విప్లవ,అస్తిత్వ ఉద్యమాలపై కె.క్యూబ్ వర్మ అభిప్రాయాలు.

 

  1 . నేటి సాహిత్య సందర్భాన్ని మీరెట్లా నిర్వచిస్తారు?

 2 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల మధ్యా, అస్తిత్వ ఉద్యమాల్లో వివిధ అస్తిత్వాల మధ్యా –ఐక్యత,ఘర్షణలు ఏ స్థాయిలో ఉన్నాయి?

3 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల విజయాలనూ వైఫల్యాలనూ తెలుగు సాహిత్య విమర్శ సమర్ధవంతంగా ప్రతిఫలించిందా?

 4 . విప్లవ సాహిత్యోద్యమానికి అనుబంధంగా విప్లవ సాహిత్య విమర్శ చెప్పుకోదగ్గ స్థాయిలోనే వచ్చింది.మరి వివిధ అస్తిత్వ ఉద్యమాలు సొంత సాహిత్య విమర్శను తగినంతగా అభివృద్ధి చేసుకోగలిగాయా?

 5 . విప్లవ ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని చెబుతాయి. అవి అభిప్రాయ భేదాల విషయంలో, విమర్శ విషయంలో ఎంతవరకు ప్రజాస్వామికంగా, సహనంగా ఉండగలిగాయి? ఉన్నాయి ?

6 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల ఉజ్జ్వల దశ కొనసాగుతోందా? ముగిసిందా?

 7 . విప్లవ సాహిత్యోద్యమం నుంచీ అస్తిత్వ ఉద్యమాల వరకూ అన్నింటినీ సమన్వయ పరిచే సమగ్ర ప్రగతి శీల దృక్పధం రూపొందవలసిన అవసరం ఉందా? అటువంటి అవకాశాలు ఉన్నాయా?లేదా ఇప్పటికే ఏర్పడిందా?

ఈ ప్రశ్నావళిని కొందరు తెలుగు బ్లాగర్స్ కి  పంపగా నలుగురు బ్లాగర్స్ స్పందించారు..వారికి నా కృతజ్ఞతలు. ఈ ప్రశ్నావళిని ఎవరైనా నింపి తమ అభిప్రాయాలను పంపవచ్చు.ప్రజాస్వామిక చర్చకి వీలుగా ఉన్న వాటిని బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను.

ఈ ప్రశ్నలకి  వ్యాసరూపంలో తన స్పందనని తెలియజేసిన సామాన్యుడు బ్లాగర్ కె.క్యూబ్ వర్మ గారికి కృతజ్ఞతలు. 

 

విప్లవ,అస్తిత్వ ఉద్యమాలపై కె.క్యూబ్ వర్మ అభిప్రాయాలు.

 

మీ ప్రశ్నావళి అంతటికీ విడి విడిగా జవాబిచ్చేంత సాహిత్య పరిజ్నానం నాకు లేదు. నాకున్న పరిమితులలో అనగా తెలిసిన విషయం పట్ల సమాధానం ఒక టూకీగా చెప్పే ప్రయత్నం మాత్రమే చేయగలను.

మారుతున్న ప్రపంచం పట్ల మనకున్న పరిమితులమేర స్పందించే విషయంలో తేడాలుంటున్నాయి. ఈ విషయం మనకు పరిమితులను విధిస్తుందన్నది నా నమ్మకం. మనమేర్పరచుకున్న మిత్ర బృందం, కుటుంబ సంబంధాలు, జీవన విధానం ఇవన్నీ మన ఆలోచనా స్రవంతిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యువకులుగా వున్న సమయంలో తన ఆలోచనలలోని వాడి, స్పందించే హృదయం ఆ తరువాత ఏర్పడే సంబంధాలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

 వ్యక్తిగా ఎదిగే క్రమంలో మారుతున్న తన అవసరాలు, మానసిక స్థితి వ్యక్తిపై ప్రభావాన్ని చూపించి అంతవరకు ఆలోచించిన విషయం పట్ల నిర్లిప్తతనేర్పరచి, ఇప్పుడే తనకు జ్నానోదయమైనట్లు, ఏదో పరిపూర్ణత పొందినట్లు సమస్యను వేరుగా చూస్తూ తప్పించుకుపోయే మార్గాన్వేషణలో తాను తన బృందంనుండి వేరుపడి, విశ్వశించిన దానిపట్ల వైముఖ్యాన్ని ఏర్పరచుకొని, కొత్త దారులు వెతుక్కుంటు ప్రధాన స్రవంతి నుండి వేరుపడతాడు.

