ఒక స్నేహితురాలి పశ్చాత్తాపం

ప్రియమైన రమణీ……….. ఎలా వున్నావు? నాతో మాటలకి పది సార్లు ప్రయత్నించి విఫలమయి మూగవోయిన నిన్ను, ఇప్పుడిట్లా అర్ధరాత్రి పలకరించాలనిపించడం నాకే వింతగా వుంది. మరేం లేదు ఇంకా ఏ మూలో మిగిలున్న హృదయంతో వంద మిస్డ్ కాల్స్ మధ్య మిస్ చేసుకున్న నిన్నూ, బహుశా కోపంతోనో బాధతోనో దూరంగా ఉండిపోయిన నిన్నూ క్షమించమని అడగాలని వుంది . ఇంకా నీ చేయి పట్టుకుని మన బాల్యంలోకి పారిపోవాలని వుంది. నాపై నువ్వు నీపై నేను అల్లుకున్న కవితలు గుర్తు తెచ్చుకోవాలని వుంది “నీ పద మంజీర మృదుసవ్వడి నా చెవి సోకగ పులకించే నా మది …..”అంటూ తొమ్మిదో తరగతిలో నేను నీ గురించి చెప్పిన కవితకు మొన్నమొన్నటి వరకూ నవ్వుతూనే వున్నావుగా ….. ఆ నవ్వుల్ని ఓ సారి గుర్తు తెచ్చుకో……. లెక్కల క్లాసులో బిక్కమొహం వేసే నన్ను ఓదారుస్తూ , “కాంపోజిట్ లెక్కలు కంపు , జనరల్ లెక్కలు జిడ్డు” అంటూ నాకు నచ్చని ప్రతీది నీకు నచ్చకుండా చేసుకోడానికి హృదయానికి ఎంత తర్ఫీదుని ఇచ్చేదానివో కదా! ఆ ఔదార్యాన్నిఓ సారి స్పృశించు……. పల్లెర్లమూడి హైస్కూల్ లో “చలన చిత్రముల వలన లాభమా?నష్టమా?”డిబేట్ కి స్టేజి మీదకి నే వెళుతుంటే యుద్దరంగానికి పంపినంత ఉత్తేజాన్ని ఒంపావు కదా ఆ స్నేహాన్ని మళ్ళీ పరిమళించు ఇపుడు నేనూ నీతో వస్తా ఇద్దరం కలిసి సోషల్ క్లాసులో దేవదానం మాస్టారి ‘జపాన్’ఉచ్చారణ చుట్టూ అల్లిన మాటలమూటల్ని విప్పుదాం. కాసిన్ని అల్లరి నవ్వుల్ని ఏరుకుందాం…….. “ఉసిరి చెట్టు కింద పసిరిక పాము కరవకనేమి?కారణమేమి?” అంటూ పాడుతూ పెట్టిన పరుగులు తల్చుకుందాం. డ్రిల్ మాస్టారి అంతర్యాన్ని పరిశోదిద్దాం. కంబైండ్ స్టడీ లో పుస్తకాలను విసిరికొట్టి దెయ్యాల గురించి చెప్పుకున్న గుసగుసల్ని మళ్ళీ విందాం. ఈ సారి భయాన్ని జయిద్దాం ఈ సారి నిజంగానే భయాల్ని జయిద్దాం బాల్య ద్వీపం లోకి చేసే ఈ ప్రయాణం లో నాలో నేను లేనేమోనన్న భయాన్ని నువ్వూ నీలో నేను మిగలలేదేమోనన్నభయాన్ని నేనూ జయిద్దాం మళ్ళీ మళ్ళీ స్నేహంలో పడుతూనే వుందాం

7 thoughts on “ఒక స్నేహితురాలి పశ్చాత్తాపం

  1. వసంతగారు మీ కామెంట్ లోని కవిత్వమే చెపుతోంది మీకూ ఓ ప్రాణస్నేహితురాలుందని……..ఉండనిది ఎవరికి? నిలబెట్టుకుందాం …..anonmyous గారూ స్వచ్ఛత స్నేహనిదే ……థాంక్ యూ …

  2. ” నాలో నేను లేనేమోనన్న భయాన్ని నువ్వూ నీలో నేను మిగలలేదేమోనన్నభయాన్ని నేనూ జయిద్దాం ” Time & Space లో చెదరి పోయిన స్నేహాల్లో ఈ సంశయం వుండటం సహజమే. జ్ఞాపకాల వారధి పై బాల్యంలోకి , చెలిమి చెంతకు మళ్లీ చేరడానికి చేసిన ప్రయత్నం చాలా బాగుంది. మరగున పడిన మా జ్ఞాపకాలను కూడా గుర్తు చేసి నందుకు ధన్య వాదాలు

  3. అందరి బాల్యమూ, బాల్యం అందరికీ- అంత సులువుగా ఎప్పుడంటే అప్పుడు తొంగిచూడగలిగే ఆల్బమ్‌లాగా ఉండదేమో కదా మల్లీశ్వరిగారూ, బాల్యం కొన్నిసార్లు, లేదా కొన్ని బాల్యాలు- ఎప్పుడూ వెళ్లకూడని పాడుబడిన మేడలోని ఉత్తరదిక్కు గది లాంటివి. కొందరి కొందరి జీవితం– వెనక్కి తిరిగి చూస్తే బుర్రబద్దలయ్యే శాపం ఉన్న నిటారు మెట్ల వంటిది. అంతమంచి బాల్యం ఉన్నందుకు కాదు కానీ, బాల్యాన్ని అంత నిర్భయంగా తడుముకోగలిగినందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి.

  4. యిటీవల బొత్స వ్యాఖ్యలపై మన ఉత్తరాంధ్ర యాసలో రాద్దామని ప్రయత్నించా. మీ email తెలియక ఈ space వాడుకుంటున్నందుకు సారీ.. http://saamaanyudu.wordpress.com/2010/02/27/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%86%E0%B0%B2%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BE/#comments మీరు మనలో మనం కార్యక్రమం విజయవంతంగా ముగించివుంటారని ఆశిస్తున్నా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s