హింస ఒక వ్యాపారం

 

Posted By భూమిక on September 3, 2012
మల్లీశ్వరి

అదొక ఇ.ఎన్‌.టి డాక్టర్‌ క్లినిక్‌. ఛాంబర్‌ బైట వరుసగా వేసిన కుర్చీల్లో కూర్చుని ఎదురు చూస్తున్నారు పేషెంట్లు. తమ వంతు రాగానే లేచారు ఒక యువజంట. అబ్బాయి తలుపు దగ్గరే ఆగి ”మే ఐ కమిన్‌ డాక్టర్‌?” అలవాటయిన సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనలిజంతో చిన్న నవ్వుని జోడించి పొలయిట్‌గా అడిగాడు. పక్కనున్న అతని భార్య నవ్వుతూ నిలబడింది.
వారి విషెస్‌ అందుకుంటూ రమ్మన్నట్లు చూసింది డాక్టర్‌. పేషెంట్‌ ఎవరన్నట్లు యిద్దరి వైపూ ప్రశ్నార్థకంగా చూడగానే అప్పటివరకూ చున్నీతో ఎడం చెంపని కవర్‌ చేసుకుంటూ ఉన్న అమ్మాయి చున్నీ తీసింది. బూరెలా వాచిపోయిన బుగ్గని చూపించి.. ” చెవి నొప్పి కూడా… చాలా సివియర్‌గా ఉంది..” నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది.
చూడగానే చాలామట్టుకు అర్థమయింది డాక్టర్‌కి.

”దెబ్బేవన్నా తగిలిందా?..” కరుకుగానే అడిగింది డాక్టర్‌. సాఫ్ట్‌వేర్‌ యువజంట మొహమొహాలు చూసుకున్నారు. మొహంలోంచి ఎగిరి పోతున్న నవ్వుల్ని బలవంతానా ఆపుకుంటున్నారు.
”దెబ్బ ఏం కాదండీ! మొన్న నేనూ తనూ కబుర్లు చెప్పుకుంటుంటే మాటల మధ్యలో తను వూరికే… సరదాగా… చెంప మీద యిట్లా అనగానే…” సిగ్గుపడుతూ నవ్వబోతూ ఆ అమ్మాయి చెపుతుండగానే డాక్టర్‌ స్కానింగ్‌ తీసి చూపిస్తూ… ఊరికే.. యిట్లా అంటేనే కర్ణబేరి యింత డామేజ్‌ అవుతుందా?” అబ్బాయిని సీరియస్‌గా చూసింది డాక్టర్‌.

మొన్నటి నుంచీ ఎంతమంది దగ్గర ఎన్నిసార్లు ఈ నొప్పినీ, ఈ అవమానాన్నీ దాచి పెట్టుకుంటూ వచ్చిందో డాక్టర్‌ కనిపెట్టేయగానే మొహం చేతుల్లో దాచుకుని ఒక్కసారిగా బావురుమంది అమ్మాయి. ”వారానికి రెండు మూడు యివే కేసులు… చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు… భార్యని కొట్టడమేంటి?… కొంచెం అటూయిటూ అయి నవరగంత మీద తగిలితే ప్రాణానికే ప్రమాదం యిట్లా అయితే పోలీసు రిపోర్టు యివ్వాల్సి ఉంటుంది.” గట్టిగా చీవాట్లు వేసింది డాక్టర్‌.

అబ్బాయి తలవంచుకున్నాడో  లేదో తెలీదు గానీ కుటుంబాల్లో ఎడతెగకుండా సాగుతున్న హింసకి ఎంత చదువుకున్నా ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా యింకా స్త్రీలు తలలు వంచుతూనే ఉన్నారు. రాన్రానూ సమాజంలో హింసపట్ల ఉదాసీనత, ఒప్పుదల పెరుగుతూ ఉంది. భౌతిక హింస ఎక్కడ జరిగినా, ఏ రూపంలో జరిగినా పిల్లలూ, స్త్రీలూ, దళితులూ, మైనార్టీ వర్గాలూ ముందుగా టార్గెట్‌ అవుతారు. గుర్తించవలసిన యింకో అంశం ఉంది. గృహ హింసకి పాల్పడిన వారిలో ఆపని తప్పనీ, బైటకి తెలిస్తే  చెడ్డగా చూడబడతామన్న సామాజిక భయమూ ఉంటుంది. అంత మాత్రానా అది ఉద్వేగాల పరిధిలోని చిన్న నేరమని గానీ సర్దుకుపోవచ్చుననీ చెప్పడం యిక్కడ ఉద్దేశం కాదు. చెంపదెబ్బల నుంచీ ప్రాణాలు తీసేవరకూ కుటుంబాల్లో హింసాపర్వం శతాబ్దాల తరబడీ సాగుతూనే ఉంది.

