మీరే కారణం

               మీరే కారణం

                           ——-కె.యన్.మల్లీశ్వరి

          రాధిక హుషారయిన పిల్ల. ఎపుడూ చిరునవ్వుతో వుల్లాసంగా ఆడుతూ, పాడుతూ కనిపిస్తుంది. ఆ రోజు ఎప్పటిలాగే స్కూలు నుంచి రాగానే వాళ్ళమ్మకిచెప్పి ఆడుకోవడానికి బయటికి వచ్చింది. ఆట పాటల్లో చురుగ్గా వుండే అమ్మాయి కావడంతో ఆమె మిత్ర బృందానికి అనధికారికంగా ఆమే లీడర్……….

          ఆ బృందానికి రాధిక మాట వేదవాక్కు . ఆమె ఏ ఆట ఆడదామంటే వాళ్ళు ఆ ఆట ఆడక తప్పదు. చిత్రంగా వాళ్ళలో రాధిక తప్ప అందరూ మగపిల్లలే ! రాధికకి చిన్నప్పట్నుంఛీ ఆడపిల్లలు ఆడుకునే చింతపిక్కలాట.. తొక్కుడు బిళ్ళ… వామన గుంటలు ..అష్టాచెమ్మ మొదలైన ఆటలు నచ్చేవికావు.

          స్వేచ్ఛగా ఆరు బయట ప్రదేశంలో వురుకులు , పరుగులు పెట్టే ఆటలంటే ఆ పిల్లకి యిష్టం. రాధిక ప్రకాశరావు చిన్నప్పట్నించీ కూతుర్ని గుండెల్లో పెట్టుకుని పెంచాడు .మొదట పాప పుట్టినపుడు యింటికి మహాలక్ష్మి పుట్టిందని సంతోషించాడు.రెండో కాన్పులో మగపిల్లాడు కలిగినపుడు పున్నామ నరకం తప్పిందని సంతృప్తి చెండాడే గానీ హృదయంలోకి తొంగిచూసుకుంటే కూతురంటేనే ప్రేమ పొంగులు వారేది.

          తండ్రి ప్రేమ కూడా నిండారా దొరకడంతో రాధికలో చైతన్యం తొణికిసలాడుతూ  ఉండేది.యింట్లో నానమ్మకీ, అమ్మకీ, తమ్ముడంటేనే ఎక్కువ యిష్టం అని అపుడపుడూ అన్పించినా తండ్రి ప్రేమ సాయంతో అందరి ప్రేమనీ పొందగలిగింది.

          రాధికని చూడగనే ఆమె స్నేహితులంతా చుట్టుముట్టేశారు. ” యీ రోజు ఏ ఆట ఆడదాం ?” ఓ అబ్బాయి  అడిగాడు. రాధిక నడుం మీద చెయ్యేసుకుని నిలబడి ఓ నిమిషం ఆలొచించింది.

          అదే సమయంలొ ఆఫీస్ నుంచి వస్తున్న ప్రకాశరావుకి రాధిక కనిపించి లూనా ఆపాడు.అతను సాధారంగా ఆ సమయంలొ ఆఫీసు నుంచి రాడు…అతను యింటికి వచ్చేసరికి రోజూ ఎనిమిది దాటుతుంది.పండగ దగ్గర పడటంతో పిల్లలకి బట్టలు కొందామని ఆఫీసులో పర్మిషన్ పెట్టుకుని వచ్చాడు. రాధికని పిలవబోతుండగా ఎదురొచ్చారు తమ పక్కింట్లొ వుండే భార్యాభర్తలు. వాళ్ళ మనస్తత్వాలు తమకు విరుద్ధం కావడంతో వాళ్ళకి దూరంగా వుంటాడు ప్రకాశరావు.

          హఠాత్తుగా వాళ్ళు కనబడడంతో బలవంతంగా చిరునవ్వు నవ్వాడు. వాళ్లిద్దరు ఆగారు………….అతను ప్రకాశరావునుద్దేశించి “మీ అమ్మాయి కోసం ఆగారా ? మగపిల్లలతో ఎపుడు చూసినా గెంతులే! అవి ఇప్పటికి తెమలవులెండి. రోజూ యిదే తంతు. మొన్నటికి మొన్న క్రికెట్ ఆడుతూ మీ ఎదురింటి కిటికీ అద్దం పగలగొట్టింది. వాళ్ళు యింటి మీదకి వస్తే మీ మిసెస్ సర్దిచెప్పలేక అష్టకష్టాలూ పడ్డారనుకొండి. అయినా ఆడపిల్లని అణుకువగా, ఒద్దికగా వుండేలా పెంచాలి గానీ యిలాగా? చూడండి , నడుం మీద చెయ్యేసుకుని ఎలా నిలబడిందో !” చిన్నగా నవ్వుతూ నవ్వుతూనే అనాల్సినవన్నీ అనేస్తుంటే ప్రకాశరావు మొహం ఎర్రబడింది.

