పితృత్వం

పితృత్వం

                మల్లీశ్వరి కె.ఎన్. 

పితృత్వం

 

            గత పదిహేను రోజులుగా నా మనసులో వున్న సందేహాన్ని డాక్టర్ కన్ ఫాం చేసింది – నేను గర్భవతిని అని. రెండో నెల నిండుతోందని. ఆ వార్త వినగానే నా భర్త మొహం వెలిగిపోయింది.

          అతని ఆనందం చూసి నాకూ కాసింత గర్వంగా అన్పించింది. నేనో అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నాను కదాని.

          అప్పట్నించీ నా భర్త చంద్రశేఖర్ నన్ను మరింత అపురూపంగా చూడసాగాడు.దాంతో నేను ఓ ప్రత్యేకమైన వ్యక్తిని అన్న భావం బలపడుతుండేది.

          దానికి తోడు ఏ పుస్తకం చదివినా, టి.వి చూసినా, సినిమా చూసినా మాతృత్వపు గొప్పదనం గురించీ, ఆడవాళ్ళు తమ బిడ్డల కోసం చేసే త్యాగాల గురించీ రకరకాల సంఘటనలు వుండేవి. అవి మనస్సుని వుత్సాహభరితం చేసేవి.

          నాకు ఏడో నెల నిండింది… యింకో నెలాగి,చేసే ప్రయివేటు లెక్చరర్ వుద్యోగానికి కొన్నాళ్ళు శెలవు పెట్టాలనుకున్నాను.

          అలాంటి సమయంలోనే క్రమంగా నాలో మార్పు రావడం ప్రారంభమయింది.విచిత్రంగా ఆ మార్పుని వేరెవరో గుర్తించిచెప్పలేదు. నాకు నాకే తెలుస్తోంది.ఇదివరకులా పుట్టబోయే బిడ్డని తలుచుకుంటే మాతృగర్వంతో పులకరింతలు రావడంలేదు సరికదా బిడ్డని నేను సక్రమంగా పెంచగలనా అని భయం పట్టుకుంది.

          ఎందుకంటే పిల్లల పెంపకం మీద నాకు కొన్ని స్థిరమయిన అభిప్రాయాలున్నాయి. పిల్లల్ని కొట్టకూడదు, మంచి మాటలతోనే వారికి క్రమశిక్షణ నేర్పాలి, మనమే వారి ప్రపంచంలోకి వెళ్ళి వారి కష్ట సుఖాలని అర్థం చేసుకుని తదనుగుణంగా మెలగాలి…….మొదలైనవి.

          “నారు పొసిన వాడే నీరు పోస్తాడన్న ” మూఢనమ్మకం నాకు లేదు. ఆలోచించేకొద్ది పిల్లల్ని పెంచడం అంత సులువు కాదు అన్న విషయం నాకు బోధపడింది.

          ఉదయం యింట్లో పనులు చేసుకుని కాలేజీకి వెళ్ళి అక్కడ పిల్లల్ని సక్రమంగా తీర్చిదిద్దే కార్యక్రమం నిర్వహించి, మళ్ళీ సాయంత్రం యింటికొచ్చి,  మళ్ళీ యింటి పనులు ముగించి వ్యక్తిగత సరదాలకి సమయం వుండటం లేదే అని బాధపడుతున్న ఈ తరుణంలో తను బిడ్డకి జన్మనిస్తోంది. సరిగా పెంచలేనేమోనని భయంకలిగేది.

          ఈ భయం నాలో అత్మవిశ్వాసం లోపించడం వల్ల కలిగిన భయం కాదు. పిల్లల్ని పెంచడం ఎంత క్లిష్టతరమైన బాధ్యతో గుర్తించడం వలన కలిగిన భయం.

          ఎవరితోనన్న చర్చిస్తే యింత చిన్న విషయానికా ? లోకంలో అందరూ కనడం లేదా? నువ్వొక్కదానివే కంటున్నావా? అని వేళాకోళం చేస్తారని తెలుసు. ఈ దిగులు మనసులో అంతర్గతంగా పెరిగిపోతుండగా ఓ రోజు పక్కింటి గీత వచ్చింది. తను కలెక్టరాఫీసులో క్లర్కుగా చేస్తోంది. వాళ్ళాయన పేరుమోసిన బ్యాంక్ లో మేనేజరుగా చేస్తున్నాడు. వాళ్ళకి నాలుగేళ్ళ బాబు వున్నాడు. గీత కూడా యిప్పుడు గర్భవతి.

