స్త్రీలకు ప్రయాణం

స్త్రీలకు ప్రయాణం

                కెయన్ మల్లీశ్వరి

          నాకు అతనంటే ఎంతిష్టమో .. ఎంచగ్గా నవ్వుతాడో !! వెన్నెల పింజలు పింజలుగా రాలుతున్నట్లు వుంటుంది. ఎంత ప్రేమగా చూస్తాడో !! కాంతి వానలో నిండారా తడుస్తున్నట్లు వుంటుంది. ఎలా స్పర్శిస్తాడో !! మత్తెక్కించే అడవిపూల పరిమళం బరువుగా చుట్టుముట్టినట్లు వుంటుంది.

          సుమ తదేకంగా మనోహర్ వంకే చూస్తోంది. నిద్రలో అమాయకంగా పసిపిల్లాడిలా కనిపిస్తోన్న అతన్ని మరీమరీ చూడాలనిపిస్తోంది

          చూస్తున్న కొద్దీ అనందంతో, ప్రేమతో, అల్లరితనంతో నవ్వు వుబికి వుబికి వస్తోంది. మనోహర్ కి చెరోవైపు పడుకున్న బాబూ , పాప అతని మీద కాళ్ళూ, చేతులూ యిష్టం వచ్చినట్లు పడేసి నిద్రపోతున్నారు. భూభారాన్ని ఎంతో సహనంతో భరించే భూమాతలా నిద్రలోనూ పెదాల వంపులో చిందులేస్తున్న నవ్వుతో ఆనందంగా పడుకున్నాడు మనోహర్.

        అనురాగంతో అతని నుదుటిని చుంబించింది.

          మెలకువ వచ్చింది మనోహర్ కి . కళ్ళు విప్పాడు……… ఎదురుగా సుమ …………అతని కళ్ళు నవ్వాయి. పెదాలు విడివడ్డాయి.

          “ఇంకాసేపు పడుకోరాదూ ! ………..” అన్నాడు.

          “అయిదున్నరయింది………” అతని నుదిటి మీద జీరాడుతున్న వెంట్రుకల్ని పైకి తోస్తూ అంది.

          “వూ …………”అంటూ తన మీద పడున్న పిల్లల కాళ్ళూ చేతుల్ని మెల్లగా తప్పించి లేచాడు.

          ఇద్దరూ కలిసి వంట చేసుకుంటుండగా హఠాత్తుగా సుమకి ఓ విషయం గుర్తొచ్చింది… నిన్న సాయంత్రం ఆఫీసు నుంచి బస్టాప్ కి నడిచి వస్తుండగా తన కొలీగ్ అడిగిన ప్రశ్న ………..” మీ వారిని చాలా సార్లు చూసాను……….. మాట్లాడాను … మీరంటే ఆయనకి అంతులేని ప్రేమవున్నట్లుగా అన్పిస్తోంది . అసలు మీరంటే ఆయనకి ఎందుకంత యిష్టం ?…………”అంది.

          తనకి వెంటనే ఏం సమాధానం చెప్పాలో తెలీలేదు. నవ్వేసి వూరుకుంది………….అవునూ ………మనోహర్ కి తనంటే ఎందుకిష్టం ??………………. తలతిప్పి అతని వంక చూసింది……………. చాలా ఏకాగ్రతతో కారెట్ ని కట్ చేస్తున్నాడతను………………. ముచ్చట పడుతూనే.

          “మనూ! …………నేనంటే నీకెందుకు యిష్టం?…………….. అడిగేసింది సుమ. తల తిప్పకుండానే ముసిముసి నవ్వులు రువ్వాడు. చేస్తున్న పని వదిలేసి వచ్చి “చెప్పవా?” గారంగా అడిగింది.

          అప్పుడు తల తిప్పి అత్మీయంగా ఆమె వంక చూశాడు.

          “ప్లీజ్ ……”బతిమిలాడుతున్న స్వరంతో అడిగింది సుమ . జవాబు చెప్పడానికి అతనేం సంకోచించలేదు. ఆలోచించలేదు………..చాలా స్పష్టమయిన కంఠంతో……..

