మాట్లాడుదాం

మాట్లాడుదాం (పెత్తనం కథల సంపుటం నుండి)

            —–కె.యన్. మల్లీశ్వరి

“ఈ రోజు నీ పంట పండింది………..” ఆఫీసు నుంచి యింటికి వస్తూనే భార్య శశితో అన్నాడు సురేష్.

          అతను అంత వుల్లాసంగా తనతో మాట్లాడటం చాలా రోజుల తర్వాత కావడంతో సంభ్రమంగా చూసిందామె. సోఫాలో రిలాక్స్ డ్ గా కూర్చుని కాళ్ళెత్తి టీపాయ్ మీద పెట్టాడు సురేష్. అలా స్వేచ్ఛగా కూర్చునే అదృష్టం తనకి లేకపోవడం మూలంగానేమో ఆ భంగిమ అంటే ఆమెకి ఎంతో యిష్టం…..

          తన పంట పండించే వార్తని ‘ యిలా కూర్చుని ‘ చెప్పబోతున్న అతని వంక అపురూపంగా చూసింది శశి.

          “ఆఫీసులో ఎరియర్స్ వచ్చాయి ఈ రోజు. అందులో యిరవై వేలతో నీకు బంగారం కొందామనుకుంటున్నాను.” వుదారంగా అన్నాడు సురేష్.

          ఉస్సురంది మనసు. ఆమెకి బంగారం అంటే మోజు లేదు. నగలు శరీరానికి తగిలించుకునే గుదిబండలు తప్ప మరేమీ కాదని అపుడపుడూ మనసుకి అన్పిస్తూ వుంటుంది. అందుకే పెద్దగా సంతోషం అన్పించలేదు.

భార్య నుంచి తనాశించిన కృతఙ్ఞతా పూర్వక ప్రవర్తన ఏ కోశానా కనబడక పోయే సరికి ఆశాభంగం కలిగింది సురేష్ కి.

          “ఏం? మొహం వేలాడేశావ్ ?” చిరాగ్గా అడిగాడు. “అహా ! ఏం లేదు .”చిరునవ్వు పులుముకుంటూ అంది. కానీ ఆమె మనసులో మరో కోరిక మొలకెత్తింది. అది మోపెడ్ కొనుక్కోవాలని. బంగారం బదులు ఓ సెకండ్ హాండ్ మోపెడ్ అయినా కొనుక్కుంటే తనకి ఎంతో సౌలభ్యంగా వుంటుంది.

          పిల్లలని స్కూళ్ళకి దింపడం,తీసుకుని రావడం,కూరలు,పాలపాకెట్లు,పచారీ సామాన్లు తెచ్చుకోవడం అన్నీ చిటికెలో చేసుకుని రావచ్చు.

          కానీ తన భర్తకి యిది నచ్చదు……..మోపెడ్స్ మీద తిరిగే ఆడవాళ్ళని అతను ఎంత అసభ్యంగా,ఎన్ని సార్లు కామెంట్ చేశాడో తనకి తెలుసు. అలాంటిది తనకి మోపెడ్ కొనిస్తాడా ? వుహూ ! యిది జరిగే పనికాదు.

          ఎప్పుడూ భర్త కోరికలకి అనుగుణంగా భార్య మెలగాలని తల్లిదండ్రులూ.స్నేహితురాళ్ళూ , బంధువులూ చెప్పే మాటలు గుర్తొచ్చాయి. తనెప్పుడూ నోరు విప్పి తన కోరికలు చెప్పకూడదు. అది తప్పు. భర్తని ఎదిరించినట్లవుతుంది. మొగుడికి ఎదిరించి మాట్లాడే ఆడదానికి పుట్టగతులుండవు . చెవి దగ్గర ఏవో కొన్ని కోట్ల గొంతులు తరాల నుంచీ నిరంతరాయంగా చెప్తున్న మాటల ఘొష ముందు తలొంచింది శశి.