          వాళ్ళ దాంపత్యం చాలా అన్యోన్యంగా సాగుతున్నట్లుగా అందరికీ అన్పించేది. వాళ్ళ బాబు మేనర్స్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. బైటకి వస్తే ఎంతో బుద్ధిగా , అల్లరి చేయకుండా వుంటాడు. క్లాసులో వాడిదే ఫస్టు రాంక్ అట.

          గీతని లోనికి ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టాను. “ప్రశాంతీ ! రేపు రాత్రికి సిటీకేబుల్ లో మా వారి గురించిన పరిచయం కార్యక్రమం టెలీకాస్ట్ అవుతుంది. లయన్స్ క్లబ్ వారు ఈ మధ్య ఈయనికి అవార్డ్ యిచ్చారుకదా! అందుకని ఈ ప్రోగాం ఎరేంజ్ చేసారు. నేనూ, బాబు కూడా వున్నాం” మొహమాట పడుతూ చెప్పింది.

          తప్పకుండా చూస్తానని చెప్పి పంపించాను.

          మర్నాటి రాత్రికి చందూని కూడా కూర్చోబెట్టి  ఆ కార్యక్రం చూపించాను. అందులో ఆయన ఎంతో గంభీరంగా, భార్యా బిడ్డల మీద అవ్యాజానురాగంతో మాట్లాడారు.

          తను సాధించిన ఈ విజయం వెనుక వున్నది తన భార్యేననీ, యింటి పనులూ, బయటి పనులూ , బాబు పెంపకం, వాడి చదువూ తన భార్య చూసుకోవడం వల్లే తను యిదంతా సాధించానని, ఆయన ఒక్క మాటలో క్రెడిట్ అంతా భార్యకే యిచ్చేశాడు.

          ఇతను ఒక్కడే కాదు. సమాజంలో విజయం సాధించిన చాలామంది మగాళ్ళకి యింటి పనులూ, బిడ్డల పెంపకం గురించి ఏమీ తెలీదు. అదంతా భార్యలే చూసుకుంటారని యిలాంటి కార్యక్రమాలలో ప్రముఖులు చెప్పగా వింది. 

          అప్పటి నుంచీ మరీ దిగులు ఎక్కువైంది. యిపుడు చందూ విజయం సాధించాలంటే యివన్నీ నేనొక్కదాన్నే చూసుకోవాలి. ‘మరి నువ్వు విజయం సాధించాలంటే ‘అని నామనసు ఓ  కొంటె ప్రశ్న వేసిందంటే తప్పు నాది కాదు.

              చివరికి ఓ రోజు ఆపుకోలేక నా సందేహాలన్నీ చందూకి చెప్పాను. యివన్నీ కొత్తగా అన్పించాయో ఏమో తెల్లమొహం వేసాడు. చివరికి తేరుకుని-

            “మరి లోకంలో అందరూ మాతృత్వపు గొప్పదనం గురించి చెపుతున్నారుగా! తల్లి క్రమ శిక్షణలో పెరిగిన పిల్లలే గొప్ప వాళ్లవుతారని. ఎంతో మంది చదువులేని వాళ్ళూ, మూఢనమ్మకాలతో వుండేవాళ్ళూ… వాళ్ళే చులాగ్గా, అలవోగ్గా ముగ్గురు, నలుగురు పిల్లల్ని పెంచుతున్నారు. నువ్వు పెంచలేవా ? నువ్వేం సందేహాలు పెట్టుకోకు. నీలో ఆ శక్తి వుంది.” అన్నాడు.

          చందూ చెప్పినంత సేపూ నిజంగానే నాకేవో అతీత శక్తులు వచ్చి పడిపోయినట్లుగా అన్పించింది. యిక ఆ తర్వాత వ్యతిరేక ఆలోచనల్ని పారదోలి, మా యిద్దరి జీవితాల్లోకి కొత్త శోభని తీసుకువచ్చే చిన్నారికోసం ఎదురుచూడటం ప్రారంభింఛాను.

          నా డెలివరీ టైమ్ కి అమ్మ యిక్కడికి వచ్చింది. హాస్పిటల్లో సుఖప్రసవం అయి పాప పుట్టింది. మూడో రోజునే యింటికి వచ్చేశాం.

          పాప పుట్టిన వెంటనే చందూ నా దగ్గరికి వచ్చి “అందరూ పాప నీ పోలికే అంటున్నారు ..” అని అలిగినట్లు మొహం పెట్టాడు.అది చూసి నవ్వొచ్చింది. అంతే …! యిక అదే మనస్ఫూర్తిగా నవ్వడం…. తర్వాత అంతా కంగారూ, భయాలతోనే రోజులు గడుస్తున్నాయి. పాపని ఎత్తుకోవడం, మాటిమాటికీ పక్క తడుపుతుంటే మార్చడం , వాటిని వుతకడం యివన్నీ అమ్మా, నేనూ చేసేవాళ్ళం.

