క్షమించు శ్రీశ్రీ

ప్రజా కవి శ్రీశ్రీ నిన్న గొప్ప గొప్ప రచయితల చేతుల మీదుగా ప్రభుత్వం ఒడిలో ముద్దు బిడ్డ అయ్యాడు. కష్టజీవికి ఇరువైపులా నిలబడతానన్న శ్రీశ్రీ కి నిన్న పాలక వర్గము, సినిమా వర్గము రెండు వైపులా నిలబడి నలభై ఏళ్ల నాడు తమకి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకున్నాయి. 1970 లో ఏం జరిగింది? 1970 లో శ్రీశ్రీ షష్టి పూర్తి సందర్భంగా విశాఖలో జరిగిన సదస్సు లోనే “రచయితలారా మీరెటు వైపు ?” అంటూ మెడికల్ కాలేజ్ విద్యార్ధులు సృష్టించిన అలజడి చల్లార లేదు. తర్వాత మూడు నెలలకే హైదరాబాద్ లో సెవన్ స్టార్ సిండికేట్ అనే సంస్థ శ్రీశ్రీ షష్టి పూర్తి ఉత్సవాలు భారీగా జరపాలని అప్పటి ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఇంకా అనేక మంది మంత్రులు, సినిమా స్టార్లు పెద్ద పెద్ద రచయితల సమక్షంలో శ్రీశ్రీ కి సన్మానం, 5000 వేల రూపాయల మనీ పర్స్ బహుకరించాలని నిర్ణయించుకుంది. దీనికి శ్రీశ్రీ అంగీకరించడం పై తెలుగు సాహితీ లోకం రెండుగా విడిపోయి స్పందించింది.

సాహిత్యంలోను జీవితంలోనూ ఎప్పుడూ పీడిత వర్గం వైపే నిలబడిన శ్రీశ్రీ, పాలక వర్గం, పెట్టుబడిదారివర్గం చేసే సన్మానాన్ని అంగీకరించడం చాల మంది ప్రగతి శీల రచయితలను నొప్పించింది “కసాయి వాడు జీవ కారుణ్యం మీద సెమినార్ పెడితే భూతదయ కలవాళ్ళు ఉరకడమేనా?” అని కొడవటిగంటి కుటుంబరావు అభ్యంతరం తెలిపాడు. శ్రీ శ్రీ ఈ సన్మానం నిమిత్తం మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చాడు, కానీ ఆఖరి నిమిషం లో శ్రీశ్రీ అనేక మంది మనోభావాలను గౌరవించి సన్మానాన్ని తిరస్కరించాడు.

ఆ తిరస్కరణ తరువాతి తరాలకు శ్రీ శ్రీ అందించిన ఒక చారిత్రక స్పూర్తి . ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రయత్నాలకి ఆ రోజే తుది రూపం ఏర్పడి శ్రీశ్రీ అధ్యక్షునిగా విరసం ఆవిర్భవించింది. అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీశ్రీ “సాయుధ విప్లవ భీభత్సుని సారధినై భారత కురు క్షేత్రంలో నవయుగ భగవద్గీతా ఝంఝని ప్రసరిస్తాను మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తా” నన్నాడు ఈ చరిత్రను విస్మరించి మనసు ఫౌండేషన్ సంస్థ శ్రీశ్రీ సాహిత్య సంపుటులను ముఖ్యమంత్రి రోశయ్య చేత ఆవిష్కరింపజేయడం, చిరంజీవి అతిధి కావడం కేవలం యాదృచ్చికమేనా?