          “నేను నీకు బంగారం కొనిపెడుతుంటే బాధగా వుందా?” వ్యంగంగా అన్నాడు సురేష్.

          తెప్పరిల్లింది శశి. “అదికాదండీ ! ఏం చేయించుకోవాలా అని ఆలోచిస్తున్నాను”.  నోటికొచ్చిన అబద్ధం చెప్పింది….

          “మీ ఆడవాళ్ళతో యిదేనోయ్ బాధ ……. వూహల్లోనే మేడలు కట్టేస్తారు…………కొంచెం నేలమీద నిలబడి ఆలోచించాలి…..” అతనేదో తనని వుద్ధరిస్తున్నట్లు, తను తప్పు చేస్తుంటే సరిదిద్దుతున్నట్లు మాట్లాడుతున్నాడు. శశి వెర్రి మొహం వేసుకుని నిలబడింది.

          పదినిమిషాల వాగ్దోరణి ఆగాక……….”పద ! పద!……. గోల్డ్ షాప్ కి వెళ్ళొద్దాం………. పిల్లల్ని పక్కింట్లో అప్పజెప్పు …………పన్లో పని ఆవిడకి కూడా చెప్పు ………’మా అయన బంగారం కొని పెడుతున్నారని………..’ గొప్పగా అన్నాడు సురేష్.

          మనసులొ కలుగుతున్న కంపరాన్ని అణిచి పెడుతూ తలూగించి లోపలికి వెళ్ళింది………..

          బంగారం కొట్టుకి వెళ్ళడానికి తయారయి బయటకి వచ్చి స్కూటర్ స్టార్ట్ చేస్తూ పక్కింటి వైపు చూస్తూ………..

“చెప్పావా ఆవిడతో………”అన్నాడు సురేష్……..

          “ఏం చెప్పాలి? ……” తెల్లబోతూ అంది శశి…..

          “రాన్రానూ నీకు మతి మరుపు ఎక్కువైపోతోంది ……..బంగారం కొంటున్నట్లు  చెప్పమన్నాగా ?…………..” విసుగ్గా అన్నాడు.

          తన మగతనం మీద ఎంత నమ్మకం !!! లోకంలో ఆడాళ్ళందరూ తమ సామర్ధ్యాన్ని చూసి పడిపోతారని ఎంత విశ్వాసం !!! …….. మండుకొచ్చింది శశికి.

          “ఆ ! ఆ !…. చెప్పాను….. వాళ్ళాయన పక్కనే వున్నాడు. నేను చెప్పింది వినగానే, వారం కిందట యాభై వేలు పెట్టి అతను చేయించిన చంద్రహారం తెచ్చి నాకు చూపించమని వాళ్ళావిడకి చెప్పాడు…….” గుండెల్లోంచి తన్నుకొస్తున్న కసిని సాధ్యమయినంత వరకూ తగ్గిస్తూ అంది ……..శశి………

          ఆ మాటలు ఛెళ్ళున తగిలి మొహం వివర్ణమయింది సురేష్ కి.

“ఆ !……..సర్లే ……….ఎక్కు…..జిడ్డు మొహం దానివి దొరికావు నా ప్రాణానికి………….” అకారణంగా విసుక్కుంటూ అన్నాడు.

          మౌనంగా స్కూటరెక్కి కూర్చుంది శశి……..విసురుగా ముందుకి దూకించాడు………..

 భర్తతో బయటికి వచ్చినపుడల్లా శశికి భయమే ! సిగ్నల్స్ పడినపుడు, రోడ్డు మీద ఏ బండినైనా క్లోజ్ గా క్రాస్ చేసి వెళ్ళినపుడు అతను వెనక్కి తిరిగి తనని చూడటానికి ప్రయత్నిస్తాడు. తను ఎవరినైనా చూస్తుందేమోనని, నవ్వుతుందోమోనని అనుమానం అతనికి, అందుకే ఎప్పుడూ తలదించుకునే వుంటుంది.