          ఆఫీసుకి వెళ్ళడం, రావడం , కొంచెం తీరిక వుంటే పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పించుకోవడం….అంతే ! కానీ కూతురి గురించి యిలా అనుకుంటున్నారని ప్రకాశరావుకి తెలియదు.

          చాలా అవమానంగ అన్పించింది. ఆడపిల్ల తండ్రిని అనుకోగానే రకరకాల భయాలూ, ఆందోళనలూ చుట్టుముట్టాయి. యింతకు ముందులేని కొత్త అలోచనలేవో కలుగుతున్నాయి. విసురుగా లూనా స్టార్ట్ చేసి వేగంగా నడుపుతూ యింటికి వచ్చాడు. ఎవరు పలకరించినా పలకలేదు. కాళ్ళయినా కడుక్కోకుండా కుర్చీలొ కూర్చున్నాడు. భార్య, తల్లి వంట గదిలోనే వుండిపోయారు.

          కను చీకట్లు ముసురుకుంటూన్నాయి. ఆ తర్వాత పది నిమిషాలకి ఆటలు ముగించుకొని రాధిక, తమ్ముడు విష్ణు వచ్చారు, వరండాలో కుర్చీలొ కూర్చున్న తండ్రిని చూసేసరికి రాధికకి సంభ్రమం కలిగింది. తండ్రి ఆఫీసు నుంచి ముందుగా, వచ్చేశాడన్న సంతోషంతో “నాన్నా! ……….వచ్చేశావా?” అంటూ పరిగెత్తుకుని వెళ్ళింది. ప్రకాశరావుని చుట్టేయబోతుంటే అతను విడిపించుకుని, లేచి నిలబడి, కూతురి వీపు మీద ఛెళ్ళున చరిచాడు……….

          ముందుకి పడబోయి నిలదొక్కుకుని మిన్ను విరిగి మీద పడినంత ఆశ్చర్యంగా చూసింది రాధిక.

          “మగరాయిడిలా మగపిల్లలతో ఏంటా గెంతులు ? యింట్లో ఆడుకోవచ్చుగా ! యింకోసారి అలా కన్పించావంటే కాళ్ళిరగ్గొడతాను. నీకు ఆడుకోవాలనిపిస్తే ఆడపిల్లలతో యింట్లో ఆడుకో అంతే ……”తర్జనితో బెదిరించి చరాచరా లోపలికి వెళ్ళిపోయాడు ప్రకాశరావు. చెయ్యి వెనక్కి తిప్పి చురచురలాడుతున్న వీపుని తడుముకుంటూ అపనమ్మకంగా తండ్రి వెళ్ళిన వైపు చూసింది. అతను కనుమరుగు కాగానే ఆమె విష్ణు వైపు తిరిగింది.

          ఆ పిల్లాడూ కాసేపు అయోమయంగా చూసి తనకి దెబ్బలు తప్పాయి కదా అన్న సంతోషంతో లోపలికి పరుగెత్తాడు. తన తప్పేంటో రాధికకి అర్థం కాలేదు. వుక్రోషంతో  కన్నీళ్ళు వస్తుంటే తన మొహం ఎవరికీ చూపించలేక పెరట్లో వేసి వున్న మంచం మీద పడుకుంది.

          నానమ్మ వచ్చి అన్నం తినమని బతిమలాడితే ససేమిరా తిననంది. చివరికి తల్లి వచ్చి బుజ్జగించడం ప్రారంభించింది.

          “నీకా మగపిల్లల్తో ఆటలొద్దని చెప్పానా ?”  అంది తల్లి.

          “తప్పేంటి ?” రోషంగా అంది రాధిక.

నాన్నమ్మ అందుకుంది అపుడు. “తప్పు కాదా మరి ? ఆడపిల్లలంటే ఎంత వినయంగా వుండాలి. నిదానంగా మాట్లాడాలి. నెమ్మదిగా నడవాలి. వంచిన తల ఎత్తకుండా బైటకి వెళ్లి రావాలి. మా కాలంలొ ఎలా వుండేవాళ్ళమనుకున్నావూ ? మా నాన్న నన్ను బళ్ళోనె వెయ్యలేదు. చిన్నపుడు పక్కింటి  అబ్బాయి అడిగాడని బిందెలో నీళ్లిస్తే, మా నాన్న కర్రతో వెంటబడి మరీ కొట్టాడు . యింకా మీ నాన్న చాలా మంచోడు. నిన్ను చదివిస్తున్నాడు ఏం కావాలంటే అవి కొనిస్తున్నాడు…. అలుసిచ్చాడు కదాని నెత్తినెక్కకూడదు……..” ఆవిడ    హిత బోధ చేసింది.        