          దానికి తోడు యింటిపని అంతా చేయాల్సి రావడంతో అమ్మకి కూడా కష్టంగా వుండేది. బాగా అలిసిపోయేది.

          అందుకే చాలా వరకు పాప పనులు నేనే చేసుకోవాలనుకునేదాన్ని . కానీ పగలంతా నిద్రపోయే పాప రాత్రయ్యేసరికి మేలుకుని అయిందానికి , కానిదానికీ రాగాలు తీసేది. ఒక్కోసారి ఎందుకేడుస్తుందో తెలీక బెంబేలెత్తిపోయేదాన్ని.

          రాత్రిళ్ళు నిద్ర చాలక కంటి కురుపులు లేచాయి. డెలివరీ అయ్యాక వచ్చే కొన్ని రకాలయిన శారీరక మార్పులు వల్ల డిప్రెసివ్ గా వుండేది. మాతృ గర్వం, పులకరింతల స్థానంలో నిస్సహాయత, భయం చోటు  చేసుకున్నాయి.

          పాపకి చిన్నమెత్తు యిబ్బంది కూడా కలగకుండా చూసుకోవడానికి నేను సర్వశక్తులూ ఒడ్డాల్సి వస్తోంది.

          ఓ రోజు రాత్రి పన్నెండింటి వరకూ యిలాంటి పనులతోనే అలిసి పోయి, అప్పుడే నిద్రలోకి జారాను. యింతలో పక్కనే వుయ్యాల్లో వున్న పాప కయ్యిన రాగం అందుకుంది. చెవులకి ఏడుపు వినబడుతోంది. కళ్ళువిడివడటంలేదు. వళ్ళంతా నిస్సత్తువగా వుంది. లేవాలనుకుంటున్నాను లేవలేకపోతున్నాను……ఆ పరిస్థితికి తలలోని రక్తనాళాలు చిట్లిపొతాయా అన్నంత టెన్షన్ గా వుంది. నిద్ర ఎంత విలువైందో తెలిసివస్తోంది.

          పాప ఏడుపు మరింత అధికం అయింది. నెమ్మదిగా కళ్ళు విప్పి పక్కకి చూశాను. అమ్మ ఆదమరిచి నిద్రపోతోంది. రెండు , మూడు సార్లు పిలిచాను. నిద్రలో వినబడలేదామెకి.

          పక్కగదిలోంచి చందూ లేచి రావడం, మూసుకుపొతున్న నాకళ్ళకి అస్పష్టంగా కన్పించింది.

          “ప్రశాంతీ….” ! నా బుగ్గ మీద తడుతూ లేపబోయాడు. లేవలేకపోయాను………… చందూ గది నుంచి బైటకి వెళ్ళిపోయాడు.

          పాప ఏడుపు మరింతగా పెరిగింది. మూసుకున్న నాకంటి చివర్ల నుంచి నిస్సహాయంగా కన్నీరు జారింది. ఆ సమయంలో ………… ఆ అసహాయ స్థితిలో పాప ఏడుపు చటుక్కున ఆగింది. డేట్టాల్ సోప్ వాసన ముక్కుపుటాలని తాకింది.

          అపుడు ఓ అమ్మ అమృత హస్తం నా తలని మృదువుగా నిమిరింది. ఈ ఆత్మీయమూర్తి ఒడిలో పాప కాళ్ళు, చేతులూ విదిలిస్తూ ఆడుకుంటోంది. ఆ ఆపద్బాంధవుడు నా చందూ, తన గంభీర కంఠంతో లాలిపాట మొదలుపెట్టాడు.

          “నా చిన్నారి తల్లికీ బంగారు వడ్డాణమూ..

          నా చిట్టి పాపకీ ముత్యాల హారమూ…………..”

          ఆ పాట పాపకో నాకో తెలీదు……….. ఆదమరిచి నిద్రపోయాను.

          అంతే ……….! ఆ రోజు నుంచీ వాళ్ళిద్దరి మధ్యా ఓ కొత్త అనుబంధం రూపుదిద్దుకుంది. అలా ఆ రోజు పాపని ఒడిలోకి తీసుకున్న చందూ మరెన్నడూ ఆ బాధ్యతని వదిలి పెట్టలేదు. ఈ పని నేను చెయ్యొచ్చా లేదా అన్న అహాన్ని వదిలి సమస్త సేవలూ పాపకి చేసాడు.

