దాతృత్వం లో నుంచి దాతృత్వం లోకి

ఆకాశాన్ని మూసిన మబ్బులు, తెరచుకున్న పధ్నాలుగు వందల యువ హృదయాలు, చల్ల చల్లని పిల్ల గాలులు, బుల్లి ముత్యాల్లాంటి వానచినుకులు…..హేలా యూత్ ఫెస్ట్-2009 కి ప్రకృతే అద్భుతమయిన స్వాగతాన్నిచ్చింది. మూడు రోజుల పాటు అవిరళ కళా ప్రదర్శనలకి పులకించని హృదయంలేదు. ఆదిత్య కళాశాల గోపాలపట్నం బ్రాంచి తరపున పిల్లలతో నేను బయలుదేరి వెళ్ళాను. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని యాభై ఆరు కళాశాల విధ్యార్దులు సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం , నాటక ప్రదర్శనలు, క్విజ్ ,వకృత్వపు పోటీల్లో ఎనభై ఒక్క బహుమతులు గెలుచుకున్నారు. ఈ యూత ఫెస్ట్ కి అదనపు ఆకర్షణ ఏంటంటే బహుమతులతో నిమిత్తం లేకుండా విద్యార్ధులు ఖాళీ సమయాల్లో ఫాన్సీ డ్రస్ ప్రదర్శన నిర్వహించడం. మా కాలేజీ విధార్ధిని వి.సంధ్య ఆరుంధతిలోజేజమ్మ గెటప్ వేసి గ్రౌండ్ లో ప్రవేశించగానే అనేకమంది “జేజమ్మా!”  “వదలాబొమ్మాళీ” అంటూ వెంట పడగానే కాస్తంత భయం కలిగింది. కానీ ఎవరూ పరిమితులు దాటకదాటకపోవడంతో ఆ అమ్మాయి వూపిరి పీల్చుకుంది. II MPCS  ప్రసాద్ మాత్రం ఛాతీ మీద ‘TO LET – NO RENT ‘ అని రాసుకొచ్చి గ్రౌండంతా తిరిగి కూడా ఒక్కఅమ్మాయినీ తన హృదయపుగదిలోకి ఆకర్షించలేకపోయినా ప్రెస్ నీ ,విద్యార్ధులనీ ఆకర్షించేశాడు. నవంబర్ ఏడవతారీఖు సాయంత్రం శివ అతని ఫ్రెండ్స్ఒక పధకం రచించారు.జనాలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో ఫిట్స్ వచ్చినట్లు నటిస్తే అందరూపోగవుతారు… అపుడు నవ్వుతూ లేచి ఏమీ ఎరగనట్లు వెళ్ళిపోవాలని…. అనుకున్నట్లుగా అందరూ ఎక్కడికక్కడ మఫ్టీలో సర్దుకున్నారు….శివ నటనలో జీవిస్తూ కాళ్ళూ చేతులూ తెగ కొట్టేసుకుంటూ జీవించడం మొదలు పెట్టగానే అందరూ చుట్టూ మూగిపోయారు.ఎంతమందంటే పిల్లలు ఊహించనంత. ఇక పరిస్థితి వాళ్ళ చేతులు దాటిపోయింది. కొందరు మీద నీళ్ళు కొట్టారు,మరి కొందరుచేతుల్లో తాళాలు పెట్టడానికి ప్రయత్నించారు. ఒకాయన నేను డాక్టర్ నని చెప్పి పల్స్ చూసి స్ట్ర్రెచర్ తీసుకురండి అని కేకలు పెట్టాడు. ఇక శివ …నటించలేక,మానలేక బిత్తర పోయాడు….పిల్లలు బిక్కమొహాలు వేశారు. వాళ్ళలో శ్రీనివాస్ ధైర్యం చేసి ‘యితను మా ఫ్రెండే నేను చూసుకుంటానని’ బలవంతంగా గుంపు నుంచి బయటకిలాక్కొచ్చాడు. ఇక అప్పటినుంచి శివ శ్రీనివాస్    భక్తుడయిపోయాడు.’నువ్వు నా పాలిటి దేవుడివిరా… నువ్వురాకపోతే నా పరిస్థితి ఏంటి? అంటూ కనపడినపుడల్లా వాపోతూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు.