ఈ తంతుకి మనం నెత్తిన పెట్టుకుని గౌరవించే రచయితలందరూ పాలకవర్గం , పెట్టుబడిదారీ వర్గాల భుజాలు రాసుకునే అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోకుండా హాజరై అసలే అడుగంటి పోయిన ఉద్యమాల స్పూర్తిని మరి లేవకుండా నడ్డి విరక్కొట్టారు. నారాయణ వేణూ…..ఎవరో అన్నారని మీరన్నారు “శ్రీశ్రీ యూనివర్సలైజ్ అయ్యాడు కాబట్టి ఎవరి సభలు వాళ్ళు పెట్టుకుంటారని” దీంతో మీరు సమాధాన పడ్డారనుకోను గానీ ఇది ఇక్కడతో ఆగదు కదా రాజ్య హింసలో ఒకదానికొకటి తీసిపోని ఈ రాజకీయ పార్టీలు రేపు తమ పార్టీ ఎజండాల్లో శ్రీశ్రీ గీతాలు ఉటంకిస్తారు.. వ్యాపార వర్గాలు తమ ఎడ్వర్టైజ్ మెంట్స్ లోకి శ్రీశ్రీ లాక్కొస్తాయి . భవిష్యత్తరాలకు రంగులు పులమబడిన శ్రీశ్రీ ఆవిష్కరింపబడతాడు ఎందుకంటే శ్రీశ్రీ ఇపుడొక ఫేషన్ కదా ……….

ప్రకటనలు

17 thoughts on “క్షమించు శ్రీశ్రీ

 1. మీ ఆవేదనకు ఒకటే సమాధానం
  జమానా బదల్ గయా
  ఏ సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడేడో ఆ శక్తులచేతిలో ఓ మంచి వ్యాపార వస్తువుగా మారిపోయాడు చేగువెరా.

  గోరటి వెంకన్న పల్లెకన్నీరు పెడుతుందో అన్న పాటలో మొదట్లో వ్రాసుకొన్న “పెద్దబావి పొద్దంత నడుస్తుందో” అన్న వాక్యం తరువాత తరువాత “పెద్దబావికూడా నడుస్తలేదో … ” గా మార్చబడిందట….. కారణం……. కాలం మారింది.

  నా పుస్తకాలని పాఠకులు కొనుక్కొని ఉంటే “అంత పెద్ద చెక్కుముందు నేను మరుగుజ్జునై నిలబడకపోయేవాడిని కదా?” ….. అన్న నామిని ఆవేదనను ఎవరు అర్ధం చేసుకొన్నారు, విరుచుకుపడ్డవారే తప్ప…. ఆయన అలా ఎందుకు అనవలసివచ్చిందంటే కారణం కాలం మారింది.

  ఒక భావజాలాన్ని రచయితో/కవో నెత్తికెత్తుకొన్నంత మాత్రానా అతనికి ఈ భౌతిక ప్రపంచంలో తీర్చుకోవాల్సిన అవసరాలు ఉండవా? పెళ్లాంపిల్లల్ని పోషించాల్సిరావటం అనే బాధ్యత ఉండదా? అతని సర్వీసెస్ కు “పే” చేసేదెవరు?

  నిన్న సరోజా శ్రీశ్రీ ఇంటర్వ్యూలో అన్నది- శ్రీశ్రీ నిత్యం చదువుకుంటూనో రాసుకొంటూనో ఉండేవారట, గాలిలో చేతివేలితో ఎవేవో రాస్తూ ఉండేవాట్ట, ఒక్కోసారి అగ్గిపెట్టెపై తనకు తట్టిన ఆలోచనను రాసుకొనేవాడట, అర్ధరాత్రి హఠాత్తుగా నిద్రలోంచి లెగిసి కాగితం పెన్ను తీసుకొని రాయటం మొదలెట్టే వాడట – నిలువెల్లా ఇంత కవిత్వపిచ్చి ఎక్కిన ఒక మనిషికి ఈ సమాజం ఎంత “పే” చేసిందో ఎవరైనా ఆలోచించారా? బతికున్నంత కాలం దుర్భర దారిద్ర్యాన్నే అనుభవించాడు.

  రాజశేఖర్ రెడ్డి చనిపోయినపుడు, వేణుగోపాల్ వ్రాసిన ఓ వ్యాసం వివాదాస్పదమైంది. ఏ? వామపక్ష భావాలు కలిగిన ఒక రచయిత, ఒక వ్యక్తిగా రాజశేఖరరెడ్డిని మెచ్చుకొంటే తప్పేంటి? అది క్షమాపణలు చెప్పాల్సినంత నేరమా?

