రెండవ గిన్నె రాజకీయాలు

రెండవ గిన్నె రాజకీయాలు

Posted By on June 4, 2012

”నేనో అద్భుతమయిన స్త్రీని చూశాను.” ఈ మధ్య కలిసిన మిత్రుడొకరు కళ్ళని మెర్క్యురీ లైట్లలా వెలిగిస్తూ అన్నాడు. యిట్లాంటి సమాజాల్లోనూ అవలీలగా బతికేస్తూ, తన వంతుగా గుప్పెడు మల్లెల పరిమళాల్ని లోకానికి దానం చేసే ప్రతి స్త్రీ  అద్భుతమే కదా! యింకా కొత్తగా ఎవరి గురించి చెప్పబోతున్నాడీయన?
మగవాడు మెచ్చిన స్త్రీ అనేసరికి కసింత సందేహం వచ్చినా వెనక్కి నెట్టేసి ”ఎవరామె? చెప్పండి…” ఆసక్తిగా అడిగాను.
ఉత్సాహంగా మొదలు పెట్టాడు. ”గత పదేళ్ళుగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌తో నాకు స్నేహం వుంది. గొప్ప స్కాలర్‌ అతను. చాలా నేర్చుకున్నాను అతని వద్ద. ఈ మధ్య వ్యక్తిగత పరిచయం కూడా పెరిగి యింటికి కూడా రాకపోకలు పెరిగాయి. ఆయనెంత నిరాడంబరుడో అపుడే అర్థమయింది నాకు. ఆస్తి పాస్తులేం లేవు. యిల్లా… అయ్యవారి నట్టిల్లు… విద్యార్థులూ తన పరిశోధనలు యివే లోకం ఆయనకి. ఆయన భార్యే నేను చూసిన అద్భుతమయిన స్త్రీ.” ఒక్క క్షణం ఆగాడు. నేను మౌనంగా వింటున్నాను.
”వాళ్ళ పెళ్ళయి ముప్ఫయ్యేళ్ళపై మాటే. ఆయనకి రోజూ డ్రింక్‌ చేసే అలవాటుంది. దాంతో పొద్దున్న లేచేసరికి కడుపులో మంట… హేంగోవర్‌… అందుమూలంగా ఆమె ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేదంటే, ఆయన నిద్రలేచి తన పనులు చేసుకుని యూనివర్సిటీకి బయల్దేరే సమయానికి రెండు గిన్నెల్లో అన్నం కలిపేది. ఒక గిన్నెలో కూరన్నం, యింకో గిన్నెలో పెరుగన్నం…. ఆయన తన జీర్ణకోశం అనుమతించిన దాన్ని బట్టి ఏదొక గిన్నెలోనిది తిని యింకోటి వదిలేసేవాడు. యిట్లా ముప్ఫయ్యేళ్ళుగా క్రమం తప్పకుండా ఆయన ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధగా వుండేదని రిటైర్మెంట్‌ ఫంక్షన్లో చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు.” నాకు మొదట్లో కలిగిన సందేహాన్ని నిరాశపరచకుండా మైమరపుగా అన్నాడు మిత్రుడు.
ఇదన్నమాట అద్భుతమయిన స్త్రీత్వం అంటే !
”సరే… బానే వుంది, మరి రెండో గిన్నె సంగతేంటి?” అన్నాను.
”రెండో గిన్నె ఏంటి?” అయోమయంగా అన్నాడు.
మీ ప్రొఫెసర్‌ ముప్ఫయ్యేళ్ళుగా రెండు గిన్నెల్లో ఒకటి ఎంపిక చేసుకుని తిన్నాక, మిగిలిపోయిన రెండవ గిన్నెలో అన్నాన్ని యిష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఎవరు తిని వుంటారో వూహించ గలవా? ఆ రెండో గిన్నె రాజకీయం నీకు అర్థం కాలేదా?” అన్నాను.
మిత్రుడు షాక్‌ తిన్నట్టు అయిపోయి, అతను కనిపెట్టిన అద్భుతమయిన స్త్రీలో అద్భుతాన్ని నేను పేలప్పిండిలా ఎగరగొట్టేసినందుకు ఉక్రోషపడిపోయి ”ఫెమినిస్టులు యింతే! త్యాగం మంచితనం లాంటి గుణాలకి విలువ యివ్వను. పెడర్థాలు తీస్తారు….” అన్నాడు.
”అవున్లే! మీరిచ్చే బిరుదుల కోసం స్త్రీలు ఏళ్ళకేళ్ళు త్యాగాలు చేసుకుంటూ రావాలి కదా మరి.” అన్నాను. అట్లా ఆ వాదన ఖండాంతరాలు దాటింది.
ఇట్లాంటిదే మరో సంఘటన.
ఇటీవల స్పాట్‌ వాల్యుయేషన్‌లో యిద్దరు తెలుగు పి.జి. లెక్చరర్ల మధ్య జరిగిన సంభాషణ నాకు కొత్త అవగాహనని కలిగించింది.
”ఒకపుడు గొప్ప గొప్ప బ్రహ్మణ పండితులు, యితర అగ్రవర్ణాల వారూ చదివిన తెలుగు యిపుడు ఎస్‌.టి, ఎస్‌.సి, బి.సిలు చదువుతున్నారు. సమాజంలో బాగా మార్పు వచ్చింది. దళితులకి అవకాశాలు పెరిగాయి. యిది చదవొచ్చు, యిది చదవకూడదు అన్న నియంత్రణలేవీ లేవు” అన్నాడు ఒక లెక్చరర్‌.
అతని పరిశీలన అర్థ సత్యం. చాలా విశ్వవిద్యాలయాల్లో, పి.జి. సెంటర్లలోని తెలుగుశాఖల్లో యిపుడు ఎక్కువ మంది ఎస్‌.టిలు, తర్వాత స్థానంలో ఎస్‌.సిలు, కొందరు బి.సిలు, ఒకరో యిద్దరో ఎఫ్‌.సిలు చేరుతున్నారు. ఆ లెక్చరర్‌ చెప్పినట్టు నిజంగా సామాజిక న్యాయంలో భాగంగా యిదంతా జరుగుతోందా? దళితులకి అవకాశాలు పెరిగిపోయి గొప్పవారు కాబోతున్నారా? కానేకాదు.
వివక్షరూపం మార్చుకుని ఆర్థిక అంశాలని యిముడ్చుకుంది.
ఒకపుడు గొప్ప గౌరవాన్ని, ఉద్యోగావకాశాలనూ యిచ్చిన తెలుగు చదువు క్రమేణా ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. తెలుగు వెలుగుతున్నపుడు, ముందు వరుసలో అవకాశాలను అంది పుచ్చుకున్న అగ్రవర్ణాల వారు దానికి అవకాశాలు తగ్గడంలో వెలుగులో వున్న చదువుల వైపు తరలి పోయారు.
ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, మిగిలిపోయిన రెండో గిన్నె అవకాశాలను దళితులు వాడుకోవాల్సి వచ్చింది.
ఇప్పటికీ తినే తిండీ, చదివే చదువులో కూడా అడుగు బొడుగు అవకాశాలే స్త్రీలకీ, దళితులకీ దక్కుతుండటం నమ్మలేని ఒక వాస్తవం.

