచ్చే జీతంతో ఆమె మొదటి భర్త పిల్లలని పోషించలేని ఆమె రెండో భర్త యొక్క ఆర్థిక పరిస్థితినా? పట్టా భూములన్నిటినీ అమ్మేసి ఎందుకూ పనికి రాని మెరక భూములని తన పిల్లలకి మిగిల్చిన ఆమె మొదటి భర్తనా?

  మగవాళ్ళ విషయానికి వద్దాం. మగవాడు తన రెండో భార్య కొడుక్కి ఆస్తిని కట్టబెట్టడానికి మొదటి భార్య కొడుకుపై హత్యాప్రయత్నం చేసిన వార్తలు విన్నాను. కానీ ఆడది తన రెండో భర్త కొడుక్కి ఆస్తి కట్టబెట్టడానికి మొదటి భర్త కొడుకుని చంపిన వార్తలు లేవు. దీన్ని బట్టి చూస్తే ఆడది లేచిపోవడం కంటే మగవాడు రెండో పెళ్ళి చేసుకోవడం వల్లే పిల్లలకి నష్టం ఎక్కువ అని అర్థం కావడం లేదా?

  లేచిపోవడాలని నేను సమర్థిస్తున్నానని మీరు అనుకోవచ్చు. నిజమే. లేచిపోవడాలని నేను డైరెక్ట్‌గానే సమర్థిస్తున్నాను.

  • కొన్ని అరిగిపోయిన నిందార్దాలూ,స్త్రీలను కించపరిచే భాష మీద కూడా ఈ కధ చర్చించింది…మళ్ళీ మనం అదే భాషని వాడడం ఏం సబబు ప్రవీణ్ గారూ…అనవసర వివాదాలకి కేంద్రం కావడం తప్ప…

 4. భర్త దుర్మార్గుడైనప్పుడు భార్య అతన్ని వదిలేసి ఇంకో వ్యక్తితో వెళ్ళిపోవడానికి నేను వ్యతిరేకం కాదు. కానీ భాష గురించి అడుగుతున్నారు కాబట్టి చెపుతున్నాను. తెలుగులో “లేచిపోయింది” అని వ్రాసినా, ఇంగ్లిష్‌లో “eloped away” అని వ్రాసినా తేడా ఏమీ రాదు. అదంతా సొంత భాషని గ్రామ్య భాష అని అనుకోవడం వల్ల వచ్చిన సమస్య. అంతే కానీ భాషా సమస్య అని అనుకోను.

 5. పదాల విషయాన్ని మీరు మరీ సీరియస్‌గా తీసుకోవద్దు. పల్లెటూర్లలో చాలా మందికి ఇప్పుడు కూడా విడాకుల చట్టం గురించి ఏమీ తెలియదు. అక్కడ స్త్రీలకి భర్త నుంచి సమస్యలు వస్తే వాళ్ళకి ఒకటే దారి కనిపిస్తుంది. అది “eloping away”. మనం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నంత చదువుకున్నవాళ్ళం కాబట్టి మనం భాష అందంగా ఉండాలని అనుకుంటున్నాం. కానీ మనం ఒక పల్లెటూరి స్త్రీతోనే డైరెక్ట్‌గా మాట్లాడాల్సి వస్తే మనకి మాత్రమే అర్థమయ్యే అందమైన భాష ఎలా ఉపయోగిస్తాం?

