మరో ముఖం

                                                          సుధాకర్ తన భర్తయినందుకు లోకం తనని ఎంతో అదృష్టవంతురాలిగా కీర్తించింది. తనకీ నిజమేననిపించింది. పెళ్ళి చూపుల్లో, పెళ్ళిలో, పెళ్ళయాక అతని చూపులు తన చుట్టూ తారట్లాడటం గమనించాక చిరుగర్వం కలిగింది. ఆ తర్వాత నాలుగు నెలలూ నాలుగు నిమిషాల్లా గడిచిపోయాక ఓ రోజు అతను శుభవార్తంటూ చెప్పిన కబురుతో హఠాత్తుగా ఈ లోకంలోకి విసిరివేయబడ్డాను.

          “ఇంకో నెలలో దుబాయ్ ప్రయాణం .. అక్కడ మంచి వుద్యోగం దొరికింది.బాగా సంపాదించొచ్చు. ఎంతా ? నాలుగయిదేళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు మనం హాయిగా గడపడానికి అవసరమైనంత సంపాదించి వచ్చేస్తాను. సంవత్సరం తిరిగేసరికి స్థలం కొనేస్తాను.రెండేళ్ళకు యిల్లు, మూడేళ్ళకి బ్యాంక్ బాలెన్స్ …. నాలుగేళ్ళకి పిల్లల పేర్ల మీద ఫిక్సెడ్ డిపాజిట్లు… నీ ఇంటి నిండా బంగారం ” అతను హుషారుగా చెప్పుకుపోతుంటే నా మనసంతా భారంగా మారింది.

          “మీరు వెళ్ళాలా ?” దిగాలుగా అడిగాను.

అతను ఓ క్షణం వినరాని ప్రశ్న విన్నట్లు అయోమయంగా చూసి పకపకా నవ్వేసి ” నా దగ్గరంటే అన్నావు యింకెవరి దగ్గరా  అనకు నవ్వుతారు ” అన్నాడు.

          అపుడు చెప్పాను నా దిగులుకి కారణం. సంభ్రమంగా చూశాడతను.

          “వెరీగుడ్ మళ్ళీ సంవత్వరానికి నేను వచ్చేసరికి నా వారసుడిని ఎత్తుకుని స్వాగతం చెపుతావన్నమాట ” మెరుస్తున్న కళ్ళతో చూస్తూ అన్నాడు. అతను అతని గురించి ఆలోచించాడు.నేను యింకేమనలేక పోయాను. ఆ తర్వాత అతను ప్రయాణ సన్నాహాల్లో మునిగిపోయాడు.

          వెళ్ళే రోజు వచ్చింది. బందువులంతా అతనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. అంత హడావిడిలోనూ నా దగ్గర వీడ్కోలు తీసుకునేందుకు కాబోలు నన్ను లోపలికి పిలిచాడు.

          వెళ్ళగానే కౌగిలించుకున్నాడు .అతనికి కళ్ళు నా ముఖాన్ని ప్రేమగా తడిమాయి. వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది . ఒకే ఒకనిమిషం అంతే!

          ఆ! ఉమా ! చెప్పడం మరిచిపోయాను. నువ్వు ఈ యింట్లోనే వుండు. ఎవరినీ రానివ్వద్దు మీ అమ్మగారిని తోడుగా వుంచుకో !” అన్నాడు.

          నాకు మా అమ్మా,నాన్న పసుపు కుంకుమల కింద ఈ యిల్లు రాసివ్వడమూ, అన్నయ్యకి వ్యాపారంలోనష్టం వచ్చి యింటద్దె కట్టుకోవడం కష్టంగా వుందని , అల్లుడు తిరిగొచ్చేవరకూ నాకు తోడుగా మా అన్నయ్య ఫామిలీ యిక్కడ వుంటారనీ మా నాన్న యితన్ని అడగడం గుర్తొచ్చింది.

          “మా అన్నయ్యకి .. కష్టంగా “ఏదో నసిగాను.

          “వద్దు .సందిచ్చామంటే జీవితాంతం కదలరు” అసహనంగా అన్నాడు. 

ఆ విషయం అక్కడితో ముగిసింది.