Share

Categories: లోగిలి

ప్రకటనలు

35 thoughts on “రెండవ గిన్నె రాజకీయాలు

 1. ఇలాంటి అంశాన్నే చాలా రోజుల క్రితం చంద్ర భాను ఒక వ్యాసం లో ప్రస్తావించారు . అగ్రవర్ణాలు ఆర్ట్స్ కోర్సులు చదువుకునే కాలం లో మేం (దళితులు) నిరక్షరాస్యులుగా ఉన్నాం .వాళ్ళు సయిన్స్ కు మారినప్పుడు మేం ఆర్ట్స్ కోర్సులు చదివాం. వాళ్ళు సైన్స్ నుంచి టెక్నాలేజీ కోర్సులకు బదిలీ అయినప్పుడు మే సయిన్స్ కు వచ్చాం అంటూఈ పరిస్థితి గురించి రాశారు

  • మురళిగారూ,
   మంచి విషయం గుర్తు చేసారు.నా వ్యాసంలో పరిస్తితి ప్రత్యక్షానుభవం లోంచి చూసేసరికి ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది…పైకి సాధారణంగా కనిపించే కొన్ని విషయాల (ముఖ్యంగా అణచివేత అస్తిత్వాల) వెనుక మనం ఊహించలేని వివక్షా కోణాలు దాగి ఉంటాయి…