అయితే ఇపుడు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న మరో విషయం సమాజంలో బాహటంగా జరుగుతున్న హింస. దానికి నిశ్శబ్దంగా లభిస్తున్న అంగీకారం… అది గౌహతిలో పదిహేనేళ్ళ పిల్లమీద జరిగిన దాడి కావొచ్చు, లక్ష్మింపేటలో దళితుల్ని ఊచకోత కోయడం కావొచ్చు. ఉద్రేకంతోనో, కుట్రపూరితంగానో సమూహం ఒక వ్యక్తిని గానీ, సమూహం మరొక సమూహాన్ని గానీ హింసకి గురి చేయడం లోని అమానవీయతకి రకరకాల ఆధిపత్యాలు మూలం. కుల, మతాధిక్య, పితృస్వామిక స్వభావం ఉన్న సమాజానికి మంచీ చెడూ చెప్పాల్సిన ప్రభావ వర్గాలదీ అదే తోవ.

పాతిక ముప్పయ్యేళ్ళ కిందట జాతీయ వార్తాపత్రికలు విధిగా ఒక నియమం పాటించేవి. హింసనీ, బీభత్సాన్నీ రేకెత్తించే ఫోటోలను గానీ, వార్తలను గానీ మొదటి పేజీలో వేసేవారు కాదు. తర్వాతి పేజీలలోనైనా సమాచారం విశ్లేషణా ఎంత వరకూ అవసరమో అంతే తప్ప పాఠకులను భయకంపితులను చేసే ధోరణి ఉండేది కాదు.

కానీ యిపుడు ప్రింట్‌ మీడియా కూడా ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రభావానికి లోనయింది. హత్య ఎలా జరిగిందో కళ్ళకి కట్టినట్టు చూపించే క్రైమ్‌ వాచ్‌ కార్యక్రమాలు, స్టింగ్‌ ఆపరేషన్ల పేరిట తప్పు చేసిన మనుషుల్ని, ముఖ్యంగా తప్పులు చేసే సామాన్యుల్ని పదిమంది కలిసి చావబాది ప్రాణాలు తీస్తుంటే వీడియో షూట్‌ చేసి బ్రేకింగ్‌ న్యూస్‌ ప్రచారం చేసే స్థాయికి మీడియా విలువలు పతనమయ్యాయి. మనిషిని వ్యాపార వస్తువు చేసిన ప్రపంచీకరణ దేనినీ వదలలేదు. చివరికి హింసకూడా వ్యాపారంగానే మారిపోయింది.

బలహీనులపై హింస వ్యవస్థీకృత స్థాయికి చేరుతున్న సమాజాల్లో దానిని నిరోధించడం వ్యవస్థల మౌలిక మార్పులలోనుంచే రావాలి. దానికి వ్యక్తుల్లో కొత్త సంస్కారం, సున్నితమయిన, తప్పనిసరిగా పాటించాల్సిన మానవీయ విలువల్ని బోధించే విద్య, వ్యక్తుల్ని ద్వేషించని సాహిత్యం, బాధ్యతగల మీడియా కూడా ఇపుడు చాలా అవసరం.

ప్రకటనలు

9 thoughts on “హింస ఒక వ్యాపారం

 1. @దానికి వ్యక్తుల్లో కొత్త సంస్కారం, సున్నితమయిన, తప్పనిసరిగా పాటించాల్సిన మానవీయ విలువల్ని బోధించే విద్య, వ్యక్తుల్ని ద్వేషించని సాహిత్యం, బాధ్యతగల మీడియా కూడా ఇపుడు చాలా అవసరం.