          తనలా మెడ ఎక్సర్ సైజ్ లు చేస్తుండగానే బంగారం కొట్టు వచ్చేసింది…………….స్కూటర్ పార్క్ చేసి వచ్చాడు సురేష్.         

          అద్దాల్లోంచి మిలమిలా మెరుస్తున్న నగలు, లేని వ్యామోహాన్ని కలిగించేలా వున్నాయి………..సేల్స్ బాయ్ నగలని ముఖమల్ క్లాత్ మీద పేర్చి చూపిస్తున్నడు……..అన్నింట్లోకీ సింపుల్ గా వున్న తెల్లరాళ్ళ నెక్లెస్ నచ్చింది శశికి……

          “ఇది వద్దు ……….” అన్నాడు సురేష్ …….అతనికి టేస్ట్ తెలియదేమోనని ” ఈ టైపు నగలు యిపుడు లేటేస్టు ఫ్యాషన్ అండీ …………….” మెల్లగా అంది శశి.

కొరకొరా చూశాడు సురేష్.యిది తమకి అలవాటేనన్నట్లు వాళ్ళు మాట్లాడుకోడానికి అవకాశమిస్తూ సేల్స్ బాయ్ పక్కకి జరిగాడు.

          “ఈ రాళ్ళ నగలకి రీసేల్ వేల్యూ వుండదు…………..బ్యాంకు లో పెట్టినా ఎక్కువ డబ్బు రాదు…….. నీ బంగారు అంతా బాంక్ లో పెట్టి లోన్ తీసుకుంటే రూపాయి వడ్డీ అవుతుంది. ఆ డబ్బుని మనం బైట మూడు రూపాయల వడ్డీకి తిప్పుకోవచ్చు. రాళ్ళ వస్తువైతే ఏం డబ్బొస్తుంది ??……..” చెప్పాడు సురేష్.

          అదన్న మాట విషయం ‘ ఒక దెబ్బకి రెండు పిట్టలు. అంతవరకూ ఏ మాత్రమో వున్న ఆసక్తి కూడా నశించి పోయింది… చివరికి అతను గుళ్ళో దేవతలకి వేసే హారంలాంటిది తీసుకున్నాడు. 

           “బావుందా ? “అన్నాడు సురేశ్.

“బావుంది ……”అంది శశి…….

 అతను మనసులో ఒక సమాధానాన్ని నిశ్చయించుకుని ప్రశ్న వేస్తాడు. తననుకున్న సమాధానం రాగానే సంతృప్తి చెందాడు…. బిల్ వచ్చే లోపు సేల్స్ గాళ్స్ నీ , షాపుకీ వచ్చిన ఆడవాళ్ళనీ ఆబగా చూడాసాగాడు. యితని చూపులకి వాళ్ళ మొహాలు ఎర్రబడతాయి అవమానంతో ………అసహ్యంతో. తను చూడటం కోసమే వాళ్ళ శరీరాలు వున్నాయి అన్నట్లు వుంటుంది అతని ప్రవర్తన.

          అది చూసి అతని పక్కనే నిలబడాల్సి వచ్చినందుకు సిగ్గుతో చితికి పోతుంది శశి మనస్సు.

షాప్ లొ రద్దీ పెరగడం ప్రారంభమయింది…… శశి పక్కనే వున్న కుర్చీలొ ఓ ముప్పయ్యేళ్ళ నార్తిండియన్ వచ్చి కూర్చున్నాడు… అతను నగలేవో చూస్తున్నాడు.

          అవాక్కయింది శశి…వూహించని ఆ పరిణామానికి తెల్లబోయింది….కుర్చీలోంచి సడెన్ గా లేస్తే బావుండదేమోనని అన్పిస్తోంది శశికి .