  • మా నాన్నగారు చదువుకునే రోజులలో వాళ్ళ బడి పంతులు (స్కూల్ టీచర్) బ్రాహ్మణుడు, గ్రామస్తులు కొండ పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులు. ఇప్పుడు బాగా చదువుకున్న బ్రాహ్మణుడు మారుమూల గిరిజన గ్రామంలో బడి పంతులు ఉద్యోగం చెయ్యడానికి ముందుకి రాడులెండి. మా అమ్మగారి గ్రామంలోనూ అంతే. అప్పట్లో వాళ్ళ స్కూల్ టీచర్‌లు కరణం కులస్తులు, ఇప్పుడు ఆ గ్రామంలో స్కూల్ టీచర్‌లు కాపు కులస్తులు.

   • ప్రవీణ్ గారూ
    మీ వూరి పరిస్తితుల్లోంచి పరిశీలించి చెప్పారు కదా బావుంది.మాకూ కొత్త విషయాలు తెలిసాయి.ఇంతకీ ఏ జిల్లా ?ఏ గ్రామం?

   • మా అమ్మగారి ఊరు శ్రీకాకుళం జిల్లా వండువ గ్రామం. ప్రాథమిక విద్య వండువలో చదివారు, హై స్కూల్ చదువు బిటివాడలో చదివారు. వండువ, బిటివాడ గ్రామాలలో ఎక్కువ మంది కాపులు. వండువ గ్రామంలో కొంత మంది చేతివృత్తులవాళ్ళు, మాలవాళ్ళు కూడా ఉన్నారు. ఆ గ్రామంలో గిరిజన కుటుంబాలు మూడే ఉన్నాయి. మా నాన్నగారి ఊరు ఒరిస్సాలోని రాయగడ జిల్లా పిపిలిగూడ. ఆ గ్రామంలో దాదాపుగా అందరూ గిరిజనులే. ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం (రిటైర్డ్ టీచర్ కుటుంబం) & ఒక OBC కుటుంబం (రేషన్ డీలర్ కుటుంబం) కూడా ఉన్నాయి. అప్పట్లో టీచర్ ఉద్యోగాలు చేసినవాళ్ళలో ఎక్కువ మంది బ్రాహ్మణులు & కరణం కులస్తులు. ఈ స్టోరీ కూడా చదవండి: http://4proletarianrevolution.mlmedia.net.in/127822496 రెండో పేరాగ్రాఫ్ చదివితే అర్థమవుతుంది.

   • మీరిచ్చిన లింక్ లో ప్రస్తావించిన విషయాలు బావున్నాయి.విశేఖర్ గారి అభిప్రాయమే నాదీను…కాకపోతే ప్రస్తావించినపుడు ఆయా వ్యక్తుల గౌరవాలకి భంగం కలగకూడదు…పైగా చెప్పదలచుకున్న అంశానికి మనం చెప్పే వ్యతి గత ఉదాహరణల కన్నా వేరే బలమైనవి లేవూ అనుకుంటే అది వేరే విషయం.
    విశేఖర్ గారు చెప్పని మరో విషయం…బహుశా వ్యాసాన్ని ఆసక్తికరం చేయడానికి కూడా వ్యక్తిగత ఉదాహరణలు వాడతాము…కానీ వాడేప్పుడు సాధారణీకరించడమే మంచి వ్యాస లక్షణం.

 2. కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్య పరిచాయి.”ఇప్పటికీ తినే తిండీ, చదివే చదువులో కూడా అడుగు బొడుగు అవకాశాలే స్త్రీలకీ, దళితులకీ దక్కుతుండటం నమ్మలేని ఒక వాస్తవం.” నేననుకుంటూ ఉంటాను, డబ్బు లేక చదువుకోలేకపోవడం అనుకునే దాన్ని కాని.. ఇలా మీరన్నట్టు ఇప్పటికి అడుగు బొడుగు అవకాశాలు మాత్రమే స్త్రీలకీ, దళితులకీ దక్కుతున్నాయంటే నాకు నమ్మలేని వాస్తవం గానే కనిపిస్తుంది. కొంచెం వివరిస్తారా?