          ” నీవ్యక్తిత్వం అంటే యిష్టం నాకు…………నువ్వు నన్ను నగలూ, బట్టలూ కొనిచ్చేవాడిలా చూడలేదు………. ‘నన్నూ , పిల్లల్నీ , నువ్వే పొషించూ’ అనలేదు. మన అనుబంధం పట్ల చాలా శ్రద్ధగా వుంటావు…………… కుటుంబాన్ని నడిపే బాధ్యత  నాదొక్కడిదే అని నువ్వెప్పుడూ భావించలేదు. మనిద్దరిలో ఎక్కువ తక్కువలు లేవన్న ఙ్ఞానాన్ని నీ సాహచర్యంలోనే నేర్చుకున్నాను……… అంతెందుకు నువ్వు నీలా వుంటావు………… నన్ను నాలా వుండనిస్తావు.అందుకే నువ్వంటే యిష్టం …….” చెప్పాడు.

          చిరునవ్వుతో మొహం వికసించగా మళ్ళీ పనిలో పడింది సుమ. ఎనిమిదిన్నర కల్లా తయారయి ఆఫీసుకి బయలుదేరింది . హాలు దాటుతుండగా టీపాయ్ మీదున్న శుభలేఖ ఆమెని ఆకర్షించింది.

          అంత అందంగా వుంది ఆ కార్డు………….. అది చేతిలోకి తీసుకుని చూస్తుండగా మనోహర్ వచ్చాడు. నా బెస్ట్ ఫ్రెండ్ మధు మారేజ్ కార్డ్ అది…………….నిన్న ఆఫీసుకి వచ్చింది….. వాడు వుద్యోగంలో డెవలప్ మెంట్ కోసం ఆ దేశం , ఈ దేశం తిరుగుతూ ముప్ఫయి మూడేళ్ళు వచ్చే వరకూ పెళ్ళి ప్రయత్నం చేయలేదు. యిదిగో యిప్పుడు ఆసక్తి కలిగినట్లుంది……….రోజూ ఫోన్ చేసి చెపుతూనే వున్నాడు. రెండురోజులు ముందే రమ్మని……….. నీకు సెలవు దొరుకుతుందా ? వెళ్దామా? ” అడిగాడు.

          “వూ ! …………ఎక్కడా పెళ్లి ? ……….. ఆసక్తిగా అడిగింది.

          “మా పెద్దమ్మ గారి వూళ్ళోనే…. ఏలూరు దగ్గర వట్లూరులో……………” చెప్పాడు.

          సుమ పెళ్ళి కార్డుని ఓపెన్ చెయ్యగానే అందులోంచి గులాబీ పువ్వు రంగులో , అదే షేప్ లో వున్న పేపర్ కింద పడింది.

          సుమ సంభ్రంగా తీసి చూసింది………అందులోంచి’ స్త్రీలకు ప్రయాణం ‘అన్న అక్షరాలు కన్పించాయి.

          “ఇదేంటి ?……….. ఆశ్చర్యంగా అడిగింది.

          “నీకు తెలీదా …………. ఆ కార్డు లేకపోతే ……” అంటూ ఏదో అనబోయి గబుక్కున మాటలు మింగేసి తడబడ్డాడు.

          వింతగా చూసింది సుమ . ఆమె పుట్టడం, పెరగడం అంతా వైజాగ్ లోనే. మనోహర్ ది విజయవాడ. చదువు నిమిత్తం ఆంధ్రా యూనివర్శిటీ లో చేరి అక్కడ పరిచయయిన సుమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . యిద్దరి కులాలు వేరు…. ఆహారపు అలవాట్లు వేరు. ఆచార సంప్రదాయాలు వేరు…..ఈ భిన్నత్వం తమ జీవితం మీద ఏ ప్రభావం చూపించకుండా వుండటానికి ముందే మనస్సు విప్పి మాట్లాడుకున్నారు. యిద్దరి మనసులూ నొప్పించని ఆచారాలని పాటించాలి. అంతే! యిప్పటి వరకూ ఏ పొరపొచ్చాలు లేకుండా జీవితం పూలనావలా సాగిపోతోంది.

          “ఏయ్  ! మనూ ……..చెప్పు ……….యిలా ఎందుకు రాసారు …..? కార్డ్ మగవాళ్ల పేరున వేస్తారు కదా !…………ఆడవాళ్ళు బాధపడతారని యిలా వేశారా ?………..నేనెపుడూ యిలాంటి కార్డులను చూడలేదు ……ఆడవాళ్ళని యిలా గౌరవించే వాళ్ళూ వుంటారా?” సుమ అంటుంటే మనోహర్ తల అటూ ఇటూ కాకుండా వూపేసాడు.