దీనిద్వారా నే చెప్పదలచుకున్నది మిత్రులకు అర్థమయ్యే వుంటుంది. విప్లవం పట్ల నేడున్న వైముఖ్యం కారణం నియోలిబరలిజం ద్వారా యువతకు కొత్త మార్గాలు కనబడుతూ కెరీరిజం మోజులో పడి ఆ రోలర్ కింద నలిగిపోతున్న జనజీవనం పట్ల ఆసక్తి లేకుండా చేస్తూ, తాను ఎగురుతు అందుకోబోతున్న ద్రాక్ష తీయదనం పట్ల ఆశ చావక చివరికి నైరాశ్యానికి గురౌతున్న ఓ వర్గం తయారవుతోంది.

విప్లవ సాహిత్యం కూడా ఇప్పుడు యువతను ఆకర్షించలేకపోవడానికి ఇదే కారణం. ఏ కొద్దిమందిగానో మిగిలిపోవడం, రాసిన దానికి తమ జీవన మార్గానికి పొంతన లేకపోవడంతో దానిలోని వెలితి వలన ఎక్కడో గుండె గది ఖాళీగా మిగిలిపోతున్నది. సాహిత్యం పట్ల ఆసక్తిని మింగేస్తుంది. నయా ఎగువ మధ్య తరగతి శాతం సమాజంలో పెరిగిన దృష్ట్యా మారిన అవసరాలకనుగుణంగా ఎవరికివారు వెతుకులాడుతూ వెంపర్లాడుతూ తమ కాలికింద నేలను మింగేస్తున్న మట్టి కాళ్ళ మహారాక్షసిని గమనించలేకపోవడంతో ఈ స్తబ్ధత ఇంకా కొనసాగుతోంది.

 అస్తిత్వ పోరాట రూపాలవలన పూరింపబడ్డాయనుకున్న సామాజిక ఉద్యమాల ఖాళీలు మరింత ఎడమయ్యాయే తప్ప పునాది రాళ్ళలోని బీటలను కప్పే దిశగా సాగకపోవడం వెలితిగానే మిగిలింది. దీని ద్వారా ఎవరికి వారే తమ గొప్పతనాన్ని, తమ వ్యక్తిత్వ నిరూపణకు వెంపర్లాట తప్ప అసలు సమస్యను మరింత జఠిలం చేసాయి. ఏ పరిష్కారానికి తోవ లేక కూడలిలో ఒంటరిగా మిగిలిపోయాయి.

వీటి ద్వారా జరిగిన లాభం మాత్రం నావరకు సమస్యను మరింత గట్టిగా చెప్పగలగడం మాత్రమే. మునుపటికన్నా తమ పట్ల ఓ గౌరవాన్ని దక్కించుకో గలిగాయి. తద్వారా ఏర్పడ్డ ఉనికి నుండి మరల సంఘటిత శక్తిగా ఏర్పడి తిరిగి తమ చైతన్యాన్ని సామాజిక మార్పు దిశగా కృషి చేయాల్సిన అవసరం నేడున్నది. ఇది సాహిత్యంలో ప్రతిఫలించకపోవడం ఎవరి అస్తిత్వం బద్దలౌతుందోనన్న భయం కారణం కావచ్చు. లేక మారిన సామాజిక వెసులుబాటుతో ఎవరికి వారు తమ వృత్తాలలో భద్రంగా దాక్కునే ప్రయత్నంలో పడి తమ బాధ్యతను విస్మరించడం కావచ్చు.

 ఇక్కడ విప్లవ ఉద్యమ కర్తవ్యం కూడా వుంది. విప్లవోద్యమం తద్వారా వచ్చే సాహిత్యం ఈ ఖాళీలను పూరించగలిగే స్థాయిలో తనవంతు కృషిని చేయలేకపోవడం కూడా లోపమే. సమాజంలో ఏర్పడుతున్న ఉపరితలాంశాల పట్ల సరైన దృక్పధాన్ని కలిగి, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వ్యూహాత్మకంగా అమలు చేయగలిగే ప్రజాసంఘాలు తమ కర్తవ్యాన్ని విస్మరించడం కూడా దీనికి ఓ ప్రధాన కారణమై వుంటుందన్నది నా భావన.