  • సింపుల్ గా కనిపిస్తోంది గానీ భలే చిక్కు ప్రశ్నలా అడిగారు శ్రీ….
   డబ్బు లేకపోవడం లోని మూలాలు,సమాజం తక్కువ కులాలుగా చూడబడడం లోని మూలాలు అన్ని రంగాల్లో దళితులు ఎందుకు అణచివేతకి గురవుతున్నారో మనకి ప్రాధమికమైన అవగాహన ఉంటుంది కదా శ్రీ…అట్లాగే స్త్రీలపట్ల కూడా…వాటి ప్రాతిపదికగా ఓపికుంటే మళ్ళీ ఒకసారి ఈ పోస్ట్ చదవండి.

 3. అద్బుతమైన స్త్రీ అంటే ఒక్క నిర్వచనం ఇవ్వమని సరదాగా అందరినీ అడగాలి అనిపిస్తుంది, మీ సంభాషణ చూసాక 🙂 ఈ పాటికి ప్రైవేటు గుంపుల్లో చర్చ మొదలయ్యే ఉంటుంది కూడా !!

  పొతే రెండవ భాగం గురించి – విద్యాహక్కు చట్టం మీరు ఆశించిన మార్పు తీసికొని రాగలదు కదా !

  • మౌళీ,
   మీకు భలే ఆలోచనలు వస్తాయి…నిజమే…అద్భుతమైన స్త్రీ అనగానే ఎవరి ఊహలు ఎలా ఉంటాయో కదా…మొత్తానికి పాతివ్రత్యాన్ని మీరిన నిర్వచనాలు అరుదుగానే దొరుకుతాయి.విద్యా హక్కు చట్టం అయినా మరొకటైనా చట్టాల ద్వారా మార్పు నేతి బీరకాయలో నేయి చందము.

  • విద్యా హక్కుల చట్టం 6-14 ఏళ్లకు మాత్రమె. ఎంత చక్కగా అమలు అయినా, ఈ చట్టం పరమావధి (the best case scenario) నిరక్షరాస్యత & బాల కార్మికుల నిర్మూలన దాటి వెళ్ళలేదు.

 4. మీరు చెప్పిన ఆ రెండో గిన్ని ఏ మాత్రం సరిపోదు. రిజర్వేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ కోర్స్ అయిన ఎంచుకునే అవకాసం ఉంది. నా ఉద్దేశ్యం లో విధ్యవకసలికి కులానికి సంబంధం లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు ప్రధాన పాత్ర పోషించే విషయం లో కుఅలం ఎందుకు వస్తుంది. ఇక పొతే మీరన్నట్టు ఆర్ట్స్ నుండి వేరే దానికి మారడానికి రీసన్ ఏంటో ఈజీ గ చెప్పచ్చు , ఎక్కడ పోటి తక్కువ ఉంటుందో అక్కడికే జనం వెళ్తారు, అంతే కాని వేరే రీఎసన్ ఏముంటుందో నాకు అర్ధం కావడం లేదు.

  // చాలా విశ్వవిద్యాలయాల్లో, పి.జి. సెంటర్లలోని తెలుగుశాఖల్లో యిపుడు ఎక్కువ మంది ఎస్‌.టిలు, తర్వాత స్థానంలో ఎస్‌.సిలు, కొందరు బి.సిలు, ఒకరో యిద్దరో ఎఫ్‌.సిలు చేరుతున్నారు. ఆ లెక్చరర్‌ చెప్పినట్టు నిజంగా సామాజిక న్యాయంలో భాగంగా యిదంతా జరుగుతోందా? దళితులకి అవకాశాలు పెరిగిపోయి గొప్పవారు కాబోతున్నారా? కానేకాదు. //

  ఈ వాక్యనకి ఆధారం చెప్పగలరా. ఒకవిషయం చెప్పండి, ఈ రోజుల్లో ఎంతమంది సైన్స్ వంటి కష్టమైనా రంగాల్ని ఎంచుకుంటున్నారు, ఎంతమంది అతి సులువు గ ఉండే కోర్స్ ని ఎంచుకుంటున్నారు.
  ఈ మధ్యనే చదివాను, మెడిసిన్ కి డిమాండ్ తగ్గుతుంది అని, ఎందుకంటే అది కష్టం మరియు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, అదే ఇంజనీరింగ్ అయితే తక్కువ టైం లో అయిపోతుంది మరియు ఈజీ గ జాబు దొరుకుతుంది.