అందంగా మోడల్లా ఉండే II MECS  ప్రవీణ్ దగ్గరకివచ్చిపచ్చచుడీదార్ వేసుకున్నఅమ్మాయివచ్చి”మీరు చాలా అందంగాఉన్నారండీ!”  అనేసి చక్కాపోయింది ఇక అంతే! అప్పటి నుంచీ “జింగిచ జింగిచ ప్రవీణ్ గాడు జింగిచ,జింగిచ,జింగిచ పచ్చరంగు జింగిచ…. మీరు చాలా బావున్నారండీ!” అంటూమూడు రోజులూ ప్రవీణ్ ని మోసేసారు. II  బయోసైన్స్ ఖ్యాతివిద్య తన అమాయకపు అల్లరితనంతో యువ హృదయాలను కొల్లగొట్టేసింది.

ఈ టూర్ మొత్తంలో నా హృదయాన్ని కదిలించిన విషయాలు కొన్ని ఉన్నాయి. మేం తిరుగు ప్రయాణంలో వున్నపుడు పిల్లలు కాంగో డ్రమ్స్ ప్లే చేస్తూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ హడావుడి చేశారు. మేం కూర్చున్న చోటుకి నాలుగు సీట్ల అవతల ఒక చిన్న పాప వాళ్ళమ్మ ఒళ్ళో కూర్చుని ఆడుకుంటోంది. డ్రమ్స్ శబ్దం వినపడగానే మా వైపు చేతులు చూపిస్తూ పేచి మొదలు పెట్టింది. నేను తీసుకొచ్చినా ఒళ్ళో కూచోపెట్టుకున్నాను. గింజుకుంటూ తన లేత పాదాలతో నా ఒళ్ళోనే డాన్స్ చేయడం ప్రారంభించింది. అంతేకాదు, చూసే వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తూ కాంగో స్టిక్  చేత్తో పట్టుకుని మా విద్యార్ధులు ఏ బీట్ యిస్తే ఆ బీట్ ని ప్లే చెయ్యడానికి ప్రయత్నించింది. ఒక చేత్తో ఒక డ్రమ్ మీద ప్లే చేస్తూ ఇంకో చేత్తో కాంగో స్టిక్ తో ఇంకో డ్రమ్ మీద ప్లే చేస్తూ వామనుడిలా వచ్చి సంగీత విశ్వరూపాన్ని చూపించింది. ‘Born Artist’  అన్న పదానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఎవరి దగ్గరకూర్చుంటే తన ఆటలు బాగా సాగుతాయో తెలిసినట్లు ఆ పసిది నాకు ధారాళంగా ముద్దులు దానం చేసి నా మెడ చుట్టూ చేతులు చుట్టి వైజాగ్ వచ్చేవరకు వదల లేదు. సంగీతం పట్ల ఆ పాప ఙానం కళగా మారుతుందా అన్నసంశయం చాలా సేపువదల్లేదు.ఇంతకీ ఆ పాప వయస్సు ఒక సంవత్సరం రెండు నెలలు.

యూత్ ఫెస్ట్ సంబరాల్లో నేను మునిగి వుండగా నెట్లోచూసిన నామిత్రుడు ఫోన్ చేసి ఒక్క ఈవెంట్ లోనన్నా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటే కాష్ ప్రైజ్ ఇస్తానని స్టూడెంట్స్ తో మాట్లాడి వాళ్ళ జోష్ ని మరింత పెంచాడు. వాళ్ళురెట్టించిన ఉత్సాహంతో ప్రాక్టీస్ చెయ్యడం చూసి ఔరా డబ్బు మహిమ అనుకున్నాను. అది డబ్బు మహిమ కాదనీ ప్రోత్సాహానికి వుండే శక్తి అని తర్వాత అర్ధమయింది. ఊహించినట్లుగానే కార్టూనింగ్ లో ప్రధమ, క్విజ్ ,డిబేట్ ల లో కన్సొలేషన్ బహుమతులు వచ్చాయి. ఆ సందడిలోవాళ్ళని అడిగాను నా మిత్రుడిచ్చేడబ్బుని ఎలా పంచుకుంటారని? అపుడు బొండు మల్లెలాంటి అందమయిన శ్రీరాధ అంతే అందంగా చెప్పింది కదా! ‘ఈడబ్బుని సేవా కార్యక్రమాలకి ఉపయోగిద్దాం’ అని.అంతాముక్త కంఠంతో ఔనన్నారు.దాతృత్వంలోనుంచి దాతృత్వంలోకి విద్యార్ధులు ప్రయాణించిన తీరు నా హృదయానికి హత్తుకుంది. ఈ సందర్భంలోనే దగ్గుమాటి పద్మాకర్ రాసిన యూ-టర్న్ కథ (కథ -2006) గుర్తొచ్చింది. కొంతమంది వద్దే సంపదలు పోగుపడటాన్నినిరసించకుండ, దాతృత్వ సిద్ధాంతాన్ని సమర్ధించేలా కథ ఉన్నందుకు విరసం పాణి విమర్శించగా, ప్రతి కథనీ మార్క్సిస్ట్ దృక్పధంతో చూడనక్కరలేదనీ, ఈకథలో సంపదలు పోగు చేయడమనే ఇమ్మెచ్యూర్ చర్యని నిరసిస్తూనే వ్యక్తుల్లో మార్పుల్ని ప్రేరేపించే కథగా పద్మాకర్ చెప్పారు. ఇవ్వడం అలవాటులేని వ్యక్తుల్ని స్వార్ధపరులుగా భావిస్తాం. నేనెరిగిన విషాదం ఏంటంటే’ తనకున్నసమస్త శక్తులతో ’ఇవ్వడం’ లోని ఆనందాన్నిప్రాక్టీస్ చేసిన మిత్రుడు ఒకరు ‘తీసుకోవడం’ ద్వారా కూడా అహాన్నిఅదుపులోపెట్టుకోవచ్చన్నది మరచిపోవడం….