  శ్రీశ్రీ మహాప్రస్థానం రాసే సమయానికి మార్క్సిజం గురించి చదవనే లేదని ఆయనే చెప్పుకొన్నారు. శ్రీశ్రీ వామపక్ష కవిగా ఎంత సాహిత్యాన్నైతే సృష్టించాడో, అంతకన్నా ఎక్కువ సాహిత్యాన్ని మానవీయ కోణంలోనూ రాసాడు.
  వామపక్ష కవిగా ముద్రవేసి (దీన్ని శ్రీశ్రీ కూడా ఆమోదించాడు లెండి) ఆయనకు బతికుండగా తెలుగుపాఠకుlu ఎంత అన్యాయం చేసారో, ఇపుడు చచ్చాకా కూడా వదలకపోవటం అన్యాయం.

  శ్రీశ్రీని ఒక్క వామపక్ష కవిగా పరిగణించటం, అంబేద్కర్ ను ఒక్క దళితులకు మాత్రమే నాయకుడిగా పరిగణించటమంత పాపం.
  ఇప్పటికైనా తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీకి తగిన గౌరవం దక్కిందని ఆనందిద్దాం. శ్రీశ్రీ అందరికీ ఫాషన్ అయ్యాడని గర్విద్దాం.
  బొల్లోజు బాబా

 2. నాదిక్కడొక సందేహం…సందేహం మాత్రమే…
  ఆ సన్మానానికి శ్రీ శ్రీ భార్య సరోజా శ్రీ శ్రీ కూడా హాజరయ్యారు…శ్రీ శ్రీ కూతుళ్ళు శుభ్రం గా ఏదో పెట్టుబడి దారి సంస్థలలొ ఉద్యోగాలు చేసుకొంటున్నారు…అలానే కొడవటిగంటి కుటుంబ రావు గారి అరవై ఏళ్ళ పుత్రుడు అమెరికా లో కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు.కుటుంబ రావు గారు బతికి ఉండగానే ఆయన కుమారుడు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగి గా చేరారు. మనుమడు బహుళ జాతి సంస్థ లో ఇండియన్ సిలికాన్ వాలీ లో నౌకరీ చేసుకొంటున్నాడు. అదేం మంటే అది ఆ సంతానం యొక్క వ్యక్తి గతం అని తప్పించుకోజూస్తారు. వ్యక్తిగత విమర్శ వద్దంటారు, వ్యక్తికీ ఆ వ్యక్తి చేసే రచనలకీ ఏ మాత్రం సంబంధం లేనట్లు.
  తమ తమ సంతానాన్నే ప్రభావితం చేయలేని సిధ్ధాంత నిబధ్ధత ఎంతవరకూ సమాజాన్ని మారుస్తుంది. ఈ రచయితలూ కవులతో ప్రభావితమయ్యి తమ తమ బూర్జువా ఆశలను వదులుకొని తరువాత చాలా ఇబ్బందుల పాలయ్యారు కొంతమంది జనం. ఇంకొంతమంది ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఉరి తీయ బడ్డారు. అలాంటి ఒక వ్యక్తి కి అంకితమిస్తూ శ్రీ శ్రీ రాసిందే “ఊగ రా ఊగరా కవిత…”
  అది పొడిచేస్తాం ఇది పొడిచేస్తాం అంటూ కవిత్వం తోనో రచనల తోనో ఆవేశ కావేశాలు రెచ్చగొట్టినపుడు/భావోద్యుక్తులను చేసినప్పుడు దాని వల ఇతరులవ్యక్తిగత జీవితాలలో జరిగే విషాదాలకు ఆ రెచ్చగొట్టిన వారికి కొంతైనా భాగం ఉండదా? తెలంగాణ పోరాటం లో చేసుకొన్న ఆత్మ హత్యలకు కొంతైనా బాధ్యత టీ ఆర్ ఎస్ లాంటి పార్టీలకు ఉన్నట్లే, ఈ విషయం లోనూ ఉండాలి కదా…? శ్రీ శ్రీ కి ఉన్న నిజాయితీ రాజకీయులకు ఉండకపోవచ్చు. అది వేరే విషయం.
  శ్రీ శ్రీ గారే ప్రభుత్వం ఇచ్చే డబ్బుకు టెంప్ట్ అయ్యినప్పుడు ఇక సామాన్య మానవుడు ఎంత? తాను ఒక పక్క టెంప్ట్ అయ్యినప్పుడు జనాలను రెచ్చగొట్టే స్వరం లోకంటే, మనందరికీ ఈ ఈ బలహీనతలు ఉన్నాయి,వీటిని అధిగమించకపోతే మనకు ఉమ్మడి గా ఈ ప్రమాదం ఉంది అనే శ్రేయోభిలాషి స్వరం తో రాస్తే బాగుండేదేమో…?