          అతను దుబాయ్ వెళ్లిపోయాడు నన్ను ఒంటరిగా వదిలేసి, నా చుట్టూ ఎందరున్నా నేను ఒంటరినే . ఎందుకంటే భర్తే సర్వస్వమనీ అతని తోడిదే లోకమని  అందరూ ఢంకా బాజాయించి చెప్పారు. నిజమనుకుని నేనూ నమ్మాను కాబట్టి.

          నాతో పాటు అమ్మ ఉండేది. ఆమె ఎపుడూ బాధతోనూ , ఆక్రోశంతోనో వుండేది. అల్లుడి మీది కినుకను నా ముందు ప్రదర్శించేది . మా అమ్మకు అర్థమయినా కాకపోయినా నేను మాత్రం ఓ విషయం గ్రహించగలిగాను. అది నేనయినా, మా అమ్మ అయినా పాత్రధారులమే తప్ప సూత్రధారులం కాదని. మన్ను తిన్న పాము ఎలా కదులుతుందో తెలీదు కానీ కాలం మహా బద్ధకంగా కదలడం తెలుస్తోంది……… అతను లేకపోవడం అన్నది నా జీవితంలొ ఎన్నో విషయాలని ప్రభావితం చేస్తోంది.

          స్నానం చేసి బీరువా దగ్గరికి వెళ్లి బట్టలు తీసుకునే ముందు మంచి చీర మీదకి చెయ్యి వెళ్లినా ‘ఆ! అతను లేనపుడు  పాత చీర కట్టుకుంటే మాత్రం యేం.’ అన్పించేది.

          ఓ రోజు మరీ విసుగనిపించి సినిమాకి వెళదామని తల్లి సణుగుతున్నా ఆమెని తోడు తీసుకుని బయల్దేరినపుడు ఓసారి చూసిపోదామని వచ్చిన మామగారు వాకిట్లో ఎదురై’ సినిమాకా ?’ అంటే  ఘోరాతిఘోరమైన నేరస్థురాలిని చూసినట్లుగా గుచ్చిన చూపు చురుక్కుమనిపించింది.

          కంప్యూటర్లో మొయిల్స్ పంపడం , చాటింగ్ నేర్చుకోమని సుధాకర్ పోరగా రోజూ ఇన్ స్టిట్యూట్ కి వెళ్లేపుడు యిరుగూ పొరుగూ కొత్తగా ‘ఏమ్మా ! ఎక్కడికీ ! ‘ అంటూ తీసే ఆరాలు బెరుకుని కలిగించేవి. అలంకరించుకోవాలన్నా, మంచి తిండి తినాలన్నా, నలుగురులో కలవాలన్నా, నవ్వాలన్నా నడవాలన్న, అనాసక్తత . మొయిల్స్ చెక్ చేసుకోవడం, కంప్యూటర్లో అతనితో ఛాటింగ్ చెయ్యడమూ యివే వుద్వేగభరితంగా వుండేవి. అతను క్లుప్తంగా మొయిల్ చేసినా తను చాలా ఎక్కువ మెసేజ్ లు పంపేది.

          నెలలు నిండాయి. బాబు పుట్టాడు. తను కదలలేకపోవడంతో అతను ఫోన్లు చేసేవాడు.అన్నట్లుగానే బాబుకు మూడో నెల వచ్చేసరికి రెందు నెలల సెలవుతో అతనొచ్చాడు. నా హృదయానికి పండగొచ్చింది . రాగానే నన్ను చూస్తాడనుకున్నాను. కానీ అతృతగా కొడుకు మొహం చూస్తూ ఎత్తుకున్నాడు . అతని మొహంలో గర్వం తొణికిసలాడింది.

          “ఈ రెండు నెలలూ నన్ను విడిచి ఒక్క క్షణం కూడా వుండొద్దు” ఆ రోజు రాత్రి అతని కౌగిలిలో కరిగిపోతూ అన్నాను. వారం రోజులు యిద్దరం బయటి ప్రపంచాన్ని మర్చిపోయాం. ఆ తర్వాత అతను ఆర్థిక ప్రణాళికల ప్రకారం స్థలం వెతికే పనిలొ పడ్డాడు. వాళ్ళ వూరు తరచుగా వెళ్లేవాడు . యిపుడు అక్కడ అతనికి పరపతి బాగా పెరిగింది. విదేశాలకి వెళ్లి డబ్బు సంపాదించి యిక్కడ ఆస్తులు కొని ఈగోని తృప్తి పరుచుకొవాలనుకుంటున్నాడు. నేను మౌనంగా వుండటం తప్ప మాట్లాడటానికి ఏం వుందని??