  విద్య, సాహిత్యంకి టీవి మీడియా పెద్ద అవరోధం అవుతాయేమో.
  మీడియా లో ఈ అంశాలను బోధించే టీవీ సీరియల్స్ ని మాత్రమె అనుమతిస్తే, మీరు ఆశించే విలువలు సమాజం లోకి వెళ్ళే అవకాసం ఉంది 🙂

  ఇవన్ని కాపోతే క్రిస్టియానిటీ ని బోధించినట్లు గా, ఈ సంస్కారం, సున్నితమయిన, తప్పనిసరిగా పాటించాల్సిన మానవీయ విలువల్ని బోధించే టీములు సమాజం లోకి రావాలి

  ఈ యోగా,ధ్యానం టీములున్నాయి కాని. వాళ్ళు చెప్పేది ఆత్మలు, జన్మలు, మోక్షం ,పాపాలు ఇలా నిద్రపుచ్చే సొద మాత్రమె. సత్యాన్ని తెలుసుకోడానికి ధ్యానం చెయ్యాలిట. ఆ సత్యం ఎలా ఉంటుందో చెప్పేవారికి అయినా తెలుసా.

 2. హ్మ్ వ్యంగం ఏమి లేదు జాజిమల్లి గారు ,

  క్రిష్టియానిటి బోధనా కార్యక్రమాల్లో శ్రద్ద బోధించే వారికి , వినే వారికి కూడా ఉన్నట్లు కనిపిస్తుంది నాకు. వారు ఎక్కువగా నమ్మి పాటిస్తారు కుడా. (ఆలోచిస్తే వాళ్ళు కూడా పరలోకం గట్రా అంటారు , అదే మన యోగా ధ్యాన కేంద్రాల్లో కూడా చెపుతున్నారు )

  ఈ సంస్కారం, సున్నితమయిన, తప్పనిసరిగా పాటించాల్సిన మానవీయ విలువల్ని బోధించే టీములు సమాజం లోకి రావాలి అంటే వారికి క్రిష్టియానిటిబోధించే వారికున్నంత నిబద్దత వనరులు ఉండాలి. చాలా కష్టం అని నా అభిప్రాయం.

  కాని మీఋ వ్రాసిన ఇలాంటి ఆర్టికల్స్ వల్ల ఆ దిశలో కొంత ప్రయోజనం చేకురినట్లే.

  • ఒక్క సారి నేను రాసిన టపా చదవండి… క్రైస్తవం ఎంత దారుణంగా ఉంటుందో మీకే తెలుస్తుంది… ఎవరో కొద్దిమంది చెసిన / చెస్తున్న తప్పులకి హిందూ మతాన్ని విమర్శించడం, యోగా క్లాసులు శుద్ధ దండగని అనుకోవడం సరికాదేమో ఆలోచించండి.. మంత్రాలకు చింతకాయలు రాలవు గానీ ప్రార్థనతో రోగాలు తగ్గిపోతాయా? http://saradaa.blogspot.in/2012/09/blog-post_15.html

   • జగదీశ్ గారు,

    నా వ్యాఖ్య లో హిందూ మతాన్ని ఎక్కడ విమర్శించాను అన్నది చెప్పగలరా ?
    అసలు హిందూమతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ?

    ఏమతం లోను ప్రార్ధన లతో రోగాలు తగ్గవు.

 3. ఇక్కడ మౌలి గారు మాట్లాడుతున్నది క్రైస్తవ నీతి గురించేమో, మంత్రాలు & మహిమల గురించి కాదేమో.

  గతంలో నేనూ నాస్తిక ఉద్యమంలో పని చేశాను. ప్రార్ధనలతో రోగాలు తగ్గించగలిగే పాస్టర్‌లకి ఐదు లక్షలు బహుమతి ఇస్తామని చాలెంజ్ వేశాము. ఒక్క పాస్టర్ కూడా ప్రార్ధనలతో రోగాలు తగ్గించగల తన credentialsని నిరూపించుకోవడానికి ముందుకి రాలేదు. ప్రార్ధనలతో రోగాలు తగ్గిస్తాము, గ్రహ శాంతి పూజలు చెయ్యిస్తాము లాంటి ప్రకటనలు ఇచ్చేవాళ్ళతో వాదించడం అనవసరం. “నీకు మహిమల మీద నమ్మకం ఉంటే నువ్వు లైవ్ ఫ్యూజ్ బాక్స్‌లో చెయ్యి పెట్టి నీ మహిమల ద్వారా షాక్ కొట్టకుండా బయటపడు” అని చెప్పి వెళ్ళిపోవాలి కానీ వాళ్ళతో వాదనలు చేస్తే టైమ్ వేస్ట్.