ఇందులో నాయకత్వం వహించే ఉద్యమం కూడా బాధ్యత వహించాల్సి వుంటుంది. సరికొత్త సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో ఓ పక్క సైనికీకరించబడుతూ, సమాంతరంగా ప్రజాసంఘాలను సరైన దిశలో నడిపే కృషి జరగకపోవడం కూడా ఈ సామాజిక సంక్షోభానికి కారణం. ఇందులో నింద మోపే కనా ఎవరికి వారు వీటి పట్ల మోజు చూపకపోవడం, వైయక్తిక ప్రతిష్టలకు పోవడం కూడా కారణం.

దీని ద్వారా ఈ రెండు ఉద్యమాలు స్తబ్ధతకో, లేక ఫుల్ స్టాప్ కో గురయ్యాయన్న భావం మనల్ని వెంటాడుతుంది. నిజానికి గతంలో కంటే నేడున్న సందర్భం వీటి అవసరాన్ని మరింతగా కలిగి వుంది. విప్లవ సాహిత్య విమర్శ స్థాయికి విప్లవ సాహిత్యం చేరుకోలేదన్నది నా ఉద్దేశ్యం. విమర్శ ద్వారా వచ్చిన వెలుగు సాహిత్యంలో ప్రతిఫలించకపోవడం విప్లవ సాహిత్యం వైఫల్యం. దీనికి కారణం సంస్థలలో వున్న లోపం కూడా. కొత్తదనాన్ని వెతికే క్రమంలో తమ సభ్యుల ఆసక్తిని సరిగా గుర్తించక దూరం చేసుకున్నందువలన కూడా కావచ్చు. తద్వారా కొత్త నీరు రాకడ ఆగిపోయిందన్నది చేదు వాస్తవం.

సామాజిక సంక్షోభాలు, తద్వారా వాటి వలన ఏర్పడే వైయక్తిక మానసిక తీవ్రతలు, అలజడిని గుర్తించలేకపోవడం, దానికి తగ్గ ప్రత్యామ్నాయాలను చూపించగలిగే నాయకత్వం లేకపోవడం, దేనినైతే వ్యతిరేకించాలో దానికే దగ్గరైన నాయకత్వం, తద్వారా ఏర్పడ్డ మానసిక ఖాళీలు సాహిత్యంలో వెలితిని సృష్టించాయి. ఇది అటూ ఇటూగా అస్తిత్వ ఉద్యమాలలో కూడా వుంది. స్త్రీవాద, దళిత, ముస్లిం వాదాలలోని ప్రధమార్థంలోని తీవ్రత నేడు కనబడకపోవడానికి ఇదే కారణాలు వర్తిస్తాయి. చీలికలుగా మిగిలిపోతే సాధించేది ఏమీ వుండదన్న సత్యం నిరూపితమైంది.

 ఇదేదో గొప్ప భావ విప్లవానికి దారి తీసి పెను మార్పులు వస్తాయని ఆశించిన వారికి భంగపాటే మిగిలింది. రాజ్యం మరింతగా బలహీనమవుతున్న క్రమంలో అది మరింత నియంతగా మారుతూ వీటన్నింటినీ మింగేసే అనకొండలా తయారైన భయానక కాలమిది. ఈ సంక్షోభంనుండి మరల బయటకు రావాలంటే ఐక్య ఉద్యమాలే శరణ్యం. లేకపోతే ఇవేవీ అందని సామాన్య జనం మరింతగా నలిగిపోక తప్పదు. కావున ఈ దిశగా విప్లవ, అస్తిత్వ సాహిత్యోద్యమాలు తమ వంతు కృషిని చేయగలగాలి.

 నేడున్న కార్పొరేట్ పాలక వర్గం సమాజంలోని అసమానతలను, అనైక్యతను మరింతగా తవ్విపోస్తూ ఆ దిశగా సామాజికరంగంలో ఏర్పడుతున్న సంక్షోభాన్ని తన వృద్ధిరేటును పెంచుకోవడానికి ఉపయోగించుకోవడాని చేస్తున్న కృషి మనకెరుకలోనే వుందన్నది వాస్తవం కనుక ఈ సత్యాన్ని సాహిత్యం ద్వారా ప్రతిఫలిస్తూనే మేధావి వర్గం సరైన దిశగా మార్పునకు నాయకత్వం వహించాల్సిన అవసరముంది.