          మళ్ళీ అతను వెళ్ళే రోజు వచ్చింది. నేను దిగులుగా వుండటం చూసి ”  నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఉమా…………… ఎంతో మంది దుబాయ్ వెళ్లి వుద్యోగ విషయాల్లొ మోసపోయి అక్కడ వుండలేక యిక్కడికి రాలేక అష్ట కష్టాలు పడుతున్నారు . వాళ్ళ భార్యల్తో పోల్చుకుంటే తెలుస్తుంది నీ అదృష్టం ” అన్నాడు.

          నాకు తిండికీ, బట్టలకీ డబ్బు పంపినంత మాత్రాన నేను సుఖంగా వుండి వుంటానని అతననుకుంటే అది చాలా అమాయకత్వం. నిట్టూర్చాను.

          అతను యిండియా వచ్చిన పని విజయవంతంగా నెరవేర్చాడు. మంచి సెంటర్లో స్థలం కొన్నాడు. నన్ను మళ్లీ యింకో వారసుడి కోసం సిద్ధం చేసాడు.

          ఫోన్లో నేను చెప్పింది వినగానే ” ఈ సారి పాపయినా ఫర్వాలేదు ” సర్దుకుపోతున్నట్లు అన్నాడు.

          అమ్మకి విసుగు ఎక్కువైంది. పనిచేసి చేసీ అలసిపోయేది. పసిపిల్లాడితో పనంటే మాటలా?

          ఈ సారి కానుపయ్యాక రెండు నెలలకి మించి వుండను. నాకు మాత్రం సంసారం లేదా ? నా కొడుకూ, కోడలూ ఏవనుకుంటారు ? మీ అత్తని పిలిపించుకుంటావో, మీ ఆయన్నే రప్పించుకుంటావో … నేను మాత్రం వుండను ” ఖరాఖండిగా చెప్పింది.

          నాకేం బాధ వెయ్యలేదు.అమ్మ పట్ల, ఆమె చేసిన సేవ పట్లా కృతఙ్ఞతా భావం కలిగింది.

          ఈ సారీ సుఖ ప్రసవం అయి ఆడపిల్ల పుట్టింది. రెండో సంవత్సరం నెల రోజుల సెలవు మీద వచ్చాడు . “యిక పిల్లలు చాలు” అన్నాడు. నన్ను ఆపరేషన్ చేయించుకోమని, మళ్లీ ఎందుకో ‘వద్దులే’ అన్నాడు.

          వాళ్ల నాన్నకి డబ్బిచ్చి , యింటి ప్లాన్ యిచ్చి, యిల్లు కట్టించి అద్దెకివ్వమని చెప్పాడు. అతను బయల్దేరి వెళ్ళేపుడు ‘ నేను మిమ్మల్ని వదిలి వుండలేకపోతున్నానండీ !” కన్నీళ్లతో అన్నాను.

          “అలా అంటే ఎలా ? మనం డెవలప్ అవ్వొద్దా. నువ్వు నన్ను ప్రోత్సహించాల్సింది పోయి నిరుత్సాహపరిస్తే ఎలా?” కొంచెం విసుగా అన్నాడు.

          ఏదో మనసులొ వున్న బాధని ఆపుకోలేక అడగడమే గానీ అతను తన మాట వింటాడన్న ఆశ వుంటే కదా! అమ్మ వెళ్ళిపోతానన్న విషయం చెప్పి అత్తయ్య గారిని పంపమన్నాను.’ ఈ పిల్లాజెల్లతో అమ్మ పడలేదు గానీ పనిమనిషిని పెట్టుకో . డబ్బు కొంచెం ఎక్కువ పంపిస్తా ! ‘ అన్నాడు.

          అతను వెళ్ళిపోయాడు.

          అమ్మ వెళ్ళిపోయింది.

          నేనే మిగిలాను యిద్దరు పిల్లలతో.

          ఇంతకాలం వరస కానుపులతో వుక్కిరి బికిరైన మనశ్శరీరాలు నెమ్మదిగా సేదతీరసాగాయి. పనమ్మాయిని పెట్టుకున్నాను. పిల్లల పని తప్ప మిగతా పనేమీ కష్టం అన్పించేది కాదు.

