మర్లపోలమ్మ యుద్ధ జయకేతనం – ఉత్తరాంధ్ర మహిళ.

”ఆధునిక మహిళ చరిత్రని పునర్లిఖిస్తుంది” అని వందేళ్ళ కిందట గురజాడ అన్నాడు.ఆధునిక మహిళ అంటే ఎవరు? అన్న ప్రశ్న అపుడు బలంగా రాకపోయి ఉండొచ్చు.ఎందుకంటే వందేళ్ళ కిందట సమాజంలో వైరుధ్యాల మధ్య ఉండే విభజన రేఖని స్పష్టంగా గుర్తించడానికి వీలుండేది.కానీ వర్తమానంలో ఆ గుర్తింపు కష్టం.అస్తిత్వాలు,ఉప అస్తిత్వాల స్పృహ పెరిగిన కొద్దీ సంఘర్షణ స్వభావం సంక్లిష్టమౌతోంది.

ఇలాంటి సందర్భంలో ఏ మహిళ చరిత్ర గతిని మార్చే ఆధునిక స్వభావాన్ని కలిగి ఉంది అన్న చర్చ జరగాలి… ఆధునికత్వాన్ని స్వభావ వాచిగా తీసుకున్నట్లయితే వివక్షలపై అవగాహన, పోరాడాలనే స్పృహ,పోరాడే చైతన్యం కలిగి ఉండడం కూడా ఆధునికతలో భాగమే…ఆ రకంగా సమాజ స్వభావాన్ని ప్రభావం చేయగలిగిన రీతిలో పోరాటాలు చేస్తున్న ఉత్తరాంధ్ర శ్రామిక వర్గ స్త్రీలను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

 గత సంవత్సరం జూలై నెలలో సోంపేట కాల్పుల ఘటన తర్వాత అక్కడ వెల్లువెత్తిన ప్రజా చైతన్యం,ముఖ్యంగా మహిళా చైతన్యాన్ని చూసినపుడు భవిష్యత్తు పట్ల ఆశ కలిగింది.సగటు స్త్రీల నుంచి ఉత్తరాంధ్ర స్త్రీలను ప్రత్యేకించి చూపే ముఖ్య గుణం వారు తొంభై శాతం వరకూ శ్రామిక వర్గ మహిళలుగా ఉండడమే….ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది ప్రజలు భూమి,సముద్రం,అడవి ఆధారంగా చేసుకుని జీవిస్తున్న వాళ్ళే…జనాభాతో పాటు ఈ మూడు వనరుల ఆధారంగా జరిగే ఉత్పత్తి కూడా ఎన్నో రెట్లు పెరిగింది. ఈ మూడు రంగాల్లోని సంపద సృష్టిలో ఉత్తరాంధ్ర స్త్రీలకి ప్రముఖ పాత్ర ఉంటుంది…

1947 తర్వాత ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న పారిశ్రామికీకరణ మూలంగా వారి జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి.ప్రభుత్వాలు అబివృద్ధి అని చెప్పే పదం నిజంగా అభివృద్ధిని సూచించేది కాదని, ఏ అభివృద్ధి అయినా ప్రజల సంపూర్ణాంగీకారంతో జరగాలనీ,ప్రజలు వ్యతిరేకించే అభివృద్ధిని ప్రభుత్వాలు బలవంతంగా రుద్దుతున్నాయనీ,అది విధ్వంసానికి దారితీస్తోందన్న అవగాహన ప్రజల్లో కలిగాక ఉద్యమాలు మొదలయ్యాయి…

 అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని ఉత్తరాంధ్ర స్త్రీలూ తీవ్రంగా వ్యతిరేకించారు….గంగవరం పోర్టు నిర్మాణం మూలంగా తమ వృత్తులనూ ,భూములనూ పోగొట్టుకున్నపుడు,ఎస్.కోటలో జిందాల్ కంపెనీకి వ్యతిరేకంగా సాగుతున్న పోరులోనూ,సోంపేటలో థర్మల్ పవర్ ప్లాంట్ కి వ్యతికేకంగా నడుస్తున్న పోరాటంలోనూ ఉత్తరాంధ్ర శ్రామిక వర్గ స్త్రీలు నిర్ణయాత్మకంగానూ,వ్యూహాత్మకంగానూ వ్యవహరించారు.ఈ చైతన్యం వెనుక అనేక ఆర్ధిక రాజకీయ,సామాజిక కారణాలు ఉన్నాయి.