 4. జాజిమల్లి గారికి,
  హింస ఎక్కడైనా ఖండిన్చదగ్గదే.
  గృహ హింస కేవలం ఇండియాలోనే లేదు , అది ప్రపంచమంతా ఉంది. ఇండియా లాంటి అక్షరాస్యత తక్కువున్న దేశాలలో ఇది ఎక్కువగా ఉంటుంది.
  చదువుకుంటే ఇటువంటి కేసెస్ తగ్గాలి, కాని మీరు చెప్పినదాన్నిబట్టి అదేమీ లేదని, ఇంకా ఎక్కువవుతుందని తెలుస్తుంది. ఈ మధ్యన పేపర్ల లో కూడా ఇవే ఎక్కువ చదువుతున్నాం.
  నా ఉద్దేశ్యం ప్రకారం, దానికి కారణం ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా యే కారణం కాకపోవచ్చు. మీడియా ప్రభావం కాదనలేము కాని మనం పుట్టి పెరిగిన వాతావరణం, పరిసరాల ప్రభావం, అన్నింటికీ మించి చదువు.
  నైతిక విలువల తో కూడిన చదువు ఈ రోజుల్లో ఎవరు బోధిస్తున్నారు. బయట పదిహేను సంవత్సరాల పిల్లలు వాడే భాష ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.
  కర్ణుడి చావుకి లక్ష కారనాలున్నట్టు, మన వ్యవస్థ లో ఎన్నో లోపాలు, సామాజిక అంశాలకి మనం విచ్చే విలువ ఎంతో చెప్పక్కర్లేదు.
  కుటుంభ వ్యవస్థ రోజు రోజుకి చిన్నదయి పోతుంది. తప్పొప్పులు చెప్పేవాళ్ళు ఉండటం లేదు. మానవ సంబందాల గురించి , మనుషులకి ఇచ్చే గౌరం గురించి ఈ రోజుల్లో ఎంత మంది పిల్లలు నేర్చుకున్తున్నారో ఎవరు చెప్పలేరు.
  మన విద్యా వ్యవస్థ లో , సున్నితమైన అంశాలు బోధించేవి ఉండవు, ఎంతసేపు ఏ ప్రశ్న కి ఎన్ని మార్కులో తప్ప.
  దీనికి పరిష్కారం గురించి ఆలోచిస్తే ఎన్నెన్నో కనపడుతున్నాయి లోపాలు, విద్య వ్యవస్థ, తల్లితండ్రుల ఆలోచన దోరణి, పరిసరాలు , మనుషులలో బాధ్యతా రాహిత్యం, జనాభా పెరుగుదల.
  చూద్దాం, ఇంతకు ముందుతో పోల్చితే చాల విషయాలలో కొంత progress కనిపిస్తుంది , వచ్చే కాలం లో significant గా తగ్గుతుందని ఆశిద్దాం.
  ఇది కేవలం హిందూ మతానికి సంభందించిందో , క్రిష్టియానిటి కి సంబంచిందో కాదు. మతం తో సంబంధం లేకుండా అన్ని దేశాలలో అన్ని మతాలలో కనిపించే దురాచారాలు కొన్ని ఉన్నాయి, ఇది కుడా ఆ కోవలోకే వస్తుంది.
  ఇది మతం తో ముడిపెట్టేవాల్లకి మనమేమి చెప్పలేం, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. క్రిష్టియానిటి బలంగా ఉన్న అమెరికా లో , ప్రతి రోజు ముగ్గురు కన్నా ఎక్కువమంది చనిపోతున్నారు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ / భర్తల చేతుల్లో.
  బౌద్దమతం బలంగా ఉన్న చైనా లో ముప్పై శాతం ఫామిలీస్ లో ఇది ఉంది. అంతే కాదు అక్కడ ఒక famous saying ఉంది. నీ వైఫ్ ని మూడు రోజులకొకసారి కొట్టకపోతే , తను నీ మాట వినదు అని .