          “ఈ పెళ్లి కి నేనూ తప్పకుండా వస్తాను………..” డిక్లేర్ చేసింది సుమ……

          రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లో ఏలూరు చేరుకున్నారు సుమ, మనోహర్ , పిల్లలు. మధు స్టేషన్ కి కారు పంపించాడు. ఆమె ఏలూరు ఎపుడూ రాలేదు. అందుకే వట్లూరు వచ్చేటప్పుడు తను డిగ్రీ చదివిన సి.ఆర్.రెడ్డి కాలేజీని సుమకీ పిల్లలకీ చూపించాడు మనోహర్. నాన్న చదివిన కాలేజ్ చూడటానికి విండొ సీట్ కోసం పోటీ పడ్డారు బాబు, పాప.

          ఊరి చివరి రైసుమిల్లు దగ్గర మనోహర్ పెద్దమ్మగారిల్ల్లు…..ఆవిడ యిద్దరు కొడుకులూ అమెరికాలో సెటిలయ్యారు.ఆమె , ఆమె భర్త యిద్దరే వుంటారు. పెద్ద మండువా లోగిలి యిల్లు. చుట్టూ పొలాలు………. వాటి మీద ఎగురుతున్నకొంగలు.ప్రాణం లేచి వచ్చింది సుమకి. మనోహర్ పెద్దమ్మ శాంతమ్మ సుమని ఆప్యాయంగా పలకరించింది.

          మర్నాటి వుదయం పిల్లలు పొలంలో వున్న బోరు దగ్గర నీళ్ల కుండీలో స్నానం చెయ్యాలని వుబలాటపడ్డారు. సుమకి కూడా వుత్సహంగా అన్పించింది. నలుగురూ కలిసి పాలేరుని వెంట పెట్టుకుని శాంతమ్మకి చెప్పి బయల్దేరుతుంటే  “నువ్వొద్దులేమ్మా!…..” యధాలాపంగా సుమతో అందామె.

          “ఏం అత్తయ్య ?………… “తెల్లబోతూ అంది సుమ.

          “మనవైపు ఆడాళ్ళు పొలాలకి వెళ్ళరు . ఎవరికన్నా తెలిస్తే నవ్వుతారు . మనూ నువ్వు వెళ్ళరా !…” అందామె

          మొహం ఎర్రబడింది సుమకి. పొలం వెళ్ళడం తప్పా?మనోహర్ వైపు చూసింది. మనోహర్ కి ఏం చెప్పాలో తోచలేదు. పాలేరుని పిల్లల్ని తీసుకుని వెళ్లమని చెప్పి మనోహర్ ఆగిపోయాడు.

          ఈ సారి ఆశ్చర్యపడటం శాంతమ్మ వంతయ్యింది. సుమ ఎందుకు డల్ అయిందో అర్థం కాలేదు.ఆ అమ్మాయి మంచి కోసమేగా తను చెప్పింది అనుకుని సుమ వెంట వెంటే తిరుగుతూ ఏవో కబుర్లు చెప్పి నవ్విస్తూ సుమని మామూలు స్థితికి తెచ్చింది.

          మనోహర్ మధుని కలిసి వస్తానని వెళ్ళాడు. పెళ్ళి రాత్రికే !… పెళ్ళికూతురిదీ ఈ వూరే !… అందుకే పెళ్ళికి యింకేవూరు వెళ్ళాల్సిన అవసరంలేదు.

          సుమ , శాంతమ్మ కూర్చుని మాట్లాడుకుంటుంటే ఓ యాభై ఏళ్ళ వ్యక్తి వచ్చి వాకిట్లోంచే ” శాంతమ్మగారూ !………………. పిలిచాడు.

‘ ఆఁ ‘ లోపలి నుంచే పలికిందామె.

          “ధనకోటేశ్వరరావు గారి అబ్బాయి మధుబాబు పెళ్ళి సందర్భంగా ఈ పొద్దున్న మగోరికి భోజనాలు……… తప్పకుండా రావాలి …………..” పాఠం చదివినట్లుగా చెప్పి వెళ్లిపోయాడు.

          నిర్ఘాంతపోయి వింది సుమ.. “మగవాళ్ళకి భోజనాలేంటి?……………….” అర్థంకానట్లు అడిగింది.