          రాధికకి ఆ మాటాలేం నచ్చలేదు, అర్థం కాలేదు కూడా. తండ్రి నిరాదరణను తట్టుకోలేకపోతోంది . ఆ రాత్రికి తల్లిని కరుచుకొని పడుకుని “నాన్న చెప్పినట్లుగా వుంటే యింకెప్పుడూ కొట్టరు కదూ!……… ” వెక్కుతూ అడిగింది రాధిక.

          “వూ !….ఆ అబ్బాయిలతో  ఆటలు, గెంతులూ మాని కుదురుగా వుంటే నాన్న ఏమీ అనరు……..”అంది తల్లి

          అసంతృప్తిగా వున్నా తండ్రి ప్రేమకొసం తలాడించింది రాధిక . అపుడామె వయసు తొమ్మిదేళ్ళు.

          ఆ కాలనీలోకెల్లా బుద్ధిమంతురాలైన పిల్ల ఎవరూ అంటే చాలా మంది రాధిక పేరే చెబుతారు . కాలేజీకి వెళ్ళేపుడూ, వచ్చేపుడూ, ఎవరూ ఆమెని బయట చూడలేదు. యింట్లో  చదువుకోవడం, యింటి పనుల్లో తల్లికి సాయం, చేయడం, కుట్లూ అల్లికలూ నేర్చుకోవడం……….యిదే ఆమె ప్రపంచం…….

          “ముత్యం లాంటి పిల్లమ్మా !ఎంత అణకువ !! ఎంత విధేయత…..రోడ్డు మీదకి వచ్చిందంటే తలఎత్తదు………యిలాంటి పిల్లను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు ! ” అని ఎవరైనా పొగుడుతుంటే ప్రకాశరావు హృదయం గర్వంతో పొంగిపొయేది. ఆ రోజు కాలేజి నుంచి యింటికి రావడానికి బస్టాప్ లో నిల్చుంది రాధిక. సాయంత్రం అయిదు గంటల సమయం కావడంతో బాగా రష్ గా వుంది ఆ ప్రాంతం…. 

          రాధిక తల వంచుకుని నిల్చుంది.బస్ వచ్చిన శబ్దం వినబడితే మాత్రం తలెత్తి చూస్తోంది. యింతలొ బస్టాప్ లో రయ్యిన వచ్చి ఆగింది ఓ బైక్. దానిని పక్కన పార్క్ చేసి ఓ యువకుడు రాధిక దగ్గరికి రాసాగాడు.

          దూరం నుంచే అతన్ని చూసి మరింత కుంచించుకుపొయింది ఆమె. భయంతో నాలుక పొడారిపోయింది.

          ఆమెని సమీపించాడతను. “మీరు ఈ రోజు ఎలాగైనా మీ పేరు చెప్పాల్సిందే !” అన్నాడు.

          తలెత్తలేదు ఆమె. వణికిపోతూ వాలు చూపులు చూడసాగింది. అది మరింత ముచ్చటగా అన్పించింది ఆ అబ్బాయికి.

          “ఇన్ని రోజుల్నుంచి ట్రై చేస్తున్నాను. మీరు నాతో ఒక్క మాటకూడా మాట్లాడలేదు. పోనీ ఈ లెటరయినా తీసుకొండి. నా హృదయం యిందులో వుంది” రెండడుగులు ముందుకేసి అన్నాడు.

          నాలుగడుగులు వెనక్కి వేసి నిస్సహాయంగా బస్సొచ్చె వైపు చూసింది. యిదంతా తనకి అసలు యిష్టం లేదు. తనతో మాట్లాడొద్దనీ, తనకి యిలాటివి యిష్టం వుండవనీ గట్టిగా చెప్పలని వుంది. గొంతు పెగలడం లేదు.

          బస్టాప్ లో ,  చాలామందే వున్నారు. విషయం అర్థం కాకపోయినా వీళ్ళిద్దరి మధ్యా ఏదో జరుగుతోందని కనిపెట్టి వినోదం చూడ్డానికన్నట్లు నిల్చున్నారు.

          అఫీసు నుంచి వస్తున్న ప్రకాశరావు కళ్ళబడిందా దృశ్యం. అతని రక్తం సలసలా మరిగింది.

          బస్టాప్ లో, యింత మంది మధ్య తన కూతురు ఎవడితోనే మాట్లాడుతోంది. అంతే ! యింకేం ఆలోచించలేదు. లూనా తెచ్చి సరాసరి కూతురి ముందు ఆపాడు. రాధిక బిక్కచచ్చిపోయింది.