          కానీ సురేష్ తన కుర్చీలోంచి వంగి… వంగి.. ….శశి మీదుగా అతన్ని గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. సురేష్ మొహం జేగురు రంగులోకి మారుతోంది.

          గుండె దడదడలాడుతోంది శశికి. యింకాసేపు యిలా వుంటే టెన్షన్ కి స్పృహ తప్పుతానేమో అన్పిస్తుంది. “అక్కడ చెవి కమ్మలు వున్నాయి… చూస్తాను…..”కుర్చీలోంచి లేస్తూ అంది … సురేష్ తలూపాడు.

          పక్కతను ఓ సారి తలెత్తి చూసి కుర్చీ జరుపుకుని ఆమె వెళ్ళడానికి తోవ యిచ్చాడు. అప్పటికి ఆ గండం నుంచి బయటపడింది శశి….

          రాత్రికి యింటికి వచ్చి భోజనాలు చేశాక కూడా సురేష్ అదోలా మొహం పెట్టుకునే వున్నాడు.

          శశికి నిస్సత్తువగా వుంది…. జ్వరం తగిలిన దానికి సూచనగా ఒళ్ళు వెచ్చబడింది….శరీరంలో ఏదో చెప్పుకోలేని యిబ్బంది ప్రారంభమయింది. చిరాగ్గా వుంది.. భయంగా వుంది దుప్పటి కప్పుకుని పడుకోబోతుండగా అప్పుడడిగాడు సురేష్, ” ఎవడువాడు? అంత రాసుకుని పూసుకుని వాడి పక్కన కూర్చున్నావు ….? ఎకసెక్కంగా అన్నాడు.

          నివ్వెరపోయింది శశి… ఈ అవమానాన్ని భరించడం చాల కష్టంగా వుంది…. నోట్లోంచి బైటకి వురకబోతున్న కోపాన్ని ఆపుకుని…..

          “అతనెవరో నాకేం తెలుసండీ !” బేలగా అంది ….. “ఓహో ! తెలియకుండానే పక్కన వచ్చి కూర్చున్నాడా?…. “అన్నాడు.          

          ఈసారి ఛీత్కారాన్ని దాచుకునె ప్రయత్నం చేయలేదు శశి .. అమె కళ్ళు ఆ భావాన్ని ప్రసారం చేశాయి.

          రెచ్చిపోయాడు సురేష్ … అమె దగ్గరగా వచ్చి జబ్బ గుచ్చిపట్టుకుని కూర్చోబెట్టి…..

          “చెప్పవే ? ………..” పళ్ళు బిగించి అడిగాడు…… తిరస్కారంగా చూసి మొహం తిప్పుకుంది. అంతే! … ఆమె చెంపలు పేలిపొయాయి… గొల్లుమని ఏడ్చింది శశి .. చెంపలు బుసబుస పొంగాయి….

          బూతులు తిడుతూ పక్క గదిలోకి వెళ్ళి పడుకున్నాడు  సురేష్… రాత్రంతా కన్నీళ్ళతో కలత నిద్రతో గడిచింది.

          తెల్లారి జ్వరం మాత్ర వేసుకున్నాక జ్వరం తగ్గింది కానీ ఏదో యిన్ఫెక్షన్ సోకింది…… ఆ బాధ మాత్రం తగ్గలేదు………….

          సురేష్ లేచి తన పనులన్నీ ముగించుకుని ఆఫీసుకి వెళుతూ శశి వంక చూసాడు.. గుండెలో ఏం కదిలిందొ ఏమో.. “అందుకే బయటికి వెళ్ళినపుడు జాగ్రత్తగా వుండాలి….” తప్పంతా తనదే అన్నట్లు, తనామెని క్షమిస్తున్నట్లు సౌమ్యంగా అన్నాడు………విని వూరుకుంది.