 3. బొందలపాటి గారి వ్యాఖ్య బాగున్నది. సరిగ్గా చెప్పారు. ఏదో ఒక విధమైన ఆవేశంలో పడి కొట్టుకుపోయి అదే ప్రపంచం అని భావింఛినందువల్ల సామాన్య జనానికి ఒరిగేదేమీ లేదని చరిత్ర చెబుతోనేఉన్నది.

 4. బొల్లోజు బాబా గారూ,
  “రాజశేఖర్ రెడ్డి చనిపోయినపుడు, వేణుగోపాల్ వ్రాసిన ఓ వ్యాసం వివాదాస్పదమైంది. ఏ? వామపక్ష భావాలు కలిగిన ఒక రచయిత, ఒక వ్యక్తిగా రాజశేఖరరెడ్డిని మెచ్చుకొంటే తప్పేంటి?”

  ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికీ కీ, వామ పక్ష సిధ్ధాంతానికి వ్యతిరేకం గా అతను చేసే పనులకీ ఏ మాత్రం సంబంధం లేక పోతే మీరు చెప్పినది సరైనదే.

  ఒక భావజాలాన్ని రచయితో/కవో నెత్తికెత్తుకొన్నంత మాత్రానా అతనికి ఈ భౌతిక ప్రపంచంలో తీర్చుకోవాల్సిన అవసరాలు ఉండవా?

  అవసరాలు ఉన్నప్పుడు ఆ రచయిత యొక్క రచనలు ఈ అవసరాలని పరిగణన లోకి తీసుకొని రాసినవై ఉండాలి కదా…ఈ అవసరాలు ఉన్నప్పుడు తద్విరుధ్ధమైన భావాలని నెత్తికెత్తుకొనే ముందు కొంచెం ఆలోచించాలనుకొంటా..

 5. అంబేత్కర్ దళితులకు మాత్రమే నాయకుడు ఎందుకయ్యాడు? అందరికీ నాయకుడు ఎందుకు ఎదగలేకపోయాడు? ఇందులో పాపం/పుణ్యం ఏమిటి? దళితులే అతన్ని పుణ్యం చేసుకుంటున్నారా? మంచిదే కదా! దళితులకే ఒక్కడే లాయర్ అంబేత్కర్, తక్కినోళ్ళకు అలాంటి వాళ్ళకు లెక్కలేదు, అదీ కారణం అయుండవచ్చు.

  మహాకవి శ్రీశ్రీ గారికి వామపక్ష నాయకులనుంచి ఏమీ సహాయం అందలేదా? ఖరీదైన మద్యం, ఫారిన్ సిగరెట్లు తాగేవాడని విన్నాను .. అది నిజం కాదా?

 6. “భవిష్యత్తరాలకు రంగులు పులమబడిన శ్రీశ్రీ ఆవిష్కరింపబడతాడు”

  ఎవరెన్ని చెప్పినా …రెండోచివర ఉండే వారి విజ్ఞత మీదే ఆధారపడి ఉంటాయ్..నిజం తెలుసుకోవాలనుకునే వారికి దారి లేకపోలేదు.