  రెండో గిన్ని కి, ఆర్ట్స్ కి, సైన్స్ కి సంబంధం ఏముంది. ఎవరు వదిలేసారు ఆర్ట్స్ ని, ఆర్ట్స్ చదివితే జాబు వస్తుందా ? వచ్చినా ఎక్కువ జీతం ఇస్తార ? ఎవరైనా, ఎక్కడైనా ఇదే ఆలోచిస్తారు, అంతే కాదు పోటి ఎక్కువగా కూడా ఉంటుంది. అంతే కాని, అగ్రవర్ణాలు వదిలేసినా రెండో గిన్ని ఆర్ట్స్ఆ , ఆ రెండో గిన్నిని వెనకబడిన వర్గాలు వారు తీసుకుంటున్నార ?? ఎందుకు సర్, ఇటువంటి మాటలు. ప్రపంచం ఎంత ఎదుగుతున్న ఇంకా కులాన్ని పట్టుకుని వేలదతరెంటి సర్. ఎవ్వరూ ఎదీ వదిలేయారు, డబ్బుంటే.

  డబ్బు తప్ప ఇంక ఏది ప్రభావితం చేయదు దెనినీ , ముక్యంగా విద్యవిశాలలో డబ్బుతో పాటు పోటి పడే మనస్తత్వం కూడా ముక్యం, దానికి కులాన్ని అంతగంతకండి. ఈ దేశం లో వెనకబడిన వర్గాలకి ఉన్న ప్రధాన సమస్య వాళ్ళకి నాయకత్వం వహించే నాయకులే.

  • వెంకట గారూ,
   మీ వ్యాఖ్య లోని విషయాలను మీరు బలంగా నమ్ముతున్నారు కాబట్టి కుల సమస్య పట్ల మీరు అంత ఆవేదన చెందారు.అందులో నిజాయితీని గుర్తిస్తూనే….గుర్తించాల్సింది దాని వెనుక ఉండే ఆధిపత్య ధోరణిని…లోకమంతా కుల రహితంగా ఉండాలని అనుకోవడం మంచి ఆదర్శమే.అగ్రవర్ణాల వారికి అట్లా గొప్పగా ఉండగలిగే వెసులుబాటు ఉంటుంది.కానీ దళితులకి ఆ వెసులుబాటు లేదు.నిత్యం అనేకరూపాల్లో కులం వెంటాడుతుంది.కాబట్టి దళితులు మనం అవునన్నా కాదన్నా కులం లోంచే మాట్లాడతారు…అది కులాన్ని సమర్ధించడం కాదు.ఉనికిని నిలుపుకోవడం.
   దళితులవి రెండవ గిన్నె అవకాశాలు అని నేను గత ఇరవై ఏళ్లుగా ప్రత్యక్షానుభవం లోంచి తెలుగు చదువు అవకాశాలను ఆసక్తి గా ఫాలో అవుతూ వచ్చాను.ఆ అనుభవమే రాసాను.అది నిజమేనని పై వ్యాఖ్యలో మురళిగారు చంద్ర భాను ఏనాడో చెప్పిన ఇదే మాదిరి విశ్లేషణ గురించి ప్రస్తావించారు.ఆ లింక్ సంపాదించడానికి ప్రయత్నిస్తాను.
   మీ వ్యాఖ్యలో మీరు పదే పదే ప్రశ్నించిన ఆర్ధిక కోణం చాలా ముఖ్యమైనది.అట్లా మెరుగైన అవకాశాల కోసం అంచెలంచెలుగా తరలిపోయిన వాళ్ళలో ఎపుడూ అగ్రవర్ణాల వారే ఉండడం అనేక పరిశోధనలు,విశ్లేషణల్లో తేలిన వాస్తవం.
   వ్యాఖ్యలో రెండు మూడు సార్లు ‘సర్’ అంటూ సంబోధించారు.ఏం వెంకట గారూ!సర్ లు తప్ప స్త్రీలు ఇలాంటి విషయాలు మాట్లాడరని,మాట్లాడలేరని అంతర్గతంగా ఉన్న విశ్వాసమా?