          ప్రకాశరావుని చూసి ఆ అబ్బాయి క్రాఫ్ సవరించుకుంటూ పక్క చూపులు చూడసాగాడు. రాధిక వచ్చి తండ్రి వెనకాల కూర్చుంది. యింటికి రాగానే హాలు తలుపులు మూశాడు ప్రకాశరావు. కూతురి చెంప ఛెళ్ళుమనిపించాడు. కెవ్వుమంది రాధిక. ఆ అలికిడికి గబాగబా వచ్చారు తల్లీ, నానమ్మ. విషయం అర్థం కాక అయోమయంగా చూడసాగారు.

“ఎవడు వాడు ?” రౌద్రంగా అడిగాడు ప్రకాశరావు.

“నాకు తెలీదు నాన్నా !” చెంప పట్టుకు కన్నీళ్ళతో అంది.

“తెలీకుండానే అంత మందిలో నీ పక్కన నిల్చుని మాట్లాడుతున్నాడా ?”

          “నిజం నాన్నా ! పేరు చెప్పమని వారం నుంచి  వెంటపడుతున్నాడు. ఈ రోజు వుత్తరం తీసుకోమని గొడవ పెడుతున్నాడు. భయంతో నిల్చున్నాను . నేను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు నాన్నా !….’ దీనంగా అంది రాధిక.

“బస్టాపులో అంత మంది అమ్మాయిలున్నారు. వాళ్లెవరితోనూ మాట్లాడని వాడు నీతోనే మాట్లాడాడంటే ఏంటి అర్థం ? నువ్వు అలుసు యివ్వకపోతే వాడు అలా ఎందుకంటాడు ?”

మెదడు మొద్దుబారిపోయింది రాధికకి. తండ్రి, తనని కన్న తండ్రేనా ఈ మాటన్నది…….నమ్మలేనట్లు ఆయన వంక చూసింది రాధిక.

          ఎవరి మీదో, దేని మీదో వున్న అసంతృప్తి యిలా బయటపడుతోంది. దానిని అంగీకరించడానికి మనసు ఒప్పుకోవడం లేదు ప్రకాశరావుకి.

          “ఏదేమైనా యిక నువ్వు యిల్లు కదలడానికి వీలు లేదు ” శాసనం చేస్తున్నట్లుగా అన్నాడు ప్రకాశరావు.

          “అయ్యో !  నిక్షేపంలా చదువుకుంటున్న పిల్లని “భార్య ఏదో అనబోయింది…………..చెయ్యెత్తి ఆమెని వారించాడు.

          “చదివి మనని వుద్దరించేది ఏం లేదు. సంవత్సరం, రెండేళ్లలో కొంచెం కూడదీసుకుని పెళ్ళి చేసి పంపిస్తే మన భారం తీరిపోతుంది.” సాలోచనగా అన్నాడు.

          నిలువెల్లా దుఃఖం కుదిపేసింది రాధికని.

          “నేను చదువుకుంటాను నాన్నా ! ” ధైర్యాన్ని కూడదీసుకుంటూ అంది. కూతురి మొహం తేరిపార చూడగానే కోపం స్థానంలో ప్రేమ కలిగింది ప్రకాశరావుకి.

          కూతురి తల నిమురుతూ “నలుగురూ నాలుగు రకాలుగా అనే అవకాశం మనం ఎవరికీ యివ్వకూడదమ్మా . నీకు అంతగా చదవాలనిపిస్తే ప్రైవేటుగా చదువు. పుస్తకాలవీ కొని తెస్తాను”అన్నాడు.

          ఇష్టం లేకపోయినా, ఆ మాత్రం అవకాశం అయినా చిక్కినందుకు సంతోషిస్తూ “అలాగే నాన్నా!”అనేసింది రాధిక. అపుడామె వయసు పద్దెనిమిదేళ్ళు.

*                  *                  *                  *                  *                  *                  *                *

          రాధిక ప్రైవేటుగా డిగ్రీ పూర్తి చేసింది. వెంటనే యింతకాలం కష్టపడి కూడబెట్టిన డబ్బుతో రాధిక పెళ్ళి చేశాడు ప్రకాశరావు. రాధిక భర్త మోహన్ ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న వుద్యోగి . కష్టపడి పని చేస్తాడు. మంచివాడు. జీతం తక్కువైనా పిల్లని బాగాచూసుకుంటాడని చెప్పి పెళ్ళి చేసారు. రాధిక కూడా వున్నంతలొ గుట్టుగా సంసారాన్ని గడిపేది. యిద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు. బాబుకి నాలుగేళ్ళు, పాపకి రెండేళ్ళు.

          మొహన్ కి జీతం పెరిగినా, దానితో పాటే ఖర్చులూ పెరిగాయి. ఓవర్ టైమ్ కూడా పనిచేసేవాడతను.

