విప్లవ,అస్తిత్వ ఉద్యమాలపై నిడదవోలు మాలతి అభిప్రాయాలు.

 

  1 . నేటి సాహిత్య సందర్భాన్ని మీరెట్లా నిర్వచిస్తారు?

 2 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల మధ్యా, అస్తిత్వ ఉద్యమాల్లో వివిధ అస్తిత్వాల మధ్యా –ఐక్యత,ఘర్షణలు ఏ స్థాయిలో ఉన్నాయి?

3 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల విజయాలనూ వైఫల్యాలనూ తెలుగు సాహిత్య విమర్శ సమర్ధవంతంగా ప్రతిఫలించిందా?

 4 . విప్లవ సాహిత్యోద్యమానికి అనుబంధంగా విప్లవ సాహిత్య విమర్శ చెప్పుకోదగ్గ స్థాయిలోనే వచ్చింది.మరి వివిధ అస్తిత్వ ఉద్యమాలు సొంత సాహిత్య విమర్శను తగినంతగా అభివృద్ధి చేసుకోగలిగాయా?

 5 . విప్లవ ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని చెబుతాయి. అవి అభిప్రాయ భేదాల విషయంలో, విమర్శ విషయంలో ఎంతవరకు ప్రజాస్వామికంగా, సహనంగా ఉండగలిగాయి? ఉన్నాయి ?

6 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల ఉజ్జ్వల దశ కొనసాగుతోందా? ముగిసిందా?

 7 . విప్లవ సాహిత్యోద్యమం నుంచీ అస్తిత్వ ఉద్యమాల వరకూ అన్నింటినీ సమన్వయ పరిచే సమగ్ర ప్రగతి శీల దృక్పధం రూపొందవలసిన అవసరం ఉందా? అటువంటి అవకాశాలు ఉన్నాయా?లేదా ఇప్పటికే ఏర్పడిందా?

ఈ ప్రశ్నావళిని కొందరు తెలుగు బ్లాగర్స్ కి  పంపగా నలుగురు బ్లాగర్స్ స్పందించారు..వారికి నా కృతజ్ఞతలు. ఈ ప్రశ్నావళిని ఎవరైనా నింపి తమ అభిప్రాయాలను పంపవచ్చు.ప్రజాస్వామిక చర్చకి వీలుగా ఉన్న వాటిని బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను.

అడిగిన వెంటనే తమ అభిప్రాయాలు మెయిల్ చేసిన తెలుగు తూలిక బ్లాగర్   నిడదవోలు మాలతి గారికి కృతజ్ఞతలు.

 

విప్లవ,అస్తిత్వ ఉద్యమాలపై నిడదవోలు మాలతి గారి అభిప్రాయాలు.

 

నేను మీప్రశ్నలకి సూటిగా సమాధానం ఇవ్వలేను. ఎందుకంటే నాకీ వాదాలు అర్ధం కావు, ఆస్థాయిలో నేను ఆలోచించనూ లేను. అంచేత స్థూలంగా వాదాలపేరుతో ఏం జరుగుతోందో, నాకు ఈ వాదనలమీద గౌరవం ఎందుకు లేదో చెప్తాను.

అనాదిగా సాహిత్యానికి రెండు శాఖలు ఉంటూనే ఉన్నాయి. ఒకశాఖలో సామాన్యజనులు తమ సుఖదుఃఖాలూ, అనుభవాలూ కథలలో పాటలలో సృష్టించి ఆనోటా ఆనోటా పాడుకుంటూ చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నారు. వాటినే మనం జానపద సాహిత్యం అంటున్నాం. నిజానికి లెక్కకి ఎక్కువమందిని ఆకట్టుకునేవి ఈకథలూ గేయాలూను. రెండో శాఖ పండితులు హర్షించేది. మేధకి సంబంధించినది. ఇది పూర్వం రాజసభల్లోనూ ఇతరత్రా తమ పాండిత్యాన్ని నిరూపించుకోడానికి రాసినవి. ఇవే ఈనాటి వాదనలకి మూలం అనుకుంటాను కొంతవరకూ.