  • నేను మాట్లాడింది భాష అందానికి సంబంధించి కాదు…అలాంటి పదాలకి రూడీ అయిపోయిన అర్దాలుంటాయి…అవి స్త్రీలని మరింత అవమానానికి లోను చేస్తాయి…మీరు గమనించాల్సింది ఇది శ్రామిక మహిళలకి సంబంధించిన కధ కాదు.మధ్యతరగతికి చెందిన కధ…అందుకే నైతిక విలువల ఘర్షణ ఇక్కడ ఎక్కువగానూ, ప్రధానంగానూ ఉంటుంది…కాబట్టి భాషని ఎలా వాడాలన్నది కూడా చాలా ముఖ్యం…

 6. “పిల్లలు ఉన్న స్త్రీ ఇంకో పురుషునితో వెళ్ళిపోవడం అసాధారణం” అనే అర్థంతో వ్రాయడం మాత్రం నాకు నచ్చలేదు. పిల్లలు ఉన్న పురుషుడు భార్యకి విడాకులు ఇచ్చిన సందర్భాలు లేవా? ఆడదానికి ఒక నియమం – మగవానికి ఇంకో నియమం ఎందుకు?

 7. Over allగా నాకు ఈ పోస్ట్‌లో disappointment కలిగించిన విషయమేమిటంటే స్త్రీ తన పిల్లలని వదిలేసి వెళ్ళిపోవడాన్ని అసాధారణ విషయంగా చూడడం. సాధారణమైతే కాదు అని మీరు అనొచ్చు. మగవాడు తన రెండో భార్య పిల్లలకి ఆస్తిని కట్టబెట్టడానికి మొదటి భార్య పిల్లలని వదిలించుకోవడానికి తెగించిన ఘటనలు ఉన్న సమాజంలో స్త్రీ తన పిల్లలని వదిలి వెళ్ళిపోతే దాన్ని ఓ అసాధారణ విషయంలా చూసే హక్కు సమాజానికి లేదు అనే నేను అనుకుంటాను.

 8. విదేశాలలో కూడా లింగ వివక్ష ఉంది. కానీ అక్కడ పెళ్ళి అయిన స్త్రీలని ఒకలాగ – పెళ్ళికాని స్త్రీలని ఒకలాగ, పిల్లలున్న స్త్రీలని ఒకలాగ – పిల్లలు లేని స్త్రీలని ఒకలాగ చూసే పద్దతి మాత్రం లేదు. కానీ మీ శైలి చూస్తోంటే మీరు ఈ పద్దతిని ఎంకరేజ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

  మైదానం నవలపై రివ్యూ వ్రాసే రోజుల్లోనే వ్రాసాను “ఆ నవలలో పెళ్ళి కాని స్త్రీ లేచిపోతున్నట్టు చూపిస్తే దాన్ని సాధారణ ప్రేమ కథ అని అనుకునేవారు” అని. ఇప్పుడేమో పెళ్ళి అనేది సమస్య కాదు, పిల్లలు ఉండడం అనేది సమస్య అనే అర్థంతో మాట్లాడుతున్నారు.

  • ప్రవీణ్ గారూ,
   నా ఎంకరేజ్మెంట్ సంగతి ఎందుకు కానీ మీరు ఎంత సేపూ ఆ ఒక్క పదాన్నే పట్టుకుని సాగదీస్తున్నారు…సత్యవతిగారి కధనీ, దాని మీద నా విశ్లేషణని మళ్ళీ ఒకసారి ఓపికగా చదివి ఈ అంశానికున్న చాలా కోణాలను గుర్తించండి దయచేసి…

 9. మల్లీశ్వరిగారూ…

  దమయంతి కథ నాకు కూడా చాలా బాగా నచ్చింది. అయితే, ఈ కథ గురించి మిత్రుల మధ్య చర్చ జరిగినపుడు ఒక ప్రముఖ మిత్రులు ఒక ప్రశ్న అడిగారు. ’నిజంగా, మన చుట్టూ మనకు తెలిసిన సమాజంలో పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయినవారు ఎవరైనా ఉన్నారా?‘అని. దీనికి మీ సమాధానం?

  • దేశరాజు గారూ,
   నాకు తెలిసీ ఉన్నారు అని అన్నాననుకోండి…వెంటనే ఎవరు అన్న ప్రశ్న వస్తుంది…ఇతరుల వ్యక్తిగతాన్ని చర్చలోకి లాగినట్లు అవుతుంది…సాహిత్యాన్ని సబ్జెక్టివ్ గా మాట్లాడుకోవచ్చా?