 ఉత్తరాంధ్రలో గ్రామీణ స్త్రీలు తమ జీవిక కోసం చేస్తున్న అనేక వృత్తులు అభివృద్ధి మూలంగా విధ్వంసానికి గురౌతాయి.జీడిపిక్కలు ఒలవడం,పళ్ళ వ్యాపారం,చేపల అమ్మకం,కాయగూరల పెంపకం/అమ్మకం,చిన్న హోటళ్ళ నిర్వహణ,పశుపోషణ,అటవీ ఉత్పత్తుల సేకరణ/అమ్మకం,కొండ ఉత్పత్తుల(కొండ చీపుళ్ళు మొదలైనవి)సేకరణ/అమ్మకం,వ్యవసాయం,వ్యవసాయాధారిత పనులు వీటన్నింటినీ ప్రత్యక్షంగా పరోక్షంగా స్త్రీలు కోల్పోవాల్సి వస్తుంది.

 దిగువ తరగతిలో కుటుంబాల బాధ్యత ప్రధానంగా స్త్రీలదే…తమ సాంప్రదాయ వృత్తుల్ని నమ్ముకుని ఇంకే ఆసరా లేకపోయినా కుటుంబాల్ని నెట్టుకొచ్చే స్త్రీలు, అవి కోల్పోవాల్సి వచ్చినపుడు…అభద్రతకి లోనవుతారు.అప్పటివరకూ తమకి తెసిన చోటులో,తెలిసిన పనుల్లో అంతో ఇంతో ఉందనుకునే సామాజిక భద్రత కూడా ఉండదని గ్రహింపుకి వచ్చినపుడు ఆందోళన చెందుతారు.

నిర్వాసిత కుటుంబాల మీద ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువ. ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం మీద కూడా పురుషుడి పెత్తనమే ఉంటుంది…ఆ రకంగానూ స్త్రీలకి ప్రత్యామ్నాయం కరువౌతుంది. అంతే కాకుండా నష్ట పరిహారం వచ్చిన తర్వాత స్త్రీలకి గృహ హింస పెరగడం,నిర్వాసితులైన స్త్రీలు వేరే ఆధారం లేక పడుపు వృత్తిలోకి దిగడం జరుగుతోందని అనేక సర్వేల మూలంగా తెలుస్తోంది. నష్ట పరిహారం భూముల్ని కోల్పోయిన వాళ్లకి తప్ప,భూముల మీద ఆధారపడిన ఇతర వృత్తుల వాళ్లకి కాక పోవడంతో తప్పనిసరై వలసలు వెళ్ళాల్సి వచ్చినపుడు కొత్త చోట్ల,కొత్త వృత్తుల్లో మళ్ళీ కొత్త నైపుణ్యాన్ని సంపాదించడం అంత సులభం కాదు.దీంతో మానసికంగా కూడా కుంగిపోవడం జరుగుతుంది.