 మరికొంత ఆంగ్లసాహిత్యంప్రభావం. సామాజికస్పృహ, సామాజికప్రయోజనం అనో మరోటో పేరయితే పెడుతున్నారు కానీ ఈరచనలూ, వాదనలూ కూడా మేధావులమధ్యనే ఉన్నాయి. ఉంటాయి. వీటికి అంతకంటే ప్రయోజనం నాకైతే కనిపించడంలేదు. వీటివల్ల సామాన్యమానవుడు ఎంతవరకూ ప్రయోజనం పొందుతున్నాడు అంటే నాదగ్గర సమాధానం లేదు.

 మరొక కోణం – సామాజిక ప్రయోజనంకోసం రాసినకథల్లో ఇతివృత్తాలు ఏమిటి? ఈనాటి ధనికులూ, రాజకీయనాయకులూ, భర్తలూ – ఎవరైనాగానీ స్థూలంగా అధికారం ఉన్నవాళ్ళు అది లేనివారిని, అర్భకులని బాధించడం. ఇది ఎందుకు జరుగుతోంది అంటే – ఒకొక మనిషిని విడిగా తీసి, కారణాలు వెతికినప్పుడు ఆమనిషి చిన్నతనంలో అనుభవించిన కష్టాలనో అలాటిదే మరొకటో చెప్తారు. అంటే ఈనాటి దుష్టులు దుష్టులు కావడానికి మనం కారణాలు చెప్పగలుగుతున్నాం. కానీ ఈనాటి పిల్లలు – రేపటి అధికారులు – అలా కాకుండా ఉండడానికి ఈనాటి సాహిత్యంలో మనం చేస్తున్నది చాలా చాలా తక్కువ.

ఎంచేతంటే ఈ వాదాల సుడిగుండంలో పడి గతాన్నీ ప్ర.స్తుతాన్నీ దుయ్యబట్టడమే జరుగుతోంది కానీ భవిష్యత్తులో మనిషి నీతిగా బతకడానికి ఇప్పటి పిల్లలని తయారు చేస్తున్నామా అంటే సాహిత్యంలో కనిపించడంలేదు. నిత్యజీవితంలో వ్యక్తివికాసంపేరున, success పేరున పిల్లలకి స్వోత్కర్ష నేర్పుతున్నారు. స్త్రీవాదం కానీ మరొకవాదం కానీ ఈనాటి భావిపౌరులని తీర్చిదిద్దే సాహిత్యం సృష్టిస్తున్నట్టు కనిపించడంలేదు. ఆతలుపు ఉన్నట్టే లేదు.

విమర్శలమాటకొస్తే 99 శాతం వ్యక్తిగతమే.. ఇక్కడ మళ్ళీ రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి – విమర్శకుడు చేతిలో ఉన్న పుస్తకమో కథో తీసుకుని అది చదివినప్పుడు తనకి కలిగిన స్పందనని వివరించడ. రెండోది – వ్యక్తిగతంగా ఆరచయితమీద గల గౌరవంతోనో అభిమానంతోనో తనఅబిప్రాయాలు చెప్పడం అంటే ఆరచయితకి ప్రోత్సహించడానికి మాత్రమే. అంతేకాదు విమర్శకులు ఆంగ్లసాహిత్యం చదివి ఆ ప్రమాణాలతో మన కథలని విమర్శించడం కూడా జరుగుతోంది. అంతేగానీ మన సంస్కృతీ, సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకుని, మన సాహిత్యం మనదేశంలో పుట్టింది, ఇక్కడ పుట్టిన పాఠకులకోణంనుండీ చూడాలి అన్న దృష్టి కనిపించడంలేదు.

 దీనికి మంచి ఉదాహరణ మనదేశంలో మౌఖికసాహిత్యం చాలా బలమైనది. ఆ సాహిత్యలక్షణాలు ఈనాటి తెలుగుకథల్లో కనిపిస్తున్నాయి. ఇవి ఆంగ్లసాహిత్యప్రభావంతో, వారికోణంలోనుండి విమర్శిస్తే, లోపాలుగానే కనబడతాయి. కానీ సామాన్యపాఠకులు వీటిని అభ్యంతరకరంగా తీసుకోరు. ఈవిషయంమీద చాలా రాయొచ్చు కానీ ప్రస్తుతానికి నేను చెప్పగలిగింది ఇంతే. తుదిమాటగా, రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చెప్తున్నాడు అన్నదానిమీద కంటే, ఏం చెప్పలేదు, ఎలా చెప్పాలి అన్నది విమర్శ అయిందీ నాడు. ఇది విచారకరమనే నేను అనుకుంటున్నాను.