  • దేశరాజు గారు, నిజంగా ఉన్నారు కాబట్టే నేను ఇందాక ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్పాను. అందులో పేర్లు వ్రాయకుండా కేవలం వాళ్ళ వృత్తల ఐడెంటిటీ మాత్రమే వ్రాయడం వల్ల మీరు దాన్ని కేవలం కథ అని అనుకుని ఉండొచ్చు.

  • ఆడవాళ్ళు పిల్లలని వదిలెయ్యడం గురించి మాట్లాడినప్పుడు మాత్రమే (అది కథలోనైనా, నిజ జీవితంలోనైనా) ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది? మగవాళ్ళ విషయంలో ఎందుకు ఆశ్చర్యం కలగదు? మగవాడు పిల్లలని వదిలేసిన కథ గురించి introduce చేసి ఉంటే ఇంత మంది స్పందించేవారు కాదనే నేను నమ్ముతాను. అందుకే నాకు ఈ పోస్ట్ పట్ల అసంతృప్తి కలిగింది.

   • ప్రవీణ్ గారూ,
    మీ వ్యాఖ్యలన్నీ మళ్ళీ ఒకసారి చూసాక ఒక విషయం స్పురించింది…ఒక సాహితీ మిత్రుడు ఇటీవల మాట్లాడుతూ మైదానంలో రాజేశ్వరి అమీర్ తో వెళ్ళిపోవడం ఇప్పటికీ సమాజానికి ఆమోదయోగ్యం కాని విషయంగా ఎందుకు ఉందంటే రాజేశ్వరి మధ్యతరగతి బ్రాహ్మణ యువతి కనుక….అదే కింది తరగతి శ్రామిక మహిళ గురించి చలం రాసి ఉంటే ఇంత చర్చ ఉండేది కాదు అని…

   • భౌతిక ధర్మాలు అనేవి కులాన్ని బట్టి మారవు. కనుక అలా వెళ్ళిపోయిన స్త్రీ పల్లెటూరి స్త్రీయా లేదా బ్రాహ్మణ స్త్రీయా అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. నలభై ఏళ్ళ క్రితం తన భర్తని వదిలేసి బడి పంతులుతో వెళ్ళిపోయిన ఆవిడ చేసిన పనిని మా బంధువులు ఇప్పటికీ అర్థం చేసుకోవడం లేదు. మన లాంటి చదువుకున్నవాళ్ళైతే పరువుమర్యాదలని పట్టుకుని వేలాడగలరు కానీ మనకి ఉన్న standard of living లేని పల్లెటూరివాళ్ళు వాటి గురించి పట్టించుకునే స్థితిలో ఉండరు అని చెపితే మా వాళ్ళు నమ్మడం లేదు.

   • bhowthika dharmaalu kulaanni batti gaanee mare ithara paristithula batti gaanee povu..kaanee vividha vargaala stitigathulani batti niyantranalanu batti,vivekaanni batti roopaanni maarchuntaayi…kaabatti maarpu untundi.(gmail lo telugu type avadam ledu)