          ఇంటిపనీ, వంటపనీ, పిల్లల్ని పెంచడం తప్ప మరో ప్రపంచం ఏదీ రాధికకు తెలీదు .ఆమె గడపదాటి బయట అడుగుపెట్టడమే గగనం.

          భర్తకి ఎంత జీతం వస్తుందో, ఎంత డబ్బు వుంటే జీవితం సాఫీగా సాగుతుందో, యిలాంటి ఆర్థిక విషయాలేవీ ఆమెకు తెలీదు. అవసరమైనవి మోహన్ తెచ్చి పడెస్తాడు. రాధిక వాటితో యిల్లు గడిపేస్తుంది .అంతే !         

          ఇలాంటి సమయంలో వురుము లేని పిడుగులా ఓ రోజు సాయంత్రం మోహన్ చావుకబురు యింటికి చేరింది. ఓవర్ టైమ్ చేస్తూ, అలసటని ఆపుకోలేక నిద్రపోవడంతో అతను పని చేస్తున్న కెమికల్ ఫాక్టరీలో మంటలు చెలరేగాయి………..అతను చనిపోయాడు.

          షాక్ లో వుండిపోయింది రాధిక. ఏడుపూ లేదు, మాటా లేదు. మతి పోయిన దానిలా చూస్తూ కూర్చుంది. ఎవరెవరో వస్తున్నారు. పోతున్నారు. దగ్గరికి తీసుకుంటున్నారు. కలగాపులగంగా ఏదో మాట్లాడుతున్నారు.

          చివరికి ఓ చాప చుట్ట తెచ్చి, యింటి ముందు పడేసి ‘యిదిగో నీ భర్త’ అన్నారు.

          గుండెలో గూడు కట్టిన దుఃఖమేదో అపుడు కరిగింది. పిల్లలిద్దరూ తల్లిని చుట్టుకుపోయారు. చూస్తున్న వాళ్ళ కళ్లు నీళ్లతో నిండాయి.

          అంతా ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు, తనూ, పిల్లలు.

          కాంపెన్సేషన్ కోసం తండి కాళ్లరిగేలా తిరిగాడు. ఫలితం లేదు. మోహన్ నిర్లక్ష్యం ఫలితంగా ఫ్యాక్టరీ చాలా నష్టపోవడం మాత్రమే కాక మరో యిద్దరు ఈ ప్రమాదంలొ మరణించారు. కాబట్టి పైసా కూడా యివ్వనని యజమాని తెగేసి చెప్పాడు.

          యూనియన్ సాయంతో ఆరు నెలల జీతం మాత్రం యిచ్చారు. అవి బ్యాంకులొ వేసి పాస్ బుక్ కూతురి చేతికిచ్చి, “మనింటికి వెళ్ళిపోదామమ్మా!” భారంగా అన్నాడు ప్రకాశరావు.

          ఈ స్థితిలొ పుట్టింట్లో వుండడం కష్టమనిపించినా తలూపింది రాధిక .

అపుడామె వయసు పాతికేళ్ళు.

                                                **********************

జీవితం భారంగా మారింది రాధికకి. తల చెడి పుట్టింటికి చేరిన ఆమె పట్ల యిరుగూ పొరుగూ జాలి చూపిస్తూ నిరంతరం ఆమె కష్టాన్ని గుర్తు చేస్తుండేవారు. మంచి కట్నం యిచ్చే సంబంధం రావడంతో విష్ణు పెళ్ళి చేశాడు ప్రకాశరావు. యింత మంది మధ్య విష్ణు భార్య యిమడలేకపోయింది. ముఖ్యంగా రాధికని చూస్తే ఆమెకి చిరాగ్గా వుండేది.

          ఎపుడూ దీనంగా , మొహం వేలాడేసుకుని, నీరసంగా ఓ మూలన వుండే ఆమెను చూస్తుంటే కంపరంగా వుండేది. సూటి పోటి మాటలు అంటుండేది ఆమె. కోడలిని ఏమీ అనలేని నిస్సహయత, కూతురి పరిస్థితి పట్ల అసహాయత కలిసి ప్రకాశరావు దంపతుల్ని వుక్కిరిబిక్కిరి చేసేవి.

          ఎంత ఈర్పుగా వున్నా తమ్ముడి భార్య ఏదో ఒకటి అంటుండటంతో ఓ రోజు తట్టుకోలేక రాధిక కూడాఏదో అంది.