          “పెళ్ళి రాత్రికిగా! ఓ పూట ….వూళ్ళో ముఖ్యమైన యిళ్ళలో మగవాళ్ళకి భోజనాలు పెడతారు. మీమావయ్య ,మనూ,బాబు వెళతారు . నీకూ, నాకూ, పాపకి వంట చేస్తాలే ……” అని శాంతమ్మ అంటుంటే అయోమయంగా చూసింది.

          తమ పెళ్ళయిన యిన్నేళ్ళలో మొదటిసారిగా తమ కుటుంబంలో ఓ విషయంలో యిద్దరికి అర్హత వుండటం, మరో యిద్దరికి అర్హత లేకపోవడం చూస్తోంది.

          “ఆడవాళ్ళని ఎందుకు పిలవరు …………?” అసంకల్పితంగా అడిగింది…………..

          “ఊరంతా భోజనాలు పెట్టలేరు ! అదీకాక కుటుంబపెద్దనీ, అతని వారసుల్నీ అందరూ గౌరవించాలి కదమ్మా!……అంది శాంతమ్మ.

          మనసు మెలిపెట్టినట్లయింది సుమకి. “అలా పిలవలేనపుడు బాగా ముఖ్యులనుకున్న పది పదిహేను కుటుంబాలలో అందరినీ పిలుచుకోవచ్చుగా !………. అంది సుమ.

          పదునుగా వున్న ఆమె కంఠ స్వరం విని నివ్వెరపోయింది శాంతమ్మ . సుమ భావాలు ఆమెకి అర్థంకాలేదు….

          దిగులుగా కూర్చుంది సుమ………కాసేపటికి మనోహర్ వచ్చాడు.అతనికీ తనకీ మధ్య ఏదో దూరం ఏర్పడినట్లు వుంది…….

          “మధు వాళ్ళింట్లో మొగాళ్ళకి భోజనాల్రా, మీరు వెళతారుగా!…………….” అంది శాంతమ్మ.

          మనోహర్ మొహం చిన్నబోయింది. తనని పట్టుకుని వుయ్యాల వూగుతున్న పాపని గుండెలకి హత్తుకుని సుమ వంక ఆర్తిగా చూస్తూ.

          “ఊహూ! ………….యిక్కడే చేస్తాను ………….రాత్రకి అందరం కలిసి వెళతాం………….” చెప్పాడు.

          కొంచెం మనసు తేలిక పడింది సుమకి. పడుకుని లేచి మధు వాళ్ళింటికి వెళుతూ సాయంత్రం ఏడింటికల్ల రెడీగావుండమని చెప్పాడు.

          మనోహర్ అటు వెళ్లగానే “ఆ ! ……….. ఏడని చెపుతారుగానీ మగాళ్ళ బంతులు అయ్యెసరికి తొమ్మిది దాటుతుంది. నువ్వు ఎనిమిదిన్నరకి వెళితే సరిపోతుందిలే అంది.

          “మగాళ్ళ బంతులేంటి ?……… “మళ్ళీ ఏం వినాల్సి వస్తుందోనని బితుకుబితుకుమంటూనే అడిగింది.

          “ముందు మాగాళ్ళ భోజనాలు అయ్యాకే ఆడాళ్ళకి భోజనాలు పెడతారు………”

          “ఎందుకలా?” సుమ అడిగింది.

          “ఎందుకేంటి ? మగాళ్ల తిన్నాకే కదా ఆడాళ్ళు తినాలి” అందామె.

          కళ్లప్పగించి చూసింది సుమ. ఆమెకి తను ఎంత అఙ్ఞానంలో వుందో అర్థమయింది. తను బాగున్నట్లే లోకం అంతా బావుందని అనుకుంది. వుహూ…… లోకంలో అంతా సుఖంగా లేరు. మరీ ముఖ్యంగా ఆడాళ్ళు గౌరవంగా జీవించడం లేదు.

          సాయంత్రం ఆరు వరకూ అన్యమస్కంగానే గడిపి స్నానం చేసి తయారయి….. శాంతమ్మ దగ్గరకి వచ్చి “మీరూ రెడీ అవండి………”అంది సుమ.

          “మాకు స్త్రీలకి ప్రయాణం లేదమ్మ ! నేనురాను మీ మావయ్య వస్తారు……” అందామె.