   • ముందు గ మిమ్మల్ని సర్ అని అడ్రస్ చేసినందుకు క్షమించండి. నాకు మీరు స్త్రీ అని తెలియదు, కేవలం మీ పోస్ట్ చూసి నా అభిప్రాయం చెప్పాను. ఒకవేళ తెలిసి ఉంటె మేడం అని అడ్రస్ చేసేవాడిని.
    ఈ దేశం సామజిక సమస్యలని కేవలం కులం కోణంతోనే ఎందుకు చూస్తారో అర్ధం కావడం లేదు. ఏ సమస్యకైన డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది కాదనలేని నిజం. దాని తరువాతే కులం వస్తుంది. ఇది న వ్యక్తిగత అభిప్రాయం. ఆర్ధికంగా బలపడిన వాళ్ళు, ఏదైనా ఎంచుకునే స్వేచ్చ ఉంటుంది. వెనకబడిన వర్గాల వారిని ఆర్ధికంగా ముందుకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు ఏమి లేకుండా , ఏ విధమైన అవకాశాలు ఇవ్వకుండా , వాళ్ళని అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమో నాకు అర్ధం కావడం లేదు.

    ఇకపోతే మీరన్నట్టు అగ్రవర్ణాలు వదిలేసినా కోర్స్లు , వెనకబడిన వర్గాలు వారు తీసుకుంటున్నారు అని ప్రస్తావించారు. ప్రజలలో అక్షరాస్యత పెరిగింది , అక్షరాస్యత పెరిగి కొంత జ్ఞానం వచ్చినప్పుడు తనకి దగ్గరలో ఉన్న సులవైన మార్గాలు ఏమున్నాయో వెతుక్కుంటారు అది మాములు విషయమే. అల పోటి ఎక్కువైనప్పుడు అందుకో కొంతమంది పోటి లేని చోటికి వెళ్లడం కూడా మాములు విషయమే. (కాక పోతే ఇందులో ఆర్ధిక కోణం కూడా ఉన్నాది ).
    నా ఉద్దేశ్యం లో అవకాశాలు కల్పించలేని ఈ ప్రభుత్వం (ఆర్ధిక స్తోమత లేనివారికి ), అవకాశాలు కావలి అని అడగలేని జనం, ఇలా ఉన్నంతకాలం, ఈ వెనకబడిన వర్గాలు అనే వాళ్ళు ఎప్పుదూ ఉంటారు.

    నాకు మీ అంత అనుభవం లేదు కనుక నేను విస్త్రతంగా అలోచిన్చాలేకపోతున్నాను. నాకున్న పరిది లో నా అభిప్రాయాలని చెప్తున్నాను. కాని స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సారాలైన ఇంకా ఈ కులాలు మతాలూ మీద మన చర్చలు జరగడం దురదృష్టకరం. మనిషి కి అవసరమైన మౌలిక సౌకర్యాల మీద కన్నా ఈ కులాలు , మతాలూ మీద మనం మన చర్చలు కేంద్రీకృతమై ఉండటం
    నిజంగా తీవ్రంగా ఆలోచించవలసిన విషయమే.
    సాధ్యమైనంత వరకు నా సంబాషణలు లో దూషణ లు , పరుషమైన మాటలు లేకుండా జాగ్రత్త పడతాను. ఒకవేళ మీకు అటువంటివి ఎమన్నా ఉన్నట్టు అనిపిస్తే క్షమించండి.

   • మీరు కేవలం వర్గ దృష్టి తోనే చూస్తున్నారనిపిస్తోంది.వర్గాపోరాటంతో సమాంతరంగా కుల పోరాటం కూడా జరగాలనే కదా దళితుల సిద్ధాంతం…అవకాశాలు కావాలి అని జనం అడగడం లేదని ఎందుకనుకుంటున్నారు…?ఉద్యమాలే చేస్తుంటే…కాకపోతే అందరి మంచి కోసం కొందరే ఆ పోరాటాలు నడుపుతారు.మిగతావారు అనుసరిస్తారు.ఆర్ధిక సమస్యలు అత్యంత ప్రధానమే…మనుషుల ఆర్ధిక స్తితిగతుల్లో ఇన్ని ఎగుడు దిగుళ్ళు ఉండడానికి కుల వ్యవస్థ నిర్మాణం కూడా ప్రధాన కారణం.
    దూషణలు అవీ ఏవీ లేవండీ…కొంచెం ఆవేశంగా మాట్లాడినట్టు అన్పించినా ముచ్చటగానే ఫీలయ్యాను.