          ఖాళీ సమయంలొ అతను గుర్తొచ్చేవాడు. మధురోహలు మనస్సుని చీల్చుకుని శరీరం మీద దాడిచేసేవి. నా పరిస్థితే యిలా వుంటే అతనెంత అవస్థ పడుతున్నాడో అనిపించేది.

          “సవ్వడైతే చాలు ప్రభూ ! రివ్వున స్మర శరం దూసుకుపోతోంది” ఓ రోజు అతనితో ఫోన్లో అన్నాను. అర్థం కాలేదన్నాడు. రిపీట్ చేశాను. అతను మౌనం వహించి మాట మార్చాడు. అతనంత కంట్రోల్లో వున్నపుడు తనిలా బైట పడినందుకు సిగ్గనిపించింది.

          పిల్లలతో తను బైటికి వెళ్లలేకపోవడంతో మెయిల్స్, ఛాటింగ్ తగ్గాయి. మాటల్ని డబ్బుతో తూకం వేసి అపుడపుడూ ఫొన్లో ఆచితూచి మాట్లాడుకోవడం తప్ప దూరాల్ని దగ్గర చేసుకున్న తృప్తి కలిగేది కాదు.

          మూడో సంవత్సరం సెలవు దొరకలేదనీ రాలేననీ అతను చెప్పినపుడు భోరున ఏడ్చాను. విరహం యింత భయంకరంగా వుంటుందని యిప్పటి వరకూ తెలీదు. యిది మనసుదా? శరీరానిదా ? అన్న ప్రశ్న మనసులొ వుదయించినపుడు పాపభీతితో వణికి పోయాను. యింకో సంవత్సరం అతని తోడు కోసం, అతని కౌగిలికోసం, అతన్ని చూడటం కోసం ఆగాలన్న విషయం వుండటం గుబులు పుట్టించింది.

          నేను మామూలుగా మనిషిగా స్వచ్ఛమైన ఆడదానిగా వుండటం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకి తపస్సు ఫలించి దేవుడు ప్రత్యక్ష్యమైనట్లు నాలుగో సంవత్సరం నిండేసరికి అతనొచ్చాడు. ఈ సారి ఎలాగైనా అతన్ని వెళ్ళనివ్వకూడదు ‘సంపాదించింది చాలదా’ అని గట్టిగా అడగాలని నిశ్చయించుకున్నాను.

          ఆ రోజు రాత్రై పిల్లలిద్దరూ నిద్రపోయాక డాబా మెట్ల మీద వెన్నెల్లో కూర్చుని అతని భుజం మీద తలానించి కువకువలాడుతూ ” ఆ వెన్నెల చూడండి ఎంత వెచ్చనవుతొందో ……. ఈ సన్నజాజులు సువాసనతో ఎలా మత్తెక్కిస్తున్నాయో ! ఈ పిల్ల గాలి మీకు హత్తుకుపొమ్మని ఎలా ఆఙ్ఞాపిస్తోందో ! యిదంతా మనం పక్కపక్కన వుండబట్టే కదా !”  నా స్వరం నాకే మధురంగా విన్పించింది. అతని స్పర్శతో తనువంతా మత్తెక్కుతోంది………..

          అతను ఒక్క క్షణం నా వంక నిదానించి చూసి “జీవితం అంటే విచ్చలవిడితనం కాదు . జీవితం అంటే బాధ్యత…………. అది ఆడవాళ్ళ కనీస బాధ్యత. అతను “బాధ్యత” అన్న మాటని మూడుసార్లు ఒత్తిపలికి చివ్వున లేచి లొపలికి వెళ్లిపోయాడు.

          నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఈ సంవత్సరం అతనిలో ఏదో మార్పు కనిపిస్తోంది. యిదివరకులా తనని దగ్గరికి తీసుకోవడం కోసం అతృత పడటం లేదు. ఎన్నో సంవత్సరాలనుంచీ కాపురం చేస్తున్న వాళ్ళలా యాంత్రికంగా వున్నాడు.అతనన్న మాటల్ని జీర్ణించుకునే లొపే సెలవులయిపోయి వెళ్ళిపోయాడు.