మొత్తానికి వచ్చేవారంవిశాఖలోని జూ పార్క్ దగ్గరగా ఉన్న జువనైల్ హోం కి వెళ్ళిఅక్కడున్నపిల్లలతో రోజంతా గడిపి, అక్కడితో వదిలేయకుండా భవిష్యత్తులోఆపిల్లల్లో కొందరికి కేర్ టేకర్స్ గా మారాలన్నది మా విద్యార్ధుల ఆలోచన.దాతృత్వం కన్నా విప్లవం గొప్పదని పిల్లలకి ఎలా అర్ధం చేయించను? ఉద్యమాలు లేని, దగ్గరలో ఆశలులేని కాలమిది. ఎటు చూసినా కెరీరిజం,హింస,వస్తు వ్యామోహం యువతను చుట్టుముడుతున్న ఈసందర్భంలో ఏమాత్రం ఔదార్యం కనిపించినా భుజం తట్టకుండాఎలాఉండగలము??

3 thoughts on “దాతృత్వం లో నుంచి దాతృత్వం లోకి

 1. మీ అనుభవాలు చక్కగ రాసారు. కాకపోతే ముగింపు వచ్చేసరికి చాల మంది లాగే దాతృత్వం కన్న విప్లవం గొప్పది అని చెప్పకపోతే ఎందుకువచ్చిన తిప్పలు అని చెప్పినట్లనిపించింది. అలాగే ఇవ్వడం అనేది అహాన్ని అదుపులో వుంచుకునే కార్యక్రమమని ఎలా చెప్పగలరు దీనికి ప్రాతిపదిక ఏమిటి? ఇవ్వటము , తీసికోవటమనేది అహాన్ని సంతృప్తి పరచే ప్రక్రియ కన్నా భిన్నంగా చూసే పరిణితి కొరవడింది అనిపించింది. ఎవరు ఎవరికి ఇస్తున్నారు?ఎవరు ఎవరిదగ్గర తీసికుంటున్నారు అనే విషయం తో పాటు ఇవ్వటం, తీసుకోవటాల్లో ఉన్న ఉద్దేశ్యాలు కూడ వ్యక్తి చర్యలను ప్రభావితం చేస్తాయి అనే మౌలిక భావన పరిగణించకుండానే వ్యక్తులు ఇచ్చిపుచ్చుకుంటారు, తద్వారా అహాన్ని అదుపులో వుంచుకోవచ్చులేదావుంచుకుంటారు అనే వాదనలో పసలేదని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్నికూడ తెలియచేయగలరు.