 5. చంద్రభాను గారు ఇంగ్లిష్ లో పయోనీర్ కు రాస్తారు . దాన్ని వార్త వాళ్ళు తెలుగులో అనువాదం చేసి ప్రచురించే వాళ్ళు . రెండేళ్ళ క్రితం చదివాను . దళితులు, స్త్రీల పట్ల వివక్ష అంత సులభంగా అర్థం కాదు లెండి . ఇంటర్ లో మెరిట్ స్కాలర్ షిప్ జాబితాలో మా పిల్లల కన్నా తక్కువ మార్కులు వచ్చిన పిల్లల పేర్లు చూసి … ఇది అన్యాయం కదూ అని పిల్లలు వాదించారు . చదువు విషయం లో అగ్రవర్ణం , దళితులు అనే తేడా ఏమిటి అని వాదించారు . కొద్ది సేపు మాట్లాడి .. తరువాత మా ఇంటికి దగ్గరగానే ఉన్న దళితులూ నివసించే గుడిసెల ప్రాంతాన్ని చూపించి అదిగో నీతో వాళ్ళు పోటీ పడాలి వారి పరిస్థితి చూసి వాదించు అని వివరించాను … చుక్క రామయ్య చెప్పిన ఓ విషయం పివి నరసింహ రావు విద్యా శాఖ మంత్రిగా ఉన్న కాలం లోనే గురుకుల స్కూల్స్, కాలేజిలు ప్రారంభించారు . ias, ips లా వంటి పోస్ట్ లు వీరికి దక్కాలంటే ముందు మంచి తిండి కావాలనే అనే వారట .. నాగార్జున సాగర్ లోని గురుకుల కాలేజి ద్వారా ఎంతో మంది ఎదిగారు కూడా .. ( ఎదిగిన వారు తోటి వారిని పట్టించుకుంటే మరింత సంతోషం ఆ ఇద్దరూ బ్రమ్హనులే … సమాజం గురించి తెలిసిన వాళ్ళు కాబట్టే అలా ఆలోచించారు

  • ”…కొద్ది సేపు మాట్లాడి .. తరువాత మా ఇంటికి దగ్గరగానే ఉన్న దళితులూ నివసించే గుడిసెల ప్రాంతాన్ని చూపించి అదిగో నీతో వాళ్ళు పోటీ పడాలి వారి పరిస్థితి చూసి వాదించు అని వివరించాను …”ఈ వాక్యాలు చదివి ఎంత ఆనందించానో…మురళి గారూ, గొప్ప గొప్ప యుద్ధాలు చేయక్కరలేదు.ఎంత సెన్సిబుల్ గా ఉన్న ఆచరణ మీది! చాలా సంతోషం.మీ అనుభవాలు పంచుకున్నందుకు.చంద్ర భాను బుక్స్ పేర్లు ఏవైనా చెప్పగలరా?వార్తలో అనువాదాలు వచ్చాయన్నారుగా వారిని కనుక్కుంటాను.

 6. ఏం వెంకట గారూ!సర్ లు తప్ప స్త్రీలు ఇలాంటి విషయాలు మాట్లాడరని,మాట్లాడలేరని అంతర్గతంగా ఉన్న విశ్వాసమా?
  ————————————————————————————————

  @ వెంకట

  “ముక్యంగా విద్యవిశాలలో డబ్బుతో పాటు పోటి పడే మనస్తత్వం కూడా ముక్యం, దానికి కులాన్ని అంతగంతకండి.”