          ఇద్దరం వుద్యోగాలు చేస్తున్నాం. యిద్దరం యింటి పనులు చేసుకుంటాం. చివరికి యిద్దరం కలిసి పాపని పెంచుతున్నాం………యిది మా ముగ్గురి మధ్యా మరింత అత్మీయతని పెంచింది.

          ఇపుడు ఏ పనీ కష్టంగా లేదు. అన్నీ యిష్టంగా ప్రతి క్షణాన్నీ ఆనందకరంగా మలుచుకుంటున్నాం.

          నాకిప్పుడు అన్పిస్తొంది. పిల్లల్ని తల్లి మాత్రమే కనగలదు. కానీ ఎవరైనా , తండ్రయినా చక్కగా పెంచొచ్చు అని.

          పాపకి ఆరేళ్ళు నిండాయి. ఎంత వద్దనుకున్నా ఒకోసారి యితరుల పిల్లలతో పోల్చి చూస్తే మా పాప పెంకిగా అన్పించడం మొదలయింది.

          ఒక్క క్షణం కుదురుగా కూర్చోదు. కూర్చున్నా, నిల్చున్నా , పడుకున్నా కాళ్ళూ చేతూలూ డాన్స్ చేస్తూనే వుంటాయి. ఆఖరికి స్కూల్లో టీచరు కూడా “మీ పాప ఏదన్నా ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా డాన్స్ చేస్తూనే వుంటుందండీ …..”! అనేసింది.

          ఇదేం జబ్బో అనుకుని ఒసారి చందూతో అంటే  “అదేం జబ్బు కాదు. పాపలో వున్న చైతన్యానికి చిహ్నం…………….” అని తెలివిగా చెప్పుకొచ్చాడు.

          ఇక పడుకునేటప్పుడు వాళ్ళ నాన్న పొట్ట మీద కాళ్ళూ , చేతులూ పడేసి అతని హృదయసామ్రాజ్యానికి తనే బుల్లిరాణి అన్నంత దర్జాగా నిద్రపోయేది. ఒకోసారి వాళ్ళ నాన్న పొట్ట నిమురుతూ “నాన్న !    నేను అమ్మ పొట్టలోంచి కాకుండా నీ పొట్టలోంచి వచ్చివుంటె బాగుండేది” అంటుంటే , చందూ మురిసిపోవాలో , నన్ను సముదాయించాలో తోచక సతమతమవుతుంటే నాకు ఆనందంతో పాటు అసూయ కూడా కలిగేది.

          మా పక్కింటి గీతకి రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టింది. యిద్దరు పిల్లలూ ముత్యాల్లాగా వుంటారు. యింట్లోంచి చిన్న శబ్దం కానీ అల్లరి గానీ  విన్పించేది కాదు. వాళ్ళింటికి ఎపుడన్నా వెళితే పిల్లలు చదువుకుంటూ కన్పించేవారు . అటూ యిటూ గెంతడం , పరిగెత్తడం, దూకడం లాంటి మా పాప  విద్యలు వాళ్లు అసలు ప్రదర్శించేవారు కాదు.

          మా పాప వుందంటే ఎపుడూ వాళ్ళ నాన్న మీదకో , నామీదకో ఎగిరి ఒళ్ళోకి దూకడం………….చందూ నడుస్తుంటే అతన్ని పట్టుకుని వేలాడ్డం……….లాంటి క్రమశిక్షణా రహిత చర్యలు చేసేది.

          “అసలు దీన్నీ పెంచే విషయంలో నిన్ను పాల్గోనివ్వడం పొరపాటయింది. అందుకే యిదిలా తయారయింది. చక్కగా పక్కింటి గీతలాగా నేనే పెంచివుంటే, వాళ్ళ పిల్లల్లాగా యిది కూడా బుద్ధిగా వుండేది” అతనికి కోపం వస్తుందని కూడా ఆలోచించకుండా అనేశాను.

          చిత్రంగా కోపం తెచ్చుకోలేదతను. నవ్వేసి కూతుర్ని గుండెలకి హత్తుకుని “ఆ రోజు నేను నీ కష్టం చూడలేక పాపని ఒళ్ళోకి తీసుకున్నాను . ఆ తర్వాత నుంచీ తెలిసి వచ్చింది. పాప హృదయానికి దారి ఏదో. కన్నతల్లి బిడ్డకి ఏయే సేవలు చేస్తుందో  అవన్నీ నేనూ చేశాను. తల్లుదండ్రులిద్దరి బాధ్యాతాయుతమైన సేవలు, ప్రేమ పొందింది కాబట్టి పాపలో అభద్రతా భావం లేదు. అందుకే ఆ చలాకీతనం ……….అది క్రమశిక్షణ లేకపోవడంగా నీకనిపిస్తోంది . ఆలోచించి చూడు.