          దాంతో ఆ అమ్మాయి శోకాలు పెడుతూ భర్తకి చెప్పింది. విష్ణు తండ్రి వంక అసహనంగా చూశాడు. ప్రకాశరావు కోడలిని ఏమీ అనలేక కూతురి మీదకి చెయ్యెత్తి,’ ఈ తద్దినాన్ని నెత్తిన పెట్టుకున్నాను.పోయినోడితో పాటే పోక……..యింకా ఎందుకిలా ?….’ చివరి మాటలు మింగేసి చరచరా బయటికి వెళ్ళిపోయాడు. ఆ మాటలకి రాధిక షాక్ తింది. అంతగా జీవితామంటే విరక్తి  ఎపుడూ కలగలేదు. యిప్పుడే చాలా ఎక్కువగా……యింకేమీ లేనట్లుగా………పిల్లల్ని వదిలేసి , పెరట్లోకి పరిగెత్తి బావిలోకి దూకింది.

          తల్లి, నానమ్మ గావుకేకలు విని విష్ణు బావిలోకి దూకి రాధికని పైకి తీశాడు.         

          యిరుగూ పొరుగూ అందరికీ తెలిసిపోయిందీ విషయం. అప్పటి నుంచీ ఎవరూ రాధిక ఎదురుగా మాట్లాడటం లేదు. రాధిక కూడా ఈ మూల గదిలోనే వుండేది.

          జీవితం అలా సాగుతుండగా,ఓ రోజు యింటికి ఓ కవర్ వచ్చింది. అది రాధికని బస్ కండక్టర్ గా జాయిన్ అవ్వమని ఆర్టీసీ నుంచి వచ్చిన ఆపాయింట్ మెంట్ ఆర్డర్.

          మోహన్ ఒకసారి తనతో సరదాగా అప్లయ్ చేయించాడు. తను యిష్టపడక పోయినా, అతని కొలీగ్స్ భార్యలందరూ అప్లయ్ చేశారని, పట్టుబట్టి తనతో దరఖాస్తు పెట్టించాడు. తనకెందుకు ఈ వుద్యోగం ? ఆ కాగితాన్ని మూలకి విసిరికొట్టబోయింది.

          “నువ్వు జాయినవ్వు” ప్రకాశరావు తల వంచుకుని అన్నాడు.

          “నేనా ?” ఆశ్చర్యంగా అంది రాధిక.

          వూ ! నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి .” నచ్చచెబుతున్నట్లు అన్నాడు ప్రకాశరావు.

          “ఇది కండక్టర్ వుద్యోగం నాన్నా!అంత మంది మగాళ్ళ మధ్యలో “తడబడుతూ అంది ………..రాధిక.

          ఛెళ్ళున చరిచినట్లయింది ప్రకాశరావుకి. తను చెప్పిన నీతులు తనకే ఎదురు తిరిగినట్లయ్యాయి.

ఆ!ఆ! తప్పదు. యింకా జీవితాంతం నిన్నూ, నీ పిల్లల్ని ఎవరు పోషిస్తారు?….. నేనున్నంత కాలం ఫరవాలేదు. మరి నా తర్వాత  ? అందుకే జాయినవు. బస్టాండుకి దగ్గరిలో గది చూస్తాను. నానమ్మని తోడుగా వుంచుకో ! మీ అమ్మా, నేను కూడా వస్తూ, పోతూ వుంటాం!” గబగబా చెప్పేసి వెళ్లిపోతుంటే విభ్రంగా చూస్తూ వుండిపోయింది రాధిక. నాన్న మాటలు కోతగా వున్నాయి. కానీ బాధించడం లేదు.

          ఆలోచిస్తూ కూర్చుంది. పిల్లలు లోపలికి వచ్చారు. వాళ్లు ఆరోగ్యంగా లేరు. సంతోషంగా లేరు. అవును  మరి , తండ్రి లేని పిల్లలు . ఆమెకు దుఃఖం వచ్చింది. అంతలొనే ఓ నిశ్చయానికి వచ్చింది. పిల్లల కొసమైనా తను ధైర్యంగా ఈ వుద్యోగం చెయ్యాల్సిందే!

                                      *********************

ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక వుద్యోగంలో చేరింది రాధిక. ట్రైనింగ్ లోనే అన్ని విషయాలూ తెలుసుకుంది. మొదటి నెల కాంపెక్స్ నుంచి గాజువాక రూట్ లో వేశారు.

          బాగా రద్దీగా వుండే రూట్ అది. మరీ ముఖ్యంగా వుదయం, సాయంత్రం ట్రిప్ లలో టికెట్లు కొట్టడం చాలా కష్టం.

          బస్ కి ముందు వైపు ఆడవాళ్ళుంటారు. అక్కడ సులభంగానే టికెట్లు యిచ్చేది.కానీ వెనుక వైపు మగాళ్ళ మధ్య నుంచీ వెళ్ళి టిక్కెట్లు యివ్వాలంటే టెన్షన్ తో చెమట్లు పట్టేవి.