          సుమకి తను చూసిన శుభలేఖ అందులోని ‘స్రీలకి ప్రయాణం ‘కార్డు గుర్తొచ్చింది . ఏదో లింక్ అందుతోంది. మనసులో అనుమానం సుళ్ళు తిరుగుతోంది.

          “అలా ఎందుకు రాస్తారు ?…………..” అడిగింది సుమ.

          ” ‘స్త్రీలకి ప్రయాణం’  అని వుంటేనే ఆడవాళ్ళు పెళ్లికి వెళ్లాలి………లేకపోతే కేవలం మగాళ్ళే వెళ్ళాలి……………..” చెప్పింది శాంతమ్మ.

          తలంతా హోరు…………యిదేంటీ?……………..యిలా అవమానించడం ఏంటి ? ప్రతి అంశంలోనూ తేడానే ?అది మాత్రమే కాదు ఆమెని బాధపెడుతున్నది.అతని చుట్టాల యిళ్ళ నుంచి స్త్రీలకి ప్రయాణం లేని కార్డులే యిప్పటి వరకూ వచ్చాయి… అంటే వాళ్లెవరికీ ,మనోహరే కావాలి కానీ తనక్కరలేదు. అన్నింటికన్నా ముందు వాటిలో రెండు మూడు పెళ్ళిళ్ళకి మనోహర్ వెళ్ళాడు. అంతేకాదు………..రాజమండ్రి పెళ్లికి వెళుతూ బాబుని వెంట పెట్టుకుని కూడా వెళ్ళాడు.

        అంటే అతనూ-బాబూ ఒకటీ, తనూ-పాప ఒకటా? పాపకీ, తనకీ లేని కొన్ని అర్హతలు వాళ్ళకి వున్నాయా?…….గుండె బరువుగా మారింది.

          పెరట్లో నూతి గట్టు మీద కూర్చుని ఆలోచిస్తోంది సుమ……..బాబు , పాప తూనీగల్లా ఎగురుతూ ఆడుతున్నారు.. యిద్దరినీ పట్టి పట్టి చూసింది. తనకేం తేడా కనిపించడం లేదు. లోకానికెలా కనిపిస్తోందో !………….” దిగులుగా అనుకుంది.

          దూరం నుంచి మనోహర్ ఆత్రంగా తనవైపే రావడం కన్పిస్తోంది. అతని ప్రేమలో కల్మషం లేదు. అది తనకు తెలుసు .కానీ అతను తనని అక్కర్లేదనుకున్న వాళ్ళదగ్గరికి వెళ్ళాడు.

          “ఏంటి సుమా డల్ గా వున్నావు ?……..ఆమె తల నిమురుతూ అడిగాడు.

          అతని కళ్లలోకి లోతుగా చూసింది . తన పట్ల ప్రేమతో స్వచ్ఛంగా వున్నాయవి.

          ” ‘స్త్రీలకి ప్రయాణం ‘వుంది కాబట్టి నన్ను తీసుకొచ్చావు కదూ!” అడిగింది.

          విస్తుపోయి చూశాడు మనోహర్.

          “నేను , పాప వద్దనుకున్న వాళ్ళకోసం నువ్వూ, బాబు వెళ్ళారు” ఆవేదనగా అంది.

          అతని కళ్ళు బాధతో విలవిల్లాడాయి.

          “నేను అంత దూరం ఆలోచించలేదు. నేను పుట్టిన దగ్గర నుంచే ఈ సంస్కృతీ, ఆచారాల్లో లీనమయుపోయాను. వాటిని పాటిస్తున్నాననుకున్నాను.” మనోహర్ చెపుతుండగా మధ్యలోనే అతని మాటల్ని ఆపేసి ” నీకు తప్పుగా అనిపించలేదా ?……….” ఆరాటంగా అంది.

          అతను అంతర్ముఖుడయ్యాడు.

          “ఈ పద్ధతి ………… ఒక కుటుంబాన్ని ఆడా, మగా పేరుతో రెండుగా విడగొడుతున్నట్లు నీకనిపించడం లేదా?…….. మగాళ్ళని మాత్రమే భోజనాలకి పిలిచే సంస్కృతీ, స్త్రీలకి ప్రయాణం అని చెపితేనే తప్ప వాళ్ళు పెళ్ళిళ్ళకి బయల్దేరలేని దుస్థితి , ముసలాళ్ళయినా , గర్భిణులయినా , చిన్నపిల్లలయినా మగాళ్ళు భోజనం చేస్తే తప్ప వాళ్ళు చేయలేని పరిస్థితీ,……. యివి నీకు నచ్చాయా?…………. యిందులో లీనమవడం నీకిష్టమా ?…………” ప్రశ్నించింది సుమ.