 7. “సీ పీ ఐ” రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నారాయణ ను, “మీ అమ్మాయి అమెరికా లో చదువుతుంది కదా? మీరేమో అమెరికా వ్యతిరేకి..ఎల సమర్ధించుకొంటారు?”,అని అడిగాడు ఒక విలేకరి.
  దానికి ఆయన సమాధానం,” మా అమ్మాయి చదివే చదువు ఇండియా లో లేదు. మా పార్టీ అమెరికా ప్రజల కు వ్యతిరేకం కాదు..అమెరికా ప్రభుత్వ పాలసీ లకి అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్థ కి వ్యతిరేకం మేము”.

  ఇది పైపైనా చూస్తే కరక్టే అనిపిస్తుంది. కానీ అమెరికా యూనివర్సిటీలు అక్కడి పెట్టుబదిదారి కంపెనీల చేతా, ప్రభుత్వం చేత చాలా సంఘీభావాన్నే పొందుతాయి. అక్కడి కాపిటలిస్ట్ వ్యవస్థకు అవి మనుషులను సప్ప్లై చేస్తాయి. చదువు పూర్తయినాక అక్కడి విద్యార్ధులు చేరేది అక్కడి కాపిటలిస్ట్ కంపెనీ లలోనే. ఒక వేళ ఎవరైనా నారాయణ గారిని, “చదువైనాక మీ అమ్మాయి అమెరికన్ కాపిటలిస్ట్ కంపెనీ లో ఎందుకు ఉద్యోగం చేస్తోంది?” అని అడిగితే, ఆయన, “ఆ ఉద్యోగాలు ఇండియా లో లేవు” అని చెప్తారేమో. లేక పోతే ” అది మా అమ్మాయి వ్యక్తి గత ఇష్టం” అని తప్పించుకొంటారో?

 8. అందరికీ శకునం చెప్పే బల్లి తాను కుడితి తొట్టి లో పడిందట. కుటుంబ రావు గారే తరువాత తన తార నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వస్తే స్వీకరించారు. తరువాత ప్రభుత్వాన్ని ఆ నవలకు అవార్డు ఇచ్చినందుకు వ్యంగ్యం గా విమర్శించారు. అది వేరే సంగతి. కానీ డబ్బు అవసరం మహిమ అలాంటిది.
  ఇక ఆరుద్ర, శ్రీ శ్రీ ల జగ డాల్లోకి వెళ్తే చాలా లోపాలు బయట పడతాయి.

 9. బొందలపాటి గారి, బొల్లోజు బాబా గారి ల వ్యాఖ్యలు బాగున్నాయి.
  వెనకుండి, ముందుకు పదండీ, పదండీ అన్న వాళ్ళకి, ఆ ముందుకురికిన వాళ్ళ ఫలితానికి నైతిక భాధ్యత ఉంటుంది ఖశ్చితంగా. కాని అదే సమయంలో సంతానానికీ, ఆ నాయకులకీ ముడి పెట్టడం ఒక ఇమ్మెట్యూర్డ్ వాదన. అయితే దాంట్లో పాయింట్ లేకపోలేదు. తమ కుటుంబాన్ని మాత్రం సమాజం ఆఫర్ చేసే సేఫ్టీ నెట్ లో పెంచుతూ, అలాగే తను బోధించే, పిలుపునిచ్చే విధానాలకి వ్యతిరేకమయినా అవి ఫైనాన్షియల్ గా భద్రతని ఇస్తాయి కాబట్టి, తమ పిల్లల్ని మాత్రం కష్టపడి అటు వైపు పంపించడం పేరేంట్స్ గా అర్ధం చేసుకోవచ్చేమో కాని, ఈ నాయకులే బయటకు వెళ్ళి వ్యక్తిగతంగా పాటించే వాటికి వ్యతిరేకమయిన ఫిలాసఫీ చాటి చెపుతూ సమాజం లో ఒక సెక్షన్ ని వీళ్ళ ఫిలాసఫీ కోసం పీపుల్ ని మొబిలైజ్ చేయటం పక్కా హిపోక్రటికల్ అవుతుంది. ఆ హిపోక్రసీ యొక్క కాన్సీక్వెన్సెస్ ఒక్కో సారి చాలా భయంకరంగానూ, ప్రాణ నష్టం చేకూరేలానూ, మరికొన్ని సార్లు ఒక తరం మొత్తం తమ భవిష్యత్తుని పోగొట్టుకునేలా ఉంటాయి.