          స్నానం చేసి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబిల్ మీద వున్న గిన్నె మీద మూత తీసింది………… యిడ్లీలన్నీ అయిపోయాయి…… అతనికి ఆకలిగా వుండి వుంటుంది……..అనుకుంటూ మళ్ళీ చేసుకునే ఓపిక , ఆసక్తి లేక రాత్రి మిగిలిన చద్దన్నం తినేసింది.

          పదింటికి చాకలి వచ్చింది ……….శశిని చూడగానే “ఏందమ్మ ! అట్టా వుండావు? ………జాలిగా అడిగింది.

          “ఏం లేదు ? “మొహం తిప్పికుంటూ అంది శశి. “బాబుగొరితో గొడవడ్డారా…..? అప్యాయంగా అడిగింది. “నీకెందుకు ఆరాలు ?…………పని చూసుకో పొ !….కసిరింది శశి…

          “అయ్యో తల్లీ ! మీ ఇళ్ళల్లో మొగుడెట్టాంటోడయినా కడుపులొ పెట్టుకుంటారు. నువ్వేం చెప్పకపొయినా తట్టుదేలిన చెంపలు , వుబ్బిన కళ్లే అన్నీ చెప్పుతున్నాయి. నలుగురూ గడ్డి పెడతారన్న భయం వుంటే యిట్టాంటి మారాజులు లొంగుతారమ్మా!… నోరు మూసుకుని పడుకున్నంతకాలం యింతే ! ..” చాకలి ఏదో సణుగుతూనే వుంది…..

          ఆ మాటలు ఆలొచనలొ పడేశాయి. యిలా యింతకు ముందు తనకెవరూ చెప్పలేదే?………..

           సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ జ్వరం వచ్చింది….చాలా యిబ్బందిని అనుభవిస్తోంది…………ఆ బాధని ఎవరితో ఎలా చెప్పుకోవాలో తెలీడం లేదు……….. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చో లేదొ తెలీదు….

          కళ్ళముందు నరకం కన్పిస్తొంది ……..ఏది ఎలా వున్నా పనులు తప్పవుగా. పంటి బిగువున బాధని భరిస్తూ యింటిపనీ,పిల్లల పనీ ముగించింది. అందరి భోజనాలూ ముగిసాయి. వంటగది సర్దే ఓపిక కూడా లేక వచ్చి పడుకుంది. పిల్లలు నిద్రపోయారు. సురేష్ అప్పటి వరకు టి.వి చూస్తున్న వాడల్లా టి.వి కట్టేసి …….శశి దగ్గరకు వచ్చి ‘చిరునవ్వు’ నవ్వాడు. అతను రోజు మొత్తంలొ ఏ సయమంలొ తన వైపు చూసి చిరునవ్వు నవ్వుతాడో తెలిసిన శశి గుండె గుభేల్ మంది……….. జ్వరంతో, భయంతో తన శరీరంలొ ఏం జరుగుతుందో అర్థం కాని గాభరాలో వుందామె.

          ఆమె పక్కన కూర్చుని భుజం మీద చెయ్యేశాడు. అటువైపు తిరిగి పోయి “నాకు ఒంట్లో బాగా లేదండి !” మెల్లగా అంది……

          “ఫర్లేదు లేవోయ్ ….” ఆమెని యిటూ తిప్పడానికి ప్రయత్నిస్తూ అన్నాడు.

కదల్లేదు శశి…

          “వూ ! ……” బలవంతంగా యిటు గుంజుతూ  అన్నాడు. బరస్టయింది శశి…………..వెక్కి వెక్కి ఏడ్చింది………….

          తెల్లబోయాడు సురేష్. ఆమెని విసురుగా తోసేసి లేచి నిలబడ్డాడు. ………నీతో ఏ సుఖమూ లేదు……తిండి పెట్టి పోషిస్తూ బంగారం,బట్టలూ అన్నీ కొనిపెడుతున్నా ఎపుడూ ఏవో బాధలు పడేదాన్లా ఈసురోమంటూ వుంటావు. నీ కన్నా ఆ బజారోళ్ళె నాకు నయమనిపిస్తున్నారు. తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తారు…..” అంటూ పాంట్ షర్ట్ వేసుకుని, పర్స్ జేబులొ వేసుకుని అతను ధైర్యంగా వెళ్ళిపోతుంటే శశి మ్రాన్పడి కూర్చుండిపోయింది.

