ఇంతకీ నేను బ్లాగెందుకు తెరిచేను?

రెండేళ్ళ కిందట ఓ రోజు గుడిపాటి గారు నాతో ఫోన్లో మాట్లాడుతూ చాలా ప్రజాస్వామికంగా “ మీరు బ్లాగెందుకు తెరువకూడదు?” అన్నారు. నేను మాత్రం చాలా అప్రజాస్వామికంగా “వూరుకోండి సార్! నేనేవన్నా అంత ప్రముఖురాలినా?” అని దబాయించేశాను.అటువైపు కాసేపు నిశ్శబ్దం…. బహుశా అయన నా మీద జాలి పడినట్లున్నారు.

ఈ మధ్య ముసునూరి ఆనంద్ “ మల్లీ ! నువ్వు బ్లాగ్ ఓపెన్ చెయ్యాలి” అన్నాడు. ఈ రెండేళ్ళలో కాస్త అఙానం తొలగిన అనుభవంతో ఔను అని వెంటనే ఒప్పేసుకున్నాను.

ఔను…. ఇంతకీ నేను బ్లాగెందుకు తెరిచేను? నా చిన్నప్పుడు మా తాత మానలుగురు అక్క చెళ్ళెళ్ళకీ కలిపి ఒక బొమ్మల పెట్టె కొనుక్కొచ్చారు. అది ఇంటికి వచ్చిన రోజు మాకో కొత్త ప్రపంచం ఆవిష్కరింపబడింది. చెక్కతో చేసిన బొమ్మలు, లక్కపిడతలు…..ఎన్నో రంగులు….ఎన్నెన్నో ఆకారాలు….నలుగురం పంచుకోవాల్సివచ్చేసరికి తగ్గిపోయాయి. అందుకే మా బొమ్మల ప్రపంచంలోకి కొబ్బ్రరాకులతో చేసినవి, మట్టితో చేసినవి కలుపుకునే వాళ్ళం. ఆ బొమ్మలకి పెళ్ళిళ్ళూ పేరంటాలూ చేస్తూ ఉత్తుత్తి వంటలు చేస్తూ మా చుట్టూ పెద్దవాళ్ళ జీవితాన్నంతా ఆ బొమ్మల పెట్టెలోనే నిర్మించేవాళ్ళం.

 మా ఆటల ప్రపంచానికి నాకూ మధ్య వారధి బొమ్మల పెట్టె.

టీనేజ్ లోకి రాగానే అల్లరి ప్రపంచంలోకి ధీమాగా అడుగులేశాం. నేను పుష్పవల్లి, విజయలక్ష్మి, సరోజిని,రమణి, తిరుమలరాణి , హేమలత మేమంతా ఒక బాచ్. వద్దన్నా వూరికూరికే బుగ్గల్లోకి పొంగేనవ్వు,కుదురుగా వుండని కాళ్ళూ చేతులూ, ఎపుడూ వెలిగిపోయే కళ్ళూ, తుళ్ళింతలూ, కేరింతలూమావూళ్ళో మాబారిన పడి నవ్వుతూ వెళ్ళిన మనిషేలేరు. ‘ మీరసలు ఆడపిల్లలేనా?’ అని రుస రుస లాడిపోతుంటే తలెగరేసేవాళ్ళం. మా బాచే లేకపోతే నేను అత్తిపత్తి ఆకుల్ల్లాంటి కోట్లాది స్త్రీలకి ప్రతిరూపంలాఉండేదాన్ని.

నాయవ్వనానికి  కాస్తంత తలపొగరునద్దిన మా బాచ్ నాకు మా అల్లరి ప్రపంచానికి మధ్యవారధి.

యవ్వనపు తికమకలలో నేను తలమునకలయి ఉన్నపుడు ఎపుడంటే అపుడు హ్రుదయంలోంచి వెన్నెలని గుప్పెళ్ళతో తీసివిసరగల ఇంద్రజాలికుడు నా ముందు ప్రత్యక్షమయి ‘నన్నుపెళ్ళాడతావా?’ అన్నాడు. నా సమస్త ప్రపంచం అతనిలో యిమిడిపోయి నేను నేను వంటరిగా రిక్తహస్తాలతో నిలబడినపుడు మళ్ళీ అతనే దయతో , ప్రేమతో నా జీవితమంతా పరచుకున్నాడు. నిజం చెప్పొద్దూ ప్రపంచాన్ని మరపించినా అతని ప్రేమలో ఉక్కిరిబిక్కిరవుతుంటే బుడి బుడి అడుగులతో పాలబుగ్గల చిన్నారి ప్రవేశించి అతనికి తోడయింది.

నేనెక్కడున్నా తమ అయస్కాంతపు హ్రుదయాలతో నన్నులాగేసే వాళ్ళిద్దరూ నాకు ప్రేమ ప్రపంచానికీ వారధులు.