          ఇక ఆ తర్వాత నుంచీ నా తిప్పలు ప్రారంభమయ్యాయి. తండ్రో , భర్తో అన్నొ పక్కన లేని ఆడదాన్ని చూస్తే చాలా మంది మగాళ్లకి’ ట్రై’ చేసి చూడాలన్న వుత్సాహం పొంగి పొర్లుతుందనుకుంటా! ఏదో రకంగా మాట్లాడించడం కోసం ఆరాటపడేవారు. మొహంలొకి చిరాకునీ, మాటకి పెళుసుదనాన్నీ అద్దెకు తెచ్చుకుని అలాంటి వాళ్ల నుంచి తప్పించుకునేదాన్ని.

          కానీ తోడు కోసం మనసు ఆరాటపడేది .మోహం వెల్లువెత్తేది. ప్రేమగా పలకరించేవారి కోసం సరదాగా కలిసి నవ్వుకునె వారి కోసం హృదయం వెతికేది…. బుద్ధి వద్దనేది ………..అదిగో అలాంటి సమయంలొనే పరిచయం అయ్యాడు నవీన్. మా పక్కింట్లొ అద్దెకి దిగాడు. టీచరట , బ్యాచిలర్ కావటంతో మంచినీళ్ళకోసం, పాలతోడు కోసం వచ్చేవాడు. నేను ముభావంగానే వుండేదాన్ని . కానీ నవీన్ తన వాక్చాతుర్యంతో నన్ను నవ్వించాలని చూసేవాడు . నన్ను చూడగానే అతని చూపులు ఆరాధనగా మారిపోవడం……….నన్నో అపురూపమైన వ్యక్తిగా చూడటం నన్ను మైకంలొ పడేసేవి.

          ఓ రోజు మా ఇంట్లో నా ఎదురు కుర్చీలొ కూర్చుని మాట్లాడుతున్నవాడల్లా లేచి సోఫాలో నా పక్కన కూర్చుని నా చెయ్యి పట్టుకు ” మీ చెయ్యి చూసి జాతకం చెబుతాను ” అంటూ ఆత్రుతగా నా వంక చూశాడు. అతని వేళ్ళు నా చేతిని మృదువుగా నిమురుతున్నాయి.

          ఎంత కఠినమైన పరీక్ష యిది……………!! నేను తలదించుకుని మొహంలొ చిన్న సిగ్గుతెరని పలికిస్తే చాలు ………. అతను ప్రొసీడవుతాడు.

          ఆ నిమిషంలొ నా అంతఃక్షేత్రంలొ జరిగిన సంఘర్షణ లో నేనే విజయం సాధించాను తలెత్తి అతని వంక చూస్తూ ” నవీన్! ఒకవేళ నేను నా భర్తకు విడాకులు యిచ్చి నా పిల్లలతో సహా మీ దగ్గరికి వస్తే నన్ను పెళ్ళి చేసుకుంటారా?”అడిగాను.

          నివ్వెరపోయాడతను . ఠక్కున నా చేయి వదిలేసి “ఎందుకండీ! బంగారం లాంటి మీ కాపురం గురించి అలాంటి మాటలు ” అంటూ తడబడి కాసేపు యిబ్బందిగా అటూ యిటూ చూసి వడివడిగా లేచి వెళ్ళిపోయాడు . నాకు నవ్వొచ్చింది . యిలాంటి అవకాశవాది మాటలా కొన్నాళ్ళయినా నన్ను మైకంలో ముంచాయి ! ఆ తర్వాత ఎంతో అవసరమైతే తప్ప అతను యిటు తొంగి చూడటంలేదు.

          ఈ సంఘటనతో నేనో నిశ్చయానికి వచ్చాను. మా ఆయన్ని ఎలాగైనా యిండియా రప్పించాలి. ముందు చెప్పినట్లుగా అయిదేళ్ళు అయిపోవచ్చాయి. అతను ఫోన్ చేసినపుడు ఈ విషయమై పట్టుబట్టాను.

          “ఇపుడు నీకొచ్చిన యిబ్బంది ఏంటో ? విసుగ్గా అన్నాడు.

          “మీకేమి యిబ్బంది లేదా ? ఎదురు ప్రశ్నించాను

          “నాకేం వుంటుంది ?” అసహనంగా అన్నాడు.

          “మీరు పూర్తిగా ఆనందంగా వున్నారా ?” సూటిగా అడిగాను.