          అతని ద్వంద్వ విలువలు ఆమెలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. యింతకాలం పరాయి స్త్రీల విషయంలో అతని ప్రవర్తన పట్ల అనుమానాలే వుండేవి.

          కానీ అది నిజం. అంతేకాదు. తననుభవిస్తున్న శారీరిక యిబ్బందికీ దీనికీ ఏదో లింకుంది. ఎంతసేపు ఆలోచిస్తూ వుందొ లెక్కలేదు. అతను రాత్రి వంటిగంట తర్వాత వచ్చాడు. అతని మొహం చూడటానికి శశి సిగ్గుపడింది. కానీ సురేష్ దర్జాగా లోపలికి నడిచాడు.

                                      *************************************

మర్నాడు వుదయం పనులు ముగించుకుని ఏమీ జరగనట్లు ఆఫీసుకి వెళ్ళిపోయాడు.పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయారు. పనులు ముగించుకునేసరికి పన్నెండయింది.

          ఇంతలో ఎవరో తలుపు తట్టారు…..వాళ్ళు చిరునవ్వుతో తమని తాము పరిచయం చేసుకున్నారు…. ‘మహిళా విమోచన సమితి ‘ తాలూకా కార్యకర్తలట…….. ‘అంతర్జాతీయ మహిళా  దినోత్సవం ‘  సందర్భంగా కాలనీలొ సభ జరుపుతున్నామని…….ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు.

          శశి యిలాంటి వాటికి ఎపుడూ వెళ్ళలేదు……. సురేష్ కి యిష్టం వుండదు………….పనీ పాటలేని అమ్మలక్కలు ఆ మీటింగుల్లొ వుబుసుపోని కబుర్లు చెపుతారనీ……….కొండొకచో అక్కడ పేకాట ఆడి, తాగి తందనాలాడుతారనీ, తను వెళ్ళిచూసి వచ్చినట్లే చెప్పేవాడు. కానీ వీళ్ళ మాటలు చూస్తే అలా లేవు……

          శశి వెళ్ళక పోయేదేమో గానీ ఆ యిద్దరు అమ్మాయిల్లొ ఓ అమ్మాయి వెళుతూ వెళుతూ అన్న మాట ఆలోచింపచేసింది……….”ఆడవాళ్ళ చాలా సమస్యలకి పరిష్కారాలు యిళ్ళల్లొ కన్నా నలుగురితో పంచుకోవడంలో దొరకచ్చు. ఓ సారి వచ్చి చూడండి.”అంది. అందుకే వెళ్ళాలని నిశ్చయించుకుంది.పక్కింటావిడకి కూడా ఈ కుతూహలం కలగడంతో యిద్దరూ బెరుకు బెరుగ్గానే బయల్దేరారు. ఆ సభలొ ఎక్కువ మంది ఆడవాళ్ళే వున్నారు….