 5. స్త్రీ ఇప్పటికీ ఆర్థికంగా పురుషునిపైనే ఆధారపడి ఉంది. పల్లెటూరిలో స్త్రీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెయ్యించుకుంటానని అన్నప్పుడు ‘ఆ ఆపరేషన్ చెయ్యించుకుంటే నిన్ను వదిలేస్తాను‌’ అని భర్త బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. నలుగురైదుగురు పిల్లల్ని కంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. భర్త వదిలేస్తే ఆమె పూర్తిగా ఆర్థికంగా ఆధారం లేనిది అవుతుంది. పల్లెటూరి స్త్రీని అన్నిటి కంటే ఎక్కువగా ఆర్థిక అంశాలే ప్రభావితం చేస్తాయి. పట్టణాలలోని స్త్రీలు భర్త పెట్టే హింసల్ని ఎందుకు భరిస్తున్నారు అనే ప్రశ్న విషయానికి వద్దాం. పట్టణాలలోని స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు భర్త మీదే ఆర్థికంగా ఆధారపడి ఉండడం లేదు. అయినా భర్త పెట్టే హింసని ఎందుకు భరిస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది.

  విజయనగరం జిల్లాకి చెందిన ఒక అమ్మాయికి హైదరాబాద్‌లోని ఒక MNCలో యాభై వేలు జీతం వచ్చే ఉద్యోగం దొరికింది. అయినా ఆ అమ్మాయి తన భర్త తన కంటే ఎక్కువ చదువుకున్నవాడు & ఎక్కువ సంపాదించేవాడు అయ్యుండాలని అనుకుంటోంది. ఆమె తన కంటే ఎక్కువ జీతం సంపాదించేవాడే కావాలని అనుకుంటోందని తెలిసిన అబ్బాయిలు ఆమెకి పది లక్షలు కట్నం అడుగుతున్నారు. యాభై వేలు జీతం తీసుకుంటున్నా కూడా ఆమె తన భర్త తన కంటే ఎక్కువ సంపాదించేవాడు అయ్యుండాలని కోరుకుంటోందంటే అది డబ్బు ఉండి ఆర్థికంగా ఆధారపడాలనుకోవడం అవ్వదా? ఆడది ఏ పరిస్థితిలోనైనా భర్త మీదే ఆధారపడాలని అనుకుంటే ఆమెకి ఉద్యోగం ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని ఆమె బంధువులు అనుకుంటున్నారు. ఆమెకి ఉద్యోగం మానెయ్యమని కూడా సలహా ఇస్తున్నారు. పెద్దపెద్ద చదువులు చదువుకుని, రెండు చేతులా సంపాదిస్తూ కూడా భర్త మీద ఆధార పడి ఉంటే ‘ఆమె నా మీదే ఆధారపడి ఉంది కనుక ఆమెని నేను ఏమైనా చెయ్యొచ్చు‌’ అని ఆమె భర్త అనుకోడా?

 6. మాధ్యమాలు ఉన్న వ్యవస్థని మరింత కుళ్ళిపోయేలా చేస్తాయి కానీ మాధ్యమాల వల్ల వ్యవస్థ కొత్తగా కుళ్ళిఉపోదు. మా పిన్ని గారి అమ్మాయి వైజాగ్‌లోనే డెంటిస్ట్‌గా పని చేస్తోంది. ఆమెకి పల్లెటూరి నుంచి ఒక డాక్టర్ సంబంధం వచ్చింది. డాక్టరే అయినా అతను పల్లెటూరివాడు కావడం వల్ల అతన్ని వద్దన్నది. పట్టణంలో అయితే అతని కంటే డబ్బున్న డాక్టర్ దొరుకుతాడని ఆశ కూడా కావచ్చు. ఒక స్త్రీ డబ్బు కోసం ఇంత ఆశపడుతోందని తెలిసిన తరువాత ఆమె కంటే డబ్బున్నవాడు ఆమెని పెళ్ళి చేసుకోవడానికి కట్నం అడగడా? వరకట్న వేధింపుల వల్ల దారుణంగా కాలిన శరీరం యొక్క గాయాలని టివి చానెళ్ళు కళ్ళకి కట్టినట్టు చూపించడం వల్ల ఆ వేధింపులు కొత్తగా పెరగడం జరగకపోవచ్చు. అవి పెరిగినా అందులో మనలో ఉన్న భావజాలం యొక్క పాత్రే ఎక్కువగా ఉంటుంది కానీ టివి చానెల్‌ల ప్రభావం పెద్దగా ఉండదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s