  ఎంత మంది నాయకులు సిన్సియర్ గా బాధపడి క్షమాపణలు చెప్పారు, వాళ్ళు లీడ్ చేసిన విధానాలు టోటల్ ఫెయిల్యూర్ అయ్యాయని ప్రూవ్ అయిన తరవాత!. ఎవరు తిరిగిస్తారు వీళ్ళ వెనక బ్లైండ్ గా ఫాలో అయిన జీవితాలని?

  బొల్లోజు బాబా గారు,

  మీరన్నారే, శ్రీ శ్రీ బతికున్నంత సేపూ దుర్భర దారిద్ర్యం అనుభవించారూ అని. సమాజం వాళ్ళ సర్వీసెస్ కి ఎవరు పే చేస్తారూ అని? మీరు మరచినట్లున్నారు. శ్రీ శ్రీ గారి సినిమా పాటలకి చేసిన సర్వీసెస్ కి ఆ ఇండస్ట్రీ బాగానే పే చేసిందని. అది ఆయన కాపాడుకోలేక పోయాడు .ఫైనాన్షియల్ డిసిప్లెన్ లేకపోవటం శ్రీ శ్రీ అసమర్ధత. నేను ఆయన అలవాట్లని విమర్శించట్లేదు. ఆల్కహాలిజం నీ, స్మోకింగ్ నీ, కొంత వరకీ స్త్రీ లోలత్వాన్నీ కూడా సానుభూతితో అర్ధం చేసుకోగలనేమో(ఒక రకమయిన ఎక్సెంట్రీటీ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ అవి), కానీ ఆయన ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ క్షమించ రానిది. ఊరికే సమాజాన్ని నిందించ కండి బాబా గారూ. సమాజం అంత చెడ్డది ఏమీ కాదు. ఆ సమాజమే లేకపోతే ఈ రోజు శ్రీ శ్రీ గురించి మాటలే వినపడేవి కాదు. ముఖ్యంగా ఆయన జీవిత కాలం భోదించిన ఫిలాసఫీకి ఈ రోజున స్థానం లేదని తెలిసిన తర్వాత కూడా ఈ సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఆయనకి ఇంత గౌరవాణ్ణి ఇచ్చింది కదా, దానికి కృతజ్ఞతలేవి?

  ఇహపోతే “చే” గురించి..నాకు నవ్వు జాలి వస్తుంది, ఆయన టీ షర్ట్ వేసుకుని తిరిగే పిల్లల్ని చూస్తుంటే, దే హావ్ నో ఐడియా హు హి వాజ్. ఆయన గురించి రాసే మిథికల్ గ్లరిఫికేషన్సే కాకుండా కొంచెం కోణం మార్చి చూస్తే తెలుస్తుంది ఆయనెలాంటి వాడో.