          అందులో చాలా మంది ఎంతో ధైర్యంగా, స్వేచ్ఛగా మొహాలనిండా వెలుగులతో ఎంతో సంతోషంగా వున్నారు. శశి తన జీవితంలొ ఎపుడూ యింత చొరవతో, హూందాతనంతో వున్న ఆడవాళ్ళని ప్రత్యక్ష్యంగా చూడలేదు……. ఆ మీటింగులో వాళ్ళు మాట్లాడిన మాటలు ఆమెలో కొత్త ఆలోచనా ద్వారాలు తెరిచాయి. మరీ ముఖ్యంగా ఒకావిడ సూటిగా స్పష్టంగా వున్న కంఠంతొ ” మనం యింతవరకూ కళ్ళతోనో, కన్నీళ్ళతోనో, కదలికలతోనో , మాట్లాడాం. కానీ యిక అలా వద్దు……..మనం నోరు విప్పిమాట్లాడదాం. మన కోరికలూ, అభిప్రాయామూ, బాధలూ సుఖాలూ అన్నీ హాయిగా గొంతెత్తి వెళ్ళబోసుకుందాం………మన కోరికలని అణిచి, మన అభిప్రాయాలని తొక్కి పెట్టి, ఎదుటి వ్యక్తి మనపై చూపిన హింసని దాచి……..చివరికి మనకొచ్చే జబ్బులని కూడా మనలోనే కుళ్ళబెట్టుకుంటూ……ఎందుకిలా ……?మనం ఎందుకిలా వుండాలి? అందుకే మనం మాట్లాడదాం…….” ఆమె చెప్పిన ఎన్నొ విషయాలు శశిని వుత్తేజం చేసాయి….ఆమె వుద్వేగం తట్టుకోలేక ఏడుస్తుంటే పక్కింటావిడ  ఓదార్చింది………..

          తిరిగి వచ్చేటపుడూ “అపుడపుడూ యిలాంటి మీటింగులకి వస్తుంటే  మనమూ మనుషులమని తెలుస్తుంది………….” పక్కింటావిడ అంది….

          తలూపింది శశి………

          తోవ మధ్యలో శశికి ఓ ఆలోచన వచ్చింది…..పక్కింటావిడ దగ్గర ఓ యాభై రూపాయలు అడిగి తీసుకుంది…….. తన దగ్గర ఓ వంద రూపాయలు వున్నాయి….తనిలా తన బాధని తనలోని దాచుకునే బదులు హాస్పిటల్ కి వెళితే మంచిది కదా !………..

అనుకున్నదే తడువుగా ఆవిడని వెళ్ళిపొమ్మని చెప్పి తను ఆటో కట్టించుకుని హాస్పిటల్ కు వెళ్ళింది. డాక్టర్ చెకప్ చేసి టాబ్లెట్స్ రాసిచ్చి తీసుకోవాలసిన జాగ్రత్తలు చెప్పింది. యింటికి వచ్చేసరికి పిల్లలు పక్కింట్లి ఆడుకుంటున్నారు. తలుపు తాళం తీసి యింట్లోకి వెళ్ళి పిల్లల్ని తయారు చేసి ఆడుకొవడానికి పంపింది….

          రాత్రికి పడుకునే ముందు సురేష్ శశితొ” పిల్లలు వచ్చేసరికి యింట్లో లేవంట ……. ఎక్కడికి వెళ్ళావు?” అడిగాడు. 

          ఛీ…….చివరికి యింత నైచ్యానికి దిగజారాడన్న మాట. పిల్లల దగ్గర తన గురించి కూపీలు లాగుతున్నాడు………మధ్యాహ్నం మీటింగ్ విషయాలు గుర్తొచ్చాయి…………ఏదో ధైర్యం వచ్చింది…. తన వెనక ఎవరో అండగా వున్నారన్న భావం కలిగింది.

          “ఒంట్లో బాగోక డాక్టర్ దగ్గరకి వెళ్లాను…………” చెప్పింది…………

“ఏం ? ……..ఏం మాయరొగం ?……..” విట్టీగా మాట్లాడాననుకుని పకాపకా నవ్వుతూ అన్నాడు…………”