          చెకింగ్ పాయింట్లో బస్ ని ఆపించి వెనుక డోర్    వైపు వెళ్లి అక్కడ టికెట్లు యిచ్చి మళ్ళీ ముందుకు వచ్చేది. దీంతో బస్ కాస్త ఆలస్యమయ్యేది.

          డ్రైవర్ విసుక్కునేవాడు.”లేడీ కండక్టరా ? యిక మనం ఈ రోజు వెళ్ళినట్లే !ప్రయాణీకులూ విసుక్కునేవారు. అంతా గాభారాగా, భయంగా వుండేది రాధికకి.

          లేటవడానికి డ్రైవర్ ఒప్పుకోకపోవడంతొ అందరి మధ్యలోంచి వెళుతూ టికెట్లు యివ్వక తప్పని పరిస్థితి . ఆమె యిబ్బందిని ఓ టీచర్ గమనించింది. ఆమె పేరు రజని. రోజూ ఆ రూట్  లోనే ప్రయాణించేది. స్టాప్ కీ స్టాప్ కీ మధ్యగ్యాప్ లో రాధిక అపుడపుడూ ఆమె పక్కన ఖాళీ వుంటే కూర్చునేది.

          రజని వికలాంగురాలు. ఆమెకి ఒక కాలు పోలియోతో చచ్చుబడిపోయింది.కానీ ఆమె మొహంలొ అంతులేని ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతూ వుండేది.

          ఓ రోజు మరీ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంది రాధిక. బస్ విపరీతమైన రష్ గా వుంది. జాగ్రత్తగా చూసుకుని అందరికీ టికెట్లు యివ్వాలి. ఎవరైనా ఒకరు టికెట్ తీసుకోకుండా చెకింగ్ లో దొరికితే తనకీ  పనిష్మెంటే !

          తను ఒదిగి ఒదిగి తోవ చేసుకుని వెళ్తున్న కొద్దీ తప్పుకుంటున్నట్లే తప్పుకుని మీద మీద పడుతున్నారు. కొందరి చూపులు తన శరీర భాగాల్ని దుస్తుల మీద నుంచి స్కాన్ చేస్తున్నాయి.

          ఇబ్బందిగా ఉంది. ఏడుపు వస్తున్నట్లుగా ఉంది.ఎవరిదో చేయి తన పిరుదులని తాకింది. చివ్వున తిరిగి చూసింది. అంతమందిలో ఎవరో తెలీలేదు.

          నాలుగడుగులు ముందుకేసి ఆగి టికెట్లు కట్ చేస్తోంది. మెడ దగ్గర ఎవరో కాస్త దూరం నుంచి ‘వుఫ్’ మని వూదారు. పాము బుస కొట్టినట్లుగా జుగుప్సగా వుంది. తిరిగి చూసింది.యిద్దరు , ముగ్గురు తలలు తిప్పుకుని, ముసిముసిగా నవ్వుకుంటున్నారు. కాళ్ళు వణుకుతుండగా గబగబా టికెట్లు చింపి యిచ్చి డబ్బులు బ్యాగ్ లో వేసుకుని, ఆ గుంపు నుంచి బైటకి వచ్చే సరికి ఆమె మొహం సిగ్గుతొ, అవమానంతో ఎర్రబడింది. కళ్ళలొ నీరు ఈ క్షణమో, మరో క్షణమో బైటకి దూకేలా వున్నాయి.

          రజని ఆమె అవస్థని గమనించింది. రష్ కొంచెం తగ్గాక సీట్లో  జరిగి రాధికని కూర్చోమంది . ఆమె ఎక్కువేం చెప్పలేదు.

          ” ఇలాంటి మగాళ్ళు కాగితం పులుల్లాంటి వాళ్ళు . కాగితం పులులు చూడగానే భయపెడతాయి. కానీ నీటి చుక్క మీద పడితే చాలు, తడిచి , దడిచి తోక ముడుస్తాయి. ఆలోచించండి. ఈ వుద్యోగం మీకు తప్పనిసరి అయితే  మీరు చాలా మారాలి. తప్పదు. మీ కోసం, మీ వునికి కోసం……. ఈ బస్ లోనే కాదు, జీవితంలోనే, ధైర్యం మన సహజ లక్షణంగా వుండాలి. మనలో ధైర్యం ఎపుడు వుండదో తెలుసా ?……. తప్పు చేసినపుడే !…………” అంది రజని.

          ఆ మాటలు రాధికకి కొత్తగా వున్నాయి.మెదడులో చల్లారిన చైతన్యపు జ్వాలలేవో ఒళ్ళు విరుచుకుని,బద్దకాన్ని వదిలించుకుని లేస్తున్నాయి.