          మా కోలీగ్స్ , మిగతా ఫ్రెండ్స్ అందరూ పిల్లల పనులు చేయడం నామోషిగా ఫీలవుతారు . కానీ వాళ్ళకీ తెలీదు    వాళ్ళేం కోల్పోతున్నారో!

          ఆ రోజు పాప  “నాన్న!  నేను నీ పొట్టనుంచి వస్తే బావుండును ” అని అందంటే అది అల్లరిగానో, ఊసుపోక     అన్నమాటో కాదు. ఆ మాట వెనుక నా మీద పాప పెంచుకున్న  ఓ బలమైన బంధం , నమ్మకం కనిపించడం లేదూ……..” అంటూ  ఆనందంతో కన్నీళ్ళు పెట్టేసుకున్నాడు.

          ఈ చర్చతో ఓ వారం శాంతించినా బ్రష్ చేయడానికీ, మంచినీళ్ళు తాగడానికి పేచీలు పెడుతూ రాగాలు తీస్తున్న పాప పెంకితనాన్ని భరించలేక దాన్ని గట్టిగా కేకలెయ్యమని చందూకి వార్నింగిచ్చాను.

          ఓ ఫైన్ మార్నింగ్ సింక్ దగ్గర సదరు తండ్రిగారి కేకలు గట్టిగా వినబడ్డాయి. ఈ పిల్లేమో వంటగదిలో నా వెనుక తచ్చట్లాడుతోంది.

          ఏం చేశావేంటి ? నాన్న కేకలేస్తున్నారు.? అన్నాను.

          “ఏం లేదమ్మా లయన్ రోరింగ్ ” అంది పాప.

          “ఏంటీ ?” అర్థం కాక అడిగాను.

          అప్పుడో సారి జూకెళ్ళినప్పుడు చెప్పావుగా ! సింహం అడవికి రాజు, గర్జించటం దానికి వుండే లక్షణం . భయపడకూడదు…అదన్న మాట…………” అనేసి చక్కాపోయింది..

          నాన్న కేకలేస్తే భయపడటం పోయి చమత్కారంగా విషయాన్ని ఎక్కడినుండి ఎక్కడికో కలిపేసి తనకొచ్చిన వుపద్రవాన్ని తప్పించేసుకుంది.

          ఇకలాభం లేదనుకుని  వాళ్ళ తాతగారికి చెప్పి అదుపు చేయమన్నాను. ఓ రోజు పాప మరీ గొడవ చేస్తుంటే చెయ్యెత్తి “అల్లరి చేసావంటేనా ? కొడతాను “. అన్నారే గానీ చెయ్యి గాల్లో ఆడుతోంది   తప్ప వీపు మీదకి రాదు.

          ఇదేమో ఆయన చెయ్యి వంకా, మొహం వంకా మార్చి మార్చి చూసి “వూరుకోండి తాతగారు !! మీరు మరీనూ, ” పెద్దరికంగా అనేసి ఆయన కోపాన్ని పేలపిండిలా ఎగరకొట్టేస్తుంటే ఆయన మాత్రం ఏం చెయ్యగలిగారనీ …….మొహం పక్కకి తిప్పుకుని ముసి ముసి గా నవ్వుకోవడం తప్ప.

          ఈ రకంగా తన చిన్ని ప్రపంచంలో తనకి ఎదురయ్యే సవాళ్ళని అత్యంత సమర్థనీయంగా ఎదుర్కోంటూ చిలుకలు వాలిన చెట్టు మా ఇంట్లో నడుస్తున్నట్లుగా చైతన్యవంతంగా వుండేది పాప.

          ఇలాంటి సమయంలోనే నేను చూసిన ఓ సంఘటన నాకూ మా పెంపకంపట్ల నమ్మకాన్ని కలిగించింది.

          ఓ రోజు గీత వాళ్ళింట్లో వున్న కంప్యూటర్ లో కొత్త సాఫ్ట్ వేర్ లోడ చెయ్యమని తనకి అది అర్జెంటని ప్లీజింగ్ గా అడిగితే కాదనలేక వుదయం పనులన్నీ చందూకి అప్పగించి వెళ్ళాను.

          అప్పటికి గీత యింట్లో పనులతో బిజీతో వుంది.నన్ను సిస్టమ్ దగ్గర కూర్చోబెట్టి తను పనుల్లో పడిపోయింది. వాళ్ళాయన పేపర్ చదువుకుంటున్నాడు. యిల్లంతా చాలా నిశ్శబ్దంగా వుంది. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు తప్ప ఎవరూ అనవసరంగా ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు.