 ఇక స్వదేశంలో విదేశాల్లాంటి సెజ్ ల్లో అమానవీయమైన పరిస్తితుల మధ్య స్త్రీలు పని చేస్తున్నారు.దోపిడీ వ్యవస్థ కొత్త రూపాలను గుర్తించే శక్తి లేకపోవడం మూలంగా పని చోట్ల మోసానికి గురైతున్నారు. ఇలాంటి చోట్ల స్త్రీలు అనార్గనైజ్ద్ సెక్టార్ ఉండడం మూలంగా తక్కువ వేతనాలు,కనీస సదుపాయాల కొరత,అమర్యాదగా వ్యవహరించడం లాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు. వీటితో పాటు వారికి ఇచ్చే పనులు అత్యంత జాగరూకతతో, ఎక్కువ శ్రద్ధ పెట్టి చేయాల్సి వచ్చే డైమండ్ కట్టింగ్ లాంటివి కావడంతో ఆరోగ్యమూ దెబ్బ తింటుంది.విశాఖలో బ్రాండిక్స్ లాంటి సెజ్ ల పని తీరు పట్ల ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి.

 ఇంత విధ్వంసకర వ్యూహంలో దేశమంతా చిక్కుకుని విలవిల్లాడుతున్నపుడు పోరాడి ఓడిన గంగవరం స్త్రీలూ,పోరాడుతున్న ఎస్.కోట,అరకు ప్రాంతాల స్త్రీలూ,పోరాడి గెలిచిన సోంపేట మహిళలూ,యావత్ మహిళా ప్రపంచానికే స్పూర్తినిస్తున్నారు.

 2010 జూలై లో రెండు సార్లు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తరుపున నిజ నిర్ధారణకు సోంపేట వెళ్ళినపుడు అక్కడి స్త్రీల పోరాట చైతన్యం చాలా భరోసాని ఇచ్చింది.అంత మంది మహిళలు సంఘటితం కావడానికి డ్వాక్రా సంఘాలు,పర్యావరణ,మత్స్యకార సంఘాలు చాలా కృషి చేసాయి.సోంపేట లో సంవత్సం పైగా నిరవధికంగా సాగుతుతున్న రిలే నిరాహార దీక్షల్లో రోజుకి ఒకో గ్రామం నుంచి ఒకో పొదుపు సంఘం మహిళలు పాల్గొంటున్నారు.ముఖ్యంగా మత్స్యకార మహిళలు 4000 ఎకరాల బీలని,సముద్ర తీర ప్రాంతాన్నీ కాలుష్యం నుంచి తప్పించడం ద్వారా తమ జీవనాధారాన్ని నిలబెట్టుకోడానికి ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదన్న తెగింపులో ఉన్నారు.

 అక్కడి స్త్రీలని కలిసినపుడు వారి భావోద్వేగాలు జానపద ప్రదర్సక కళల్ని తలపింపజేసాయి.వారి ఆవేశం,ఆక్రోశం,ఉద్వేగాలు,ఉద్రేకాలు,వ్యంగ్యం,నిష్కపటత్వం,పట్టుదల అసంకల్పితంగా కళాత్మకతని సంతరించుకోవడం కన్పించింది…పోలీసు కాల్పుల్లో మరణించిన గున్నా జోగారావుకి ప్రభుత్వం 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది.ఈ విషయం జోగారావు భార్య జగదాంబ వద్ద ప్రస్తావనకి వచ్చినపుడు,ఆమె ఉద్వేగంగా ”లచ్చలూ కోట్లూ నాతో మాటాడవు గదా నా పక్కన కూకోని నాకు కబుర్లు సెప్పవు గదా”అంది.

 పోలీసులూ, పవర్ ప్లాంట్ గూండాల దౌర్జన్యాన్ని ఎదిరిస్తామని చెపుతూ ”ఆళు మూడు వేల మంది వత్తే మావు ముప్ఫై వేల మంది ఒత్తాం ….ఆళు పొగ బాంబులేత్తే మాం బురద మట్టితో కప్పెడతాం…ఆళు అగ్గి బాంబులతో వత్తే… మాం పెట్రోల్ జల్లడానికైన సిద్ధం” అని మత్స్యకార మహిళ బట్టి మోయినమ్మ ఆవేశంగా అంది…పలాసపురం మహిళలయితే ”భుక్తికోసం భూమి కోసం నిలబడ్డామని మా మీద నక్సలైట్లని ముద్రేత్తే మరేటి సేస్తాం….మావు అదే అవుతాం.”అని తేల్చి చెప్పేశారు.