          ఏవర్థమయిందో ఏమో తత్తర పడి ఆ తర్వాత విసురుగా ఫొన్ పెట్టేశాశు.

          నాకొక విషయం అర్థమైంది.అతను యిప్పట్లో యిండియా రాడు.డబ్బు సంపాదన అతనికి రుచిగా వుండి వుండొచ్చు. కానీ యితర సంతృప్తులు ఎలా లభిస్తున్నాయి? నా మనసులొ అనుమానం అంకురించింది .భయంతో వణికిపోయాను . ఎవరితో ఏవని చెప్పుకోను?

          కొన్నాళ్లకి తెలిసింది నా అనుమానాలు నిజమేనని. దుబాయ్ నుంచి మా నాన్న దూరం చుట్టం వస్తూ మా ఆయన కథని కూడా తెచ్చాడు. యిండియా నుంచి ఆయన లాగే సంపాదన కోసం వెళ్లిన ఓ యువతీ , మా ఆయన కలిసి అక్కడ భార్యభర్తలుగా చెలామణి అవుతూ ఒకే ఇంట్లో వుంటున్నారు.

          కళ్ళ ముందు ప్రపంచం గిరగిరా తిరుగుతున్నదనిపించింది. తర్వాత అర్థమైంది. ప్రపంచంకాదు మా వైవాహిక బంధమే సుడిగుండంలో చిక్కుకుని గిరగిరా తిరుగుతోందని.

          తన కొడుకు బాగు చూసి ఓర్వలేక ఆ చుట్టాలాయన యిలాంటి పుకారు పుట్టించాడని చెప్పి మా అత్తామామలు ఆయన యింటి మీద పడి గొడవ చేసారు. దాంతో అతనికి మంటెక్కిందనుకుంటా. అతను మళ్లీ దుబాయ్ వెళ్ళాక ఆ యువతీ, మా ఆయన సన్నిహితంగా బయట తిరుగుతున్నప్పుడు ఫొటోలు, వీడియో తీసి పంపాడు.

          ఇక అందరూ నమ్మారు. కానీ ప్లేట్ మార్చేశారు. ‘మగాడన్నాక ఎన్నాళ్లని కోరికలను అణచిపెట్టుకుంటాడు ? పెళ్ళాం పిల్లల్ని పోషిస్తునాడు కాబట్టి నోరు మూసుకుని పడుండమన్నారు అత్తమామలు. అమ్మానాన్నలు ఓ ఏడుపు ఏడ్చి వూరుకున్నారు .

          అతనితో ఫోన్ లొ గొడవపడితే “అదంతా ట్రిక్ ఫొటోగ్రఫీ …………….నమ్మొద్దు “అన్నాడు. తను లాజిక్ తియ్యబోతే “యింకా విషయాలు వదిలేయి . ఈ మాత్రం ఫోన్లు కూడా చెయొద్దా?” గట్టిగా అనే వాడు. అందులొ అంతర్లీనంగా వున్న బెదిరింపు బెంబేలెత్తించేది. యిక పెళ్లికి ముందు తను ఊహించుకున్న అందమైన, ఆదర్శమైన జీవితం తనకి లేనట్లే ! యింతకీ అతను తనని పెళ్ళెందుకు చేసుకున్నాడు ? ఈ ప్రశ్న పదే పదే వేధించేది.

          కాలక్షేపం కోసం చదివే పుస్తకాలే తనకి సమస్యల మూలాల్ని విప్పి చెప్పాయి. అతను ఈ పితృస్వామ్య సమాజానికి ప్రతినిధి. అతను సొంత ఆస్తిని సంపాదించుకుంటాడు. ఆ ఆస్తిని  తన ద్వారా పుట్టిన పిల్లలకి సంక్రమింపచేస్తాడు. ఈ క్రమంలొ అతనికి వారసుల్ని కనిచ్చి వాళ్ళని జాగ్రత్తగా సంరంక్షించడమే స్త్రీల పని……తనపని.. అందుకే తను అతనికి పనికొచ్చే వస్తువుగా మాత్రమే కనిపించింది.

          శతాబ్దాల తరబడి స్త్రీ పనిముట్టు లేదా భోగ వస్తువు,…… అవును…. వస్త్రం, ఆభరణం, గంధం , పుష్పం, తాంబూలం మొదలైన వాటిలా స్త్రీ భోగ వస్తువుని మన పండితులెపుడో సిద్ధాంతీకరించారు.