          “మనమేం చెయ్యగలం……..” అసహాయంగా అన్నాడు మనోహర్.

          “చెయ్యగలం,………….కనీసం మనకోసం…………….మన సంతృప్తి కోసం ఏదో ఒకటి చెయ్యగలం ……..ఈ వివక్ష లేని చోటికే మనం వెళదాం ………ఈ వివక్ష కూడదని అందరికీ చెపుదాం నవ్వుతారా నవ్వనీ !…..ఆడవాళ్ళని కించపరిచే యిలాంటి సాంప్రదాయాల్ని రూపుమాపడానికి కృషి చేశామన్న సంతృప్తి మిగులుతుంది……….” అంది సుమ.

          సాలోచనగా తలూపాడు మనోహర్.

          “మధు ఈ రోజు మనిద్దరినీ పిలిచాడు కాబట్టి హమ్మయ్య స్త్రీలకి ప్రయాణం వుందని నేను బయల్దేరొచ్చు…………….కానీ నాలాంటి ఆడవాళ్ళనే చాలా మందిని అవమానించారు. అందుకే యిపుడేం చెయ్యాలో చెప్పు………అంది సుమ.

          లేచి నిలబడ్డాడు మనోహర్…..”ఈ రోజు రాత్రికే బస్ లో వైజగ్ వెళ్ళొపోదాం………. తర్వాత ఫోన్ లో అతనికి మన ఫీలింగ్స్ చెపుతాను………………..” అన్నాడు.

          సుమ హృదయం తేలికయింది.

          అందుకే నాకు అతనంటే ఎంతిష్టమో!!…………….

స్త్రీలను…..వూహూ మనుషులను ఎంత బాగా గౌరవిస్తాడో!!….హిమాలయ పర్వతం కళ్ళముందు నిల్చున్నట్లు వుంటుంది.

13 వ్యాఖ్యలు

13 thoughts on “స్త్రీలకు ప్రయాణం

 1. sthreelaku prayanam ani vunte vallau thappakunada ravalani ardham kani adi lekapothe pelliki ravoddu ani kadu anukunta..
  aada vallaki ade vullo aithe bottu pedatharu , band tho special ga oka group ga velli. ado pedda veduka.
  Maga vallaki oka manishi(magavadu :-)) vachi bhojannaiki chebuthadu simple ga :-(.
  vere vullalo vallaki velli special ga bottu petti cheppadam kudaradu kabatti ee special caption. inka 15 years back aithe oka chinna card, subha lekha tho vesevallu( andulo bottu peduthunna bomma vundedi)
  naku telisi vijayawada arealo sthreele ee card lekapothe pelliki vellevaru kadu. aithe adi vallu special ga pilavaledani anthe kani vallu ravaddu annaru anikadu.

  kani mee anubhavam verega vundemo naku theleedu.
  2)sthreelaku prayanam ani lekapothe pelliki only magavalle ravai ani ardham aithe ,pelliki only maga vallanu piliche pelli ekkadina chusara meeru?
  3) bhojananiki 1 manishi ni piliche alavatu ..
  general ga ekkuva cheyyaleni vallu intiki oka manishi ki ani chebutharu.
  4) magavallaku bhojanam cheppetappudu avi ekkuvaga magavvallu chese karyakramalu ayi vuntayi. like dinam/dasadina karma/sraddham
  5) adavallaku mathrame cheppe bhojanalu kuda vuntayi .. like perantam/sravana masam nomulu/ samartha/atla vayinalu /inka chala vunnayi
  asalu oka rakam ga cheppalante ‘adavaalku mathrame’ type ekkuva functions vuntayi.

  ivanni naa swanubham lo jariginavi /jaruguthunnavi .. anthe kani ekkada streelaku atleast indulo jarigina anyayam emi ledu ani naku anipinchindi..