          వాళ్ళాయన కూర్చున్న దగ్గరనుంచి కదలకపోవడమే కాక “గీతా ! కాఫీ….”,  “గీతా !  నీళ్ళు తోడావా?”  అంటూ అడగడం చూస్తుంటే కంపరమెత్తింది.

          యింకో పక్క గీత యుద్ధ సన్నాహాల్లో వున్నంత టెన్షన్ గా వుంది…………నిజమే మరి యిద్దరు పిల్లలతో అన్ని పనులూ ముగించుకుని, తనూ ఆఫీసుకి వెళ్ళాలంటే ఎంత కష్టం ? వర్క్ మధ్యలో ఏదో డౌటోచ్చి అడగడానికి డైనింగ్ రూం వైపు వెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసి తెల్లబోయాను.

          గీత కోపంగా కళ్ళు పెద్దవి చేసి వాళ్ళ పాపని భయపెడుతూ “వూ ! పాలు తాగు…….”  పంటి బిగువున సాధ్యమైనంత కఠినంగా అంటోంది.

          “వద్దమ్మా! కడుపు నొప్పిగా వుంది” కడుపు పట్టుకుంటూ భయంగా అంటోంది ఆ పాప.

          “కడుపు నొప్పా ? గాడిద గుడ్డా? స్కూలు ఎగ్గొట్టడానికి యిదో వంక…….తాగు …….” జబ్బ దగ్గర గుచ్చి పట్టుకుంటూ అంది గీత.

          డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటున్న గీత అత్తగారు – ” మా కాలంలో అయితేనా ……పిల్లలు ఆఁ !         అంటే ఆగేవారు. ఓసారి కళ్ళెర్రజేస్తే వుచ్చపోసేవారు. యిప్పటి పెంపకాలా……..? పుండు మీద కారం జల్లుతూ అంది.

          అప్పటి గీత మానసిక పరిస్థితిని వూహించగలను. కానీ అంత వైల్డ్  గా  రియాక్టవుతుందనుకోలేదు.

          పిల్ల వీపు మీద , చెంపల మీదా ఛెళ్ళు ఛెళ్ళున చరుస్తూ “వూ ! తాగు…. లేకపోతే డాడీకీ చెపుతాను………” రౌద్రంగా అంది. అంతే ! ఆ పాప మొహంలో విపరీతమయిన భయం !

            ముంచుకొస్తున్న ఏడుపుని ఓ చేత్తో నోరు మూసుకుని అదుపు చేసుకుంటూ యింకో చేత్తో గ్లాసందుకుంది.

          “ఏంటీ గొడవ………..? యిన్ షర్ట్  సరిజేసుకుంటూ వచ్చాడతను. కడుపులో లుంగలు చుట్టుకుంటున్న దుఃఖానికో భయానికో ఆ పాప తాగిన పాలు భళ్ళున వాంతి చేసుకుంటుంటే అది తుళ్ళి అతని మీద పడుతుంటే అతను కూతుర్ని నిర్దాక్షిణ్యంగా తోసేస్తూ “ఛీఛీ……వెధవగోల…..యిపుడు మళ్ళీ బట్టలు మార్చుకోవాలి……” అని మొహం కంపరంగా పెట్టి వెళ్ళి పోతుంటే తనకి మరింత పనిని పెంచినందుకు గీత మళ్ళీ   పిల్లని నాలుగు దెబ్బలు వేసింది.

          ఆ సంఘటనకి నిశ్చేష్టురాలినయ్యాను. ఆ పాప కళ్ళలోని అపనమ్మకాన్ని, భయాన్ని చూస్తుంటే కడుపులో దేవేసింది. పాప అన్న చెల్లినిలేపి, మొహం కడిగి మంచినీళ్ళు ఇచ్చాడు. ఆ బాబు కళ్ళలో చెల్లి పట్ల స్పష్టంగా జాలి కనబడింది. కనీసం ఆ మాత్రం ఙ్ఞానం అయినా తల్లి దండ్రులకి లేకపోయిందే అన్న బాధ మొదలయింది. వెనుతిరగబోతుండగా చూసింది గీత. నన్ను చూసి బలవంతంగా నవ్వుతూ-” ఎపుడూ వుండేది యిది………. పిల్లలెపుడూ నాలుగు తగిలితే కానీ తోవలోకి రారు……” అంది.