 నేను కథలు , నవలలు రాయడం మొదలుపెట్టి కొన్నేళ్ళయిన తర్వాత ఎందుకు రాస్తున్నాననే, ఏం రాస్తున్నానో తెలియని పరిస్థితి. ఒంటరి అన్వేషణ ఒక వృధాప్రయత్నం. రచయిత్రులందరం కలిసి సాగించిన అన్వేషణలో పుట్టిందే ‘మనలో మనం’. ఇపుడు మేవంతా మా మధ్య ఉన్న భిన్న అస్తిత్వాలను గౌరవించుకుంటాం. అర్ధం చేసుకుంటాం. సమస్య ఎవరిదయినా అందరం పోరాడుతాం.

నాకూ సాహిత్య ప్రపంచానికి మధ్య వారధి ‘మనలో మనం’.

ఇపుడు నేను  బ్లాగు ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నా. నాకూ బ్లాగు ప్రపంచానికీ jajimalli.wordpress.com వారధి. నాభావాలను నేనిపుడు ఎక్కువమందితో పంచుకోవచ్చు. ఇక్కడ నాభావాలకి కత్తిరింపులుండవు, ప్రచురణకోసం తిప్పలుండవు. ఈ బ్లాగింటిని నా భావాలతో , అనుభూతులతో సౌందర్యవంతం చేస్తా. స్వేచ్చ నవలలో ఓల్గా చెప్పినట్ట్లు నా ఉనికి సమాజ చలనానికి ఏ కొంచెమయినా ఉపయోగపడటం కోసం ఈ బ్లాగు ను వారధి చేస్తా.

    ఇదుగో ….ఇపుడే నాబ్లాగింటి తలుపులు తెరిచాను. ‘ముందుమాట’ తోరణం కట్టాను. స్నేహాభిమానంతో మీరిచ్చే సూచనలు, సలహాలు,విమర్శలు, జాజి మల్లెల గుబాళింపుతో సమానంగా భావించి సరిదిద్దుకుంటాను.

            —మల్లీశ్వరి

10 thoughts on “ఇంతకీ నేను బ్లాగెందుకు తెరిచేను?

 1. మల్లీశ్వరిగారూ, చాలా సంతోషం. బ్లాగ్లోకానికి స్వాగతం.
  బ్లాగెందుకు తెరవాలీ అని ప్రశ్న వేసుకోవడమే కాదు, దానికి మంచి తగిన సమాధానాన్ని కూడా ఇచ్చుకున్నారు. మీ కీబోర్డునించి వెలువడే మంచి టపాలకై ఎదురు చూస్తుంటాము.

 2. మల్లిగారు,

  బ్లాగ్లోకానికి స్వాగతం. ఇక మీ బ్లాగు నుండి మల్లెల పరిమళాలు నలుదిసలా వ్యాపించాలి మరి.ఇక్కడ మల్లెలు, మామిడిపళ్ల పంకలు, ఏ.సీలు చాలామంది ఉన్నారు.. 🙂

 3. జ్యోతి గారూ,
  మనస్ఫూర్తిగా పిలిచే పిలుపు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. బ్లాగ్లోకంలోకి రావటం ఇంత బాగుంటుందని తెలిస్తే ఎప్పుడో వచ్చేదాన్ని. అయినా ఫరవాలేదు చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో.
  లేటుగా జవాబిచ్చినందుకు ఏమీ అనుకోవద్దు ప్లీజ్.
  మల్లీశ్వరి

 4. యవ్వనపు తికమకలలో నేను తలమునకలయి ఉన్నపుడు ఎపుడంటే అపుడు హ్రుదయంలోంచి వెన్నెలని గుప్పెళ్ళతో తీసివిసరగల ఇంద్రజాలికుడు నా ముందు ప్రత్యక్షమయి ‘నన్నుపెళ్ళాడతావా?’ అన్నాడు. నా సమస్త ప్రపంచం అతనిలో యిమిడిపోయి నేను నేను వంటరిగా రిక్తహస్తాలతో నిలబడినపుడు మళ్ళీ అతనే దయతో , ప్రేమతో నా జీవితమంతా పరచుకున్నాడు. నిజం చెప్పొద్దూ ప్రపంచాన్ని మరపించినా అతని ప్రేమలో ఉక్కిరిబిక్కిరవుతుంటే బుడి బుడి అడుగులతో పాలబుగ్గల చిన్నారి ప్రవేశించి అతనికి తోడయింది.

  ఇంత అందమైన వాక్యాలను చదవడానికి కలిగిన భాగ్యానికి, దాన్ని ప్రోస్తాహించిన గుడిపాటిగారికి ధన్యవాదాలు చెప్పకుండా ఎలా వుండగలను

  మీకు అభినందన్లు
  రాయండి! రాస్తూ వుండండి! రాస్తూ వుండండి! రాస్తూ వుండండి!

 5. ఆ నవల స్వాతిలో వచ్చింది కనుక నా వద్ద డి టి పి చేయించిన కాపీ ఉండదు.నేను విడిగా నవల పబ్లిష్ చేయలేదు.
  ఏ మాత్రం వీలున్నా బ్లాగ్ లో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.కల్లూరి శ్యామల గారు ఈ నవలను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసారు.అది న్యూ ఆవకాయ డాట్ కాం లో ప్రచురించారు.వీలుంటే చూడగలరు.థాంక్ యూ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s