   • కులం కట్టుబాట్లు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ అనవసరం. ఉదాహరణకి బ్రాహ్మణ కుటుంబాలలో ఇప్పటికీ భర్త చనిపోయిన స్త్రీలని కుంకుమ, గాజులు పెట్టుకోనివ్వరు. కానీ బ్రాహ్మణాచారాలు తెలియని పల్లెటూరి స్త్రీలు భర్త చనిపోయిన తరువాత కూడా కుంకుమ, గాజులు పెట్టుకుని తిరుగుతారు. వాళ్ళని చూసినప్పుడు బ్రాహ్మణులు “కలికాలం వచ్చేసిందనీ, అందుకే ఆడవాళ్ళు ఇలా తయారవుతున్నారనీ” అనుకుంటారు. పల్లెటూరి స్త్రీలకి బ్రాహ్మణాచారాలు తెలియవు అని మనం ఆ బ్రాహ్మణులకి చెప్పినా అది వాళ్ళకి అర్థం కాదు. తమ నమ్మకాలే కరెక్ట్ అన్నట్టు బ్రాహ్మణులు మాట్లాడుతారు. మా అమ్మగారు శ్రీకాకుళం RCBలో పని చేసే రోజులలో వాళ్ళ బ్యాంక్‌కి ఒక పల్లెటూరి స్త్రీ వచ్చింది. ఆమె వ్యక్తిగత సమాచారం అడిగినప్పుడు ఆమె తన భర్త చనిపోయాడని చెపితే ఆ బ్రాంచ్‌లో ఉన్న ఒక మహిళా ఉద్యోగి నమ్మలేదు. పల్లెటూరి స్త్రీలకి బ్రాహ్మణాచారాల గురించి తెలియదని మా అమ్మగారికి అర్థమైంది కానీ పక్కన కూర్చున్న ఉద్యోగినికి అర్థం కాలేదు. మైదానం రాజేశ్వరి లాంటి స్త్రీలు ఉంటారని చెప్పినా కొందరు ఇలాగే నమ్మకపోవచ్చు. వాళ్ళు పుట్టి పెరిగిన కుటుంబ వాతావరణం వల్ల కూడా వాళ్ళకి ఇది నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ భౌతిక ధర్మాలు అనేవి కులాన్ని బట్టి మారవు కదా. ఈ నిజాన్ని అంగీకరిస్తే ఒక బ్రాహ్మణ స్త్రీ భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకున్నా, భర్త ఉండగా ఇంకో పురుషునితో వెళ్ళిపోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

    కులం కట్టుబాట్ల పేరుతోనో, మతం పేరుతోనో చిన్నప్పటి నుంచి మనిషి ఆలోచనలని కట్టడి చేసే కట్టుబాట్లని బోధించినంతమాత్రాన సహజ సిద్ధంగా కలిగే కోరికలు ఆగవు. “ఆమె కులం ఏమిటి, ఆమె చేసిన పని ఏమిటి?” అని ఎవరు అనుకున్నా సహజమైనది అసహజమైపోదు.

 10. “స్త్రీలు నచ్చిన వ్యక్తి కోసం వెళ్ళిపోయినపుడు అనివార్యంగా పురుషుడు చెడ్డవాడు కాక తప్పని దుస్థితి నుంచి స్త్రీవాద కథని ఈ కథ ద్వారా రక్షించగలిగారు పి. సత్యవతి.”
  -పితృస్వామ్య సమాజంలో నిరంతరం ఆధిపత్యపు అడుగు జాడల్లో అందరం నలుగుతూ ఉన్నా కూడా అంత కూల్ గా సత్యవతి గారు రక్షించేరని మీరూ ఆనందపడాల్సిందేముందో అర్థం కాలేదు నాకు-
  అక్కడికి దమయంతి వెళ్లిపోవడానికి కేవలం ఆమెని మాత్రమే బాధ్యురాల్ని చెయ్యడం ఆ భర్త పాపం ఏమీ ఎరగని గొప్ప పుణ్యపురుషుడిగానూను-
  ఇక దమయంతి వెనక్కి రావడం కాదుకదా అసలు పిల్లల్ని చూడడానికి వద్దామనుకున్నా అసలా భర్త ఒప్పుకుంటాడా? అమ్మ వద్దామనుకున్నా నాన్న రానిచ్చేవాడా? అని రచయిత్రి ఎక్కడైనా రాసి
  ఉంటే కాస్తయినా దమయంతికి న్యాయం చేసినట్లయ్యేది-
  http://vihanga.com/?p=5629
  అమ్మ రాదు
  రోదన కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే ఎంత బావుణ్ణు
  అమ్మ పాపాయికి మిగిలేది
  పాపాయి అమ్మకి మిగిలేది….
  …………………….
  పాపా! నాన్నని నిలదియ్యి-
  అమ్మని తరిమి కొట్టిన నాన్నని నిలదియ్యి-
  మొగాళ్లని నిలదియ్యి-
  కన్నీళ్లని మాత్రమే మిగిలుస్తున్న మొగుళ్లని నిలదియ్యి-
  – ( దమయంతి కూతురు చదివేక-)
  -కె.గీత
  http://www.facebook.com/geetamadhavi.kala