          ఆ కాలంలొ ప్రతి రాజుకీ భార్యలు, ప్రియురాళ్ళు, యుద్ధాలలో జయించి తెచ్చుకున్న స్త్రీలు కలిపి అనేక వందల మంది. వాళ్లంతా ప్రతి రాత్రీ సింగారించుకుని తమ హృదయాధినాధుని కోసం విరహంతో వేగిపోతూ ఎదురుచూసేవారు  ఒక్కొక్కరూ సంవత్సరం పైన ఎదురుచూడాలి.

          ఇంతమందిలొ రాజుకు ఏ స్త్రీ అయినా అధికంగా నచ్చి ఆమె దగ్గర ఎక్కువ రోజులు వుండిపోతే ! అందుకే భర్త కోసం,………………… భర్తలొ వున్న మగాడి కోసం ఆ అంతఃపుర రాణులు సాగించిన అంతఃకలహాలూ, అసూయలూ, మారణహోమాలు……….యివి చరిత్ర చెప్పని సత్యాలు.

          ఆ అంతఃపుర రాణులు అడవి గాచిన వెన్నెలలు.

          ఆ లక్షలాది స్త్రీలు ఏళ్ల తరబడీ మోహాల్ని ధ్వంసం చేసుకున్న విరహానలలు. చరిత్ర ఆ విధ్వంసానికి మేలి ముసుగు తొడిగింది. పురుషుల విశృంఖలత్వాన్ని రసికతగా భ్రమింప చేసింది.

          అంతఃపురద్వారపాలకులుగా మగవారిని గాక ఆడవారిని, నపుంసకులను నియమించండలోని వాస్తవికత అర్థమవుతోంది.

          నాకిపుడు దుఃఖం కుదిపేస్తోంది…… అప్పటికీ యిప్పటికీ మగవాళ్ళింతేనా ? ఆడవాళ్ళూ యింతేనా ?

            నేనిలా ఆందోళనగా వున్న సమయంలొ మా అత్తామామలు ఏదో పని మీద సిటీ వచ్చి” పిల్లల్ని చూడటం కోసం” మా ఇంటికి వచ్చారు. వాళ్ళకి చేయవలసిన మర్యాదలన్నీ చేస్తున్నాను.సాయంత్రం అయిదు గంటలకి నవీన్ వరండాలో నిల్చిని ఖాళీ వాటర్ బాటిల్ చేతికొచ్చి మంచినీళ్ళడిగాడు.

          మా అత్తామామలు తొంగి చూసి మొహాలు మాడ్చుకున్నారు. బహుశా నవీన్ వచ్చినందుకు కాబోలు. వాళ్ళు ఒక్క రోజు కూడా వుండలేదు. ఆ రాత్రికే వెళ్లిపోయారు.

          తెల్లారే సుధాకర్ ఫోన్ …………. అతను నా దినచర్యనీ……….. నా చుట్టుపక్కల ఎవరుంటారన్న దాని గురించి అడిగాడు. అతని మాటలు ఒకింత పరుషంగా వున్నాయి.

          తర్వాత గంటకి అమ్మానాన్నల ఫోన్ ……….మొగుడి గురించి భయంలేకుండా చెడు తిరుగుళ్ళు మొదలు పెట్టిన ఆడదాన్ని లోకం ఎలా కాకుల్లా పొడుచుకు తింటుందో వాళ్ళనీ వీళ్ళనీ వుదాహరణాలుగా చూపించి అన్యాపదేశంగా హెచ్చరించారు.

          మూడో రోజుకల్లా మా అత్తగారూ, మరిదీ లగేజీతో వచ్చారు . వాళ్ల మాటల్ని బట్టి తేలిందేంటంటే వాళ్లిక్కడే వుండబోతున్నారు. మామూలుగా అయితే చాలా సంతోషించే దానే !

           కానీ వాళ్ళు నాకు ‘కనపడని యినుప కచ్చడాలు’తొడగడానికి పంపబడిన వాళ్లు. మనసు అయిష్టంగా మారింది. అతనిలో మరో ముఖపు వికృతత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాను.