  Ha ha ..ముందు తెలుగు నేర్చుకొని వచ్చి ఆవేశ పడు. లేకపోతె ఆవేశం గా వ్యాఖ్యలు వ్రాయడం మానెయ్యి 🙂

  • //ప్రౌడ్ హిందూ వెంకట్ అనే అజ్ఞాత బ్లాగుల మీద పడ్డాడు//
   ముందు అవతలి వాళ్ళని గౌరవించడం నేర్చుకో. yes. when I am talking about religious things, I am proud Hindu, for other issues I am just venkat. ఎక్కడ ఎలాంటి పేరు వాడుకోవాలో నాకు తెలుసు. ఇకపోతే తెలుగు అంటావ, పరవాలేదు, అది నా బుర్రలో తేడ కాదు, నేను వాడే keyboard , ఇంకా ఆ software.

   డియర్ మేడం. I am sorry to use your space. But I did not expect that you would allow such defamatory comments which are not at all related to our discussion.

   • మౌళీ కామెంట్ ని ఎడిట్ చేసి ఉండాల్సింది.కానీ మౌళీ ప్రగతిశీల భావజాలం పట్ల నాకు గౌరవం ఉంది.అందుకే తిరిగి మళ్ళీ చూడలేదు.మీ కామెంట్ ని కొంత ఎడిట్ చేసాను.ఇక దీని మీద దయ చేసి చర్చలు వద్దు.

 7. ఒక వ్యక్తీ అభివృద్ధి కి అతని కులం ఒక అడ్డం అవుతుందా ? ఆర్ధిక అంశాలు కాకుండా వేరే విషయాలు అతని అభివృద్ధి ని అడ్డుకుంటాయ ? నాకున్న పరిది లో నేను చూడలేదు. అందుకే అడుగుతున్నాను. దళితులూ అన్న పదం వాడటానికి నాకు మనసొప్పదు. అల address చేయడం వాళ్ళని అవమానిన్చినట్టని నా ఉద్దేశ్యం.
  ప్రతీ వ్యక్తీ ఏదో ఒక వర్గానకి support చేయలా ? న్యూట్రల్ గా ఉంటూ చెప్పే విషయాలకి ప్రాదాన్యత ఉండదా ?
  కుల వివక్ష తో కొంతమంది ని దూరం పెట్టడం చూసాను, అదే సమయం లో అదే కులం లో ఆర్ధికంగా బాగున్నా వాళ్లతో వ్యాపార లావాదేవీలు నడపడం చూసాను. అంటే ఇక్కడ ప్రాదాన్యత దేనికిచ్చినట్టు కులానిక , డబ్బుకా ? నాకు కుల వివక్ష తెలియదు, ఎందుకంటే నేను forward cast లోనే పుట్టాను.

  ఊరిలో కుల వివక్ష, ఊరు దాటితే ఆర్దిక వివక్ష, దేశం దాటితే వర్ణ వివక్ష , ఇలా ఎక్కడికెళ్ళిన ఏదో ఒక వివక్ష ఉంటూనే ఉండాలా ? ఇలా అయితే మనం ఏం చదువుకుంటున్నాం , ఏం నేర్చుకుంటున్నాం ?

  ఎక్కడ ఉంది లోపం, మన వ్యవస్త లోన ? మన విద్య విధానం లోన ?

  • వెంకట్ గారూ,
   మనుషులందరూ ఒకటే అని ఒకటిగానే ఉండాలని అనుకోవడం చాలా మంచి విషయం …కానీ అలా లేరన్నది వాస్తవం….ఆ వాస్తవాన్ని అతి చిన్న ఉదాహరణ ద్వారా మురళిగారి వ్యాఖ్యలో కూడా చూసాం.దళితుల వెనకబాటు తనానికి దళితులే ఎలా కారణమౌతారూ!!మన అన్ని సమస్యలకీ మనమే కారణాలు ఎట్లా కామో దళితులూ స్త్రీలూ మైనార్టీలూ కూడా అంతే…

 8. if you still think dalits are in a miserable state where they badly need sympathy of upper castes you are grossly mistaken.equal number of dalits are reading science and other technical subjects and are excelling.may be this is a flawed arguement to understate the achievements of dalits in subjects like telugu,social sciences and other creative aactivities like poetry,stories etc.
  so called liberal and progressive writers who romanticise poor and under privileged in their writings and make a career out of it,behave most cruelly when some one from those sections compete and surpass them.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s