          నిజమా ! నాలుగు తగిలితే తోవలోకి వస్తారనుకుంటే దానిపట్ల నిబద్ధతతో కొట్టాలి. అత్తగారి మీద కోపాన్ని, తనలో వున్న అసంతృప్తిని యిలా చూపిస్తే ఎలా ? మనసులోని ఆవేదన బైటకి వచ్చేలోపు యింటికి వచ్చేశాను.

          అప్పటికే తండ్రి కూతుళ్ళిద్దరూ ఎవరి పనిమీద వాళ్ళు వెళ్ళిపోయారు. నేనూ అన్యమస్కంగానే కాలేజీకి వెళ్ళొచ్చాను.

          పాప స్కూలు నుంచి రాగానే గుండెలకి హత్తుకున్నాను.

          “ఏంటమ్మ ………..? ” నా మొహాన్ని చూసి ఏదోవుందని కనిపెట్టేసి అడిగింది.

          “నేను గానీ, నాన్న గానీ ఎపుడన్నా తిడితే,నీకు బాధనిపిస్తే కాసేపాగి మాకు చెప్పాలి……”అన్నాను.

          “అలాగే . మీకు బాధేసినా నాకు చెప్పండి “అంది.

నవ్వేసి దాని బుగ్గలు ముద్దాడాను. ఓ అరగంట ఆడుకుని ఆటలు బోర్ కొట్టి చదువుకుంటానని లోపలికి వెళ్ళింది.

          నేను యింటి ముందు తోటలో కలుపు వుంటే తీస్తున్నాను. పక్కింటికీ, మాకూ మధ్య పిట్టగోడ ఎత్తు తక్కువ కావడంతో వాళ్ళ కాంపౌండ్ మాకు స్పష్టంగా కనిపిస్తుంది.

          గీత అక్కడ కూర్చుని మొక్కలకి పాదులు చేస్తోంది. యిద్దరు పిల్లలూ  వుదయం జరిగింది మర్చిపోయి స్వేచ్ఛగా నవ్వుతూ ఆడుకుంటున్నారు.

          పిల్లలు ఎంత తేలిగ్గా క్షమించగలరు ? నవ్వుకుంటూ తల తిప్పుకోబోతుండగా జరిగిందా సంఘటన.

          వీధి చివర వాళ్ళాయన కారు కన్పించగానే గీత కంగారుగా “డాడీ వచ్చేస్తున్నారు…………వెళ్ళండి…..చదువుకోండి……..” అంది. పిల్లలు పెద్దపులి నుంచి తప్పించుకోవాలన్న భయంతో పరుగులు పెట్టారు. ఆ హడావిడిలో బాబు కాలికేదో తట్టుకుని బొక్కబోర్లా ముందుకు పడ్డాడు. వరండా అంచు నుదుటికి తగిలింది.నుదుటి నుంది రక్తం కారడం స్పష్టంగా కన్పిస్తోంది.

          అయ్యయ్యో ! అంటూ నడవబోయాను. కానీ ఆ బాబు లేచి చేతిని అడ్డుపెట్టుకుని దెబ్బ కనబడకుందా వుండేలా ప్రయత్నిస్తూ వరండాలో వున్న చాపమీద కూర్చుని పుస్తకాలు తెరిచాడు. చిన్న శబ్దం కూడా గొంతు నుంచి రానివ్వలేదు. వాళ్ళ నాన్న వచ్చి చదువుకుంటున్న పిల్లల్ని సంతృప్తిగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. అపుడు చెయ్యి తీసి దెబ్బ చూసుకున్నాడు. రక్తం చూడగానే ఏడుపొచ్చినట్లుంది. గుడ్ల నీళ్ళు గుడ్లకుక్కుకుంటూ చదువుతున్నాడు. నివ్వెరపోయి చూస్తుండిపోయాను. చెయ్యి కొంచెం గీసుకుంటేనే హంగామా చేసే మాపాప, చందూ గుర్తొచ్చారు. యింతలో చందూవచ్చిన సూచనగా బైక్ హారన్ వినిపించింది. లోపల హోంవర్క్ చేసుకుంటున్న మాపాప గెంతుతూ వరండా మెట్లు దూకుతూ వచ్చి నాన్నని చుట్టుకుపోయింది.

          గోమాతా, లేగదూడల్లా పరస్పరం నిమురుకునే ప్రక్రియ పూర్తయ్యాక నవ్వుతూ నావైపు చూశాడు చందూ. పితృత్వపు మాధుర్యాన్ని చవి చూస్తున్న అతనికి యిక పాప గురించి చెప్పేందుకేముంది ?! ఈ బంధాలు బలపడాలని కోరుకోవడం తప్ప.