“ఆ ! డాక్టర్ కూదా అదే చెప్పింది……….. మాయరోగమే !………మొగుడు అంటించిన రోగం ….యిప్పటికైనా మీరు చెడు తిరుగుళ్ళు మానకపోతే ఈ మాయ రోగమే మహమ్మారి రోగమవుతుందని చెప్పింది……..ముందు మీరు అన్ని టెస్టులూ చేయింఛుకోండి ….. మీ ఆరోగ్యం అంతా బావుందని డాక్టర్ చెపితేనే మిమ్మల్ని దగ్గరకి రానిచ్చేది. నాకు నా ప్రాణంముఖ్యం. ఎందుకంటే నా వెనుక పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత వుంది కాబట్టి ……..” ఖరాఖండీగా చెప్పేస్తుంటే తన బండారాన్ని భార్య యిలా గ్రహించిందని తెలిసి మొహం చాటేస్తూ పక్క గదిలొకి వెళ్ళి పొయాడు సురేష్.

                                                **************************

           ఆ రోజు ఆదివారం……

పిల్లలు భోజనాలు చేసి టి.వి. చూస్తున్నారు.

          సురేష్, శశి భోజనాలకి కూర్చున్నారు……….కూరలు చూసి మొహం చిట్లించాడు సురేష్. ” నాకు అనపకాయ కూర యిష్టం వుండదని తెలిసీ ఎందుకు వండావ్ ?” గరిటె విసురుగా గిన్నెలో వదులుతూ అన్నాడు.

          ” నాకు యిష్టం .నాకోసం వండుకున్నాను………….” చెప్పింది శశి.

          ” నీ  కో………..స……..మా ! వినరాని మాట విన్నట్లు ఆశ్చర్యంగా అడిగాడు. యిది వరకు అతని ఆశ్చర్యం చూస్తే భయం వేసేది….యిపుడు అతని ఆశ్చర్యం తనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

          ” వూ ! నా కోసమే…యిన్నాళ్ళు మీకూ, పిల్లలకీ ఏదిష్టమో అదే వండాను………కానీ నాకూ నాకిష్టమైంది తినాలని వుంటుందిగా ! అందుకే అపుడపుడూ మీకు ఈ యిబ్బంది తప్పదు……” నవ్వుతూ అంది శశి.

          “ఏంటోయ్ ! తెగ మాటలు నేర్చావ్ ….” వ్యంగ్యంగా అన్నాడు సురేష్.

“ఇన్నాళ్ళు నేను నోరు తెరవకపోవడానికి కారణం నాకు మాటలు రాక కాదు……. నేనసలు మాట్లాడొచ్చని తెలీక…..”అంది శశి.

                             అప్రతిభుడయ్యాడు సురేష్.       

                                                *************************

15 వ్యాఖ్యలు

15 thoughts on “మాట్లాడుదాం

 1. చాలాబాగుంది. అణిగి మణిగి ఉన్నంత కాలం అణుస్తునే ఉంటారు పిరికి జనం. ఎదురు తిరిగినప్పుడు తెలుస్తుంది వాళ్ళ పిరికితనం. బాగా వ్రాసారు.

 2. మేడంజీ!మాట్లాదుదాం కథ కాదు వాస్ఠవప్రపంచం.యె దేశమైనా సగటు ఆడ బ్రతుకును ఇది ప్రతిబింబిస్తుంది.అందరికి చదువు,పని,ఆరొగ్యమే ఆడవాల్ల చాలా సమస్యలకు పరిస్కారం.

  • మల్లిక్ గారూ,
   కధని విశ్లేషించినందుకు ధన్యవాదాలు.గుడ్ ఇంప్రూవ్ మెంట్..ఇక ఎదురు చూడాల్సింది అచ్చుతప్పులు లేని తెలుగుని.మీ పట్టుదల ముందు అవెంత? తల వంచి తీరతాయి.(పంతులమ్మలా చెప్పినట్లున్నాను.)

  • మెత్తని వాళ్ళని చూస్తే మొత్తబుద్ధి అవుతుందట. ఇంట్లో ఆడవాళ్లు నోరు తెరిస్తే సగం సమస్యలు పరిష్కారమవుతాయి.

   ధరిత్రీ దేవి👃

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s