నిడదవోలు మాలతి

 ఫిబ్రవరి

ప్రకటనలు

9 thoughts on “విప్లవ,అస్తిత్వ ఉద్యమాలపై నిడదవోలు మాలతి అభిప్రాయాలు.

 1. చదివేవాళ్లంతా పాఠకులు కానట్టే, రాసేవాళ్లంతా రచయితలూ కారు. మల్లీశ్వరి గారడిగిన ప్రశ్నలకు మాలతి గారి జవాబులు చదివితే నాకిలా అనిపించింది. అవి ఏ స్థాయిలో వున్నప్పటికీ వాదాలకి సంబంధించిన వాదనలమీద గౌరవం లేని మాలతిగారు మరెందుకు సమాధానాలు రాసినట్టో నాకైతే అర్థం కాలేదు. ఆ వాక్యంతో ఈ పరిపృచ్చ ఆగిపోతే బాగుండేది. అసలు సాహిత్య సృజన అంతా సుందర సుఖమయ భవితకే అన్న కీలక విషయాన్ని మర్చిపోయి, తనకు కొన్ని వర్గాల పట్ల, వాదాల పట్ల విన్న ప్రీకన్సీవ్డ్ నోషన్స్ తో అజ్నాన ప్రదర్శనకు పూనుకొన్నారు. మాలతిగారి రచనలపట్ల కొంత, సాహిత్యాని ఆమె చేస్తున్న సేవలపట్ల పూర్తి గౌరవం వున్నప్పటికీ ఈ ప్రశ్నలకిచ్చిన జవాబులతోనే పూర్తి అసంతృప్తితో వున్నా…

  • రవిగారూ,
   మాలతి గారి అభిప్రాయాల మీద మీరు ‘మాట్లాడితే’ బావుండేది.
   ఉద్యమాల పట్ల మీకున్న గౌరవాన్ని గురించి చెప్పి ఉన్నా బావుండేది.

  • “చదివేవాళ్లంతా పాఠకులు కానట్టే, రాసేవాళ్లంతా రచయితలూ కారు. ”
   -అంటే ఏమిటో, కొంచెం చెప్తారా? పాఠకులంటే చదివే వాళ్ళు కాక వేరెవరు? చదివేవాళ్ళని పాఠకులు అని కాక వేరే ఏమని అనాలి?

 2. మాలతి గారిచ్చిన స.ధా లు నాకు బాగా నచ్చాయి. వారు స్థూలంగా ఆడుగుతున్న మాట ఒక్కటే.. ఈ వాదాల వల్ల పేదలకి ఒరిగేదేమిటని? ఇది నా ఆక్రోశం కూడా.. నిజమే… పుంఖాలు పుంఖాలు రాసి భుజకీర్తులు తగిలినిచుకోవడం తప్ప ఈ వాదాల వల్ల ఒరిగే ఫలితం శూన్యం. నాలుగువెళ్ళు నోట్లోకివెళ్ళగలిగిన స్థితిలో ఉన్నవాడు ఊరకున్నఐదో వేలు సాయంతో ఆ వాదాలు రాస్తూ వల్లెవేస్తాడని నా అభిప్రాయం. మాలతి గారు చెప్పినవాటిలో కొన్ని ఆలోచనాత్మకమైనవి కొన్ని.

  #ఈరచనలూ, వాదనలూ కూడా మేధావులమధ్యనే ఉన్నాయి. ఉంటాయి. వీటికి అంతకంటే ప్రయోజనం నాకైతే కనిపించడంలేదు. వీటివల్ల సామాన్యమానవుడు ఎంతవరకూ ప్రయోజనం పొందుతున్నాడు

  # ఎంచేతంటే ఈ వాదాల సుడిగుండంలో పడి గతాన్నీ ప్ర.స్తుతాన్నీ దుయ్యబట్టడమే జరుగుతోంది కానీ భవిష్యత్తులో మనిషి నీతిగా బతకడానికి ఇప్పటి పిల్లలని తయారు చేస్తున్నామా అంటే సాహిత్యంలో కనిపించడంలేదు.