          రజని తన స్టాప్ లో దిగే ముందు చెప్పింది. “నాకు ట్రాన్స్ ఫర్ అయ్యింది మళ్లీ ఎపుడో !……ఎక్కడో !.. ఆల్ ది బెస్ట్ ……….” చిరునవ్వుతో అంది.

          మనస్ఫూర్తిగా ఆమెకి వీడ్కోలు చెప్పింది రాధిక.

                                                          ***********************

మూడేళ్ళు గడిచాయి.

          ఆ రోజు ఎన్ఎడి కొత్త రోడ్డులో బస్సెక్కిన రజనిని చూడగానే గురుపట్టింది రాధిక.

          బస్ రష్ గా వుండటంతో మాట్లాడటానికి  వీలు చిక్కలేదు.చిరునవ్వుతోనే పలకరించుకున్నారు.

          రాధిక టికెట్లు కొట్టడానికి వెళ్ళింది….. అక్కడ నుంచి ఆమె కంచు కంఠంరజనికి విన్పిస్తోంది.

“బాబూ కొంచెం తప్పుకో, ఏవయ్యా పక్కకి జరుగు. అక్కడ ఖాళీగా వుందిగా, జరగండి ……………. ఏంటి తమ్ముడూ ! మీద మీద పడుతున్నావు….. తిన్నగా నిల్చో. సార్……….. యిది లేడీస్ సీటు. యిది కూడా చెప్పాలా ? ………లేవండి……….లేవండి……. స్క్వాడ్ వస్తే యిబ్బంది……….మాటలో , మొహంలొ, కదలికలో ఎంత స్థిరత్వం! చిరునవ్వు నవ్వుతున్న నిప్పు కణికలా వుందామె.

          ఇపుడెవరూ రాధికని చూసి వెకిలి వేషాలు వెయ్యలేరు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే , ఆమె కుండ బద్దలుకొట్టినట్లు కడిగి పారేస్తుంది.

          టికెట్లు యిచ్చి వచ్చేశాక రజని రాధికను చూస్తూ “చాలా సంతోషంగా వున్నారే !…………..” చిరునవ్వుతో అడిగింది.

“వూ ! ఒకప్పుడు ఆడదానికి నినయం,అణకువ , ఒద్దిక వుండాలని అందరూ చెబితే నిజమనుకున్నాను. కానీ మీరు చెప్పిన తర్వాతే తెలుసుకున్నాను. అవి అన్ని పరిస్థితుల్లోనూ మనల్ని రక్షించవు. ధైర్యంగా మనకొచ్చిన సమస్యలను మనమే పరిష్కరించుకునే చైతన్యాన్ని కలిగి వుండటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. దురదృష్టవశాత్తూ నా తల్లిదండ్రులు నాకది నేర్పలేదు. అందుకే చాలా సంవత్సరాలు చీకటిలో మగ్గాను. యిపుడు నేను ఆ తప్పు చేయను. ఆడపిల్లలయినా, మగపిల్లలయినా కష్టాలు వచ్చినపుడు కుంగిపోకుండా వాటిని తట్టుకోవాలి. నేనూ నా పిల్లల్లోనూ ఈ చైతన్యాన్ని కలిగిస్తాను. నాలో ఈ మార్పుకు కారణమైన మీకు నా కృతఙ్ఞతలు .” హృదయపూర్వకంగా అంది రాధిక.

2 వ్యాఖ్యలు

2 thoughts on “మీరే కారణం

 1. madamji!’meere kaaranamu’lo vunna paatralanthaa ‘urmila navvu’nu thamaku anvainchukunte bhaaguntundi.mana samaajamu maarpunu thondaragaa angeekaristhu,vaastavaprapanchamuloni manchini thanalo kalpukunte thappa -maro radhikaku dakkalsina nyaayamaina,vivaksha leni jeevithamu dhakkadu.nenu ‘maromukhamu’lo velibuchhina abhipraayaanni ikkada kuuda anvainchukovachhu. mee prathi kathalo ‘akshyapaatra’lo vuurinatlugaa enno,ennenno vishayaalu -maa kadupunimpi,maa hrudayaalanu pindi,maa manassulanu theta parichi,maa medhadu lo vunna tharatharaala buujunu dhulipi,mammulanu paripurna manishigaa maaradaaniki dhohadhamu chesthayi .as usual our agreement.

  • మల్లిక్ గారూ,
   మీ స్పందనకి,విశ్లేషణ కి ధన్యవాదాలు.
   మరి మీరెపుడు బ్లాగ్ ఓపెన్ చేస్తున్నారు?మీ ఒక్కో
   కామెంట్ ఒక్కో బ్లాగ్ పోస్ట్ అంత అర్ధవంతం గా అన్పిస్తుంటేనూ….
   ఒప్పందపు పరిమితుల్లోంచే మాట్లాడా…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s