  • గీత గారూ,
   దమయంతి కూతురు మొత్తానికి చాలా మందిని కదిలించింది కదూ…అందుకు ముందుగా రచయితని అభినందిద్దాం…

   దమయంతి కూతురుని చూసి నేను చాలా ఆనందించాను….ఎందుకంటే కుంగిపోకుండా అట్లా నిలబడగలిగినందుకు…ఒక వ్యక్తి(తల్లి అయినా ,భర్త అయినా మరే ప్రధానమైన వారైనా)మనకి లేకుండా పోయినపుడు ఆ శూన్యం మనకి రానీయకుండా మన చుట్టూ అనేక మానవ సంబంధాలు ఉంటాయన్న భరోసాని నేను కధలోచూసాను…పిల్లల్ని తల్లి మాత్రమే కనగలదు…కానీ ఎవరైనా, తండ్రైనా చక్కగా పెంచొచ్చు అని మనం చదువుకున్నపుడు అక్కడ అర్ధం మాతృత్వం మీద ఉన్న మిత్ ని బ్రేక్ చెయ్యడమే కదా…అదే ఈ కధలో జరిగింది… అయినప్పటికీ మాతృత్వం ఎంత గొప్పదో దానికి సాటి వచ్చేది మరేదీ ఎందుకు ఉండదో కూడా దమయంతి కూతురు అనుభవించిన వెల్తి చూస్తే తెలుస్తుంది…అయితే అది కేవలం వెల్తి మాత్రమే…శూన్యం కాదు…ఇది జీవితం పట్ల మినిమంగా ఉండాల్సిన ఆశావహదృక్పధం అని నాకు అన్పించింది.

   ‘దమయంతి వెళ్ళిపోడానికి ఆమెని మాత్రమే బాధ్యురాలిని చెయ్యడం’…అంటున్నారు మీరు…వెళ్ళిపోవడం లో తప్పొప్పుల అంచనా వెయ్యలేదు..వెయ్యను కూడా..అందుకే ఎవరు బాధ్యులన్న ప్రశ్న అక్కడ నాకు ముఖ్యం కాదు.మగవాళ్ళు దుర్మార్గులైతేనే,నానా రకాలుగా పీడిస్తేనే స్త్రీలు హక్కుల్ని ఎస్సర్ట్ చేసుకోవాలనుకునే ధోరణి నుంచి స్త్రీవాదం ఇంకా బయటపడలేకపోతోంది…దమయంతి ఎందుకు వెళ్ళిపోయింది అన్నది రచయిత ఎక్కడా చెప్పలేదు…ఆ భర్త చాలా దుర్మార్గుడై చాలా వేధిస్తే వెళ్ళిపోయింది అనుకోవడం ద్వారా వెళ్ళిపోవడాన్ని సమర్ధించి మళ్ళీ నైతికతలోకే స్త్రీలను నెట్టివేస్తామా? ..అవేమీ లేకుండానే..తనకి బాగానచ్చిన వ్యక్తి కోసం,తన కలల జీవితం కోసం వెళ్లిపోయిందే అనుకోండి…అపుడు సమాజం ఎట్లా చూస్తుంది?మనమెట్లా చూడాలీ?

   పీడనని ఎదుర్కోవడం లోనే కాదు,తమ నిర్ణయాధికారాన్ని అమలు జరపడంలో కూడా స్త్రీల మీద వివక్ష, నియంత్రణ ఉంటుందన్నది కూడా ఈ కధ నిరూపించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s