 పోలీసు కాల్పుల ఘటన రోజు భూమి పూజని ఆపడానికి గొల్ల గండి గ్రామం లోని స్త్రీలంతా వెళ్తున్నపుడు 85 ఏళ్ల రాజమ్మ కూడా వంగిన నడుముని నిటారు చేసి ధైర్యంగా ముందుండి వారిని నడిపించింది.రాజమ్మని కలిసినపుడు ఆమె తన చేతి కర్రని తిప్పుతూ, ఉద్రేకంగా అక్కడ జరిగినవి వివరిస్తుంటే…..ఉత్తరాంధ్ర పోరాట స్త్రీలకి ప్రతినిధిలా, ఏడుగురు రాజులతో పోరాడి గెలిచిన మర్ల పోలమ్మ యుద్ధ జయకేతనంలా కనిపించింది.

 ఈ రోజు…. సోంపేట ఘటన తర్వాత అభివృద్ధి విధ్వంసం లో చిక్కుకున్న మిగతా ప్రపంచం సోంపేట వైపు ఆశగా చూస్తోంది…ఇంతటి స్పూర్తిదాయమైన పోరాటం చేస్తున్న ఉత్తరాంధ్ర మహిళలకూ,యావత్ మహిళా లోకానికీ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవానికి వందేళ్ళు నిండుతున్న సందర్భంగా శుభాకాంక్షలు.

 (అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ‘వీక్షణం’ మాసపత్రిక లో ప్రచురింపబడింది)

ప్రకటనలు

8 thoughts on “మర్లపోలమ్మ యుద్ధ జయకేతనం – ఉత్తరాంధ్ర మహిళ.

 1. అభివృద్ధి తీసుకువచ్చే విధ్వంసం వల్ల బాధితులు ఎప్పుడూ బలహీనులే. సముద్ర తీరం లో వారు మత్స్యకారులు కావచ్చు. ఇంకో చోట అటవీ నిక్షేపాల సందర్భంలో వారు ఆదివాసులు కావచ్చు, పోలేపల్లి సెజ్ వంటి చోట్ల వారు దళితులు కావచ్చు. మత్స్యకారులు, ఆదివాసులు, దళితులూ- అన్న స్థూల వర్ణనలు కూడా పాక్షిక సత్యాలే. నిర్వాసితత్వం అందరికంటే ఎక్కువ బాధించేది, ఆయా సామాజిక శ్రేణులలోని స్త్రీలను. అందువల్లనే, వారి ఆగ్రహంలో అంతటి తెగింపు,తీవ్రత, ఆర్ద్రత కనిపిస్తాయి. ఆ వాస్తవాన్ని మీ పోస్టు సోదాహరణంగా సమర్ధంగా నిరూపించింది.

  • శ్రీనివాస్ గారూ,
   “మత్స్యకారులు, ఆదివాసులు, దళితులూ- అన్న స్థూల వర్ణనలు కూడా పాక్షిక సత్యాలే. నిర్వాసితత్వం అందరికంటే ఎక్కువ బాధించేది, ఆయా సామాజిక శ్రేణులలోని స్త్రీలను.”
   నా వ్యాస సారాంశాన్ని ఒక్క వాక్యంలో చక్కగా చెప్పారు.థాంక్ యూ…
   మౌళీ,
   అభివృద్ధి నిర్మాణమే పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం….అలాంటి నిర్మాణం లో నిర్వాసితులు భాగస్వాములైనంత మాత్రానా వారికి ఒరిగేది చాలా తక్కువ.

   • అదేన౦డీ,ఆ అభివృద్ధి నిర్మాణమే పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కాకు౦డా, సమాజ శ్రేయస్సు కోస౦ ఉ౦డేలా ప్రభుత్వ౦పై వత్తిడి ఉ౦డాలి.