ఈ నా జవాబులో మీరాశించిన్నంత లోతు వుండకపోయుండొచ్చు. ఇది నా జ్నాన పరిమితులమేర రాసినది.

ప్రకటనలు

6 thoughts on “విప్లవ,అస్తిత్వ ఉద్యమాలపై కె.క్యూబ్ వర్మ అభిప్రాయాలు.

 1. మీ ప్రశ్నావళి అంతటికీ విడి విడిగా జవాబిచ్చేంత సాహిత్య పరిజ్నానం నాకు లేదు.అని అంటూనే వర్మ గారు కూలంకషంగా విశ్లేషణ కొన సాగించారు.అభినందనలు .వారన్న యీ పదాలు సమస్యపై వారి కున్న సంపూర్ణ అవగాహనను సూచిస్తాయి.
  ‘సాహిత్యంలో ప్రతిఫలించకపోవడం ఎవరి అస్తిత్వం బద్దలౌతుందోనన్న భయం కారణం కావచ్చు. లేక మారిన సామాజిక వెసులుబాటుతో ఎవరికి వారు తమ వృత్తాలలో భద్రంగా దాక్కునే ప్రయత్నంలో పడి తమ బాధ్యతను విస్మరించడం కావచ్చు’.
  ఒకప్పుడు సమాచారాన్ని వివిధ ప్రాంతాలకు ,వ్యక్తులకు చేరవేసే క్రమంలో ఒకరి నుండి ఒకరికి చేరవేయడం ద్వారా దేశం మొత్తం సమాచారం చేరి పోయేది .ప్రస్తుత సాంకేతిక యుగం . సమాచార విప్లవ యుగంగా వ్యవహరించ వచ్చు.క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగానే కాక ఇతర గ్రహాలకూ చేరవేయవచ్చు.
  యే సమస్య పైనైనా అందరూ బహిరంగంగా నిర్భీతిగా చర్చించేందుకు వాతావరణం ఏర్పడాలి.సమాజంలో వివిధ విషయాలపై సమస్యలపై పూర్తి రీతిన సుసంపన్నత పొందిన వివిధ మీడియాల ద్వారానే ఇది సాధ్యం. ఒకప్పుడు వుస్చ్చరించడానికి బెరుకు పడే స్థితినుండి ఎయిడ్స్ ,వ్యభిచారం ఇతర అనేక స్త్రీ సమస్యలగురించి ప్రతివక్కరూ బహిరంగంగా చర్చిన్చుకొంటున్నాము. కేవలం చర్చించుకొని వదిలేసినందువల్ల పరిష్కారం లభించదు. చర్చ పరిష్కారం దిశగా పయనించి పరిష్కారంతోనే ముగిసేలా మీడియా కృషి వుండాలి కేవలం లాభాపెక్షే కాకుండా సామాజిక ప్రయోజనాలకూ పెద్ద పీట వేయాలి. యువతను ఉత్తేజితుల్ని చేయాలి భావ వ్యక్తీకరణను ప్రోత్స్తహించాలి.
  చర్చ రసవత్తరంగా సాగుతోంది ప్రొసీడ్. అభినందనలతో శ్రేయోభిలాషి …నూతక్కి.

 2. విప్లవ,అస్తిత్వ.ఉద్యమాలపై ===ఇవన్నీ కొన్నాళ్ళు ఉండి సమసి ,,పొయేవి.సిద్ధంతీకరణ,సమర్థన, వీటితొనే సరిపుచుతున్నారు.దానికి బదులు మంచి కవిత్వం రాయడానికి ప్రయత్నం చెయ్యండి.నేటి కవుల రచనలలో కవిత్వం పాలు బాగా తక్కువగా ఉంది.పూర్వుల గొప్పకావ్యాలు అధ్యయనం చెయ్యండి.

  రమణారావు.

 3. @రమణారావు గారూ..కవిత్వం అయినా, కథైనా దాని పరమావధి ఆలోచింప జేసేదిగా వుండాలి కదా.. సాహిత్య ఉద్యమాలు సామాజిక ఉద్యమాలతో కలిసి జమిలిగా పయనిస్తాయి. సమాజాన్ని అద్దం పడతాయన్న విషయాన్ని మీకు చెప్పనక్కర్లేదు..
  ఇంగ్లీషు మీడియం చదువులతో ఇంక కొన్నాళ్ళు పోతే తెలుగులో కవిత్వం చదివే అవకాశమింక వుండదెవరికీ…(ఇది మరో అస్తిత్వం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s