          ఇక అప్పట్నుంచి అడుగు తీసి అడుగేస్తే సవాలక్ష సందేహాలూ, ప్రశ్నలూ, పాతివ్రత్య ధర్మపు బోధనలు, ఫోన్లో అతని అనుమానపు వేధింపులూ వీటితో విసిగిపోయాను. అతన్ని యిండియా వచ్చేయమని వాదించి అలసి పోయాను.

          చివరికి నేనొ నిశ్చయానికి వచ్చాను. యింతవరకూ మా బంధంలో శిథిలమైనవి ఏవైనా వుంటే అవలానే రాలిపోనీ !  ఆ స్థానే యికనైనా అనురాగం, చిగుర్లెత్తాలి. అలా అతనికి యిష్టం లేకపోతే తను తన జీవితాన్ని పునర్నిర్మించుకోవాలి.

          దీనికి ప్రాంరంభంగా అతను యిండియా రావాలి. లేదా నన్ను దుబాయ్ తీసుకెళ్ళాలి. మేమిద్దరం కలిసి ఆనందంగా జీవితం గడపాలి. యిందుకు అతను అంగీకరించాలనీ లేదా విడాకులకు సిద్ధపడాలనీ లాయర్ నోటీస్ యిప్పించాలని బయల్దేరాను.

          “ఎక్కడికీ పెత్తనాలు ?” మా అత్తగారు ముచ్చటగా అడిగింది. నేను సమాధానమివ్వలేదు.

          రోడ్డుమీద పెద్ద వూరేగింపు. ప్రపంచీకరణ నేపథ్యంలో శిథిలమవుతున్న మానవ సంబంధాల గురించి ఆందోళన చేస్తున్నారు వాళ్ళు. రెండొందల మంది పైగా మగవాళ్ళున్న ఆ వూరేగుంపులో పట్టుమని పదిమంది ఆడవాళ్ళు కూడా లేరు. నేనూ ఆ గుంపులొ కలిసాను. ” ఆకాశంలో సగం’విస్తృతిని అర్థం చేసుకోలేక యిరుకిళ్లలో బంధించి తాళాలు వేశారు. అవిపుడు విరిగి పోతున్నాయి తెలుసా? నా పక్కనాయనతో అన్నాను. అతను అయోమయంగా చూశాడు. నేను మనసారా నవ్వి స్వేచ్ఛగా మిగతా వారితో గొంతు కలిపి నినదించాను.

4 వ్యాఖ్యలు

4 thoughts on “మరో ముఖం

 1. madamji, indulo uma nirnayaanni “bhaagundi”ani vokka maatalo cheppe mundu chaalaa vishayaalu discuss cheyyali ,konni suchanalu-konni pariskaaraalanu vethakaali.1.aarthikaswaatantramu lekundaa ammayiki pelli cheyyakudadu.chaduvu-svayamupaadiki dohadapade vidyalu cheppinchaali.2.ammayini samasyalanu dairyangaa yedurkunetatlugaa penchaali.3.naveen laanti vaallu cheppE maatalaku (vokavela nenu pellichesukuntaanu ani mosam cheste?)longanatha lokajnaanaanni ivvali.4.sudakar laanti vaallaku-dabbu kante viluvainavi chaalaa vunnayane vishayaanni gurthucheyyali…….abhipraayaalu,nirnayaalu maarinappudalla mana mukhamu maro mukha mavuthundi.inkaa e kathalo anni paatralu prastutha samaajaanni prathiphalinchayi.so gn8.(telugulo raayaalani naaku vundi,kaani naaku computer knowledge thakkuva -thondarlone telugulone palakarinchukuntaamani haamiisthu)

  • మల్లిక్ గారూ,
   కధ సారాంశాన్ని చక్కగా విశ్లేషించారు.అంతే కాకుండా కధాంశం లోంచి
   పాఠకుడు ముందుకెళ్ళి ఎన్ని రకాలుగా ఆలోచించాలో మీ సూచనలు
   తెలియజేస్తున్నాయి.ఓపికగా చదివి సమీక్షించినందుకు ధన్యవాదాలు.
   బ్లాగ్లోకమంతటా మీ కామెంట్ల విశ్వరూపమే…పది నిమిషాల్లో తెలుగులో
   రాయడం నేర్చుకోగలరు.మిత్రుల సాయం తీసుకోండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s