‘ప్రేమ కధలు చెప్పుకుందాం’ కవిత మీద వచ్చిన కొన్ని స్పందనల నేపధ్యంలో విడి విడి గా సమాధానాలు రాయడం కన్నా ఆ స్పందనల స్వభావం మీద తప్పనిసరిగా ఒక పోస్ట్ రాయాలనిపించింది. భావ వ్యక్తీకరణ స్వేఛ్చ ప్రజాస్వామ్యం లో ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఐతే ఉద్యమం విజయ సూర్యుడిని ప్రసవించడానికి పురుటి నొప్పులు పడుతున్నపుడు, యువతరం అమాయకంగా ఉద్యమం మెడలో ప్రాణ హారాలు వేస్తున్నపుడు మనమెట్లా వుండాలి? ఉద్యమాల గడ్డ మీద నిలబడి ధర్మ క్రోధాన్ని ఎట్లా ప్రకటించాలి? మనం నమ్మేది సమైక్యమా ప్రత్యేకమా అని కాదు మన డిక్షన్, వ్యక్తీకరణ ఉద్యమానికి ఎంత వరకూ తోడ్పడతాయి అన్నది ముఖ్యం. మన సైద్ధాంతిక భావజాలానికి వ్యతిరేకంగా వున్న వారి పట్ల మన వైఖరిని వ్యక్తిగతంగా ప్రదర్శించడం ఏ విధం గానూ పరిణితి కాదు. ముఖ్యంగా విమర్శఫై అది తీసుకొచ్చే మార్పుఫై అవగాహన వున్న వ్యక్తులు జెండర్ ని, కులాన్ని, మతాన్ని, అడ్డం పెట్టుకుని వ్యక్తిగత దాడులకు దిగరు. ఉద్యమ సాధన కోసం తమ సర్వ శక్తుల్నీ ఒడ్డుతున్నవారు…… సహానుభూతితో స్పందిస్తున్న ఇతర ప్రాంతాల వారి పట్ల అనుమానం కలిగివుండడాన్ని అర్ధం చేసుకోవచ్చు అవమానించాలనుకోవడంలో అర్ధం లేదు. చివరిగా….ఒక బ్లాగర్ తన కవితా శక్తినంతా వినియోగించి నన్ను ‘తెలంగాణా బిడ్డ’ను చేసారు. సంతోషం. నా తల్లి వారసత్వం నుంచి నేనెవరన్నది నా వ్యక్తిగతం. తెలంగాణా ఉద్యమం పట్ల సహానుభూతి కలిగినదానిగా నేనెవరన్నది సామాజికం
మనం నమ్మినది న్యాయమైనదైనప్పుడు విమర్శలను పట్టిమ్చుకోనక్కరలేదు., బ్లాగుల్లో పనికట్టుకు రాసేవాళ్ళు వున్నారు. అధిక శాతం మంది కోస్తా వాళ్ళు వు౦డడ౦తో తెల౦గాణాపై ఎవరు రాసినా దాడి జరుగుతో౦ది. అయినా ఒక న్యాయమైన ఆకాంక్షకు మద్దతు తెలపడానికి తెలంగాణా వారే కానక్కరలేదు. మొన్నటి ఆదివారం వార్తా ఎడిషన్ లో స్లోవేనియన్ మార్క్సిస్టు తత్వవేత్త Slavoz Zizek కూడా మద్దతు తెలిపారు. మీ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న తీరు హర్షణీయం.
సామాన్యుడి అభిప్రాయంతో నేనేకీభవిస్తున్నా.