    కాబట్టి ప్రజలు ప్రభుత్వ౦ పై ఈ విష్య౦ గా పెద్ద ఎత్తున, ప్రా౦తాలకు అతీత౦గా తిరుగుబాటు చెయ్యాలి. (అభివృద్ది కి వ్యతిరేక౦ గా పోరాట౦ చెయ్యడ౦ కన్నా ఇది మ౦చిది కదా).

    ప్రా౦తాలకతీత౦గా వుద్యమి౦చడ౦ వల్ల భవిష్యత్తు లో మిగతాప్రా౦తాలలో ఇటువ౦టి అన్యాయ౦ చెయ్యాల౦టే పెట్టుబడి దారులు, ప్రభుత్వ౦ ఆలోచిస్తాయి.

    ఈ పోరాట౦ కు విధ్యాధికులు, ఆర్ధిక వెసులుబాటు ఉన్న వారు ము౦దుకు రావాలి, రోజు కూలీ తో పొట్ట ని౦పుకొనేవారు కాదు.

    అ౦టే ఇప్పుడు కొద్దిమ౦ది సాయ౦ తో మీరు ఇస్తున్న ప్రోత్సాహ౦ పెద్ద ఎత్తున జరగాలి. అ౦దుకు అన్ని ప్రా౦తాల వారికినీ ముఖ్య౦గా గ్రామాల్లో నివసి౦చేవారికి కూడా అవగాహన కలిగి౦చాలి.

   • మౌళీ,
    ప్రభుత్వాలు అభివృద్ధి అని చెపుతూ థర్మల్ ప్లాంట్స్ నీ, సెజ్ లనూ…బలవంతంగా ప్రజల మీద రుద్దుతున్నపుడు తమది కాని అభివృద్ధిని తిరస్కరిస్తున్నారు తప్ప…మొత్తం అభివృద్ధిని కాదు…నూటికి ఎనభై శాతం పైగా ఉన్న ప్రజల నిజమైన అభివృద్ధి కోసం ఇటీవలి కాలం లో ప్రభుత్వాలు ఏ ప్రణాళికలు వేసాయి చెప్పండి….పారిశ్రామిక రంగాన్ని ప్రజల పరం చేయడానికి అందరినీ ఉద్యమించమని మీరంటున్నారు….దానికి ఓ సిద్ధాంతం ఉంది కదా ..అది మీరు అంగీకరిస్తారా?

 2. భాగస్వామ్య౦ అ౦టే నా ఉద్దేశ్య౦ నిర్వాసితులకు ఉద్యోగాలు కలిపి౦చాలి కొత్త ప్రాజెక్టు లలో అని.

  సిటీ లో ఒక అపార్ట్మె౦ట్ కోస౦ ఇల్లు అమ్మితే నే, వారికి డబ్బు తో పాటు ఫ్లాట్ కూడా వస్తు౦ది .మరి నిర్వాసితులకు నష్టపరిహార౦ తో పాటు మెరుగైన జీవనోపాధి చూపాలి కదా.

  ఏది ఏమయినా, ప్రమాద౦ వచ్చే వరకు కాకు౦డా అన్ని ప్రా౦తాలలో మహిళలు కు ఇటువ౦టి అ౦శాలపై అవగాహన కలిపి౦చడమ్ తప్పనిసరి.

 3. మీ వ్యాసం ఆలొచనాత్మకం గా వుంది. మీ వ్యాసం చదువుతుంటె అప్పుడెప్పుడొ చదివిన ఒల్గా కవిత
  గుర్తుకు వచ్చింది. భూమి కొల్పొయి, నిలువ నీడ కొల్పొయీ బాధ పడటం ఒక ఎత్తైతె మానసిక ఒంటరి తనం మరొక విషాదం. బావుంది

  వంశీ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s