 10. కుమార్ గారికి
  శ్రీశ్రీ సినిమా గీతాలని సాహిత్యంగా శ్రీశ్రీయే పరిగణించలేదు. ఇండస్ట్రీ శ్రీ శ్రీ బలహీనతలను వాడుకొని ’ఫే” చెయ్యలేదనే సరోజతో సహా అందరి ఆరోపణానూ.
  నేనెక్కడా సమాజాన్ని నిందించలేదు. సమాజంలో కొంతమంది విమర్శకులు/పాఠకులు ఒక మంచి కవికి, మార్క్సిస్టు కవి అని ముద్రవేసి, ఆయనకు దక్కాల్సిన ఫలాలను దక్కకుండా చేసారు అనేదే నా అభియోగం. దానికి శ్రీశ్రీ ఆమోదం తెలపటం ఆనాటి కాలమాన పరిస్థితులో లేక ఆయన దురదృష్టమో కారణాలు. డబ్బయ్యిల నాటి అలాంటి ధోరణి ఇంకా బ్లాగుల్లో కూడా ఇలాంటి పోస్టు ద్వారా వ్యక్తమవటం ఆయన చచ్చాకా కూడా వదలరా అనిపించింది.
  శ్రీశ్రీ కి ఒక సార్వజనీన కవిగా ఎప్పుడో దక్కాల్సిన గౌరవం ఇప్పటికైనా దక్కిందని సంతోషాన్ని ప్రకటించానే. దాన్నే కాలం మారింది (మరో అర్ధంలో చెప్పాలంటే ఆ ఫిలాసఫీ రిలవెన్స్ కోల్పోయింది అని చెప్పటం) అన్నాను.
  అన్ని భాషల్లోను ఇరవయ్యోశతాబ్దాన్నంతటికీ ప్రాతినిధ్యం వహించే ఒకరో ఇద్దరో ఐకాన్ కవులుంటారు (తమిళ్ కు భారతీయార్ లాగ). తెలుగుకు ఎవరున్నారు. ఆ లోటు ఈనాటికి తీరటం, అదీ మనతరంలో జరగటం గర్వకారణమే.

 11. కుమార్ గారు,
  కొ. కు గారు ముందుండి నడిపించకపోవటంపై ఒక సమర్ధన చేశారు. ఆయన ఇప్పుడు లేరు కాబట్టీ విమర్శించటం సరి కాదేమో.
  ” కాపిటలిస్ట్ కంపెనీ లలో మానేజర్లు పని చేయరు…ఇతరుల చేత చేయిస్తారు.మేము కూడా అలానే ఇతరులకి స్పూర్తినిస్తాము”
  కమ్యూనిస్త్ సిధ్ధాంతాన్ని సమర్ధించుకోవటానికి కాపిటలిస్ట్ స్ట్రక్చర్ ని చూపించటం ఒక విషయమైతే,ఇంకొకటి ఏమిటమంటే,”మామూలు కంపెనీలలో చేసే పని లో లేబర్ రిస్క్ కీ విప్లవ పోరాటాలలో ఉండే రిస్క్ కీ పొంతన లేదు.

 12. మార్క్సే “ప్రపంచ కార్మికులారా ఏకంకండి. పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప” అన్నాడు. అంటే కార్మికులు ఇప్పటికే కష్టాలలోనే ఉన్నారు కాబట్టీ వారు తిరుబాటు లో చనిపోయినా పరవాలేదు. ప్రస్థుత స్థితి లో వారి ప్రాణాలకు పెద్ద విలువ లేదు. తను (మార్క్స్ ) మాత్రం ఒక మేధావి, పోరాటాలలోకి వెళ్తే, యూనివర్సిటీలలోనో, స్కాలర్ గానో తను పోగొట్టుకొనేది చాలా ఉంది.. కాబట్టీ తాను వాళ్ళళొ ఒకడు కాదు. తాను వాళ్ళలో ఒకడైతే, “ఏకమౌదాం” అనేవాడు. ఏకం కండి అనే వాడు కాదు.
  ఎదుటి వారు కష్టాలలో ఉంటే వారి కష్టాల పట్ల సానుభూతి చూపించటంలో తప్పు లేదు. కానీ “వారు పోరాటాలలోకి వెళ్ళాలా వద్దా, జీవితాన్ని ప్రమాదం లో పడేసుకోవాలా వద్దా” అనేవి వారు తీసుకోవలసిన నిర్ణయాలు. వాటి గురించి మార్క్స్ మహాశయుడు నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యం. కార్మికులు ప్రాణాలు పోగొట్టుకొవటానికి సిధ్ధం గా లేక పోతే ఏమి చేస్తాం? మనకి “వాళ్ళదేమి జీవితం రా”, అని జాలి కలిగినా, వాళ్ళ జీవితం వాళ్ళకి విలువైనది అవ్వవచ్చు. వాళ్ళ జీవితమ్మీద వాళ్ళకి జాలి లేక పోవచ్చు. ఏ సినిమా నటుడి కొ సాధారణ మధ్య తరగతి జీవిని చూసి, “ఇతనిదీ ఒక జీవితమేనా?”, అని జాలి కలగ వచ్చును. కానీ ఆ సదరు మధ్య తరగతి జీవికి తన మీద తనకి జాలేమీ లేక పోవచ్చును. కాబట్టీ లేని అసంతృప్తిని లేవగొట్టి జనాల బ్రతుకుని నరకం చేయటం ఎందుకు?