  • దాతృత్వం పరిష్కారం కాదు ఉపశమనం

   పద్మా..గారూ.. దాతృత్వం గురించీ, అహం గురించీ నేను రాసిన దాని మీద మీ ప్రతిస్పందన చూశాను. దాతృత్వం కన్నా విప్లవం గొప్పదన్న నా అభిప్రాయం చివర్లో చెప్పడం అన్నదిమొక్కుబడిగాచెప్పినట్లు ఉందని అన్నారు. నా విద్యార్ధులు చూపిన దాతృత్వ భావన నన్ను ఆలోచింపచేసింది. ఆ నేపధ్యంలో విద్యార్ధులకుండే పరిమితుల దృష్ట్యా దానిని నేను ఎక్కువ వివరించాను.చాలామందికి ఇలాంటి అనుభవం కలిగిందో లేదోవారు తమ అభిప్రాయాలను ముందు చెపుతారో వెనక మొక్కుబడిగా చెపుతారో నేను అంచనా వేయలేను గానీ నేను నమ్మేది చివర చెప్పిందే కానీ సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంటున్ననేటి యువతలో కనిపించిన ఈ చిన్నపాటి ఔదార్యాన్నిచెప్పడం నాలక్ష్యం తప్పవిప్లవం గురించి వివరించడం నా ఉద్దేశ్యం కాదు. అయితే యూ-టర్న్ రాసిన పద్మాకర్ కి కూడా దాతృత్వం పరిష్కారం కాదని ఉపశమనం మాత్రమేనని తెలిసుంటుందనుకుంటాను.’విప్లవం గొప్పదని చెప్పకపోతే తిప్పలు పడలేమని’చెప్పినట్లుగా ఉందని మీ కనిపిస్తే, అందరికి అలాగే అనిపించే అవకాశం ఉంటే మళ్ళీ మళ్ళీ చెపుతాను ‘దాతృత్వం కంటే విప్లవంగొప్పది’

   ఇవ్వడం,తీసుకోవడం రెండింటికీ సంబంధించి మీరు వేసిన ప్రశ్నలతో ఏకీభవిస్తున్నా.ఇవ్వడం,తీసుకోవడం వెనుక కేవలం అహానికి సంబంధించిన విషయం మాత్రమే ప్రాతిపదిక కాదు. ఎవరు ఎవరికి ఇస్తున్నారు? ఎవరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారు? వెనుక ఉన్నఉద్దేశ్యాలేంటి? అన్నమౌలిక ప్రశ్నలు వేయగలిగిన మీరు ‘నా మిత్రుడొకరు’ అని నేనడము ద్వారా ఈ ప్రక్రియ అంతా వ్యక్తిగత పరిమితిలోఉండొచ్చన్నవిషయం మీరు విస్మరించారు. నా మిత్రుడు దాతృత్వ భావనతోఎక్కువగా ఇవ్వడానికి (విధిలేక ఇచ్చే సందర్భాలు మానవ సహజం కాబట్టి అవి కాసేపుపక్కన పెట్టి) ఇష్టపడతాడు. దానితో ఎంత మమేకత చెందుతాడంటే తీసుకోవడంలో అతనికి ఏ మాత్రం సంతృప్తి కలగదు. ఇచ్చేస్థానపు ఆధిక్యత నుండి బయటపడటానికి, తీసుకోవడంలో ఉండే ఆనందం, నిస్సహాయత,ఇబ్బందికర పరిస్థితి అవగాహనలోకి రావాలంటాను నేను. ఇవ్వడం, తీసుకోవడంలోని అనుభూతులను సమానంగా పొందాలన్నది నా మిత్రుడికి నేనిచ్చిన సూచన.
   ఈ విషయాలను తరచి చూసుకోవడానికి మీ స్పందన నాకు ఉపయోగపడింది. కృతఙతలు.

 2. మీరు వ్రాసిన టపాలు ఒక దాని వెంట మరొకటి (సుమారు ఒక 50) కామెంటు కూడా పెట్టకుండా చదివేస్తూ ఇక్కడకు వచ్చాక ఇక కామెంటు పెట్టకుండ ఉండలేకపొతున్నానండి. పద్మప్రియ గారి ప్రశ్నలకు మీ సమాధానం నన్ను అపేసింది, మిమ్మల్ని అభినందించటానికి. చాలా బాగా చెప్పారు.

  తీసుకోవడం ద్వారా అహాన్ని అదుపులో వుంచుకోవచ్చు,దాతృత్వం కంటే విప్లవం (నేను, శాస్వతపరిష్కరమునకు జరిగే కృషి ఏదయిన అని చదువుకున్నాను) గొప్పది అన్న మీ మాటలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

  సహాయం అడగలేని అహంభావానికి నా మీద నాకు కోపమొస్తుంది, అప్పుడప్పుడు. ఎందుకో కొంతమందిని సహయం అడగలేను, వారికి సహాయం చేయటనికి వెనకాడను కాని.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s