             

 

 

20 వ్యాఖ్యలు

20 thoughts on “పితృత్వం

 1. చాల బాగా వ్రాస్తున్నారు. సెన్సిటివ్ విషయాలు మీరు సూటిగా, స్పష్టంగా ఇంకా చెప్పాలంటే సున్నితంగా చెపుతున్నారు. ఈ కథ తో ఐ కాన్ identify మై ఫ్యామిలీ, అస్ ఐ బెకామే మదర్ recently. మీ కథ లో లా మా వారు కూడా మా బాబు తో చాలా క్లోజ్ గా ఉంటారు. so I can be rest assured that my husband would enjoy his fatherhood well. 🙂

  మీ ఆడవాళ్లకు ఆహ్వానం అనే కథ చదివాకా రోజంతా అదే ఆలోచన. అలా కూడా జరుగుతుందని ఫస్ట్ టైం తెలిసింది. మనసంత బాధ గా ఐంది. మీ కథలో లాంటి హీరోఎస్ ని ఇపుడిపుడే(ఆడవాళ్ళ మనసులిని అర్థం చేసుకొనే మనస్తత్వం ఉన్నవాళ్లు ) చూస్తున్నాము.

 2. మల్లీశ్వరిగారూ, ఈరోజూ నా డెస్క్ టాప్ ప్రక్షాళన చేస్తుంటే ఈకథ కనిపించింది. సిగ్గుగా ఉన్నా చెప్పకతప్పదు. ఎవరు నాకు పంపేరో నేనే ఎక్కడినిండైనా డౌన్ లోడ్ చేసుకున్నానో తెలీదు. పిడియఫ్ లో మీపేరు లేదు. అంచేత రిసెర్చి చేసి ఇక్కడ ఉందని చూశాను. మంచి ఇతివృత్తం తీసుకుని చక్కగా రాసేరు. మారుతున్న కాలంలో మారేవిలువలూ, మరే కొందరూ, మారని కొందరూ .. ఇలా వివిధకోణాలు చూపడంవల్ల కథకి పుష్టి చేకూరింది. అభినందనలు.
  మాలతి

  • మాలతి గారూ చాలా సంతోషం.మనం విశాఖపట్నం లో ఒకసారి కలిసాం ..మీరు ఆ రోజు మీటింగ్ బిజీ లో ఉండడంతో మనం ఎక్కువ సేపు మాట్లాడుకోలేకపోయాం.కధ నచ్చినందుకు ధన్యవాదాలు.

 3. మేడంజి ,’పితృత్వం ‘ లో parents పిల్లలతో ఎలా ఉండాలో చాలా భాగా చెప్పారు .పోల్చి చెప్పడము ,చూపడము చాలా భాగుంది .మీ రచనలకు వ్యాఖ్య రాయాలంటే చాలా భయమ్మేస్తుంది ,అన్ని మంచి లక్షణాలు నాలో ఉన్నాయా అని -కొన్నిసంతోషాలకు దూరమయ్యాను నా వృత్తి వల్ల పిల్లలలోతో గడిపే క్ష ణాలను ,ఎంత డబ్బు పోస్తే ఆ రోజులు మళ్ళీ వస్తాయా ?ఇప్పుడిప్పుడే ఆ లోటును పూడ్చుకుంటున్నాను .మాతృత్వము ,పిత్రుత్వాన్ని చాలా chakkagaa చెప్పిన మీకు మీరే సాటి .

 4. Nice story….It’s deeply touched my heart…
  –అపుడు చెయ్యి తీసి దెబ్బ చూసుకున్నాడు. రక్తం చూడగానే ఏడుపొచ్చినట్లుంది. గుడ్ల నీళ్ళు గుడ్లకుక్కుకుంటూ చదువుతున్నాడు. — ee lines chadavagaane kallaloki neellu vachesayi…
  Even i saw some people doing like that… 😦
  When i saw people doing like that, i feel like going to them and tell “If u don’t know how to handle kids, give to me or don’t give birth to them”!!
  But no use…they will tell, “Why u r interfering in our lifes…”! 😦
  Feel so bad to see those kids….
  Any ways…Thanks for writing such a good story..

 5. మల్లీశ్వరి గారు,
  కధ చాలా బావుంది.
  ఆ పితృత్వపు మాధుర్యాన్ని నేను పొందుతున్నాను….మా గారాలపట్టి, ఒకటిన్నర వత్సరాల అమ్మాయి కృతి దగ్గర. గోమాత, లేగదూడల్లా అన్న పోలిక బావుంది….నాకు బాగా పరిచితమైన అనుభూతి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s