 13. శ్రీ బొల్లోజు బాబాగారు నుడివినట్లు,………..
  .”శ్రీశ్రీ మహాప్రస్థానం రాసే సమయానికి మార్క్సిజం గురించి చదవనే లేదని ఆయనే చెప్పుకొన్నారు. శ్రీశ్రీ వామపక్ష కవిగా ఎంత సాహిత్యాన్నైతే సృష్టించాడో, అంతకన్నా ఎక్కువ సాహిత్యాన్ని మానవీయ కోణంలోనూ రాసాడు. వామపక్ష కవిగా ముద్రవేసి (దీన్ని శ్రీశ్రీ కూడా ఆమోదించాడు లెండి) ఆయనకు బతికుండగా తెలుగుపాఠకుlu ఎంత అన్యాయం చేసారో, ఇపుడు చచ్చాకా కూడా వదలకపోవటం అన్యాయం.శ్రీశ్రీని ఒక్క వామపక్ష కవిగా పరిగణించటం, అంబేద్కర్ ను ఒక్క దళితులకు మాత్రమే నాయకుడిగా పరిగణించటమంత పాపం.ఇప్పటికైనా తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీకి తగిన గౌరవం దక్కిందని ఆనందిద్దాం. శ్రీశ్రీ అందరికీ ఫాషన్ అయ్యాడని గర్విద్దాం
  అవును. గళ్ళీ లీడరు దగ్గరనుంచి ,మంత్రివర్గ పీఠాలెక్కిన నిరక్షరాస్యులదాకా , …. శ్రీశ్రీ అన్న రెండు అక్షరాలను విడమరిచి చెప్పలేని వాడికి కూడా ఓ ఫాషనయ్యాడు శ్రీశ్రీ..
  ఇప్పుడు మనం మహాకవి… కీర్తిని…. చీల్చి చెండాడి పోస్ట్మార్టం చేసి ఆయన ఘనుడో కాదో తీర్మానం చేయవలసిన అవసరం లేదు . కాల పరీక్షలో
  ఆయన ధురీణత నెగ్గింది. తన సంతానాన్నో స్వంతవారినో రచనల ద్వారా ప్రభావితం చేయలేక పోయాడు, అట్టి వుధ్భోదలవల్ల సమాజానికేం లాభమన్న రీతిలో వాఖ్యలు చేయడం ,మిట్ట మధ్యాహ్న్నం సూర్యునిపై వుమ్మడం లాటిది.
  అవి ఆపేసి ప్రభుత్వం ప్రతిపాదించి రూపొందిస్తున్న విదేసీ ధనంతో గర్భసంచులద్వారా సంచులు నింపుకకోవాలనుకొనే గర్భసంచుల వ్యాపారం. గురించి చర్చించుకొంటే …యేమన్నా సమాజానికింత మేలు చేసిన వారవుతారు………………అభినందనలతో …..మనోహర్.

 14. శ్రీ శ్రీ ని యి చర్చకు సబ్జెక్ట్ చేసి “వుతికారేసేన్” అన్నట్లు పిండి కూడా ఆరేస్తున్నార!…సమసమాజపు సామాజిక సాహితీ వుద్దండులు కొందరు ?. చాల బాగుంది. అభినందలందించాలో, ఆక్రోశంతో ఆహారవాల్ చేయాలో, నిర్ఘాంతతో నిట్టూర్పులిడవాలో…….నూతక్కి రాఘవేంద్ర రావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s