  # అంతేకాదు విమర్శకులు ఆంగ్లసాహిత్యం చదివి ఆ ప్రమాణాలతో మన కథలని విమర్శించడం కూడా జరుగుతోంది. అంతేగానీ మన సంస్కృతీ, సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకుని, మన సాహిత్యం మనదేశంలో పుట్టింది, ఇక్కడ పుట్టిన పాఠకులకోణంనుండీ చూడాలి అన్న దృష్టి కనిపించడంలేదు.

  # రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చెప్తున్నాడు అన్నదానిమీద కంటే, ఏం చెప్పలేదు, ఎలా చెప్పాలి అన్నది విమర్శ అయిందీ నాడు. ఇది విచారకరమనే నేను అనుకుంటున్నాను.

  పై వాటిని ఎవరికీ వారు సంధిచుకుంటే వాస్తవాలు పెల్లుబికుతాయోమో!

 3. @ దుప్పల రవికుమార్, మల్లీశ్వరి గారు దీన్ని చర్చ అన్నారు కనక సమాధానం ఇస్తున్నాను.
  నా అజ్ఞానప్రదర్శన (మీరనే అజ్నానం) సంగతి ముందు చెప్తాను. నిజానికి ఈవాక్యమే చాలు పండితులు ఎలా మాటాడతారో చెప్పడానికి.

  పోతే, నేను పండితురాలిని కానని వీలున్నప్పుడల్లా చెప్తూనే ఉన్నానండీ. మీరు ఇంటర్వూ అడిగినప్పుడు కూడా అలాగే మనవి చేసుకున్నాను. అంచేత ఇక్కడ నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా ఆ అజ్ఞానంలో, నా సాహితీవ్యక్తిత్వంలో భాగాలే. అవి బహాటంగా చెప్పుకోడానికి నాకేమీ అభ్యంతరం లేదు. మీకు ఆభాగం కూడా తెలిసినతరవాత మీరు ఎలాటి గౌరవం ఏర్పరుచుకుంటే అదే నిజమైన గౌరవం. లేకపోతే ఏవో భ్రమలు.

  ఇక అసలు విషయం – మళ్ళీ నాఅజ్ఞానంమూలంగా వచ్చినవే ఇంకా చాలామందికి కూడా ఉన్నాయి. అవి రాజేష్ జి ఎత్తి చూపేరు. మీరు వాటికి సమాధానాలు ఇస్తే మల్లీశ్వరిగారు కోరిన చర్చ వస్తుందనుకుంటాను.
  బహుశా మీకూ నాకూ తేడా కూడా అదేనేమో – మీరు పుస్తకాలు చదివి మాటాడతారు. నేను మనుషుల్ని చూసి మాటాడతాను.

  @ రాజేష్, జి. మీరు సరైన అభిప్రాయాలని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు..
  – మాలతి

 4. మీ మొదటి ప్రశ్న మాత్రమె అర్ధమయ్యి౦ది . చర్చలో కొ౦దరయినా తమ విలువైన అభిప్రాయాలు ప౦చుకొ౦టే మీ ప్రయత్నం సఫలమైనట్టే . రె౦డవ ప్రశ్న ను౦డి మీరు ఆసక్తి చూపిన విప్లవ,అస్తిత్వ ఉద్యమాల గురి౦చి లోతైన ప్రశ్నలు /ఆలోచనలు ను ము౦దు౦చారు .

  మీ స్థాయి వ్యక్తులు మాత్రమె వ్యాఖ్యాని౦చదగిన౦త క్లిష్టము గ ఉ౦ది అ౦టే మీరేమ౦టారు?

  • స్థాయిని ఎట్లా నిర్ణయిస్తాం మౌళీ?అది కాదు విషయం….కొన్నాళ్ళుగా నాలో ఉన్న ఈ సందేహాలను నాకు దొరికిన వేదికల మీద అడుగుతూనే ఉన్నా…ఇది కూడా అట్లాగే…
   ప్రశ్నలు లోతైనవే….సమాధానాలే దొరకడం లేదు…మాట్లాడగలిగినవారి మౌనంతో….

 5. పింగుబ్యాకు: ఉద్యమాలేం చేస్తాయి? (చర్చ) – తెలుగు తూలిక

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s