  Mee anubhavam vere ayi vundavachu..

  kotha konam nunchi chusaru kani adi biased ga vunda kudadu kada…

 2. madamji,manaku istamunna lekapoinaa idi ‘purushadikyatha samaajamu’.maa praanthamulo ‘shtrilaku prayaanamu’laantivi levu.pellindlaku bhandu,mitra samethamugaa rammani aahvaanamu vuntundi,ladies pelliki raakapothe vaallu enduku raaledho- pellivaallaku convenient gaa cheppesariki ikkadi mogavaariki thala praanamu thokaku vastundi.idi kevalamu voka arealo (or)konni castelalo vundhemo,e aachaaramu ekkadavunna idi chaalaa anyaayamu.maaruthunna samaajaaniki anugunangaa e aachaaraanni rupumaapadaaniki andaru krushi cheyyali.ika bhojanaala vishayaaniki vasthe-suma abhipraayamutho nenu yekibhavisthaanu.manamu entha naagarikulamu ane vishayamu-manamu entha maanaveeyamugaa vunnaamu,maanavathaa viluvalanu etuvanti vivaksha lekundaa paatistunnamu ane daani meeda aadharapaduthundi,anthegaani -carlu,cellphonelu,dth lu,rocketlu,chandrayaanlu kaadu.paatha kaalamulo theliso,theliyako,vokariki bhayapado konni thappulu,vivaksha jarigivundochhu kaani neti pragathiseelasamaajamulo manaku sarvasvamu aame ayina ‘shtrimoorhini’anni vishashaalalonu gouravaneeya sthaanamulo vunchaalani korukuntu-sanscrit lo voka sukthiki telugulo arthamu-ekkadaithe sthreelu navvuthu ,aanandamugaa vuntaaro akkada dhevathalu naatyamu chestharu ani.voka manchi vishayaanni sprushinchina meeku-as usual our agreement.

 3. “మనభావాలు అలా లేవుకాని వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకు? పెద్దవాళ్ళు మారారు సర్దుకుని పోదాం” అనకుండా ఈ కథలో కథానాయకుడు నిజమైన కథానాయకుడనిపిoచుకున్నాడు.

 4. మల్లీశ్వరి గారు,

  ఇలాంటి సాంప్రదాయం..గురించి ఇదే వినడం. మగవాళ్లు తిన్నాకా తినే పధ్ధతి నా చిన్నప్పుడు మావైపు కుటుంబాల్లో చాలా సాధారణం. ముందర పిల్లలు (లేదా.. పిల్లలు వేరే పక్క, తర్వాత మగవారు, ఆ తర్వాత ఆడవాళ్లు..). కానీ గత పదేళ్లు గా చూడనే లేదు.

  ఇక జ్యోతిర్మయి గారి కామెంట్ తో పూర్తి గా ఏకీభవిస్తాను..

  • ఆ కధ రాయడానికి నాలుగైదు నెలలు ముందు కాబోలు ఏలూరు మా అమ్మ గారింటికి వెళ్ళినపుడు అలాంటి కార్డ్ చూసానుఽలాగె వాళ్ళు వచ్చి మగవాళ్ళకి మాత్రమె భోజనాలకి చెప్పి వెళ్ళడం తో ఆ కధ రాసాను

 5. అబ్బా మీ కధా నాయకురాలు నచ్చింది కాని, కధతోనే కాస్త ,. మరి ఆ సంప్రదాయం ను దగ్గరగా చూడడం వల్లనేమో. మగవారికి ఉండే పరిచయాలు ఆడవాళ్ళకి ఉండవు కదా? కాస్త దూరం పరిచయాలు, చుట్టరికాలు పురస్కరించుకొని ఇంటికి ఒకరిని పిలవడం , ఆ పిలిచేదేదో ఇంటి పెద్దని పిలవడం వల్ల వివక్ష గా కాక, గుర్తు పెట్టుకున్నారన్న సంతోషం ఉండేది. ఇంకా మరీ ఎక్కువమందికి పెట్టలేని వారు కాస్త దగ్గరి వాళ్ళని కూడా ఇదేవిధంగా పిలుస్తారు.

  ఇక మగవాళ్ళ భోజనాలు ముందు పెట్టడం అంటారా. వాళ్ళు త్వరగా తినేస్తారు అనుకుంటాను. ఒక్కోసారి వాళ్ళవి అయ్యేదాకా వేచి చూడడం చిరాకేస్తున్దనుకోండి.

  ఇదంతా ఊరిలోని వారిగురించి , కాని ఇలా దూరంగా ఉన్నవారు స్త్రీలకు ప్రయాణం ఉందా లేదా చూసుకొని ఏర్పాట్లు చేసికోవాల్సి రావడం అస్సలు బాలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s